సాఫల్యం-30

2
9

[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[తల్లిదండ్రులిద్దరూ వాగ్దేవక్క డెలివరీకి వెడితే, ఇంట్లో తమ్ముళ్లకి వండి పెడతాడు పతంజలి. అక్కకి మగపిల్లాడు పుట్టాడని ఉత్తరం వస్తుంది. పతంజలి వివిధ పోటీ పరీక్షలకి దరఖాస్తులు పంపుతాడు. నూతన శిశువుకి నాగేశ్వర్ అని పేరు పెడతారు. రామ్మూర్తి బావకి హైదరాబాదు బదిలీ అవుతుంది. సికింద్రాబాదులోని  మహంకాళీ ఆలయం సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుంటారు. గుత్తేదారు ఓబులప్ప చేసిన ప్రయోగం వల్ల పతంజలి వాళ్ళ నిమ్మతోట పాడవుతుంది. తనకే నష్టం వచ్చింది కాబట్టి, తాను బాగు చేయించలేనంటాడతను. పెద్దమనిషిగా నిలిచిన రామకృష్ణారెడ్డి ఇకపై తోటకూ, ఓబులప్పకి ఏం సంబంధం లేదని తీర్పు చెప్తాడు. తోటని మళ్ళీ బాగు చేయించుకుందామని నిర్ణయించుకుంటారు. చేపల ఎరువు లోడ్ కోసం హైదరాబాద్ వస్తాడు పతంజలి. బండి బాడుగ రేటు చెబుతాడు వ్యాపారి. – ఇక చదవండి.]

[dropcap]“మ[/dropcap]రి ఎరువుకు?”

“ఎంతో కొంత యివ్వండి. పదమూడు టన్నులు కదా! మూడు వేలు ఇవ్వండి”

పతంజలి గుండె గుభేలుమంది. అంటే దాదాపు ఐదువేల వరకు అవుతుంది చెట్ల క్రిందకి ఎరువు చేరడానికి.

రామ్మూర్తి బావ అన్నాడతనితో. “ఇది విలువయినదేమీ కాదు కద! అంత చెపుతున్నారు. కొంత తగ్గించుకోండి”

“విలువైంది కాకపోతే ఇంత దూరం రారు కదా సార్‌!” అన్నాడు ఫజలుద్దీన్‌. “లారీ కూడా నేనే మాట్లాడి, లోడింగ్‌ చేయిస్తాను. నాకెంతిస్తారో మీ దయ” అన్నాడు.

“సరే రెండువేలిస్తాము లోడ్‌ చేయించండి” అన్నాడు బావ.

“ఇంకో రెండు వందలు వేసివ్వండి. నా బక్ష్సీస్‌ కూడ దాంట్లో సర్దుకుంటాను”

బావ పతంజలి వైపు చూసి ‘సరే’ అన్నాడు.

“ఒక ఐదువందలిచ్చిపోండి. రేపు పొద్దున ఏడెనిమిది గంటలకల్లా కూలీలు వస్తారు. పదిలోపే లోడింగ్‌ అయిపోతుంది. మీకు చెక్‌ పోస్టుల దగ్గర ప్రాబ్లం లేకుండా ఏదో ఒక షాపు నుండి బిల్లు రాయించి యిప్పిస్తాను. దానికి వన్‌ పర్సెంట్‌ తీసుకుంటారు. మీరు రేపుదయం ఏడున్నరకల్లా వచ్చేయండి. దగ్గరుండి ఎదరుగా పనికి రానివి కనబడితే ప్రక్కన పడేయొచ్చు” అన్నాడు.

పతంజలి జేబులోంచి ఐదువందలు తీసి అతనికిచ్చాడు. ఇద్దరూ బండిమీద ఇంటికి బయలుదేరారు.

“బావమరిది డల్‌ అయిపోయాడే. ఏం కాదులే! చెట్లు మళ్లీ బాగా తిరుక్కుంటాయి. ఇదంతా నీ జీవితంలో ఒక ట్రాన్సిషనల్‌ పీరియడ్‌ అనిపిస్తూంది. యాక్సెప్ట్‌ లైఫ్‌ యాజ్‌ ఇట్‌ ఈజ్‌ మై డియర్‌ బ్రదరిన్లా!” అంటూ పతంజలిని ఉత్సాహపరిచాడు బావ.

దారిలో మదీనా హోటలు దగ్గర స్కూటరు ఆపి, సమోసా తిని టీ తాగారు. మదీనా టీ చాలా బాగుంది. ఆరుగంటలకు యిల్లు చేరుకున్నారు.

సాయంత్రం అందరూ మహంకాళి గుడికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. గుడి ఎదురుగ్గా కొంచెం ప్రక్కనే మార్వాడీలది లక్ష్మీనరసింహ స్వామి గుడి ఉందని చెప్పాడు బావ. ఎందుకో పతంజలికి ఎక్కడలేని ధైర్యం వచ్చింది. స్వామికి మూడు మూరల కనకాంబరం పూలమాల, పావుకిలో ద్రాక్షపళ్లు కొన్నాడు.

గుడి చాలా పురాతనంగా ఉంది. స్వామికి అర్చన చేసి హారతి ఇచ్చాడు. పూజారి కనకాంబరం మాల వేసుకొని స్వామి మెరిపోతున్నాడు. నిమ్మతోటను బాగుచేసి మా కుటుంబాన్ని కాపాడు తండ్రీ అని అని నరసింహస్వామిని వేడుకొన్నాడు. మళ్లీ దుఃఖం వచ్చింది. సాతాళించిన శనగలు ప్రసాదం పెట్టారు.

వచ్చేస్తుంటే గుడిగోడకు చిత్రించిన స్వామి తైలవర్ణ చిత్రం కనిపించింది. హిరణ్యకశిపుడిని తొడలమీద వేసుకుని గోళ్లతో హృదయాన్ని చీలుస్తున్న దృశ్యం. స్వామి మహా క్రోధంగా ఉన్నాడు. గుండె జల్లుమంది పతంజలికి. బొమ్మలో పాదాలకు తల తాకించి నమస్కరించాడు.

