సాఫల్యం-35

3
12

[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[స్వామి దర్శనంతో తన్మయుడవుతాడు పతంజలి. మర్నాడు అక్కాబావలకి వీడ్కోలు చెప్పి వెల్దుర్తి బయలుదేరుతాడు. ఇంటికి చేరాకా, తమ్ముడు చెల్లెలు ఎలా చదువుతున్నదీ అడిగి తెలుసుకుంటాడు. పొలం చుట్టూ కంచె పెరిగిపోయిందనీ, దాన్ని కొట్టించాలనీ, ఈసారి కొమ్మశనగ పంట వేద్దామని, ఈసారి కర్నూలు నుంచి వచ్చేడప్పుడు రెండు వేల రూపాయలు తెమ్మని అంటాడు మార్కండేయశర్మ. రాబడి లేని పొలంపై ఖర్చును తలచుకుని  కాస్త వెనుకాడుతాడు పతంజలి. అప్పటికి ఏమీ చెప్పకుండా కర్నూలు వెళ్ళిపోతాడు. మైసూరు యూనివర్సిటీ వారి – స్కూల్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ – పాతికేళ్ళు దాటిన ఎవరైనా ఎం.ఎ. చేయవచ్చని ప్రకటన వస్తుంది. ముగ్గురు మిత్రులు కలిసి ఆ కోర్సును బాగా ప్రచారం చేస్తారు. పన్నెండు మంది చేరుతారు. కోర్సు ఫీజు నిర్ణయించి, యూనివర్శిటీ నుంచి స్టడీ మెటీరియల్ తెచ్చి అభ్యర్థులకు ఇస్తారు. స్టడీ మెటీరియల్‌కి చక్కని ఆర్డర్లు వస్తాయి. బాజిరెడ్డి వస్తే, తమ పొలం విషయం చెబుతాడు పతంజలి. ఆదాయం రాని ఆ పొలాన్ని అమ్ముకోవడమే మంచిదని అతనంటాడు. రాధాసారుని సంప్రదిస్తే, ఆయన అదే సలహా ఇస్తారు. వీలు చేసుకుని ఇంటికి వెళ్ళినప్పుడు – డబ్బు తెచ్చావా అని తండ్రి అడుగుతాడు. అప్పుడు పొలం అమ్మేయాలన్న ఆలోచన చెప్తాడు. తల్లీతండ్రీ ఇద్దరు ముందు విస్తుపోయినా, తర్వాత అంగీకరిస్తారు. రాధాసారు, బాజిరెడ్డిల సాయంతో మంచి ధరకే పొలాన్ని అమ్ముతారు. – ఇక చదవండి.]

[dropcap]ముం[/dropcap]దుగా బ్యాంక్‌ లోన్‌ కట్టేశారు. దాదాపు పదివేలుంది. తర్వాత రామలింగయ్య శెట్టిని పిలిపించాడు మార్కండేయశర్మ. మొత్తం వడ్డీతో సహా లెక్కలు తీసుకొని రమ్మన్నాడు. ఆయన లెక్కలు తీసి, అసలు ఎనిమిది వేలు, వడ్డీ పదహారు వందలు అయిందనీ, అసలు తీర్చేస్తే చాలనీ, పొలం అమ్మి అప్పు తీరుస్తున్నారు కాబట్టి వడ్డీ తీసుకోననీ చెప్పాడు. పెద్ద మనసే శెట్టిది.

బ్యాంకులో రామ్మూర్తి బావ పేరున ఐదు వేల రూపాయలకు డ్రాప్టు తీసి, వాగ్దేవికి స్త్రీ ధనంగా బహూకరించారు. దీన్ని వర్ధనమ్మ సూచించింది. మహితకు ఐదు తులాలు బంగారం కొని, నాలుగు, గాజులు చేయించారు. చిన్నోడికి ఐదువందలు పెట్టి అట్లాస్‌ గోల్డ్‌ లైన్‌ సైకిలు కొనిచ్చారు.

పశువులశాల అంతా విప్పించి, దూలాలు, దంతెలు (రీపర్లు) టింబర్‌డిపో వారికి అమ్మేశారు. చాలా నాణ్యమైన పాతకాలం టేకు. ట్యూషన్ల షెడ్‌ కూడ తీసేశారు. బయటి గోడలు రెండున్నర అడుగుల మందమున్నాయి. రాతిగోడలవి. వాటిని కూడ తొలగించి రాళ్లను కూడ అమ్మేశారు. మొత్తం మూడువేలు కలపకు రాళ్లకు వచ్చింది. దాదాపు 300 చ.గజాల విశాలమైన స్థలం ఏర్పడింది. పొరుగునే ఉన్న సుంకిరెడ్డి దానిని ఎనిమిదివేలకు తీసుకున్నాడు.

తామున్న ఇంటిని కూడ సంస్కరించారు. గోడలకున్న సున్నం తొలగించి సిమెంట్‌ ప్లాస్టరింగ్‌ చేయించారు. గవాక్షాలతో సహా పైకప్పు తీసేసి, గోడల మీదుగా ఇనుప గరెండాలు వేయించి, వాటిమీద ఇనుప షీట్లు పరిపించి, అడుగు మందాన కాంక్రీటు పోయించి, మళ్లీ ప్లాస్టరింగ్‌ చేయించారు. మిద్దెమీదికి వెళ్లడానికి మెట్లు, మిద్దె చుట్టూ సరిహద్దు గోడ కట్టించారు. బయట వరండా ఓపన్‌గా ఉండేది. దానికి గ్రిల్స్‌ పెట్టించారు. పడసాలలో, వరండాల్లో రెండు ఉషా ఫ్యాన్లు వేయించారు. నాలుగు కుర్చీలు టేకుతో చేయించారు. పెరట్లో బోరింగ్‌ వేయించారు. వందడుగుల లోతున నీళ్లు పడ్డాయి. తియ్యగా లేవు గాని, వాడకానికి వంటకు పనికొస్తాయి. దానికొక వన్‌హెచ్‌పి మోటారు బిగించి బాత్‌రూములో ఒక కొళాయి, వంటింట్లో ఒకటి, పెరట్లో ఒకటి పైపుల ద్వారా నీరు వచ్చేలా ఏర్పాటు చేసుకున్నారు. ఇంటికి వైట్‌ బ్లూ కలర్‌ డిస్టెంపర్‌ వేయించారు. ఇంటి పై భాగాన సిమెంటుతోనే ‘శ్రీ లక్ష్మీనరసింహ నిలయము’ అని తయారు చేయించి, వాటికి పసుపు రంగు పెయింట్‌, అంచుల్లో ఎరుపురంగు ఫీడ్‌ వేయించారు. పెరట్లో సెప్టిక్‌ లెట్రిన్‌ కట్టించారు.

