సాఫల్యం-42

4
11

[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[వసుధ, పతంజలిల దాంపత్యం అనురాగపూర్వకంగా సాగుతోంది. పాణితో కలిసి చిరంజివి సినిమాకి వెళతారు. తన భర్త కూడా చిరంజీవిలానే సెల్ఫ్-మేడ్ మ్యాన్ అని అంటుంది వసుధ. పాణిని కూడా ఆ ప్రశంస సరైనదే అంటాడు. కర్నూలులో కాపురం పెడతారా దంపతులు. మల్లినాధ దినాదినాభివృద్ధి చెందుతూ, తండ్రికి పూర్తి విశ్రాంతి కల్పించాడు. మహిత డిగ్రీ సెకండియర్‌లోకొచ్చింది. బావ రామ్మూర్తి సాయంతో పాణినిని ఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీలో చేర్పించి హాస్టల్‌లో దింపుతాడు పతంజలి.  ఆరు నెలల తరువాత జె.ఎల్. పరీక్ష ఫలితాలు వస్తాయి. ఇంగ్లీష్‌ సబ్జెక్టు జోన్‌ ఫోర్‌లో తన నంబరు వెతుకుతాడు పతంజలి. కానీ నెంబరు కనిపించక నిరాశ చెందుతాడు. అయితే, ప్రతిభ ఆధారంగా పతంజలిని జోన్ వన్‍కి (ఉత్తరాంధ్ర జిల్లాలకి) ఎలాట్ చేశారని కంబగిరి రెడ్ది ఉత్తరం రాస్తాడు. మార్కండేయ శర్మ కాస్త వ్యతిరేకించా, పతంజలి నచ్చజెప్పడంతో మెత్తబడతాడు. ఉత్తరాల ఈ వార్త తెలుపుతూ బడేమియా గారికి, చంద్రమౌళి గారికి కృతజ్ఞతలు తెలుపుతాడు. బదులుగా బడేమియా గారు ఉత్తరం రాస్తూ, ఆలస్యం చేయకుండా ముందు ఉద్యోగంలో చేరమనీ, లేదంటే సీనియారిటీ పోతుందనీ, జోన్ మారే విషయం తరువాత చూడవచ్చని చెప్తారు. రాధా సార్‌కి వార్త చెబితే ఆయన బాగా సంతోషించి, త్వరగా జాయిన్ అవమని చెప్తారు. సక్సెస్ ట్యూటోరియల్స్ భాగస్థులైన ముగ్గురు వచ్చిన ఆదాయాన్ని సమానంగా పంచుకుంటారు. ఉస్మాన్‌కు ఆదోనిలో ఎయిడెడ్‌స్కూల్లో టీచరుగా వచ్చే అవకాశముందని తెలుస్తుంది. షాపును ముని తీసుకుంటానంటాడు. సక్సెస్ ట్యూటోరియల్స్ సంస్థను దేవ సహాయం సారు కజిన్స్ టేకోవర్ చేస్తారు. – ఇక చదవండి.]

1982

[dropcap]వా[/dropcap]రం రోజుల్లో సర్వీస్‌ కమీషన్‌ నుండి, మరో నాలుగు రోజుల్లో ఆర్‌.జె.డి రాజమండ్రి వారి నుండి ఆర్డర్స్‌ వచ్చాయి. శ్రీకాకుళం జిల్లా ‘పలాస’ అనే ఊరికి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో, జూనియర్‌ లెక్చరర్‌ ఇన్‌ ఇంగ్లీష్‌గా పోస్టింగ్‌ యిచ్చారు. జాయిన్‌ అవడానికి నలభై ఐదు రోజులు టైమిచ్చారు.

వెంటనే జాయిన్‌ అయితే ఉత్తరోత్తరా ప్రమోషన్లకు మంచిదని శ్రేయోభిలాషులు చెప్పిన మేరకు పలాసకు ప్రయాణమయ్యాడు పతంజలి. రైల్వే స్టేషన్‌కు వెళ్లి విచారిస్తే విజయవాడ – హౌరా మార్గంలో ఆ ఊరు ఉందని, చాలా పెద్ద స్టేషనని, సబ్‌ డివిజినల్‌ కేంద్రమనీ చెప్పారు. విశాఖపట్నం నుండి దాదాపు రెండు వందల కి.మీ. దూరంలో ఉంది పలాస. శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పట్టణాలలో అదొకటి. ఒరిస్సా బార్డరు ఆ వూరికి కేవలం అరవై కి.మీ దూరంలోనే ఉంటుంది. జాతీయ రహదారి (మద్రాసు – కలకత్తా) ఆ ఊరి మీదుగా వెళుతుంది. హౌరా వెళ్లే అన్ని రైళ్లూ అక్కడ ఆగుతాయి.

వసుధను వెల్దుర్తిలో దింపి, డోన్‌లో గుంటూరు ప్యాసింజరెక్కాడు పతంజలి. రెండు రోజులకు ముందే కర్నూల్లో యిల్లు ఖాళీ చేశారు. గుంటూరు నుండి నాన్‌స్టాఫ్‌ బస్సులో విజయవాడ చేరుకున్నాడు. దారిలో మంగళగిరి నృసింహాలయశిఖరానికి నమస్కరించాడు. సత్యనారాయణపురంలో వాగ్దేవక్కయ్య వాళ్లిల్లు చేరుకొనేసరికి ఎనిమిదయింది. ముందే రామ్మూర్తి బావకు తాను వస్తున్నట్లు  జాబు రాసి ఉన్నాడు.

బావ టిఫిన్‌ చేసి, బ్యాంకుకు బయలు దేరుతున్నాడు. వాళ్లు హైదరాబాద్‌ నుండి ఇల్లు మారి, విజయవాడకు షిప్ట్‌ అయ్యి పదిరోజులు కూడా కాలేదు.

“ప్రిన్సిపాల్‌ కాస్తా లెక్చరర్‌ అయ్యాడన్నమాట!” అన్నాడు బావ. “నేను ముందే చెప్పాను కదరా నీకు కర్నూలుతో ఋణం తీరిపోనుందని” అని గుర్తు చేశాడు. “దిసీజ్‌ ఓన్లీ బిగినింగ్‌! గో అహెడ్‌ మైడియర్‌ బ్రదరిన్లా!” అంటూ భుజం తట్టాడు.