రాత్రి అందరికీ పొంగణాలు వేసి పెట్టింది వాగ్దేవి. శశిగాడు కూడ కారం అనకుండా తిన్నాడు. హాల్లో పతంజలికి చాప, దాని మీద బొంద వేశారు. కలత నిద్రపట్టింది.

ఉదయాన ఆరుగంటలకల్లా తయారయ్యాడు పతంజలి. బావ కూడా వస్తానన్నాడు. “ఆదివారం నాకు సెలవే కదా” అని స్కూటరు తెచ్చాడు. ఎనిమిదికి ఫజలుద్దీన్‌ కూలీలతో వచ్చాడు. ఎరువు గంపకు తోడి ఇద్దరు ఇస్తుంటే ఇద్దరు లారీలో వేస్తున్నారు. బావ బావమరిది అక్కడే నిలబడి చివికిపోయిన గోనెసంచులు, మరీ కుళ్లినట్లున్న భాగాలు పక్కకు తీసేయిస్తున్నారు. ఎరువు గంపల్లోకి లాగేందుకు ఇనుప ఫోర్కు ఒకటి తెచ్చుకున్నారు. మొత్తానికి ఎరువు పొడిపొడిగానే దొరికింది. ఎవరో ఒకతను వచ్చి రొయ్యల పొట్టు పది బస్తాలుంది ఎంతోకొంత ఇవ్వండి లోడ్‌ మీద వేయిస్తాన్నాడు. అతనికి యాభై రూపాయలిప్పించాడు ఫజలుద్దీన్‌.

పదిన్నరకు లోడింగ్‌ పూర్తయింది. బాడీ పైనవరకు వెదురు తడకలు కట్టి వేసినందువలన చాలా ఎత్తుగా చిన్న కొండలాగా కనబడుతూంది లోడు. పతంజలి ఒకేసారి బ్యాగు తెచ్చేసుకున్నాడు. ఇద్దరూ స్కూటర్‌ మీద మెయిన్‌ రోడ్డుకుపోయి ఒక హోటల్లో టిఫిన్‌ చేశారు. వాళ్ల వద్ద పూరీ తప్ప ఏమీ లేదు. అదే తిన్నారు. మైదా ఎక్కువ కలిపాడేమో ఎలాస్టిక్‌ లాసాగుతూన్నాయి.

బావకు వీడ్కోలు చెప్పి క్యాబిన్‌లోకి ఎక్కాడు పతంజలి. మధ్యలో చెక్‌పోస్టుల వద్ద ఎవరూ ఏమీ అనలేదు. కొత్తకోటలో భోజనం చేశారు. క్లీనరెవరూ రాలేదు. డ్రయివర్‌ది కరీంనగరట. ఐదు గంటలకల్లా లారీ తోటలోకి ప్రవేశించింది. గడ్డివాము దగ్గరే తోకోడు, సుంకన్న, పతంజలి కలిసి, సలికెలతో ఎరువంతా క్రిందికి లాగేశారు. తకడలు విప్పంగానే సగభాగం క్రిందికి దొర్లిపోయింది. డ్రైవరుకు బాడుగ యిచ్చి పంపేశాడు. ఇంటికి వెళ్లి వేడినీళ్ల స్నానం చేసి పడుకున్నాడు. రేపే పదిమంది కూలీలను తీసుకు రమ్మని చెప్పాడు.

మూడు రోజులపాటు సాగింది పని. హైదరాబాదులో లోడ్‌ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా పనికిరాని చెత్తంతా పక్కకు తీయించినా దాదాపు అరటన్ను చెత్త ఇంకా తేలింది. ఎరువంతా పాదుల్లోకి మోసి పాదులు చదును చేసి పూర్వ స్థితికి తెచ్చేసరికి ఒక విధమయిన రిలీఫ్‌ కలిగింది పతంజలికి. వెంటనే ఒక తడి నీరుపెట్టారు.

పెసలు మినుములు తీగలుసాగి పిందెలు వేశాయి. కనీసం ఇంటి ఖర్చులకన్నా పెసరపప్పు, మినపప్పు సమకూరితే, లాభం సంగతి తరువాత చూసుకోవచ్చుననుకున్నాడు.

కొన్ని రోజులకు యూనివర్సిటీ నుండి రిజిస్టరు కవరు వచ్చింది. దాంట్లో ఒరిజినల్‌ సర్టిఫికెట్లు పంపించారు. మార్కుల జాబితా, ప్రొవిజనల్‌ డిగ్రీ సర్టిఫికెట్‌ వచ్చాయి. విశేషమేమంటే ‘ర్యాంకు’, ‘సర్టిఫికెట్‌’ కూడ పంపారు. ఒరిజినల్‌ డిగ్రీ కోసం తర్వాత దరఖాస్తు చేసుకోవాలనీ, ఎక్స్‌టర్నల్‌ వారికి కాన్వొకేషన్‌ ఉండదు కాబట్టి, నిర్ణీత ఫీజు చెల్లించి ఆరు నెలల తర్వాత పొందవచ్చుననీ కవరింగ్‌ లెటరులో ఉంది.

మార్కులు బ్రహ్మాండంగా వచ్చాయి పతంజలికి. ఇంగ్లీషులో 78%, సంస్కృతంలో 83%, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో 87% ఎకనామిక్స్‌లో 82% ఇంగ్లీషు లిటరేచర్‌లో 89% వచ్చాయి. శంకరయ్యసారుకూ, రాధాసారుకూ సర్టిఫికెట్లు చూపించి వచ్చాడు. ఆజంసారుకు మార్కుల వివరాలు తెలుపుతూ జాబు రాశాడు.

