సాఫల్యం-21

3
11

[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]ని[/dropcap]మ్మకాయలు పెద్దగా రాలడం లేదు. రోజు రెండు మూడు వందల కాయలు కూడ రావడం లేదు. వెల్దుర్తిలోనే ఇంటి దగ్గర. సోడా షాపులవాళ్లకు సరిపోతున్నాయి.

నాల్రోజులు పోతే జీతగాండ్లకు పనిలేదు. ఏం చేయిద్దామా అని ఆలోచించాడు పతంజలి. ఏమితోచలేదు. రోజుకూలీ వాళ్లే అయినా, ‘నో వర్క్‌, నో పే’ అన్న సూత్రం వారికి వర్తించదు. చివరికి తోకోడే అన్నాడు “ఒక నెల రోజులు కల్ల (కంచె) కొడతాం, సామీ బాగా పెరిగింది. కింద సందులు బడిపోయినాయి”.

“నిజమేరా! ఆ పని చేయండి” అన్నాడు పతంజలి.

ఇంగ్లీషు, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, పూర్తయి నోట్సులు రాయడం కూడ ఇంగ్లీషు లిటరేచర్‌ ఒక్క పేపరు మిగిలింది. ఎకనమిక్సు మూడింట రెండొంతులయినట్లే మరో నాలుగయిదు ఆదివారాలు ఇద్రూస్‌ భాషా దగ్గరికి వెళ్లి రావల్సుంటుంది.

సంస్కృతం రెండు పేపర్లు నాన్న దగ్గర చెప్పించుకోవడం అయిపోయినట్లే, ఇంగ్లీషులో నోట్సు రాస్తున్నాడు. కాని పాణిని వ్యాకరణం రెండు పరిచ్ఛేదాలు అసలు ముట్టుకోలేదు.

మృత్యుంజయ శర్మ అన్నాడు.

“సాహిత్యమయితే పరవాలేదు గాని వ్యాకరణం నాకు కొరుకుడు పడేది కాదురా. మన కృష్ణ శర్మ మామ ఉన్నాడు గాని వాడు తెలుగు వ్యాకరణానికే పరిమితం. ఒక పని చేద్దాము. కర్నూల్లో నా స్నేహితుడు ‘ఉప్పులూరి విశ్వేశ్వర శాస్త్రి’ అని ఉన్నాడు. అతడు సంస్కృత వ్యాకరణంలో దిట్ట. కొన్ని రోజులు ఆయన దగ్గర చెప్పించుకుందువుగాని” పతంజలి నసుగుతూ, “దానిని పదిహేను మార్కులే ఉంటాయి నాన్నా. మనమే చెప్పుకుంటే సరిపోదా, పరీక్షల కోణంలో” అన్నాడు.

తండ్రికి కోపం వచ్చింది. “అవ్యుత్పన్న ప్రాతిపదికతో చదువును చదివినా ఒకటే, చదవకపోయినా ఒకటే. పరీక్షల కోసం చదువుతావా? ఐతే గైడ్లు కొనుక్కోకుండా ఎందుకీ అవస్థంతా పడుతున్నావు. ఒక భాషానైపుణ్యం, ముఖ్యంగా సంస్కృత భాషా నైపుణ్యం ఇతర భాషల మీద, శాస్త్రాల మీద కూడ ప్రభావం చూపుతుంది.” అన్నాడు. పతంజలికి బుద్ధొచ్చింది.

 “సరే నాన్నా నాలుగు రోజుల్లో ట్యూషన్‌ అయిపోతుంది. మళ్లీ జూలై రెండవ వారానికి గాని రెగ్యులర్‌ పిల్లలు రారు. ఈలోపు ఆయన దగ్గర నేర్చుకుంటా. వచ్చే ఆదివారమే ఆయన దగ్గరికి వెళదాం” అన్నాడు.

అనుకొన్నట్లుగానే ఆదివారం భోజనం చేసి కర్నూలు వెళ్లారు. తుంగభద్ర ఒడ్డున ప్రకాశ్‌ నగర్‌లో ఉంటారాయన. నేతాజీ టాకీసు పక్క సందులో అని చెప్పారు. బస్టాండు నుండి రిక్షాల్లో ఇద్దరూ ఆయన యింటికి వెళ్లారు.

పెద్ద యిల్లు. ఇంటిముందు షటిల్‌ కోర్టు. నున్నగా గచ్చు చేసి ఉంది. ఒక పక్కగా పెద్ద బాదం చెట్టు. దాని క్రింద సిమెంటు సోఫాలు. ఇంటి చుట్టూ వరండా. వరండాలో నాలుగడుగులకొక స్తంభం. టేకుతో చేసిన నగిషీలు. వీళ్లు గేటు తీసిన శబ్దానికి పెద్ద కుక్క ఒకటి అరుస్తూ బయటకు వచ్చింది. ‘రాముడు భీముడు’ సినిమాలో కుక్కలాగా, అంతే సైజులో ఉంది. శాస్త్రిగారు బయటకు వచ్చారు. కుక్కను వెనక్కు పిలిచారు.

