సాఫల్యం-19

5
12

[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]బా[/dropcap]జిరెడ్డి అతనికి వంద రూపాయలిచ్చాడు. ఇంకో విషయం చెప్పాడు సిద్ధరామప్ప

దీనికి ‘వేబిల్లు’ లాంటివేం ఉండవనీ, ఎండాకాలం కాబట్టి టార్పాలిన్‌ కప్పకుండా తాళ్లు బిగించి లోడ్‌ ఓపన్‌గా వదిలేస్తామనీ, చెక్‌పోస్టుల దగ్గర వాళ్లకు తృణమో పణమో ఇస్తే వదిలేస్తారనీ చెప్పాడు.

ఇద్దరూ సైకిళ్లపై గోకర్ణం చేరుకున్నాడు. రాత్రి దోసెలు పెట్టిందా తల్లి. మినపట్లు కాదవి. రెండు మూడు రకాల పిండ్లు కలిపి గరిట జారుగా చేసి, ఇంగువ పోపు పెట్టిపోసింది. నంచుకోవటానికి కొబ్బరి చట్నీ చేసింది. ఇలాంటి దోసెలు అమ్మ కూడ పోస్తుందనుకున్నాడు పతంజలి. రేపు ఉదయం వెళ్లిపోతామనీ, పదిగంటల కల్లా భోజనం చేస్తామనీ చెప్పారు. పొద్దున్న ఒకసారి శివదర్శనం చేసుకుని వస్తామన్నారు.

ఉదయం 7 గంటల కల్లా లేచి తయారై గుడికి వెళ్లొచ్చారు. తన చదువు నిర్విఘ్నంగా కొనసాగేలా అనుగ్రహించమని శివున్ని వేడుకున్నాడు. ఇక సైకిళ్లు అక్కరలేదు కాబట్టి వెళ్లేటపుడు సైకిలు షాపతనికి డబ్బులిచ్చేస్తే సరి. బ్యాగులు సర్దుకుని క్రిందికి వచ్చారు. బస్సు పదిన్నరకని చెప్పాడు ముచికుందస్వామి.

తొమ్మిదిన్నరకల్లా భోజనాలు పెట్టిందా తల్లి. అరటి కాయ ముద్దకూర. వంకాయలు నిప్పులమీద కాల్చి చేసిన పచ్చిపులుసు. చారు కాచింది. మజ్జిగ తాగారు. బాదం ఆకుల్లో ఉప్మా వేసి పైన న్యూస్‌ పేపర్‌తో ప్యాక్‌ చేసి, మధ్యాహ్నం తినమని రెండు పాకెట్లు ఇచ్చారు.

బాజిరెడ్డి పతంజలిని పక్కకు పిలిచి, రహస్యంగా అన్నాడు. “ఎంతయిందో చెప్పడీయన. ఎంతిద్దాం?” “మూడు రోజులు తిండి పెట్టారు. రెండు రోజులు రూములో ఉన్నాం. అభిషేకం కూడ చేయించాడు. రోజుకు పది రూపాయలు వేసుకున్నా ముప్ఫై అవుతుంది అన్నాడు పతంజలి.

“సాచ్చాత్తు అన్నపూర్ణమ్మ లెక్క కడుపు నింపినాది. వీళ్ల విషయంలో లెక్క లేసుకోకూడదు” అన్నాడు బాజిరెడ్డి. ఆయన ఔదార్యం తాను మాటల్లో చూపలేనందుకు పతంజలి సిగ్గుపడ్డాడు. “నిజమే వాళ్ల ఆదరణను డబ్బుతో కొలవగలమా?” అన్నాడు.

“యాభై రూపాయలిద్దాం” అన్నాడు బాజిరెడ్డి పతంజలి కూడ సరే అన్నాడు.

యాభై రూపాయలనోటు తీసి ముచికుందప్ప చేతిలో పెట్టారు. ఆయన అది తీసుకొని లోపలికి వెళ్లాడు. భార్యతో సంప్రదించాలేమో అనుకున్నారు. ఒకవేళ అదనంగా కావాలన్నా సంతోషంగా ఇద్దామనుకున్నారు.  ఆయన వీళ్ల డబ్బు మూట వీళ్లకు తెచ్చి భద్రంగా అప్పచెప్పాడు. రెండు పది రూపాయలనోట్లు బాజిరెడ్డి చేతిలో పెట్టాడు. వీళ్లకర్ధం కాలేదు. “యాభై మీకే. మళ్లీ ఇరవై తిరిగిస్తున్నారెందుకు?” అని అడిగితే “మువ్వత్తు సాలు” అన్నాడు సంతోషంగా నవ్వుతూ.

“తిక్క బ్రామ్మడా! నీలాంటోల్లుండ బట్టే పెపంచంలో ఇంకా దర్మం న్యాయం ఉండాయి. తీసుకోవయ్యా దేవుడా” అని బలవంతంగా ఆయన చేతిలో పెట్టాడు బాజిరెడ్డి.

కాత్యాయనమ్మను కూడా బయటకు రమ్మని, ఇద్దర్నీ పక్కపక్కన నిలబడమని, వారి పాదాలకు నమస్కరించారిద్దరూ. “దీర్ఘాయుష్మాన్‌ భవ. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు” అని దీవించారు ఆది దంపతులిద్దరూ.