మొత్తం ఇరవై ఏడు వేలు ఖర్చయింది. ఇంటి స్వరూపమే మారిపోయి సరికొత్త లుక్‌ వచ్చింది.

ఇప్పుడు మిగిలిన డబ్బును జాగ్రత్తగా ఇన్‌వెస్ట్‌ చేసుకోవాలి. దాదాపు లక్షా డెభై ఐదు వేలుంది. రాధాసారు ఒక సలహా యిచ్చాడు. బ్యాంకులైనా, యన్‌.యస్‌.సి బాండైనా రూపాయి వడ్డీ కంటే గిట్టదు. ‘సుందరం ఫైనాన్స్‌’లో పెడితే వాళ్లు దాదాపు రెండు రూపాయల వడ్డీ యిస్తారు. ‘టి.వి.ఎస్‌ అయ్యంగార్స్‌’ అని మద్రాసువారి సంస్థ అది. చాలా పురాతనమైనది. విశ్వసనీయమయినది.

కర్నూలు నగర పొలిమేరలో ఒక రెండు వందల గజాల స్థలం చూశాడు రాధాసారే. బళ్లారి చౌరస్తాకు దగ్గరలో ఉంది. ఏడెనిమిది సంవత్సరాలలో బాగా అభివృద్ధి అయ్యే సూచనలున్నాయి. ఎమ్‌.జి బ్రదర్స్‌ వారి ట్రాక్టర్లు, లారీల షోరూం అక్కడే ఉంది. హైదరాబాదు బెంగుళూరు జాతీయ రహదారికి కనుచూపు మేరలోనే ఉంది ప్లాటు. రిజిస్ట్రేషన్‌తో సహా ఇరవైవేలయింది. సరిహద్దు రాళ్లు పాతించారు.

ఐదువేలు సేవింగ్స్‌ అకౌంట్లో ఉంచుకున్నారు. మిగతా లక్షా యాభై వేలల్లో మహిత పెళ్లి కోసం ఆ అమ్మాయి పేర 20 వేలు, తండ్రి, ముగ్గురన్నదమ్ములకు ఒక్కొక్కరి పేర 33 వేలు, ‘సుందరం ఫైనాన్స్‌’లో ఐదు సంవత్సరాలకు డిపాజిట్‌ చేశారు. మహితది మాత్రం మూడేళ్లకే వేశారు. వడ్డీ 21% ఇస్తున్నారు. నెలనెలా వచ్చే వడ్డీని కొంత ఇంటి ఖర్చులకు వాడుకొనేలా, కొంత రికరింగ్‌ డిపాజిట్‌ కట్టేలా నిర్ణయించుకున్నారు.

కుటుంబం మీద అంతవరకు ఉన్న పెను ఆర్థిక భారం తీరినట్లుంది.

***

అక్టోబరు నెలలో ఎమ్‌.ఎ. పరీక్షలకు హాల్‌ టికెట్‌ వచ్చింది. నవంబరు 3వ తేదీ నుండి పరీక్షలు జరుగుతాయి. సికింద్రాబాద్‌లోని మహబూబియా కాలేజి సెంటరుగా ఇచ్చారు. నాలుగు పేపర్లూ సిలబస్‌ పూర్తి చేసుకొని, నోట్సు తయారు చేసుకున్నాడు. ఒక పదిహేను రోజులు క్లాసులు స్నేహితులకప్పచెప్పి, చదువుకోసాగాడు పతంజలి.

రెండవ తేదీ రాత్రి బెంగుళూరు ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి సికింద్రాబాదు చేరుకున్నాడు. రైలు దిగి రిక్షాలో అక్కయ్య వాళ్లింటికి వెళ్లాడు. ముందే తాను పరీక్షలు వ్రాయటానికి వస్తున్నట్లు బావకు జాబు వ్రాశాడు.

అక్కయ్య తలుపుతీసి పతంజలిని ఆహ్వానించింది. బావ పిల్లలూ ఇంకా లేవలేదు. ముఖం కడుక్కుని కాఫీ తాగాడు. రెండుగంటల పాటు ఆ రోజు పరీక్షకు చదువుకున్నాడు.

బావతో పొలం అమ్మిన విషయం, ‘సక్సెస్‌’ నిర్వహణ అన్నీ చర్చించాడు. అక్కయ్య లాంగ్‌ చైను బంగారంది తెచ్చి చూపింది.

“మీరు పంపిన డబ్బుతో మీ బావ చేయించారురా!” అన్నది సంతోషంగా చైను క్రింది భాగంలో లాకెట్‌ కూడ ఉంది. బావతో పాటు భోజనం చేసి, ఆయన బ్యాంకుకు వెళ్లిన తర్వాత పదకొండు వరకు నిద్రపోయాడు పతంజలి. లేచి అక్క యిచ్చిన ‘టీ’ తాగాడు. ఒంటిగంటవరకు చదువుకొని, ఒకటింబావుకు తయారై సెంటరుకు బయలుదేరాడు. దగ్గరే. నడిచిపోవచ్చు. రాష్ట్రపతి రోడ్‌, సరోజినీదేవి రోడ్‌ కలిసే చౌరస్తాలో ఉంది.

ఐదు గంటలకు పరీక్ష పూర్తయింది. ఐదు ప్రశ్నలూ చాలా బాగా రాశాడు. నరసింహస్వామి దయవల్ల తాను బాగా ప్రిపేరయినవే వచ్చాయి. ప్రతి ప్రశ్నకు పదిహేను పేజీల వరకు జవాబు వ్రాశాడు.

బయటకు వస్తుంటే ఒకతను పలుకరించాడు. అతని పేరు కైలాస్‌. వాళ్లది అనంతపురమట. జడ్‌.పి. హైస్కూల్లో టీచరట. ఎమ్‌.ఎ. చేస్తే లెక్చరర్‌గా వాళ్లకు ప్రమోషన్‌ ఇవ్వడానికి కోటా ఉందట.