మార్కండేయ శర్మను చూసి మహదానందపడ్డాడాయన. “రండి రండి అవధాన సరస్వతీ, పౌరాణిక రత్న. ఇంకా ఏవయినా బిరుదులున్నాయా మీకు?” అన్నాడు నవ్వుతూ.

హాల్లో కూర్చోబెట్టాడు. క్రింద బేతంచర్ల పాలిష్‌ బండలు నిగనిగ మెరుస్తున్నాయి. సోఫాలు, రోజ్‌వుడ్‌ కర్రతో చేసినవి వాటిమీద మెత్తలు, అనుకోడానికి దిండ్లు. ఎదురుగా పెద్ద బల్లమీద పెద్ద మర్ఫీ రేడియో ఉంది. ఒక వైపు ర్యాక్‌ నిండా పుస్తకాలు. లోపలికి వెళ్లి వచ్చాడాయన. “ఊరక రారు మహాత్ములు. వచ్చిన పని సెలవిస్తే, నా యథాశక్తి దాన్ని సఫలం చేస్తాను” అన్నాడు. పతంజలి ఆయనకు నమస్కరించాడు.

లావుగా ఎత్తుగా ఉన్నాడాయన. నున్నని గుండు వెనక గోష్పాదమంత పిలక. సైనుగుడ్డతో కుట్టిన చేతుల బనియన్‌ ధరించాడు. M.L.A అంచు తెల్లని ధోవతి. నుదుట గంధం, కుంకుమ. సాక్షాత్తు విశ్వేశ్వరుడే అనుకున్నాడు పతంజలి. “నాన్నవయసే ఉంటుంది”.

కుక్క వచ్చి ఆయన కాళ్ల దగ్గర పడుకుంది. దాని తల నిమురుతూ, “వీడు భైరవుడు. మా ఇంట్లో ఒక ముఖ్యమయిన సభ్యుడు” అన్నాడు.

ఇలాంటి కుక్కను కొన్ని సినిమాల్లో ధనవంతుల యిళ్లలో చూసి ఉన్నాడు పతంజలి. “ఇది ఏ జాతిదండీ?” అనడిగాడు కుతూహలంగా. “దీన్ని జర్మన్‌ షెపర్డ్‌ అంటారు నాయనా” అన్నాడాయన.

మార్కండేయ శర్మ చెప్పాడు. “వీడు మా పెద్దవాడు. పతంజలి శర్మ. ఉస్మానియా బి.ఏ. ప్రయివేటుగా చదువుతున్నాడు. ద్వితీయ భాష సంస్కృతం తీసుకున్నాడు. సాహిత్య భాగమంతా నేను చెప్పినాను. పాణిని వ్యాకరణం రెండు పరిచ్ఛేదాలు పాఠ్యాంశాలుగా ఉన్నాయి. మీ వద్ద అంతేవాసిగా ఉండి నేర్చుకుంటాడని తీసుకొని వచ్చాను”

“నా మీద మీకున్న అవ్యాజమైన అభిమానం కొద్దీ అలా అంటున్నారుగాని, మీకు రాని వ్యాకరణమా అది. మీ ముందు నేనెంతవాణ్ని” అన్నాడాయన.

“లేదు లేదు, వ్యాకరణంలో మీకున్న ప్రజ్ఞ నాకు లేదు” అన్నాడు తండ్రి.

వాళ్లిద్దరూ మహా పండితులయినా, వాళ్ల వినయ శీలం పతంజలికి అచ్చెరువు గొల్పింది. గేటు బయట శిలాఫలకం మీద చూచి వచ్చాడు. అయిన ఎమ్‌.ఎ (ఇంగ్లీషు), ఎమ్‌.ఎ. (సంస్కృతం), ఎల్‌.ఎల్‌.బి. చేసినట్లు వరుసగా డిగ్రీలున్నాయి. ఆయన పేరు ముందు “ప్రతివాది భయంకర” అన్న బిరుదు తండ్రి చెప్పాడు.

“శాస్త్రిగారు మద్రాసులో, బెనారస్‌లో చదువుకున్నారు. వీరి తాతల కాలం నుండీ న్యాయవాదులే”

గ్రూపులో ఇంగ్లీషు లిటరేచర్‌ తీసుకున్నట్లు తెలిసి సంతోషించాడాయన.

