సాధించెనే ఓ మనసా!-6

0
11

[box type=’note’ fontsize=’16’] ప్రముఖ తమిళ, ఆంగ్ల రచయిత వరలొట్టి రంగసామి రచించిన ఆంగ్ల నవలకు కొల్లూరి సోమ శంకర్ తెలుగు అనువాదం. ఇది 6వ భాగం. [/box]

[dropcap]అం[/dropcap]బికా దేవి అక్కడికి రావడానికి పదిహేను నిమిషాల ముందు మాల్య, పద్మ జెకె ఆసుపత్రికి వచ్చారు. వారితో శివ కూడా ఉన్నాడు.

“శివా, పిన్ని ఈ రోజు మెడికల్ చెక్ అప్ చేయించుకోవాలనుకుంటోంది. మన డ్రైవర్లు ఈ రోజు సెలవులో ఉన్నారు. మా కోసం నువ్వు కారు నడుపుతావా? నువ్వు అలసిపోయినా లేదా నీకు వేరే పని ఉంటే, మేము ఆటోలో వెళ్తాము.”

మాల్య అభ్యర్థనను శివ తోసిపుచ్చలేకపోయాడు.

కాసేపట్లో వారు ఆసుపత్రి యొక్క విశాలమైన లాబీలో ఉన్నారు. శివకి చెరోపక్కా మాల్య, పద్మలు కూర్చున్నారు.

ఆ సమయంలోనే అంబికా దేవి తన శిష్యులతో కలిసి ఆసుపత్రిలోకి ప్రవేశించింది.

మాల్య శివ భుజాన్ని తాకింది.

“ఆవిడ ఎవరో నీకు తెలుసా?”

“ఊహూ”

“ఆమె అంబికా దేవి, లేడీ సెయింట్. చాలా ప్రసిద్ధి చెందినవారు. శ్రీకృష్ణుడికి గొప్ప భక్తురాలు. ఆమెకు చాలా అరుదైన శక్తులు ఉన్నాయి. అక్కడ చూడు, నల్లి సిల్క్స్ యజమాని ఆమెను చూడటానికి వేచి ఉన్నాడు. ఇంకా పోలీసు కమిషనర్ ఉన్నారు. ఆమె ఆశీర్వాదం పొందడానికి ఈ ప్రజలు వేచి ఉన్నారు.”

అభిమానుల పట్ల శివుడికి ఆసక్తి లేదు.

***

నలభై నిమిషాల తరువాత కాషాయ వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి గట్టిగా పిలిచాడు.

“శివ.. శివ.. శివ పేరుతో ఎవరైనా ఇక్కడకు వచ్చారా.. తండ్రి పేరు రంగనాథన్. శివ.. శివ.. ”

శివ సంశయంతో లేచి నిలబడ్డాడు.

“నాతో రండి. మాత మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. మీతో ఎవరైనా వచ్చారా? ”

మాల్య, పద్మ లేచి నిలబడ్డారు.

“రండి. వెళ్దాం.”

శివ అక్క, పిన్నిల వైపు చూసాడు. అతని ముఖం మీద స్వల్పమైన కోపం ఉంది. ‘నా పేరు వారికి ఎలా తెలుసు?’ అని. అతను తన స్థానంలో ఆగిపోయాడు.

“శివ, నేను తర్వాత చెప్తాను. మాత స్వయంగా మనల్ని పిలిస్తే, మనల్ని మనం అదృష్టవంతులుగా భావించుకోవాలి. దయచేసి లోపలికి వెళ్దాం. పద” అంది పద్మ.

“శివ, దయచేసి అర్థం చేసుకో, ఇదంతా నీ కోసమే. ప్లీజ్ రా” అంది మాల్య.

శివ అయిష్టంగానే గదిలోకి నడిచాడు.

శివ అంబికా దేవిని చూశాడు. ఆమె కళ్ళలో ఏదో మహత్తు ఉంది, శివ ఆమెతో చాలా సౌకర్యంగా ఉండేలా చేసిందది.

ఆమె శివని చూసి నవ్వినప్పుడు అతను కరిగిపోయి ఆమె ముందు సాష్టాంగపడ్డాడు.

“బిడ్డా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.”