“మన యస్‌.వి. యూనివర్సిటీ వదిలి ఉస్మానియాకు ఎందుకు వచ్చారు?” అనడిగాడు పతంజలి.

“మీరెందుకు వచ్చారో చెప్పండి ముందు” అన్నాడతను నవ్వుతూ.

“మా కర్నూలికి హైదరాబాదే తిరపతి కంటే దగ్గర. నేను డిగ్రీ వన్‌ సిటింగ్‌ ఉస్మానియాలోనే చేశాను. ఇక్కడ మా అక్కా వాళ్లున్నారు.”

“నేను యస్‌.వి.లో రెండుసార్లు రాశాను. 48% దాటటం లేదు. మినిమం 50% ఉంటేగాని జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుకు అర్హత రాదు. అదే డిగ్రీ కాలేజీ లెక్చరర్లకయితే యు.జి.సి.నార్మ్స్‌ ప్రకారం 55% ఉండాలి”

పతంజలికీ వివరాలన్నీ తెలియవు. శ్రద్ధగా వింటున్నాడు. “పైగా యస్వీలో ఐదు పేపర్లుంటాయి. ఉస్మానియాలో నాలుగే. అక్కడ ప్రతి పేపర్లో కనీసం 50 శాతం రావాలి. ఇక్కడ నాలుగు పేపర్ల మీద అగ్రిగేట్‌ 50% వస్తే సరిపోతుంది. సెకండ్‌ క్లాస్‌ యిస్తారు. పి.జి.లో 50% కంటే తక్కువ మార్కులతో పాసయినా వేస్టు.” పతంజలికి అర్థమయింది. డిగ్రీలో తనకు 85 శాతం వచ్చిందనీ యూనివర్సిటీ థర్డ్‌ ర్యాంకర్‌ననీ చెప్పాడు. అతడు అభినందించి అన్నాడు. “డిగ్రీలో ఇస్తారు గాని అదేమిటో పి.జి.లో ఇవ్వరు. చాలా సందర్భాలలో 49 వద్ద, 54 వద్ద ఆపేస్తారు. ఉస్మానియాలో కూడ కష్టమే. ఏమిటంటే అగ్రిగేట్‌ విధానం వల్ల ఒక పేపర్లో తక్కువ వచ్చినా, ఇంకో పేపర్లో ఎక్కువ వస్తే అడ్జస్ట్‌ అవుతాయి. నాలుగు వందలకు, నాలుగు పేపర్లకూ కలిపి రెండు వందలు రావాలి. అప్పుడు జె.ఎల్‌. పోస్టుకు అర్హత వస్తుంది. రెండు వందల ఇరవై వస్తే డి.ఎల్‌. పోస్టుకు ఫిట్‌ అవుతాం” ఇంకా చెప్పాడు. “నేను విన్నదేమంటే యాన్నొటేషన్స్‌ కరెక్ట్‌గా ఆన్సర్‌ చేయగలిగినవారికే క్లాసు వస్తుందని. దాదాపు పదహారు డిటెయిల్డ్‌ టెక్స్టులన్నీ చదివేది ఎందరు? వాటిల్లోంచి ఏ వాక్యం అడిగినా, టెక్ట్స్‌ పేరు, కవి పేరు, యాక్ట్‌, సీన్‌ నంబర్లతో సహా ఉటంకిస్తూ, ఏ సందర్భంలో కవి ఎవరి చేత పలికించాడు లేదా తానే అన్నాడా, దాని సిగ్నిఫికెన్స్‌ ఏమిటి? దానిలో ఉన్న సాహిత్య విలువలేమిటి అన్నీ రాయాలి. మన ఖర్మ కాలి అది కంపల్సరీ క్వశ్చన్‌. ఛాయిస్‌లో వదిలేయలేం. గుడ్డిలో మెల్ల ఏమిటంటే దాంట్లో ఎనిమిది సబ్‌ క్వశ్చన్స్‌ ఇచ్చి వాటిల్లో ‘ఎ’ ఆర్‌ ‘బి’ అన్న ఇంటర్నల్‌ ఛాయిస్‌ ఉంది. చాలాసార్లు ఎ,బి లు రెండూ మనకు తెలిసినవి రావు”

ఈరోజు రాసిన పరీక్షలో అన్నీ తనకు బాగా తెలిసినవే వచ్చినట్లు పతంజలి గ్రహించాడు. తాను టెక్స్ట్‌ అన్నీ క్షుణ్ణంగా నాలుగయిదుసార్లు చదివి ఆర్‌.సి. (రిఫరెన్స్‌ టు ది కాంటెక్స్డ్‌లకు యోగ్యమైన భావస్ఫోరకమయిన వాక్యాలను, పద్యముల్లోని లైన్లను మార్క్‌ చేసుకొని మననం చేసుకొని ఉన్నాడు. ఈ రోజు నాలుగేమిటి ఆరు ఆర్‌.సి.లకు జవాబు వ్రాశాడు.

ఇంటికి వెళ్లి ముఖం కడుక్కొని అక్కయ్య పెట్టిన బచ్చలాకు బజ్జీలు తిని కాఫీ తాగాడు. నరసింహస్వామి గుడికి వెళదామని బయలుదేరుతుంటే మేనల్లుళ్లు తామూ వస్తామన్నారు. శశికి నాలుగేళ్లు. వచ్చే సంవత్సరం స్కూలకు పంపాలి. చిన్నాడు రెండో సంవత్సరంలో ఉన్నాడు.

ముందు మహంకాళి అమ్మవారిని దర్శించుకొని, నరసింహస్వామి గుడికి వెళ్లారు. స్వామికి అర్చన చేయించాడు. గోడమీద స్వామి వారి ఆయల్‌ పెయింటింగ్‌ దగ్గర కూర్చున్నారు. పతంజలి స్వామిని ధ్యానిస్తూ ఉద్వేగానికి గురై దుఃఖించాడు.

“మామా! ఎందుకేడు త్తున్నావ్‌! బొజ్జ నొత్తుందా” అని అడిగాడు బుజ్జి మేనల్లుడు.

తెప్పరిల్లి, అల్లుళ్లను చెరొక చేత్తో పట్టుకొని వాళ్లకు చాక్‌లెట్స్‌ కేక్స్‌ కొనిపెట్టి, ఇంటికి తీసుకొనివచ్చాడు.

