సదా(ఆ)నందమే మేలు

2
9

[box type=’note’ fontsize=’16’] “మనుషుల్లోని చపలత్వాన్ని బలహీనతలని రెచ్చగొట్టే సినిమాలూ, కథలూ అవసరం లేదు. స్వచ్ఛమైన హాస్యంతో మనసును తేలిక పరిచే కథలే గ్రేట్” అని గ్రహించిన ఓ రచయిత భార్య ఆలోచనలని ‘సదా(ఆ)నందమే మేలు‘ కథలో చెబుతున్నారు గంగాధర్ వడ్లమన్నాటి. [/box]

[dropcap]స[/dropcap]దానందంగారు ఇచ్చిన హాస్య మాస పత్రికలో అతని కథ చదివిన ఆండాళ్ళు, చిన్నగా మూతి విరిచేస్తూ “అబ్బా ఏంటండీ మీరూ, మీ తీరూ. ఎప్పుడూ హాస్య రచనలే చేస్తారు. ఆ మన్మధరావుని చూసి నేర్చుకోండి” అని ఓ క్షణంలోనే కిక్కెక్కినదానిలా, కళ్ళలో మత్తు నింపుకుని, శూన్యంలోకి చూస్తూ, “అసలు అతను ఆడవాళ్ళ గురించి ఎంత చక్కగా వర్ణిస్తూ నవలలూ, కథలూ వ్రాస్తున్నాడో చూసారా. అసలు నేను వయసులో ఉన్నప్పుడు, అతని శృంగార నవలలు ఎంచక్కా మంచం దిండుకింద పెట్టుకు మరీ చదివేదాన్ని. ఎంత అను’భూతో’ చెప్పలేం. అమ్మాయిలని వర్ణించే తీరూ, ప్రేమికుల మధ్య జరిగే ఆ రొమాన్స్ జోరూ, చదివితే ఎంతకైనా తెగించి అలాంటి రొమాన్స్ చేయాలనిపిస్తుంది. ఇక మగపిల్లల పరిసస్థితి ఏంటో. ఏమైనా అతని ఛి’లిపి’ వరసే వేరు. అందుకే ఆయనకి అంత పాపులారిటీ. మొన్నోసారి అదేదో ఛానల్లో ఆ రచయితకి ఆడవాళ్ళలో అభిమానులెక్కువని కూడా చెప్పారు” అని కళ్ళలో కిక్కు తగ్గించి, “మీరూ ఉన్నారు! అలాంటి కథలు రాయొచ్చుగా. కనీసం పట్టుమని పదిమంది అభిమానుల నుండి కూడా ఫోన్లు రావు. ఎందుకండీ ఈ హాస్యం” చెప్పిందామె ఈసారి ముఖాన్ని చిట్లిస్తూ.
ఆ మాటలకతను ముసి ముసిగా నవ్వుతూ “పోనీలేవే, నాకు తోచింది నచ్చి వ్రాస్తున్నాను, పాఠకులు అది మెచ్చి చదువుతున్నారు. ఏదో గడిచిపోతోంది. నాకు ఆశమ్ (Awesome) తృప్తి మిగులుతుంటే, నీకు మాత్రం అసంతృప్తి మిగలడమేంటో నాకార్ధం కావడం లేదు ఆండాళ్లూ” చెప్పారు సదానందం గారు.
“అలా అంటే కుదరదు ఆనందం. నువ్వూ అలాంటి కథలే వ్రాయాలి. వాటిని యువత పిచ్చెత్తి చదవాలి. నెట్లో నీ రచనల్ని న’బూతో’ న భవిష్యత్ అనాలి. అపుడే నాకు గర్వం. అర్ధమైందా” అందామె అతని ముక్కు పట్టుకుని అటూ ఇటూ కుదిపేస్తూ చిన్న నవ్వుతో.
“సర్లే. సాయంత్రమే దీనికో పరిష్కారం చెప్తాను” అని ముక్కు సరిచేసుకుంటూ ఆఫీసుకి బయల్దేరాడు.
సాయంత్రం సదానందం గారు వచ్చేప్పుడు మన్మధరావు రచించిన ‘కోరిక బలపడితే’ అనే పుస్తకాన్ని తెచ్చాడు. అది చూస్తూనే ఆండాళ్ళు వచ్చి “ఏంటండీ అది” అడిగింది.
“నీకో సర్‍ప్రైస్ ఇవ్వబోతున్నాను” అని సదానందం ఏదో చెప్పేంతలోనే, ఆ పుస్తకం తీసి అతని నెత్తిమీద ధభీ ధబీ మని బాది, తర్వాత దాన్ని కసిగా బర బరా చించేసింది.
అది చూసిన సదానందంగారు “ఏంటే ఇది. మెంటలొచ్చిందా. ఎందుకా పుస్తకాన్ని అలా ఆకులా చించేసావ్?” అడిగాడు కోపంతో, ఆమెని నెత్తిన మొట్టేయబోతూ ఆగి.
“ఎందుకా! మధ్యాహ్నం మా బాబాయి ఇంటికి వచ్చి వెళ్ళాడు. ఆయన మాటల సందర్భంలో ఓ విషయం చెప్పారు. ఆయన గారి మనవరాలు, ఈ రోజు ఓ పార్క్‌లో ఓ కుర్రాడితో దొరికిపోయిందట. ఆ కుర్ర వెధవని నాలుగు తగిలించేసరికి పారిపోయాడట. దాన్ని మందలించి అడిగితే ప్రేమలో రొమాన్స్ ఎంత బావుంటుందో అది అనుభూతి చెందితేనే తెలుస్తుందనీ, ఆ గొప్ప అనుభూతిని అందుకోవాలని ప్రేమలో పడిందట. అలా అని ఏ వెదవ చెప్పాడే అని నిలేసి అడిగితే, తన స్మార్ట్ ఫోన్‌లో తను డౌన్లోడ్ చేసిన కొన్ని దిక్కుమాలిన సినిమాలతో పాటు, నెట్ నుండి డౌన్లోడ్ చేసిన ఈ మన్మధరావు నవలలు కూడా చూపిందట. దాంతో ఆ మన్మధరావుని నా ముందే తెగ తిట్టేశారు. నాకూ ఆయన ఆవేశం సబబనిపించింది. అందుకే నేను అహం విడిచి ఒప్పుకుంటున్నాను. మీరే కరక్ట౦డీ. ఇవాళ మనుషుల్లోని చపలత్వాన్ని బలహీనతల్నీ రెచ్చగొట్టే సినిమాలూ, కథలూ అవసరం లేదండీ. స్వచ్ఛమైన హాస్యంతో మనసును తేలిక పరిచే కథలే గ్రేటండీ” చెప్పిందామె అతన్ని గట్టిగా వాటేసుకుంటూ.
‘ఇంకా నయం. నేనే ఇన్నాళ్లుగా ఆ మన్మథరావు పేరుతో మితిమీరిన శృంగార కథలూ, నవలలూ వ్రాస్తున్నానని చెప్పేను కాదు, ఆ పుస్తకం చించినట్టు నా డొక్కా చించేసేది. ఇక నుండి ఆ పేరునీ, ఆ రచనల్నీ వదిలేస్తే మేలేమో’ అని గొణిగాడు.
కానీ అపుడు ఆండాళ్ళు వాటేసుకోవడంతో అతని మాటలు ఆమె చెవిన పడనే పడ్డాయి. దాంతో ఆమె మామూలు కౌగిలి కాస్తా దృతరాష్ట్ర కౌగిలిగా మారింది మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here