సాధించెనే ఓ మనసా!-9

0
7

[box type=’note’ fontsize=’16’] ప్రముఖ తమిళ, ఆంగ్ల రచయిత వరలొట్టి రంగసామి రచించిన ఆంగ్ల నవలకు కొల్లూరి సోమ శంకర్ తెలుగు అనువాదం. ఇది 9వ భాగం. [/box]

[dropcap]త[/dropcap]న బెస్ట్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతుంటే వినూ హృదయం గర్వంతో పొంగిపోయింది.

“మేడమ్, నేను సరదాగా అనడం లేదు. యూనివర్సిటీలో మొదటి మూడు సెమిస్టర్లలో శివ మొదటి స్థానంలో నిలిచాడు. కానీ వాళ్ళ నాన్న మరణం కారణంగా చివరి సెమిస్టర్ పరీక్షలు రాయలేకపోయాడు.

అంతే కాదు మేడమ్, డిజైనర్ల జాతీయ స్థాయి పోటీలో వరుసగా రెండుసార్లు సిల్క్ చీరల విభాగంలో ‘ఎథ్నిక్ డ్రెసెస్’లో బెస్ట్ అమెచ్యూర్ డిజైనర్‌గా ఎంపికయ్యాడు.

ఈ రోజు మీరు ఎంచుకున్నది అతను బహుమతి గెలుచుకున్న డిజైన్లలో ఒకటి” చెప్పాడు.

తన మిత్రుడిని ఆపడానికి ప్రయత్నించాడు శివ. కానీ వినూ ఆగే స్థితిలో లేడు. శివ బయోడేటాలోని గుణగుణాలను వెల్లడించిన తర్వాతే ఆగాడు.

సంజన శివకి షేక్ హ్యండ్ ఇచ్చింది.

“నేను నిజంగా గర్వపడుతున్నాను, శివా. నీ విజయాల కంటే నీ వినయానికే నాకు గర్వంగా ఉంది. నీ గత కీర్తిని నువ్వెన్నడూ చాటుకోనందుకు; ఎంతో ఉత్సాహంతో మేం ఇచ్చిన గుమాస్తా పనిని చేసినందుకు – నచ్చావు.

శివా, నీ గురించి తెలుసుకున్నందుకు నాకు నిజంగా సంతోషంగా ఉంది. మిస్టర్ వినూ, థ్యాంక్యూ. ఈ రోజు మీరు నాకు చాలా ఆనందం కలిగించారు.”

శివ సిగ్గుపడ్డాడు. శివ, సంజన మధ్యాహ్నం 12 గంటల సమయంలో దుకాణం నుండి బయటికి వచ్చారు.

“నాకో పని చేసిపెడతావా శివా?”

“చెప్పండి మేడం.”

“నువ్వు ఈ రోజు నాతో భోజనం చేయగలవా? మనం టి.నగర్ శరవణ భవన్‌కి వెళ్దాం. ఇది నేను ఇచ్చే విందు. మనం అక్కడ ఉన్నప్పుడు కారణం చెప్తాను.”

“సంతోషంగా వస్తాను, మేడమ్.”

***

“ఇప్పుడు సమయం వచ్చింది, శివా. రంగా సిల్క్స్ పేరు వినగానే ఎందుకు అరిచావో చెప్పు!”

ఆ ప్రముఖ హోటల్ మొదటి అంతస్తులో సంజన, శివ ఎదురెదురుగా ఉన్న రెండు కుర్చీల్లో కూర్చున్నారు.

ఆ సమయంలో తినేందుకు ఎక్కువ మంది లేరు. సంజన భారీగానే ఆర్డర్ ఇచ్చింది. మొదటగా చల్లని బాసుంది; తర్వాత వేడి వెజిటబుల్ సూప్, ఫింగర్ చిప్స్, ఇంకా వెజిటబుల్ స్ప్రింగ్ రోల్స్, రొట్టెలు, నాన్స్, పన్నీర్ రెడ్ చిల్లీ, గ్రీన్ పీస్ మసాలా, పులావ్ రైస్, దాల్ మఖాని, ఇంకా కీరా రైతా.

వారు స్వీట్ కోసం ఎదురుచూస్తూ, అప్పడాలను నములుతుండగా, రంగా సిల్క్స్ అనే పేరు వినగానే శివ ఎందుకలా స్పందించాడో అడిగింది సంజన.

“ఎందుకంటే, మేడమ్, అది మా షాప్. కాదు, అది ఒకప్పుడు మా దుకాణం. ”

“అవునా, ఏమైంది?”

