సాధించెనే ఓ మనసా!-4

0
9

[box type=’note’ fontsize=’16’] ప్రముఖ తమిళ, ఆంగ్ల రచయిత వరలొట్టి రంగసామి రచించిన ఆంగ్ల నవలకు కొల్లూరి సోమ శంకర్ తెలుగు అనువాదం. ఇది 4వ భాగం. [/box]

[dropcap]శి[/dropcap]వని విమానాశ్రయంలో కలవాలని పద్మ తీసుకున్న నిర్ణయం తెలివైనదని తేలింది. శివని ఓదార్చడం కష్టమైంది.

శివ విమానాశ్రయంలో చుట్టూ ఉన్నవారిని పట్టించుకోకుండా పిన్ని చేతుల్లోకి ఒదిగి, దుఃఖించడం ప్రారంభించాడు.

పద్మ అతన్ని కొన్ని క్షణాల పాటు ఏడవనిచ్చింది. తర్వాత శివ కోసం ఒక కప్పు కాఫీ తెమ్మని లోగుకి చెప్పింది.

కాస్త కాఫీ తాగిన తర్వాతే శివ మాట్లాడగలడు.

“పిన్నీ ఎలా జరిగింది? నేను సుమారుగా ఉదయం తొమ్మిది గంటలకి నాన్నతో మాట్లాడాను. ఆయన నా పరీక్షలకు శుభాకాంక్షలు చెప్పారు. ఆయన మామూలుగానే, సంతోషంగానే ఉన్నట్టు అనిపించింది. 10-10.15 మధ్యలో చనిపోయారని అక్క చెప్పింది…  ఎలా పిన్నీ?”

బావ చనిపోలేదు. చంపబడ్డాడు. హంతకులు ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన ఆయుధాన్ని ఉపయోగించారు. అణు పరికరం కంటే ప్రాణాంతకమైన – కృతఘ్నతఅనే ఆయుధాన్ని ప్రయోగించారు!

పద్మ తన ఆలోచనలను అణచివేసి, అప్పటికప్పుడు తోచిన వివరణ ఏదో ఇచ్చింది.

“ఆయనకి ఈ మధ్య పక్షవాతం వచ్చింది. దుకాణం లోకి ప్రవేశించేటప్పుడు బాగా గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి తీసుకువెళ్ళారు, కాని అక్కడకు చేరకముందే మరణించాడు.”

“శివ, మనం చాలా చేయాల్సి ఉంది. దయచేసి తట్టుకో. మీ అమ్మ, అక్క పరిస్థితి దారుణంగా ఉంది. వాళ్ళకి ఇప్పుడు నీ మద్దతు కావాలి.”

కానీ శివకే అమ్మ, అక్కల కంటే ఎక్కువ ఓదార్పు అవసరం. అతను పద్మ ఒడిలో పడుకుని, ఏడుస్తూనే ఉన్నాడు.

శివకి ఇరవై మూడు సంవత్సరాలు. పట్టు, జరి యొక్క మంచి లక్షణాలను మిళితం చేసే మంచి డిజైనర్ లాగా, శివ తన తండ్రి మరియు తల్లి యొక్క మంచి లక్షణాలను వారసత్వంగా పొందాడు.

అతను తన తండ్రి పదునైన ముక్కు మరియు అతని పెద్ద కళ్ళను వారసత్వంగా పొందాడు. పరిమళ తెలుపు రంగు అతనికి వచ్చింది. నలిగిన దుస్తులు, చెదిరిన జుట్టు, ఏడుపు ద్వారా ఎర్రగా మారిన కళ్ళతో ఉన్నప్పటికీ, విమానాశ్రయంలోని చాలా మంది యువతులు అతనిపై నుంచి చూపు మళ్ళించలేకపోయారు.

