సద్వినియోగం

0
11

[బాలబాలికల కోసం ‘సద్వినియోగం’ అనే కథ అందిస్తున్నారు కంచనపల్లి వెంకట కృష్ణారావు.]

[dropcap]“క[/dropcap]థ చెప్పండి గురూజీ” అంటూ విద్యాపతి గారి చుట్టూ పిల్లలు చేరారు.

“తప్పక చెబుతాన్రా పిల్లలూ, ఆశావాదికి, నిరాశావాదికి సంబంధించిన కథ చెబుతాను శ్రద్ధగా వినండి” అని చెప్పి కథ మొదలు పెట్టారు.

ఓ గురువు గారి వద్ధ విజయుడు, గణపతి అనే శిష్యులు ఉండేవారు. ఇద్దరి ఆలోచనలు చాలా భిన్నమైనవి.

విజయుడికి ఏ పని చెప్పినా సమర్థవంతంగా పనిచేసి ఆ పనిని సాధించేవాడు. గణపతికి గురువుగారు ఏ పని చెప్పినా, పనిని గురించి వివరించినా బద్ధకంగా ఆ పని తన వలన కాదని తన అనాసక్తతను తెలిపి తప్పించుకునేవాడు. ఇప్పుడే పని పట్ల ఇటువంటి అలసత్వం లేక బద్ధకం చూపితే ఇక భవిష్యత్తులో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎన్నో కష్టాలు ఎదుర్కొనవలసి వస్తుందని చెప్పి చూసాడు. అయినా గురువుగారి మాటలను లెక్క చేసేవాడు కాదు గణపతి.

గణపతిలో మార్పు తేవాలని గురువు నిశ్చయించుకుని ఇద్దరికీ ప్రత్యేకంగా రెండు గదులు కేటాయించాడు. ఒకరోజు ఇద్దరూ పుస్తకాలు చదువుకుని ఇద్దరూ గాఢ నిద్రపోయారు. అర్ధరాత్రి పనికిరాని వస్తువులను గురువుగారు వారి గదుల్లో ఉంచారు.

తెల్లవారి ఇద్దరూ నిద్ర లేచేసరికి వారి గదుల్లో పనికి రాని వస్తువులు కనబడ్డాయి. వెంటనే గురువుగారి వద్దకు వెళ్ళి ఆ వస్తువులను గురించి అడిగారు.

“పనికిరాని వస్తువులంటూ ఏవీ ఉండవు, మెదడు పెట్టి ఆలోచిస్తే అన్నీ పనికొచ్చేవే” అని చిరునవ్వుతో చెప్పారు గురువుగారు.

గురువుగారు తమకు పరీక్ష పెట్టారని విజయుడు ఆలోచించి ఆ వస్తువుల్లోంచి పనికి వచ్చే మూడు వస్తువులు తయారు చేసి గురువుగారి మెప్పు పొందాడు.

గణపతి ఆ పనికిరాని వస్తువులను చూసి కోపగించుకుని వాటిని తన గదిలో వేసి తనను అవమానించినట్లు భావించాడు. ఏది ఏమైనా గురువును మెల్లగా నిలదీయాలని అనుకున్నాడు.

గురువును గణపతి తనగదిలో చెత్త వస్తువులను గురించి అడిగాడు.

“గణపతీ రెండు రోజులు ఓపిక పట్టు, అన్నింటినీ తీయించేస్తాను.” చెప్పారు గురువు.

రెండు రోజుల తరువాత విజయుడి గదిని గణపతి చూస్తే విజయుడు ఆ పనికిరాని వస్తువులతో పిల్లలు ఆడుకునే చిన్నబండి, చిన్న బల్లలు రెండు తయారు చేసాడు. మరీ పనికిరాని కొయ్య వస్తువులను వంటశాలలో పొయ్యి దగ్గర పెట్టాడు!

గురువుగారు గణపతిని, విజయుణ్ణి పిలిచి ఈ విధంగా చెప్పాడు.

“ఇద్దరి గదుల్లో పనికిరాని వస్తువులు పెట్టాను. కానీ విజయుడు ఏ విమర్శా చేయకుండా కనీసం ఉపయోగపడే మూడు వస్తువులు తయారు చేసాడు. అంటే చెత్త నుండి సంపద సృష్టించాడు. గణపతీ నీవు మటుకు అనాలోచితంగా ఆ వస్తువులను ఉపయోగించక నీకు చేతనైన ఏ వస్తువు చేయలేకపోయావు. ఆలోచించు మన జీవితంలో బద్ధకంతో లేక వక్రంగా ఆలోచిస్తే వచ్చిన అవకాశం చేజారి పోవచ్చు. ఇద్దరికీ ఇంచుమించు ఒకేరకం పనికిరాని వస్తువులు ఇచ్చాను. ఇద్దరికీ దేముడు ఒకే రకమైన సమయం ఇచ్చాడు. విజయుడు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే నీవు మటుకు సద్వినియోగం చేసుకోలేక పొయ్యావు” అని వివరించారు గురువు.

విజయుడు తయారు చేసిన బొమ్మ, చెక్క బల్లలు చూసి తనను తాను మార్చుకోవాలని గణపతి నిర్ణయించుకుని గురువు గారి పాదాలకు నమస్కరించి తన మంచి అభిప్రాయం చెప్పాడు.

విద్యాపతిగారు ఈ కథ చెప్పి, “పిల్లలూ మీకు ఈ కథలోని నీతి అర్థం అయిందా?” అని అడిగారు.

“అయింది గురువుగారు మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, బద్ధకం వదిలించుకుంటే జీవితంలో పైకి వస్తాము.” అని పూర్తి విశ్వాసంతో చెప్పారు. వారిమాటలు విన్న విద్యాపతి గారు ఎంతో సంతోషించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here