శివ తన తండ్రి మరణం గురించి, తన బాబాయిల ద్రోహం గురించి క్లుప్తంగా ఆమెకు చెప్పాడు. తన అందమైన గుమస్తా పట్ల సంజన ఇష్టం రెట్టింపు అయ్యింది.

“దేవుడా! వాళ్లు నిజ జీవితంలోని పాత్రలలా అనిపించరు, శివా. నేను అలాంటి విలన్లని చూడలేదు. వాళ్ళతో పోలిస్తే మన రాజశేఖర్‌ ఓ సాధువులాంటి వాడు.

నిజాయితీగా చెప్తున్నాను, శివా, మీరు ఆ వంచకులని ఏదైనా చేయాలనుకుంటే, నేను నాన్నతో మాట్లాడతాను. ఆయనకి అన్ని ప్రభుత్వ విభాగాలలో అపారమైన పలుకుబడి ఉంది.”

“అవసరం లేదు మేడమ్. గతం గతః. మేమంతా ఈ కొత్త జీవితానికి అలవాటు పడుతున్నాం. వారితో పోరాడుతూ నా జీవితాన్ని వృథా చేయకూడదనుకుంటున్నాను.”

తర్వాత వాళ్ళు – పట్టుచీరల డిజైన్, శివ చదువు, వినూతో అతని స్నేహం, ఇంకా మరెన్నో విషయాల గురించి మాట్లాడుకున్నారు.

“ఈ ట్రీట్ ఎందుకిస్తున్నానో అడగవా?”

“మీకు పెళ్ళి కుదిరిందా మేడమ్?”

“అస్సలు కాదు.”

“బ్యాంకు రుణం మంజూరు అయినందుకా ఈ వేడుక?”

“కాదు”

“నేను చెప్పలేను మేడమ్.”

“ఇవాళ నా పుట్టినరోజు, శివా”

“అయ్యో! పుట్టినరోజు శుభాకాంక్షలు మేడమ్. ఏంటి మేడమ్, మీరు ముందే చెప్పి ఉండాల్సింది.

ఇది గొప్ప రోజు మేడమ్. మీరేమో బయటి ఉష్ణోగ్రతను ఫారెన్‌హీట్‌లో ప్రకటిస్తున్నట్లుగా చప్పగా చెప్పారు.”

“శివా, వేడుక జరుపుకోవడానికి ఏముంది? నా కోసం ఎవరు ఉన్నారు? ”

శివ ఆమెను హత్తుకుని, ఆమె చెవుల్లో గట్టిగా చెప్పాలని అనుకున్నాడు – ‘రాబోయే కాలమంతా నేను మీ కోసం ఉంటాను. మరెవరి కోసమైనా మీరు ఎందుకు చూడాలి?’ అని

శివకి అకస్మాత్తుగా దగ్గు వచ్చింది. సంజన మంచినీటిని అతని వైపుకు జరిపింది. శివ దానిని తిరస్కరించి రెస్ట్ రూమ్ వైపు కదిలాడు.

పది నిమిషాల తరువాత తిరిగి వచ్చాడు.

“శివా, నీకు బానే ఉందా?”

“అవును మేడం. ఈ దగ్గు.. వాంతులవుతాయేమోనని భయపడ్డాను. అందుకే రెస్ట్ రూమ్‌కి పరిగెత్తాను.”

“శివ, ప్రతి సంవత్సరం నా పుట్టినరోజున నన్ను పలకరించే మొదటి వ్యక్తి నాన్న. ఈ సంవత్సరం ఆయన మర్చిపోయారు. మా అమ్మ కూడా.

వారు నా జీవితం గురించి చాలా ఆందోళన చెందుతున్నారు, నా పుట్టినరోజును కూడా మరచిపోయారు. ఎంత విచిత్రం! నా ఆప్త మిత్రురాలిని భోజనానికి ఆహ్వానించాను. ఆమె వస్తానని వాగ్దానం చేసింది కాని చివరి క్షణంలో రాలేకపోయింది.

నా కోసం ఎవరూ లేరని అనుకున్నాను. అందుకే నేను ఉదయాన్నే నిరాశకు గురయ్యాను, శివా.”

“మీరు నన్ను మరచిపోయారు మేడమ్. ఉదయాన్నే మీ పుట్టినరోజు గురించి మీరు నాకు చెప్పి ఉంటే మనం గొప్ప పార్టీ చేసుకునేవాళ్ళం. ”

ఇంతలో బాసుంది వచ్చింది. దానిని మౌనంగా రుచి చూడసాగారు. తర్వాత సూప్, చిప్స్, స్ప్రింగ్‌రోల్స్ వచ్చాయి.

