సాధించెనే ఓ మనసా!-13

3
10

[box type=’note’ fontsize=’16’] ప్రముఖ తమిళ, ఆంగ్ల రచయిత వరలొట్టి రంగసామి రచించిన ఆంగ్ల నవలకు కొల్లూరి సోమ శంకర్ తెలుగు అనువాదం. ఇది 13వ భాగం. [/box]

[dropcap]“ను[/dropcap]వ్వు తప్పు చేశావని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఇది సంస్థ ఖర్చులను తగ్గించడానికి చేపట్టిన సంస్కరణ మాత్రమే. అధిక జీతాలు ఉన్న వారందరినీ పంపించేస్తున్నాం.

పైగా ఖర్చులను ఆదా చేయడానికి తక్కువ జీతాలకి కొత్తవాళ్ళని నియమించుకుంటున్నాం. నీకు బాగా తెలుసు, శివా. నేను బ్యాంకు రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించాలి.”

“సర్, నా అపాయింట్‌మెంట్ లెటర్‌లో ఉన్న మూడు నెలల నోటీసు వ్యవధినైనా కనీసం మీరు గౌరవిస్తారని నేను ఊహించాను.”

“బదులుగా నీకు మూడు నెలల జీతం ఇస్తాను. నేను ఇప్పటికే చెక్కులపై సంతకం చేశాను. వాటిని సంజన దగ్గర తీసుకో. గుడ్ లక్, శివా. ”

డాక్టర్ కన్నప్పన్ “బయటకి నడు” అని మర్యాదగా చెప్తున్నారు.

ఆయనతో వాదించడంలో అర్థం లేదని శివకి తెలుసు. తను తన యజమాని సంజన తోనే తేల్చుకోవాలి. అతను ఆమె గదిలోకి ప్రవేశించాడు.

***

ఆ రోజు సంజన అందమైన నెమలి నీలంరంగు పట్టు చీర కట్టుకుంది.

“హాయ్ శివా, నీకేమైంది? నువ్వు బాగానే ఉన్నావు కదా? ఇదివరకూ ఎప్పుడూ లోపలికి వచ్చేముందు తలుపు తట్టి మర్యాదగా అడిగి వచ్చేవాడివి. ఈ రోజు ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? నీ నాగరికత, మర్యాద ఏమయ్యాయి?”

“నేను చేసిన తప్పేంటి మేడమ్? మీరు నాకు చెప్పిన పనులన్నీ నేను చేయలేదా? ఆ మోసగాడు రాజశేఖర్ లాగా నేను మీ డబ్బును దొంగిలించానా?

నేను ఆఫీసు సమయంలో నా వ్యక్తిగత పని చేశానా? నా పనిలో ఏదైనా లోపాన్ని మీరు ఎత్తి చూపగలరా? అకస్మాత్తుగా నన్ను ఎందుకు తీసేస్తున్నారు?”

“పొదుపు చర్యలు శివా. నీ జీతం 15వేలు. ఇంకా ప్రోత్సాహకాలు, పిఎఫ్, ఇతర చెల్లింపులను జోడిస్తే, అది 20 వేలకి పైగా అవుతోంది. నీతో సమానంగా చక్కగా పనిచేసే ఇద్దరు కొత్త ఉద్యోగులకు ఒక్కొక్కరికి 6 వేల రూపాయలే ఇస్తున్నాం.”

“మేడమ్, వాళ్ళు నాతో సమానంగా చక్కగా పని చేయడానికి కారణం, వాళ్ళకి నేనే శిక్షణ ఇచ్చాను.”

“అది నీ విధుల్లో భాగం, శివా. మేము నీపై నెలకు 20వేలు ఖర్చు చేయడానికి కారణం అదే.”

“అంటే నా వేలితోనే నా కంట్లో పొడిచారన్న మాట! మీరు చాలా తెలివైనవారు, మేడమ్ ”

సంజన శివ వ్యాఖ్యలను పట్టించుకోకుండా ఇంటర్‌కామ్‌లో ఎవరితోనే మాట్లడింది.

“శివ చెక్కులు, రిలీవింగ్ ఫార్మ్స్ సిద్ధంగా ఉన్నాయా?”

“…”

“సరే, ఇక్కడికి తీసుకురండి.”

“శివ నువ్వు ఈ నెలలో 18 రోజులు పనిచేశావు. ఈ నెలకు ప్రొ-రేటెడ్ జీతం ఇది. ఇంకా ఈ చెక్ నీ అపాయింట్‌మెంట్ ఆర్డర్ నిబంధనల ప్రకారం మూడు నెలల నోటీసు పేమెంట్ కోసం. రిలీవింగ్ ఫార్మ్ పై ఇక్కడ సంతకం పెట్టు. ఈ చెక్స్ తీసుకో. గుడ్ లక్.”

