సాధించెనే ఓ మనసా!-11

0
10

[box type=’note’ fontsize=’16’] ప్రముఖ తమిళ, ఆంగ్ల రచయిత వరలొట్టి రంగసామి రచించిన ఆంగ్ల నవలకు కొల్లూరి సోమ శంకర్ తెలుగు అనువాదం. ఇది 11వ భాగం. [/box]

[dropcap]“స్వా[/dropcap]గతం మేడమ్. దయచేసి లోపలికి రండి. మేడమ్, ఏం చూడాలనుకుంటున్నారు?”

మెరిసే కళ్ళతో, వినూ చాలా స్నేహపూరిత చిరునవ్వుతో వారిని స్వాగతించాడు.

వినూ ప్రకాశవంతమైన, పిల్లలలాంటి ముఖాన్ని చూసిన ఇద్దరు ఆడవాళ్ళూ నిట్టూర్పు విడిచారు. ఇతను శివ స్నేహితుడు అయితే తప్పేమీ జరగదు.

“మీరు… మిస్టర్ వినూ… అవునా…?”

“అవును మేడం. మీకెలా తెలుసు?”

“జెకె హాస్పిటల్‌కు చెందిన ఎంఎస్ సంజన మీ షాప్‍ని సూచించారు. ఆమె మీ గురించి కూడా చెప్పారు. మీరు డిజైనర్‌ట కదా, అవునా?”

“అవునండీ.”

“మిస్టర్ వినూ! మా కుటుంబంలో వివాహం ఒకటుంది. మీరు మాకు కొన్ని మంచి డిజైన్లను చూపించి, ఉత్తమమైన రేట్లు చెప్తే, అన్ని పట్టు చీరలు మీ దగ్గరే కొనాలని అనుకుంటున్నాము.”

“తప్పకుండా, మేడమ్.”

“పద్మా, సంజన తన ఎర్ర చీరను డిజైన్ చేసిన వ్యక్తి గురించి చెప్పింది. నీకు పేరు గుర్తుందా?”

మాల్య ఇప్పుడు ఆ 900 చదరపు అడుగుల బోటిక్‌లో ఆస్కార్ విజేతలా నటిస్తోంది.

పద్మ కూడా తన అభినయపూర్వక ప్రతిభను ప్రదర్శించడంలో తక్కువ తినలేదు.

“శివకుమార్ లేదా శివరామన్, అది ‘ఎస్’తో ప్రారంభమయ్యే పేరు.”

“ఓహ్, ఇప్పుడు నాకు అర్థమైంది. అది శివ. అవును, శివే.”

వినూకి సరదాగా ఉంది. మాల్యని ఆపి, పద్మ మాట్లాడసాగింది.

“మిస్టర్ వినూ, మిస్టర్ శివ మా చీరలను డిజైన్ చేయాలని మేము కోరుకుంటున్నాము. మేము అతనితో మాట్లాడాలనుకుంటున్నాము. మాకు నచ్చితే, ఈ రోజునే అడ్వాన్స్ ఇచ్చేస్తాము” అంటూ, మాల్య వైపు తిరిగి…

“మాల్య, మనం ఒక లక్ష రూపాయలు ముందుగానే చెల్లించగలమా? మొత్తం బడ్జెట్ పది లక్షల వరకు ఉండవచ్చని మామ నాకు చెప్పారు. కాబట్టి 1 లక్ష, అంటే 10% పర్వాలేదు. సరేనా?”

“ఆఁ. అవును. సరైనదే. ”

వినూ ఈ సంభాషణను ఆసక్తిగా గమనిస్తున్నాడు.

“మేడమ్, దయచేసి వచ్చే నెల 3వ తేదీన రాగలరా? మేడమ్, ఈ రోజు 25 వ తేదీ. ఇప్పటి నుండి పది రోజులు కూడా లేదు కదా.”

“ఎందుకు, ఈ రోజు మేం డిజైనర్‌ను కలవలేమా? అతను ఇక్కడ లేడా?”