అరగంట తరువాత నలుగురు బేరర్లు గంభీరమైన ఊరేగింపుగా వారి టేబుల్ దగ్గరకు నడుస్తున్నారు. ఐదవ బేరర్ ఊరేగింపు మధ్యలో పెద్ద అట్ట పెట్టెను పట్టుకున్నాడు.

ఊరేగింపు వీరి టేబుల్‌ వద్దకు చేరుకుంది. అట్టపెట్టెను శివ, సంజన మధ్య ఉంచారు.

బేరర్లలో ఒకరు ఆ అట్టపెట్టె నుండి ఒక పెద్ద చాక్లెట్ కేక్ తీసి టేబుల్ మీద ఉంచి కొవ్వొత్తి వెలిగించారు. కేక్‌పై “హ్యాపీ బర్త్‌డే సంజన మేడం” అని రాసి ఉంది.

శివ వారికి సైగ చేశాడు. వాళ్ళు ‘హ్యాపీ బర్త్ డే..’ అని పాడడం ప్రారంభించినప్పుడు శివ వారితో గొంతు కలిపాడు.

కళ్ళని కమ్మేసిన నీటి గుండా సంజన కేక్‌ని చూసింది. శివ కొత్త ప్లాస్టిక్ కత్తిని ఆమెకు అందించాడు.

సంజన కేక్ కట్ చేసి శివకీ, బేరర్లకు ముక్కలు ఇచ్చింది.

బేరర్లు ఆ స్థలాన్ని విడిచిపెట్టిన వెంటనే శివ ఆమెకు షేక్ హ్యాండిచ్చాడు.

“మేడమ్, పుట్టిన రోజు శుభాకాంక్షలు” అంటూ సంజన చేయి పట్టుకుని చాలా సేపు ఊపాడు.

సంజన నిరాశ గాలిలో కలిసిపోయింది. ఆమె ఇప్పుడు శివతో చాలా విషయాల గురించి ఉత్సాహంగా మాట్లాడుతోంది.

ఇదే సరైన సమయం అని అనుకున్నాడు శివ. సంజనకు తన మనస్సును తెలపడానికి మరింత మెరుగైన సమయం ఉండదు. ఆమెకు ప్రపోజ్ చేయడానికి, ప్రేమలో ఆమెని గెల్చుకోడానికి.

కానీ సంజన అతని కన్నా చాలా ముందుంది.

ఆమె శివ చేతులను పట్టుకుని నెమ్మదిగా గుసగుసలాడుతూ చెప్పింది.

“శివా, నేను నీ నుండి పెద్ద సహాయం కోరుకుంటున్నాను.”

“మేడమ్, పని అయిపోయిందనే అనుకోండి.”

“శివా, నేను అమ్మానాన్నలకు కూడా చెప్పలేదు. నా ప్రేమ గురించి నేను చెబుతున్న మొదటి వ్యక్తి నువ్వే. అవును, నేను శంకర్ అనే ఆర్కిటెక్ట్‌ని ప్రేమిస్తున్నాను. మేము ఈ మధ్యే కలుస్తున్నాం.

నేను ఆయన్ని చాలా ప్రేమిస్తున్నాను. కాని సమస్య ఏమిటంటే ఆయన వేరే కులానికి చెందినవాడు, పైగా వయసులో నాకన్నా చాలా పెద్దవాడు. ఈ సంబంధాన్ని నాన్న ఒప్పుకోరని నేను భయపడుతున్నాను. నువ్వే ఎలాగైనా నాన్నని ఒప్పించాలి. నువ్వు చెప్తే నాన్న అంగీకరిస్తారు. శివా, నువ్వు నా కోసం ఈ పని చేస్తావా?”

“చేస్తాను మేడమ్.”

శివ తన గుండె బీటలు వారడం విన్నాడు. అతని స్పందన చాలా బలహీనంగా ఉంది. కానీ సంజన తన ప్రేమలో మునిగిపోయింది, అది ఆమె గమనించలేదు.

సంజనలోని నిరాశ అంతా ఇప్పుడు శివని ఆవరించింది.

***

మరుసటి వారం చాలా సాధారణంగా గడిచిపోయింది. ఆ మేఘావృతమైన రోజు మధ్యాహ్నం దాటిన తరువాత సంజన శివని తన కాబిన్‌కి పిలిచింది.

“శివా, సాయంత్రం ఏడింటికి, టిటికె రోడ్ వద్ద హోటల్ రాజ్ పార్క్‌కి నువ్వు రావాలి.”

“మీరు నాకు ఇంకో ట్రీట్ ఇస్తున్నారా మేడమ్?”