శివకి షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి సంజన తన సీటు నుండి లేచి నిలబడింది. ఆమె అతనికి చెక్కులను అందజేసింది.

శివుడు ఆ హేయమైన చెక్కులను చించేసి, ఆమె ముఖం మీద విసిరేయాలనుకున్నాడు, కాని తనని తాను నియంత్రించుకున్నాడు.

తన అతి ఆవేశాన్ని అణుచుకునేందుకు శివ బయటికి వెళ్ళిపోబోయాడు, కాని, సంజన మాటలు అతన్ని ఆపాయి.

“మీ ఇంట్లో వాళ్ళు నీకు నేర్పించిన మర్యాద ఇదేనా? నీ బాస్ నీకు యాభై వేల రూపాయలకు చెక్కులు ఇచ్చింది. నీ బాస్ నీకు శుభాకాంక్షలు తెలిపింది. కనీసం థాంక్స్ చెప్పడానికి కూడా నీకు మర్యాద లేదు. ప్రపంచం ఎటు పోతోంది, శివా?”

తన మాజీ ఉద్యోగి తనని కోపంగా చూడడం సంజన తట్టుకోలేకపోయింది.

“అది సరే, శివా. మీకు ఆ సాధారణ మర్యాదలు తెలియకపోతే నేను ఇప్పుడు నేర్పించలేను. నీ మాజీ బాస్‌తో కలిసి ఒక కప్పు ఐస్ క్రీం తింటావా? చివరిగా ఒక్కసారి? నాతో రా, చెప్తున్నాగా. ”

శివ తనని తాను నియంత్రించుకోలేకపోయాడు. కనీసం ఒక రోజు నోటీసు లేకుండా ఉద్యోగం లోంచి తీసేసి ఆమె అతన్ని అవమానించింది.

ఆ పైన ఆమె తన కఠినమైన మాటలతో అతన్ని ఆటపట్టిస్తోంది. శివ నోటికి వచ్చినట్టు మాట్లాడాడు.

“నాకు తెలుసు మేడమ్. నన్ను పనిలోంచి తీసేయ్యమని మీ ప్రేమికుడు చెప్పి ఉంటారు. అందుకే మీరు, మీ నాన్నగారు నన్ను తీసేయ్యడానికి ఈ ప్రణాళిక వేశారు. మీరు నాకు చెప్పుండాల్సింది.

మేడమ్, మీరు అడిగితే, నేను సంతోషంగా రాజీనామా చేసేవాడిని. పొదుపు చర్యలు, బ్యాంక్ లోన్ తిరిగి చెల్లించడం అని ఆ చెత్త మాటలు మీరు నాతో ఎందుకు అనాలి?

ఆసుపత్రికి గత సంవత్సరం వంద లక్షలకు పైగా లభాలొచ్చాయని నాకు తెలుసు. మీరేమో నాకు చెల్లిస్తున్న 20000 రూపాయల జీతం ఆదా చేయడం గురించి మాట్లాడుతున్నారు.

ఒకే రోజున తండ్రీకూతుళ్ళిద్దరూ మానసిక సంతులనాన్ని ఎలా కోల్పోయారో నాకు అర్థం కావడం లేదు. ఏమైనా, నా నిజాయితీకి ఒక అందమైన బహుమతిని ఇవ్వడానికి మీరిద్దరూ చేతులు కలిపారు మేడమ్. మీకు మేలు కలుగు గాక.”

శివ కోపం కన్నీళ్లుగా బయటకు వచ్చింది.

“శివా, చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నావు. నాతో ఐస్ క్రీం పార్లర్ కి రా. నేను అన్నీ వివరిస్తాను. ”

“ఊహూ, నేను రాను. మీ ప్రేమికుడిని పిలవండి. అతను మీతో ఐస్ క్రీం తింటాడు. నేను ఇప్పుడు వెళ్తున్నాను. గుడ్ బై. ఆఁ, ఈ అద్భుతమైన చెక్‌లకు థాంక్స్. ”

“ఇలా నిన్నెప్పుడూ చూడలేదు, శివా. ఎంత కోపం!”

“…”

“సరే, నువ్వు ఐస్ క్రీం కోసం రావలసిన అవసరం లేదు. కానీ నువ్వు ఈ స్థితిలో డ్రైవ్ చేయకూడదు. నేను నిన్ను దిగపెడతాను. నీ కారును తరువాత తీసుకురమ్మని నా డ్రైవర్లలో ఒకరికి చెప్తాను. నాతో రా.”

