సాఫల్యం-53

3
13

[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[ఇంజనీరింగ్ పిల్లలకి సాహిత్యం ఎందుకు అవసరమో వివరిస్తాడు పతంజలి. ల్యాబ్ మాన్యువల్ ప్రారభించేముందే పిల్లలకు ఇంట్రడక్షన్ ఇచ్చాడు. చైర్మన్ గారికి పతంజలి పాఠాలు చెప్పే విధానం నచ్చుతుంది. ఈ సంస్థ ద్వారా అందుకున్న ఆదాయంతో బీదా బిక్కీకి సాయం చేస్తాడు. ప్రజ్ఞకి మంచి సంబంధం వస్తుంది. అందరికీ ఆమోదం కావడంతో పెళ్ళి చేస్తారు. బోధనా, రచనా వ్యాసంగం కొనసాగుతున్నాయి. గోవిందరెడ్డి నల్లగొండలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని చక్కని ప్రసంగం చేస్తాడు పతంజలి. వాల్డెన్ స్ఫూర్తితో మేడ మీద తనకోసం ఓ ప్రత్యేకమైన కుటీరంలా ఉండే గదిని కట్టించుకుంటాడు పతంజలి. నిరాడంబరమైన జీవితం గడపడానికి ప్రయత్నిస్తాడు. గ్లోబల్ బిజినెస్ స్కూల్‍లో డీన్‍గా అవకాశం వస్తే, అప్లయి చేసి, సెలెక్ట్ అవుతాడు పతంజలి. ప్రద్యుమ్న ఉద్యోగం మారి, హైదరాబాద్‍కి కుటుంబంతో సహా వచ్చేస్తాడు. అందరూ భోజనానికి కూర్చుంటారు. – ఇక చదవండి.]

[dropcap]ప[/dropcap]చ్చి టమోటా వేరుశనగ పలుకులు వేయించి పచ్చడి చేసింది వసుధ, కొడుక్కు ఇష్టమని. కోడలికిష్టమని కాకరకాయ నువ్వుల గుజ్జు చేసింది. మామిడి అల్లం పప్పు, మటిక్కాయ (గోరు చిక్కుడు) మిరపపొడి చేసింది. చివరిది పతంజలి కిష్టం. మనుమడికి చప్పని పప్పు కొద్దిగా ప్రక్కకు తీసి రెండు బంగాళాదుంపలు ఉడికించింది.

“వీడు కారం బాగానే తింటాడమ్మా. వాడి పప్పులో అరస్పూను కాకరకాయ గుజ్జు కలిపివ్వు. ఎలా తినేస్తాడో చూద్దువుగాని”

పతంజలి అన్నాడు. “వాడి తాతది, నాన్నది కర్నూలు, వాడి నాన్నమ్మదీ అమ్మదీ కడప. కారం ఉప్పు తగలకపోతే ఎలా తింటాడు మరి?”

“కాం తింతే దగ్గొత్తుది. అప్పులు ‘అప్ప’ తాగుతే తగ్గిపోతుంది” అన్నాడు మనమడు. అందరూ నవ్వారు.

“పచ్చి టమోటాపచ్చడి చూశావా! అలా ఉండాలి. నీవు చేస్తే కుదిరి చావదు” అన్నాడు పుత్ర రత్నం.

“అన్నీ మీతో కంపేర్‌ చేసి మీరు చేసినట్లు రాలేదని అంటూంటారత్తయ్యా ఈయన” అన్నది కోడలు.

“ఓరేయ్‌! అదే తప్పు. మీ అమ్మకు వంటలో ముఫై ఐదేళ్ల అనుభవం. పాపం కోడలు బడ్డింగ్‌ కుక్‌. కంపారిజన్‌ ఎందుకు? నాల్రోజులు పోతే ఆ పిల్లే అన్నీ నేర్చుకుంటుందిలే క్రమంగా. మాటిమాటికీ దాన్ని చిన్నబుచ్చకు” అన్నాడు పతంజలి.