బావ ఇంటికి వచ్చే సరికి ఎనిమిదైంది.

“రోజూ ఇంత తేటవుతుందా బావా!” అని అడిగితే “ఈరోజు అరగంట ముందొచ్చానురా. డే బుక్‌ ట్యాలీ అయ్యేంతవరకు రాలేము. క్లర్కుల పనే హాయి. ఐదు గంటలకు ఠంచనుగా వెళ్లిపోతారు” అన్నాడు బావ.

తొమ్మిది గంటలకు భోజనం చేశారందరూ. పతంజలి రాత్రి పన్నెండు వరకు చదువుకున్నాడు. కైలాస్‌ మాటల వల్ల వచ్చిన అవగాహనతో ఆర్‌.సి.ల మీద ఎక్కువ కృషి చేశాడు. అందునా రేపు ఎలిజబెతియన్‌ ఏజ్‌ షేక్‌స్పియర్‌ నాటకాలే మూడున్నాయి. క్రిస్టఫర్‌ మార్లోవి రెండు. వెబ్‌స్టర్‌వి రెండు, అవిగాక రెండు వేరే వారివి ఉన్నాయి.

మళ్లీ ఉదయం ఐదుకే లేచి ఏడు వరకు చదువుకున్నాడు. బావమరదులిద్దరూ స్కూటర్‌ మీద మోండా మార్కెట్‌కు వెళ్లారు. కూరగాయలు చాలా చవక. మార్కెట్‌ చాలా పెద్దది. కర్నూలు పెద్ద మార్కెట్‌కు పదింతలుంది. కానీ చాలా అపరిశుభ్రంగా ఉంది. బండి ఒక హోటలు వద్ద పెట్టి, లోపలికి వెళ్లారు. ఉస్మానియా బిస్కెట్లు తిని, ఇరానీ చాయ్‌ తాగారు. కూరగాయలు తీసుకొని ఇంటికి వచ్చారు.

“అక్కయ్యా, పుదీనా నవనవలాడుతూంది. పచ్చడి నూరవే” అనడిగాడు అక్కయ్యను.

“ప్రిన్సిపాల్‌ గారికి పచ్చడి మెతుకులేనా! ఏదైనా స్పెషల్‌ చెయ్యి హృదయేశ్వరీ!” అన్నాడు బావ. “కూరగాయలన్నీ ఉన్నాయి. వెజిటబుల్‌ పలావు చెయ్యరాదూ!”

“అవన్నీ తొమ్మిదికే ఎలా అవుతాయి ప్రాణానాధా!” అన్నది వాగ్దేవి. “వాడు కర్నూల్లో వాళ్లకు ప్రిన్సిపాలేమోగాని నాకు మాత్రం నా బంగారు తమ్ముడే” అంది. పతంజలి వెంటనే వెళ్లి అక్కయ్య అక్కున జేరాడు.

“సరే ఒక పని చేద్దాం. అందరికీ ఏదైనా సింపుల్‌ టిఫిన్‌ పెట్టెయ్యి. నేను రెండు గంటలకు వచ్చి తినిపోతాను. ప్రిన్సిపాల్‌గారు పన్నెండున్నరకల్లా తిని పరీక్షకు వెళ్లిపోతారు.”

“మాటిమాటికి ప్రిన్సిపాల్‌గారని అనకు బావా! నాకు గిల్టీగా ఉంది”

“ఉన్నమాటే గదా అంటున్నా. ఇదేమిటి, ఎమ్‌.ఎ. అయింతర్వాత లెక్చరర్‌ అవుతావు. కొంతకాలానికి గవర్నమెంట్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌వు కూడా అవుతావు. ఇంకా మాట్లాడితే రాష్ట్ర స్థాయి అధికారివైనా ఆశ్చర్యం లేదు.” అన్నాడు బావ. అంటూ పతంజలి దగ్గర కొచ్చి అతన్ని కౌగిలించుకున్నాడు, “ఐయామ్‌ ప్రౌడ్‌ ఆప్‌ యు” అంటూ.

“ఊరుకోండి. వాడినలా ఆకాశానికెత్తకండి. అహంకారం వస్తుంది” అన్నది అక్కయ్య.

చకచకా రవ్వ దోసెలు పోసింది. పుట్నాలు, కొబ్బరి కలిపి చట్నీ చేసింది. టిఫిన్‌ తిని బావ బయలుదేరుతూ “నా వెంట రా” అని పిలిచాడు. మెయిన్‌ రోడ్డుమీద స్కూటరాపి, బాలాజీ మిఠాయి భండార్‌లో పావుకిలో జీడిపప్పు పకోడీ తీసుకుని పతంజలికిచ్చాడు.

“వెజిటబుల్‌ పలావులో నంచుకోడానికి, నీవు తొందరగా తింటావు కదాని” అన్నాడు. “అక్కాతమ్ముడూ మొత్తం తినేయకండిరోయ్‌. నాక్కూడా కొంచెం ఉంచండి” అని వెళ్లిపోయాడు.

బావ హాస్యస్ఫూర్తికి నవ్వుకుంటూ ఇంటికి వెళ్లాడు పతంజలి. పన్నెండు వరకూ చదువుకున్నాడు. చదువుకోడానికి కూర్చొనే ముందు అక్కయ్యకు ఉర్లగడ్డలు, క్యారెట్‌, బీన్స్‌, ఉల్లిపాయలు తరిగి ఇచ్చాడు. పచ్చి బటాణీలు వలిచి యిచ్చాడు. అక్కయ్య “నేను చేసుకుంటాను నీవు చదువుకోపోరా” అన్నా వినలేదు.

“కూరగాయలు మార్కెట్లో తిరిగి కొనుక్కురావడం, అన్నీ ఇంటికి వచ్చిన తర్వాత విడివిడిగా బుట్టలో సర్దడం కూరలు తరగడం నాకు చాలా ఇష్టమే అక్కయ్యా! దీని వల్ల నాకు రిలాక్సేషను కలుగుతుంది” అన్నాడు.

“నీ మొహంలే” అన్నది అక్కామణి.

పన్నెండున్నరకు వడ్డించింది. వెజిటబుల్‌ పలావు బ్రహ్మాండంగా కుదిరింది. దాన్లోకి పెరుగు పచ్చడి. వైట్‌ రైస్‌లో కలుపుకోడానికి పుదీనా పచ్చడి చేసింది. నీళ్లచారు చేసింది.

