సగం రోజు

0
7

[box type=’note’ fontsize=’16’] నగీబ్ మహఫూజ్ (ఈజిప్ట్) రచించిన ‘హాఫ్ ఎ డే’ కథను తెలుగులో ‘సగం రోజు’ పేరుతో అందిస్తున్నారు శ్రీ ఎ.యం.అయోధ్యారెడ్డి. [/box]

[dropcap]మా[/dropcap] నాన్న కుడిచేయి గట్టిగా పట్టుకొని నడుస్తున్నాను. ఆయన పెద్ద పెద్ద అంగలేస్తూ పోతుంటే ఆయనతో సమానంగా నడిచేందుకు మధ్యమధ్య పరిగెత్తుతున్నాను. అప్పుడు నేను కొత్త డ్రస్ ధరించి వున్నాను. కాళ్ళకు నల్లటి పాలిష్ చేసిన బూట్లు, ఆకుపచ్చ స్కూలు యూనిఫారం. ఎర్రరంగు కుచ్చుటోపీ పెట్టుకున్నాను.

అయితే కొత్త బట్టలు వేసుకున్న ఆనందంగానీ, అవి చిన్నమరకైనా లేకుండా మెరిసిపోతున్నాయన్న గర్వంగానీ నాలో లేవు. అది పండగరోజు కూడా కాదు. మేమేదైనా ఫంక్షనుకో.. విందు భోజనానికో వెళ్ళడం లేదు. కానీ వీటన్నిటికీ మించిన ముఖ్యమైన రోజది. ఆ దినమే నేను మొదటిసారి స్కూలుకు వెళుతున్నాను. నాన్నా నేనూ కలిసి పోతుంటే మా అమ్మ వంటింట్లో కిటికీ వద్ద నిలబడి మమ్మల్నే చూసింది. నేనామెను సహాయపడమని అర్థిస్తున్నట్టు మాటిమాటికి వెనుదిరిగి చూస్తూ ముందుకు అడుగులేశాను. కానీ ఆమె నాకే సాయమూ చేయలేదు.

దారిపొడవునా ఇరువైపులా పచ్చటి పంటచేళ్లు, తోటలు విస్తరించివున్న వీధుల గుండా మేము నడిచిపోయాం. కనుచూపుమేరా విశాలమైన పంటపొలాలే కనిపించాయి. ప్రిక్లీ బేరి, గోరింట, ఖర్జూర, ఇతర చెట్లతో ఏపుగా పెరిగిన తోటలున్నాయి.

“నేనిప్పుడు స్కూల్లో చేరడం ఎందుకు నాన్నా! చదువు అంత అవసరమా?” నిలదీసినట్టు అడిగాను. అంతలోనే భయపడి “నాకు స్కూలు వొద్దు. ఇంట్లోనే ఉంటాను. నేను మిమ్మల్ని బాధపెట్టే పని ఎప్పుడూ చేయను నాన్నా” గొంతు తగ్గించి వినయంతో అన్నాను.

“నేను నిన్నేమీ శిక్షించడం లేదురా” ఆయన నవ్వుతూ అన్నాడు.

“స్కూలు అంటే అదేదో జైలు కాదురా. అది బాలలను సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారుచేసే కర్మాగారం. నువ్వూ చదువుకొని మీ నాన్నలా, అన్నయ్యల మాదిరిగా ఉండాలని అనుకోవడం లేదా?”

ఆయన మాటలు నాకు సంతృప్తి కలిగించలేదు. నా ఇంటి నుంచి, ఇంట్లో మనుషుల సాన్నిహిత్యం నుండి విడదీసి నన్ను దూరంగా తీసుకవెళ్లడం వల్ల జరిగే మంచి ఏమిటో అర్థం కాలేదు. బడి మీద నమ్మకంగానీ, బడి అంటే ఇష్టంగానీ నాకు లేదు కూడా. అదిగో.. ఆ రోడ్డు చివర్లో నిలబడి ఉన్న ఎత్తయిన పాఠశాల అనే భవనంలోకి బలవంతంగా తోసెయ్యడం నిజంగా నా శ్రేయస్సు కోసమేనా? నాకు అస్సలు విశ్వాసం లేదు.