స్టేట్‌ బ్యాంక్‌ వారి ప్రకటన వచ్చింది. క్లర్క్ కమ్‌ క్యాషియర్‌ పోస్టులు దాదాపు పన్నెండు వందల పోస్టులు ఖాళీ ఉన్నాయని. అప్లై చేశాడు తర్వాత యు.పి.యస్‌.సి. వారి స్టాఫ్‌ సెలెక్షన్‌ కమీషన్‌, రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు వారి ప్రకటనలు వచ్చాయి. స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ వారి ‘ఎక్జిక్యూటివ్‌ ట్రెయినీస్‌’ పోస్టులకు కూడా వచ్చింది. వ్రాత పరీక్ష కేంద్రం బొంబాయిలోనే ఉంది.

ఇంకా కొన్ని కాంపిటిటివ్‌ పుస్తకాలు తెచ్చుకొని దీక్షగా చదవసాగాడు పతంజలి. ట్యూషన్లు ముగిశాయి. ఆ ఫీజులతోనే ఇల్లు గడుస్తూంది. సెలవుల్లో యథాప్రకారం స్పోకెన్‌ యింగ్లీష్‌, గ్రామర్‌ స్పెషల్‌ క్లాసులు ప్రారంభించాడు.

చేపల ఎరువువేసి దాదాపు రెండు నెలలు కావస్తుంది. చెట్లలో ఏ మార్పు కనబడడంలేదు. పైపెచ్చు మరింత క్షీణిస్తున్నాయి. రెండుసార్లు మందు పిచికారీ చేయించారు. పూత కూడ బాగా తక్కువగా ఉంది, నిమ్మపిందెలు ఏలకుల సైజులోనే విపరీతంగా రాలిపోతున్నాయి.

తోకోని భార్య గర్భవతైంది. వారి జీవితాల్లో కొత్తూరు సుబ్బారాయుడు వెలుగు నింపినట్లే.

సమ్మర్‌ క్లాసుల్లో పిల్లలు బాగా చేరారు. నాలుగు బ్యాచ్‌లు చేశాడు. ఆ సంవత్సరం ఎండలు బీభత్సంగా ఉన్నాయి. భూ గర్భజలాలు లోపలికి వెళ్లాయి. కష్టంమీద నిమ్మచెట్లకు తడిపారిస్తున్నారు. రోజూ గంట సేపటి కంటే మోటరుకు నీరందటం లేదు.

స్టేట్‌ బ్యాంక్‌, యుపియస్‌సి పరీక్షలు వ్రాశాడు పతంజలి. ‘సెయిల్‌’ వారి పరీక్షకు ఇంకా చాలా టైముంది. ఈలోగా రాయలసీమ గ్రామీణ బ్యాంకు వారి నోటిఫికేషన్‌ వచ్చింది. సిండికేట్‌ బ్యాంక్‌ వారి సబ్సిడియరీ సంస్థ అది. కేవలం కర్నూలు కడప జిల్లాలో మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో దాని బ్రాంచీలుంటాయి. హెడ్‌ ఆఫీసు కడప. క్లర్కు పాస్టులు, ఆఫీసరు పోస్టులు ఖాళీలున్నాయి. ఎ.జి. బియ్యస్సీ చేసినవారు డైరెక్ట్‌గా బ్రాంచి మేనేజరు పోస్టుకు అర్హులు. దానికే అప్లయ్‌ చేశాడు.

ఆ సంవత్సరం పూర్తి వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. నీరు చాలక మినుము, పెసర పంట అరకొరగా పండింది. పశువుల మేతకు కూడ కటకటగా ఉంది. కూలీలు యిచ్చుకోలేక సుంకన్నను మాన్పించారు. తోకోడొక్కడే తోట చూసుకుంటున్నాడు.

మరో రెండు నెలల్లో వీళ్లు భయపడినంతా అయింది. కుటుంబానికి ఆధారంగా ఉండిన నిమ్మతోటంతా క్రమక్రమంగా ఎండిపోసాగింది. దానిమీద ఏ ఖర్చు పెట్టినా వ్యర్థమే అని సలికెల పనికూడ చేయించడం మానుకున్నారు.

ఒకరోజు తండ్రీ కొడుకులిద్దరూ చెట్లన్నీ తిరిగి చూశారు. తోకోడు కూడ వెంటనే ఉన్నాడు. దిగులుతో ముగ్గురి మనస్సులూ బరువెక్కాయి. మౌనంగా తోటంతా తిరిగారు. చివరికి మార్కండేయశర్మ అన్నాడు. “రేపట్నుంచి చెట్లన్నీ కొట్టించేద్దాము. నెలరోజుల్లో వేర్లతో సహా మొండాలు పెకలించి వేయిస్తే, వెలిపొలం చేసుకోవచ్చు. బావిలో ఊటను బట్టి మెట్ట పంటలు వేసుకుందాము” అంటూనే క్రింద కూలబడి పోయాడాయన.

పతంజలికి దుఃఖం ఆగలేదు. తోకోడయితే వెక్కి వెక్కి ఏడ్చాడు. మార్కండేయశర్మ తేరుకుని ఇద్దరినీ ఓదార్చాడు. “చెట్లతో మనకు ఋణం తీరిపోయింది. బాధపడకండి!”

గొడ్డండ్లు, ఎరుకల కొడవళ్లు కమ్మరి దగ్గర సరిపించుకుని (sharpen) కూలీలు వారంరోజుల్లో చెట్లన్నిటినీ నరికివేశారు. కొంచెం పెద్ద కొమ్మలను వేరుచేసి, వంట కట్టెల కోసం వామి దగ్గర పేర్చారు. మిగతా కొమ్మలన్నీ పొలం మధ్యలో వేసి కాల్చేశారు.

పదిరోజుల తర్వాత వేర్లతో సహా పెకలించి వేసి ఇనుప నాగలితో దుక్కి దున్నించారు. దాన్ని లాగడానికి రెండు కాండ్ల ఎద్దులు అవసరమయ్యాయి.