“అలా చెప్పండి మామయ్యా!” అన్నది ఉదయ.

మర్నాడు వాడు జాయిన్‌ అయ్యాడు. కొండాపూర్‌లో వాడి కార్యస్థానం. ఔటర్‌ రింగు రోడ్డు మీద కారులో వెళితే గంటంబావు ప్రయాణం. వాడి కారు ఇంకా రాలేదు. అందాకా మెట్రోలో వెళ్లి వస్తానన్నాడు. నాగోలు వరకు క్యాబ్‌లోవెళ్లి అక్కడ నుండి మెట్రోలో వెళతాడు. మధ్యాహ్నం రెండు నుండి రాత్రి 11 గం॥ వరకు వాడి ఆఫీస్‌ అవర్స్‌, ఉదయం ఆలస్యంగా లేస్తారు. ఒకేసారి పదకొండున్నరకల్లా భోజనం చేసి, రాత్రికి క్యారేజ్‌ తీసుకొని వెళ్లిపోతాడు.

వంట పనంతా వసుధే చూసుకుంటుంది. గిన్నెలు సర్దటం కిచెన్‌ శుభ్రం చేయడం, వాషింగ్‌ మెషీన్‌లో బట్టలు వేయడం, ఆరవేసి, తర్వాత మడతలు పెట్టటం లాంటి పై పనులన్నీ ఉదయ చేస్తూంది.

ఒక వీకెండ్‌ బెంగుళూరు నుండి సామాను షిఫ్ట్‌ చేసి పైన సర్దుకున్నారు. కారు తెచ్చేకున్నారు.

శని ఆదివారాలు మాత్రం బయటికి వెళ్తారు. సినిమాకో, షాపింగ్‌కో వెళ్లి, డిన్నర్‌ చేసి తిరిగి వస్తారు. వీళ్లను కూడా పోదాం రమ్మని సతాయిస్తారు. ఒకటి రెండుసార్లు వెళ్లారుగాని, ఆ ఎలాస్టిక్‌ రోటీలు, ఇంచుమించు ఒకే ప్లేవరున్న ఆ స్పైసీ కూరలు, బిర్యానీలు తినలేక వెళ్లడం మానేశారు.

ప్రద్యు వచ్చింతర్వాత పతంజలికి పెన్షన్‌ మిగిలిపోసాగింది. వాడూ కోడలూ కలిసి స్పెన్సర్స్ లేదా డిమార్ట్‌ వెళ్లి నెలకు కావలసిన సరుకులు తెచ్చేస్తారు. ఎలక్ట్రిసిటీ బిల్లు వాడి అకౌంట్‌ నుండే రెండు మీటర్లదీ ఆన్‌లైన్‌లో వెళ్లిపోతుంది. పనిమనిషి, పాలవాడు, కేబుల్‌ టీవి లాంటి ఖర్చుల కోసం వాళ్లమ్మకు నెలనెలా పదివేలిస్తాడు.

మనుమడి పేర యస్‌.బి.ఐలో ‘సిప్‌’ (సిప్టమెటిక్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ ప్లాన్‌) ఒకటి నెలనెలా పదివేలు కట్టేలాగా ప్రారంభించాడు పతంజలి. గ్లోబల్‌ బిజినెస్‌ స్కూలు వారిచ్చే రెమ్యూనరేషన్‌ కూడ ఐ.టి. పరిధిలోకి వచ్చి 20% శ్లాబులోకి వచ్చాడు. దానికోసం బుజ్జమ్మపేర ఎస్‌బిఐ స్మార్ట్‌ ఎలైట్‌ అనే పథకంలో సంవత్సరానికి లక్షన్నర చొప్పున కడుతున్నాడు. అతనికి 80సి క్రింద మినహాయింపు. బుజ్జమ్మకు మెచ్యూరిటీ బెనిఫిట్‌. ఐదేండ్లు కడితే ఏడున్నర లక్ష అవుతుంది. మరో ఐదేండ్లు దాన్నలా ఉంచి పదో సంవత్సరం చివర పదిహేడు లక్షలు ఇస్తారు బుజ్జమ్మకు. ఈ పథకాలన్నీ ఎస్‌బిఐ మేనేజర్‌ అంజనీ కుమార్‌ చెప్పి చేయిస్తున్నవే.

