సాఫల్యం-3

1
9

[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని సరికొత్త ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]పే[/dropcap]పరిచ్చేసి బయటకు వచ్చాడు పతంజలి. పరీక్ష బాగా రాసినందుకు సంతోషంగా ఉంది. కృష్ణశర్మసారు గుర్తుకు వచ్చాడు. ఆయన చెప్పబట్టి కదా బాగా రాయగలిగినానని అనుకొన్నాడు.

గేటు బయట స్నేహితులు నిలబడి ఉన్నారు. ఎలా రాశావురా అంటే ఎలా రాశావని పలుకరించుకున్నారు. అందరూ బాగానే రాశారు. ఒక్క బక్ష్‌ తప్ప. వాడు తెలుగులో వీకు.

ఇంగ్లీషు పరీక్షరోజు వాతావరణం మారిపోయింది. స్లిప్పులు పెట్టి రాస్తున్నారు. కిటికీలు బయట ఎక్కి చిన్న గులక రాళ్లతో చీటీలు చుట్టి కావలసిన వాళ్ల దగ్గరికి విసురుతున్నారు. దూరంగా పడినవి యిన్విజిలేటరు తీసి అందిస్తున్నాడు. పతంజలికి భయంగా ఉంది. అతని దగ్గర కూడ ఉండలు పడుతున్నాయి. పోలీసులు కూడ సహకరిస్తున్నారు.

ఇంతలో “స్క్వాడ్‌ ! స్క్వాడ్‌!” అని బయట నుండి కేకలు. ఒక్కసారిగా కిటికీల్లోంచి బయటకు స్లిప్పుల వర్షం కురిసింది. దాదాపు అరగంట పాటు స్క్వాడ్‌ సభ్యులు పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. తర్వాత మళ్లీ మామూలే.

చివర్లో హిందీ పరీక్ష, ప్రతి పేపర్లో 35 శాతం రావాలి గాని హిందీలో 25 శాతం వస్తే చాలు.

చివరి పరీక్ష పూర్తయిన తర్వాత గుండెల్లోంచి భారం దిగింది పిల్లలకు. మధ్యాహ్నం మ్యాట్నీకి వెళ్లారు స్నేహితులంతా. ‘కంచు కోట’ – యన్‌.టి.ఆర్‌ సినిమా ‘రాజా’ టాకీసులో ఆడుతుంది. ధియేటరు నిండా టెంత్‌ రాసినపిల్లలే. ఆ కత్తి యుద్ధాలు, పాటలు పతంజలిని ముగ్ధుడిని చేశాయి.

సాయంత్రం తండ్రి వచ్చాడు పతంజలిని తీసుకొని వెళ్లటానికి. చిన్నాన్నకు పిన్నమ్మకు కాళ్లకు నమస్కారం చేశాడు. బస్సులో వెల్దుర్తి చేరుకున్నారు. ఇంటికి వెళ్లగానే వర్ధనమ్మ కొడుకును దగ్గరకు తీసుకొని ఒళ్లంతా నిమిరింది. అక్క, చెల్లెలు, తమ్ముళ్లు సంబరపడ్డారు. పతంజలిని విడిచిపెట్టి అన్ని రోజులు వాళ్లెపుడూ ఉండలేదుమరి.

కొడుక్కిష్టమని ‘తపేలాంటు’ (బియ్యపు పిండితో రొట్టె) చేసిపెట్టిందామె. పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వేరుశనగ పలుకులు కలిపి చేసే ఆ రొట్టె అంటే ఎంతో యిష్టం పతంజలికి. బియ్యపు పిండిలో ఇవన్నీ కలిపి నీళ్లుపోసి, ముద్ద చేసి, కర్రలపొయ్యి మీద ఒక మందమైన కంచు తపేలాంటు పెట్టి, లోపలివైపు చేతిలో పల్చగా తట్టాలి. పతంజలి వాళ్లమ్మ తపేలా చేయడంలో దిట్ట. చాలా శ్రమతో కూడిన పని అది. ఇష్టంగా తిన్నాడు.

***

పరీక్షలయింతర్వాత ఎంతో తీరుబాటు అనిపించింది పతంజలికి. కానీ ఆ తీరుబాటు రెండ్రోజులు మాత్రమే. మూడోరోజు తండ్రి తోటకు తీసుకొని పోయి అక్కడి విషయాలన్నీ చెప్పాడు “నిమ్మ తోట కాపుకు వచ్చింది. ఇంతవరకు కాపు తక్కువే కాబట్టి, గంపలతో అమ్ముకొనే వాళ్లకు యిచ్చాము. ఇప్పుడు కాపు ఎక్కువ వస్తుంది. హైదరాబాద్‌, హుబ్లీ, చెన్నై మార్కెట్లకు పంపాలి” అన్నాడు తండ్రి.

జీతగాండ్లను పిలిచి చెప్పాడాయన. “ఒరేయ్‌! రేపటి నుండి చిన్నస్వామి కూడ తోటకు వస్తూంటాడు. అన్నీ చెప్పండి” అని.