రెండు ఎద్దులనూ తోకోనికే తక్కువ ధరకు ఇచ్చేశారు. బండితో సహా. తోటపని లేదు కాబట్టి బాడుగలకు సేద్యానికి, ఎరువు, చెరువు మట్టి తోలడానికి పోతానని చెప్పాడు వాడు. వామిలో మిగిలిపోయిన మేత కూడ వాడికే ఇచ్చేశారు.

ఇక గణపతి మిగిలాడు. వాడినేం చేయాలి? సేద్యం చేసే స్థోమత లేదు. దానికి జత కొనాలంటేనే ఇప్పుడు మూడు వేలకు పైమాటే. ఆ మధ్య ముక్కుతాడు కూడ వేయించారు. విధిలేని పరిస్థితుల్లో గణపతిని గోరంట్ల మాధవస్వామి తిరునాళ్లలో అమ్మేసుకొని రావాలని నిర్ణయించుకున్నారు.

కర్నూలు జిల్లాలోనే కాదు, రాయలసీమ జిల్లాలు, కర్నాటకలోని రాయచూరు, తెలంగాణాలోని మహబూబ్‌నగర్‌ జిల్లా నుండి కూడ మేలు జాతి ఎద్దులు, కోడెలు కొనడానికి రైతులు వస్తారు గోరంట్లకు. వెల్దుర్తి నుండి కోడుమూరు వెళ్లేదారిలో కొంత ప్రక్కగా ఉంటుందా ఊరు. హంద్రీ నది ఒడ్డునే ఉంటుంది. మాధవస్వామి గుడి గోపురం చాలా ఎత్తుగా ఉంటుంది. వర్షాకాలం ఇంకా పుంజుకోకముందే హంద్రీనది యిసుక తిన్నెల్లో సంత జరుగుతుంది.

ఎద్దులు, కోడెలె గాకుండా, నాగళ్లు, గంటకలు, గొర్రలు, కొడవండ్లు, సలికెలు, పికాశులు, గడ్డపారలు, రకరకాల మందాల్లో, సైజుల్లో తాళ్లు పెద్ద ఎత్తున అమ్ముతారు సంతలో. ఇసుకలో చెలిమలు తవ్వుకుని, మనుషులకూ, పశువులకూ నీళ్లు సమకూర్చుకుంటారు. సంత దాదాపు వారం పది రోజులు జరుగుతుంది.

ఒక రోజు గణపతికి వేడినీళ్లతో స్నానం చేయించి, నూగారంతా రాలిపోయేలాగా టెంకాయ పీచుతో రుద్ది, మెడకు కాళ్లకు నల్లని కంబడి తాడు కట్టి, ముకుదాడుకొక వైపు చిరుగజ్జెలు కట్టి, కొమ్ములకు ఆముదం రాసి నిగనిగలాడేట్లు చేసి, గోరంట్ల సంతకు బయలుదేరాడు పతంజలి తోకోడిని తీసుకొని. తనను అమ్మబోతున్నారని తెలియని పిచ్చి గణపతి మహదానందంగా పతంజలి పట్టుకున్న తాడు వెంట నడుస్తున్నాడు.

దాదాపు పది కిలోమీటర్లకు పైనే వుంటుంది. గోరంట్ల. తారు రోడ్డు మీద నడిపిస్తే మెత్తకాళ్లు పడతాయి గణపతికి. పైగా దాని గిట్టల కింద నాడాలు కొట్టించలేదు. అందుకని మామూలు బండ్ల బాటలో తీసుకొని వెళ్లసాగారు. అన్నాలు తిని రాత్రి పదిగంటలకు నడక మొదలుపెట్టారు. త్రయోదశి రోజేమో వెన్నెల చక్కగా కాస్తూంది. ఆ వెన్నెల్లో గణపతి మెరిసిపోతూన్నాడు.

మధ్యలో లద్దగిరి పొలిమేరల్లో ఒక గంట విశ్రాంతి తీసుకున్నారు. మళ్లీ నడక కొనసాగించి తెల్లవారు ఝామున నాలుగ్గంటలకు సంతలోకి ప్రవేశించారు. సంతంతా గుంజలు పాతి ఉన్నాయి. చోటు వెతుక్కుని, గణపతిని ఒక గుంజకు కట్టేశారు. అంతమంది జనాన్ని పశువులను చూచి గణపతి బెదురుతున్నాడు.

ప్రక్కనే ఒక చెలిమె తవ్వుకున్నారు. మూడడుగుల్లోనే మంచినీళ్లు వచ్చాయి. గణపతికి తాగించారు. అక్కడ పశువులకు మేత, వేరుశనగ చెక్క, బక్కెట్లు చెక్క నానబెట్టుకునే ముంతలు అన్నీ దొరుకుతాయి. టిఫిన్లు, భోజనాలు కూడ పాకల్లో అమ్ముతారు.

ఒక ముంత, ఒక ప్లాస్టిక్‌ బక్కెటు కొనుక్కున్నారు. వేరుశనగపిండి ముంతలో నానేశారు. ఒక జల్ల (పెద్ద గంప) నిండా చొప్ప, బుడ్డలకట్టె, వరిగడ్డి కొనుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు మొఖాలు కడుక్కొని ఉగ్గాని బజ్జీ తిని, టీ తాగి వచ్చారు.

పదిగంటలకు బాగా ఎండెక్కింది. గణపతి ఎండకు తాళలేక అస్థిమితంగా తొక్కులాడసాగింది. రైతులు మారు బేరగాండ్లు వచ్చి గణపతిని పండ్లు, సుళ్లు పరీక్షించి చూస్తున్నారు.

రాయచూరు వైపు నుంచి జిర్రలు (పొడవైన కొమ్ములుగల ఎద్దులు) ఒంగోలు గిత్తలు, రేనాటి కోడెలు, ఆ పశుసంపదను చూడటానికి రెండు కళ్లు చాలడం లేదు.