‘శివా, మీ నాన్న మరణ వార్త కూడా నువ్వు భరించలేకపోయావు. మీ బాబాయిల ద్రోహం గురించి నీకు తెలిస్తే .. దేవుడా! … వీడు ఇంకా చిన్నవాడు..’ అనుకుంది పద్మ.

***

ఇంటికి చేరుకున్న వెంటనే శివ అమ్మ దగ్గరికి పరిగెత్తాడు.

“మీ నాన్న మమ్మల్ని మోసం చేసారు, శివా. ఆయన ఇంత అకస్మాత్తుగా ఎందుకు చనిపోవాలి?”

ఆపై మాల్య అతని వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చింది. పద్మ తప్ప కుటుంబం మొత్తం ఏడుస్తూ ఉంది. పద్మ ముఖం దృఢంగా, అభావంగా ఉంది.

సుమారు గంట తర్వాత పద్మ అందరినీ పిలిచింది.

“శివ వచ్చాడు కదా, ఇక ఏమి చేయాలో చూద్దాం. ఎవరైనా శ్మశానవాటికకి ఫోన్ చేశారా? మనం శవవాహనాన్ని పిలవాలి. ఇప్పటికే టైమ్ 2.30 అవుతోంది. కార్యక్రమమంతా ఆరు గంటలలోగా పూర్తి చేయాలి. ”

ఆమె సహజ నాయకురాలిగా – జనాలకు పనులు అప్పగించడం ప్రారంభించింది.

“పద్మా, అతని తమ్ముళ్ళు ఇంకా రాలేదు. వారికి కబురు తెలిసిందా?”

“చెప్పాము. కానీ ఇంక వేచి ఉండలేము. బహుశా వాళ్ళు ఊర్లో లేరేమో.”

“పద్మా, నీకు ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? తమ్ముళ్ళు ఆయనకి కొడుకుల్లాంటి వాళ్ళు. వాళ్ళు లేకుండా అంత్యక్రియలు జరిపితే వాళ్ళు తరువాత మనతో గొడవపడవచ్చు. దయచేసి వాళ్ళకి మళ్ళీ కబురు చెయ్యండి.”

“వద్దు. ఇప్పటికే రెండుసార్లు చెప్పాము. సమయానికి రావడం వాళ్ళ ఇష్టం. మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి అక్కా, ఈ విషయాలు నాకు వదిలేయ్. ”

పరిమళ భయంతో వణికింది. మరుదులు ఎందుకు రాలేదు?

అతను ఆసుపత్రిలో ఉన్నప్పుడు వారు ఆమెతో ఉన్నారు. దహన సంస్కారానికి ముందు ఒక్కసారి అన్నయ్య ముఖాన్ని చూడటానికి రాకూడదా? వాళ్ళు ఊర్లో లేకపోతే వాళ్ళ భార్యలకు ఏమైంది? ఆ ప్రశ్నలకు చాలా కాలం సమాధానం దొరకలేదు.

పదహారు రోజులు గడిచాయి. రంగనాథన్ చావుకి సంబంధించి అన్ని ఆచారాలు సంప్రదాయబద్ధంగా జరిగాయి.

ఈ కుటుంబం ఇప్పుడు దుఃఖానికి అలవాటు పడింది. సాధారణ జీవితంలోకి తిరిగి అడుగుపెట్టనుంది.

పరిమళ, పద్మ, మాల్య, శివ విశాలమైన డ్రాయింగ్ రూంలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు.

“శివ, మిస్ అయిన పరీక్షలను ఎప్పుడు రాస్తావు? నువ్వు ఢిల్లీకి ఎప్పుడు వెళ్లాలి?” మాల్య అడిగింది.

“అక్కా, నేను తిరిగి ఢిల్లీకి వెళ్ళడం లేదు. పరీక్షలు రాయకపోతేనేం? ఆ డిగ్రీ నాకొద్దు. నా పేరు వెనుక అక్షరాలు అక్కర్లేదు. ఉద్యోగానికి పోలేను. ఏం చేయాలి, అక్కా.