మేము స్కూలు గేటు వద్దకు చేరుకున్నాం. భవనం ముందుగల సువిశాలమైన ప్రాంగణాన్ని చూశాను. ఆ ప్రాంగణంలో గుంపులు గుంపులుగా అబ్బాయిలు, అమ్మాయిలు కనిపించారు.

“నేను నీతో లోపలికి రాకూడదు. నువు వెళ్లి వాళ్ళందరితో చేరిపో. అట్లా భయంగా, ముడుచుకొని వుండకు. నీ ముఖం మీద ఎప్పుడూ చిరునవ్వు కనబడుతూ వుండాలి. అందరితో స్నేహపూరితంగా మసులుకో, అర్థమైందా” నన్ను లోపలికి పంపుతూ అన్నాడు నాన్న.

కొన్ని క్షణాలు సంశయిస్తూ ముందుకు పోకుండా ఆయన చేతిని మరింత గట్టిగా పట్టుకున్నాను. కానీ నాన్న నా చెయ్యి బలవంతంగా విడిపించుకొని నన్ను చిన్నగా లోపలికి నెట్టాడు.“భయమెందుకురా? ధైర్యంగా వెళ్ళు. చక్కగా చదువుకో. మంచి బాలుడిగా వుండు. నువ్వీరోజు నీ అసలైన జీవితాన్ని మొదలుపెట్టబోతున్నావు. ఇందుకు సంతోషించాలి. బడి వొదిలే సమయానికి మళ్లా నేనిక్కడే నీకోసం ఎదురు చూస్తుంటాను” అన్నాడు.

నేను మెల్లగా అడుగులు వేస్తూ కొద్దిదూరం ముందుకెళ్ళాను. ఆపైన ఆగి ఒకసారి వెనక్కి చూశాను. కానీ అక్కడ నాన్న కనిపించలేదు. నాకెదురుగా ఎంతోమంది అబ్బాయిలు, అమ్మాయిలు. వాళ్ళలో నాకెవరూ తెలియదు. అట్లాగే వాళ్ళలో ఏఒక్కరికీ నేనూ పరిచయం లేను. అంతమందిలో నేనో దారితప్పిన అపరిచితునిలా వున్నాను. వాళ్ళలో పలువురు నాకేసి కుతూహలంగా చూస్తున్నారు. ఒకతను చొరవగా నా సమీపానికి వొచ్చి“ బడికి కొత్తగా వొచ్చావా? నిన్నిక్కడికి ఎవరు తీసుకొచ్చారు?” అని

అడిగాడు. “మా నాన్నతో కలిసి వొచ్చాను” సంకోచంతో మెల్లగా చెప్పాను.

దానికా అబ్బాయి చాలా మామూలుగా “నాకు నాన్నలేడు, చచ్చిపోయాడు” అని చెప్పాడు.

అతడట్లా అనగానే నాకేం మాట్లాడాలో తోచలేదు. ఇంతలో బడి గంట మోగింది. కీచుమనే పెద్ద చప్పుడుతో స్కూలు మెయిన్ గేటు మూసుకుంది. నాలాగే ఆరోజే కొత్తగా వొచ్చిన కొంతమంది పిల్లలు కన్నీళ్లు పెట్టుకున్నారు. భవనం లోపలినుంచి ఒక మహిళ కొందరు వ్యక్తులను వెంటబెట్టుకొని బయటికి వచ్చింది. ఆమెతో వచ్చిన వ్యక్తులు మమ్మల్ని ర్యాంకుల వారీగా క్రమబద్ధీకరించి లైన్లలో నిలబెట్టారు.

ఆ ప్రాంగణంలో చుట్టూ మూడువైపులా బహుళ అంతస్తుల ఎత్తైన భవనాలు. ప్రతి అంతస్తులోనూ చెక్కతో కట్టబడిన పెద్ద బాల్కనీలు ఉన్నాయి. మధ్యన గల విశాలమైన మైదానంలోనే మేమిప్పుడు జట్లుగా ఏర్పడి నిలుచున్నాం.