మాల్య, పద్మ అప్పుడు ఆమె ముందు సాష్టాంగపడ్డారు, ముగ్గురూ ఆమె ముందు నేలపై కూర్చున్నారు.

“శివా, మీ బాబయిలు ద్రోహులు. వారు మీ తండ్రిని చంపారు. దానికంటే ఘోరంగా, వారు మీ రెక్కలను కత్తిరించి, మిమ్మల్ని నేలరాలేలా చేశారు.”

తనపై తనకే జాలి కలిగి కన్నీళ్లతో శివ కళ్ళు నిండిపోయాయి. అతను తన కన్నీళ్లను దాచడానికి క్రిందికి చూశాడు. పద్మ, మాల్య అతని దుఃఖాన్ని గ్రహించి, ఏకకాలంలో అతని భుజాలపై చేతులు వేశారు.

ఇది శివ పట్ల వారికున్న ప్రేమకు అత్యంత మృదువైన వ్యక్తీకరణ. అంబికా దేవి కూడా చూసి కదిలింది.

“శివా, ఈ ఇద్దరు స్త్రీలు మీ పట్ల చూపిన ప్రేమ మీ జీవితంలో అద్భుతాలు చేస్తుంది. అది మిమ్మల్ని నయం చేయడానికి సరిపోతుంది.”

శివ కూర్చున్నాడు.

“మీకు చాలా ఆశలు, ఆకాంక్షలు ఇంకా కలలు ఉన్నాయని నేను తెలుసుకున్నాను. మీ చిన్నాన్నల వల్ల ప్రతిదీ పోయిందని మీరు అనుకుంటున్నారు. ఆ ఆలోచన మిమ్మల్ని వేధిస్తోంది, శివా.

వారు మీ ఆస్తులను దొంగిలించగలరు. కాని శివా, నేను మీకు చెప్తున్నాను, వారు మీ కలల్ని, ఆశలను మీ అనుమతి లేకుండా దొంగిలించలేరు.”

“…”

“కలలు అలా ఉండనివ్వండి. ప్రస్తుతానికి మీ దృష్టి మరల్చడానికి మీరు ఎక్కడైనా పని చేయాలి.”

‘నేను కాలేజీ డ్రాపౌట్‌ని, ధనవంతుడి కొడుకుని, నా జీవితంలో ఏ పని చేయలేదు. నాకు పని ఎవరు ఇస్తారు?’

అతని మనసులో ఏముందో తనకు తెలిసినట్లుగా అంబికా దేవి మాట్లాడారు.

“ఈ ఆసుపత్రి యజమాని డాక్టర్ కన్నప్పన్ నాకు తెలుసు. మీకు ఉద్యోగం ఇవ్వమని నేను అతనిని అడుగుతాను. ఒక సాధారణ క్లరికల్ ఉద్యోగం. మీరు పని చేయడానికి సిద్ధంగా ఉన్నారా?”

‘నేను ఇక్కడా! ఆసుపత్రిలో గుమస్తాగానా! రంగా సిల్క్స్ గ్రూప్‌కి ఏకైక వారసుడిని!నిపుణుడైన సిల్క్ చీరల డిజైనర్‌ని – ఇలా పీల్చి పిండేసే అకౌంటింగ్, అడ్మినిస్ట్రేటివ్ వర్క్ చేయాలా?’

ఆమె ప్రశ్నకు శివ స్పందించలేదు.

“మీరు ముగ్గురు కొంచెం పక్కన కూర్చుని, నా ప్రతిపాదన గురించి చర్చిస్తుంటే, నేను నా ఇతర సందర్శకులను చూస్తాను.”

వారు అంగీకరించారు.

***

మాల్య శివ చేతిని తన చేతిలో ఉంచుకుని మృదువైన స్వరంలో మాట్లాడింది.

“శివా! ఆవిడ నిన్ను పని చేయమని అడుగుతుందని అనుకోలేదు. ఆ రోజు నువ్వు మూర్ఛపోయినప్పటి నుంచి నువ్వు ఏ మాత్రం బాగున్నట్లు అనిపించలేదు. డాక్టర్ వరదాచారి వద్దకు వెళ్ళాము, ఆయన ఈవిడని కలమన్నారు. శివా, నీకు పని చేయడం ఇష్టం లేకపోతే, వద్దు. మాకు ఇబ్బంది లేదు.”

