సాఫల్యం-54

12
12

[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవల త్వరలో  పుస్తక  రూపంలో వస్తోంది. వివరాలకు  9550214912  ను సంప్రతించండి.     [/box]

[మనవడు పతంజలికి, వసుధకి బాగా మాలిమి అవుతాడు. ఆ చిన్నారి ఆటపాటలను ఆస్వాదిస్తుంటారు వారు. ఇంటి ఖర్చునంతా కొడుకూ, కోడలు చూసుకోవడంతో తన సంపాదనలో కొంత కూతురి పేరిట, మనవడి పేరిట దాస్తూ – మిగిలిన భాగాన్ని సేవాకార్యక్రమాలను ఉపయోగిస్తాడు పతంజలి. వీధి వ్యాపారులకు రక్షణ గొడుగులు కొనిస్తాడు. ఒకసారి అమ్మ తద్దినానికి వెల్దుర్తి వెళ్తాడు పతంజలి. అక్కడ శిథిలావస్థలో ఉన్న ఒక బస్టాండును బాగు చేయిస్తాడు. మరోసారి తండ్రి ఆబ్దీకానికి వెళ్ళినప్పుడు హరిజనవాడకి వెళ్ళి తన చిన్ననాటి మిత్రులు సుంకన్న, తోకోడిని కలుస్తారు. వాళ్ళ భార్యాపిల్లలతో, మనవరాలితో కాలక్షేపం చేసి పిల్లల్ని ఆశీర్వదించి వస్తాడు. – ఇక చదవండి.]

[dropcap]త[/dropcap]న చేతనైనంత ఇతరులకు సాయపడుతూ, సాహితీ వ్యవసాయం చేస్తూ, జీవనయానం సాగిస్తున్నాడు పతంజలి. కానీ ఈ మధ్య ఎందుకో అతని మనస్సులో ఒక శూన్యం ఏర్పడింది. ఇంతేనా జీవితం? తానేమి సాధించాడు? పదిమంది గొప్పగా చెప్పుకొనే పనులేవీ చేయలేదు. వివిధ రంగాలో లబ్ధప్రతిష్ఠులై ప్రజల నాలుకల మీద నిత్యం తమ పేర్లు ఆడుతూండగా, చనిపోయిన తర్వాత సైతం జీవిస్తున్న మహనీయులతో పోల్చుకుని నిరాశపడేవాడు. ‘జీవిత సాఫల్యం’ అంటే ఏమిటి? అది ఎలా సిద్ధిస్తుంది? అని నిరంతరం మథనపడసాగాడు పతంజలి. సాహిత్యం కాకుండా వేదాంత గ్రంథాలు చదవసాగాడు. అవి మరీ ‘అబ్‌స్ట్రాక్ట్‌’ గా అనిపించేవి. జిడ్డు కృష్ణమూర్తిగారి ‘ఫ్రీడమ్‌ ఫ్రం ది నోన్‌’ అన్న పుస్తకం చదివి మరీ నిరాశకు గురయ్యాడు. బంధాల నుండి విముక్తి మాత్రమే. ‘పుల్‌ఫిల్‌మెంట్‌’ నిస్తుందటాడాయన.

మరి వసుధ ప్రద్యు, ఉదయ, బుజ్జమ్మ, యజ్ఞ నారాయణ, ప్రజ్వలయ్యస్వామి వీళ్లందరితో బంధాలు తెంచుకోవాలా? అమ్మో! ఆ ఆలోచనే భరించలేకపోయాడు. వివేకానందుని ‘నాన్‌ అటాచ్‌మెంట్‌’ సిద్ధాంతాన్ని కూడ జీర్ణించుకోలేకపోతున్నాడు.