“చూడండి పిల్లలూ! ఇకనుంచి ఇదే మీ కొత్త ఇల్లు” అని ఆ మహిళ చెప్పింది. “మీ ఇంట్లో మాదిరిగానే ఇక్కడ కూడా మీ అమ్మా నాన్నలు ఉంటారు. మీకు ఇక్కడ సంతోషంగా ఉండేందుకు కావాల్సినవి, మీ విజ్ఞానానికి, మతానికి సంబంధించిన ప్రయోజనం చేకూర్చే ప్రతిదీ ఇక్కడ ఉన్నది. అందుచేత మీ కన్నీళ్ళు తుడుచుకొని జీవితాన్ని ధైర్యంగా ఆనందంగా ఎదుర్కోవడం నేర్చుకోండి”

మేము క్రమంగా అక్కడి పరిసరాలకు, వాస్తవాలకు అలవాటు పడ్డాం. మాకది ఒక విధమైన సంతృప్తిని కలిగించింది. మా అందరిలో పరస్పర స్నేహపూరిత ఆకర్షణకు దోహదం చేసింది. నాలో బెంగ తొలగింది. నాకు నచ్చిన అబ్బాయిలతో స్నేహం చేశాను. అలాగే మనసుకి దగ్గరగా వొచ్చిన అమ్మాయిలకు సన్నిహితమయ్యాను. అలా నేను ఇతరులను ప్రేమించడం తెలుసుకున్నాను. తద్వారా నాలో అప్పటివరకూ వున్న పలు అనుమానాలకు ఆధారం లేదని అనిపించింది. ఒక స్కూలు ఇన్ని గొప్ప సౌకర్యాలతో, ఇంత సౌకర్యవంతంగా వుంటుందని నేను ఎప్పుడూ ఊహించలేదు.

మేమక్కడ భిన్నమైన అన్నిరకాల ఆటలు ఆడుకున్నాం. స్వింగ్స్, వాల్టింగ్ హార్స్, బాల్ గేమ్స్ ఇట్లా ఎన్నో. ప్రత్యేకంగా సంగీతం, కళల కోసం కేటాయించబడిన గదిలో మేము తొలిసారి పాటలు పాడాం. కొత్తపాట నేర్చుకున్నాం. అట్లాగే భాషకు సంబంధించి తొలి పరిచయం మాకు అక్కడే జరిగింది.

అక్కడ మేము పెద్ద గ్లోబును చూశాం. దాని ద్వారా సమస్త భూగోళాన్ని గమనించాం. దాన్ని చుట్టూ తిప్పుతూ వివిధ ఖండాలు, దేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకున్నాం. తర్వాత గణితంలో అంకెలు నేర్చుకోవడం ప్రారంభించాం. విశ్వాంతరాలాన్ని సృష్టించిన విధాత కథలను అక్కడ మాకు చదివి వినిపించారు. ఆయనచేత సృష్టించబడిన ఈ లోకం గురించీ, దీనికి పైన ఉన్న పరలోకాన్ని గురించీ మాకు గొప్పగా చెప్పబడింది. దేవుడి ప్రవచనాలు, వర్తమానంలో వాటికి తగిన ఉదాహరణలు కూడా విన్నాం.

మాకు చక్కటి రుచికరమైన భోజనం పెట్టారు. తిన్నతర్వాత మధ్యలో కొంతసేపు నిద్రపోయాం. లేచిన తర్వాత కొత్త ఉత్సాహంతో ముందుకు సాగిపోయాం. ప్రేమకోసం, స్నేహాల కోసం, చదువూ క్రీడాభిలాషలతో ముందుకు సాగినం.

మా మార్గమే మాకు అన్నీ విశదం చేసింది. అయినప్పటికీ మొత్తంమీద అది పూలబాట అన్పించలేదు. మేము ఊహించుకున్నట్టు సాహసించేలా లేదు. హఠాత్తుగా వచ్చిపడిన సుడిగాలులు, అనుకోని ప్రమాదాలు అప్రమత్తంగా సంసిద్ధంగా ఉండటం ఎట్లాగో నేర్పించాయి. కేవలం ఆడుకోవడం, తిరగటం మాత్రమే సర్వస్వం కాదు. అలాగే తగాదాల వల్ల బాధలు కలుగుతాయి. గొడవలు పరస్పర ద్వేషాన్ని పెంపొందిస్తాయి. చివరికి విషాదాన్నే మిగులుస్తాయి.