బస్టాండు వరకూ వచ్చాడాయన. దారిలో సైకిలు షాపతనికి డబ్బు ఇచ్చేశారు. నాలుగున్నర రూపాయిలయిందన్నాడు. ఐదు రూపాయల నోటు ఇస్తే అర్ధరూపాయి వెనక్కివ్వ బోయాడు అతను వద్దన్నారు.

పదిన్నరకు బస్సెక్కారు. ఆయన వెళ్లిపోతూంటే బాధనిపించింది యిద్దరికీ.

“పేదరికంలో కూడ ఎంత సంతోషంగా ఉన్నారు కదా!” అన్నాడు పతంజలి. “దానెమ్మ డబ్బు దాంతో సంతోషం ఎక్కడొస్తాది సామీ! ఇంకా సంపాయిచ్చి యింకా సంపాయిచ్చి సచ్చారు. ఆసామి, ఆయమ్మ సాక్షాత్తు శివుడు, పార్వతమ్మే” అన్నాడు బాజిరెడ్డి.

పదకొండు కల్లా తదిడిలో దిగి సిద్ధరామప్ప దగ్గరికి వెళ్లారు. ఈరోజు చాలా దూరం వెళ్లారు. కానీ ఈ రోజుకూడ సరుకు బాగుంది. మధ్యాహ్నానికి ఇరవై బస్తాలయింది. మధ్యాహ్నం ఉప్మా తిన్నారు.

మధ్యాహ్నం ఎరువు తక్కువ సమకూరింది. పదిహేను బస్తాలు కూడ  అవలేదు. అన్ని బస్తాలు మోయించుకొని ఒక చోట చేర్చారు. మొత్తం లెక్కపెడితే నూట పదిబస్తాలు తేలాయి. పదమూడు టన్నులవుతాయా’ అనే అనుమానం వ్యక్తం చేశాడు పతంజలి. సిద్ధరామప్ప మరో ఇద్దర్ని పురమాయించి మరో ఆరు బస్తాలు తెప్పించాడు.

ఆరుగంటలకు లారీ వచ్చింది. పది చక్రాల లారీ. చాలా పెద్దది. “బసవేశ్వర ట్రాన్స్ పోర్టు” అని కన్నడలో వ్రాసి ఉంది దానిమీద. లారీ రివర్సు చేసి బస్తాలకు ఆనించిపెట్టాడు డ్రయివరు. అతనితో పాటు క్లీనరుకూడ వచ్చాడు. లారీలోంచి ఏటవాలుగా ఉన్న పలక దించారు. కాలికి పట్టుదొరకటానికి అంగుళంన్నర ఎడంతో అడ్డపట్టెలు బిగించి ఉన్నాయి. నలుగురయిదుగురు  మగవాళ్లు, ఇద్దరు ఆడవాళ్లు బస్తాలు నెత్తికెత్తుకొని పలకమీదుగా లారీలో వేయసాగారు. బాడీ దాటి చాలాపైకి వచ్చింది లోడు. వెనక డోరు కూడ క్రిందికి చేసి దాని మీద కూడ నాలుగు బస్తాలు పేర్చారు. క్లీనరు కూడ పైకి ఎక్కి బస్తాలు సర్దాడు. ఒక లావుగా ఉన్న ఇనుప కడ్డీతో బస్తాలను బాది, ఒకదానిమీద ఒకటి గ్యాప్‌ లేకుండా సెట్‌ చేశాడు. క్లీనరు.

డ్రైవరూ, క్లీనరూ, కలిసి, క్యాబిన్‌ మీద ఉన్న తాళ్ల చుట్టలు విప్పి పకడ్బందీగా తాళ్లు బిగించారు. బాడీ అంచు పొడుగునా ఉన్న హుక్స్‌ అందుకు బాగా పనికొచ్చాయి.

సిద్ధరామప్పకు ఎనిమిది వందలిచ్చేశాడు బాజిరెడ్డి. అవి తీసుకొని అతడు నమస్కరించాడు. కూలీలు వచ్చి నిలబడ్డారు. వాళ్లకు ఒక ఇరవై యిచ్చాడు.

“జాయేంగే సాబ్‌?” అన్నాడు డ్రైవర్‌. డ్రైవింగ్‌ సీటులో కూర్చుని స్టార్ట్‌ చేశాడు బండిని. ఇటువైపునుండి పతంజలి, బాజిరెడ్డి, క్లీనరు ఎక్కారు. క్యాబిన్‌ చాలా విశాలంగా ఉంది. డ్రైవర్‌ వెనుక విశాలమయిన కుషన్‌ సీటు ఉంది. పైన పడుకోడానికి బెర్తు కూడ ఉంది. ముందు చెక్క పలక అడ్డంగా వేసుకొని రోడ్డు కనబడేలా క్లీనరు కూర్చున్నాడు.

సంచులు పైన బెర్తుమీద పెట్టారు. లారీ తదిడి దాటి మెయిన్‌ రోడ్డెక్కింది.

“మీ పేరేమిటి?” అనడిగాడు పతంజలి డ్రయివర్ను.

“మేరా నామ్‌ ఉస్మాన్‌ హై సాబ్‌” అన్నాడతను. క్లీనరు పేరు సుబ్బణ్ణట.