“ఎల్లుండి మంచి రోజు అని నాన్న చెప్పారు బావా! నేను రేపు రాత్రికల్లా పలాస చేరుకోవాలి” అన్నాడు పతంజలి.

“నేను బ్యాంకులో మా వాళ్లను కనుక్కుంటానులే. శ్రీకాకుళంవాడే ఒకాయన నా దగ్గర క్లర్క్‌గా చేస్తున్నాడు. నీవు రెస్ట్‌ తీసుకో. మధ్నాహ్నం నేను భోజనానికి వచ్చినపుడు నీ ప్రయాణం ఎలా సాగాలో చెబుతాను” అని బావ బ్యాంకుకు వెళ్లిపోయాడు.

పతంజలి స్నానం చేసి అక్క పెట్టిన పొంగణాలు(ఇది రాయలసీమకు ప్రత్యేకమైనవంటకం. దోసపిండిలో పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ,పచ్చికొబ్బరి కలిపి గుంతలున్న పెనంలొ  గుంతల్లో పిండివేసి రెండువైపులా కాలుస్తారు) తిన్నాడు. పెద్దల్లుడు స్కూలుకు వెళ్లిపోయాడు. చిన్నవాడిని ఈ సంవత్సరం చేర్చాలని అక్క చెప్పింది. అక్కయ్యకు కూరగాయలు తరిగిచ్చాడు. కారం వేయకుండా చేసిన గోళీకూర పప్పు, బూడిదగుమ్మడికాయతో మజ్జిగ పులుసు, కందిపచ్చడి చేసింది వాగ్దేవి. ఉప్పు మిరపకాయలు, మినప వడియాలు వేయించింది. కాసేపు పడుకున్నాడు.

రెండు గంటలకు బావ వచ్చాడు. అందరూ భోంచేశారు. “నీవు వస్తే వంట బ్రాహ్మాండంగా చేస్తుందిరోయ్‌ మీ అక్కయ్య!” అన్నాడు బావ.

“అంటే రోజూ మీకు బాగా చేయడం లేదా?” అన్నది అక్కయ్య

“ఎంతైనా తమ్ముడి తర్వాతే మొగుడు కదా! రోజూ ఉండేవాడి కోసం ప్రత్యేకంగా ఏం చేస్తారు?”

“చూడరా ఆయన మాటలు! ఎంత చేసినా గుర్తింపులేదు”

“నిన్ను ఉడికించాలని అట్లా అంటాడులేవే బావ!” అన్నాడు పతంజలి.

“కోపములో ఉన్న నీ అందమును చూడవలెనని తప్ప, నాకు వేరొక ఉద్దేశము లేదు హృదయేశ్వరీ!”

“కోపంగా ఉన్నప్పుడు అందమేమిటి నా ముఖం!” అంటూ నవ్వింది.

అక్కయ్య తానూ వసుధా వీళ్లలాగే కొనసాగాలని పతంజలి మనసులో నిర్ణయించుకున్నాడు.

“ఆ! నీ సంగతి కనుకున్నానోయ్‌! రేపు ఉదయం ఆరున్నరకు మద్రాసు – హౌరా మెయిలుందట. అది పలాసకు సాయంత్రం ఐదున్నరకు చేరుతుందట. రేపు రాత్రికి చేరుకుంటావు. ఎల్లుండి పతంజలి గారు జె.యల్‌. ఇన్‌ ఇంగ్లీషుగా జాయినవుతారు” అన్నాడు బావ.

బావకు బ్యాంకులో పనిభారం చాలా ఎక్కువగా ఉందట, రాత్రి యింటికి వచ్చేటప్పటికి తొమ్మిదవుతూందట. బాగా అలసిపోతూన్నాడని అక్కయ్య చెప్పింది. “ఈరోజు ఏడుగంటలకల్లా వచ్చేస్తాను. అందరూ రడీగా ఉండండి. కనకదుర్గమ్మ గుడికి వెళదాం” అని చెప్పి బ్యాంకుకు వెళ్లిపోయాడు బావ.

రాత్రి అందరూ ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మను దర్శించుకున్నారు. కొండ దిగే సరికి తొమ్మిదయింది.

“ఇప్పుడు కొత్త గెజిటెడ్‌ ఆఫీసరు గారి గౌరవార్ధం విందు ఏర్పాటు చేయడమయినది” అని ప్రకటించాడు బావ. గాంధీనగర్‌లో ఉన్న ఒక ఎ.సి. రెస్టారెంటుకు వెళ్లారు. దాని పేరు ‘సురుచి’. పుల్కాలు, కాబూలీ శనగల కుర్మాకు ఆర్డరిచ్చాడు బావ. తర్వాత వెజిటబుల్‌ బిర్యానీ, చివరగా పెరుగువడ. బిల్లు పతంజలే చెల్లించాడు.

“అదేమిట్రా, మీ బావ యిస్తారులే” అన్నది.

“లేదక్కా, నాకు మంచి ఉద్యోగం వచ్చిన సందర్భంలో నేనిస్తున్న పార్టీ అనుకోండి” అన్నాడు పతంజలి.

“మరి నాకు మేనేజర్‌గా ప్రమోషన్‌ వచ్చింది కదా!” అన్నాడు బావ.

“మీతో నేను పోటీ పడగలనా బావా?” అంటే

“అయాం ప్రౌడ్‌ ఆఫ్‌ యు,” అంటూ బావమరిదిని దగ్గరకు తీసుకున్నాడు ఆప్యాయంగా.

“సరేగాని, మామ ఒప్పుకున్నాడా నీవు వెళ్లడానికి?”

“ముందు ఒప్పకోలేదు. చాలా దూరం కదా అన్నాడు. ఉద్యోగం మంచిది నాన్నా. పైగా నాకు ఇష్టమైన వృత్తి అని బ్రతిమిలాడాను. కొంత గారాబం కూడ చేశాను. చివరికి ఒప్పుకున్నాడు.”