తర్వాత మోటారు పంపు ఉన్న రూములో కూర్చోబెట్టుకొని పతంజలితో చెప్పాడాయన. “నాయనా! నీవు పెద్దవాడివవుతున్నావు. వ్యవసాయంలో, ఇతరత్రా నాకు చేదోడు వాదోడుగా ఉండాలి. తమ్ముళ్లు, చెల్లెలు చిన్నవాళ్లు. అక్కకు ఈ సంవత్సరమో వచ్చే యేడో పెళ్లి చేయాలి. నీవు కూడ బాధ్యతలు తీసుకోవాలి. నీకు రేపటినుండి ముహూర్తాలు పెట్టడం, మంచిరోజులు చూడడం, జ్యోతిష్యం కూడ నేర్పిస్తా. శ్రద్ధగా అన్నీ ఒంటబట్టించుకో నాయనా” అన్నాడు.

ఎందుకు ఇంత వివరంగా చెబుతున్నాడో పతంజలికి అర్థం కాలేదు.

“సరే నాన్నా” అన్నాడు.

పొద్దున్నే స్నానం సంధ్య పూర్తి చేసుకొని చద్దన్నం తిని తోటకు వెళ్లేవాడు. జీతగాళ్లతో సాన్నిహిత్యం ఏర్పడింది. వాళ్లూ పెద్దవాళ్లేమీ కాదు. పతంజలి కంటే నాల్గయిదేళ్లు పెద్దవాళ్లేమో. ఒకరు ‘తోకోడు’. వాడి పేరు హనుమంతు అయితే అందరూ అలా పిలుస్తారు. వాళ్లు ముగ్గురన్నదమ్ములు. మొదటి వాడిని పెద్ద తోకోడని, రెండోవాడిని నడిపి తోకోడని, మూడో వాడిని చిన్న తోకోడనీ పిలుస్తారు. కానీ పతంజలికిది నచ్చలేదు. ‘హనుమంతూ’ అనే పిలిచేవాడు వాడు కొద్దిగా యిబ్బంది పడేవాడు.

“అదేంది సామీ! అందరి మాదిరి పిలిస్తే సరిపోతుంది కదా!” అనేవాడు. రెండోవాడు సుంకన్న. హనుమంతు పల్లెపదాలు చక్కగా పాడేవాడు. సుంకన్న కుండ మీద దానికి తగ్గట్టుగా దరువు వేసేవాడు. పతంజలి కూడా ఆసక్తిగా వినేవాడు.

మధ్యాహ్నం యింటికి వెళ్లి భోంచేసి, కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్లీ తోటకు వచ్చేవాడు. మోటారు ఆన్‌ చేయడం, నిమ్మ చెట్లకు నీరు పెట్టడం నేర్చుకున్నాడు. ప్యాంట్లు వాడకం తగ్గిపోయింది. అడ్డపంచె, షర్టు వేసుకునేవాడు. భుజం మీద ఒక టవలు. అదీ పతంజలి ఆహార్యం. మామూలుగా వేసుకునే చెప్పులు పాడయిపోతాయని ‘టైరు చెప్పులు’ వేసుకొనేవాడు. పాతటైర్లతో చెప్పు అడుగుభాగం తయారు చేసేవారు మందంగా. అవి ఎంత గట్టిగా ఉండేవంటే ముళ్ళు తొక్కినా ఏమీ అయ్యేది కాదు. సాయంత్రం చీకటి పడిన తర్వాత యింటికి చేరుకొనేవాడు.

రాత్రి ‘ముహూర్త దర్పణం’ లాంటి పుస్తకాల్లోంచి మంచి రోజులు, తిథులు, వారాలు వర్జ్యాలు అన్నీ నేర్పించేవాడు నాన్న. నెల రోజుల్లోనే అవగాహన కలిగింది. ఒడి బియ్యం పెట్టడానికి, నామకరణం, ఇలాంటి వాటికి మంచి రోజులు చెప్పడం వచ్చింది. ‘జాతక మార్తాండం’ ద్వారా కుండలి వేయడం గ్రహాల స్థితిగతులు గణించడం నేర్పాడు తండ్రి. ఆయన లేనపుడు ఎవరయినా వచ్చి ‘ప్రశ్న’ అడిగితే చెప్పగలిగేవాడు.

ఒకసారి ఒక గమ్మత్తు జరిగింది.

పక్కనే ఉన్న నార్లాపురం అనే ఊరి నుండి కొందరు వచ్చారు.

“పెద్దసామి లేడా సామీ!” అని అడిగారు.

రాయలసీమలో బహువచన ప్రయోగం తక్కువ.

“లేడు. పనుండి డోనుకు వెళ్లాడు” అని చెప్పాడు పతంజలి.

“నీకు మంచి రోజులు సూడడం రాదా చిన్నసామీ?” అని అడిగారు వారు.