“మనం బెంగుళూరు మీదే పోతామా?” అనడిగాడి సంభాషణంతా హిందీలో సాగుతుంది. “లేదు సాబ్! అది చాలా దూరం మనం దావణగేరే, చిత్రదుర్గ, బళ్లారి, గుంతకల్‌, గుత్తి మీదుగా వెళతాం. మేం హైదరాబాదుకు లోడ్‌ తీసుకుపోయినా ఇదే రూటు. రోడ్‌ కూడ బాగుంటాది” అన్నాడు ఉస్మాన్‌.

ఉస్మాన్‌ యువకుడే. ముఫై ఏళ్లుంటాయి. తెల్లగా ఉన్నాడు. ఉంగరాలజుట్టు కొంచెం గడ్డం. సుబ్బణ్ణకు తన వయసుంటుందనుకున్నాడు.

లారీని డైరెక్ట్‌గా వే బ్రిడ్జి దగ్గరకు తీసుకొని వెళ్ళాడు కార్వార్‌లో. సరిగ్గా లారీ నిలబడేంత ఉందది. ఉక్కుతో చేయబడిన పెద్ద పలక. లారీ దానిమీద ఆపి క్రిందకు దిగాడు ఉస్మాన్‌. ఖాళీ లారీ ఎంత బరువుంటుందో ఒక పట్టిక ఉంది ఆఫీసులో. అశోక్‌ లేలండ్‌. ధర్టీన్‌ టన్నర్‌ అని ఉన్నచోట ఎదురుగ్గా 2.65 టన్స్‌ (Tonns) అని వేసి ఉంది.

లోడ్‌తో సహా లారీ 16.75 టన్నులున్నట్లు చూపించింది. ఇండికేటర్‌ ఖాళీ లారీ బరువుపోను 14.10 టన్నులుంది లోడు. “ఏక్‌టన్‌ జ్యాదా హైసాబ్‌. మై బరాబర్‌ తేరాటన్‌ లిఖా వూంగా. నైతో అప్‌ కో ఏక్‌ సౌ చాలీస్‌ ఎక్స్‌ట్రా దేనా పడతాహై. అన్‌లోడింగ్‌ కర్నేకి బాద్‌ ముఝే పచాస్‌ రూపయే బక్షీస్‌ దీజియే. క్లీనర్‌ కో దస్‌ రూపయే చాయ్‌ పానీకేలియే దీజియే” అన్నాడు.

పతంజలికర్థమయింది. లోడ్‌ తక్కువగా రాయించి తీసుకుపోతాడు. దానివల్ల అతనికి బేటాకాక మరో యాభై మిగుల్తుంది. తమకు ఒక వంద మిగులుతుంది. పోనీ త్రోవలో చెక్‌ పోస్టు వాళ్లకన్నా వస్తుందనుకొని “సరే” అన్నాడు. బాజిరెడ్డికి కూడ అర్థమైంది.

“ఎంతకంతే ఎంకటలచ్మీ అని, ఎవడు దినేది వాడు దినాల. కానీ పా” అన్నాడు.

అప్పటికి తొమ్మిదయింది. ఐదువందలు డీజిలుకని అడిగి తీసుకున్నాడు ఉస్మాన్‌. ఊరిలోనే డీజిలు కొట్టించాడు. ట్యాంకునిండా అక్కడే చక్రాలన్నింటికి గాలి చెక్‌ చేయించాడు. అప్పటికి పది గంటలవుతుంది. “కుచ్‌ ఖాకే నికాలేంగే సాబ్‌” అన్నాడు.

లారీని బంకులోనే ఒక ప్రక్కగా ఉంచి దగ్గరలోని హోటలుకెళ్లారు. అది మిలిటరీ హోటలు. బాజిరెడ్డి కూడ వాళ్లతో పాటు నాన్‌ వెజ్‌ తింటానన్నాడు. పతంజలి కొంత దూరం నడిచిం తర్వాత “మంజునాధ భవన్‌” అని కనబడింది. భోజనం చేయలేదు. రెండిడ్లీ, ఒక రవ్వదోసె తిని, కాఫీ తాగాడు. నడుచుకుంటూ లారీ దగ్గరకు చేరుకున్నాడు.

మరో అరగంటకు అందరూ వచ్చారు. లారీ బయలుదేరింది. క్యాబిన్‌లో లైటు ఆపేశాడు ఉస్మాన్‌. ఒక పాటందుకున్నాడు. “క్యాహువా, తేరా వాదా” అంటూ మొత్తం పాటంతా పాడాడు. గొంతు బాగుంది. కిశోర్‌ కుమార్‌ గొంతులోని ఒక చిన్న జీర అతని గొంతులో కూడ ఉంది. పాటవగానే చప్పట్లు కొట్టాడు పతంజలి. బాజిరెడ్డి, సుబ్బణ్ణ కూడ చేతులు కలిపారు.

“వావ్, క్యా గాయాతుంనే ఉస్మాన్‌ భాయ్‌. బహుత్‌ షుక్రియా” అన్నాడు అభినందనగా. ఉస్మాన్‌ సిగ్గుపడ్డాడు.

“సాబ్‌, ధన్యవాద్‌, మై ఇతనా బడాగాయక్‌ నహీ హు. తోడా తోడా” అన్నాడు.

“ఔర్‌ ఏక్‌ గానా” అన్నాడు పతంజలి.