“మీ నాయన మాటలు విని నా గురించి ఎక్కువగా ఊహించుకోవద్దురా. ఆయనకు డిగ్రీలు లేకపోయినా పుంభావసరస్వతి. మేము లౌకికమయిన చదువులు చదివాము” అన్నాడాయన.

బస్టాండులోనే కొన్న మామిడిపండ్లు తమలపాకుల్లో పెట్టి, ఆయన చేతుల్లో పెట్టి పాదాభివందనం చేశాడు పతంజలి. “సరస్వతీ కటాక్ష సిద్ధిరస్తు” అని దీవించాడాయన.

ఇంతలో ఇంట్లోనుండి యాపిల్‌ ముక్కలు, మజ్జిగగ్లాసులు ఒక వెండి ప్లేట్లో పెట్టుకొని ఒక ముత్తయిదువ వచ్చింది.

“నా మెరుగైన సగం” అన్నాడాయన. రెండు నిమిషాల తర్వాత అర్థమయింది పతంజలికి. “బెటర్‌ హాఫ్‌” అన్న ఇంగ్లీషు పదాన్ని చమత్కారంగా అలా తెలుగులోకి మార్చాడని.

ఆమె మార్కండేయ శర్మకు నమస్కారం పెట్టింది. “ఎప్పుడో రాంబొట్ల వారి గుడిలో మీ ప్రవచనం విన్నాను. మళ్లీ ఆ భాగ్యం కలుగలేదు” అన్నదామె.

“వీడు మన శిష్యుడు.” అని పతంజలిని చూపాడాయన “శర్మగారి కొడుకు” ఆమె పతంజలిని చూసి వాత్సల్యంగా నవ్వింది.

మధ్యాహ్నం ఖాళీగా ఉంటాననీ రేపటి నుండి రమ్మనీ చెప్పాడాయన. ఇద్దరూ ఆయన వద్ద సెలవు తీసుకొని వచ్చేశారు. రిక్షాల్లో తండ్రి అన్నాడు. “నిగర్వి మహా పండితుడు. వైయాకరణి. కర్నూల్లో లీడింగ్‌ లాయరు, మంచి సంపన్నులు”

“నీవు మాత్రం నిగర్వివి కాదా నాన్నా, ఆయన నిన్ను ‘పుంభావ సరస్వతి’ అని అన్నపుడే నాకు అర్థమయింది” అనుకున్నాడు పతంజలి మనసులో.

బస్సులో కూర్చున్నా ఆయనే గుర్తొస్తున్నాడు. “అంత చదువు, హోదా, సంపద ఉన్నా, ఎంత నిరాడంబరంగా ఉన్నాడు! ఆ బనియన్‌ చూస్తేనే తెలిసిపోయింది” అనుకున్నాడు.

నాన్న పాఠం చెప్పిన ‘రఘువంశం’ గుర్తొచ్చింది. కాళిదాస విరచిత మహాకావ్యమది. మొదటి రెండు సర్గలు పాఠ్యాంశాలు. మొదటి సర్గలో అంటాడు మహాకవి.

“ప్రాంశుల భ్యేఫలే మోహాత్‌ ఉద్భాహురివవామనః

తితీర్షుర్దుస్తరం మోహాత్‌ ఉడుపేనాస్మి సాగరమ్‌”

“పొడవైన వాడికి మాత్రమే అందే ఫలాల కోసం చేతులు పైకి చాచిన పొట్టివాని లాగా, మహా సముద్రాన్ని దాటటానికి ఒక చిన్న పడవను సాధనం చేసుకున్నట్లుగా, రఘువంశీయుల గొప్పదనమును తన పరిమితమైన పాండిత్యంతో వర్ణించే సాహసం చేస్తున్నాను” అని అర్థం ఆ శ్లోక భాగాలకు. ఆయన వినయం గురించి చర్చిస్తూ, తండ్రి అప్పటికప్పుడు అశువుగా చెప్పిన తెలుగు పద్యం గుర్తొచ్చింది పతంజలికి.

అసముండయ్యును కాళిదాసుడు విశిష్టానేక శాస్త్రమ్ములన్‌

ఇసుమంతేని యహంకృతిన్‌ బడయకేనల్పుండనంచున్‌ కృతిన్‌

లసితోదంచిత వైఖరిన్‌ నుడివె. ధీ లక్ష్మీ కృపాపాత్రులీ

వసుధన్‌ గర్వము బొందనేరరు గదా బ్రఖ్యాతులై యెప్పినన్‌”

అర్థాంతర న్యాసాలంకారాన్ని కాళిదాసుని వినయానికన్వయించి ఎంత హృద్యంగా చెప్పాడు నాన్న. శాస్త్రిగారు చెప్పినట్లు డిగ్రీలు లేకపోయినా ఆయన పుంభావ సరస్వతి తండ్రి, అభిమానంగా అపురూపంగా చూసుకున్నాడు పతంజలి.