“ఈ చదువులూ, ఉద్యోగాల పట్ల అవగాహన లేక సగం, దశరధునికి శ్రీరాముడి మీద ఉన్నట్లుగా నీ మీద ఉన్న ప్రేమ సగం ఆయన్ను అలా చేశాయి రోయ్‌. ఒక్కోసారి ప్రేమ ఎక్కువయినా, అది అభివృద్ధి నిరోధకమవుతుందనడానికి మామే నిదర్శనం.”

మరునాడుదయం ఐదుకే నిద్రలేచి, స్నానాలు, కాఫీలు ముగించుకొని ఆరులోపే విజయవాడ స్టేషన్‌ చేరుకున్నారంతా. వద్దన్నా అక్కయ్య వినలేదు. సరిగ్గా ఆరున్నరకు మెయిల్‌ వచ్చింది. జనరల్‌ కంపార్టుమెంట్లు క్రిక్కిరిసి ఉన్నాయి. రైలు విజయవాడలో దాదాపు ఇరవై నిమిషాలుంటుంది. ఒక స్లీపర్‌ క్లాస్‌ పెట్టె దగ్గర నిలబడి ఉన్న కోచ్‌ కండక్టర్‌ దగ్గరికి వెళ్లి ‘రిక్వెస్ట్‌’ చేశారు.

‘పలాస’ అనగానే ఆయన “మీరు యస్‌ ఎయిట్‌లో సెవెంటీటులో కూర్చోండి” అని రశీదు రాసిచ్చాడు. రిజర్వేషన్‌ సహా అరవై ఏడు రూపాయలయింది. ముందే జనరల్‌ టికెట్‌ కొనుక్కున్నాడు.

పతంజలివి రెండు బ్యాగులు. యస్‌ ఎయిట్‌లో వెళ్లి బెర్తు మీద పెట్టి క్రిందికి దిగాడు.

“జాగ్రత్తరా! దూరాభారం పోతున్నావు” అన్నది అక్కయ్య. ఆమె కళ్లల్లో దిగులు.

“వాడింత వరకూ చేసిన పనుల ముందు ఈ ఉద్యోగం నల్లేరుమీద నడక. హి కెన్‌ మ్యానేజ్‌ థింగ్స్‌ ఎనీవేర్‌” అన్నాడు బావ.

రైలు కదులుతూంటే చేయి ఊపుతూన్న అక్కయ్య, బావ, మేనల్లుళ్లు దూరమవుతూంటే, కళ్లు చెమ్మగిల్లాయి పతంజలికి.

రాజమండ్రిలో టిఫిన్‌ చేశాడు. ఇరువైపులా పచ్చని చేలు, తోటలు, కనువిందు చేస్తున్నాయి. కనుచూపు మేరంతా పొలాలే. ‘సస్యశ్యామలం’ అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూస్తున్నాడు. అన్నవరం దాటుతూండగా సత్యనారాయణస్వామి వారి గుట్ట, దేవాలయ గోపురాలు దర్శనమిచ్చాయి. ఒంటిగంటకు విశాఖపట్నం చేరుకుంది రైలు. అక్కడ పులిహోర పెరుగన్నం పొట్లాలు కొనుక్కుని తిన్నాడు. విశాఖలో రైలు దాదాపు అరగంట ఆగింది.

కాపేపు పడుకున్నాడు కానీ నిద్ర పట్టలేదు. మూడు గంటలకు రైల్లోనే అమ్మకానికి వచ్చిన చిన్న చిన్న ఉల్లిపాయ సమోసాలు కొనుక్కొని తిని టీ తాగాడు. సరిగ్గా నాలుగుంబావుకు రైలు ‘శ్రీకాకుళం రోడ్‌’ స్టేషన్‌లో ఆగింది. శ్రీకాకుళం టవును అక్కడికి పన్నెండు కిలోమీటర్లుంటుందనీ, స్టేషన్‌ ఉన్న ఊరిని ఆముదాల వలస అంటారనీ తెలుసుకున్నాడు.

తరువాతి స్టాప్‌ ‘పలాస’ అని కండక్టరు చెప్పాడు. ముఖం కడుక్కొని కూర్చున్నాడు. ఐదుంబావుకు ‘పలాస’ స్టేషను వచ్చింది. చాలా పెద్ద స్టేషను. కిటకిటలాడుతూంది. అటువైపు ప్లాటుఫారం మీద ‘జనతా ఎక్స్‌ప్రెస్‌ ఆగి ఉంది. బ్యాగులు పట్టుకొని ఓవర్‌ బ్రిడ్జి మీదుగా స్టేషను బయటకి వచ్చాడు. బయట రిక్షాలు ఆగి ఉన్నాయి. కర్నూలు రిక్షాల మాదిరి కాకుండా సీటు ఎత్తుగా, కాళ్లు క్రిందికి పెట్టుకోడానికి వీలుగా ఉన్నాయి.

“రండి బావూ! ఏడి కెల్లాలేటి?” అంటూ ఇద్దరు ముగ్గురు అడిగారు.

“నాకీ వూరు కొత్త. ఏదయినా లాడ్జికి వెళ్లాలి”

“రెండే నాడ్జీలండి ఈ వూల్లోని. కాశీబుగ్గలో ఒకటి. పలాసలో ఒకటి. తవురు యాడ దిగుతారోమరి!” అన్నాడొకడు.

“నేను పలాసకు వెళ్లాలి”

“పదండయితేను రూపాయివ్వండి. కాశీబుగ్గలో ఇంకోర్నెక్కించుకుంతే ముప్పావలా ఇద్దరుగాని”

“అవసరంలేదు. నాకు బ్యాగులున్నాయి కదా! నేనొక్కడినే వస్తాను”

రిక్షాలో వెళుతూంటే జాతీయ రహదారి క్రాస్‌ చేశారు. లారీల ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంది. షాపుల మీది బోర్డుల మీద ‘కాశీబుగ్గ’ అని వ్రాసి ఉంది.

“పలాస ఎంతదూరం?”