“ఎందుకు రాదు, మీకేం కావాలో చెప్పండి” అన్నాడు పతంజలి.

“నిసేకమూర్తం పెట్టాలయ్యా”

“సరే కూర్చోండి”

అందరూ కూర్చున్నారు. బొరుగులు (మరమరాలు), బెల్లం, పుట్నాల పప్పు కలిపిన  పొట్లం, తమలపాకులు, వక్కపేళ్లు, రూపాయి దక్షిణ పెట్టారు. ‘ముహూర్త దర్పణం’లో వెతికితే పతంజలికి ‘నిషేక మహోత్సవము’ అని కనబడిరది. ఇంకేముంది ? వధూవరుల పేర్లు అడిగాడు. పేరుబలం చూశాడు.

“ఎన్ని రోజుల్లో కావాలి?” అన్నాడు.

“వారం పదిరోజుల్లో సూడయ్యా” అన్నారు.

ఆదివారం, నక్షత్రం చూసి నిషేకమునకు యోగ్యమయినదిగా తీర్మానించుకున్నాడు పతంజలి.

“వచ్చే బుధవారం, పంచమి, శతభిష నక్షత్రం పగలు ఉదయాన….” అంటుండగానే ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టారు వచ్చినవారు.

“నాయనా, పతంజలీ! ఒక్కసారి లోపలికి రా” వర్ధనమ్మ పిలిచింది.

వెళ్లాడు. “ఏమిటమ్మా, పిలిచావు?”

“కొంప ముంచేవాడివి గదా! నిషేక ముహూర్తం పట్టపగలు పెడతారా?”

“ఏం, ఎందుకు పెట్టకూడదు?”

“నిషేకమంటే శోభనం రా వెధవా! పెళ్లయింతర్వాత ఆలూమగలకు పెద్దలు ఏర్పాటు చేసే తొలిరాత్రి. అర్థమయిందా! అది రాత్రిపూట పెట్టే ముహూర్తం.”

నాలుక కర్చుకున్నాడు పతంజలి. ‘ముహూర్త దర్పణం’లో మంచి తిథులూ, నక్షత్రాలే ఉన్నాయి. నిషేకానికి పగలూ, రాత్రీ ప్రస్తావన లేదు.

బయటకు వెళ్లి కూర్చుని కాసేపు మళ్లీ చూసినట్లు నటించి, “ఆ! బుధవారం, పంచమి రాత్రి 11.08 ని॥లకు శుభ ముహూర్తం” అని ప్రకటించాడు. ఒక కాగితం మద వధూవరుల పేర్లు వివరాలు రాసి, కాగితానికి అన్నివైపులా పసుపు బొట్టు పెట్టి, దానిమీద కుంకుమ వేసి, ఇచ్చాడు వారికి.

వారి అనుమానం పటాపంచలయింది.

“చిన్నసామి గట్టోడే” అనుకుంటూ నమస్కారాలు చేసి వెళ్లిపోయారు.

***

జూన్‌ నెల 1971. స్నేహితులందరూ హడావిడిగా ఉన్నారు. S.S.C ఫలితాలు వచ్చాయి. పతంజలికి ఫస్టు క్లాసు వచ్చింది. ఆరువందలకు నాలుగు వందల రెండు మార్కులు వచ్చాయి. లెక్కల్లో, హిందీలో తక్కువ వచ్చాయి. తెలుగు, ఇంగ్లీషులో ఎక్కువ వచ్చాయి.

1969 నుండే పి.యు.సి. కోర్సు రద్దయి, ఇంటర్మీడియెట్‌ కోర్సు ఏర్పడింది. జూనియర్‌ కాలేజీలు కర్నూల్లో మాత్రమే ఉన్నాయి. డోన్‌లో కూడ లేదు. అటు వెళితే నంద్యాలలో ఉన్నాయి. వెల్దుర్తికి కర్నూలే దగ్గర పిల్లలందరూ సీజన్‌ టికెట్టు తీసుకొని, లోకల్‌ రైల్లో తిరిగి, చదువుకుంటారు. కర్నూల్లో ప్రభుత్వ జూనియర్‌ కాలేజి ఒకటి, దాని పక్కనే “కోల్స్‌ మెమోరియల్‌ జూనియర్‌ కాలేజి”, “ఉస్మానియా కాలేజి” ఉన్నాయి.

దశరథ పతంజలికి కూడ ఒక అప్లికేషన్‌ తెచ్చిచ్చాడు. ఆజం సారు దగ్గరికి వెళ్లి ఏ గ్రూపు మంచిదో అడిగాడు. “నీవు లెక్కల్లో వీక్‌ కాబట్టి H.E.C. లేదా C.E.C గ్రూపు తీసుకో”మని సలహా యిచ్చాడాయన. కాలేజి ఫీజు 11 రూ.

ఆ రోజు సాయంత్రం ఉత్సాహంగా తల్లితో తండ్రితో చెప్పాడు పతంజలి.