“మేరే సప్పునోంకీ రాణీ కబ్‌ అయేగీత్‌” ఆలపించాడు మధురంగా.

“నీపాసుగూల సాయిబులైనా బోపాడుతుండావే డ్రైవరూ” అన్నాడు బాజిరెడ్డి. అది ఆయన ప్రశంసించే విధానం.

“సాయిబులే హిందీ పాటలు బాగా పాడతారు. ‘సాయిబులైనా’ అని అంటావేమిటి?” అన్నాడు పతంజలి.

“అప్‌ భీ ఏక్‌ గానా సునాయియే” అన్నాడు ఉస్మాన్‌.

పతంజలి బెట్టు చేయలేదు. కళాకారుడెప్పుడూ తన విద్యను ప్రదర్శించటానికి జంకడు.

రఫీసాబ్‌ పాడిన “జోవాదాకియావో నిభానా పడేగా” పాటను పాడాడు.

ఉస్మాన్‌ స్టీరింగు వదిలేసి చప్పట్లు కొట్టాడు. బాజిరెడ్డి ఆశ్చర్యంగా చూస్తున్నాడు.

“సామీ, నీ దెబ్బ, ఇందీ పాట ఎంత బాగా పాడినావు. పాట అర్థంగాకపోయినా ఇనడానికి బో బాగుండాది” అన్నాడు. “మన తెలుగుపాట ఒకటి పాడు కానీ ఈ నాయండ్లకు అర్థంకాదేమో” అన్నాడు.

“అదేంకాదు. హిందీపాట నీవు వినలేదా, అలాగే” అన్నాడు పతంజలి. బాల సుబ్రమణ్యం. ఘంటసాల ఇద్దరూ కలిసి పాడిన “ఏకవీర” సినిమాలోని “ప్రతిరాత్రి వసంతరాత్రి ప్రతిగాలి పైరగాలి” అన్నపాటందుకొని చక్కగా పాడాడు.

“బహుత్‌ ఖూబ్‌ హై సాబ్‌ ఆప్‌కా ఆవాజ్‌” అన్నాడు ఉస్మాన్‌. బాజిరెడ్డి పతంజలిని కౌగిలించుకొని అభినందించాడు.

“నీ పాసుగూల నీకు రాని విద్దే లేదే సామీ” అన్నాడు.

రాత్రి ఒంటిగంటకు షిమోగా బైపాస్‌లో ఒక హోటల్‌ దగ్గర టీ తాగారందరూ. తర్వాత సుబ్బణ్ణ కునికిపాట్లు పడసాగాడు. బాజిరెడ్డిని పైకెక్కి పడుకోమన్నాడు పతంజలి. డ్రైవరు నిద్ర రాకుండా తానుతోడుగా ఉంటానన్నాడు. ఉస్మాన్‌ కుటుంబ విషయాలు అడిగి తెలుసుకున్నాడు. ఉస్మాన్‌కు పెళ్లయింది. ఇద్దరు పిల్లలు. తండ్రి కూడ డ్రైవరే. ఇద్దరక్కలకు పెళ్లిళ్లు చేశారట. ఇంకో చెల్లెలుంది. చివరగా తమ్ముడు. వాడు టెంత్‌ చదువుతున్నాడు. వీళ్లది తుముకూరట. పెద్దలిచ్చిన ఇల్లు ఉంది. తండ్రి తాగుతాడట గానీ, తనకు అలవాటు లేదట. సిగరెట్‌, బీడీ కూడ ముట్టుకోడట. కడుపునిండా తిండి ఉంటే చాలట. అతని భార్య ఎనిమిది వరకు చదివిందట. చాలా మంచిదట. ఆమెను గురించి చెపుతూంటే అతని కళ్లల్లో మెరుపు కనిపించింది. తాను మాత్రం ఐదో తరగతిలోనే ఆపేశాడట. తనకంటె ఎక్కువ చదువుకున్నా ఆమెకు కొంచెమైనా గర్వంలేదట. జేబులోంచి పర్సు తీసి, భార్య ఫోటో చూపించాడు. చక్కని చుక్కే.

“మీ యిద్దరూ చక్కని జోడీ” అన్నాడు పతంజలి.

అతని తల్లి, భార్య, చెల్లెలు ఇంట్లోనే బీడీలు చుట్టి సంపాదిస్తారట.

సుబ్బణ్ణది కార్వారేనట. మంచివాడట. డ్రైవింగ్‌ కూడ బాగా వచ్చట. ఇంకా పెళ్లి కాలేదు సుబ్బణ్ణకని చెప్పాడు.

అలా కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం సాగించారు. ఉస్మాన్‌ డ్రయివింగ్‌ కూడ చాలా ‘బాలెన్స్‌డ్‌గా ఉంది.

తెల్లవారే  సరికి దావణగేరే దాటారు. ఎక్కడా ఊర్లోకి వెళ్లడంలేదు. బైపాస్‌లే.

ఐదుగంటలకు బాజిరెడ్డి దిగాడు “నీవు కూడ పడుకో పో సామీ” అన్నాడు. పతంజలి కూడ రెండుగంటలు పడుకొని వచ్చాడు. ఎనిమిది గంటల ప్రాంతంలో ఒక ఊరి దగ్గర చిన్న హోటలుంటే ఆపాడు ఉస్మాన్‌. అందరూ దిగారు. అక్కడ తొట్టిలో నీళ్లు, రేకు డబ్బాలు ఉన్నాయి. రెండు మూడు లారీలు ఆగి ఉన్నాయక్కడ. కొందరు లోపల టిఫిన్లు చేస్తున్నారు.