“ఆ ఎంతో దూరం నేదండిబాబు. రెండు మైల్లుంటాది. ఇవి రెండూర్లు బావు. ఇది కాశీబుగ్గ. అది పలాస తవురిదేవురు?”

“మాది కర్నూలు”

“ఈడ ఏంపనిమీదొచ్చినారో! ముకం సూత్తే జీడిపప్పు యాపారస్తుల్లా అగుపడరు”

“నేను పలాస గవర్నమెంట్‌ కాలేజీలో లెక్చరర్‌గా చేరడానికి వచ్చాను” రిక్షావాడు టక్కున రిక్షా పక్కకు తీసి ఆపి “అయబాబోయ్‌! తప్పయిపోనాదండి. తవురు నెచ్చేలేరు గారని తెలియక ఏదేదో మాటాడేత్తున్నానండి బాబూ. అయితేను ఒకటాలకించండి. పలాసలో నాడ్జింగు అంత బాగుండదండి. కాశీబుగ్గలోనే దిగండి తవురు. శీనివాస నాడ్జి అని బుగ్గకు పలాసకు మజ్జనుంటాది. కొత్తగా లెగిసిన నాడ్జి. సానా బాగుంటాది. నాకు అద్దరూపాయిప్పించండి సాలు”

రిక్షా శ్రీనివాస లాడ్జిముందాపాడు. రెండు బ్యాగులూ తెచ్చి రిసెప్షన్‌ వద్ద పెట్టాడు. పతంజలి అతనికి రూపాయినోటిచ్చాడు. అతడు అర్థరూపాయి తిరిగి యివ్వబోతుంటే “పరవాలేదులే ఉంచుకో” అన్నాడు. రిక్షా అతని ముఖం వికసించింది.

“వత్తాను బావు” అని వెళ్లిపోయాడు.

రెండే ప్లోర్లున్నాయి. సింగిల్‌ రూం విత్‌ అటాచ్‌డ్‌ బాత్‌ ఎనిమిది రూపాయలు. క్రిందే రూం ఇచ్చారు. రూంలో దిగి స్నానం చేసి ఫ్రెష్‌ అప్ అయ్యాడు పతంజలి. వాతావరణం ఉక్కపోతగా ఉంది. బయట చిన్న క్యాంటిన్‌ లాంటిది ఉంది. అక్కడ పొడుగ్గా ఉన్న బజ్జీలు వేస్తున్నారు. అవేమిటని అడిగితే “అరటికాయ బజ్జీ మాస్టారు!” అని జవాబు. మిరపకాయ బజ్జీలు అస్సలు చేయరట. రెండు అరటి కాయ బజ్జీలు తిన్నాడు. చాలా బాగున్నాయి. అరటికాయను నిలువుగా అంత పల్చగా తరగడం నేర్పే అనిపించింది. టీ కూడ తాగి రూములో ఎనిమిదిన్నరవరకు రిలాక్స్‌ అయ్యాడు.

ఎనిమిదిన్నరకు బయలుదేరి నడుచుకుంటూ కాశీబుగ్గ మూడు రోడ్ల జంక్షన్‌ చేరుకున్నాడు. రెండు భోజన హోటళ్లు కనిపించాయి రెండిట్లో వెజ్‌, నాన్‌ వెజ్‌ కలిసి ఉన్నాయి. ‘జగన్నాథ్‌ విలాస్‌’ లోకి వెళ్లాడు. వెజిటేరియన్‌ మీల్స్‌ నాలుగు రూపాయలు. టికెట్‌ తీసుకొని కూర్చున్నాడు. బటాణీ, బంగాళాదుంపల కూర, పల్చని పెసరపప్పు వడ్డించారు. నీళ్ల సాంబారు. పెరుగు పుల్లగా పల్చగా ఉంది.

“ప్రియ పచ్చడి కావాలా మాస్టారు? పావలా ఎగ్రస్ట” అన్నాడు సర్వరు. గోంగూర పచ్చడి కరెక్టుగా ఒక స్పూన్‌ వేసిపోయాడు. దాన్ని పప్పులో కలుపుకుంటే కొంచెం తినగలిగాడు. సాంబారు పెరుగు అస్సలు తినలేక పోయాడు. అన్నంకూడ లావుగా, బిరుసుగా ఉన్నాయి మెతుకులు.

కడుపు నిండలేదు. బయటకు వచ్చి కిళ్లీ కొట్టు వద్ద రెండరటిపళ్లు కొని తిన్నాడు. అవి కూడ లావుగా తక్కువ పొడవుగా ఉన్నాయి . చెక్కరకేళి రకమట. వాటి రుచి ఎలా ఉందంటే బియ్యం పిండి తడిపి కొద్దిగా చక్కెర కలిపి తిన్నట్లుంది.

నడుస్తూ లాడ్జికి వచ్చేసరికి ఒళ్లంతా చెమట. బనియన్‌ ఒంటికతుక్కుపోయింది. మళ్లీ స్నానం చేసి ఫ్యాన్‌ క్రింద కూర్చుంటే గాని మనసు కుదుట పడలేదు.

***

మరునాడు ఉదయం స్నానం చేసి బయట క్యాంటీన్‌లో టిఫిన్‌ చేశాడు. ఇడ్లీని కేకులుగా కోశారు. ఇడ్లీల మీదే పల్చని చట్నీ, బటాణీల కూర పోసి యిచ్చేశాడు. స్పూన్‌ లేదన్నాడు. రెండు ఇడ్లీ కేకులు తిని, పూరీ ఇమ్మన్నాడు. రెండు పూరీలు, వాటిమీదే గరిటెడు ఉప్మా వేసి, వాటి మీద మళ్లీ అదే చట్నీ, కూరవేశాడు. బటాణీలను ‘చెనిగలు’ అనడం గమనించాడు. మొత్తం మీద టిఫిన్‌ భోజనం కంటే నయమనిపించింది. ఈసారి నుండి వాటి మీద అన్నీ పోసేయకుండా ప్రక్కన వేరుగా ఇయ్యమంటే సరిపోతుందనుకున్నాడు.