మా క్లాసు టీచరు కొన్నిసార్లు చక్కగా నవ్వుతుంటుంది. కానీ అంతకన్నా తరచుగా తిడుతుంది. కొడుతుంది కూడా. ఇంకొన్నిసార్లు అక్కడితో ఆగకుండా కఠినమైన శారీరక శిక్షలను అమలు చేస్తుంది. దీనికితోడు ఒకరి మనసు పరివర్తన చెందగల వ్యవధి ముగిసింది. ఇక వెనుతిరిగి వెళ్ళగల ప్రశ్నే లేదు. మన ముందు శ్రమించడం, పట్టుదలతో పోరాడటం తప్ప మరేమీ మిగలదు. నిరాశ నిస్పృహల మధ్య తమను తాము సన్నద్ధం చేసుకొని, విజయానికి ఆనందానికి అందివచ్చే అవకాశాలను సమర్థులు మాత్రమే సద్వినియోగం చేసుకోగలిగారు.

ఆరోజుకు పని ముగిసినట్టు, రోజు గడిచినట్టుగా గంట కొట్టారు. పిల్లలు గుంపులుగా తెరుచుకున్న గేటువైపు పరిగెత్తారు.

నేను స్నేహితులకు, సన్నిహితులైన అమ్మాయిలకు వీడ్కోలు చెప్పి గేటుదాటి వెళ్లాను. బయట నిలబడి చుట్టూ చూశాను.

కానీ ఆ సమయానికి అక్కడే వేచివుంటానని వాగ్ధానం చేసిన నాన్న జాడ కనిపించలేదు. చాలాసేపు రోడ్డుపక్కనే నిలబడ్డాను. అట్లా ఎంతోసేపు ఎదురుచూసినా నాన్న వస్తున్న జాడ కనిపించలేదు. ఇక నేనే ఒంటరిగా ఇంటికి తిరిగి వెళ్లాలని బయలుదేరాను.

నడుస్తుంటే నడివయసు మనిషి ఒకరు నన్ను దాటుకుని వెళ్ళాడు. అతన్ని ఇదివరలో ఎక్కడో చూసినట్టూ, నాకు పరిచయస్థుడైనట్టూ అనిపించింది. ముందుకు పోయినవాడల్లా అతనే తిరిగి నా దగ్గరకొచ్చాడు. నాతో చేయి కలిపి నవ్వుతూ “మనం కలుసుకొని చాలా కాలమైంది. ఎలా వున్నారు?” అని ప్రశ్నించాడు.

తలవూపుతూ నేను కూడా నవ్వాను. అతనితో ఏకీభవించినట్టు చూస్తూ, “నేను బాగున్నాను, మరి మీరు?” అన్నాను.

“నిజం చెప్పాలంటే అంత బాగా ఏమీ లేను. అంతా సర్వాంతర్యామి దయ” అంటూ మరోమారు చేయి కలిపి వెళ్ళిపోయాడు.

నేను అట్లా మరికొంత దూరం నడిచి ఆశ్చర్యంతో నిలబడిపోయాను. గాడ్..! ఈ దారిలో విశాలమైన తోటలూ, పంటచేళ్ళూ వుండాలి. అవేవీ ఇప్పుడు కనిపించడం లేదు. ఏమై పోయాయి? మందలు మందలుగా ఈ వాహనాలన్నీ ఎక్కనుంచి వొచ్చాయి? ఎప్పుడు దురాక్రమణ చేశాయి. ఇంత సందోహం, జన జీవనం, ఉరుకులు పరుగులన్నీ ఈ వీధి ఉపరితలం పైకి ఎప్పుడు చేరుకున్నాయి? దారికి రెండువైపులా అపరిశుభ్రమైన చెత్తకుప్పలు ఎప్పుడు పెరిగి కొండలైనాయి? రోడ్డును కమ్ముకుంటూ ఈ మురికి కాలువలేమిటి ఇట్లా అసహ్యంగా పారుతున్నాయి? ఇదంతా ఎప్పుడు జరిగింది? ఎట్లా జరిగింది? రోడ్డు సరిహద్దుల వెంబడి వుండే చెట్లూ, పచ్చని పొలాలు ఏమయ్యాయి? వాటి స్థానంలో ఇప్పుడు ఎత్తయిన బహుళ అంతస్తుల భవనాలు వెలిశాయి.