చెక్క నానిం తర్వాత బక్కెట్లోని నీళ్లతో కలిపి తాగించారు గణపతికి. మేత సరిగ్గా తినడం లేదు. ఆఖరుకు చెరుకు గడలమ్మేవాళ్ల దగ్గర గడల చివరిభాగాలు తెచ్చి వేసినా ముట్టలేదు. ఆ రోజు గడచింది. మధ్నాహ్నం తోకోడికి డబ్బిచ్చి మిలటరీ హోటలకు పొమ్మన్నాడు. తాను మాత్రం పెరుగు వడలు నాలుగు తిన్నాడు. సాయంత్రం కల్లు, సారాయి దుకాణాల దగ్గర రద్దీ ఎక్కువైంది.

పతంజలి కిష్టమయిన మిరపకాయ బజ్జీలు ఒకచోట వేస్తున్నాడు. వాడి దగ్గర స్పెషల్‌ వంకాయ బోండాలు, చిన్న చిన్న వంకాయలను మగ్గించి వాటి కడుపులో ఉల్లికారం కూరి, శనగపిండిలో ముంచి బోండాలు వేస్తున్నాడు. రెండు బోండాలు, నాలుగు మిర్చి బజ్జీలు తిన్నాడు. బోండాల రుచి అద్భుతం. ఎండాకాలం మిరపకాయలు, తోటలు ఉడిగిపోయిన స్థితిలో గిడసబారి ఉన్నాయేమో బజ్జీలు ఒకటిన్నర అంగుళం కంటే పొడవు లేవు. “శేరు (200గ్రా) చొప్పున తూకానికి అమ్ముతున్నారు. శేరుకు ఎనిమిది బజ్జీలు తూగాయి. నాలుగు తాను తిని, నాలుగు తోకోనికి కట్టించాడు. రెండు బోండాలు కూడ. రాత్రికి తనకేమీ అవసరం లేదనుకున్నాడు.

రెండోరోజుకు గణపతికి ఆ పరిసరాలు గందరగోళం అలవాటయ్యాయి. తోకోడో, పతంజలో ఎవరో ఒకరు కనబడుతుండాలి దానికి లేకపోతే టెన్షన్‌ పడుతుంది. రెండో రోజు మేత బాగానే తిన్నది. ఆ రోజు కూడ బేరం కుదరలేదు. రాత్రిళ్లు ఇసుకలోనే పడుకుంటున్నారు.

మూడవరోజు ఉదయం తొమ్మిదిగంటలకీ ఒక పెద్దాయన ఆయన కొడుకు వచ్చారు. పెద్దాయనకు అరవై దాటుంటాయి. సైను గుడ్డతో కుట్టిన చేతుల బనియన్‌, ముతక ధోవతి ధరించాడు. చెవులకు బంగారు పోగులు. జుట్టు వెనక ముడివేసుకున్నాడు. నుదుట తిరునామం దిద్దుకున్నాడు. కొడుక్కు నలభై సంవత్సరాలుండొచ్చు. తెల్లని నల్లంచు పంచెను లుంగీలాగా కట్టుకొని, సిల్కు అంగీ ధరించాడతను. నల్లని ఒత్తైన క్రాపు నూనె రాసినందుకు మెరుస్తూంది. మీసాలు ఒత్తుగా ఉన్నాయి. చేతికి వాచీ ఉంది.

ఇద్దరూ గణపతి దగ్గరకు వచ్చారు. పతంజలిని చూసి, “మీదేనాప్పా కోడె?” అన్నాడు. అవునన్నట్లు తల ఊపాడు పతంజలి. కొడుకును చూసి, “మన గంగరాజుకు మాంచి జతైతాది ల్యా” అన్నాడు.

తోకోడు గణపతి నోరు రెండు చేతులా విడదీసి పండ్లు చూపించాడు. సుళ్లు చూశారు.

“పొడుచ్చాదా?

“సన్నపిల్లోండ్లు కాల్ల కింద దూరిపోయినా ఏమనదు” అన్నాడు తోకోడు.

“వగిసు?”

“దసరాకు మూడేండ్లు నిండుతాయి.”

భూమి మీద నుండి మూరలతో గణపతి ఎత్తు కొలిచారు. మీద చెయ్యి వేస్తే చెంగున ఎగురుతూంది.

“శానా సురుకునుండాది నాయినా” అన్నాడు కొడుకు

“దర ఎంత సెప్తిరి?” అన్నాడు తండ్రి.

“నాలుగువేలు జెప్తున్నాము. మీకు గిట్టే దర మీరు చెప్పండి” అన్నాడు తోకోడు.

“పసరం (పశువు) అంతిలువ జేచ్చాది. కాని సేజ్జాలు రాను రాను గిట్టుబాటు గావడం ల్యా. ఎగుసాయం దప్ప రానోల్లం. మాకాడ ఇట్లాంటిదే గంగరాజుంది పశది (తెల్లది) మీది బట్టది (గోధుమ, తెలుపు పొడల మిశ్రమం) గాబట్టి జత బాగుంటాది. కోడె మాకు నచ్చినాది. ఇచ్చేమాట చెప్పండి ఫయిసలు (సెటిల్‌) జేసుకుందాము.”

తోకోడు పతంజలిని పక్కకు తీసుకుపోయి అన్నాడు. “సామీ! ఎంత చెబుదాం?”

“ఒక మూడొందలు తగ్గిస్తామని చెప్పు”

తోకోడు వెళ్లి “మూడొందలు తగ్గిస్తామంటుండాడు మా సామి” అన్నాడు.

తండ్రీ కొడుకులిద్దరూ ప్రక్కకు వెళ్లి మాట్లాడుకున్నారు. వాళ్లకు తెలిసిన ఒక రైతుకు గణపతిని తెచ్చి చూపించారు.

“ప్రచత్తమైన పసరం. కల్లుమూస్కోని దీస్కోండి” అన్నాడాయన.