తొమ్మిదికి తయారై, అపాయింట్‌మెంట్‌ ఆర్డరు సివిల్‌ సర్జను ఇచ్చిన మెడికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఒక ప్లాస్టిక్‌ కవర్లో పెట్టుకొని రిక్షా కోసం చూడసాగాడు. చాలా రిక్షాలు పలాస వైపు వెళుతున్నాయి. ఒక్కటీ ఖాళీగా లేవు. క్యాంటీనతడు అది గమనించి చెప్పాడు.

“మాస్టారూ, ఇక్కడ ఖాళీ రిక్షా దొరకదు. బస్టాండుకెలిపోండి”

బస్టాండు దగ్గరే. రెండు ఫర్లాంగులుంది. అక్కడ రిక్షాలు బయలుదేరుతున్నాయి. ఒక రిక్షాలో ఒకరు ఎక్కగానే రిక్షా అతను “చిటుకలేయ్‌” అని అరుస్తున్నాడు. చిటికెలు ఎందుకెయ్యమంటున్నాడో పతంజలికి అర్థం కాలేదు. అదే రిక్షాలో మరొకరు ఎక్కింతర్వాత అరవడం ఆపి రిక్షాను తీసుకొని వెళ్లిపోయాడు.

పతంజలికర్థమయింది. ఒకే రిక్షాలో ఇద్దరు అపరిచితులు ప్రయాణం చేయచ్చు. షేరింగ్‌ రిక్షా అన్నమాట. కాశీబుగ్గనుండి పలాసకు ఒక్కర్నే తీసుకుని వెళితే రూపాయి. ఇద్దర్నయితే రూపాయన్నర. అంటే షేరింగ్‌ వల్ల ఒక్కొక్కరికి పావలా తగ్గుతుంది. రిక్షావాళ్లు అరుస్తున్నది. “సీటు ఖాళీ” అని అన్నమాట. అది వారి యాసలో అపభ్రంశరూపమై” చిటుకలేయ్‌” అయ్యింది. పతంజలికి నవ్వు వచ్చింది.

పతంజలి ఒక రిక్షా ఎక్కి కూర్చోగానే ఇంకొకతను కూడ ఎక్కాడు.

“పలాసలో గవర్నమెంటు కాలేజి ఎక్కడండీ?” అనడిగాడు పక్కనున్నతన్ని.

“ఈడు మనల్ని దింపిన కాడ్నించి అరకిలోమీటరనుకోండి. రూపాయిచ్చేయండి ఆడే కాలేజి కాడ దింపేత్తాడు” అని సలహా చెప్పి, “మాట్టారిని కాలేజీకాడ దింపుమీ” అని రిక్షావాడికి అదేశమిచ్చాడు.

పలాస సెంటర్‌లో అతను దిగిపోయాడు. రిక్షావాడు పతంజలిని కాలేజి గేటుముందు దింపి రూపాయి తీసుకొని వెళ్లిపోయాడు. పెద్ద ఇనుపగేటు. దానిమీద ఆర్చ్. దానిమీద సిమెంటు పోత పోసిన అక్షరాలు. ‘ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, పలాస శ్రీకాకుళం జిల్లా’

పతంజలిని చూసి ఒకతను దగ్గరికి వచ్చి “ఎవరు కావాలండీ?” అనడిగాడు.

“ప్రిన్సిపాల్‌గారిని కలవాలి”

“మీరు కొత్తగా చేరడానికి వస్తున్న ఇంగ్లీషు మాస్టారు కదాండి? ఇయ్యాల మీరు జాయినవుతారని అనుకుంటున్నామండి బాబు. ఈరోజు మంచిది కదండి. ప్రిన్సిపాలు గారికి అర్జేడీ గారి నుంచి లెటరొచ్చీసినాది లెండి. పదండి బావూ ఎలదాం” అంటూ ప్రిన్సిపాల్‌ రూం వైపు తీసుకెళ్లాడు. ‘నా పేరు తవిటయ్యండి బావు. ఈడ అటెండర్ని” అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు.

“నా పేరు పతంజలి శర్మ” అంటూ తవిటయ్యకు షేక్‌ హ్యాండివ్వబోయాడు. తవిటయ్య తబ్బిబ్బు పడ్డాడు. “ఇదేంటండి బావు” అంటూ నమస్కరించాడు.

స్వింగ్‌ డోర్సు తెరుచుకొని లోపల అడుగుపెట్టి. “మే ఐ కమిన్‌ సర్‌?” అని అడిగాడు. పాతకాలం టేబులు వెనుక ఒక పెద్దాయన కూర్చొని ఉన్నాడు. రూమంతా చుట్ట వాసన వ్యాపించి ఉంది. టేబుల్‌ మీద చెక్క నేమ్‌ ప్లేట్‌మీద “నిష్టల సుబ్బారావు ఎమ్‌.ఎ. బి.ఇడి. ప్రిన్సిపాల్‌” అని ఉంది.

“రండి” అన్నాడాయన.

“నా పేరు పతంజలి శర్మ. కర్నూలు నుండి వస్తున్నాను. నన్ను ఇక్కడ ఇంగ్లీషు లెక్చరర్‌గా అపాయింట్‌ చేశారు” అంటూ ఆయనకు నమస్కరించాడు.

“కూచోండి” అని. “మీరు వైదీకులా, నియోగులా?” అని అడిగాడు. పతంజలి ఆశ్చర్యపోయాడు. తమాయించుకొని “వైదీకులమండి” అన్నాడు.

అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పరిశీలించాడు. ఒక తెల్ల కాగితం ఇచ్చి “జాయినింగ్‌ రిపోర్టు రాసివ్వండి. రెఫరెన్స్‌లో అర్డేజీ వారి ప్రోసీడింగ్స్‌ నంబరు ఇవ్వండి” అన్నాడు.

మూడు నిమిషాల్లో నీట్‌గా జాయినింగ్‌ రిపోర్టు రాశాడు పతంజలి. ఆయన దాన్ని చదివి మెచ్చుకోలుగా చూశాడు. బెల్‌ కొట్టి అటెండరును పిలిచి, “యు.డి.సి పట్నాయక్‌ గారిని రమ్మను” అన్నాడు.