***

మరురోజు భోజనం చేసి మధ్యాహ్నం రైలుకు బయలుదేరాడు కర్నూలుకు. స్టేషన్లో సీజన్‌ టికెట్‌ తీసుకున్నాడు. దాదాపు నెలరోజులు తిరగాలి కాబట్టి ఛార్జీ బాగా తగ్గుతుంది. “మామూలుగా ఐతే రాను పోను రూపాయి అరవై పైసలయితుంది. బస్సుకైతే నాలుగు రూపాయల నలభై పైసలు. సీజన్‌ టికెట్‌ నెల రోజులు తిరగటానికి కేవలం పధ్నాలుగు రూపాయలే. స్టూడెంట్‌ అని కాలేజీ వారి సర్టిఫికెట్‌ ఉంటే తొమ్మిది రూపాయలే. అంతేగాక విశ్వేశ్వర శాస్త్రిగారిల్లు స్టేషన్‌కు దగ్గర. స్టేషన్‌ నుండి పట్టాల వెంబడి నడుచుకొంటూ రావొచ్చు. పాఠం చెప్పించుకొని సాయంత్రం డోన్‌ లోకల్‌కు వెళ్లిపోవచ్చు.

రైలు దిగి శాస్త్రి గారింటికి వెళ్లేసరికి ఒంటిగంటయింది. “రా నాయనా కూర్చో” అని ఆహ్వానించాడాయన. పతంజలి కిందే కూర్చున్నాడు. ఆయన ముఖంలో ఒక మెచ్చుకోలు కనబడిరది.

పాణిని రెండు పరిచ్ఛేదాలూ చూశాడాయన. తలపంకించాడు.

“రోజూ గంట కూర్చుంటే గట్టిగా పక్షం రోజులు పని” అన్నాడు. “అయితే నాదొక షరతుంది. రోజూ నేను చెప్పిన సూత్రం దాని వ్యాఖ్యానం, ఉదాహరణలు అన్నీ మరుసటి రోజు నాకు అప్ప చెప్పాలి. ఇంగ్లీషులో ఏం రాసుకుంటావో నీ యిష్టం” అన్నాడాయన.

సాహిత్యంలో తండ్రి చెప్పిన పాఠాలకు తాను ఇంగ్లీషులో వ్రాసుకున్న వ్యాసాలను చూపించాడాయనకు. బాణుని “చండాలకన్యకా వర్ణనము”, కృష్ణకర్ణామృతంలోని శ్లోకాలకు తాను వ్రాసిన తాత్పర్యం చూపించాడు. వాటిని చదివి ఆయన అన్నాడు.

“ప్రతి భాషకూ దానికి మాత్రమే సొంతమైన జాతీయత (idiom) ‘తనం’ (nativity) ఉంటాయి. వాటిని సస్టెయిన్‌ చేసినపుడే అది పండుతుంది. కొన్ని మన భావాలు, పదాలు, ఇంగ్లీషులో సమానార్థకాలు కలిగి ఉండవు. అలాంటి వాటిని ట్రాన్స్‌లేట్‌ చేయడానికి ప్రయత్నించకూడదు. ట్రాన్స్‌లిటరేట్‌ చేయాలి. ఆ పదాన్ని ఇంగ్లీషు స్పెల్లింగ్‌లో వ్రాసుకొని బ్రాకెట్‌లో పక్కన క్లుప్తంగా వివరించాలి.

“ఉదాహరణకు ‘యజ్ఞోపవీతం’ అన్న పదాన్ని ‘sacred thread’ అని వాడకూడదు. “yagnopavitha” అనే రాయాలి. లీలాశుకుడు కృష్ణున్ని వర్ణించేది చూడు. “మందం మందం” అన్న భావాన్ని ‘slowly slowly’ అని చూపించావు. కానీ ఆ భావం పలకడంలేదు. “with a subdued pace” అని చూడు సరిగ్గా సరిపోతుంది. నీ వయసుకు నీవు రాసినది బాగానే ఉంది. ఈ దృష్టిలో చూడిక. రోజూ పది నిమిషాలు నీ నోట్సులో నేటివిటీ లేని చోట్ల ‘అండర్‌లైన్‌’ చేసి యిస్తాను. మార్చి చూపిస్తూండు. ఈ వ్యాకరణం పూర్తయ్యేలోపల పుంజుకుంటావు”

పతంజలికి జ్ఞానోదయమైంది. ఆ రోజు పాఠం పూర్తయ్యేసరికి మూడు కావస్తూంది. గురుపత్ని ఒక వెండి ప్లేట్లో నాలుగు పప్పు చెక్కలు పెట్టిచ్చి, మంచి నీళ్లిచ్చింది. గురువుగారితో కూడ కాఫీ కూడ తాగి, ఆయన పాదాలకు నమస్కరించి బయలుదేరాడు.