రేకు డబ్బాలతో నీళ్లు తీసుకుని వెనక పొలాల్లోకి వెళ్లి కాలకృత్యం తీర్చుకున్నారు. తొట్టి దగ్గరే “నంజన్‌గూడ్‌ పళ్లపొడి పాకెట్‌” పెట్టి ఉంచారు. దాంతోనే పళ్లు తోముకున్నారు.

లోపల నాప బండలు పరచి టేబుళ్లలాగ వేసి ఉన్నారు. గోడలు పొగచూరి ఉన్నాయి. రంపపు పొట్టు పొయ్యి మీద పెనం కాలుతూంది. దాని మీద దోసెలు పోస్తున్నాడొకతను. ఇంకొక వ్యక్తి ఇడ్లీ వాయదింపుతున్నాడు ఒక మూల కాఫీ, టీ, కౌంటరు. ఇద్దరు ఆడవాళ్లు టేబుల్‌ క్లీనింగ్‌, ప్లేట్లు కడగడం చేస్తున్నారు.

తలా రెండిడ్లీ తిన్నారు ముందు. సాంబారు లేదు. కొబ్బరి చట్నీ ఇవ్వలేదు. బొంబాయి చట్నీ ఇచ్చారు. వేడిగా బాగున్నాయి. తర్వాత దోసెలకార్డరిచ్చారు. అవీ వచ్చాయి. రెస్టారెంటులో కన్నా బాగున్నాయి. “అంతా పొట్టు పొయ్యి మహిమ” అన్నాడు బాజిరెడ్డి. అందరూ టీ తాగి బయటకొచ్చారు. బాజిరెడ్డి బిల్లు చెల్లించాడు.

సుబ్బన్న ఉస్మాన్‌తో “నేను తోలతాను బండి. నీవు కాసేపు పడుకో”మన్నాడు. ఉస్మాన్‌ రాత్రంతా డ్రయివ్‌ చేసి అలసిపోయి ఉన్నాడు. వెళ్లి పడుకున్నాడు. సుబ్బన్న స్టీరింగ్‌కు దండం పెట్టుకుని స్టార్ట్‌ చేశాడు. బాగానే నడుపుతున్నాడు.

“యాడివరొకొచ్చింటాము” అనడిగాడు బాజిరెడ్డి.

“చిత్రదుర్గ యాభై మూడు కి.మీ అని ఇందాక బోర్డు చూశాను. మరో గంటకు పైగా పడుతుంది. బళ్లారి చేరామంటే అక్కడ నుంచి నాలుగు లేదా ఐదు గంటల్లో చేరుకుంటాము” అన్నాడు పతంజలి.

కాసేపటికి ఒక చెక్‌ పోస్ట్‌ వచ్చింది సుబ్బన్నదిగి బండి కాగితాలు పట్టుకుని చెక్‌పోస్టు సిబ్బంది కూర్చున్న పాకలోకి వెళ్లాడు. కాసేపటికి బైటికి వచ్చి పతంజలిని రమ్మని సైగ చేశాడు.

ఇద్దరూ పాక దగ్గరికి వెళ్లారు. అక్కడున్న ఉద్యోగి బైటకు వచ్చి లోడ్‌ చూశాడు. “క్యామాల్‌ హైయే? కాంజారేహై?” అని అడిగాడు. “ఏ డ్రైఫిష్‌ కా కచరా హై. నీంబు బగీం చోం కేలియే లే రహేహై” అన్నాడు పతంజలి. దేనికైనా వే బిల్లు లేకుంటే కుదరదంటున్నాడా వ్యక్తి. ఇంతలో ఒకాయన మోటార్‌ సైకిల్‌ మీద వచ్చి పాక ముందాగాడు. ఇతడు ఆయనకు సెల్యూట్‌ చేసి విషయం చెప్పాడు. వీళ్ల పై అధికారిగా అర్థమయింది.

పతంజలివెళ్లి ఆయనకు నమస్కరించి ఇంగ్లీషులో చెప్పాడు. “వుయ్‌ ఆర్‌ ఫ్రం ఆంధ్రప్రదేశ్‌ సార్‌. వుయ్‌ పర్చేజ్‌డ్‌ దిస్‌ ఫిష్‌ వేస్ట్‌ ఫర్‌ అవర్‌’ లెమన్‌ గార్డెన్స్‌ యాజ్‌ మాన్యూర్‌. ది సెల్లర్స్‌ ఆర్‌ నాట్‌ ఎస్టాబ్లిష్‌డ్‌ డీలర్స్‌. వుయ్‌ గ్యాదర్డ్‌ ఫ్రం మెనీ సోర్సెస్‌. సో నో వేబిల్‌ కుడ్‌ బి పాసిబుల్‌” అన్నాడు.

ఆయనకర్థమయింది. “ఓ.కె. యుకెన్‌గో” అన్నాడు మర్యాదగా. మళ్లీ కొనసాగింది ప్రయాణం.