“అతను ఇక్కడ ఉన్నాడు. కానీ మీరు అతన్ని చూడలేరు, మేడమ్. వచ్చే నెల 2 వ తేదీ వరకు ఎటువంటి కొత్త డిజైన్ పనులను అంగీకరించడానికి అతను ఖచ్చితంగా నిరాకరించాడు.”

“మిస్టర్ వినూ, మీకు ఇంకొంచెం అడ్వాన్స్ కావాలంటే, మేము చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాము. మాల్య, ఇప్పుడు 2 లక్షలు చెల్లిద్దాం… కానీ మేము 10 రోజులు వేచి ఉండలేము.”

వినూ చుట్టూ చూస్తూ, గొంతు తగ్గించి, గుసగుసగా మాట్లాడాడు.

“మేడమ్, నేను మీ ఆర్డర్‌ను ఎట్టి పరిస్థితిలోను పోగొట్టుకోను. కానీ నేను మీకు చెప్పినట్లు ఎవరికీ చెప్పవద్దు. శివ పుట్టినరోజు సెప్టెంబర్ 2న. ఆ రోజు అతను తనకు చాలా దగ్గరైన వ్యక్తికి గొప్ప బహుమతి ఇవ్వాలని యోచిస్తున్నాడు.

అతని ఉద్దేశంలో ఒక పరిపూర్ణమైన బహుమతి అంటే ఉత్తమ మెటీరియల్స్‌తో తయారు చేసిన పట్టు చీరలు. అతను తన చేతులతో రూపొందిస్తాడు.

అతను గత రెండు నెలలుగా ఆ ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నాడు. అతను మేడమీద ఉన్న మా డిజైన్ సెంటర్లో ఉన్నాడు. అతను తన పనిని చూడటానికి కూడా నన్ను అనుమతించడు, మేడమ్.

చాలా రోజులలో అతను తన టిఫిన్ లేదా భోజనం లేదా రెండింటినీ దాటవేస్తున్నాడు. అతను చాలా చిరాకు పడుతున్నాడు, వేరే ఇతర పనిని అంగీకరించడానికి తీవ్రంగా నిరాకరించాడు. అందుకే 3వ తేదీన రావాలని నేను మిమ్మల్ని అడిగాను. అతను రెండు రోజుల్లో డిజైన్ చేస్తాడు. మేము చీరలు రెండు వారాల్లో అందిస్తాం, మేడమ్.”

దర్యాప్తు ప్రక్రియను పూర్తి చేయడానికి మాల్య మరో సమాచారాన్ని సేకరించాలని అనుకుంది.

“ఇది తమాషా కదూ, మిస్టర్ వినూ. చూడండి, మీ ఎదురుగా లక్షలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్న కస్టమర్ ఉన్నారు. కావాలంటే మేము ఫుల్ ఎమౌంట్ ముందుగానే చెల్లించగలం. భారీగా ఆదాయం వచ్చే ఈ పనిని చేపట్టే బదులు, అతను కొన్ని చిన్న బహుమతుల పట్ల ఎందుకు ఆసక్తి చూపించాలి, ఓహ్?”

“ఆసక్తి కొద్దీ అడుగుతున్నాను, మిస్టర్ వినూ, డబ్బు చెల్లించే కస్టమర్ కంటే ఒక ప్రొఫెషనల్‌కు ఎవరు దగ్గరగా ఉంటారు, ఆఁ?”

“వాళ్ళ అమ్మగారు లేదా అక్క లేదా పిన్ని లేదా అతని యజమాని సంజన కావచ్చు.”

ఆడవాళ్ళిద్దరు ఒకేసారి అవతలి వైపు తిరిగారు. వారి కళ్ళలోని కన్నీళ్లను తుడుచుకోవడం ఒక అందమైన దృశ్యం.

మాల్య వెక్కి వెక్కి ఏడ్చేస్తుందేమోననిపించింది. కొన్ని సెకన్ల తరువాత మాల్య నిజంగానే షాపు నుండి బయటకు వచ్చింది.