సాయంత్రం ఆరు నలభైకి రైలు. అంతవరకు హాయిగా చదువుకోవడం, వ్రాసుకోవడం చేసుకోవచ్చు. స్టేషన్‌ రోడ్డులోనే గిబ్సన్‌ కాలనీ అని ఉంది. అక్కడ ‘విజయ భాస్కరరెడ్డి పార్కు’లో పౌరగ్రంథాలయం ఉంది. సాయంత్రం నాలుగు నుంచి ఏడు గంటల వరకు తెరిచి ఉంటుంది. స్టేట్‌బ్యాంకు దాటి కాలేజి ఎదురుగా ఉన్న రోడ్డులో ప్రవేశించి లైబ్రరీ చేరుకున్నాడు. లైబ్రేరియన్‌ యువకుడే. అతని దగ్గరకు వెళ్లి తాను ఒక చోట కూర్చొని ఆరు గంటల వరకు చదువుకోడానికి అనుమతి అడిగాడు. తన చదువు గురించి చెప్పాడు. “దానికేం భాగ్యం! భేషుగ్గా చదువుకో” అన్నాడాయన.

లైబ్రేరియన్‌ కూర్చునే చిన్న గది కాక, ఒక సుమారైన హాలుంది. పెద్ద టేబులుకిరువైపులా పది పన్నెండు కుర్చీలు వేసి ఉన్నాయి. టేబుల్‌ మీద వార్తాపత్రికలు, వారపత్రికలు, ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ భాషల్లో ఉన్నాయి. ఇతరులెవ్వరికీ ఇబ్బంది కలుగకుండా ఒక చివర కూర్చున్నాడు. రాసుకోడానికి కూడ అనువుగా ఉంది టేబులు. ఆ రోజు శాస్త్రి గారు చెప్పిన సూత్రాలను కంఠస్థం చేశాడు పతంజలి ఐదు నిమిషాల్లో. వ్యాఖ్యానాన్ని ఆకళింపు చేసుకొని దాన్ని ఇంగ్లీషులో రాసుకున్నాడు.

తర్వాత గ్రూప్‌ ఇంగ్లీషులో మూడవ పేపరు తీశాడు. ‘క్రిటికల్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ అనే పేపరది. కవిత్వాన్ని ఎలా విశ్లేషించాలో వివిధ విమర్శకులు చెప్పిన సిద్ధాంతాలుంటాయి అందులో. లబ్ధ ప్రతిష్ఠులైన కవులు రచయితల రచనల నుండి తీసుకున్న ఉదాహరణలకు విశ్లేషణలుంటాయి. ఈ విశ్లేషణలో కవి వైఖరి నచ్చకపోతే విమర్శించవచ్చు కూడ. ఇమేజ్‌, ఇమేజరీ, డిక్షన్‌. ఫిగర్స్‌ ఆఫ్‌ స్పీచ్‌, ఇలా ప్రకరణాలున్నాయి.

పరిసరాలను కూడ గమనించకుండా చదువులో మునిగిపోయాడు పతంజలి. దాదాపు ఐదున్నరకు తలెత్తి గోడ మీద ఉన్న గడియారం వైపు చూశాడు. పుస్తకాలన్నీ సర్దుకొని లైబ్రేరియన్‌కు ధాంక్స్‌ చెప్పి బయటకు వచ్చాడు. పార్కులోనే ఉన్న కొళాయి వద్ద ముఖం కడుక్కున్నాడు. స్టేషన్‌కు నడక సాగించాడు. దగ్గరే పదినిమిషాలు కూడపట్టదు.

కె.సి కెనాల్‌ వంతెనకుముందే ఒక సర్కిల్‌ వస్తుంది. అక్కడ ‘అరోమా టీస్టాల్‌’ అని ఉంది. అక్కడ టీ తాగాడు. స్టేషన్‌ చేరుకునే సరికి ఆరుంబావు. లోకల్‌ ప్లాట్‌ ఫారం మీద ఉంది. ఇంజను వెనక్కు తీసుకుని వెళ్లి తగిలించాలి.

పెట్టిలో బ్యాగ్‌ పెట్టి ఇంజను వెనక్కి ఎలా తిరుగుతుందో చూద్దామని స్టేషన్‌ దాటి వెళ్లాడు. అక్కడ పట్టాల కింద పెద్దగుంత ఉంది. స్టీమ్‌ ఇంజన్‌ వెళ్లి సరిగ్గా ఆ గుంతమీద పట్టాలపై నిలబడింది. పట్టాలు గుంత వెడల్పుకు సరిపడా కట్‌ చేసి ఉన్నాయి. గుంత చుట్టూ కింద ఏవో కప్పీలు, లివర్లు లాంటివి చూశాడు.