“ఇక పప్పు, కూర చెయ్యలేదురా. మీ బావ పలావు చేస్తే మరేమీ తినరు” అంది.

“అంతేమరి. సాదకాలు ఎక్కువైనా తినలేం. వృథా అవుతాయి” అన్నాడు. బోడంబి (జీడిపప్పు) పకోడీ కూడ చాలా బాగుంది. ఒంటిగంటకు పరీక్షకు బయలుదేరాడు. ఆర్‌.సి. ప్రశ్నలతో సహా అన్నీ తెలిసినవే, బాగా ప్రిపేరయినవే వచ్చాయి.

నాలుగు పరీక్షలూ దిగ్విజయంగా వ్రాశాడు పతంజలి. చివరి పరీక్షరోజు సాయంత్రం స్వీట్స్‌ తెచ్చాడు పావుకిలో. మరుసటి రోజు ఆదివారం అయింది. తాను వెళ్లిపోదామన్నా బావ పోనివ్వడు. పైగా ఆయనతో రోజంతా గడపొచ్చు.

శనివారం మధ్యాహ్నమే వచ్చేశాడు బావ. సాయంత్రం పతంజలి పరీక్ష నుండి రాగానే అందర్నీ సినిమాకు బయల్దేరదీశాడు. వాళ్లింటికి అతి దగ్గరలోనే ఉంది అంజలీ ధియేటర్‌. ఐదు నిమిషాల నడక. అందులో బాలచందర్‌ సినిమా ‘మరో చరిత్ర’ ఆడుతూంది. అప్పటికే చాలా పేరొచ్చింది దానికి. అందరూ సినిమా బాగా ఎంజాయ్‌ చేశారు. ఆ సినిమా చూసినప్పటినుండి పతంజలికి యన్‌.టి.ఆర్‌., ఎ.ఎన్‌.ఆర్‌, యస్‌.వి.ఆర్‌, ల తర్వాత కమల్‌హాసన్‌ అభిమాననటుడైనాడు. అతనికెందుకో ‘సరిత’ నటన నచ్చలేదు.

సినిమా పూర్తయిన తర్వాత, దగ్గరే ఉన్న ‘ఆనందభవన్‌’కు వెళ్లారు. టిఫిన్‌ చేశారు. చిన్నల్లుడు తనకూ ఒక ప్లేట్‌ కావాలని, సొంతంగా తింటానని గొడవ. తిన్నవి రెండిడ్లీలు. ఆ హోటల్లో ఫ్యామిలీ సెక్షన్‌ చాలా బాగుంది. బావ అన్నాడు.

“మనింట్లో రోజూ తినే టిఫిన్లు కాకుండా వెరైటీగా తిందాం” అంటూ అలూ పరోటా, ఎమ్మెల్యే పెసరట్టు ఆర్డరిచ్చాడు. ‘శశి’ ఇడ్లీ వద్దు అవే తింటానంటే వాడికి తమ వాటిల్లోంచి పెట్టారు. వాడు తింటూంటే చిన్నోడు రెండో ఇడ్లీ సగానికిపైగా వదిలేసి తనకూ పరోటా కావాలన్నాడు. పరోటా రెండు ముక్కలు తిని, పెసరట్టు కూడ కొద్దిగా తిన్నాడు.

“మొత్తానికి అన్నీ రుచి చూశావురా భడవా!” అన్నాడు పతంజలి. “ఇంతకూ నీకేది నచ్చింది కన్నా” అనడిగితే “ఇడిలీ” అన్నాడు ముద్దుగా అందరూ నవ్వారు.

ఎక్కడా బావను డబ్బు తీయనివ్వలేదు బావమరిది. రామ్మూర్తి కూడా బావమరది సంపాదనపరుడయినందుకు గర్వపడ్డాడు. “రేపు ఉదయమనందరం ‘జూ’కి వెళుతున్నాం” అని ప్రకటించాడు బావ. “అయితే ఇంటినుండి అన్నీ చేసుకొని తీసుకుపోదామండీ. అక్కడే అన్నీ తినాలంటే బోలెడు ఖర్చు” అన్నది వాగ్దేవి.

ఉదయాన్నే లేచి, పూరీలు, వాంగీబాత్‌, పెరుగన్నం చేసింది. సికింద్రాబాద్‌ స్టేషనుకు అందరూ రెండు రిక్షాల్లో వెళ్లి అక్కడి నుండి డైరెక్ట్‌గా ‘జూ పార్క్‌’ వెళ్లే బస్సు ఎక్కారు. తొమ్మిదన్నరకు ‘జూ’ దగ్గర దిగి టిక్కెట్లు తీసుకొని లోపలికి వెళ్లారు. నవంబరు నెల కాబట్టి హడావుడిగా, ఆహ్లాదంగా ఉంది. ఎండ కూడా పెద్దగా లేదు. అందరూ ఒక చెట్టు క్రింద పచ్చికలో కూర్చొని పూరీలు తిన్నారు.

మధ్యాహ్నం వరకు తిరిగి రకరకాల జంతువులన్నీ చూశారు. మేనల్లుళ్ల ఆనందానికి అంతే లేదు. ‘జూ’ అంతా ఒకటే పరుగులు. ఒంటిగంటన్నరకు కడుపులో నకనకలాడసాగింది. అందరూ ఒక చెట్టు క్రింద చప్టా మీద కూర్చుని భోజనానికి ఉపక్రమించారు. బావ ఇప్పుడే వస్తానని అక్కడ ఉన్న క్యాంటీన్‌కు వెళ్లి తలా రెండు మసాలా వడలు తెచ్చాడు.

“వాంగీబాత్‌లో నంచుకోడానికి బాగుంటాయి” అన్నాడు.

“ముందనుకొని ఉంటే ఇంట్లోనే బజ్జీలు చేసి ఉండే దాన్ని గదా!” అన్నది అక్కయ్య.

“నీవు చేస్తావు. సందేహం లేదు. కానీ దేని రుచి దానిదే సఖీ” అన్నాడు బావ.

“వీటిల్లో పుదీనా కూడ వేస్తారు. ప్రిన్సిపాల్‌గారికిష్టమని తెచ్చాను”.

బావ వైపు అభిమానంగా చూశాడు మరది.

