సబర్మతీలో కాలిడిన వేళ

0
10

[dropcap]భా[/dropcap]రత జాతిపిత మహాత్మాగాంధీ గురించి చదవని వారు, తెలియని వారు ప్రపంచం లోనే ఉండరు. మహాత్ముడు సాగించిన ఆయుధాలు లేని సత్యాగ్రహం స్వాతంత్ర్యోద్యమం గురించి మన చిన్నప్పుడు పాఠ్యంశాలలో చదువుకుని ఉన్నాం. మరి ఆ మహాత్ముడు జన్మించిన నడయాడిన నేలను దర్శిస్తే వచ్చే ఆనందమే వేరు కదా!

గాంధీజీ జైలు జీవితం గడిపిన దక్షిణాఫ్రికా దేశాన్ని, గాంధీని ఖైదు చేసిన జైలునూ చూసొచ్చాను. ఇప్పుడు అయన జన్మించిన నేల గుజరాత్ రాష్ట్రాన్ని, సబర్మతీ ఆశ్రమం ఉన్నటువంటి అహ్మదాబాద్ నగరాన్ని చూశాను. ఆ విశేషాలు మీ కోసం.

అహ్మదాబాద్ లోని సబర్మతీ నది ఒడ్డున గాంధీ నిర్మించుకున్న ఆశ్రమం స్వాతంత్ర్యోద్యమ సమయంలో కీలకమైన పాత్ర పోషించింది. ఈ ఆశ్రమం లోకి అడుగు పెడుతుంటేనే వళ్ళంతా గుగుర్పోడిచింది. ఆ మహనీయుడు నడిచిన నేలపై నేను కూడా కాలు మోపుతున్నాను అని మనసు ఉద్వేగంతో నిండిపోయింది. ఒక స్వాతంత్ర్య సమర యోదుని కూతురిగా దేశభక్తిని నరనరానా నింపుకున్న భారతీయురాలిగా నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను.

సబర్మతీ ఆశ్రమంలో గాంధీజీ కస్తూరిబాతో కలసి పన్నెండు సంవత్సరాలు నివసించారు. నేను కస్తూరిబా గాంధీ జీవిత చరిత్రను ఒక చిన్ని నవలగా రచించి దేశభక్తిని రగిలించే చరిత్రను పిల్లలకు అందించానని ఎంతో తృప్తి పొందాను. స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన ఉప్పు సత్యాగ్రహం దండి యాత్ర ఈ సబర్మతీ ఆశ్రమం నుంచే మొదలై చరిత్రను స్వంతం చేసుకున్నందున భారత ప్రభుత్వం జాతీయ స్మారక స్థలంగా గుర్తించింది. 1917వ సం. జూన్ 17 వ తేదీన గాంధీ మహాత్ముడు ఈ ఆశ్రమానికి వచ్చారు.

నది మీద నుంచి వీచే గాలులతో వాడినటువంటి రాట్నాలు ఒడికిన నూలు అన్నీ గదుల్లో చక్కగా అలంకరించబడి ఉన్నాయి. ఆనాటి చిత్రాలు, లేఖలు, ఫోటోలు ఎన్నో నిక్షిప్తం చేయబడ్డాయి. ఆనాటి చిత్రాలు వస్త్రాలు కూడా కొన్ని వేలాడదీయబడి ఉన్నాయి.

ఆశ్రమం వెలుపలి వాతావరణంలో నది ఒద్దు వైపుగా గాంధీ విగ్రహం ప్రతిష్ఠించబడి ఉన్నది. ఆశ్రమం లోపలికి అడుగు పెడుతూనే చెట్ల మధ్యలో చెడు వినకు, చెడుకనకు, చెడు మాట్లాడక అనే మూడు కోతుల విగ్రహాలు కనిపించాయి. గాంధీ జీవితంపై వచ్చిన సాహిత్యం అయన రాసిన ఉత్తరాలు, సందేశాలు ఎన్నో అమర్చి మ్యూజియం రూపొందించారు. ఇందులో వినోబా మీరా కుటీరం, ప్రార్థనా భూమి ఉన్నాయి.