‘బ్లిస్‌’ అంటే ఏమిటి? అలౌకికానందం. ఈ లోకమే లేని ఆనందం ఎలా సంభవిస్తుంది? హ్యాపీనెస్‌కు బ్లిస్‌కు తేడా ఏమిటి? చాగంటి, గరికపాటి వారి ప్రసంగాలు విన్నాడు. అని భక్తిని పెంపొదిస్తున్నాయి. గరికపాటి వారి భావాలు కొన్ని తనకు దగ్గరగా ఉన్నాయి. ఒక్కోసారి ఆయన ‘సోషల్‌ రెబల్‌’ అనిపిస్తాడు.

జగ్గీ వాసుదేవ్‌ ప్రసంగాలు విన్నాడు. ఆయన ఫిలాసఫీని చక్కగా మాడరనైజ్‌ చేస్తారు.

అంతా అర్థమవుతూ ఉంది. కానీ ఏదో అసంతృప్తి.

బుజ్జమ్మ నెల తప్పింది. సీమంతం ఘనంగా చేశారు. ఏడో నెలలో ఇంటికి తెచ్చుకున్నారు. మరి కొన్ని రోజుల్లో మెటర్నిటీ లీవ్‌ ప్రారంభం. తన గుండెలమీద ఆడుకున్న బంగారు తల్లి, గర్భభరాలసగా ఇంట్లో తిరుగుతూంటే గుండె నిండిపోతోంది!

మనమడి సమక్షంలో తనకు తానే మరచిపోతాడు. వాడి ముద్దుమాటలు అల్లరి మురిపిస్తాయి. కోడలు వాడిని తీసుకొని పది రోజులు పుట్టింటికి పోయింది! ఇద్దరి జీవితాలూ శూన్యం అనిపించాయి.

బి.స్కూలు పిల్లలు తన పిల్లలా అనిపిస్తారు! వాళ్లకు పాఠాలు చెబుతూ ఉంటే మనస్సు ఉరకలు వేస్తూంటూంది.

వసుధ లేకపోతే క్షణం తోచదు. ఆమె సమక్షంలో ఎందుకో నిశ్చింతగా ఉంటుంది.

సిటీబస్‌ కండక్టరు, డ్రైవరు, ఆటో డ్రైవరు, మెట్రో స్టేషన్‌ సెక్యూరిటీ, టీ కొట్టువాడు, టిఫిన్‌ బండివాడు అందరూ తనవారే అనిపిస్తుంది. రెండు రోజులు కనబడకపోతే అడుగుతారు.

“గీ మధ్య వస్తలే రేందిసార్‌!” అని.

కొడుకు వీకెండ్స్‌ లోనే కనబడతాడు. శుక్రవారం నుండే – వాడు ఇంట్లో ఉంటాడన్న థ్రిల్‌ ప్రారంమవుతుంది. మరి ఇదంతా  ‘అటాచ్‌మెంటా?’ ‘బ్లిస్‌’కు అవరోధమా? వీళ్లందర్నీ కాదనుకుంటే పుల్‌ఫిల్‌మెంట్‌ వస్తుందా.

పోనీ చూద్దాం అనుకొని అందరితో అంటీముట్టనట్లుండడం ప్రారంభించాడు. ఏం వంట చేసుకోవాలనే దాని గురించి టిఫినేమిటని, ముందురోజు రాత్రే చర్చ జరిగేది. “ఏదో ఒకటి చెయ్యి” అనసాగాడు.

‘అనవసరమయిన ఖర్చులు పెట్టోద్ద’ని కొడుకును తిట్టడం మానేశాడు. మనుమడితో అంతగా ఆడుకోవడం లేదు.

మనసంతా ప్రశాంతత ఆవరించడానికి బదులు, జీవితం దుర్భరంగా అనిపించసాగింది.

“ఈయనకేమైంది?”

“నాన్న అలా ఉన్నాడేమిటి?”

“తాతకు కోపం వచ్చింది!”

“డాడీ హజ్‌ బికం డల్‌ దీజ్‌ డేస్‌”

“ఏంది సార్‌ తబియత్‌ మంచిగ లేద!”