పద్మ షోకేస్ లోని బొమ్మను నిమిషం వివరంగా పరిశీలించినట్లు నటిస్తూ తరువాత ఐదు నిమిషాలు గడిపింది. ఆ తర్వాత దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోయింది. ‘తరువాత వస్తామ’ని అస్పష్టంగా చెప్పింది ఆమె.

ఆమె షాపు నుండి బయటకు వచ్చింది.

ఆ సమయంలో పాండి బజార్ పూర్తిగా రద్దీగా ఉంది.

ఫుట్‌పాత్ మధ్యన నిలబడి సిగ్గుపడకుండా ఏడుస్తున్న ఆ 30 ఏళ్ళ మహిళను చూసి ప్రతి ఒక్కరూ విస్తుపోయారు.

పద్మ మాల్య వద్దకు పరుగెత్తి ఆమె చేతులు పట్టుకుంది. మాల్య పద్మ కౌగిలిలో ఒదిగింది.

“మనం నిజంగా మూర్ఖులం, పద్మా. పాపం, వాడు మన కోసం కష్టపడుతున్నాడు. మనకు మంచి బహుమతి ఇవ్వడానికి శ్రమిస్తున్నాడు. మనమేమో మూర్ఖులం, వాడిని అనుమానించాము.”

“మాల్య, ప్రతీకారం తీర్చుకోవడానికి నా దగ్గర సరైన ప్రణాళిక ఉంది.”

మాల్య కళ్ళు తుడుచుకుని తనను తాను సంబాళించుకుంది.

“ఏంటది?”

పద్మ తన మాస్టర్ ప్లాన్ గురించి చెప్పడంతో మాల్య కళ్ళు విశాలమయ్యాయి.

***

మామూలు రోజులానే సెప్టెంబర్ 2 వచ్చింది. శివ కాఫీ తాగకుండా, టిఫిన్ తినకుండా రోజూ వెళ్ళే కన్నా చాలా ముందుగానే ఉదయం ఆరు గంటలకు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు.

కాసేపటికి మాల్య ఆఫీసు నుండి సుమారు 8 మంది నిపుణులైన కార్మికులు వచ్చారు. వారు ఫ్లాట్ యొక్క పెద్ద డ్రాయింగ్ రూమ్‌ని అలంకరించడం ప్రారంభించారు. పట్టు చీర శివ చేతి విద్య అయితే, థర్మోకాల్, ప్లైవుడ్, పేపర్లు మాల్య ఆయుధాలు. ఆమె రూపొందించిన సరళమైన, సొగసైన డిజైన్ 200 చదరపు అడుగుల ఆ డ్రాయింగ్ రూమ్‌కి పండుగ వాతావరణాన్ని కల్పించింది.

గది మధ్యలో 10 x 5 కొలతతో ఒక ఫ్లెక్స్ షీట్ మీద – పెద్ద అక్షరాలతో “మా శివకి పుట్టినరోజు శుభాకాంక్షలు” అని వ్రాయించింది.

క్రింద లైన్‌లో శుభాకాంక్షలు తెలుపుతున్న వారి పేర్లు ఉన్నాయి.

అమ్మ – పరిమళ, అక్క – మాల్య, పిన్ని – పద్మ, బాస్ – సంజన.

ఇవే పదాలు వ్రాసి ఉన్న రెండు కిలోల చాక్లెట్ కేక్ సాయంత్రం నాలుగు గంటలకు వారికి అందింది. పద్మ, మాల్య ఆ రోజు ఆఫీసులకు వెళ్ళలేదు.

మధ్యాహ్నం మూడు గంటలకు ఏదో ‘ముఖ్యమైన పని’ కోసం వాళ్ళు బయటకు వెళ్ళారు, సాయంత్రం ఐదున్నర వరకు తిరిగి రాలేదు.

పరిమళ వంటగదిలో తీరిక లేకుండా ఉంది. విస్తృతమైన విందు సిద్ధం చేయడంలో నిమగ్నమై ఉన్న ముగ్గురు వంటమనుషుల బృందానికి ఆమె ఆదేశాలిస్తోంది.