మన కుటుంబ వ్యాపారం ఉన్నప్పుడు నేను ఎందుకు పని చేయాలి? పట్టు చీరను ఎలా డిజైన్ చేయాలో నాకు తెలుసు. నా డిజైన్లలో కొన్నింటిని నాన్నకు పంపించాను. ఆయన వాటిని చూసి చాలా సంతోషించారు. నన్ను అభినందించడానికి నాకు ఫోన్ కూడా చేశారు.

ఇంతకుముందు మన కుటుంబం తరపున నాన్న మన వ్యాపారంలో పనిచేశారు. ఇప్పుడు ఆయన లేరు. ఆయన లేకుండా వ్యాపారం నిర్వహించడం బాబాయిలకు చాలా కష్టమవుతుంది.

మనం మన కుటుంబ వ్యాపారపు ఫలాలను ఆస్వాదిస్తున్నప్పుడు, భారాన్ని కూడా పంచుకోవాలి.

అందుకే బాబాయిలతో కలిసి, మన వ్యాపారం చూసుకోవాలని నిర్ణయించుకున్నాను, అక్కా. ఇప్పుడు నాన్న లేరు కాబట్టి బాబాయిలే నాకు నాన్నతో సమానం. పిన్నీ, నువ్వేమంటావు?”

“శివా”

పద్మ గట్టిగా అరిచి, అతని దగ్గరికి పరిగెత్తి అతన్ని హత్తుకుంది.

“ఏయ్ పద్మా, నీకేమైంది? శివ ఏమీ తప్పుగా అనలేదు. తన బాబాయిలకు సాయంగా ఉండాలనుకుంటున్నాడు” అంది పరిమళ.

“నీ ప్రియమైన మరుదులు మనల్ని మోసం చేశారు.”

“పద్మ, మాటలు జాగ్రత్త.”

పద్మ ఉద్రేకంతో నవ్వింది.

“బావ ఆసుపత్రిలో ఉన్నప్పుడు వాళ్ళు నీ చేత చాలా కాగితాలపై సంతకం చేయించారా?”

“అవును. అది ఆసుపత్రి సిబ్బంది కోసం. నేను బాధ్యత మరియు రిస్క్‌నీ ఒప్పుకుంటే తప్ప వారు ఆ ప్రమాదకర శస్త్రచికిత్స చేయటానికి అంగీకరించలేదు.”

“అయితే అక్కా ఆ పేపర్లు చదివావా?”

“నేనెందుకు చదవాలి పద్మా, ఆయన తమ్మళ్ళు అప్పటికే చదివారుగా?”

పద్మ తన నుదురుపై కొట్టుకుంది.

“వాళ్ళు నీతో సంతకాలు చేయించినవి రిలీజ్, రిటైర్‌మెంట్ పేపర్ల మీద. బావ నీపేరిట పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు. కాబట్టి నీ సంతకం బావ సంతకం లానే చెల్లుతుంది. ఆ దుర్మార్గులు మనల్ని మోసం చేశారు.”

“పద్మా. అలా మాట్లాడకు. వాళ్ళు మంచివాళ్ళు. ఆపరేషన్ కోసం పది లక్షలు డ్రా చేసినట్లు నీకు తెలుసు. ఆపరేషన్ అవసరం లేదని డాక్టర్ చెప్పినప్పుడు వాళ్ళా డబ్బు నాకు ఇచ్చారు. అది సురక్షితంగా ఉంది. అంత్యక్రియల ఖర్చుల కోసం చాలా ఉపయోగపడింది.”

ఈసారి పద్మ తనను తాను మరింత గట్టిగా కొట్టుకుంది.

“అయ్యో అక్కా, వాళ్ళు నీకు కేవలం పది లక్షలు ఇచ్చి, మూడు వందల కోట్ల విలువైన ఆస్తిని చేజిక్కించుకున్నారు.”