మనమడు ఇద్దరికీ బాగా చేరికయ్యాడు. రెండో ఏడు నడుస్తూంది వాడికి మధ్యాహ్నం ఒంటిగంట దాటే సరికి పతంజలి కోసం చూస్తూంటాడు. మాటిమాటికి గేటు దగ్గరకు వెళ్లి.

“నానామ్మా, తాత రాలేదు!” అంటాడు దిగులుగా.

తాత ఆటో దిగిన వెంటనే కాళ్లకు చుట్టుకుంటాడు. తాత, నాన్నమ్మతో బాటు భోంచేస్తాడు. వాడు తన చిట్టి చేతులతో ఇద్దరికీ తినిపిస్తాడు.

పతంజలి విశ్రమిస్తూంటే ప్రక్కన వచ్చి చేరతాడు.

“తాతా, కత చెప్పు” అని డిమాండ్‌ చేస్తాడు. వాడి నుండి అన్నీ ఆదేశాలే గాని అభ్యర్థనలుండవు.

“ఏం కథ చెప్పమంటావు నాన్నా” అంటే

‘నచిమ్మసామి కధ’ అంటాడు టక్కున

ప్రహ్లాదుడు వాళ్ల నాన్న మాట వినకపోవడం, ఆయనకు కోపం రావడం, కొడుకును పాములతో కరిపించడం, ఏనుగుతో తొక్కించడం, సముద్రంలో పడేయడం, ప్రతిసారీ ‘నచిమ్మసామి’ కాపాడటం చివరికి స్తంభంలోంచి స్వామి వచ్చి హిరణ్యకశిపుని పొట్ట చీల్చి చంపేయడం. రోజూ చెప్పాల్సిందే తాత చెపుతూంటే కళ్లింత చేసుకొని ఆ దృశ్యాలన్నీ మనసులోనే విజువలైజ్‌ చేసుకుంటాడు. మధ్యలో తాత అడిగే ప్రశ్నలకు ఫీడ్‌బ్యాక్‌ ఇస్తుంటాడు.

నరసింహస్వామి కోపం ఎలా వచ్చిందో చూపిస్తాడు. అది ఎంతకీ తగ్గదు. చివరికి ప్రహ్లాదుడే తగ్గిస్తాడు. మీద కూర్చోబెట్టుకొని ప్రహ్లాదుకు ‘బెద్ద డైరీ మిల్క్‌’ చాక్‌లెట్‌ నరసింహస్వామి ఇవ్వడంతో కథ ముగుస్తుంది.

నాన్నమ్మ కాకి కత చెప్పాలి వాడికి. కుండల్లో నీళ్లు అడుక్కు ఉంటే అవి పైకి రావడానికి చిన్న చిన్న రాళ్లు కుండలో వేసి పైకి ఎలా తెప్పించిందో చెబుతుంది. నాన్నమ్మ.

చిన్న డైనింగ్‌ రూముంది. ఒక మూల చిన్న స్టాండ్‌ మీద ఒక మట్టి కుండ పెట్టుకున్నారు. ఇద్దరూ ఫ్రిజ్‌ నీరు తాగరు. కోడలికిష్టమని ఒకరోజు కిలో ‘దూద్‌ పేడ’ పీసెస్‌ తెచ్చి డైనింగ్‌ టేబుల్‌ మీద పెట్టాడు పతంజలి. మధ్యాహ్నం వసుధ టీవీ చూస్తుంటే, వచ్చి పిలిచాడు వాడు.

“నాన్నామ్మా, దా! కాకి కుండలో రాయి ఏచింది. నేను మన కుండలో ఏచినా. చూడు” అంటూ లోపలికి తీసుకెళ్లాడు. ఇంకేముంది? టేబుల్‌ మీద ఉన్న దూద్‌పేడాలన్నీ కుండ మూత తెరిచి అందులో వేశాడు.