“డీన్‌ సార్ల జోష్‌ తగ్గిందిలే”

ఇలా కామెంట్స్‌. సెకండ్‌ సాటర్‌డే. సండే, సోమవారం మరో పబ్లిక్‌ హాలిడే కలిసి వస్తున్నాయి నాల్రోజుల్లో. అందరూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ప్లాన్స్‌ వేసుకుంటున్నారు. తామూ ఎక్కడికైనా వెళదామంటే వసుధ రాలేదు. బుజ్జమ్మకు నెలలు నిండుతున్నాయి. ఆఖరుకు తానొక్కడే ఎక్కడికైనా వెళ్లొద్దామని నిర్ణయించుకున్నాడు. ఎన్నో రోజుల నుండి (భక్త తుకారం. విప్రనారాయణ సినిమాలు చూసినప్పటి నుండి) పండరీపురం వెళ్లి విఠలుని దర్శనం చేసుకోవాలని ఉంది. ఒకసారి షిర్డీ వెళ్లినపుడు వెళ్దామనుకుంటే దాదాపు మూడువందల కి.మీ దూరమని మానుకున్నారు.

ఒక రోజు లంచ్‌ అవర్లో లైబ్రేరియన్‌ సత్యనారాయణగారు ప్రసాదం ఇచ్చారు పండరిపురం వెళ్లొచ్చానన్నారు.

“చాలా దూరమనుకుంటాను” అన్నాడు పతంజలి.

“అబ్బే. మనకు బాగా దగ్గర సార్‌” అంటూ ప్రయాణ వివరాలు చెప్పాడు ఆయన.

శుక్రవారం బ్యాగ్‌ సర్దుకొని కాలేజికి వచ్చాడు పతంజలి. మధ్యాహ్నం రెండు కల్లా, సికింద్రాబాద్‌ స్టేషన్‌ చేరుకున్నాడు. పావుతక్కువ మూడు గంటలకు ‘శతాబ్ది’ లో బయలుదేరాడు. ముందురోజే తత్కాల్‌లో ప్రద్యు టికెట్‌ బుక్‌ చేశాడు. చాలా కంఫర్టబుల్‌ అండ్‌ ఫాస్టెస్ట్‌ ట్రెయినది. సికింద్రాబాద్‌ – పుణెల మధ్య దూరాన్ని కేవలం ఎనిమిది గంటల్లో అధిగమిస్తుంది. ఏడు గంటలకల్లా ‘షోలాపూర్‌’ లో దిగి ‘ఛత్రపతి శివాజీ మహరాజ్‌ స్క్వేర్‌’లో ఒక హోటల్లో రూం తీసుకున్నాడు.

తెల్లవారు జామున నాలుగు గంటలకు లేచి స్నానం ముగించుకొని బస్టాండుకు వెళ్లాడు. ‘పండరిపూర్‌’ నాన్‌ స్టాప్‌ బస్సులు ప్రతి అరగంటకు ఉన్నాయి. గంటన్నరలో పండరిపురం చేరుకున్నాడు.

తిరుపతిలో లాగా ప్రత్యేక దర్శనాలు, శ్రీఘ్ర దర్శనాలు, అతి శీఘ్రదర్శనాలు, వి.ఐ.పి బ్రేక్స్‌ ఏవీలేవిక్కడ. అందరికీ ఒకే క్యూ. క్యూలో భక్తులు స్వామి దర్శనం కోసం తహతహ లాడుతున్నాడు. గుడిలోనికి ప్రవేశించడానికి రెండు గంటలు పట్టింది.

క్యూలో కొందరు భజనలు చేస్తున్నారు. భక్తి పారవశ్యంతో ఊగిపోతున్నారు. బిగ్గరగా పాటలు పాడుతున్నారు. పతంజలిలో వైబ్రేషన్స్‌ ప్రారంభమయ్యాయి. అప్రయత్నంగా తానూ పాటలు పాడసాగాడు.

“విఠలా విఠలా పాండురంగ విఠలా”

“చందన చర్చిత నీల కళేబర”

“రాధికా కృష్ణా రాధికా”

ఇలా పాటలు అతని గొంతు నుండి జాలువారాయి. కళ్లనుండి ఆనంద బాష్పాలు.