గంభీరంగా, మౌనంగా ఉండిపోయాడు మృత్యుంజయశర్మ. పతంజలికి అర్థంకాలేదు. తండ్రి ఎందుకలా ఉన్నాడో. తల్లి దగ్గరికి వెళ్లి “ఏమయిందమ్మా” అని అడిగాడు.

భర్తవైపు చూసిందామె నిస్సహాయంగా.

“ఇటు రా నాయనా” అన్నాడు తండ్రి. దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పసాగాడు. “నీవు పై చదువులు చదివే అవకాశం లేదు. మన యింటి పరిస్థితులు నీకు తెలియనివి  కాదు. నిన్ను చదివించే స్తోమత నాకు లేదు. ఇంటికి పెద్దవాడివి. అన్నీ చూసుకోవలసిన వాడివి. వ్యవసాయం సంగతేమిటి. పెద్ద చదువులు చదివిన వాళ్లంతా ఉద్యోగాల్లేక అఘోరిస్తున్నారు. మనకున్నది చూసుకో చాలు. నిమ్మ తోట కాపుకొచ్చింది. నీవు చదువంటూ వెళ్లిపోతే నాకు కుడిచేయి విరుగుతుంది. ‘స్వధర్మేనిధనం శ్రేయః, పరధర్మో భయావహః” అని కదా గీతా వాక్యం! నా మాట విను. కాలేజీలో చేరే విషయం మరచిపో”.

ఒక్కసారిగా హతాశుడయ్యాడు పతంజలి. ఏం మాట్లాడాలో తోచలేదు. “నాన్నా” అన్నాడు బేలగా. వెళ్లి అమ్మ ఒళ్లో తలదాచుకున్నాడు. ఏడుపు వస్తూంది. ఆయనకు నచ్చచెప్పే శక్తి తల్లికి లేదు. తండ్రి మాట కాదనే ధైర్యం పతంజలికి లేదు.

ఈ విషయం స్నేహితులకు చెప్పుకొని బాధపడ్డాడు పతంజలి. ఆ పిల్లవాడు తప్ప అందరూ, ఆఖరికి చాలా బీదవాడయిన అల్లాబక్ష్‌ కూడ కాలేజిలో చేరుతున్నాడు. ఒకరోజు ఆజంసారు, శంకరయ్యసారు శర్మగారింటికి వచ్చారు. వారిని సాదరంగా ఆహ్వానించి చాప పరచి కూర్చోబెట్టారాయన. వాగ్దేవి వారికి కాఫీలు యిచ్చింది. యధావిధిగా కాఫీ తాగి, గ్లాసులను కడిగి, బోర్లించిపెట్టారు.

“ఏం నాయనా! ఇలా వచ్చారు?”

“మన పతంజలిని చదువు మానిపిస్తున్నట్లు తెలిసింది స్వామి. పెద్దలు, పండితులు మీకు చెప్పగలిగినవారం కాదు గాని, మీ నిర్ణయం సముచితం కాదేమో అని మాకు అనిపిస్తున్నది.”

“ఆహా! కారణం?”

“పతంజలి చాలా తెలివైనవాడు. కష్టపడి చదువుతాడు. వాడికి టెంత్‌లో మంచి మార్కులు వచ్చినాయి. బాగా చదివిస్తే ఇంజనీరో, డాక్టరో, కలక్టరో అవుతాడు.” అన్నాడు ఆజం సారు.

ఇంతలో గ్రామ తలారి వచ్చి, “సామీ, పెద్దరొడ్డొచ్చాండాడు” అని ప్రకటించాడు. సర్పంచ్‌ రామకృష్ణారెడ్డి, ఆయిల్‌ మిల్లు ఓనర్‌ రామలింగయ్యశెట్టి, ఇంకా ఇద్దరు ఊరిపెద్దలు వచ్చి శర్మగారికి నమస్కరించి కూర్చున్నారు “మీరు కానివ్వండి” అన్నాడాయన సార్లవైపు చూచి.

శంకరయ్యసారు అందుకున్నాడు “సామీ, తొందరపడి పిల్లవాడి భవిష్యత్తు పాడు చేయకండి. చదువు ఆపకండి. చాలా తెలివయిన వాడు”

రామకృష్ణారెడ్డి అన్నాడు “స్వామీ, ఇంట్లో మా దశరథుడు ఒకటే ఏడ్పు, పతంజలి చదవకపోతే తానూ చదవనని. మీరెందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో అర్థం కావటం లేదు.”

“నీకు తెలియనిదేముందిరా రామకృష్ణా! పెద్ద చదువులు చదివించడానికి ఆర్థిక స్తోమత ఉండవద్దా. ఇంటికి పెద్దకొడుకు వాడిని చదువులకు పంపితే నాగతేమిటి, నాకు చేదోడు వాదోడుగా ఉండాల్సింది వాడే గదా!” అన్నాడాయన.