“నీవు గీన ఇంగ్లీషులో మాట్లాడకపోయుంటే ఆనా కొడుకులు ముఫ్పై నలభై రూపాయలయినా దొబ్చిందురు” అన్నాడు బాజిరెడ్డి పతంజలి నవ్వాడు.

“భాష ఏదైనా చెప్పే విధానం ముఖ్యం” అన్నాడు పతంజలి.

“నేను గొప్పొడినని సస్తే ఒప్పుకోవే” అన్నాడు బాజిరెడ్డి పతంజలి నవ్వాడు.

చిత్రదుర్గ దాటారు.  బళ్లారి 65 కి.మీ అని చూపిస్తుంది.

“పన్నెండున్నరకల్లా బళ్లారిలో ఉంటాం” అన్నాడు. పతంజలి బ్యాగులోంచి ‘ఇంగ్లీషు సాహిత్య              విమర్శ-3’ తీసి దానిలో లీనమయిపోయాడు. దాదాపు ఒంటిగంటకు బళ్లారి వచ్చింది. ఉస్మాన్‌ నిద్రలేచి దిగి వచ్చాడు. బళ్లారి బైపాస్‌లో ఒక హోటల్‌ వద్ద ఆపాడు సుబ్బణ్ణ. ఉస్మాన్‌ ముఖం కడుక్కొని ఫ్రెష్‌గా తయారయ్యారు. అందరూ వెజిటబుల్‌ బిర్యానీ పెరుగు వడ తిన్నారు.

మళ్లీ ఉస్మాన్‌ స్టీరింగ్‌ తీసుకున్నాడు. రెండున్నరకు గుంటకల్‌ దాటారు. గుత్తి దగ్గర చెక్‌ పోస్టు తగిలింది. అక్కడ పతంజలి ఇంగ్లీషు పరిజ్ఞానం పనిచేయలేదు. వేబిల్లు లేదని ససేమిరా వదలిపెట్టమన్నారు. బాజిరెడ్డి పతంజలిని పిలిచి తాను రంగంలోకి దిగాడు.

“రైతుల కాడ సూసీసూడనట్టు పోవాలసారూ. మేమేం యాపారం జేచ్చాండామా దీంతో. తోటకెయ్యనీకె గాదూ. ఏదో నీవు దయ తలుస్తే నీ రునం ఉంచుకోము” అంటూ యాభై రూపాయల నోటు అతని చేతిలో పెట్టి గుప్పిట మూశాడు. అతడు గుప్పిట తెరిచి ఏ నోటో చూసుకుని దాన్ని జేబులో పెట్టుకొని “పెద్దమనిషివి నీవు బంగపొతున్నావు (బ్రతిమాలు తున్నావు) కాబట్టి విడిచి పెడుతున్నా పోండి” అన్నాడు.

నవ్వుకుంటూ వస్తూన్న బాజిరెడ్డిని చూసి, పతంజలి “అన్నిచోట్లా ఇంగ్లీషు పని చెయ్యదు చూసినావా? పైసామే పరమాత్మా అని ఊరికే అనలేదు” అన్నాడు.

మరో గంటన్నరలో డోన్‌ బైపాస్‌ దాటింది లారీ. నాలుగున్నరకల్లా వెల్దుర్తి చేరుకున్నారు. వెల్దుర్తి బైపాస్‌లో నుండి తోటకు లారీ వెళ్లగలిగిన దారి వుంది. ఆ దారిలో తీసుకువెళ్లి పలగాడి దగ్గర ఆపించి, జీతగాండ్లను కేకలు పెట్టి పిలిచాడు పతంజలి.

ఇద్దరూ పరుగుపరుగున వచ్చారు. ‘పలగాడి’ తీసి లారీని గడ్డివాము వరకు తెచ్చాడు ఉస్మాన్‌. తోకోడు సుంకన్న, సుబ్బన్న కలసి బస్తాలు మెల్లగా దింపారు ఏటవాలు బల్లమీదుగా. వాటిని ఎత్తుకొని తదిడి కూలీలలాగా బల్లమీద దిగడం రాలేదు వీళ్లకు. బస్తానే బల్లమీదుగా క్రిందికి లాగారు. సరిగ్గా సగం బస్తాలు దింపి గడ్డివామి పక్కన పేర్చారు. “యాభై ఐదు బస్తాలు దింపారా లేదా” అని పతంజలి లెక్కపెట్టుకుంటుంటే “రెండు బస్తాలు ఎక్కువ తక్కువయితే కొంపలు ములిగేదేమీ లేదులే సామీ” అన్నాడు బాజిరెడ్డి.

ఉస్మాన్‌ పతంజలిని కౌగిలించుకొని, వీడ్కోలు చెప్పాడు. సుబ్బణ్ణకు పతంజలి షేక్‌ హ్యాండిచ్చాడు. సగంలోడు ఒక చోట సగంలోడు మరొకచోట దింపాలని ముందుగానే చెప్పారు కాబట్టే ఉస్మాన్‌ కూడ మానసికంగా సిద్ధమయ్యే ఉన్నాడు.

బాజిరెడ్డి లారీ ఎక్కుతూ, “రెండ్రోజుల్లో కర్నూల్లో కలుచ్చాంకద. అప్పుడు మాట్లాడుకుందాలే లెక్కడొక్కా” అన్నాడు లారీ వెళ్లిపోయింది.