‘అప్ప’ (నీరు) పేకి వచ్చింది చూదు నాన్నమ్మా!” అంటున్నాడు. దూద్‌పేడా నీళ్లల్లో నాని ముద్దయ్యింది.

తాతకు, నాన్నమ్మకు కొంచెం నలతగా ఉందనిపిస్తే చాలు తలుపుచాటు నుండి చీపురు పట్టుకొస్తాడు. ‘దిట్టి తీత్తా’ అంటూ మూడుసార్లు అటూ ఇటూ తిప్పి, మళ్లీ జాగ్రత్తగా దాన్ని తలుపు వెనక పెట్టి వస్తాడు.

స్నానం చేసిన వెంటనే దేవుడి గదిలోకి వెళ్లి మొక్కుకుని, నాన్నమ్మతో బొట్టు పెట్టించుకొంటాడు. పూజను ‘ఓం ఓం’ అని, తినటాన్ని ‘ఆంఆం’ అని అంటాడు.

“ఓం ఓం చేచుకునీ, ఆం ఆం తింతా” అంటాడు.

ఇంటికి దగ్గరలోనే పెద్దది హెచ్‌.ఎమ్‌.డి.ఎ వారి పార్కు ఉంది. సాయంత్రం ఆరుకు నిద్రలేచి, మంచి డ్రస్‌, షూస్‌ వేసుకొని రడీ ఐపోతాడు.

“తాతా! పార్క్‌!” అంటాడు తాత ప్యాంట్‌ షర్ట్‌ వేసుకొనే సరికి తాత చెప్పులు షూ స్టాండ్‌ నుండి తీసి బయట పెడతాడు. తాత చెయ్యి పట్టుకొని నడుస్తాడు. ఒక గంట పార్కులో ఆడుకుని, “ఐకీం” తిని ఇంటికి వస్తారు.

‘ప్రజ్జలయ్యసామి ఎంత బంగారైనాడమ్మా” అని అంటే ఇష్టం ముసి ముసి నవ్వులు నవ్వుతాడు.

ప్రద్యు ఎప్పుడయినా వాడికి కోప్పడితే, వెంటనే పతంజలితో

“తాతా, నాన్నను కొత్తు” అంటాడు వాళ్ల నాన్నను కొట్ట గలిగినవాడు తాత మాత్రమే అని వాడికి తెలిసిపోయింది. తాత నాన్నను కొట్టినట్లు నటిస్తూంటే నవ్వుతాడు.

పతంజలిపైన ‘వాల్డెన్‌ హట్‌’ (వసుధ పెట్టిందా పేరు) రాసుకుంటూంటే ఒక్కడే మెట్లన్నీ ఎక్కి తాత దగ్గర కెళతాడు. రాయడం ఆపేసి ఆడుకుందాం రమ్మంటాడు. నాన్నమ్మ వంట చేస్తూంటే చంకలో కూర్చుని చూడ్డం యిష్టం వాడికి. స్టవ్‌ మీద అమర్చిన చిమ్నీ ఆన్‌ చేస్తానంటాడు. వెట్‌గ్రైండర్‌ పిండి రుబ్బుతూంటే ఎత్తుకుని చూపించాలి.

ఇంగ్లీషు కూడ వచ్చు వాడికి

“ఒక ముద్దు పెట్టు నాన్నా, బంగారు సామీ” అంటే

“నాట్‌ నౌ” అంటాడు సీరియస్‌గా.

ఇంటిముందు నుండి పెరట్లోకి వెళ్లేందుకు నాలుగడుగులు వెడల్పున్న నడవా ఉంది. దాంట్లో నాన్నమ్మతో బాలాట ఆడతాడు. ఎంతకీ చాలించడు. “నామాట విను కన్నా” అంటుందామె విసిగిపోయి. అదే ఇంటోనేషన్‌తో “నామాత విను నాన్నమ్మా” అని రాగం తీస్తాడు వెధవ.