రోడ్డు మీద చాలామంది పిల్లలు విచ్చలవిడిగా తిరుగుతూ ఆడుతున్నారు. వాళ్ళ అరుపులు, కేకలతో కలవరపెట్టే శబ్దాలు గాలిని కదిలిస్తున్నాయి. అక్కడక్కడా గారడివాళ్ళు తమ విద్యలు ప్రదర్శిస్తూ తమ దగ్గరున్న వెదురుబుట్టల్లోంచి పాములను తీసి ఆడిస్తూ జనాలకు వినోదం పంచుతున్నారు. ఎదుటివైపు నుంచి వస్తున్న ఒక బృందం పెద్దగా బ్యాండు చప్పుడుచేస్తూ ఫలానా తేదీ నుంచి ఊళ్ళో సర్కస్ ప్రదర్శన వుంటుందన్న ప్రకటన చేస్తున్నారు. సర్కసులో పనిచేసే వస్తాదుల్లా వున్న కొందరు వెయిట్ లిఫ్టర్లు, ఆడవాళ్ళు, జోకర్లు బ్యాండుకు ముందు నడుస్తున్నారు.

కేంద్ర భద్రతాదలాలను తీసుకువెళుతున్న ట్రక్కుల కాన్వాయ్ ఒకటి గంభీరంగా ముందుకు వెళ్ళింది. ఆ వెంటనే సైరన్ పెద్దగా మోగించుకుంటూ ఫైరింజన్ ఒకటి రోడ్డుమీద విరుచుక పడింది. అంతటి రద్దీని, జన సమూహాన్ని తప్పించుకుంటూ ఆ వాహనం వేగంగా ప్రమాదస్థలానికి చేరుకోగలదా అనేది అనుమానమే.

రోడ్డుకు మధ్యలో ఒకచోట ఒక ప్రయాణీకుడు టాక్సీ డ్రైవరుతో గొడవ పడుతున్నాడు. చూస్తుండగానే ఆ గొడవ కాస్తా కొట్లాటకు దారితీసింది. ప్రయాణికుని భార్య కాబోలు సహాయం కోసం కేకలు వేస్తూ అందరినీ పిలిచింది. కానీ ఎవరూ వినిపించుకోలేదు. అటుకేసి రాలేదు.

“మైగాడ్! ఏమిటిదంతా.. ఏమిటీ మార్పు?” నేను అబ్బురపడ్డాను. నా తల తిరిగింది. దాదాపు వెర్రివాడిలా చూడసాగాను.

ఉదయం తండ్రితో కలిసి బడికి వెళ్ళిన సమయానికి, ఇప్పుడు సూర్యాస్తమయానికి నడుమ కేవలం సగంరోజులో ఇన్ని మార్పులు ఎట్లా జరిగాయి? ఇంత తక్కువ వ్యవధిలో ఇది ఎట్లా సాధ్యం? ఏం జరిగివుండవచ్చు? ఇంటికి చేరాక నాన్నను అడిగి విషయం తెలుసుకోవాలి.

ఇంతకీ మా ఇల్లు ఏదీ? కనిపించదేం.. ఎక్కడుంది? ఎక్కడా కనిపించడం లేదు. ఎటు చూసినా ఎత్తయిన భవనాలు, గొర్రెల మందల్లా జనం కనిపిస్తున్నారు. గబగబా నడుస్తూ బర్డెన్స్ అండ్ అబూఖోడా మధ్యగల కూడలికి చేరుకున్నాను. మా ఇంటికి వెళ్ళడానికి నేను అబూ ఖోడాను దాటవలసి వచ్చింది. మా ఇల్లు చేరాలంటే రోడ్ క్రాస్ చేయాలి. కాని ఎంతసేపటికీ రోడ్డుపైన వాహనాల ప్రవాహం వీడలేదు. అడుగువేయబోతే ఏదో వాహనం దూసుకుపోతున్నది. హఠాత్తుగా ఫైర్ ఇంజన్ తాలూకు సైరన్ శబ్దాలు విరుచుకుపడి భయపెడుతున్నాయి. కానీ ట్రాఫిక్ ఏమాత్రం తగ్గటం లేదు. చాలాసేపు వేచిచూసినా రోడ్డుకు అటుపక్కకి వెళ్లలేకపోయాను.

చిరాకు కలిగింది. కోపంగా వుంది. అసహనానికి గురయ్యాను. ఇట్లా భయపడుతూ నిలుచుంటే ఎప్పటికి రోడ్డు దాటగలను అనిపించింది. అట్లాగే నిలబడి చూస్తున్నాను.