చేపల పొట్టు వాసన తోటంతా వ్యాపించింది. “రేపు మీ ఇద్దరితో బాటు మరో నలుగురిని పిలవండి. పాదునానుకొని గెనం చుట్టూ అడుగుకు పైగా లోతు గాడీ చేసి దాంట్లో ఈ ఎరువు పోసి మట్టితో మూయాల. మరసటిరోజే ఎరువేసిన చెట్లకు నీళ్లు పారాల. దీనికి కాక (వేడి) చాలా ఎక్కువంట. ఒక నెలరోజులు మీద మీద నీళ్లు పెట్టాలంట. మనవంతు యాభైఐదు బస్తాలు వచ్చినాయి. మనవి 294 చెట్లున్నాయి. ఆ లెక్కన చెట్టుకు 18 కేజీలు పడుతుంది. ఒక్కోబస్తా ఆరు చెట్లకు సరిపోతుంది.” అని జీతగాండ్లకు వివరించాడు పతంజలి. “పోదాంపాండి యింటికి” అన్నాడు. గణపతి తోటలోనే ఉన్నాడు. ఎద్దుల దగ్గర కట్టేసి ఉన్నారు. పతంజలి గొంతు విని తొక్కులాడుతూన్నాడు. ఎద్దులు కూడ నాలుగయిదు రోజులుగా పతంజలిని చూడక మోరలెత్తి చూస్తున్నాయి. తమదగ్గరికి వస్తాడని.

ముందు గణపతి దగ్గరకు పోయి పలుగు విప్పాడు. అతని ముఖాన్ని తన గురుకు నాలుకతో నాకుతూ, భుజంమీద మోర అన్చి గారాబం పోయిందది. దాని ఒళ్లంతా నిమిరి పరామర్శించాడు.

ఎద్దులు రెండూ చూస్తున్నాయి. వెళ్లి వాటి గొంతు క్రింద చెయ్యి వేసి నిమిరాడు. అరమోడ్పుకళ్లతో ఆస్వాదించాయి. బండి కట్టుకొని బయలుదేరారు ముగ్గురూ గణపతి బండి వెంట రాసాగింది.

ఇల్లు చేరుకుని విశేషాలన్నీ తల్లిదండ్రులకు చెప్పాడు. గోకర్ణంలో శివునికి అభిషేకం చేసుకోవడం, ముచికుందప్ప కాత్యాయనమ్మ దంపతుల ఆతిథ్యం అన్నీ ఏకరువు పెట్టాడు.

“అన్నయ్య దగ్గర ఏదో కంపు వాసన వస్తూంది” అన్నాడు పాణిని.

“మూడు రోజులుగా ఎండు చేపల సంపర్కమే కదా” అన్నాడు అన్నయ్య. అందరూ నవ్వారు.

శుభ్రంగా వేడినీళ్లు పెట్టుకొని తలస్నానం చేశాడు పతంజలి. అమ్మ మటిక్కాయల సాంబారు, కందిపచ్చడి చేసింది. వడియాలు వేయించింది. శుభ్రంగా తిని హాయిగా పడుకున్నాడు మిద్దెమీద బొంత పరచుకొని.

మరుసటిరోజు నలుగురు కూలీలు సలికెలు (పారలు) భుజాన పెట్టుకొని జీతగాళ్లతో సహా వచ్చారు. వీళ్ల భార్యలు ఇద్దరు సరేసరి. ముందు బస్తాలన్నింటినీ ఆరు చెట్లకు ఒకటి చొప్పున మోసుకున్నారు. ఇద్దరిద్దరు ఒక చెట్టు చొప్పున సలికెలతో పాదు చుట్టూ గాడి తవ్వారు. అది దాదాపు అడుగుంన్నర ఉంది. ఆడవాళ్లు బస్తాకున్న పురికొస కోసేసి, ఎరువునంతా కిందబోసి, ఈతకర్రలతో అల్లిన తట్టలతో ఆ గాడిలోకి మోయసాగారు.

ముందు ఒక బస్తా ఎన్ని తట్టలయితుందో కొలిచి పోయమన్నాడు పతంజలి. ప్రతి బస్తా ఇరవై నాలుగు తట్టలు వచ్చింది. దీన్ని బట్టి చెట్టుకు నాలుగు తట్టలు వస్తుంది. గాడీకి సగానికి వచ్చింది ఎరువు. ఎరువు వేస్తూనే ఇద్దరు మగవాళుల సలికెలతో మట్టిని ఎరువు కనపడకుండా కప్పుకుంటూ వస్తున్నారు.

పొద్దున్న కాఫీ మాత్రం తాగి వచ్చేశాడు పతంజలి. మార్కండేయశర్మ 11 గంటలకు మామిడికాయ చిత్రాన్నం, పెరుగన్నం కొడుక్కు తీసుకొనివచ్చాడు. పతంజలి తిన్నాడు. పైటాలకల్లా ముఫై చెట్లు పూర్తయినాయి.

కూలీలు భోజనాలు చేసి సేద తీరడానికి గంట సేపయినా తీసుకుంటారు. ఈలోగా తండ్రీ కొడుకులు ఇంజను రూములో కూర్చుని మాట్లాడుకోసాగరు.

“లారీ బాడుగతో సహా ఎంతయింది నాయనా?” అనడిగాడు తండ్రి.