సాయంత్రం ఆరు గంటలకు తలుపు గంట మోగింది. శివ వచ్చాడనుకుని, పద్మ, మాల్య తలుపు దగ్గరకు పరిగెత్తారు.

కానీ వచ్చింది సంజన. శివ డిజైన్ చేసిన అందమైన ప్రకాశవంతమైన ఎరుపు చీర కట్టుకుంది. మెడలో మెరిసే వజ్రాల హారం, డైమండ్ చెవి రింగులు, ఇంకా సింగిల్-డైమండ్ ముక్కు పుడక ఆమెను దేవకన్యలా మార్చాయి.

మాల్య సంజనని గట్టిగా కౌగిలించుకుంది. తర్వాత ఆమె చేతులు పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది. సంజన తన పేరును ఫ్లెక్స్ బోర్డు పైనా, కేక్ మీద చూసి కరిగిపోయింది.

“నా పేరు ఎందుకు మాల్య? నేను ఇక్కడికి అతిథిగా వచ్చాను. “

“మన నలుగురిలో ఒకరివి. శివ స్వయంగా తన స్నేహితుడికి చెప్పినది అదే.”

“మాల్య! ఒక్కోసారి నాకు శివ పట్ల అసూయ కలుగుతుంది. అతనిపై ప్రేమను చూపించడానికి మీరు ముగ్గురు ఉన్నారు. కానీ మాల్య, మీలాంటి వారు నాకు లేరు.”

“మేం ముగ్గురు అదే ప్రేమను నీ మీద కూడా కురిపించడానికి సిద్ధంగా ఉన్నాం, సంజనా. నా మనసులో ఏముందో చెప్పడం సరైనదో కాదో అర్థం కావడం లేదు. ”

“మాల్య, సందేహం ఎందుకు? చెప్పు, నీ మనసులో మాట చెప్పు.”

“నిన్ను ఇలా చూడటం వల్లా, నీ దయగల మాటలు వినడం వల్లా – వయస్సు, కులం ఇంకా ఇతర అడ్డంకులను విస్మరించి, శివ వధువుగా నిన్ను మా ఇంటికి తీసుకురావాలని ఉంది.

మేం నిన్ను మా చేతుల్లోకి తీసుకుని, ఈ ఇంట్లో నిన్ను సంతోషపెట్టడానికి మా జీవితాన్ని, ప్రాణాలను ఇస్తాము.”

సంజన ముఖంలో భావాలను చూసిన మాల్య తన తప్పును గ్రహించింది.

“నేను చెప్పినది తప్పు అని అనుకుంటే, దయచేసి నన్ను క్షమించు. నేను మాట్లాడినదాన్ని మర్చిపో. నిన్ను బాధపెట్టినందుకు క్షమించు సంజనా” అంది మాల్య.

తన ప్రియుడి గురించి చెప్పాలని అనుకుంది సంజన. కాని అది సరైన సమయం కాదని గ్రహించింది.

“పర్వాలేదు.” సంజన స్వరంలో జీవం లేదు.

పద్మ ఓ ప్లేటులో వేయించిన జీడిపప్పు తెచ్చింది. వాళ్ళు ముగ్గురు రకారకాల విషయాలు మాట్లాడుకున్నారు.

సమయం గడుస్తోంది.

***

సుమారు 8 గంటలకు మళ్ళీ డోర్ బెల్ మోగింది. వాళ్లందరికీ తెలుసు వచ్చింది శివ అని.

మాల్య ముందడుగు వేసింది.

“అమ్మా, అది శివ అయి ఉండాలి. నువ్వు వెళ్లి తలుపు తెరవు. పద్మా, సంజనా, ఇక్కడికి రండి. బ్యానర్ దగ్గర కలిసి నిలబడి శివకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని పాడదాం” అంది.

పరిమళ తలుపు తెరిచిన వెంటనే శివ చేతిలో పెద్ద పార్శిల్‌తో ఇంట్లోకి ప్రవేశించాడు.

ముగ్గురు ఆడవాళ్ళు పెద్ద గొంతులో పుట్టినరోజు శుభాకాంక్షలు పాడటం ప్రారంభించారు.