కాసేపటికి ఒక నడివయస్కుడు వచ్చాడు. “యుడిసిగారు, ఈయన కొత్తగా మన కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్‌గా జాయిన్‌ అవుతున్నారు. చూడండి” అని, జాయినింగ్‌ రిపోర్టు మీద ‘అడ్మిట్‌ హిమ్‌’ అని గ్రీన్‌ యింక్‌తో రాసి సంతకం పెట్టాడు. “రండి మాస్టారూ,” అని ఆయన ఆఫీసుకు దారి తీశాడు. ఆఫీసులో ఒక యల్‌.డి.సి, ఒక టైపిస్టు, ఇద్దరి రికార్డు అసిస్టెంట్లను పరిచయం చేశాడాయన. వీళ్లుకాక ఒక అటెండరు, నైట్‌ వాచ్‌మన్‌, ఉన్నారని చెప్పాడు.

అటెండెన్స్‌ రిజిస్టరులో పతంజలి పేరు, డిజిగ్నేషను రాసి, ఒక సంతకం చేయమన్నాడు. తూర్పు వైపు తిరిగి కూర్చోమన్నాడాయన సంతకం చేసింతర్వాత చెప్పాడు.

“మాస్టారూ, ఈ క్షణం నుంచి మీరూ ఒక గజిటెడ్‌ ఆఫీసరు. ఇదే బిల్డింగ్‌లో హైస్కూలు, జూనియర్‌ కాలేజి నడుస్తున్నాయి. రెండింటికీ ప్రిన్సిపాల్‌ గారే అధిపతి. ఉదయం ఏడున్నర నుండి మధ్యాహ్నం పన్నెండు ఇరవై వరకు హైస్కూలు, మధ్యాహ్నం పన్నెండున్నర నుండి సాయంత్రం ఐదున్నర వరకు కాలేజి. మన స్ట్రెంగ్త్‌ ఎనిమిది వందలు. ఈ జిల్లాలో పెద్ద కాలేజీల్లో ఇదొకటి. మొత్తం పధ్నాలుగు మంది టీచింగ్‌స్టాఫ్‌. అందులో ఒకరు లైబ్రేరియన్‌, ఒక ఫిజికల్‌ డైరెక్టర్‌. ఇంగ్లీష్‌ లెక్చరర్స్‌ మీతో ఇద్దరు. ఎం.పి.సి. బైపిసి, హెచ్‌యిసి, సియిసి గ్రూపులున్నాయి. తెలుగు మీడియం” అని కాసేపు ఆగాడు. “అందరూ పన్నెండున్నరలోపు వస్తారు. మీరు కూడ అలా వస్తే చాలు. ఇంతకూ ఎప్పుడొచ్చారు? ఎక్కడ దిగారు?”

పతంజలి చెప్పాడు “నిన్న మెయిలుకు వచ్చాను సార్‌. శ్రీనివాస లాడ్జిలో దిగాను”

“మీకు పెళ్లయిందా?”

“అయ్యిందండి”

“అయితే త్వరగా ఫ్యామిలీ తెచ్చుకోండి. ఇక్కడ హోటళ్లలో మీరు తినలేరు.” అని గోడమీద గడియారం వైపు చూశాడు. “పదకొండు కావస్తుంది. మీరు వెళ్లి భోజనం చేసి రండి” అన్నాడు.

పతంజలి సెంటరుకు నడుచుకుంటూ వెళ్లాడు. భోజనం చేద్దామంటే భయమేసింది. ఒక చిన్న హోటల్లో దోసె తిన్నాడు. పరవాలేదనిపించింది. మళ్లీ కాలేజీ చేరుకున్నాడు. కాలేజీ ఆవరణలో పెద్ద పెద్ద వృక్షాలున్నాయి. ఒకవైపు పెద్ద మీటింగ్‌ హాలు లాంటిది కనబడింది. దానిలోకి వెళ్లి చూస్తే ఒక వేదిక, దాదాపు వెయ్యిమంది కూర్చునే వసతి కనబడ్డాయి. బిల్డింగ్‌ మీద ‘డొనేటెడ్‌ బై, కాష్యూ మర్చెంట్స్‌ అసోసియేషన్‌ పలాస’ అని రాసి ఉంది.

పన్నెండుంబావుకు స్టాఫ్‌ ఒకరొకరూ రాసాగారు. స్టాఫ్‌ రూములు మాత్రం వేరుగా ఉన్నాయి. పట్నాయక్‌ గారు ఒకాయనను పిలిచి, పతంజలిని పరిచయం చేశారు. పతంజలికి చెప్పారు.

“ఈయన తుంబనాధంగారని ఇంగ్లీష్‌ లెక్చరర్‌. మన జోన్‌లో సీనియర్‌ మోస్ట్‌. అకడమిక్‌ వర్కంతా ఈయనే చూస్తారు” అని చెప్పి, “మాస్టారూ ఈయనను స్టాఫ్‌ రూంకు తీసుకుని వెళ్లి మన వాళ్లందరికీ పరిచయం చేయండి. వివరాలు చెప్పండి” అని ఆయనకు చెప్పారు.

“రండి మాస్టారు” అంటూ ఆయన స్టాఫ్‌ రూంకు దారి తీశారు.

స్టాఫ్‌ రూం విశాలంగా ఉంది. మధ్యలో చాలా పెద్ద టేబులు. దానిమీద రెగ్జిన్‌ క్లాత్‌ పరచి ఉంది. టేబులు చుట్టూ చెక్క కుర్చీలు వేసి ఉన్నాయి. ఒక మూల పిజియన్‌ హోల్స్‌ చెక్క బీరువా ఉంది. ప్రతి సొరుగు మీద సబ్జెక్ట్స్‌ పేర్లు రాసి ఉన్నాయి. రూం మధ్యలో రెండు ఫ్యాన్లున్నాయి. ఒక మూల స్టూలు మీద స్టీలుది పెద్ద వాటర్‌ ఫిల్టరుంది.

తుంబనాధం గారిని చూసి అందరూ నమస్కారం చేశారు ఆయన వారితో ఇలా అన్నారు.