“కాదు, నువ్వు నా బోయ్ ఫ్రెండ్‍ని కలవాలని కోరుకుంటున్నాను. నువ్వు ఆయన గురించి తెలుసుకుంటేనే నాన్నతో నమ్మకంగా మాట్లాడగలవు.”

“దయచేసి క్షమించండి మేడమ్. మీరు ప్రేమికులు కలవబోతున్నారు. పానకంలో పుడకలా నేనెందుకు మేడమ్ అక్కడ?”

“నువ్వు మొత్తం టైమంతా అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. కాసేపు ఉండి, ఆయన్ని కలువు, సూప్, ఐస్ క్రీం తీసుకో, ఆ తరువాత నువ్వు వెళ్ళవచ్చు. మంచి చీరను ఎంచుకోవడానికి నువ్వు నాకు సహాయం చేశావు. నా జీవిత భాగస్వామిని కూడా ఎంచుకోవడంలో కూడా సహాయం చేస్తావని ఆశిస్తున్నాను.”

‘ఎంచుకోవడానికి ఏముంది? అతనితో ప్రేమలో పడటానికి ముందు మీరు అతన్ని నాకు చూపించి ఉంటే, నేను మీకు సహాయం చేయగలిగేవాడిని.

మరెవరినైనా పరిగణలోకి తీసుకునే ముందు మీరు నాకు అవకాశం ఇచ్చుండాల్సింది. ఇప్పుడు విషయం చేయి దాటిపోయింది! మీరు ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నారు. సంబంధాన్ని ఆమోదించడానికి నేనెవరు?’

తన మనసులోని చేదును దాచడానికి శివ చాలా కష్టపడాల్సి వచ్చింది.

“మేడమ్, నేను అక్కడ అరగంట ఉన్నా, ఇంటికి వెళ్ళేసరికి బాగా ఆలస్యం అవుతుంది, మేడమ్. మా వాళ్ళు కంగారు పడతారు.”

“ఓహ్, అదా నీ సమస్య? అయితే, నాకు మాల్య నెంబర్ ఇవ్వు. నేను తనతో మాట్లాడి ఆమె అనుమతి తీసుకుంటాను. చాలా?”

శివ తలాడించాడు.

“భయపడకు. నా ప్రియుడిని కలుస్తున్నావని నేను మాల్యకి చెప్పను. నేను బ్యాంకు సిబ్బందికి పార్టీ ఇస్తున్నానని ఆమెకు చెబుతాను.”

***

“శంకర్, ఇతను శివ. మా ఆఫీస్ మేనేజర్, ఇంకా నా పిఎ కూడా. తెలివైన వాడు. నిపుణుడైన చీరల డిజైనర్. ఆ ఎరుపు రంగు చీర చూశారు కదా, గుర్తుందా? అది ఇతనే డిజైన్ చేశాడు.”

“శివా, ఈయన శంకర్. ప్రసిద్ధ ఆర్కిటెక్ట్. మన ఆసుపత్రికి రెండు బ్లాకుల దూరంలో ఎత్తైన భవనం కడుతున్నది గమనించావా? అవును, అది ఈయన డిజైనే. ఇద్దరు సృజనాత్మక వ్యక్తులను ఇక్కడ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.”

శంకర్ హ్యాండ్‌షేక్ వెచ్చగా, స్నేహంగా ఉంది. ఆయనకి కనీసం నలభై సంవత్సరాలు ఉండాలి. సగటు ఎత్తు శరీరం, పైగా కొద్దిగా ఊబకాయం. తాను ధరించిన డిజైనర్ కళ్ళజోడు వెల కనీసం యాభై వేలు ఉంటుందని శివకి తెలుసు.

ఏమైతేనేం, సంజన అందగాడు, ధనవంతుడైన ప్రొఫెషనల్‌తో ప్రేమలో పడింది. ఆమె తండ్రి పెద్దగా అభ్యంతరం చెప్పకపోవచ్చు.

సంజన గతం దృష్ట్యా చూస్తే, ఇది ఖచ్చితంగా చాలా మంచి సంబంధం. కానీ, ‘శంకర్, ఏదేమయినా మీరు ఆమెకి సరిజోడు కాదు. స్థాయిలో ఆమె కన్నా ఎన్నో మెట్లు దిగువన ఉన్నారు’ తనలో తాను అనుకున్నాడు శివ.

ధనవంతుల మాటల్లో దొర్లే సాధారణ అంశాలైన – చెన్నైలోని రియల్ ఎస్టేట్ ధరలు, ఆదాయపు పన్ను కష్టాలు, పెరిగే బంగారం ధరల గురించి మాట్లాడుకున్నారు.