ఒక రైల్వే ఉద్యోగి, సన్నగా ఉన్నాడు. ఇంజను వెనుక భాగంలోని రెయిలింగ్‌ను పట్టుకొని తోయసాగాడు. అంత బరువుండే ఇంజను సులువుగా కదిలి వర్తులాకారంగా తిరుగుతూ ముందు భాగం డోన్‌ వైపు వచ్చి ఆగింది. పట్టాలు, గుంతమీది పట్టాలు సమాంతరంగా వచ్చాయని క్రింద చూచి నిర్ధారణ చేసుకుని. అతడు డ్రైవరుకు సిగ్నలిచ్చాడు. ఇంజను లూప్‌ లైను మీదుగా వెళ్లి, మెయిన్‌ లైన్‌ మీదికి వచ్చి, రివర్స్‌లో కదులుతూ, రైలును చేరుకుంది. మొదటి పెట్టికున్న కప్లింగ్‌లతో దానిని అనుసంధానించారు. మరో ఐదునిమిషాల్లో రైలు బయలుదేరింది.

రెండోరోజు నిన్నటి పాఠం అప్పచెప్పమని ఆయన అడగలేదు. పతంజలి వెళ్లేటప్పటికి ఎవరితోనో ఏదో కేసు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరో వెళ్లిపోయింతర్వాత పతంజలితో అన్నాడు శాస్త్రిగారు.

“ఈరోజు కొంచెం కోర్టు వ్యవహారం ఉంది. అయినా సరే ద్వితీయ విఘ్నం కాకూడదని నీ కోసమే ఎదురు చూస్తున్నాను. కానీ,,” అంటూ ఒక అరగంట సేపు రెండు సూత్రాలను వివరించి, కావ్యాలనుండి అవి ఉపయోగించబడిన ఉదాహరణలు చెప్పాడు.

“కొన్నిసార్లు మహా కవులు సైతం వ్యాకరణ సూత్రాలను ఉల్లంఘిస్తారు. కాని మహోన్నతమైన వారి వైదుష్యం ముందు అవి చిన్నబోతాయి. వ్యాఖ్యాతగా పేరుగాంచిన మల్లినాధ సూరి కూడ తన ‘దీప శిఖా వ్యాఖ్యానం’లో సైతం అటువంటి సందర్భం వచ్చినప్పుడు, ‘మహాకవి ప్రయోగాణాం సాధు’ అని వదిలేస్తాడు. అంటే మహా కవి ప్రయోగించినాడు కాబట్టి మంచిదే అని అర్థం.

పతంజలి ఈ వివరణకు ముగ్ధుడైనాడు. ఇంతలో బల్లమీద నల్లని ఫోన్‌మోగింది, ఆయన రీసివర్‌ తీసి చెవి దగ్గర పెట్టుకొని, “హలో ! ఆ. ఆ. బయలుదేరుతున్నా. మా డ్రయివరు రాలేదు. మీ కారే పంపండి” అని చెప్పాడు.

పతంజలి ఆయన పాదాలకు నమస్కరించి వచ్చేశాడు. అప్పటికింకా రెండు కూడా కాలేదు. పార్కులోని గ్రంథాలయం నాలుక్కుగాని తెరవరు. ఏంచేయాలా అని ఆలోచించాడు. పక్కనే నేతాజీ టాకీసు ఉంది అందులో ఏం సినిమా ఆడుతుందో వెళ్లి చూశాడు. “ది మైటీ హిమాలయన్‌ మ్యాన్‌.”

ఇంగ్లీషు సినిమా కాబట్టి నాలుగు లోపే అయిపోతుందని చెప్పి బెంచీ టికెట్టు తీసుకొని లోపలికి వెళ్లి కూర్చున్నాడు. జనం పలుచగా ఉన్నారు. సినిమా అద్భుతంగా ఉంది. హిమాలయాల్లోని ఒక ‘ఏప్‌’ (వానరజాతి) మ్యాన్‌ పాదముద్రలను చూస్తారు ట్రెక్కర్స్‌. అతన్ని పట్టుకొని జనావాసాలకు తీసుకొని వెళతారు. హీరోయిన్‌ మీద అభిమానం పెంచుకుంటాడు ఏప్‌ మ్యాన్‌. దాన్ని ఉపయోగించుకొని అతన్ని పట్టుకుని తీసుకుపోతారు.