తలుపుచాటు నుండి వారి సంభాషణను ఉత్కంఠతో వింటున్నాడు పతంజలి.

రామలింగయ్య శెట్టి కల్పించుకొని ఇలా అన్నాడు.

“స్వామీ, డబ్బు గురించయితే మీరు ఆలోచించాల్సిన పనిలేదు. మేమందరం లేమా! చిన్న స్వామిని చదివిస్తాం.”

మృత్యుంజయశర్మ దీర్ఘంగా నిశ్వసించి ఇలా అన్నాడు.

“ఇది మా కుటుంబ విషయం, అన్యధా భావించకండి. సెలవు” అంటూ చేతులు జోడించాడు. అందరూ నిరాశగా వెనుదిరిగారు.

***

పతంజలికి తండ్రి మీద కోపం రాలేదు. ‘ఆయనైనా ఏం చేస్తాడులే పాపం’ అనుకున్నాడు. వ్యవసాయ పనులు, ఇంటిదగ్గర ముహూర్తాలు పెట్టడం చూసుకోసాగాడు. వెల్దుర్తిలో శాఖా గ్రంథాలయం ఉండేది. మంచి మంచి పుస్తకాలుండేవి. ఇంగ్లీషు తెలుగు దినపత్రికలు వారపత్రికలు వచ్చేవి.

ఎందుకోగాని యింగ్లీషు బాగా నేర్చుకోవాలని బలంగా అనిపించేది. ఆజంసారు ఒక పాత డిక్షనరీ ఇచ్చాడు. దాన్ని పెట్టుకొని ‘హిందూ’ పత్రిక, ‘ఇల్లస్ట్రీటెడ్‌ వీక్లీ’ నెమ్మదిగా చదువుకునేవాడు. శంకరయ్యసారు దగ్గరకి కూడ వెళ్లేవాడు. ‘హిందూ’లోని సంపాదకీయాలను, ‘లెటర్స్‌ టుది ఎడిటర్‌’ బాగా చదివి, “నీ భాషలో వ్రాయి” అని చెప్పేవాడాయన. అలా రాసుకొని వెళితే తప్పులు దిద్దేవాడు. ‘రెన్‌ అండ్‌ మార్టిన్‌’ గ్రామరు పుస్తకం కూడ యిచ్చాడు శంకరయ్యసారు. కొద్ది నెలల్లోనే ఇంగ్లీషు మీద కొంచెం పట్టు దొరికింది.

***

నిమ్మతోట బాగా కాపు కాయసాగింది. ప్రతి పదిహేను రోజులకొకసారి 30, 40 బస్తాల కాయతెగేది. కూలీలను పెట్టి కాయ దింపించేవాడు పతంజలి. నిమ్మ చెట్లకు ముళ్లుంటాయి. నిమ్మకాయలు కోయడానికి ముల్లుకర్ర చివర రివర్స్‌ U ఆకారంలో ఒక ఇనుప తీగను వంచి, కొలిమిలో కర్రకు చివర రంధ్రం చేసి అమర్చేవారు. వాటితో కాయలు తెంపేవారు.

కాయలు బస్తాలకెత్తి. ఇంటికి తెచ్చి, కింద వరిగడ్డి పరిచి, ఒకమూల రాశిగా పోయాలి. దానిమీద వరిగడ్డి పరచి, నీళ్లు చల్లి, గోనె సంచులు కప్పి, వాటిమీద బరువుకు రాళ్లు పెడతారు. గడ్డి వేడెక్కి 24 గంటల తర్వాత ఆకుపచ్చని కాయలు పసుపురంగుకు తిరుగుతాయి.

కిరాణాషాపుల్లో చిన్న సైజుగా గోనె సంచులు కొనుక్కొని వచ్చేవాడు పతంజలి. నిమ్మకాయలను గ్రేడింగ్‌ చేసి, పెద్ద సైజు, మీడియం సైజు, చిన్న సైజుగా విభజించేవారు. ఒక్కో బస్తా తీసుకుని, తడిసిన వరిగడ్డి బస్తా చుట్టూ, అడుగున ఉండేలా అమర్చి, 1100 కాయలు లెక్కబెట్టి ఒక బస్తాలో వెయ్యాలి. పైన కూడ కప్పి, టైట్‌గా పురికొస, దబ్బనంతో దగ్గర దగ్గరగా కుట్లు వేయాలి. ఈ పనులన్నీ జీతగాళ్లతో బాటు చేసేవాడు పతంజలి. బండి తోలడం, గొర్రు కట్టడం, వామి వెయ్యడం కూడ వచ్చు.

“కాపోల్ల పొట్టిగాల్లు మా చిన్న సామి ముందల ఎందుకు పనికొచ్చారు!” అనేవాడు తోకోడు. వాడికి పతంజలి అంటే చచ్చేంత ప్రేమ. శాపవశాన ఈ భూమిమీద అవతరించిన ఏ మహానుభావుడో పతంజలి అని వాడిభావన.