“అయామ్‌ వెరీ హ్యాపీ టు ఇంట్రడ్యూస్‌ మిస్టర్‌ పతంజలి శర్మ, ది న్యూలీ అపాయింటెడ్‌ ఇంగ్లీష్‌ జె.యల్‌” అంటూ ఒక్కొక్కరినీ పేరు పేరునా పరిచయం చేశాడు. అందరికీ చిరునవ్వుతో షేక్‌ హ్యాండ్‌ ఇచ్చాడు పతంజలి.

అందరూ డస్టర్లు, చాక్‌ పీసులు తీసుకొని క్లాసులకు వెళ్లిపోయారు. క్లాసులు లేని కొందరు మాత్రం ఉండిపోయారు. తుంబనాధంగారు టైంటేబిల్‌ పతంజలికిచ్చి చెప్పారు.

“మీకు వారానికి ఇరవై రెండు క్లాసులుంటాయి మాస్టారు. రోజూ మూడు కంపల్సరీ. బోత్‌ ఫస్ట్‌ అండ్‌ సెకండియర్స్‌కు వెళ్లాల్సుంటుంది. ఇంత వరకు ఇంగ్లీషు సెకండు పోస్టు నింపక నేను రోజూ వరుసగా ఐదు క్లాసులు తీసుకొనే వాడిని. మీరొచ్చారు కద. ఇక హ్యాపీ. ఇప్పుడు సెకండ్‌ సియిసికి వెళుదురుగాని పదండి” అంటూ ఆ రూంకు తీసుకెళ్లాడు. ఆయనను చూస్తూనే పిల్లలందరూ లేచి నిలబడి “గుడ్‌ ఆఫ్టర్‌నూన్‌ సార్‌” అన్నారు.

“గుడ్‌ ఆఫ్టర్‌నూన్‌. కూర్చోండి. కూర్చోండి. ఈ మాస్టారు మీకు ఈ రోజు నుండి ఇంగ్లీషుకు వస్తారు. ఈరోజే చేరారు. ఈయన పేరు పతంజలి శర్మ. ఆల్‌ ది బెస్ట్‌ మాస్టారు.” అని చెప్పి వెళ్లిపోయాడాయన.

క్లాసునంతా తేరిపార చూశాడు. కో-ఎడ్యుకేషన్‌. అబ్బాయిలు అమ్మాయిలు కలిసి వందమందికి పైగానే ఉన్నారు.

“డియర్‌ స్టూడెంట్స్‌, లెట్‌ మీ ఇంట్రడ్యూస్‌ మైసెల్ఫ్‌” అంటూ తనను గురించి క్లుప్తంగా చెప్పుకున్నాడు. ఇంటర్మీడియట్‌ సిలబస్‌ పతంజలికి కొట్టిన పిండి. ఒక అబ్బాయి వద్ద టెక్ట్స్‌ అడిగి తీసుకొని, “లెటజ్‌ స్టార్ట్‌ విత్‌ ది ప్రోజ్‌ లెసన్‌, ‘గుడ్‌ బ్రిక్స్‌’ రిటన్‌ బై సి. రాజగోపాలచారి” అంటూ, రాజాజీ గారిని గూర్చి ఇంట్రడక్షన్‌ ఇచ్చాడు. యువత దేశ నిర్మాణానికి ఉపయోగపడే మంచి యిటుకలు అనే కాన్సెప్ట్‌ను ఇరవై నిమిషాలు చక్కని ఇంగ్లీషులో మంచి ఉచ్చారణతో వివరించాడు. తరువాత ఐదు నిమిషాలు తెలుగులో వివరించాడు. ఆ రోజు జరిగిన నాలుగు పేరాగ్రాఫ్‌లలోని కఠిన పదాలను అందరితో అండర్‌లైన్‌ చేయించాడు. తర్వాత వాటికి బోర్డు మీద మీనింగ్స్‌ వ్రాసి బ్రాకెట్లో పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్‌ కూడ ఇచ్చాడు. చివరగా ఒక పేరా సెలెక్ట్‌ చేసి, బోర్డు మీద దాన్ని బేస్‌ చేసుకొని ఐదు కాంప్రెహెన్షన్‌ ప్రశ్నలు వ్రాశాడు. ఆ పేరా బాగా చదివి దానికి జవాబులు నోట్సులో వ్రాయమన్నాడు. పదినిమిషాలు టైమిచ్చి, ఆ పదినిమిషాలు సీట్ల వరుసల మధ్య నున్న ఖాళీలో పచార్లు చేస్తూ పర్యవేక్షించాడు.

“ధాంక్యూ స్టూడెంట్స్” అని చెప్పి బయటకు వచ్చాడు పతంజలి

రెండో పీరియడ్‌ క్లాసులేదు. స్టాఫ్‌ రూంలో ఉన్న కొందరు పతంజలితో మాటలు కలిపారు. తెలుగు మాస్టారు ‘అయ్యలు’ కూడ చాలా పెద్దవాడే. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ మాస్టార్లకు ప్రత్యేకంగా ల్యాబ్‌లున్నాయి. వాళ్లు ఎక్కువగా స్టాఫ్‌ రూంలోకి రారట. వాళ్లందర్నీ ల్యాబ్‌కెళ్లి పరిచయం చేసుకున్నాడు. తనలాగా డైరెక్ట్ గా ఎ.పి.పియస్‌.సి ద్వారా రిక్రూట్‌ అయిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు గ్రహించాడు పతంజలి. ఎక్కువమంది హైస్కూలు టీచర్లుగా చేస్తూ, పి.జి చేసి జె.యల్స్‌గా ప్రమోట్‌ అయినవాళ్లే.

ల్యాబ్‌ల నుండి స్టాఫ్‌ రూంకు వెళుతూంటే ఎత్తుగా లావుగా ఉన్న ఒకతను ఎదురొచ్చి,

“మీరేనా పతంజలి? నా పేరు మల్లికార్జున్‌, పి.డి.ని” అంటూ పరిచయం చేసుకున్నాడు.

“నేనూ పోయినేడే జేరినా. మాది డోన్‌ దగ్గర ప్యాపిలిలే.”