“వా! వా! క్యా గానే హై”

“బహుత్‌ ఖూబ్” అంటున్నారు భక్తులు.

ఒకామె వచ్చి “ఆప్‌ కా ఆవాజ్‌ బహుత్‌ సుందర్‌ హై కాకా” అని చెబుతూ అతని చేతిని ముద్దుపెట్టుకుంది.

“విఠల్‌ బాబాకా అనుగ్రప్‌ పాత్ర్‌ హై ఆప్‌” అంటూ కౌగలించుకొన్నాడొకాయన.

గర్భగుడిని సమీపించే కొద్దీ గుండెలు బాదుకొనేవారు, ఏడ్చేవారు, భక్తి పరవశులైనవారు, స్వామిని చూడబోతున్నామనే భావోద్వేగంతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు.

“పండరీపుర్‌ మహరాజ్‌ విఠల్‌ బాబాకీ జై” అని అరుస్తున్నారు.

నాలుగడుగుల నల్లని విగ్రహం. ఇటుక రాయిలాంటి వేదికమీద నడుము మీద చేతులు పెట్టుకొని నిలబడి ఉన్నాడు పాండురంగ విఠలుడు. ఆ కళ్లలో ఏదో సమ్మోహన శక్తి పాదాలు తాకి కళ్లకద్దుకుంటున్నారు. ముఖాన్ని పాదాలమీద ఉంచుతున్నారు.

పతంజలి కంటివెంట ఆనందాశ్రువులు రాలుతూండగా వంగి స్వామి పాదాలను స్పృశించాడు. స్వామిని బుగ్గలు నిమిరాడు ‘తండ్రీ! లక్ష్మీనరసింహా! ప్రసీద!’ అని ఆక్రోశించాడు. దర్శనం అద్భుతం. వేలాది భక్తులను తన్మయులను చేసి తనలో ఐక్యం చేసుకున్న పరమాత్మ. తన జన్మ ధన్యమైందనుకున్నాడు పతంజలి. బయటకు వచ్చి కాసేపు మంటపంలో కూర్చుని ధ్యానం చేశాడు.

బయటికి వచ్చి పూరీ, చనా తిన్నాడు. మళ్లీ షోలాపూర్‌కు తిరిగి వచ్చి ‘తుల్జాభవానీ’ మాత దర్శనానికి తుల్జాపూర్‌ వెళ్లాడు. అది ముప్పావుగంట ప్రయాణమే. శివాజీ మహరాజ్‌కు దివ్య ఖడ్గాన్ని బహూకరించిన తల్లి ఆమె. అమ్మవారి దర్శనం మూడు గంటలు పట్టింది. సాయంత్రానికి షోలాపూర్‌ చేరుకొని రెస్ట్‌ తీసుకున్నాడు.

ఉదయాన్నే లేచి తయారై, రూం ఖాళీ చేసి, ‘అక్కల్‌కోట’ చేరుకున్నాడు. గురుపరంపరలో షిర్డీ సాయబాబాకు పూర్వుడయిన “అక్కల్‌ కోట్‌ మహారాజ్‌’ను దర్శించుకున్నాడు. టిఫిన్‌ చేసి ‘గాణగాపూర్‌’ బయలుదేరాడు.

భారతదేశంలోని ప్రసిద్ధ క్షేత్రం గాణగాపురం. ఆ ఊరి రోడ్డు మీద దుమ్ములో కూడ పవిత్రతను ఫీలయ్యాడు పతంజలి. ముందు స్వామి ధూళి దర్శనం చేసుకొని దేవస్థానం వారి సత్రంలో ఒక రూం తీసుకున్నాడు. మధ్యాహ్న భోజనం దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ‘అన్న ప్రసాద వితరణ’ లో చేశాడు. ఒక జొన్న రొట్టె, కూటు, కొంచెం ముతక బియ్యంతో వండిన అన్నం. గరిటజారుగా ఉన్న పప్పు, ఏలకులు పచ్చ కర్పూరం కలిపిన కొబ్బరి స్వీట్‌ ఇచ్చారు భోజనంలో.