డ్రాయింగ్ రూమ్‌లో అసాధారణమైన అలంకరణ, శివ పుట్టినరోజును ప్రకటించే పెద్ద బ్యానర్, పెద్ద కేక్, కోరస్ పాట, సంజన సమక్షం… పైగా అతను డిజైన్ చేసిన చీరలో రావడం… శివ కన్నీళ్ళతో అక్క వైపు చూశాడు.

“అక్కా, ఏం జరుగుతోంది?”

మాల్యా తన చిన్నారి సోదరుడిని కౌగిలించుకుని, అతని నుదుటిపై ముద్దు పెట్టుకుని పలకరించింది. పద్మ కూడా అలాగే చేసింది. పరిమళ కొడుకును కౌగిలించుకుని దీర్ఘాయువు, ఆనందం కలగాలని దీవించింది.

సంజన శివకి షేక్‌హ్యాండ్ ఇచ్చింది.

“శివ, నో కోసం ఒక చిన్న బహుమతి.”

“ధన్యవాదాలు, మేడమ్.”

“గిఫ్ట్ ప్యాక్ లోపల ఏముందో చూడవా?”

దాన్ని తెరిచాడు శివ. అది తానిష్క్ నుండి సంజన ఎంపిక చేసిన అందమైన బంగారు కంకణం.

“మేడమ్, ఇంత ఖరీదైన బహుమతి ఎందుకు?”

“ఇది ఖరీదైనదని అనుకుంటున్నావా? సరే, వీళ్ళేం చేశారో చూడు.”

పద్మ, మాల్య శివకి ఒక చిన్న పెట్టె ఇచ్చారు.

“శివ, మేము భరించగలిగేది ఇదే.”

వారి ముఖాలు అతి దయనీయంగా పెట్టారు.

బాక్స్ తెరవమని సంజన శివని కోరింది.

లోపల ఒక చిన్న కీ ఉంది.

“మాల్య, నేను ఊహించనా? ఈ కీ మన పార్కింగ్ స్థలంలో ఉన్న సరికొత్త స్పోర్ట్స్ బ్లూ హ్యుండాయ్ ఐ 10 కారుదని అనుకుంటున్నాను. సరిగ్గానే చెప్పానా?”

“అక్కా, పిన్నీ…” శివ వారికి కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాడు. కాని మాటలు రాలేదు. వెక్కిళ్ళతో చెప్పాడు.

అతను వెక్కిళ్ళను ఆపలేకపోయాడు. వంటగదిలో బిజీగా ఉన్న పరిమళ శివ గొంతు విని ఏం జరిగిందో అని బయటకు వచ్చింది.

“ఎందుకు అమ్మాయిలూ, నా కొడుకు పుట్టినరోజున వాడిని ఏడిపిస్తున్నారు?”

అమ్మాయిలు కళ్ళలో నీళ్ళతో నవ్వారు.

“శివా, ఇక్కడ కొత్త బట్టలు ఉన్నాయి. అవి వేసుకుని కేక్ కట్ చేయడానికి రా” అంటూ శివ చేతికి ఒక పార్శిల్ అందించింది పద్మ.

పది నిమిషాల తరువాత శివ తిరిగి వచ్చాడు. అతను స్కై-బ్లూ కలర్ ఫేడెడ్ జీన్స్ ప్యాంటు, ఫుల్ హ్యాండ్ పిచ్ బ్లాక్ టీ షర్టు వేసుకున్నాడు.

సంజన అతన్ని చూసింది. తాను చాలా నిర్ణయాలు తీసుకోవలసి ఉందని, అది కూడా చాలా వేగంగా తీసుకోవాలని ఆమెకు తెలుసు.

ఆ నిర్ణయాల గురించి – అవి ఎంత అప్రియమైనవి అయినా – పార్టీ తర్వాత శివకి చెప్పడానికి ఆమె మనసులో ఒక నోట్ తయారు చేసుకుంది.

ఆమె తన ఆలోచనలను కూడగట్టుకుంది. వాటిని తెలియజేయడానికి సరైన పదాలను కూడా ఎంచుకుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here