జనాలను ఒప్పించటానికి పద్మకి తనదైన మార్గం ఉంది.

“శివా, నా భర్త చనిపోయినప్పుడు నా వయసు 28 ఏళ్లు. నాకు ఏమి చేయాలో తెలియదు. నేను జీవితాన్ని అసహ్యించుకున్నాను. అతని బ్యాంక్ నాకు ఉద్యోగం ఇచ్చినప్పుడు నేను నిరాకరించాను. అప్పుడు మీ నాన్నే నన్ను ఒప్పించారు.

‘పద్మ, ఇది డబ్బు కోసం కాదు. జీవితాంతం నీకు ఆసరా ఇవ్వడానికి నా దగ్గర తగినంత డబ్బు ఉంది. కానీ నువ్వు ప్రపంచంలోకి వెళ్లాలి. ప్రజలను కలవాలి. వారితో తిరగాలి. వారి సమస్యలను తెలుసుకోవాలి. వారితో చురుకైన సంబంధం కలిగి ఉండాలి. అప్పుడే ఇతర గొప్ప విషయాలలో పోలిస్తే నీ దుఃఖం పెద్దది కాదని నీకు తెలుస్తుంది.’

“అవి వివేకవంతమైన మాటలు, శివా. నేను ఈ రోజు మీ నాన్న మాటలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ నాన్న చెప్పిన విషయాలు ఇప్పుడు నీకు ఎక్కువ శక్తితో వర్తిస్తాయి.

మాల్య, నేను తగినంత డబ్బు సంపాదించాము. నీకు కావలసినది ఇవ్వగలను. కాని నువ్వు  నీ ప్రతిభను వృథా చేయకూడదని నేను కోరుకుంటున్నాను. నువ్వు గెలవటానికే పుట్టావు.

ఇది పూర్తిగా తాత్కాలికమైన ఏర్పాటు. నీ మనసులోని గాయాలు పూర్తిగా నయం అయిన తర్వాత మేం కొంత డబ్బు పెట్టుబడి పెట్టి నీ కోసం ఒక దుకాణం తెరుస్తాము, శివా.”

వివిఐపిలు వరుసగా అంబికా దేవి దర్శనం కోసం వచ్చారు. నల్లి సిల్క్స్ యజమాని, పోలీస్ కమిషనర్… వారి తరువాత… శివ ఆశ్చర్యపోయాడు.. తమిళ సినీ ప్రపంచంలో అగ్రశ్రేణి హీరో, సినీపరిశ్రమలో సూపర్ స్టార్ అని పిలవబడే వ్యక్తి తన సాధారణ నిరాడంబరమైన శైలిలో మాత ముందు హాజరయ్యాడు.

శివ చూస్తుండగానే అంబికా దేవి ముందు ఆ నటుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు శివ వెన్నంటే ఉన్న విధి ఎవరికీ వినబడని స్వరంలో పలికింది:

శివా, నువ్వు ఇప్పుడు సరైన ఎంపిక చేసుకుంటే, ఈ గొప్ప నటుడు, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది అభిమానులను కలిగి ఉన్న ఈ వ్యక్తి, ఒక రోజు నీ సలహాను వింటాడు. నువ్వు అతనితో సమాన స్థాయిలో మాట్లాడబోతున్నావు. అయితే ప్రతిదీ నువ్వు రాబోయే కొద్ది నిమిషాల్లో తీసుకోబోయే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

అప్పుడు శివ మాత వైపు చూశాడు. ఆమెలో నటుడిని చూసిన ఉత్సాహమూ లేదు; పోలీసు కమిషనర్‌ను ప్రసన్నం చేసుకోవాలన్న ఉద్దేశమూ లేదు.

ఆమె ప్రతి ఒక్కరితో సమాన స్థాయిలో వ్యవహరించింది. ఆ గుణమే శివ ఆమెను విశ్వసించేలా చేసింది. కమిషనర్, వ్యాపారవేత్త ఇంకా నటుడు గౌరవించే ఇంత మంచి మహిళ అతనికి సలహానిస్తే, అందుకు కొంత యోగ్యత ఉండాలి.

“అక్కా, పిన్నీ, నేను ఉద్యోగంలో చేరతాను.”