పిల్లలిద్దరూ పెరుగన్నం తిన్నారు. కాసేపు ఆ చప్టామీదే రెస్టు తీసుకున్నారు. మళ్లీ జంతు సందర్శనకు వెళుతూంటే బావ “నేను కాసేపు పడుకుంటాను మీరు వెళ్లిరండి” అని చెప్పి నిద్రపోయాడు.

“ఆయనకు శని ఆదివారాలు మధ్యాహ్నం నిద్ర అలవాటు” అన్నది అక్కయ్య.

నాలుగున్నరకు క్యాంటీన్‌లో టీలు తాగి బయటకు వచ్చారు. బయట పిల్లలకోసం బెలూన్స్‌, పీకలు, రబ్బరు బొమ్మలు అమ్ముతున్నారు. మేనల్లుళ్లకు అన్నీ కొనిచ్చాడు. చిన్నోడి బెలూన్‌ రెండు నిమిషాలకే ‘ఠప్‌’ మంది.

“నేనేం చేయకుండానే విరిగిపోయింది” అన్నాడు వాడు. వాడి భాషకు అందరికీ నవ్వొచ్చింది. ఇంకోటి కొనిచ్చాడు మామ. శశిగాడొప్పుకోలేదు. తనకు కావాలన్నాడు.

డైరెక్ట్‌ బస్‌ ఎక్కి జేమ్స్ స్ట్రీట్‌లో దిగి ఇంటికి వెళ్లారు. అక్కడే బావ తమ బ్యాంకు భవనాన్ని చూపించాడు.

మర్నాడు పొద్దున్నే తయారై ఇమ్లీబన్ బస్టాండు వెళ్లి కర్నూలు బస్సెక్కాడు పతంజలి.

బస్సు దిగి ‘సక్సెస్‌’కు వెళ్లేసరికి ఒంటిగంటయ్యింది. జడ్‌చర్లలో టిఫిన్‌ చేశాడు. ముని అన్నం వండి టమోటా పప్పు చేసి పతంజలి కోసం ఎదురుచూస్తున్నాడు. ఉస్మాన్‌ భోజనానికి వెళ్లాడు. పతంజలి ఫ్రెష్‌ అయ్యేలోపు ముని గీతాభవన్‌కు వెళ్లి పెరుగు తెచ్చాడు. ముని వాళ్ల అమ్మ పంపిన ఎండు కొబ్బరి, వెల్లుల్లి పొడి ఉంది. భోజనం చేసి కాసేపు నడుంవాల్చారు. పరీక్షలు బాగా రాసినట్లు మునికి చెప్పాడు పతంజలి.

సాయంత్రం స్పోకెన్‌ ఇంగ్లీష్‌ బ్యాచ్‌వారికి తాను లేని ఐదారు రోజులు కాంపెన్సేట్‌ చేయడానికి రోజూ అరగంట అదనంగా తీసుకుంటానని చెప్పాడు.

రాత్రి క్లాసులయిన తర్వాత ముగ్గురూ ఆఫీసురూంలో కూర్చుని చర్చించుకుంటారు. ఆ రోజు చర్చలో మైసూరు యూనివర్సిటీ డైరెక్ట్‌ ఎమ్‌.ఎ. వాళ్ల నుండి స్టడీ మెటీరియల్‌ కోసం ఆర్డర్స్‌ ఇంక రానట్లేనని అనుకున్నారు. రోనియో తీసినవి కొద్దిగా మిగిలాయి. అవీ స్టెన్సిల్‌ కట్‌ చేసిన పేపర్లు ఒక అట్టపెట్టెలో పెట్టి జాగ్రత్తగా దాచారు.

పతంజలికి ఒక ఆలోచన వచ్చింది. మరో మూడు నెలల్లో సెవెన్త్‌ టెన్త్‌ వారికి పబ్లిక్‌ పరీక్షలు వస్తాయి. వాళ్లకు బిట్‌ ప్రశ్నలు కీలకం. అన్ని సబ్జెక్టులకు కలిపి వెయ్యి బిట్‌ ప్రశ్నలు. వాటి సమాధానాలు తయారు చేసి, పుస్తకాలుగా ముద్రించి, స్కూళ్లకు తీసుకొని వెళ్లి అమ్ముకుంటే ఎలా వుంటుందనేది పతంజలి ప్రతిపాదన. మొదట ఒక వెయ్యి కాపీలు వేసి ట్రయల్‌ చూస్తే తెలుస్తుంది. జనవరి మొదటివారంలో సేల్స్‌కు వెళ్లేలా ప్లాన్‌ చేసుకోవాలి. ముగ్గురూ ఒకేసారి కాకుండా ఇద్దరు ఇన్‌స్టిట్యూట్‌ చూసుకుంటే, ఒక్కరు స్కూలుకు వెళ్లి అమ్మాలి.

సెవెంత్‌, టెంత్‌ టెక్ట్స్‌ బుక్స్‌, బిట్‌ బ్యాంక్స్‌ తెచ్చుకుని ముగ్గురూ, ఇరవై రోజుల్లో బిట్స్‌ తయారు చేశారు. కర్నూల్లో గౌస్‌ మండీ దగ్గరే ‘ఉజ్జ్వల’ పబ్లిషర్స్‌ వారి ఆఫీసుంది. వారొక మాసపత్రిక నడుపుతారు. వాళ్లను వెళ్లి విచారించాడు పతంజలి. వాళ్లు చెప్పిందేమంటే ఎ.పి.కి ముద్రణా రాజధాని విజయవాడ. మద్రాసులో తీసే సినిమాలకు కూడ నిర్మాతలు వాల్‌ పోస్టర్లను విజయవాడలో ప్రింట్‌ చేయించుకుంటారు. తెలుగు సాహిత్యంలోని నవలలు, కథా సంపుటాలు అసంఖ్యాకంగా విజయవాడలోనే ప్రింటవుతాయి. ఆఫ్‌ సెట్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీ విజయవాడలో ఉంది. హైదరాబాదులో కూడా లేదు. కాబట్టి విజయవాడలో ఐతే నాలుగు రోజుల్లో ప్రింటింగ్‌ బైండింగ్‌ కూడ చేసిస్తారు. చాలా చౌకగా కూడా చేస్తారు.