“సామీ! మీరు బ్రామ్మర్లని అర్థమైనాది. మీ దుడ్డు మేం దినకూడదు. పాపమొచ్చాది. నీవే కరాకండిగా ఆకిరి మాట జెప్పు. మేం కాదంటే నీ ఎడమ కాలి చెప్పుతో గొట్టు” అన్నాడా పెద్దాయన. ఆయన పేరు గిడ్డారెడ్డనీ, ఆయన కొడుకు పేరు ప్రద్యమ్నరెడ్డనీ, వాండ్లది దగ్గరనే ఉన్న నాగలాపురమనీ తెలిసింది.

పతంజలి కాసేపు ఆలోచించి, “సరే రెడ్డిగారు! ఐదువందలు తగ్గించి మూడు వేల ఐదువందలు చేసుకోండి. దీని తల్లి ఇది పుడుతూనే చచ్చిపోతే ఇంట్లో పిల్లోని మాదిరి సాక్కున్నాం. మా పరిస్థితి బాగాలేక అమ్ముకుంటున్నాము గాని….” అంటూ ఆగిపోయాడు. అతని కంఠం గద్గదమయింది. కళ్లు చెమ్మగిల్లాయి. గిడ్డారెడ్డి అది గమనించాడు.

“సామీ! బాదపడకండి. ‘ఋనానుబంద రూపేనా పసుపత్ని సుతాలయా’ అని కదా మన పెద్దలు సెప్పింది. మీలాంటి మంచోల్ల యింటి కోడె మా యింట్లో ఉంటే మాకు మంచిది. సరే మీ మాటే కానియ్యండి. సామికి లెక్క యియ్యరా” అన్నాడాయన.

కొడుకు జేబులోంచి డబ్బుతీసి లెక్కపెట్టి పతంజలికిచ్చాడు. అతడు లెక్కపెడుతున్నపుడే తానూ కళ్లతోనే లెక్కపెట్టాడు. “ఎండకు నడసలేదు కోడె. వగరుచ్చాది. నాలుగు గంటలకు తోల్కొబోతాం” అన్నారు.

గణపతి మెడను కౌగిలించుకొని దుఃఖించాడు పతంజలి. గణపతి కేం అర్థంకాలేదు. గారం చేస్తున్నాడనుకుని పతంజలి ముఖం తన గరుకైన నాలుకతో నాకింది.

నాలుగంటలకు ప్రారంభమయ్యిందసలు వ్యవహారం. కట్టుతాడు విప్పి వారి చేతికచ్చాడు తీసుకుపొమ్మని ప్రద్యుమ్నరెడ్డి తాడు గుంజుతూంటే అంగుళం కూడ కదల్లేదు. తోకోడు వెనుక నుంచి అదిలించినా లాభం లేకపోయింది. గిడ్డారెడ్డి ముక్కు తాడున్న మోకును పట్టుకోబోతే ఆయను విదిలించి పారేసింది. బుసలు కొడుతూ పతంజలి వద్దకొచ్చి నిలబడింది.

గిడ్డారెడ్డి అన్నాడు “సామీ! మీరు కూడ కోడెను పట్టుకోని మా ఊరికి రాండి. మూడు మైల్లు కూడ ఉండదు. మాగాటికాడ కట్టేసి, కొంచేపుండి పోదురుగాని. మాకు కొంచెం అలవాటయితాది”

సరేనని తాడుపట్టుకొని పతంజలి నడుస్తూంటే, నిశ్చింతగా అతని వెంట నడవసాగింది. మధ్యలో వాళ్లు మీద చేయి వేస్తే చెంగున గెంతుతూంది. చీకటి పడేవేళకు నాగలాపురం చేరుకున్నారు. గాడిపాడు దగ్గర కట్టేశారు గణపతిని. అటువైపు గంగరాజున్నాడు. స్నేహపూర్వకంగా చూశాడు గణపతిని. మేత వేస్తే ముట్టలేదు. పతంజలి వెళ్లి దగ్గర నిలబడి, “తిను” అంటే తినసాగింది.

“సామీ! మా యిండ్లల్లో బోంచేచ్చారా?” అని అడిగాడు గిడ్డారెడ్డి.

“మాసామి యాడయినా తింటాడు” అన్నాడు తోకోడు.

నవారు మంచంమీద దుప్పటి పరచి కూర్చోబెట్టారు పతంజలిని. స్టీలు ప్లేటులో మెత్తని జొన్నరొట్టెలు, మువ్వంకాయ వేసిచ్చారు. నల్ల నువ్వుల పొడి వంకాయల్లో కూరి మగ్గించారు. రెండు రొట్టెలు తిన్నాడు. పెద్ద గ్లాసుతో మజ్జిగ యిచ్చారు.

తోకోనికి మాంసాహారం పెట్టారట. వాళ్ల జీతగాండ్లతోపాటు తిన్నాడట. జొన్న సంకటిలో పొట్టేలు మాంసం వేసి పెట్టారట. చాలా బాగుందని చెప్పాడు వాడు.

“సామీ! రాత్రి ఈడే నడుం వాల్చండి. మీ కోడె కాడనే మంచమేపిచ్చా. పొద్దున్నే అర్దమైలు దూరంలో రోడ్డుండాది. నాగలాపురం మెట్ట అంటారు. కోడుమూరు కాన్నించి ఆరుగంటలకు ఆర్టీసీ బస్సొచ్చాది వెల్దుర్తికి మీరు ఆయిగా పోవచ్చు” అన్నాడు గిడ్డారెడ్డి.

పడుకునేముందు గణపతి దగ్గరకు వెళ్లి నిమురుతూ చెప్పాడు పతంజలి. “ఇప్పట్నుంచి నీవిక్కడే ఉండాలి. వీళ్లు చెప్పినట్లు విని, మంచి పేరు తెచ్చుకోవాలి. సరేనా!” గణపతి తన విశాల నేత్రాలతో పతంజలి వైపు చూస్తుండిపోయింది.