హాలంతా తన ఆట బొమ్మలు విరజిమ్ముతాడు. సోఫా కవర్లను లాగి పారేస్తాడు. వాళ్లనాన్నంటాడు.

“సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ప్లాట్‌ఫారం నంబర్‌ వన్‌లా ఉందిరా మన యిల్లు!”

ఒకసారి పతంజలి డైనింగ్‌ టేబుల్‌ వద్ద కూర్చొని ఉన్నాడు. పెరటి తలుపు తెరిచి ఉంది వీడు తాత దగ్గరకొచ్చి.

“తాతా! డోర్‌ ఎయ్యలేదు. మ్యావ్‌ వచ్చి పాలన్నీ ఆం ఆం చేత్తుంది. నో!” అని పెరటి తలుపు దభీమని వేసి తాతను కోపంగా చూస్తూ వెళ్లాడు.

ఇలా ప్రజ్ఞలయ్యసామి నాన్నమ్మ తాతల జీవితాలను అర్థవంతం చేస్తూ మురిపిస్తూన్నాడు.

ఇర్రం మంజిల్‌ మెట్రోస్టేషన్‌లో దిగి నడుచుకుంటూ కాలేజీకి వెళతాడు పతంజలి. మధ్యాహ్నం తిరిగి వచ్చేటప్పుడు బాగా ఎండగా ఉంటుంది. నిమ్స్‌ హస్పిటల్‌ ఔట్‌ గేట్‌ దగ్గర్నుంచి, నిమ్స్‌ బస్టాప్‌ దాటి కొంతదూరం వరకూ పళ్లు అమ్ముకొనేవారు, టూత్‌ పేస్ట్‌ లు, సబ్బులు వగైరాలమ్ముకునేవారు, బెల్ట్‌లు, పర్సులు, కార్డ్‌ హోల్డర్లు అమ్ముకునేవారు ఎర్రటి ఎండలో నిలబడి వ్యాపారాలు సాగిస్తారు. నిమ్స్‌ పేషంట్లు విజిటర్సే వారి కస్టమర్లు. కొందరు గంపల్లో పెట్టుకొని రోడ్డుమీదే కూర్చుంటారు.

పతంజలికి ఒక ఆలోచన వచ్చింది. నగరంలో కొన్ని చోట్ల పెద్ద గొడుగుల్లాంటివి కొందరు పెట్టుకొని రోడ్‌ మీద చిల్లర వ్యాపారాలు చేసుకోవడం చూశాడు. మధ్యలో ఒక స్టీల్‌ రాడ్‌ ఉండి. మామూలు గొడుగులకు రెండు రెట్లుంటాయని ఎండ నుండి వాన నుండి రక్షణ యిస్తాయి బాగా.

అవి ఎక్కడ దొరుకు తాయో కనుక్కుంటే ‘బేగం బజారు’ లో దొరుకుతాయని చెప్పారు. ఒకరోజు వెళ్లి అడిగితే వెయ్యి రూపాయల నుండి మూడు వేల రూపాయల వరకు ఉన్నాయి. తనకు ఇరవై కావాలని, తగ్గించి యివ్వమనీ రిక్వెస్ట్‌ చేస్తే, వెయ్యి రూపాయలవి ఏడు వందలకు ఇవ్వగలమని చెప్పారు. పదిహేను వేలు పెట్టి ఇరవై తీసుకొని ఆటోలో వేసుకుని వెళ్లాడు అందరికీ ఇచ్చాడు.

“సల్లగుండు బిడ్డా!”

“జీతే రహో”

“మంచి పని జేసిండు సారు”

ఒక పెద్దాయన వచ్చి “సారూ, నాకొకటియ్యరాదె” అనడిగాడు. “నీవెక్కడుంటావు?” అనడిగితే మెట్రో పార్కింగ్‌ దారిలో పేవ్‌మెంట్‌ మీద షేవింగ్‌ కటింగ్‌ చేస్తుంటానని చెప్పాడు. పతంజలికి గుర్తొచ్చింది. అతనికి ఒకటి ఇచ్చేశాడు.