విధి ఆనందంతో అరిచింది. ఆహా! అబ్బాయీ! సాధించావు. ఓయీ, నటుడా, నీ మనిషి సిద్ధంగా ఉన్నాడు.

***

మూడు రోజుల తరువాత కొంచెం కంగారుగా ఉన్న శివ డాక్టర్ కన్నప్పన్ ముందు కూర్చున్నాడు. డాక్టర్ అతని దరఖాస్తును సరిగ్గా పరిశీలించి కొన్ని సౌమ్యమైన ప్రశ్నలు అడిగారు. ‘అంబికా దేవి ఈ అభ్యర్థిని సిఫారసు చేసింది. నేను ఇంకా ఏమి చూడాలి?’

శివని నెలకు రూ.6000 జీతంతో జనరల్ అడ్మిన్ విభాగంలో గుమస్తాగా నియమించారు.

తన తండ్రి దగ్గర పనిచేసిన ఐదుగురు డ్రైవర్లలో ప్రతి ఒక్కరూ దీని కంటే చాలా ఎక్కువ మొత్తంలో జీతం తీసుకున్నారు.

శివ ఉదయం 9 నుండి సాయంత్రం ఆరు వరకు, వారంలో ఆరు రోజులు పని చేయాల్సి వచ్చింది. అతని పని వోచర్లు దాఖలు చేయడం, అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌లో ఎంట్రీలు వేయడం, కొన్ని బిట్స్ అండ్ ఆడ్స్ కోసం దాదాపు ప్రతిరోజూ బ్యాంకుకు వెళ్లడం, బ్యాంకు స్టేట్‌మెంట్‌ను ఆసుపత్రి పుస్తకాలతో సరిచేసుకోవడం మరియు మేనేజ్‌మెంట్ అతనికి అప్పగించినట్లు మరేదైనా పని చేయడం. ప్రస్తుతానికి ఇవీ అతని పనులు.

అంబికా దేవి యొక్క ప్రాపంచిక జ్ఞానం ఆమె ఆధ్యాత్మిక పరాక్రమం కంటే తక్కువ కాదు. ఆసుపత్రిలో శివునికి ఉద్యోగం పొందడంలో ఆమె పరోక్షంగా వేదన, బాధలను చూసేలా చేసింది.

తన మొదటి రోజు పనిలో శివ భోజన విరామ సమయంలో ఆసుపత్రి చుట్టూ తిరిగాడు, నర్సులతో మాట్లాడడం ద్వారా కొంతమంది రోగుల గురించి తెలుసుకున్నాడు. వారు ఆసుపత్రిలో ఇప్పటివరకు చాలా అందమైన గుమస్తాకి సహాయం చేయడానికి చాలా ఆసక్తి చూపారు.

ఓ యాభై ఏళ్ల వ్యక్తి తన ఏకైక కుమార్తెకు వివాహం నిర్ణయించాడు. అతను గత కొన్నేళ్లుగా రక్తపోటు, మధుమేహం కోసం మందులు తీసుకుంటున్నాడు.

కొంతమంది ‘సర్వజ్ఞులు’ అతనికి మందులు లేదా ఆహార ఆంక్షలు అవసరం లేదని; వ్యాధులు వాటంతటే అవే తగ్గిపోతాయని చెప్పారు. ఈ సలహాని పాటించడం అతనికి చాలా సౌకర్యంగా ఉన్నాడు. ఒక వారంలోనే అతనికి తీవ్రమైన పక్షవాతం వచ్చింది, గత రెండు రోజులుగా ఐసియులో ఉన్నాడు.

అతను ఒకటి లేదా రెండు రోజుల్లో చనిపోతాడని వైద్యులు ఖచ్చితంగా చెప్పారు. మరి అతని కుమార్తె పెళ్ళి మాటేమిటి?

పద్దెనిమిదేళ్ల అరుణ్ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అతను నాలుగు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పటి నుండి నాడీ రుగ్మతతో బాధపడుతున్నాడు. దాని పేరు ఉచ్చరించడం వైద్యులకు కూడా చాలా కష్టం, వారు దీనిని ‘ఎఎల్ఎస్’ అనే పొడి అక్షరాలలో పిలుస్తారు.