తెల్లవారుజామున లేచి ఇద్దరూ బయలుదేరి బస్సులో ఊరు చేరుకున్నారు. కొంత దూరం వరకు గణపతి పెనుగులాడుతూ బాధగా రంకెలు పెడుతున్న శబ్దాలు వినిపస్తూనే ఉన్నాయి.

వారం రోజులు గడిచాయి. ఇంటర్వ్యూలు ఏవీ రాలేదు. కడపలో గ్రామీణ బ్యాంకు పరీక్ష వ్రాసి వచ్చాడు. ప్రొద్దుటూరికి వెళ్లి వసుధను చూచి వద్దామని మనసు పీకింది. కాని వెళ్లలేకపోయాడు. నిమ్మతోట కొట్టేసినప్పటి నుండి నాన్న ఆరోగ్యం బాగులేదు. ఆయనకు తెలిసిన హోమియో వైద్యమే వాడుతున్నాడు. వ్యవసాయం పూర్తిగా వైఫల్యం చెందడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు.

ఆ రోజు ఉక్కగా ఉందని, వీధిలో మంచం వేసుకొని పడుకున్నాడు పతంజలి. ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. ఉక్కబోత తగ్గి చల్లగా గాలి వీస్తూంది. మంచి నిద్రలో ఉన్నాడు. ఎందుకో మెలకువ వచ్చింది. వెచ్చగా ఎవరిదో శ్వాస ముఖానికి తగులుతూంది. ఆకురాయితో గీకినట్లు చెంపల్ని ఎవరో గీరుతున్నారు. కలేమో అనుకున్నాడు. “సామీ, సామీ” అని ఎవరో పిలుస్తున్నారు.

కళ్లు తెరిచి చూస్తే గణపతి. వెనుక తాడు పట్టుకున్న ప్రద్యుమ్నరెడ్డి. వాళ్ల జీతగాడు కన్పించారు. దిగ్గున లేచాడు. అప్పటికే గణపతి మోర చాచి అతని భుజం మీద పెట్టాడు. మళ్లీ పతంజలి కళ్లల్లోకి చూశాడు. ముట్టితో అతన్ని తోస్తున్నాడు. చాలా ఉద్వేగంగా ఉన్నాడు. వాడి డొక్కలు ఎగిరెగిరి పడుతున్నాయి.

“గణపతీ! వచ్చినావా! నా బంగారు కొండ!” అంటూ ఒళ్లంతా నిమిరి దాన్ని శాంతింపజేశాడు. ఈలోగా శర్మ, వర్ధనమ్మ పిల్లలు అంతా వచ్చేశారు. అందరి దగ్గరకూ వెళ్లి మూజూచి, తన రాకను తెలిపాడు గణపతి. పతంజలి వద్ద కొచ్చి నిల్చున్నాడు.

ప్రద్యుమ్న రెడ్డి చెప్పాడు. “సామీ! మీ మీద ఎంత మమకారం పెంచుకుందో ఈ నోరు లేని జీవి. మీరు వెళ్లిపోయిన నాటి నుండి గుప్పెడు మేత తినల్యా. దోసెడు నీల్లు తాగల్యా. రెండుసార్లు కట్టుతాడు తెంచుకొనింది. పెనుగులాడి మెడంతా ఒరుసుకుపోయింది. వారం రోజులు సూసినాం. ఇంగ మాతో కాల్యా. తిండిదినక సచ్చిపోతాదేమోనని తీసికొచ్చినాము.”

పతంజలి గణపతిని పరిశీలించాడు. వారం రోజులకే చిక్కి శల్యమయింది. ఎముకలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులందరికీ దుఃఖం వచ్చింది.

“నేనూ మీ యింట్లో మనిషినై ఉంటే ఇలా చేసేవారా చెప్పండి!” అన్నట్లుగా చూస్తూ ఉందది.

పతంజలి లోనికి వెళ్లి మూడు వేల ఐదువందలు తెచ్చి ప్రద్యుమ్న రెడ్డికిచ్చాడు. అతడు డబ్బు తీసుకొని నమస్కరించి వెళ్లబోతూ అన్నాడు.

“తిండి తినక అంత నీరసంగున్న పసరం, మీ యింటికి తీసకపోతాండామని గ్రయించుకొని ఎట్ట నడిసినాదో! మజ్జన ఒక్క సిటం కూడ నిలబడల్యా. ఒకేల ఎవరికైనా అమ్మినా రోజూ మీ కల్లముందుండేట్టు సూసుకోండి.”

గణపతిని తీసుకొని వెనక సాలలో కట్టేశాడు. అసలేమీ జరగనట్లు వెళ్లి తన కట్టుకొయ్య వద్ద నిలబడింది. దాని ముఖంలో అనిర్వచనీయమయిన ప్రశాంతత. బోయ సింజయులు యింటికి బోయి రెండు చేతులతో జొన్న చొప్ప తెచ్చి దాని ముందువేశాడు. వాళ్ల దగ్గరే రెండు దోసిళ్ల మొత్తటి వరి తవుడు అడిగి తెచ్చి బక్కెట్లో నీళ్లలో కలిపి దానికి తాపించాడు. సగం బకెట్‌ ఖాళీ చేసి, నెమ్మదిగా చొప్పదంట్లు ఒక్కొక్కటి నమలసాగింది. అందరూ దాని చూస్తూ నిలబడ్డారు. తింటూ తింటూ అందర్నీ చూసుకుంటూంది.

వంటింట్లో చేరి అందరూ కాఫీలు తాగేటపుడు చర్చించుకున్నారు. మన ఊర్లోనే ఎవరికయినా ఇద్దాం. ధర తక్కువ వచ్చినా సరే అని తీర్మానించుకున్నారు. అందరి మనసులు తేలికపడ్డాయి.