రాత్రి పదకొండు గంటలకు గుల్బర్గాలో హైదరాబాద్‌ బస్సుకు ముందే రిజర్వేషన్‌ చేయించుకున్నాడు కొడుకుతో.

కాసేపు రూములో విశ్రాంతి తీసుకొని, టీ తాగి, దర్శనానికి క్యూలో నిల్చున్నాడు. అనసూయాత్రి సంభూతుడు, దిగంబరుడు, భవ సంకటములనుండి ఉద్ధరించేవాడు ఐన దత్త భగవానుని దర్శనం కావడానికి గంటపైగా పట్టింది. దత్తాత్రేయ తత్త్వం అద్భుతమైనది. ఏ భేదాలు లేకుండా అందర్నీ అనుగ్రహిస్తాడాయన. కాని అనుగ్రహిమిచ్చే ముందు కఠిన పరీక్షలకు గురిచేస్తాడు.

గణపతి సచ్చిదానందస్వామి వారి ఆశీస్సులతో తీసిన ‘శ్రీదత్త దర్శనము’ అనే సినిమా చూసి ఉన్నాడు. పతంజలి. దత్తుని విశ్వ జనీన తత్త్వంలోని భావజాలం తన ఆలోచనా విధానానికి దగ్గరగా ఉంటుందనుకున్నాడు పతంజలి.

సాయంత్రం ఆరు కావస్తూంది. గాణగాపురంను ఆనుకొని పారుతున్న రెండు నదులు ‘భీమా, అమరజా’ లు కలిసే సంగమస్థలానికి వెళ్లాడు. ఇంకా వెలుతురు బాగానే ఉంది. నదిలో నీళ్లు అంతగా లేవు. ఒడ్డు నానుకొని మోకాటిలోతున పారుతున్నాయి. మధ్యలో ఇసుక తిన్నెలు, మళ్లీ నీటి ప్రవాహం.

నీళ్లలో దిగి దోసిలితో నీళ్లు త్రాగాడు. నెత్తిన చల్లుకున్నాడు. కళ్లు తుడుచుకున్నాడు. గట్టు ఎక్కి పైకి వచ్చాడు. గట్టుమీద ఒక పెద్ద మేడి చెట్టుంది దాని క్రింద చదునుగా ఉన్న పెద్ద బండరాళ్లున్నాయి. ఒకదాని మీద ఒకాయన కూర్చుని ఉన్నాడు. వృద్ధుడు డెభై సంవత్సరాలు దాటి ఉంటాయేమో!

అప్రయత్నంగా అటువైపు నడిచాడు పతంజలి. ఆయన కావి రంగు లుంగీ కట్టుకున్నాడు. పైన ఒక జుబ్బా ధరించాడు. నున్నగా షేవ్‌ చేసుకున్నాడు. జుట్టు వెనక్కి దువ్వి ముడి వేసుకున్నాడు. చేతికి రాగి కడియముంది. మెడలో రుద్రాక్షమాల. నుదుట గంధం బొట్టు. ఆ వయసులో కూడ ధృఢంగా ఉంది శరీరం” విశాలమైన రొమ్ము. భుజాలు వెడల్పుగా ఉన్నాయి.

వెళ్లి ఆయకు నమస్కరించాడు పతంజలి. ఆయన నవ్వాడు, షిరీడి సాయిబాబావలె నవ్వాడు. రమణ మహర్షివలె నవ్వాడు. చిన్ని కృష్ణయ్య నవ్వది.

“రా. కూర్చో!”  అన్నాడాయన.

పతంజలి కూర్చున్నాడు. “మీరు ……………. తమరెవరు స్వామీ?” అనడిగాడు వినయంగా.