కనులు చెమ్మగిల్లగా, శివ ఆమెను చూశాడు.

“నువ్వు మర్యాదలను మరచిపోయి ఉండవచ్చు. కానీ నేను మర్చిపోలేదు. రిటైర్ ఆయ్యేవాళ్ళని వారి చివరి రోజున వారి ఇళ్ళ వద్ద డ్రాప్ చేస్తారని నువ్వు వినలేదా? నేను ఇప్పుడు అలాంటి పనే చేస్తున్నాను.”

సంజన నవ్వు శివకి క్రూరంగా అనిపించింది.

తను మళ్ళీ ఆమెను కలవలేనని శివకి మనసులో తెలుసు. అతను ఆమెతో మరికొంత సమయం గడపాలని తీవ్రంగా కోరుకున్నాడు.

పురసవల్కం వెళ్ళడానికి కనీసం గంటన్నర సమయం పడుతుంది. అతను ఆమెతో మాట్లాడడు. కానీ అతను చివరిసారిగా ఆమెతో కలిసి కారులో కూర్చోవాలనుకున్నాడు.

సంజన అతన్ని కార్ పార్కింగ్ వైపుకు దాదాపుగా లాక్కెళ్ళింది. డ్రైవర్ నుండి తాళంచెవి తీసుకొని కారును స్వయంగా నడిపింది.

***

సమయం ఇంకా పది గంటలు కూడా కాలేదు. పీక్-అవర్ ట్రాఫిక్‌లో నగరం మొత్తం ఉక్కపోతగా ఉంది. సంజన కారు తిరు వి.కా. వంతెనపైకి మళ్ళింది. ఆపై గ్రీన్‌వేస్ రోడ్‌ ఎక్కింది.

బిల్‌రోత్ హాస్పిటల్ సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్‌ వద్ద ఆమె ఎడమ మలుపు తీసుకుంది.

శివ పూర్తిగా మౌనంగా ఉన్నాడు. అతని కళ్ళలో నీరు ఉబుకుతోంది.

కొద్ది నిమిషాల తరువాత సంజన వాహనాన్ని ఆపింది.

“శివా, ఎందుకక్కడ భారీ గుంపు ఉందో నీకు తెలుసా? ఆ రంగురంగుల షామియానా ఏంటో?”

శివ వాటిని చూసే మానసిక స్థితిలో లేడు. అర్థంలేని తదేకమైన చూపు చూశాడు.

సంజన అతని భుజాలపై కొట్టింది.

“హే శివా, కళ్ళు తెరువు, నేను చెప్తున్నాగా.”

శివుడు తన కుడి వైపు చూశాడు.

అక్కడ ఒక కొత్త దుకాణం వచ్చింది. ‘శివా సిల్క్స్’ అనే పేరు ఉదయపు సూర్యకాంతిలో ప్రకాశించింది.

“నీ పేరున్న వారెవరో కొత్త వెంచర్ ప్రారంభించినట్లు కనిపిస్తోంది. రా ఆ మూర్ఖుడు ఎవరో చూద్దాం.”

***

శివ కారులోంచి దిగగానే మాల్య, పద్మలు తనకి స్వాగతం చెప్పడానికి ‘హారతి’ పళ్ళెంతో వేచి ఉండడాన్ని చూశాడు.

శివ తల్లి మరొక వైపు ఉంది. వారికి కొంచెం దూరంగా డాక్టర్ కన్నప్పన్, వినూ నిలబడ్డారు.

శివ చెవిలో సంజన గుసగుసలాడింది.

“వాళ్ళంతా నీ కోసం ఎదురు చూస్తున్నారు, శివా. ముఖం మీద ఆ తమషా హావభావాలు మార్చు. అన్ని ఫోటోలలో ధుమధుమలాడే కోతిలా కనిపిస్తావు. మంచి అబ్బాయివి కదూ, ఉత్సాహంగా ఉండు. ”

ఆమె శివ చేతులు పట్టుకుని షాపు వైపుకి నడిపించింది.

సాంప్రదాయకంగా షాపులోకి స్వాగతం పలకడానికి ముందు మాల్య, పద్మ శివకి హారతిచ్చారు.

ఒక అమ్మాయి పరిమళకు ఒక వెండి కత్తెరను అందించింది. ఆమె నేర్పుగా పేపర్ రిబ్బన్ కట్ చేసి షాపుని ప్రారంభించింది. అందరూ చప్పట్లు కొట్టారు.