వనస్థలిపురంలో కూడ తన మిత్రులతో కలిసి, చెప్పులు కుట్టేవాళ్లకు, నిలబడి అమ్ముకునే చిన్న వ్యాపారులకు ఆ గొడుగులు అందజేశాడు.

తల్లిదండ్రలుల ఆబ్దికాలు వెల్దుర్తిలో జరుపుతాడు మల్లినాధ. భోక్తలుగా వాడి శిష్యులే ఉంటారు. మంత్రం వాడే చెబుతాడు. పతంజలి ఆ రోజుల్లో  వెళ్లి తద్దినాలకు హాజరై వస్తాడు. వీలుకాకపోతే వనస్థలిపురంలోని “గాయత్రి భవన్‌” లో పెట్టిస్తాడు.

ఒకసారి వెల్దుర్తికి అమ్మ తద్దినానికి వెళ్లాడు. సంత సెంటర్‌లో మార్కండేయశర్మ బస్ట్‌ సైజు కంచు విగ్రహం ప్రతిష్టించి ఉన్నారు. దగ్గరుండి విగ్రహాన్ని కడిగించి, పూలమాల వేయించారు.

సాయంత్రం అలా ఎల్లమ్మగుడి వైపు వెళుతుండగా ‘దస్తుమియ కట్ట’ అంతా కూలిపోయి కనిపించింది. అక్కడ పెద్ద వేపచెట్టు ఉంటుంది. దాని చుట్టూ చతురస్రాకారంగా ఎవరో చాలా ఏండ్ల క్రింద అరుగు కట్టించారు.

వెల్దుర్తి నుండి రామళ్లకోట మీదుగా నంద్యాల పోయే వాహనాలు, పుల్లగుమ్మి, కలుగొట్ల మీదుగా కర్నూలు పోయే బస్సులు ఆ మార్గంలో వెళతాయి. ‘వంక’ మీద వంతెన కూడ వచ్చింది. దస్తుమియ కట్టమీద కూరగాయలు, అరటిపండ్లు, పువ్వులు అమ్మేవారు జీవనం సాగిస్తూంటారు. బస్సులు షేర్‌ ఆటోల్లో ప్రయాణం చేసేవారు అక్కడ వాటి కోసం ఎదురు చూస్తారు.

దాన్ని శిథిలావస్థలో చూడగానే పతంజలికి బాధ వేసింది. అరుగును పునర్నిర్మించి అక్కడ ఒక బస్‌ షెల్టర్‌ కడితే చాలామందికి అనువుగా ఉంటుంది.

వెంటనే తన చిన్న నాటి మిత్రుడు, సహాధ్యాయి, ప్రస్తుత గ్రామ పంచాయితీ సర్పంచ్‌ “దశరథరామిరెడ్డి” ని కలిశాడు. ‘దశరథుడు’ అని పిలుస్తాడు పతంజలి అతన్ని అభిమానంగా.

“రా శర్మా!” అని ఆదరంగా ఆహ్వానించాడతను.

అతనికి దస్తమియ కట్ట దుఃస్థితి వివరించి, తాను పదివేలు ఇస్తాననీ, పంచాయితీ నిధులు కొంత తీసి, అరుగు పునర్నిర్మించి, ఒక బస్‌ షెల్టర్‌ కడితే బాగుంటుందని కోరాడు. ‘దశరధుడు’ దానికి సానుకూలంగా స్పందించాడు. పదివేలు అతనికి ఇచ్చేశాడు పతంజలి.

వెల్దుర్తిలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కూడ వచ్చింది. సొంత భవనాలు కూడ నిర్మించింది ప్రభుత్వం. వెళ్లి చూశాడు. సైకిల్‌ స్టాండ్‌ ఏర్పాటు చేయడానికి, టాయిలెట్లకు మోటారు, ఓవర్‌ హెడ్‌ ట్యాంకు పెట్టుకోడానికి తాను యాభై వేల రూపాయలు ఇస్తానని ప్రిన్సిపాల్‌గారితో చెప్పాడు.