తోకోనికి కబురు పంపి రెండు మూడు జల్లల మేత తెచ్చి పెట్టమన్నారు. వేరుశనగ నూనెమిల్లులో శనగచెక్కపిండి ఐదు కేజీలు తెప్పించి, రోజూ నానబెట్టి నీళ్లలో కలిపి తాపుతున్నారు. కేవలం నాలుగు రోజుల్లో తిరుక్కునింది కోడె. ఎముకలు పూడిపోయి, దానిపూర్వ నైగనిగ్యం రాసాగింది.

ఒకరోజు తోకోడు ఒకతన్ని తీసుకువచ్చాడు. అతని పేరు వలీ. దూదేకుల సాయిబులు. దూదేకుల సాయిబులు పేరుకు ఇస్లాం మతం స్వీకరించినా, హిందువుల పండగలన్నీ జరుపుకుంటారు. వారు మాట్లాడే తెలుగులో కూడ ఉర్దూ యాస ఉండదు. పేర్లు మాత్రం ముస్లింలవే. వస్తూనే “నమస్కారం సామీ!” అని శర్మకు, పతంజలికి నమస్కరించాడు. “నా పేరు మస్తాన్‌ వలీ. ఖాదర్‌ వలీ కొడుకును. బ్రహ్మగుండం రోడ్డులోని పొలాల్లో మంచినీళ్ల బాయిల్నుంచి పీపాతో బస్టాండులోని ఓటల్లకు నీళ్లు పోచ్చా. యావయినా కార్యాలు జేసుకొనేటోల్లకు కూడ నీల్లు దోల్తా ఉంటా. నాకు టైరు బండి ఉండాది. మూడు డ్రమ్ములు కలిపి వెల్డింగ్‌ చేపిచ్చుకోని బండిమీద పీపా మాదిరి బిగించుకున్నా. పైన నీళ్లు బోయనీకె రంద్రం ఉంటాది. పీపాకు వెనకవైపున కొళాయి పెట్టించుకున్నా. బాలనాగి రెడ్డి బాయి, ఉప్పరి వెంకటేసు బాయి, సుంకిరెడ్డి బాయి ఇట్టా యాడదొరికితే ఆడనీళ్లు దోల్తా. ట్రిప్పుకు పది రూపాయలొచ్చాయి. నాకాడున్న ఎద్దు ముసలిదైపోయింది. మీకాడ కోడె ఉండాదని. మీ కల్ల ముందరే ఉండేటట్లు అమ్మాలనుకుంటుండారని ఈ అనుమంతు జెప్పె. నేను బీదోన్ని. ఎక్కువ దర ఇచ్చుకోలేను. కోడెను నాకిప్పిస్తే నా కన్న బిడ్డ మాదిరి జూసుకుంటా” అని విన్నవించుకున్నాడు.

“పోయి కోడెను చూసిరాపో నాయనా!” అన్నాడు శర్మ. అతను వెళ్లి చూసి వచ్చాడు. పతంజలి అన్నాడు “అలవాటయ్యేంతవరకు మా తోకోడు నీ వెంట ఉంటాడు. వాడికి కూలీ మేమిస్తాం. అది ఇంకా కాడి మరగలేదు. మెత్తకాళ్లు పడకుండా నాడాలు కొట్టిస్తాం.రోజుకు ఎన్ని ట్రిప్పులు వేస్తావు?”

“నాలుగు, ఐదు కంటె ఎక్కువుండవు సామీ! పొద్దున్నే బండికడితే పైటాల వరకే తోలతాను. టైరుబండి కాబట్టి బరువనిపించదు. ముందల కాళీ పీపాతో బండినేర్పిస్తా.”

“కొన్ని రోజులు మా ఇంటినుండే నడుపుకో. నీవూ దానికి అలవాటయితావు. మీ యిల్లు ఎక్కడ?”

“డోను రైలు గేటు కివతల, సంజన్న గౌడు సుద్ద ప్యాక్టరీకాడ. మా పెండ్లాం సుద్ద ప్యాక్టరీలో పని జేచ్చాది. అమ్మ సచ్చిపాయె. మా నాయన మెత్తబడె.”

“సరే! మేము అప్పుడపుడు వచ్చి చూసి పోతుంటాం! ఎంతిస్తావు మరి?”

“రెండువేల ఐదువందల కంటె ఇచ్చుకోలేను. కోడె నాలుగు వేలయినా జేచ్చాదని దెల్చు. ఏదో నా జీవనం నిల్పినోల్లవుతారు.”

“సరేలే. ఎల్లుండి పంచమి శుక్రవారం. తోకోన్ని పిల్చుకొనిపోయి బండి నేర్పించు”

“ఐదొందలు సంచకారం దెచ్చినా” (అడ్వాన్సు)

“వద్దులే ఎల్లుండి అంతా ఒకేసారి యిద్దువుగాని”

వలీ నమస్కరించి వెళ్లిపోయాడు. గణపతి కథ సుఖాంతమైంది.

***

మల్లినాధ టెన్త్‌ పాసయ్యాడు. నలభై ఏడు శాతం మాత్రమే వచ్చింది. వాడు చదువు కొనసాగించడానికి సుముఖంగా లేడు. మార్కండేయ శర్మకు మంచి అవకాశం దొరికినట్లయింది.

“మల్లినాధకు ఈ ఇంగ్లీషు చదువులు వద్దు. పతంజలిని మన సంప్రదాయం ప్రకారం తయారు చేద్దామనుకున్నాను. వాడు తన మార్గం వేరుగా మలచుకుంటున్నాడు. సరే విధి ఎవర్ని ఏ స్థాయికి తీసుకునిపోతుందో అనుహ్యం. మన మల్లినాధను శ్రీశైలంలో వేద పాఠశాలలో చేర్పిద్దాము. రెండు సంవత్సరాలు స్మార్తం, జ్యోతిష్యం, వాస్తు చదువుకొని వస్తాడు.” అన్నాడాయన.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here