మొదట్లో అతని పాదాలలో తిమ్మిరి ఉండేది. కొన్నేళ్లుగా తిమ్మిరి నెమ్మదిగా పైకి ప్రాకుతోంది. గత 14 సంవత్సరాలలో ఈ వ్యాధి అతని మెడ వరకు చేరింది.

అరుణ్ ఆరు సంవత్సరాల నుండి చక్రాల కుర్చీలోనే ఉంటున్నాడు. అతని 23వ పుట్టినరోజుకు ముందే అరుణ్ జీవితం ముగుస్తుందని వైద్యులు ఊహిస్తున్నారు. అరుణ్ తల్లి మాత్రం నమ్మకం కోల్పోలేదు. తన కొడుకు జీవితంలో ఉత్తమమైన దాన్ని ఇవ్వడానికి ఆమె చాలా కష్టపడుతోంది.

అతని వ్యాధి కారణంగా జలుబు కూడా ప్రాణాంతకమవుతుంది. శివ అతనిని చూసినప్పుడు, పాపం, ఆ అబ్బాయిని ఇద్దరు మగ నర్సులు తలక్రిందులుగా చేసి అతని ఛాతీలోని కఫాన్ని బయటకు తీశారు.

‘ఎఎల్ఎస్’ కోటిమందిలో ఒకరిని మాత్రమే బాధ పెడుతుందని వైద్యులు చెప్పారు. ప్రపంచంలోని వ్యక్తులందరిలో, ఈ మృదువైన అబ్బాయికే ఎందుకు సోకాలి?

వ్యాధి మరియు బాధలు ఎల్లప్పుడూ మానవులపై చికిత్సా ప్రభావాన్ని కలిగి ఉంటాయి.

అతను బాధను ఎదుర్కోకముందే ప్రతి మనిషి తనను తాను ఉన్నతుడిగా భావించుకుంటాడు; తన అహంలో భాగంగా తనకు హక్కుందనే బలమైన భావాన్ని కలిగి ఉంటాడు.

‘నేను అలాంటి కుటుంబంలో జన్మించాను, లేదా నేను ఈ లేదా ఆ స్థాయి వరకు చదువుకున్నాను కాబట్టి, ఒక నిర్దిష్ట పొడవు గల కారులో వెళ్ళడానికి, ఒక నిర్దిష్ట పరిమాణంలో ఉన్న ఇంట్లో నివసించడానికి నాకు అర్హత ఉంది …’.

అరుణ్ లాంటి వారిని చూడటం ఆ వ్యక్తిని అలాంటి భ్రమ నుండి దూరం చేస్తుంది, అతను పీల్చే గాలికి లేదా అతను తినే ఆహారానికి కూడా అర్హత లేదని అతనికి తెలుసు.

శివకి వైద్యం చేసే ప్రక్రియ అత్యంత శ్రద్ధతో ప్రారంభమైంది. నెలలు గడిచేసరికి శివ మామూలుగా మారాడు. అతను పీల్చి పిప్పిచేసే ఆ సాధారణ గుమాస్తా పనిని ఇష్టపడటం ప్రారంభించాడు.

***

అడ్మిన్ విభాగంలో ఉన్న ఏకైక అధికారి అయిన రాజశేఖర్‌ శివకి పై అధికారి. రాజశేఖర్ మేనేజర్ సంజనకు రిపోర్ట్ చేస్తాడు. రాజశేఖర్ సంజన పిఎగా కూడా ద్వంద్వ బాధ్యతలు నిర్వహిస్తాడు.

రాజశేఖర్ ఆసుపత్రిలో అపారమైన ప్రభావాన్ని పొందాడు, అతను ఎన్నడూ శివని పట్టించుకోలేదు. చాలా రోజులుగా శివ తన సీటు నుండి లేచి అతనికి గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు, రాజశేఖర్ శివ ఉనికినే పట్టించుకోలేదు.

శివ ప్రతిసారీ అవమానంగా భావించాడు. కానీ అతను ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు.

ఆ విధికృతమైన రోజున శివ కొన్ని వివరాలను సేకరించడానికి బ్యాంకుకు వెళ్ళాడు. అతను బయలుదేరబోతుండగా, బ్యాంక్ మేనేజర్ అతని వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు.

“మీరు జెకె హాస్పిటల్ నుండి వచ్చారా?”