సంభాషణ ఇంగ్లీషులో సాగుతూంది.

“నా పేరు కృత్తివాస్‌ ముఖర్జీ. వెస్ట్‌ బెంగాల్‌ నుండి వచ్చాను”

తనను గురించి చెప్పాడు పతంజలి.

“సరే గాని, ఎందుకు విచారంగా ఉన్నావు. నీ మనసులో ఏదో మథనపడుతున్నట్లున్నావు”

పతంజలి ఆశ్చర్యపోయాడు. ‘ఎవ్వరీ మహానుభావుడు? తన మానసిక స్థితిని ఉన్నది ఉన్నట్లుగా చెప్పేశాడు!’ అనుకున్నాడు.

“మనసు బాగులేదు స్వామీ! జీవితంలో సఫలత పొందలేకపోయాను” ఆయన మళ్లీ నవ్వాడు.

“పిచ్చివాడా! జీవన సాఫల్యం అనేది మానవులందరికీ సమానంగా వర్తించదు సుమా!”

“ఈ సమాజానికి నావల్ల ఏ మేలూ జరగలేదు. దేశం కోసం ప్రాణాలర్పించే వారు, తమ ఆస్తులను తృణప్రాయంగా భావించి, సమాజ హితం కోసం ఉపయోగించేవారు. కుటుంబ జీవితాన్నే త్యాగం చేసేవారు ఇలాంటి నిస్వార్థపరులను గురించి తెలుసుకొని, నేనెంత అల్పుడినో అర్థమై, వేదన చెందుతున్నాను. బంధాల నుండి విముక్తి పొందలేపోతున్నాను.”

“నీవు వేదాంత గ్రంథాలు ఈ మధ్య ఎక్కువగా చదువుతున్నావనుకుంటాను”

“అవును స్వామీ”

“నేను నిన్ను కొన్ని ప్రశ్నలడుగుతాను. దాపరికం లేకుండా నిజాలు చెబుతావా?”

“తప్పకుండా”

“నీవు నీ తల్లిదండ్రులను గౌరవించి, వారి మనసు నొప్పించకుండా, వారిని బాగా చూసుకున్నావా?”

“నాకు ఉద్యోగం వచ్చి బయటకు వెళ్లేంతవరకు వారి దగ్గరే ఉన్నాను. వాళ్లంటే నాకు అంతులేని ప్రేమ. గౌరవం. వారి మనసును ఏనాడూ గాయపరచలేదు”

“తోడబుట్టిన వారిపట్ల నీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించావా?”

“అవును. నిరంతరం వారు ఎలా జీవితంలో నిలదొక్కుకుంటారా అనే ఆలోచించాను. అందరూ బాగున్నారు.”

“నీ భార్యను నీవు గౌరవించావా? నీవల్ల ఆమె దుఃఖాన్ని పొందిందా? మీ సంబంధం ఎలా ఉంది?”

“నా భార్యంటే నాకు అమిత ప్రేమ. ఆమెను సంప్రదించకుండా ఏ పనీ చేయను. మా మధ్య భౌతికమయిన ఆకర్షణ తగ్గినా, పరస్పర అనురాగం రోజురోజుకూ పెరుగుతూంది. మేమిద్దరం మంచి స్నేహితులం. నావల్ల ఆమె ఎన్నడూ కంటతడి పెట్టలేదు.”

“నీ వృత్తిలో నీవు నిజాయితీగా పని చేశావా? నీ వృత్తిని సమాజానికి వ్యతిరేకంగా వినియోగించలేదు కద! నీ వృత్తిలో నీకు ఆనందం లభించిందా?”

“భగవంతుడు దయతో నాకు ఉపాధ్యాయవృత్తి ప్రసాదించాడు. వేలాది మందికి చదువు చెప్పాను. వారి అభివృద్ధి కోసం తపన పడ్డాను. ఇప్పుడూ బోధన చేస్తూనే ఉన్నాను. డబ్బు తీసుకుని ట్యూషన్స్‌ చెప్పాను, కాని క్లాసురూంలో పిల్లలకు ఏనాడూ అన్యాయం చేయలేదు”

“నీ పిల్లలనెలా పెంచావు? వారిమీద నీ అభిప్రాయాలను రుద్దావా? నియంతలా వారిని శాసించి బాధించావా?”