గ్లోబల్‌ బిస్కూలు వారు నెల జీతం క్రెడిట్‌ చేయగానే, కాలేజీ అకౌంటుకు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు.

ఒకసారి తండ్రిగారి అబ్దీకానికి వెళ్లినపుడు మాదిగ గేరి (హరిజనవాడ)కి వెళ్లి తన బాల్యమిత్రులు సుంకన్నను తోకోడిని కలిశాడు. సుంకన్న కొడుకు సుధాకర్‌ ఇంటర్‌ తర్వాత సెకండరీ ట్రెయినింగయి, యస్‌.జి. టీచరుగా పనిచేస్తున్నాడట. తోకోని కూతురు నాగమణి ఇంజనీరింగ్‌ పూర్తి చేసి బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తుందట. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. సుధాకర్‌ భార్య కూడ టీచరే. నాగమణి భర్త కూడ సాఫ్ట్‌వేరేనట.

సుంకన్న, తోకోడు, వారి భార్యలు ఇంకా ధృఢంగానే ఉన్నారు. వ్యవసాయ పనులు చేస్తున్నారు. పతంజలి సామి తమయిండ్లకు వచ్చినందుకు వారు పరమానంద భరితులయ్యారు. మట్టి మిద్దెలు పోయి పక్కాయిళ్లు కట్టుకున్నారు.

తోకోని భార్య బుడ్డక్క అన్నది. “చిన్నసామికి ఏమయినా పెట్టల్లంటే బయమైతాది!”

పతంజలి అన్నాడు. “బుడ్డక్కా, నా సంగతి మీకు తెలుసు కదా, నాకటువంటి భేదాల్లేవు”

తోకోడు అన్నాడు. “సామి నిమ్మతోటల, ఇంజను రూంకాడ సెట్టు కింద మనం సద్దులిప్పుకుని అన్నీ కలిపి తినుకుంటవుంటే నాకూ ఒక ముద్ద పెట్రండ్రా అని అడిగేటోడు. సటుక్కున పెద్ద సామిగిన వచ్చాడేమో అని  బయం.”

“జొన్న రొట్టె గనుక చేసింటే పెట్టు బుడ్డక్కా” అని అడిగాడు పతంజలి.

“పొద్దున చేసినవుండాయి సామీ. ఉండు తెచ్చా” అని ఒక ప్లేటులో ఒక రొట్టె కొంచెం ఎల్లిపాయ (వెల్లుల్లి) కారం మీద నూనె వేసి యిచ్చిందామె.

రొట్టె మృదువుగా ఉంది పొరలు పొరలుగా వస్తూంది. కొరివి కారం రుచి అద్భుతం.

“సామికి ‘ష్టీ’ ఇయ్యవే” అన్నాడు తోకోడు

“టీ సుంకన్నగాడింట్లో తాగుతాలేరా!” అన్నాడు.

సుంకన్న కొడుకు కోడలు ఇంట్లోనే ఉన్నారు. సుధాకర్‌కు హోండా స్ప్లెండర్‌ ఉంది. వాడు బొమ్మిరెడ్డి పల్లెలో వాడి భార్య అల్లుగుండులో పని చేస్తారట. బండిమీద వెళ్లి వస్తారట. రెండు స్కూళ్లూ ఒకే రూటు మరి.

“వీడు నెలల పిల్లవాడిగా ఉన్నప్పుడు, ఉయ్యాలలో ఏడుస్తూంటే ఎత్తుకొని బుజ్జగిస్తూంటే, సరిగ్గా అప్పుడే నాయనవచ్చె. పెద్దకొట్లాటలే అది” అని గుర్తు చేసుకున్నాడు పతంజలి.