“మూడు నాలుగు రోజుల్లో కర్నూలుకు వెళ్లినప్పుడు తేలుతుంది నాన్నా” అన్నాడు పతంజలి. భోజనాలకూ టిఫిన్లకు ఛార్జీలకు తానే పెట్టాడాయన. ఎంత చెప్పిన వినలేదు. తర్వాత చూసుకుందామంటాడు. పదిహేను వందలిచ్చాను. అవిగాక పైన నూట యాభై రూపాయలు తీసుకొని వెళ్లాను. అని ఖర్చుకాలేదు. ఏడువందలు ఎరువు. కూలీలు, ఏజంటు కమీషన్‌ వంద, లారీ బాడుగ పద్దెనిమిది వందలు. డ్రైవరు బేటా, చెక్‌పోస్టు మరొక నూటయాభై, మొత్తం రెండువేల ఎనిమిది వందలయింది. మన వంతు పద్నాలుగు వందలు. ఇంకా వంద ఆయన దగ్గర ఉంది. కానీ ఛార్జీలు, టిఫిన్లు, భోజనాలు మిగతా ఖర్చులు ఎంతయినాయో ఆయనే చెప్తాడు. మనమే యింకో వందదాకా ఇవ్వాల్సుంటుందేమో. చాలా మంచివాడు నాన్నా బాజిరెడ్డి” అని ముగించాడు.

“ముందుగా మనం అనుకున్నంతే అయ్యిందిలే” అన్నాడు తండ్రి. రెండు రోజులనుకున్నది మూడు రోజులు అయ్యింది. తెచ్చిన ఎరువంతా చెట్ల పాదుల్లోకి చేరుకునే సరికి మొత్తం ముపై మంది కూలీలు పని చేశారు మూడు రోజులూ కలిసి. మరుసటి రోజు నుండి నీరు పెట్టారు. ఎండు చేపల ఎరువు వేడి వల్లనో ఏమో గంటల్లోనే భూమి ఆరిపోతుంది.

నాలుగోరోజు నిమ్మకాయలు ఏరించుకొని, ఐదోరోజు కర్నూలుకు వెళ్లాడు. ఒక మూట మాత్రమే అయ్యాయి. జనరల్‌గా వేసవిలో కాపు తక్కువ.

పతంజలి వెళ్లిన కాసేపటికి బాజిరెడ్డి వచ్చాడు ట్రాక్టరు తోలుకుంటూ. దాదాపు ఐదారు మూటలు వేసుకొచ్చాడు. ఎండాకాలం కాబట్టి రేటు బాగానే పలికింది. ఒక్క మూటకే నూట యిరవై రూపాయలు వచ్చాయి. బాజిరెడ్డికి ఎనిమిదివందలు వచ్చింది.

ఇద్దరూ మార్కెట్‌ ఉడిపిలో కూర్చున్నారు. ‘మురుకు’ రెండు ప్లేట్లు తెప్పించారు. తింటూ మాట్లాడుకోసాగారు. “ఏదో నీపున్నెమా అని దూరం దేశం జూపిచ్చివి. ఆ సముద్రం, ఆ ఆడోళ్లు, గోకర్ణంలో ఆ సామి, అమ్మయ్య పెట్టిన తిండి. అన్నీ ఏదో కలలో జరిగినట్టుండాయి” అన్నాడు బాజిరెడ్డి. పతంజలి నవ్వాడు.

“నిజమే ఒక మరిచిపోలేని అనుభవం” అన్నాడు. “ఎరువంతా చెట్లకు వేయించడం అయిపోయిందా” అన్నాడు. “ఆ నిన్నటికి అయిపోయిండ్ల్యా” అన్నాడాయన.

“సరేగాని, నేను ఇంకా ఎంత ఇవ్వాలి. మొత్తం పై ఖర్చంతా నీవే పెట్టావు. అంతా లెక్క రాశావా?” అన్నాడు పతంజలి.

“ఏంది లెక్క రాసేది? భోజనాలు, టిఫన్లు, పై కర్చులు నేను పెట్టుకున్యా. నా ధర్మం అది. నీవు గినక నా వెంట లేకపోతే నాతో ఏమైతాది? నీకే ఇంకా నూర్రూపాయలొచ్చాది” అంటూ వంద రూపాయల నోటు తీసి, బలవంతంగా పతంజలి ప్రతిఘటిస్తున్నా వినకుండా, జేబులో కుక్కాడు.

“ఏందిది? ఇట్లని తెలిసుంటే రాకపోయేవాన్ని” అన్నాడు పతంజలి.

“సామీ! నా మాటిను నీవు సదువుకున్నోనివి. మంచోనివి. దేవుడు నాకు మచ్చులు (మస్తు)గ ఇచ్చినాడు. నీకు పెట్టకపోతే ఇంకెందుకు” అన్నాడాయన పతంజలి చేతులు పట్టుకొని. ఆ మాటలతో పతంజలి కదిలిపోయాడు. ‘సరేలే’ అన్నాడు కాఫీ తాగి యిద్దరూ విడిపోయారు.

***

ఇంటికి పోయి భోజనం చేసి తోటకు వెళ్లాడు పతంజలి. వంగతోట కూడ ఉడిగిపోతూ ఉంది. మరో వారం పదిరోజులు కాయలు దిగుతాయని అంచనా వేశాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here