“లేదు లేదు. వారికిష్టమైన చదువులే చదివించాను. తల్లిదండ్రులుగా వారికి అన్నీ సమకూర్చాం. మంచి వ్యక్తిత్వాన్నిచ్చాం. మా పిల్లలు రత్నాలు”

“వాళ్లు విదేశాల్లో ఉన్నారా?”

“కాదు మా వద్దనే ఉన్నారు. అందరం కలిసే ఉంటాం. విదేశాల మీద మోజు మా పిల్లలకు లేదు”

“నీ కులాన్ని మతాన్ని ఎక్కువగా భావిస్తూ ఇతరులను కించపరచావా? నీ హోదా కంటె తక్కువస్థాయి వారిని అవమానించావా?”

“ఆ భావన నాలో ఏమాత్రమూ లేదు.”

“సమాజానికి నీ యథాశక్తి ఏదయినా సాయం చేస్తూంటావా?”

“చేస్తూంటాను. బీదవారికి చేయూతనిస్తాను. రిటైరయిన తర్వాత నేను సంపాదించే డబ్బును ఇతరుల కోసమే వినియోగిస్తున్నాను.”

“రిటైరవకముందు?”

“అవకాశమున్నపుడల్లా పేదపిల్లలకు ఉచితంగా చదువు చెప్పేవాడిని. కోచింగ్‌ యిచ్చేవాడిని”

“నీవు సాధించినదంతా నీ కృషి వల్ల లభించినదేనా?”

“నా ఇష్టదైవం లక్ష్మీనరసింహుని దయవల్ల నేనీ స్థితిలో ఉన్నానని నా బలమైన నమ్మకం”

“ఆఖరు ప్రశ్న. ఈ క్షణంలో నీ జీవితం ముగిసిపోతుందని తెలుస్తే ఎలా స్పందిస్తావు?”

“భగవంతుడు నాకన్నీ ఇచ్చాడు. నా శక్తివంచన లేకుండా నా బాధ్యతలన్నీ నెరవేర్చాను. ఉడతాభక్తిగా సాటివారికి సాయపడ్డాను. ఈ క్షణంలో, ఈ గాణగాపురంలో, దత్తస్వామి సన్నిధిలో, మీలాంటి జ్ఞానుల సమక్షంలో ఈ జీవితాన్ని చాలించడం కంటే కావలసినదేముంటుంది నాకు?”

కృత్తివాస్‌ ముఖర్జీ లేచి నిలుచున్నాడు. ఆయన ముఖంలో దివ్య తేజస్సు. పతంజలి దగ్గరకు వచ్చి తలమీద చేయి పెట్టి ఆశీర్వదించాడు. పతంజలి ఒళ్లు ఝల్లుమంది! మంద్ర స్వరంతో ఇలా అన్నాడు.

“నాయనా! నీ విచారం నిర్హేతుకం. సాఫల్యమనేది వైయక్తికం సుమా! నీవు కొన్ని రంగాల్లో శిఖర సమానులైన వారితో పోల్చి చూసుకుని, దుఃఖిస్తున్నావు. కోట్లమంది మానవుల్లో అలాంటివారు పదుల సంఖ్యలో ఉంటారు. మిగతావాళ్లంతా జీవితంలో సఫలీకృతులు కాలేదు అని అనుకుంటే ఎలా?”

“భగవంతుని దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానులే. ఎవరి పరిధిలో వారు తమ విధులను నిర్వర్తించి, సమాజానికి తమ వంతు సేవ చేస్తారు. వారెంత చిన్నవారైనాసరే. మురికి కాలువలు శుభ్రం చేసేవాడయినా తనపని తాను సక్రమంగా చేస్తే సఫలుడే. అదే కర్మయోగం. అందరి పట్ల సమదృష్టి. ఇవి లోకంలోని అతి హీనస్థాయి వారికి కూడ వర్తిస్తాయి.