ఒక మహా నగరంలో అతన్ని ప్రదర్శనకు పెడతారు. మనుషుల అత్యుత్యాహం అతనికి చిరాకు కల్గిస్తుంది. నిలువెత్తు బోనులోంచి తప్పించుకొని నగరంలో విధ్వంసం సృష్టిస్తాడు. చివరకు ఆ అమ్మాయి మీద ప్రేమతోనే లొంగిపోయినా కూడ అతని మీద బుల్లెట్ల వర్షం కురిపించి చంపేస్తారు.

సినిమా నాలుగులోపే ఐపోయింది. వెళ్లి లైబ్రరీలో కూర్చుని చదువు కున్నాడు. నోట్సు రాసుకున్నాడు. రాత్రి రైలుకు ఇంటికి చేరుకున్నాడు.

అన్నట్లుగానే పది రోజుల్లో రెండు ప్రకరణాలూ పూర్తిచేశాడాయన. చివరి రోజు నాలుగు యాపిల్‌ పళ్లను ఆయన చేతిలో ఉంచి, పాదాలకు ప్రణమిల్లాడు పతంజలి. పతంజలిని అక్కున చేర్చుకుని, ఆశీర్వదించాడాయన.

“అప్పుడప్పుడు వస్తూండు” అని చెప్పాడు.

జూలైలో వానకారు బుడ్డల విత్తనం తయారు చేసుకున్నారు. మల్లేపల్లి నుండి బుడ్డలు (వేరుశనగకాయలు) తెచ్చుకున్నారు. విత్తనం కాయలు ఇచ్చిన రైతు పేరు శేషశయనారెడ్డి. మార్కండేయశర్మ శిష్యుడే. విత్తనానికి డబ్బులు తీసుకోలేదు.

“సామోల్లకాడ తీసుకుంటామా!” అన్నాడంతే.

కాయలు వలిచి, నట్టలు, (విత్తనానికి పనికిరాని చివికిపోయినవి) నల్లబడినవి, తీసేసి, ఒక రోజంతా ఎండబెట్టారు గోమూత్రం కలిపి. వర్షం కురిసిన రెండోరోజు విత్తనం గొర్రు సుంకన్న తోలుతూ ఉండగా తోకోడు, బుడ్డక్క, సుంకన్న భార్య, పతంజలి, గొర్రు వెనక చెక్కగరాటుల్లోంచి వెదురు బొంగుల్లోకి విత్తనాన్ని జారవిడుస్తూ రాసాగారు. గొర్రు నాలుగు సాల్లు (వరసలు) తోలుతుంది. బొంగుల్లోంచి విత్తనం సాళ్లలో పడిపోతుంది అంగుళం లోతున.

నడుము దగ్గర ఒడి కట్టుకొని, ఒడిలో విత్తనాలు పోసుకొని చెక్కగరాటులో ధారగా పోయాలి. దానికి చాలా నైపుణ్యం కావాలి. వీళ్లు పోసే ధారను బట్టి విత్తనాలు నిర్ణీత దూరంలో భూమిలో పడతాయి. పతంజలి వాళ్లు వేసింది గుత్తికాయ. వేరుశనగ చెట్టు నిలువుగా దాదాపు రెండడుగులు పెరుగుతుంది. నేలలో కాయలు గుత్తులు గుత్తులుగా ఏర్పడతాయి.

రెండో రకం ఒకటుంది. దాన్ని తీగ కాయ అంటారు. వర్షాధారమైన మెట్ట భూముల్లో దీన్ని మాత్రమే వేస్తారు. ఇది పైకి పెరగదు. నేలంతా పరచుకుంటుంది. తీగలుగా, తీగల వెంట కాయలు నేలలో దిగుతాయి. గుత్తి కాయకు నీటి తడి ఎక్కువగా అవసరమవుతుంది.

వీళ్ల వెనకే సాళ్లను మూసి చదును చేస్తూ గుంటక తోలుతున్నాడు ఒకతను. అతని ‘కాడి’ని బాడుగకు పిలిచారు. నిమ్మచెట్లున్న భాగం తప్ప మిగతా ఐదారెకరాలూ విత్తడం సాయంత్రానికి పూర్తయింది.

ఐదారు రోజులు చూసి వర్షం పడకపోతే ఒక తడి పారించాలని నిర్ణయించుకున్నారు.

సాయంత్రం నిమ్మ చెట్లలో తిరిగి చూశాడు పతంజలి. ఎండు చేపల ఎరువు బాగా పని చేసింది. చెట్లన్నీ గుబురు తేలాయి. పూత విపరీతంగా పట్టింది. చాలాచోట్ల పిందే వేపకాయంత పరిమాణంలో ఉంది.

పతంజలి మనస్సు కూడ నిమ్మ చెట్లలాగే పుష్పించింది. “మరో రెండు నెలల్లో కాపు చేతికొస్తుంది. వచ్చే సంక్రాంతి వరకు దాదాపు ఐదు వందల బస్తాలు దిగొచ్చు” అని అంచనా వేశాడు.