రంగనాథన్ జీవితంలో చివరి రోజున ఏమి జరిగిందో పద్మ వివరంగా చెప్పింది. మాల్య, శివ మాటల్లేక మూగబోయారు. పరిమళ రగిలిపోతోంది.

హఠాత్తుగా మాల్య వెళ్లి శివ దగ్గర కూర్చుంది. ఆమె తన చేతిని అతని భుజాలపై ఉంచింది. పద్మ కూడా అదే చేసింది.

మాల్యా తన సోదరుడి చేతిని పట్టుకుని నెమ్మదిగా చెప్పింది.

“దేని గురించి బెంగపడద్దు శివా. నేను బతికున్నంత కాలం నిన్ను రాజులా చూసుకుంటాను.”

ఇక పద్మ వంతు.

“శివా, ఈ విషయాలను ఇంతటితో వదిలేయ్. అక్కా, నేను చేతులు కలిపితే, మనం ఈ ప్రపంచాన్ని తలక్రిందులుగా చేయగలము. ”

పరిమళ కోపంగా ఉంది.

“దీని గురించి బాధపడకపోతే, వాడు దేని గురించి బెంగపడాలి? నేను వాళ్ళని నా కొడుకులుగా పెంచాను. బదులుగా వాళ్ళు నా భర్తను చంపి నా కొడుకును మోసం చేశారు. నేను బతికుండి ఉపయోగం ఏమిటి?” అంది.

భర్త ఆకస్మిక మరణం వార్త విన్నప్పటి రోదన కంటే పరిమళ ఇప్పటి ఏడుపు విదారకంగా ఉంది.

పద్మ అక్కని ఓదార్చడానికి ప్రయత్నిస్తోంది. మాల్య, పద్మ ఇప్పుడు పరిమళ పక్కన కూర్చున్నారు. శివ అమ్మ వైపు చూస్తూ ఉన్నాడు. మాల్య వెక్కిళ్ళను ఆపుకోడానికి విశ్వప్రయత్నం చేస్తోంది.

పరిమళ అకస్మాత్తుగా లేచి నిలబడింది.

“నేను అక్కడికి వెళ్తున్నాను. వాళ్ళ చొక్కా కాలర్ల పట్టుకుని న్యాయం అడుగుతాను. నేను చేసే గొడవకి వాళ్ళా పాపిష్టి కాగితాలను మనకు తిరిగి ఇచ్చేస్తారు.”

“లేదా, వాళ్ళు నిన్నూ చంపే అవకాశం ఉంది, అమ్మా. ఊరికే ఉండు. మేము ఇప్పుడే నాన్నని కోల్పోయాము. మేము అమ్మని కూడా పోగొట్టుకోవాలనుకోవడం లేదు.”

మాల్య చేసిన ఉద్వేగభరితమైన విజ్ఞప్తి పరిమళ మెత్తబడేలా చేసింది.

“వాళ్ళు 300 కోట్లు దొంగిలించారు. రండి, పోలీసుల వద్దకు వెళ్దాం. మన లాయర్‌తో మాట్లాడుదాం. వారి మీద కేసు వేద్దాం.”

“అయ్యే పని ఆలోచించాలి అక్కా. మనం దావా వేస్తే కేసును ఎదుర్కోడానికి అవసరమైనంత డబ్బు వాళ్ళకి ఉంది. కేసు పెట్టడానికి మన దగ్గర డబ్బేం ఉంది?

అక్కా, నేను నా బ్యాంక్ తరపున రుణగ్రహీతలపై కేసులు నమోదు చేస్తున్నాను. ఖర్చులు మరియు సమస్యలు నాకు తెలుసు. మీరు రూ.300 కోట్లకు దావా వేయాలనుకుంటే మీరు కోర్టుకి రూ.30 కోట్లు ఫీజులు చెల్లించాలి.