అలా కుట్టిన నిమ్మకాయ బస్తాలను ఎద్దుల బండిపై రైల్వే స్టేషనకు తరలించాలి. మధ్యాహ్నం కాచిగూడ నుండి ఒక ప్యాసింజరు వస్తుంది. అది డోను వరకు వెళుతుంది. పతంజలి చేతి సంచీలో ఒక జత బట్టలు, టవలు, సబ్బు వగైరా సరంజామా సర్దుకొని, ఏదో ఒక మంచి పుస్తకం కూడ పెట్టుకొని స్టేషన్‌కు వెళతాడు. అక్కడ బుకింగ్‌ క్లర్క్‌ ఆ బస్తాలనన్నింటినీ ‘హుబ్లీ’ స్టేషన్‌కు బుక్‌ చేస్తాడు. ఒక్కో బస్తాకు పావలా లంచం తీసుకొంటాడు. ఇవ్వకపోతే ఆ రోజు ప్యాసింజరుకు లోడింగ్‌ చెయ్యరు.

స్టేషన్‌లో ఇద్దరు హమాలీలుంటారు. ఒకరు ‘సద్గుణం’, ఇంకొకడు ‘పెంటయ్య’. లోడ్‌ చేసినందుకు వారికి పది పైసలు బస్తాకివ్వాలి. ప్రతి బస్తామీద పైన VDI (అంటే వెల్దుర్తి) క్రింద UBL (హుబ్లీ) వయా GTL HPT GDG (గుంటకల్‌, హోస్పేట్‌, గదగ్‌) అని రాసి మొత్తం 30 బస్తాలుంటే 1/30, 2/30, 3/30 ఇలా నంబరు వేయాలి.  R.R. నంబరు (రైల్వే రశీదు నం.) రాయాలి. ఇవన్నీ బుకింగ్‌ క్లర్క్‌ వ్రాయడు. హమాలీలకు చదువురాదు. పతంజలే వ్రాసుకునేవాడు. ‘పెరిషబుల్‌’ అని కూడా రాయాలి.

స్టేషన్‌లో చిన్న ముంతలో ఏవో కాయలు మూలికలు దంచి ఒక యింక్‌ లాంటిది నల్లరంగులో పోసి ఉంచేవారు. ఈతపుల్లను చివర దంచి ఒక బ్రష్‌లా చేసి దాని ఈ నల్లని యింక్‌లో అద్ది రాసేవాడు. ఇతర ప్రయాణీకులు పతంజలి రాస్తూంటే ఆసక్తిగా చూసేవారు.

***

రైలు వచ్చి ఆగింది. గార్డు పెట్టె పక్కనే లగేజి వ్యాన్‌ ఉంటుంది. ముందే బస్తాలు అక్కడ పెట్టుకునేవారు. రైలాగుతూనే గార్డు దగ్గరకు వెళ్లి నమస్కారం పెట్టి “30 బస్తాలు సార్‌ నిమ్మకాయలు” అని చెప్పి ఆయనకు ఐదు రూపాయలు చేతిలో పెట్టాడు పతంజలి. బస్తాలు ఎక్కించిన తర్వాత పక్క పెట్టెలో ఎక్కాడు.

రైలు డోన్‌ చేరగానే బస్తాలు దింపడానికి హమాలీలు వచ్చారు.

“హుబ్లీ బండికే గద సామీ” అని అడిగి రెండో నంబరు ప్లాటు ఫారం మీద లగేజి పెట్టెకు దగ్గరగా పెట్టుకున్నారు. హుబ్లీ బండిలో లోడిరగ్‌ చేసినందుకు వాళ్లకు బస్తాకు 10 పైసలు, గార్డుకు మళ్లీ ఐదు రూపాయలు.

సాయంత్రం 4 గం॥లకు గుంటూరు – హుబ్లీ పాసింజరు వచ్చి ఆగింది. డోన్‌ స్టేషను పేరు ద్రోణాచలం. అక్కడ దాదాపు పది నిమిషాలు ఆగుతుంది బండి. బస్తాలు లోడ్‌ చేయించుకొని, రైలెక్కాలి. లాంగ్‌ డిస్టెన్స్‌ ట్రెయిన్‌ చాలా రద్దీగా ఉంటుంది. ఎలాగో ఎక్కి గుంటకల్‌లో దిగేవారెవరో విచారించుకొని అక్కడ సర్దుకున్నాడు. పైన చెక్కబల్లమీద పడుకోవచ్చు రాత్రి.

డోన్‌ నుండి హుబ్లీకి పధ్నాలుగు రూపాయలు ఛార్జీ. స్లీపర్‌ క్లాస్‌ కూడ ఉంటుంది. స్లీపర్‌ ఛార్జి రెండు రూపాయలే, కాని పతంజలి జనరల్‌లోనే ప్రయాణం చేస్తాడు. అది దుబారా ఖర్చు అని.