‘ఉజ్జ్వల’ అధినేత శ్యామసుందర్‌గారు విజయవాడకు ట్రంక్‌ కాల్‌ చేసి తనకు తెలిసిన ప్రింటింగ్‌ ప్రెస్‌ వారితో మాట్లాడారు. ‘అరుణోదయ ప్రింటర్స్‌ అండ్‌ బైండర్స్‌’ అట. ఏలూరు రోడ్‌లో ఉంటుందట. ఆ యజమాని ఫోను పతంజలికిమ్మన్నాడు. ఆయన పేరు లెనిన్‌ అట. పతంజలి రిసీవర్‌ తీసుకొని ఆయనతో మాట్లాడాడు.

“లెనిన్‌ గారు, నమస్తే నా పేరు పతంజలి. సక్సెస్‌ ట్యుటోరియల్స్‌ ప్రిన్సిపాల్‌ను”

“నమస్తే అండీ”

“మేము సెవెన్త్‌, టెంత్‌ వారికి వెయ్యి చొప్పున ఒక్కో తరగతికి బిట్స్‌ తయారు చేశాము. అవి బుక్స్‌గా ప్రింట్‌ చేయించాలి”

“తప్పకుండా. వెయ్యి బిట్లకు డైరెక్టుగా జవాబులు వ్రాశారా? లేక ఎ.బి.సి.డి అని అబ్జెక్టివ్‌ టైపులో వ్రాశారా?”

“అలా రాస్తే పేజీలు పెరుగుతాయని డైరెక్ట్ గానే వ్రాశామండి”

“అయితే వన్‌బై ఎయిట్‌ డెమ్మి సైజు బాగుంటుంది. ఒక్కో పేజీలో పదిహేను వచ్చినా డెభై పేజీల పుస్తకం అవుతుంది. పుస్తకం అందంగా ఖరీదుగా ఉండాలా?”

“లేదు సార్‌. పరీక్షల ముందు కొనుక్కుంటారు పిల్లలు. పర్మనెంట్‌గా ఉంచుకోరు.”

“అయితే వైట్‌ పేపరు వద్దు న్యూస్‌ ప్రింట్‌ వాడదాము. కవరు పేజీకి కూడా లైట్‌ కలర్‌ డ్రాయింగ్‌ షీట్‌ వాడదాం. తక్కువలో  అయిపోతుంది. మీరెన్ని కాపీలు వేయించాలని?

“వెయ్యి”

“మీకూ గిట్టదు మాకూ గిట్టదండి. ప్రూఫ్‌ సెట్టింగ్‌కు వెయ్యికైనా పదివేలకయినా ఒకటే ఛార్జి వేస్తాము. ప్రింటింగ్‌ ఛార్జీలే సంఖ్యను బట్టి మారేది. కనీసం మూడు వేల కాపీలు వేద్దాం.”

“సుమారు ఎంత ఖర్చు రావొచ్చండి?

“బైండింగ్‌తో సహా మీకు ఒక్కో కాపీ రూపాయి పావలా పడుతుంది. మీరు ఐదు రూపాయలకు అమ్మవచ్చు.”

“ఆర్డరిచ్చిన ఎన్నిరోజులకిస్తారు?”

“మీరు ఈ రోజు ఆర్డరిస్తే మూడో రోజు సాయంత్రానికల్లా యిచ్చేస్తామండి. ఒకేసారి పదహారు పేజీలు సెట్‌ అవుతాయి సార్‌”

“మేం నిరుద్యోగలం సార్‌. మీరు మాకు సహాయం చేయాలి”

“రండి మాట్లాడదాం”

శ్యామసుందర్‌కు మరీ మరీ కృతజ్ఞతలు చెప్పాడు పతంజలి. ట్రంక్‌ కాల్‌కు అయిన డబ్బు ఎంతయిందని అడిగి, ఇవ్వబోతే సున్నితంగా తిరస్కరించాడు.

ఇన్‌స్టిట్యూట్‌కు వచ్చి స్నేహితులతో చర్చించాడు. ఆరువేల కాపీలు ఏడు వేల ఐదువందలు అవుతుంది. విజయవాడలో ఖర్చులు ఇంకో ఐదు వందలు వేసుకున్నా ఎనిమిదివేలు. పుస్తకం ధర ఐదు రూపాయలు పెట్టినా ముఫై వేలు వస్తాయి. అంటే ఇరవై వేలదాకా లాభం వస్తుంది.

పతంజలికి ఎప్పటినుండో ఒక ఆలోచన ఉంది. ఎయత్‌, నైంత్‌, టెంత్‌ వాళ్లకు ఇంచుమించు ఇంగ్లీషు గ్రామర్‌ ఒక్కలాగే ఉంటుంది. మూడు తరగతులకూ పనికొచ్చేలా గ్రామర్‌ ఎక్సర్‌సైజెస్‌ విత్‌ ఆన్సర్‌ తయారు చేస్తే? సిననిమ్స్‌, అంటానిమ్స్‌, యాక్టివ్‌ పాసివ్‌ వాయిస్‌, డిగ్రీస్‌ ఆఫ్‌ కంపారిజన్‌, ఇన్‌డైరెక్ట్‌ స్పీచ్‌, కాంప్రెహెన్షన్‌ పాసేజెస్‌, పంక్షుయేషన్‌, మ్యాచింగ్‌, ఇలా క్లుప్తంగా రూల్స్‌తో సహా చేయాలి. వంద పేజీలలో వస్తుంది. అంటే తన చేతి వ్రాతలో రెండు వందలకు పైగా.

ఎలాగూ స్కూళ్లకు వెళతాము. విజయవాడ ఖర్చులు కూడ కలిసివస్తాయి. అది కొంచెం ఎక్కువ పేజీలు వస్తుంది కాబట్టి ఏడు రూపాయలు పెట్టవచ్చు.

ఆరోజే నరసింహస్వామిని ధ్యానించి రాత్రింబగళ్లు శ్రమించి తయారుచేశాడు. పది రోజుల్లో పూర్తయింది. ఇంగ్లీష్‌ గ్రామర్‌ పతంజలికి కొట్టిన పిండి. గ్రామీణ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని అతి సులభంగా అర్థమయ్యేలా టెక్స్ట్‌ట్యుయల్‌ ఎక్సర్‌సైజెస్‌, మరికొన్ని అదనంగా తయారు చేశాడు. రెండు వందల ముఫ్ఫై పేజీలు వచ్చింది.