పతంజలికి ప్రాణం లేచివచ్చింది.

“మాది వెల్దుర్తి సార్‌!” అన్నాడు.

మల్లికార్జున్‌ పతంజలి వాటేసుకున్నాడు. “ఇంకా సారేంది సార్‌! ‘మల్లీ’ అని పిల్చు. నిన్ను ‘సామీ’ అంటా. ఏందో దేవుడు మనల్ను ఈడ దెచ్చిబాడేశినాడు”

రాయలసీమ భాష అందునా కర్నూలు స్లాంగ్‌ వింటుంటే చెవికింపుగా ఉంది పతంజలికి. ఎంతయినా సొంత ప్రాంతం, సొంత ఊరంటే ప్రాణంపెట్టని వాళ్లెవరు? శ్రీరామచంద్రడంతటివాడే స్వయంగా ఒప్పుకున్నాడు గదా, ‘జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ అని.

మల్లి పతంజలికంటె రెండేళ్లు పెద్దవాడు. వాళ్ల నాన్న లారీ ఓనరట. ఆయనే డ్రైవరు కూడా. మల్లికి ఇద్దరూ ఆడపిల్లలే. మేనమామ కూతుర్నే చేసుకున్నాడట. ఆమెది కర్నూలు ప్రక్కనే ఉన్న కల్లూరు. మామ జమ్మలమడుగు ఆర్‌.డి.వోగా పనిచేస్తాడట. కాశీ బుగ్గలోనే పోలీస్‌ కాలనీలో కుటుంబంతో ఉంటున్నాడు మల్లి. యస్‌వి యూనివర్సిటీలో ఎమ్‌.పి.ఇ.డి చేశాడు. సర్వీస్‌ కమీషన్‌ క్యాండిడేట్‌ . యూనివర్సిటీ వాలీబాల్‌ టీముకు కెప్టెన్‌గా ఉండినాడట. ఇప్పుడు పలాస – కాశీబుగ్గ క్రికెట్‌ అసోసియేషన్‌కు జనరల్‌ సెక్రటరీగా చేస్తున్నాడు.

మాట తీరు, వ్యవహారం అంతా రఫ్‌ అండ్‌ టఫ్‌గా కనిపించాడు మల్లి.

మూడో పీరియడ్‌ ఫస్టియర్‌ సైన్సెన్‌కు వెళ్లాడు పతంజలి. లాంగ్వేజెస్‌కు మాత్రం ఎం.పి.సి. బైపిసి వాళ్లను క్లబ్‌ చేస్తారు. వాళ్లకు సరోజినీనాయుడు ‘బ్యాంగిల్‌ సెల్లర్స్‌’ పద్యం ఎక్స్‌ప్లెయిన్‌ చేశాడు. ఆ పీరియడ్‌ తర్వాత ఇంటర్వల్‌.  మల్లి వచ్చి టీ తాగి వద్దాం రమ్మని పిలిచాడు బయట రోడ్‌ నానుకొని చిన్న టీ కొట్టుంది. చిన్న  స్టీలు రోలులో అల్లంముక్కలు దంచి టీలో వేసిందామె. టీ ఫరవాలేదు.

“మరి అమ్మయ్యను ఎప్పుడు దీస్కరావాలని? ఈడ హోటళ్లలో అస్సలు తినలేం” అన్నాడు మల్లి టీ తాగుతూ.

“ముందు ఏదైనా యిల్లు చూసుకోవాల”

ఇంతలో సన్నగా అతి నల్లగా ఉన్న ఒక వ్యక్తి వచ్చి, “పీడీగారూ, మన ప్రిన్సిపాల్‌ ఏమిటండీ లాజిక్‌ లేకుండా మాట్లాడుతాడు? నేను నాన్‌ టీచింగ్‌ క్యాడర్‌ కాబట్టి, మినిస్టీరియల్‌ స్టాఫ్‌లాగా పదిగంటలకే రమ్మంటాడు? మన పిల్లలు పన్నెండున్నరకొస్తే, నేను పది నుండీ వచ్చి ఏం చేస్తాను? వేరీజ్‌ ది లాజిక్‌ అండీ, వేరీజ్‌ ది లాజిక్‌?” అన్నాడు ఆవేశంగా.

“ఆయనకూ నీకూ నిత్యం ఉండే పంచాయితీలే గాని, ఈయన పతంజలి గారు. ఇంగ్లీష్‌ జె.యల్‌” అని పరిచయం చేశాడు మల్లి.

“ఈయన సూర్యనారాయణ. హైలీ క్వాలిఫైడ్‌. ఎమ్‌.యల్‌. ఐ.యస్‌.సి. చేసి లైబ్రరీ సైన్సులో పి.హెచ్‌.డి కూడ చేశాడు. మన లైబ్రైరీయన్‌గారు. అసలు యూనివర్సిటీలో యుజిసి స్కేల్స్‌తో పని చేయాల్సిన వ్యక్తి. పాపం వేరీజ్‌ ది లాజిక్‌?” అన్నాడు మల్లి. “ఈయన రైల్వే కాలనీలో ఒక్కడే ఉంటాడు. ఇంకా పెళ్లికాలేదు. సామీ నీవు లాడ్జి ఖాళీ చేసి ఈయన ఇంటికి మారిపో. నాల్గు రోజుల్లో ఏదైనా యిల్లు చూద్దాము. మాస్టారూ, మీకేం ఇబ్బంది లేదు కదా!”

“అబ్బే! యు ఆర్‌ వెల్‌కం సార్‌! అన్నాడతడు.

ఐదో పిరియడ్‌ సెకండ్‌ హెచ్‌యిసి క్లాసు తీసుకన్నాడు. వాళ్లకు ‘లెటర్‌ రైటింగ్‌’ గురించి చెప్పాడు. మంచి రెస్సాన్స్‌ వచ్చింది. ఆరో పిరియడ్‌ జరగలేదు. నాలుగు యాభైకి పిల్లలంతా వెళ్లిపోసాగారు. ప్రాక్టికల్స్‌ ఉన్న సైన్సు పిల్లలు మాత్రం ఉన్నారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here