గుంతకల్‌లో రైలు దాదాపు అరగంటపైనే ఆగుతుంది. చెక్కబల్లమీద బెడ్‌షీట్‌ పరచుకొని, చేతి సంచీ కూడ పైనే పెట్టుకొని, ప్లాటుఫారం మీద బెంచీమీద కూర్చొని అమ్మ కట్టిచ్చిన ‘తపేలాంటు తిని, నీళ్లు తాగాడు.

రాత్రంతా ప్రయాణించి తెల్లవారు ఝామున 5 గంటలకు హుబ్లీ చేరుకుంది రైలు. రైలు దిగి బయటకు వచ్చాడు పతంజలి. రైల్లోనే మొహం కడుకున్నాడు. స్టేషన్‌ బయట ‘సవితా’ హోటల్లో కాఫీ తాగాడు.

కర్నాటక రాష్ట్రంలోని పెద్ద నగరాల్లో హుబ్లీ ఒకటి. మన హైదరాబాదు సికింద్రాబాద్‌లాగా, హుబ్లీ – ధార్వాడ జంట నగరాలు. రెండూ కలిసి కార్పొరేషన్‌గా ఉంటాయి.

స్టేషన్‌ నుండి నిమ్మకాయల ‘మండి’ రెండు కిలోమీటర్లుంటుంది. నడుచుకుంటూ వెళ్లాడు. కొత్తచోటనే బెరుకు గాని, కంగారు కానీ ఏమీ లేవు పతంజలిలో.

మండీ చెరుకుని కమీషన్‌ ఏజంట్‌ ‘యం.యం. హషీం’ అన్న బోర్డు చూసి ఇదే అని నిర్ధారించుకున్నాడు. క్రింద ఆఫీసు, పై అంతస్తులో పెద్ద హాలు, క్రింద జంపఖానాలు పరచి ఉన్నాయి. కవర్లు లేని తలదిండ్లు వరసగా ఉన్నాయి. అప్పటికే కొందరు రైతులు పడుకొని ఉన్నారు. తానూ కాసేపు పడుకున్నాడు. హాలునానుకొనే నాలుగు బాత్‌రూములు, నాలుగు లెట్రిన్‌లు ఉన్నాయి. ముఖాలు కడుక్కోడానికి వాష్‌ బేసిన్లు బిగించి ఉన్నాయి.

నిమ్మకాయల హోల్‌సేల్‌ వ్యాపారానికి హుబ్లీ ప్రసిద్ధి. ఆంధ్రప్రదేశ్‌లోని తాడిపత్రి, రాయల చెరువు, రాజంపేట, కోడూరు, నంద్యాల, చాగలమర్రి ప్రాంతాల్లో నిమ్మతోటలు విరివిగా పెంచుతారు. రైతులందరు రైళ్లల్లో బుక్‌ చేసుకుని బస్తాలతో హుబ్లీ మార్కెట్‌కు తీసుకువస్తారు. రోజూ కొన్ని వేల బస్తాలు వివిధ మండీలకు వస్తాయి. వాటిని వ్యాపారులకు వేలం పాట ద్వారా అమ్మి, అప్పటికప్పుడు డబ్బులు చెల్లిస్తాడు ఏజంటు. పదిశాతం కమీషన్‌ తీసుకుంటాడు. కొందరు రైతులకు పెట్టుబడి కోసం వడ్లీ లేని ఋణాలు కూడా యిస్తారు ఏజంట్లు. వాళ్లందరూ ముస్లింలే. హషీం, దావల్‌ సాహెబ్‌, గౌస్‌, ఇనాయతుల్లా మొదలైన వారి మండీలు హుబ్లీలో ప్రసిద్ధిచెందాయి. చిన్న చిన్న మండీలు కూడ చాలా ఉన్నాయి. నిమ్మకాయలతో బాటు, యాపిల్స్‌, ద్రాక్ష, బత్తాయిలకు కూడ హోల్‌సేల్‌ మార్కెట్టు హుబ్లీ.

8 గంటలకు ఏజంటు మనిషి వచ్చి, రైల్వే రశీదులు (R.R.) కలెక్ట్‌ చేసుకుని వెళ్లాడు. స్టేషన్‌ నుండి వాళ్ళ మినీ లారీలో మండీకి తెస్తారు. ట్రాన్స్ పోర్టు ఖర్చులు కూడా రైతులపై వేయరు. లాడ్జింగ్‌ ఖర్చుల బెడదలేదు. రైతులకు వసతి సౌకర్యాలు మండీవారే కల్పిస్తారు. పైన హాల్లో ఫాన్లు, కుండలతో మంచినీళ్లు కూడ పెడతారు. చాయ్‌లు కూడ ఫ్రీ.

నిమ్మకాయల రేటు ‘డిమాండ్‌ – సప్లై’ సిద్ధాంతం మీద అధారపడి ఉంటుంది. ఫిబ్రవరి నుండి – జూన్‌ వరకు మంచి డిమాండ్‌ ఉంటుంది. పంట కూడ తక్కువ. మిగతా మాసాల్లో దిగుబడి ఎక్కువ. ధర పడిపోతుంది.