ఇదే గుజరాత్‌ను చూడటం మొదటిసారి అక్కడి హస్తకళల గురించి తెలుసు. గాంధీ సొంత రాష్ట్రమైన గుజరాత్ చూడాలని ఎన్నో సంవత్సరాల కోరిక ఇప్పటికి తీరింది. 19వ తేదీన సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగు పెడుతూనే ఎయిర్‌పోర్టును ఫోటో తీశాను. చిన్న ఎయిర్‌పోర్టు ఇది. దక్షిణాఫ్రికా నుంచి గాంధీ తిరిగి వచ్చాక సబర్మతీ శ్రమాన్ని నిర్మించారు. నది తీరంలోని దండి వద్దనే గాంధీజీ ఉప్పు తాయారు చేశారు. ఆ ప్రాంతాన్ని కూడా చూడాలని ఉబలాటపడినప్పటికీ సమయం చాలక వెళ్ళ లేక పోయాం. గాంధీ జన్మించిన పోరుబందర్ కూడా చూడాలని చాలా ఆశపడ్డాము. అహింసా మార్గంలో బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా జరిగిన సత్యాగ్రహమే ‘ఉప్పు సత్యాగ్రహం’. దీనినే ‘దండి సత్యాగ్రహం’, ‘దండి యాత్ర’ అని కూడా అంటారు.

ఆశ్రమంలో ఉన్న ఉత్తరాలు సందేశాలు చదువుతుంటే చిన్నపుడు స్కూల్లో చదివిన పాఠాలు గుర్తుకు వచ్చాయి. ఆ వయసులో బట్టీపట్టి పరిక్షలు రాయడమే తప్ప పరిస్థితిని అర్థం చేసుకోలేం కదా! ఇప్పుడు ఆలోచిస్తుంటే నిజంగా గాంధీ లాంటి వ్యక్తి భూమ్మీద జన్మించారా అనిపిస్తుంది. రాక్షసుల పాలనలో నానా అవస్థలు పడుతున్న ప్రజలను రక్షించడానికి దేవుడు అవతారమెత్తాడు అంటే నవ్వే నాస్తికులు గాంధీ పుట్టుకనేమనాలి? వంద కోట్ల భారతీయులు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కోల్పోయి పరాయి రాజ్య పాలనలో బానిసల్లా బతుకిడుస్తుంటే దేవుడిలా వచ్చిన నేత గాంధీ. ఆ పరిస్థితులను తట్టుకునే దైర్యం చాక చక్యం కలగలిపిన వ్యక్తిగా రూపొందటం భారతీయుల అదృష్టం.

ఈ సబర్మతీ ఆశ్రమం నుంచే గాంధీ తన అనుయాయులతో దండి యాత్రను ప్రారంభించారు. రోజు రోజుకూ పెరిగే సత్యాగ్రహాలతో దండి దాకా సాగిన యాత్ర 24 రోజుల పాటు కొనసాగింది. ‘సబర్మతీ’ నది పేరని, ‘దండి’ ఊరు పేరని స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రను చదివేటప్పుడు తెలియదు. మా నాన్న అమ్మ స్వాతంత్ర్య ఉద్యమం గురించి చిన్నప్పుడు చెప్తుంటే జైలుకు వెళ్ళడమంటే చిన్న విషయమే అన్నట్లుగా అనిపించేది.

ఈనాడు మనకు జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించెందుకే ధైర్యం లేదు, అనవసరంగా వాళ్ళ దృష్టిలో చెడ్డవాళ్ళం కావటమెందుకని లోపల్లోపల బాధపడి ఉరుకుంటాం. ఇంట్లో ఉన్న నలుగురినీ ఒక్క తాటిపై నడపడమే కష్టం అనుకుంటున్న మనకు కోట్ల మందిని ఒక్క తాటిపైకి తెచ్చి నడిపించి గాంధీ ఎంత గొప్ప వ్యక్తో కదా అనిపించింది. నేను దక్షిణాఫ్రికాలో గాంధీని, నెల్సన్ మండేలాను ఉంచిన జైలు గదుల్ని చూసినపుడు ఎంతో ఆవేదన కలిగింది. దండి సత్యగ్రహం తర్వాత గాంధీని అరస్టు చేశారట. ఆయనతో పాటు 60,000 మంది భారతీయులు జైలు పాలయ్యరట. నేను ఇక్కడ తెలుసుకున్న విశేషాలన్నీ మీకు చెప్పాలనుకున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here