ఇప్పుడు ఎవరి దగ్గర అంత డబ్బు ఉంది? పోనీ మన దగ్గర ఆ డబ్బు ఉందని అనుకుంటే, వారి వద్ద అన్ని కాగితాలు చట్టబద్ధంగా చెల్లేలా ఉన్నాయి. వాటి మీద సంతకం నీది కాదని నువ్వు వాదిస్తావా?”

పరిమళ గందరగోళానికి లోనయ్యింది.

మాల్య స్థిరమైన స్వరంతో తన తల్లికి చెప్పింది.

“అమ్మా, మన సంపద ఆ దుకాణమో లేదా రియల్ ఎస్టేటో కాదు. మన ఆస్తి శివ. వీడు వందల కోట్లు సంపాదించబోతున్నాడు.”

“అంటే వాళ్ళ మానానా వాళ్ళని వదిలేసి, మనం మౌనంగా ఉండాలా?” అంది పరిమళ.

“అమ్మా, మనంతా ఒకసారి రైల్లో ఢిల్లీ వెళ్ళిన సంగతి గుర్తుందా? ఆ రోజున శివ తినేటప్పుడు ఒక బిచ్చగాడు శివ ప్లేట్ పట్టుకుని పారిపోయాడు. శివ అతనిని వెంబడించడానికి ప్రయత్నించాడు.

అప్పుడు నువ్వు, ‘బిచ్చగాడిని వెంబడించడంలో అర్థం లేదు. నీ ఆహారాన్ని తిరిగి పొందినప్పటికీ నువ్వు తినలేవు. కనీసం అతన్ని తిననివ్వు. మేము నీకు తాజా ప్యాకెట్ తీసుకువస్తాము’ అని అన్నావు.

బాబాయిలు రైల్వే స్టేషన్‌లో బిచ్చగాళ్లలా ప్రవర్తించారు. వారు మనం తింటున్న పళ్ళాన్ని ఎత్తుకుపోయారు. అంతే” అంది మాల్య.

“అది కొద్దిగా పెరుగు అన్నం పాకెట్ మాత్రమే, మనం పది రూపాయలకు ఇంకో ప్యాకెట్ పొందవచ్చు. కానీ ఇది 300 కోట్లు. అంత డబ్బు మనకు ఎక్కడ లభిస్తుంది? మనం ఏదో ఒకటి చేయకూడదా? ”

“అవును, అక్కా. మనం తప్పక ప్రతీకారం తీర్చుకోవాలి.”

పద్మ గొంతులో దృఢత్వం చూసి మాల్య, పరిమళ భయపడ్డారు. శివ చూపు తీవ్రంగా ఉంది.

“మనం పోలీసుల వద్దకు వెళ్లకూడదు. కోర్టు ఖర్చులు భరించలేము. నువ్వేమో ఆ ధూర్తులను నేను ఎదుర్కోకూడదంటున్నావు. ఇక మనం ప్రతీకారం ఎలా తీర్చుకుంటాం?”

“ఆ ఆస్తులు లేకుండా సంతోషంగా జీవించడం ద్వారా. ఆ సంపద లేకుండా జీవితంలో నెగ్గుకు రావడం ద్వారా. వాళ్ళు మన సంపదను దోచుకున్నారు, ఎటువంటి సందేహం లేదు. కానీ మన ఆనందాన్ని కూడా దోచుకోనీయకూడదు.”

“గొప్పగా చెప్పావు, పద్మా. మరి వాస్తవ పరిస్థితుల మాటేమిటి? కుటుంబాన్ని నడపడానికి అయ్యే ఖర్చుల గురించి ఏమిటి? ”

మాల్య అందుకుంది.

“అమ్మా, నేను నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నాను. ఇంకా నాన్న సలహా మేరకు నా గత ఆదాయాలన్నీ బ్యాంక్ డిపాజిట్లు మరియు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాను, ఆయన దయ వల్ల నా దగ్గర 25 లక్షలు ఉన్నాయి.