శివుడు కన్నీటి పర్యంతం అయ్యాడు

“మేడమ్.. మేడమ్…. ‘

“శివా, నువ్వు ఉంటే ఐదేళ్ల అబ్బాయిలా కోపంగా ఉంటావు లేదా ఐదేళ్ల అమ్మాయిలా ఏడుస్తూ ఉంటావు. ఎప్పుడు ఎదుగుతావు శివా?”

“మేడమ్.. మేడమ్….”

“లేదు, నువ్వు నన్ను మేడమ్ అని పిలవకూడదు. నన్ను పార్ట్‌నర్ అని పిలు. అవును మనం శివా సిల్క్స్‌లో సమాన భాగస్వాములం. నేను డబ్బు పెట్టుబడి పెట్టాను.

నువ్వు మీ ప్రతిభను పెట్టుబడి పెట్టబోతున్నావు, మనం లాభాలను సమానంగా పంచుకుంటాము. ఈ నిబంధనలను అంగీకరిస్తూ నువ్వు భాగస్వామ్య దస్తావేజులపై సంతకం చెయ్యాలి.”

“…”

“అవును, శివా. నీలాంటి కళాకారుడు ఆత్మహత్యా సదృశం లాంటి గుమాస్తా పనికి పరిమితం కావాలని నేను కోరుకోను. అది చాలా పాపం. ఇప్పుడు నువ్వు రోజంతా పట్టు చీరలను డిజైన్ చేయవచ్చు. నిన్ను ఎవరూ ప్రశ్నించలేరు.”

శివకి ఇంకా మాటలు రావడం లేదు.

“రా, షాపంతా తిరిగి చూద్దాం.”

ఈ షాపు కేవలం 900 చదరపు అడుగుల విస్తీర్ణంలో విను యొక్క బోటిక్ వలె రూపొందించబడింది. చాలా పెద్ద షాపుగా కనిపించేలా ఇంటీరియర్ డెకరేషన్ కళాత్మకంగా జరిగింది.

వ్యూహాత్మక ప్రదేశాలలో సాదా అద్దాలు ఉంచబడ్డాయి, ఇది లోపల విశాలంగా ఉన్నట్టు దృశ్య భ్రమను కల్పించింది.

చీరల అల్మారాలకు అద్దాలు అమర్చబడి ఉన్నాయి. అవి తీస్తే గానీ, వాటిలో పేర్చబడిన చీరలను కస్టమర్లు చూడలేరు.

ప్రవేశద్వారం యొక్క ఇరువైపులా ఉంచిన గాజు షోకేసులలో బొమ్మలకి రెండు ఉత్తమ చీరలు కట్టారు.

సంజన షోరూం చుట్టూ శివని నడిపించింది. ఆమె చీరల అల్మారాలలో ఒకదాన్ని తోసింది, ఆ తలుపు తెరుచుకుని మరొక గదికి దారితీసింది.

అది ఐదు వందల చదరపు అడుగుల గది. ఆ గదిని ఆహ్లాదకరమైన లేత నీలం రంగులో పెయింట్ చేశారు.

అభిరుచి మేరకు ఎంచుకున్న పెయింటింగ్స్ గోడలను అలంకరించాయి. నాలుగు కంప్యూటర్ వర్క్ స్టేషన్లు ఉన్నాయి.

“ఇది డిజైన్ రూమ్, శివా. నీకు అవసరమైన సాఫ్ట్‌వేర్ కోరల్‌డ్రాను అన్ని సిస్టమ్‌లలో లోడ్ చేసాను. వినూ డిజైన్ సెంటర్‌లో నువ్వు చేస్తున్న అన్ని పనులూ ఇప్పటికే ఇక్కడి సర్వర్‌లోకి లోడ్ చేయబడ్డాయి.”

“మేడమ్.. మేడమ్…”

శివుడు కన్నీరు ఆపుకోలేకపోతున్నాడు.

సంజన తన చేతిని శివకి అందించింది. శివ తన ముఖాన్ని ఆమె చేతుల్లో దాచుకుని ఏడ్చాడు.

సంజన అతని భుజంపై తట్టింది.

“శివా, ఇది ఒక ప్రారంభం మాత్రమే.”

“…”

“ఆ కన్నీళ్లను తుడుచుకో. బయట ఎదురుచూస్తున్న వివిఐపిలను పరిచయం చేయబోతున్నాను. వాళ్ళు లేకపోతే ఇది అస్సలు సాధ్యమయేది కాదు.”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here