“ఒక వారం రోజుల్లో పిందె రాలకుండా స్ప్రే చేయాలి చెట్లకు” అనుకున్నాడు.

విత్తనం వేసిన మూడోరోజు మంచి పదును వాన కురిసింది. వారం రోజుల్లో విత్తనాల్లోంచి చిన్న చిన్న మొలకలు రాసాగాయి. పదిహేను రోజుల్లోగా సాళ్లు ఏర్పడ్డాయి. వేరుశనగా మొక్కతో పాటు గడ్డి, కలుపుకూడ వచ్చాయి. భూమి ఆరింతర్వాత కలుపు గుంటక తోలారు.

మామూలు గుంటకలో ఇనుప బ్లేడు అంగుళంన్నర వెడల్పు, పావు ఇంచీ మందం ఉండి పొడుగ్గా ఉంటుంది. కలుపు గుంటకకు నాలుగు చిన్న బ్లేడ్లు విడివిడిగా ఉంటాయి. ఒక్కొక్కటి మూడంగుళాల పొడవు మాత్రమే ఉంటాయి. విత్తనం గొర్రు పట్టిల మధ్య ఎంత దూరముంటుందో సరిగ్గా అంతే దూరం కలుపుగొర్రు పట్టీల మధ్య ఉంటుంది.

కాడికి ఎద్దులను కట్టి, కాడి మధ్యలో గుంటకను తాళ్లతో కడతారు. నాలుగు బ్లేడ్లూ నాలుగు సాళ్ల మధ్య ఉండేలా చూసుకొని గుంటక మీద పెద్ద రాయి పెట్టి, వెనక పిడి వట్టి పట్టుకొని తోకోడు గుంటక తోలసాగాడు. చాలా అప్రమత్తంగా తోలాలి. ఏమాత్రం అటూ యిటూ అయినా, సాలులోని వేరుశనగ మొక్కలన్నీ లేచిపోతాయి. నెమ్మదిగా తోలాలి. కలుపు ఎక్కువగా ఉన్న చోట గుంటకమీద పెట్టిన రాయి బరువు చాలకపోతే, తోలే మనిషి ఒక కాలును గుంటక మీద పెట్టి ప్రెస్‌ చేస్తూ, బరువు పెంచుతూ, ఒక కాలితో నడుస్తూ తోలాలి.

తోలేవాడి పనితనం ఒక ఎత్తయితే, ఎద్దుల ఏకాగ్రత మరో ఎత్తు. గంటల తరబడి సాలు మధ్యలోనే నడుస్తాయి. సాళ్ల చివర టర్నింగ్‌ తిరిగినపుడు కూడా పొరపాటున మొక్కల మీద నిలబడవు. మొక్కలను తినడానికి ప్రయత్నించవు. ఎందుకయినా మంచిదని వాటి మూతులకు చిక్కాలు కడతారు కానీ, వాటికాధ్యాస ఉండదు. తదేక దీక్షతో సాళ్ల మధ్యలో మునుల్లాగా నడుస్తూ ఉంటాయి.

ఎప్పుడో ఒకసారి ఏదో ఒక మొక్క ఎద్దు గిట్ట కింద నలిగిపోతుంది. దాని లేత కొమ్మలు విరిగిపోతాయి. కాని ఆశ్చర్యమేమంటే అలాంటి మొక్క నాలుగు రోజుల్లో తేరుకుని, మిగతా మొక్కలకంటే ఏపుగా పెరుగుతుంది. అందుకే ఎవరయినా మంచివాడు దెబ్బతిని మళ్లీ బాగుపడితే, కర్నూలు జిల్లాలో ‘ఎద్దుతొక్కిన మొక్క లెక్క’ లేసి కూర్చున్నాడంటారు.

కాసేపు సుంకన్న గుంటక తోలాడు. కాసేపు పతంజలి కూడ తోలాడు. సాయంత్రానికి పూర్తయింది. ఎద్దులను ‘గాడిపాట్లో’ కట్టేసి, ఒళ్లంతా నిమిరారు వాటి పనితనాన్ని అభినందిస్తూ.

కలుపు గుంటక కందని, మొక్కల మధ్యలో ఉండిపోయిన కలుపును రేపు ఆడకూలీలు వచ్చి కలుపుతీసే కొడవళ్లతో తొలగిస్తారు.

రెండ్రోజుల తర్వాత వేరుశనగ చేసు కలుపంతా పోయి కళకళలాడసాగింది. డోన్‌కు బండికట్టుకుని పోయి గ్రోమోర్‌ బస్తాలు ఐదు వేసుకొని వచ్చారు. చేనంతా గ్రోమోర్‌ చల్లి మరసటి రోజు ‘తడి’ పారించారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here