సంజన శివ కళ్ళలోకి సూటిగా చూస్తూ అతనితో నేరుగా మాట్లాడినప్పుడల్లా శంకర్ ముఖ కవళికలు మారిపోయాయి, ఇది గమనించడంలో శివ విఫలం కాలేదు.

శివ ఫ్రెంచ్ ఆనియన్ సూప్, ఒక కప్పు చాక్లెట్ ఐస్ క్రీం పూర్తి చేశాడు. ఇకపై ప్రేమికుల  మధ్య తాను ఉండటానికి ఇష్టపడలేదు. బయలుదేరడానికి లేచి నిలబడ్డాడు.

“శివా, నా సెలెక్షన్ ఎలా ఉంది?”

సంజన అతన్ని ఆటపట్టించింది.

శంకర్ కళ్ళలో తేలికపాటి కోపం కనబడింది. సంజన ప్రశ్నకు శివ సమాధానం ఇవ్వలేదు. బదులుగా శంకర్‌తో మాట్లాడాడు.

“సర్, సంజన మేడమ్ లాంటి వారిని పొందడానికి నిజంగా అదృష్టం ఉండాలి.”

“వినండి, వినండి” సంజన చిన్నపిల్లలా అరిచింది. ఆమె శివకి షేక్ హ్యాండ్ ఇచ్చింది.

శంకర్ ముఖ కవళికలు దారుణంగా ఉన్నాయి.

“ఇది ఎలా ఉందంటే, శివా, మీరు ఆమె పిఏ. సహజంగానే మీ బాస్‌ని పొగుడుతారు. కరెక్టే కదా? ఒకవేళ నేను నా పిఎను తీసుకువస్తే ఆమె కూడా సంజనతో ఇలాగే అని ఉండేది.”

తన జోక్‌కి తానే గట్టిగా నవ్వాడు శంకర్.

“సర్, మీరు బాధపడనని మాటిస్తే, నేను మీకో విషయం చెప్తాను.”

“తప్పకుండా.”

“ఒకవేళ నేను మీ పిఏ అయినా అదే మాట చెప్పేవాణ్ణి. నేను మీకు చెప్పినది ఒక ప్రాథమిక సత్యం, సర్.

సూర్యుడు తూర్పున ఉదయించడం అనే సత్యం లాంటిదే ఇదీను. ప్రాథమిక సత్యాల చెల్లుబాటు ప్రస్తుతానికి నా యజమాని ఎవరు అనే దానిపై ఆధారపడి ఉండదు. నేను సరిగ్గా చెప్పాకదా మేడమ్?”

“శబాష్, శివా. ఆయన మాటకి తగిన జవాబు చెప్పావు.”

మనస్తాపం చెందినట్లు శంకర్ ముఖంలో స్పష్టంగా కనబడింది. మిగిలిన తన ఇమేజ్‌ని కాపాడుకోటానికి ప్రయాసపడ్డాడు.

“శివా, మీరు బాధపడనని మాటిస్తే, నేను మీకో విషయం చెప్తాను.”

శివ యజమాని స్వరాన్ని శంకర్ అనుకరించాడు.

“ప్లీజ్ సర్.”

“తనకు తాను మేధావిననుకునే మీలాంటి వాళ్ళని నేను నా పిఎ గా పెట్టుకోను.”

‘అసలు నేను మీలాంటి పొగరుబోతుల దగ్గర పని చేయను.’

అరిచి చెప్పాలనుకున్నాడు శివ, కాని చెప్పలేదు.

శంకర్ మళ్ళీ నవ్వాడు. కానీ ఆ నవ్వు రోత కలిగించేలా ఉంది.

శివ మనసు గాయపడింది.

కానీ తన ప్రేమికుడితో సంజన గడిపే సమయాన్ని పాడుచేయటానికి ఇష్టపడలేదు శివ. అందువల్ల అతను తన కోపాన్ని అణచుకుని, నవ్వు ముఖం పెట్టాడు.

“మేడమ్, మీకు సరైన వ్యక్తి లభించారు. తెలివైన మాటలతో నన్ను గెలిచారు, చూడండి. నేను వెళ్ళాలి మేడమ్. బై. బై, సర్. మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది.”

***

కాలం వేగంగా పరిగెడుతోంది. మాల్యకీ, పద్మకీ తమ ప్రధానమైన సమస్య పరిష్కారమైంది. శివ జీవితంలో సర్దుకున్నాడు, కుదురుకున్నాడు. ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు, ఉత్సాహంగా పని చేస్తున్నాడు. అయినా జీవితం ఒడిదుడుకుల మయం కదా!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here