“సర్వత్ర సమదర్శినో యోగినః”

“యోగః కర్మసు కౌశలమ్‌”

“ఆత్మవత్‌ సర్వభూతాని”

“ఇవన్నీ నీకు తెలిసినవే. ఇవన్నీ నీ జీవితంలో ఆచరించావు. పదిమందికి చెప్పావు. ఇక ‘నాన్‌ అటాచ్‌మెంట్‌’, ‘బంధవిముక్తి’ అంటావా, ఆ స్థాయికి లక్షల్లో ఒకరు చేరుకుంటారు. చేరుకోవాల్సిన అవసరమూ లేదు. నీ సమాధానాలను బట్టి నీవు మంచి కొడుకువు, మంచి సోదరుడివి, మంచి భర్తవు, మంచి తండ్రివి, మంచి స్నేహితుడివి. మంచి సాటి మానవుడివి. లోపాలే లేనివాడు సృష్టిలో ఉండడు. కాబట్టి నీవు ‘సాఫల్యం’ పొందావు. సందేహం లేదు. ఇదే విధంగా శేష జీవితాన్ని కొనసాగించు. గాడ్‌ బ్లెస్‌ యు.”

పతంజలి మనసులోని నిర్వేదం మటుమాయమైంది. ముఖం తేటపడింది. వంగి ఆయన పాదాలను స్పృశించాడు. చీకటి పడుతూంది. కృత్తివాస్‌ ముఖర్జీ తన సంచీ భుజానికి తగిలించుకొని, నిశీధిలోకి నిష్క్రమించాడు, పతంజలిని వెలుగుతో నింపుతూ!

సాక్షాత్‌ ఆ అహోబిలేశుడో లేదా దత్త ప్రభువో ఈ మహనీయుని రూపంలో తన అజ్ఞానాన్ని పటాపంచలు చేయడానికి వచ్చారనిపించింది పతంజలికి.

రాత్రి గుల్బర్గా నుండి బస్సులో బయలుదేరి ఉదయానికి హైదరాబాద్‌ చేరుకున్నాడు. అందరితో మునుపటి లాగా ప్రవర్తించాడు.

ఆరోజు సాయంత్రమే ప్రజ్ఞకు నొప్పులు ప్రారంభమైనాయి. గైనకాలజిస్ట్‌ ఇచ్చిన డేట్‌ కంటే నాల్గురోజులు ముందే డెలివరీ వచ్చింది. ‘సాయిదత్త మెటర్నిటీ హోంలో ఆడపిల్లను ప్రసవించింది బుజ్జమ్మ. నార్మల్‌ డెలివరీ.

బయట వెయిట్‌ చేస్తున్న తండ్రీ కొడుకులవద్దకు వచ్చి సంతోషంగా చెప్పింది వసుధ.

“బావా! మనమరాలు! కన్నా! నీవు మామవైనావు రోయ్‌! బావకు ఫోన్‌ చేయ్యి” హడావుడిగా వెళ్లిపోతూ. మళ్లీ వెనుక్కు వచ్చి,

“టైం నోట్‌ చేయండి. ఏడు ఇరవైమూడు. ఈ రోజు మంచిదే, త్రయోదశి శుక్రవారం. హస్తా నక్షత్రం. మల్లినాధకు ఫోన్‌ చేయండి. జాతకం వ్రాసిపెడతాడు. మంచి పేరేదైనా ఆలోచించండి మనవరాలికి. కవులు కదా!” అంటూ వెళ్లిపోయింది వసుధ.

పతంజలి పెదవులు చిరునవ్వు నవ్వాయి.

తర్వాత ఇలా ఉచ్చరించాయి.

“సాఫల్య!”

~

*సర్వేజనాః సుఖినో భవన్తు*

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here