“అవునండి.”

“మీరు ఈ కవర్‌ని రాజశేఖర్ గారికి అందజేస్తారా?”

“తప్పకుండా సార్.”

శివ రాజశేఖర్ క్యూబికల్ లోకి వెళ్లి కవర్ ఇచ్చాడు. అందుకు కృతజ్ఞతలు తెలిపేంత మర్యాదగా రాజశేఖర్ ఉంటాడని శివ ఎప్పుడూ అనుకోలేదు. అలాగే, అతను ఇంత తీవ్రంగా విరుచుకు పడతాడని కూడా ఊహించలేదు.

“ఏం ఓయ్, ఈ కవర్ ఎందుకు తెరిచి ఉంది? లోపల ఏమి ఉందో తెలుసా? మన ఆసుపత్రి బ్యాంక్ స్టేట్‌మెంట్స్! నేను నీకు ఇస్తే తప్ప నువ్వు స్టేట్‌మెంట్స్ చూడవలసిన అవసరం లేదు. అర్థమైందా?”

“అలాగే సార్.”

“ఇప్పుడు నిజాయితీగా చెప్పు, నువ్వు వీటిని తెరిచి చూశావా?”

“లేదండి.’

“అబద్దాలు చెప్పేవాళ్ళు నాకు నచ్చరు, శివా.”

శివ సహనం కోల్పోయాడు.

“ఇందులో అబద్ధం చెప్పడానికి ఏముంది సార్? మీరు చెప్పేదాక ఇది బ్యాంక్ స్టేట్‌మెంట్ అని నాకు తెలియదు. బ్యాంక్ మేనేజర్ దానిని ఓపెన్ కవర్‌లో ఇచ్చారు. నేను మీకు అలాగే తెచ్చిచ్చాను. మళ్ళీ సారి బ్యాంక్ మేనేజర్ ఓపెన్ కవర్ ఇచ్చినప్పుడు నేను ఆయన మీద అరుస్తాను. చాలా?”

శివుడి గొంతులోని దృఢత్వం రాజశేఖర్‌కి చికాకు కల్గించింది.

“చాలా ఎక్కువ మాట్లాడావు, అబ్బాయ్. మాటలు జాగ్రత్త! నేను నిన్ను ఎప్పుడైనా ఉద్యోగంలోంచి తీసేయగలను. డాక్టర్ కన్నప్పన్ పట్టుబట్టారని మాత్రమే నీకీ ఉద్యోగం ఇచ్చాను. నేను నిన్ను ఇరికించగలను, ఎప్పుడైనా తొలగించగలను. అది మనస్సులో ఉంచుకో. ఇక నువ్వు వెళ్ళచ్చు.”

శివ కలవరానికి లోనయ్యాడు. అతనితో ఎవరూ అలా పరుషంగా మాట్లాడలేదు. అతని తండ్రి కూడా అతనితో మాట్లాడుతున్నప్పుడు ఎన్నడూ గొంతు పెంచలేదు. అతనితో మాట్లాడేటప్పుడు అమ్మ, మాల్య, పద్మ అందరూ ప్రేమగా ఉన్నారు.

‘ఓ అధముడి చేతిలో నేను ఎలాంటి మాటలు పడాల్సి వచ్చింది, అది కూడా నేను చేయని పనికి! ఎందుకు?’

శివ ఆ రోజు నిద్రపోలేదు. అంతా సక్రమంగా జరిగి ఉంటే, అతను రంగా సిల్క్స్‌లో కూర్చుని ఉంటే…. అతను రాజశేఖర్ వంటి మూర్ఖుడి నుండి ఆ రకమైన చెత్తవాగుడు వినవలసిన అవసరం లేదు. తన బాబాయిలపై లక్షలసార్లు కోపం తెచ్చుకున్నాడు.

రాజశేఖర్ కఠినమైన మాటలు అతని మనస్సులో మళ్లీ మళ్లీ మెదులుతుండగా, అతనికి ఒక ఆలోచన తట్టింది.

అతని ఆలోచనా ప్రక్రియలను చూసే సామర్థ్యం ఉన్న విధి ఆనందంతో గెంతులు వేసింది.

“శభాష్ అబ్బాయి, నువ్వు జాక్‌పాట్ కొట్టావు.”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here