మన జీవన ప్రమాణాలు కొంచెం తగ్గవచ్చు, కాని కొన్ని సర్దుబాట్లు చేయడానికి సిద్ధంగా ఉంటే మనం ఇంకా సంతోషంగా జీవించగలం” అంది.

“అక్కా, నా చేతికొచ్చే జీతం 40 వేలు. నేను దాచిన నా దగ్గర పది లక్షల రూపాయలు, యాభై సవర్ల బంగారం ఉన్నాయి. మీకు అన్నీ ఇస్తాను. అది సరిపోతుందా?”

“పద్మా, నీ డబ్బంతా కుటుంబానికి ఇస్తే నీ భద్రత మాటేమిటి?”

“అక్కా, నా భద్రత నువ్వు, మాల్య మరియు అన్నింటికంటే ఎక్కువగా నా శివ. మీరు ముగ్గురు నా భద్రతా వలయం, అక్కా. నేను నా భర్తను కోల్పోయినప్పుడు నువ్వు నన్ను నీ కూతురుగా భావించి నాకీ ఈ కుటుంబంలో ఆశ్రయమిచ్చావు. ఇప్పుడు నేను చేస్తున్నదంతా కేవలం ఒక కూతురు తన కుటుంబం కోసం ఏమి చేయాలో అదే. బావ నాకు తండ్రి కంటే ఎక్కువ.”

మాల్య పద్మను కౌగిలించుకుంది. పరిమళ కూడా మౌనంగా ఉండిపోయింది. పద్మ బహిరంగంగా ప్రేమని ప్రకటించడం శివ బాబాయిల ద్రోహానికి విరుగుడుగా ఉపయోగపడింది.

మాల్య ఇప్పుడు భవిష్యత్ ప్రణాళికల గురించి ఉత్సాహంగా మాట్లాడుతోంది.

“అమ్మా, మనం ఈ ఇంటిని అద్దెకు ఇద్దాము. నెలకు లక్ష రూపాయల కన్నా ఎక్కువ అద్దె పొందవచ్చు. మేము పురసైవాక్కం సమీపంలో త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్‌లోకి మారదాం. మనకు నెలకు 25000 కన్నా ఎక్కువ ఖర్చు ఉండదు. మన జీవన ప్రమాణాలను కొనసాగించడానికి అద్దె మిగులును ఉపయోగించవచ్చు.”

“అయితే మనం అన్ని కార్లను ఎక్కడ పార్క్ చేద్దాం, మాల్య?”

“ఇబ్బందే లేదు. అన్ని కార్లు సంస్థకు చెందినవి. ఆర్‌సి – రంగా సిల్క్స్ పేరిట ఉంది. వారు కార్లను తిరిగి తీసుకోవడానికి ఎప్పుడైనా రావచ్చు. అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో నా ఫోర్డ్ ఫియస్టాకీ, నీ మారుతి స్విఫ్ట్ కోసం పార్కింగ్ దొరుకుతుందనే నేను అనుకుంటున్నాను. ”

“”

“కానీ మన మొదటి ప్రాధాన్యత శివ తన చదువు పూర్తి చేయడమే.”

అప్పుడే వారు శివ వైపు తిరిగారు.

“శివా” అంటూ ముగ్గురు ఆడవాళ్ళూ ఒకేసారి అరిచారు. శివ స్పృహ తప్పాడు. పద్మ ఫోన్‌ దగ్గరకి పరిగెత్తింది. మాల్య చల్ల నీరు కోసం పరిగెత్తింది. పరిమళ శివని లేపడానికి ప్రయత్నిస్తోంది.

విధి నవ్వి, వారికి వినబడని స్వరంలో వాళ్ళతో మాట్లాడింది.

నేను మిమ్మల్ని పడదోశాను. భారీ అదృష్ట చక్రంలో మీ పెట్టె ఇప్పుడు అట్టడుగున ఉంది. అది ఇప్పుడు కదలగల ఏకైక దిశ పైకి మాత్రమే.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here