9 గంటలకు స్నానం చేసి, బట్టలు మార్చుకున్నాడు పతంజలి.

“ఏ వూరు చిన్నా” అనడిగాడు ఒకాయన.

“వెల్దుర్తి. డోన్‌ దగ్గర” అని బదులిచ్చాడు.

“తెల్చులే. టేసను కూడ వుండ్లా. పా, టిపన్‌ చేసొచ్చాం” అని వెంట తీసుకొని వెళ్లాడు. అతని పేరు వెంకటనాయుడు. కోడూరు. కడపజిల్లా. పండ్ల మొక్కలు అంటుకట్టి సరఫరా చేసే ప్రభుత్వ, ప్రయివేటు నర్సరీలకు కోడూరు ప్రసిద్ధి. వెంకటనాయుడికి నిమ్మ నర్సరీ కూడ వుందట. సొంతం వెయ్యి చెట్లున్నాయట. అవిగాక ‘గుత్త’కు (కౌలు)కు కొన్ని తోటలు తీసుకుంటాడట.

పతంజలి బ్రాహ్మడు అని తెలుసుకుని “సామీ” అని పిలవడం ప్రారంభించాడు. దగ్గరలో ఉన్న ‘మిత్ర సమాజ్‌” అనే హోటలుకు వెళ్లారు. పరిశుభ్రంగా ఉంది. ‘లింగాయత ఖానావలి’ అని బోర్డులతో చాలా హోటళ్లు ఉన్నాయి.

“ఇదే మొదటిసారిగదా రావడం” అన్నాడు నాయుడు.

“పొట్టెగానివైనా బలెవచ్చినావే. మరి సదువు?”

టెన్త్‌తో ఆపేసి, తండ్రికి సహాయంగా ఉంటున్నానని చెప్పాడు పతంజలి.

“చ్చొచ్చొచ్చొ” అని ధ్వని చేశాడు. “అందేందియో, మీ బాపనోల్లు సదువు మానుకొని వ్యవసాయం చేయడం యాడైనా ఉండాదా. మీ నాయన బలె తిక్కలోనిల్యా ఉండాడే” అన్నాడు.

తండ్రిని అలా అన్నందుకు పతంజలికి చివుక్కుమంది మనసు. కాని నాయుడి బోళాతనం, మనసులో ఏదీ దాచుకోకపోవడం నచ్చినాయి.

రెండు ‘సిర’ అని ఆర్డరిచ్చినాడు నాయుడు. “కన్నడోల్లు పొద్దున్నే స్వీటు తింటారు సామీ! బాగుంటాది. మనం ‘అల్వా’ అంటాం సూడు అదే” అన్నాడు.

‘సిర’ చాలా బాగుంది. రెండు మూడు స్పూన్లే యిచ్చాడు. తర్వాత ఇడ్లీ వడ సాంబారు తెప్పించాడు నాయుడు. పతంజలికి కడుపు నిండినట్లయింది. ‘ఇకచాలు’ అంటే “వైసు పొట్టెగాడివి ఆ తిండేందయో. పూరీ గాని దోసె గాని తినాల. లేకపోతే నేను గమ్మునుండను” అని దోసె తెప్పించాడు. కాఫీ తాగారు. బిల్ల పతంజలిది కూడ నాయుడే యిచ్చినాడు. ఆ పిల్లవాడు మొహమాట పడితే,

“బాపనోల్లకు ఎంత పెట్టినా తప్పులేదులే సామి. నీవు గమ్మునుండు” అని వారించాడు. “మధ్యాహ్నం నేను మిలిట్రీ ఓటలుకు బోతాగాని, నీవు ఈడికే వచ్చి తిను” అని సలహా యిచ్చాడు.

11 గంటలకల్లా స్టేషన్‌ నుండి సరుకు వచ్చింది. ఆఫీసు వెనుక పెద్ద గోడవును లాంటిది ఉంది. రైతుల వారీగా బస్తాలు పేర్చి వుంచారు. తమ బస్తాలు కరెక్టుగా వచ్చినాయని తృప్తి చెందాడు పతంజలి.

11:30 నిమిషాలకు హషీం సాహెబ్‌ వచ్చాడు. ఇంచుమించు పింక్‌ కలర్‌లో ఉన్నాడు. లావుగా, ఎత్తుగా, క్లీన్‌గా షేవ్‌ చేసుకున్నాడు. వెళ్లి నమస్కారం పెట్టాడు.

“కాంసే ఆయే?” అని అడిగాడాయన.

పతంజలి చెప్పాడు. మండీ ఉద్యోగులంతా హిందీలో మాట్లాడుతున్నారు. కొంచెం కొంచెం అర్థమవుతూంది గాని, బదులు చెప్పడం రావటం లేదు. టెంత్‌ క్లాసులో నేర్చుకున్న హిందీ ఎందుకూ పనికిరాలేదు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here