పతంజలి జాయింట్‌ సెక్రటరీగా ఆర్‌.జె.డిగా పనిచేసి రిటైరైనాడని సుంకన్నకు తెలియదు. తోకోనికి కూడ మొత్తం మీద సామి శానా పెద్ద ఉజ్యోగమే చేసినాడని, నెలజీతమే లచ్చన్నర అని మల్లిసామి వాండ్లకు చెప్పిండె.

తన డిజిగ్నేషన్‌ సుధాకర్‌కు చెప్పాడు. దంపతులిద్దరూ అవాక్కైన్నారు. వారికి ఎం.ఇ.వో.ఏ గొప్పపదవి. అటువంటిది ఆరు జిల్లాల అధికారి తన తండ్రిని చూడడానికని రావడం, మంచంమీద కూర్చుని అమ్మ ఇచ్చిన టీ తాగడం ఆశ్చర్యంగా ఉంది వారికి.

“యువర్‌ ఫాదర్‌ అండ్‌ ఐ వర్‌ బెస్ట్‌ ఫ్రెండ్స్ ఇన్‌ అవర్‌ ఛైల్డ్‌ హుడ్‌. హి యూజ్‌ డ్‌ టు ప్లే ఆన్‌ దిపాట్‌ విత్‌ హిస్‌ ఫింగర్స్‌ ఫర్‌ మై సాంగ్స్‌. తోకోడు వజ్‌ ఆల్సో మై క్లోజ్‌ ఫ్రెండ్‌” అని చెప్పాడు వాడికి.

“వేరీ కైండ్‌ ఆఫ్‌ యు సార్‌. మై ఫాదర్‌ ఆల్వేస్‌ రిమెంబర్స్‌ దోస్‌ డేస్‌” అన్నాడు వాడు. ఇంతలో లోపల్నించి పసిపిల్ల ఏడుపు వినిపించింది.

“మనమరాలు సామీ! సూపిచ్చాతాళు” అంటూ సుంకన్న భార్య ఎనిమిది నెలల పాపను ఎత్తుకొని వచ్చింది. నాన్నమ్మ ఎత్తుకుంటూనే ఏడుపు మానేసిందా పిల్ల. పతంజలిని చూసి ఎప్పటినుండో పరిచయమున్నట్లుగా చిరునవ్వులు చిందించింది. చేతులు చాస్తే కొత్తలేకుండా వెళ్లి, పతంజలి జేబులోని సెల్‌ఫోన్‌ లాక్కోబోయింది. కళ్లద్దాలు పీకడానికి ప్రయత్నించింది.

“మీ నాన్నను కూడ ఎత్తుకొని తిప్పేవాడినే నేను. దొంగ భడవా” అన్నాడా పిల్లను ముద్దాడుతూ. “దీనికి ఏం పేరు పెట్టారురా?” అనడిగాడు.

“సునీతని పెట్టినాం సార్‌” అన్నది ఆ పిల్ల తల్లి.

ఐదువందలు దాని చేతికిస్తే, గట్టిగా పిడికిటిలో బిగించి నోట్లో పెట్టుకుంది.

“దీనికి మంచి డ్రెస్‌ కొనిపెట్టండి” అని చెప్పాడు.

“రెస్టు తీసుకోమని చెప్తూంటే మా నాయిన ఇనడు సార్‌” అని ఫిర్యాదు చేశాడు సుధాకర్‌.

“ఓపిక ఉన్నన్నాళ్లు చెయ్యనీ లేరా వాడిష్టం. పని చేస్తూంటేనే ఆరోగ్యం బాగుంటాది. ‘రెస్ట్‌ లీడ్స్‌ టు రస్ట్‌’” అని చెప్పాడు వాడికి.

వాళ్లకు చెప్పి వచ్చేశాడు. వాళ్ల యిండ్లకు వెళ్లి వచ్చినట్లు మల్లినాధతో చెప్పలేదు. చెబితే దర్భ కాల్చి నాలుకమీద వాత పెడతాడు, పంచగవ్యం తాగిస్తాడేమోనని భయం పతంజలికి.

(ముగింపు వచ్చే వారం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here