మంచి రోజు చూసుకొని, సాయంత్రం విజయవాడ బస్సెక్కాడు. పెట్టుబడికి ఢోకాలేదు. మైసూరు ఎమ్‌.ఎ విద్యార్థుల పుణ్యమా అని వాళ్ల దగ్గరే బ్యాంకులో డబ్బుంది. అందులో నుండి పదిహేను వేలు డ్రాచేసి పెట్టుకున్నాడు. మిగతా క్లాసులన్నింటికీ సమస్యలేదు. స్పోకెన్‌ ఇంగ్లీష్‌వారికి ఐదు రోజులకు టెస్ట్‌లు తయారు చేసి మునికిచ్చాడు.

సాయంత్రం 7 గంటలకు కర్నూలు వదిలింది బస్సు. ఆత్మకూరులో తొమ్మిదిన్నరకు భోజనానికి ఆపాడు. భోజనం పరమ చెత్తగా ఉంది. ఆత్మకూరు తర్వాత నల్లమల అడవి ప్రారంభమైంది. అడవిలో పదకొండు గంటలకు ఒక చెక్‌పోస్టు దగ్గర బస్సులు, ఇతర వాహనాలన్నీ ఒక గంట ఆపి, ఒక పోలీసు ఎస్కార్టు వాహనం తోడిచ్చి, వదిలారు. దోర్ణాల, వినుకొండ, నరసరావుపేట, గుంటూరు మీదుగా ఉదయం 6 గంటలకు విజయవాడ చేరింది. ఒళ్లు హూనమయింది పతంజలికి. దాదాపు పన్నెండు గంటల ప్రయాణం. నరసరావుపేట వరకు సింగిల్‌ రోడ్డే. అది పెద్ద పెద్ద గుంతలు పడి భయంకరంగా ఉంది. ఏదైనా వాహనం ఎదురొస్తే అంతే. లారీవాడయితే రోడ్డు దిగడు. వాగ్వివాదం.

పతంజలి ప్రక్కన ఒక పెద్దాయన కూర్చున్నాడు. “కర్నూలు నుండి వస్తున్నారా? ఈ రూటు నాకు ఊహ తెలిసినప్పటినుండి ఇంతే” అన్నాడు.

“డైరెక్ట్‌ బస్‌ కదా హాయిగా వెళ్లిపోవచ్చునని అనుకున్నానండీ”

“చూస్తున్నారుగా ఎంత హాయిగా ఉందో! మీరసలు రైలులో రావలసింది. కర్నూలు నుండి ద్రోణాచలం (డోన్‌) జంక్షన్‌కు వచ్చారంటే మీకు గదగ్‌ ప్యాసింజరు, గుంటకల్‌ ప్యాసింజరు ఉన్నాయి. హాయిగా పడుకొని తెల్లవారు జామున ఐదు గంటలకు గుంటూర్లో దిగొచ్చు. ఐదున్నరకు గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ చేరుకోవచ్చు. అది తప్పిపోయినా బస్టాండుకు పోతే విజయవాడకు ప్రతి అరగంటకు నాన్‌-స్టాప్‌ బస్సులుంటాయి” అన్నాడాయన.

“ఈసారి నుండి అలాగే చేయాలి మరి” అన్నాడు పతంజలి.

బస్టాండులో దిగి ఏదయినా లాడ్జికి తీసుకొని పొమ్మని చెప్పి రిక్షాలో ఎక్కి కూర్చున్నాడు. ఏలూరు రోడ్డులోనే ‘మాడరన్‌ లాడ్జి’ దగ్గర రిక్షా ఆపాడు. పతంజలి అతనికి డబ్బిచ్చి, బ్యాగ్‌ తీసుకొని లోపలికి నడిచాడు. పేరుకు మాడరన్‌ గాని చాలా పాత భవనం. కానీ శుభ్రంగా ఉంది. సింగిల్‌ రూం కావాలని కౌంటర్లో ఉన్నతన్ని అడిగాడు. అటాచ్‌డయితే పదిహేను, లేకపోతే పదిరూపాయలని చెప్పాడతను “ముందు రూము చూసి రండి” అన్నాడు.

పతంజలి మెట్లెక్కి, బాయ్‌తో సహా వెళ్లి మొదటి అంతస్తులోని రూం చూశాడు. బాగానే ఉంది. గోడకు మంచం ఆనించే వేశారు. సింగిల్‌ కాట్‌. మంచం దిగితే ఇటువైపు గోడ రెండడుగల దూరం కూడ లేదు. ఒక మూల అద్దం బిగించి ఉంది. ఒక చెక్క కుర్చీ చేతులు లేనిది ఒక చిన్న టీపాయి ఉన్నాయి. తలుపు వెనక హ్యాంగర్‌ ఉంది.

“బాత్‌రూంలు?” అనడిగాడు.

“నడవా చివర సార్‌!” అన్నాడా అబ్బాయి. వెళ్లి చూశాడు. నడవా చివర రెండు వైపులా నాలుగు బాత్‌రూంలు నాలుగు లెట్రిన్స్‌ విడివిడిగా ఉన్నాయి. దుర్వాసన లేదు. కొళాయిల్లో నీరు ఫోర్సుగా వస్తూంది.

‘నాలుగు రోజుల భాగ్యానికి ఇది చాలు’ అనుకుంటూ క్రిందికి వెళ్లి రిజిస్టరులో వివరాలు వ్రాసి నలభై రూపాయలు అడ్వాన్స్‌ యిచ్చాడు. బాయ్‌ పతంజలి బ్యాగ్‌ తీసుకొచ్చి రూములో పెట్టి, వెళ్లిపోకుండా నిలుచున్నాడు.

పతంజలి ప్రశ్నార్థకంగా అతని వైపు చూశాడు.

“కంపెనీ కావాలాసార్‌! అన్నాడు అర్థవంతంగా నవ్వుతూ.

పతంజలికి మొదటి అతడు చెబుతున్నది అర్థం కాలేదు.

“కంపెనీ ఏమిటి.” అన్నాడు.

“అమ్మాయిలు సార్‌, ఫ్యామిలీ టైపు కావాలంటే ఉన్నారు. కాలేజీ అమ్మాయిలు కూడ సార్‌. మీరు చూస్తానంటే ఆల్బమ్‌ తెస్తాను.”

పతంజలి కోపంగా “అక్కర్లేదు వెళ్లు” అని కసిరాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here