రోడ్డు మూలగా వున్న ఐరన్ షాపులో పనిచేస్తున్న ఒక కుర్రవాడు పరుగున నా దగ్గరకొచ్చాడు.“తాతగారూ.. పదండి, నేను మిమ్మల్ని రోడ్డు దాటిస్తాను” అంటూ చేయి పట్టుకున్నాడు. తలవూపి ముందుకు అడుగేశాను.

మూలరచన: నగీబ్ మహఫూజ్ (ఈజిప్ట్)

అనువాదం: ఎ.యం.అయోధ్యారెడ్డి


నగీబ్ మహఫూజ్ పరిచయం

ఈజిప్ట్ లెజండ్ నగీబ్ మహఫూజ్ సాహిత్యానికి నోబెల్ బహుమతి పొందిన ఏకైక అరబిక్ రచయిత. ఏడు దశాబ్దాలుగా నిరంతరాయంగా విస్తారమైన సాహితి సృజన చేసిన ప్రతిభాశాలి. వందల్లో కథలు, నవలలు, వ్యాసాలు, స్క్రీన్ ప్లేలు రాశారు.

1911 డిసెంబరు11న కైరో నగర పాతబస్తీలో దిగువ మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో పుట్టాడు. అక్కడే హైస్కూలు చదివి తర్వాత కైరో వర్శిటీ నుంచి ఫిలాసాఫీలో డిగ్రీ పొందారు. 1934 నుంచి సివిల్ సర్వెంటుగా వివిధ హోదాల్లో పనిచేసి పదవి విరమణ చేశారు. మహఫూజ్ కఠినమైన ఇస్లాం సంప్రదాయాల మధ్య పెరిగినవాడు. చిన్నతనం నుంచీ సాహిత్యం విపరీతంగా చదువుకున్నారు. మార్సెల్ ప్రౌస్ట్, ఫ్రాంజ్ కాఫ్కా, జేమ్స్ జాయిస్ రచనలు చదివి ఎక్కువ ప్రభావితులయ్యారు. అల్-రిసాల పత్రిక కోసం మహఫూజ్ తొలుత చిన్న కథలు ఎక్కువ రాశారు.

ఆయన రచనల్లోని పాత్రలు చాలావరకు సాధారణ జనం. ముఖ్యంగా కైరోలోని అధిక జనాభా గల ప్రాంతాల నేపధ్యం.

పాత్రలు సాధారణ జనం. పాశ్చాత్య నాగరికతలు, ఆధునీకరణ మధ్య జనం జీవన విధానం, ఎదుర్కొన్న సంఘర్షణలు కనిపిస్తాయి. తొలినాళ్ళలో రాసిన ‘మోకరీ ఆఫ్ ఫేట్స్’, ‘రాడోపిస్’, ‘ది స్ట్రగుల్ ఆఫ్ దెబిస్’ తదితర నవలలు ప్రాచీన యూరప్ నేపధ్యంలో రాయబడినవే అయినా తదనంతర రచనలు ఆధునిక ఈజిప్టు సామాజిక స్థితి, పరిణామాలను చిత్రించినయి. అరబిక్ కాల్పనిక సాహిత్యంలో ఆస్తిత్వవాద ఇతివృత్తాలను అన్వేషించిన సమకాలీన రచయితల్లో ఆద్యునిగా పేర్కొనబడ్డారు.

నాటి ఈజిప్టు విప్లవం నాటికి ఆయన వయసు ఏడేళ్లు అయినప్పటికీ విప్లవం ఆయనపై బలమైన ముద్ర వేసింది. దాని ప్రభావంతో రాసిందే తన రచనల్లో తలమానికమైన ది కైరో ట్రయాలజీ. ‘ప్యాలెస్ వాక్’, ‘ప్యాలెస్ డిసైర్’, ‘సుగర్ స్ట్రీట్’ నవలలు మొదటి ప్రపంచ యుద్ధకాలం నుండి 1952 సంవత్సరం కింగ్ ఫరూక్‌ను పదవీచ్యుతుణ్ణి చేసిన సైనిక తిరుగుబాటు వరకు కైరోలోని మూడుతరాల భిన్న కుటుంబాల జీవితాలను చిత్రించినయి.

మహఫూజ్ తమ జీవితకాలంలో యాభై వరకు నవలలు, 350 కథలు, వందలాది వ్యాసాలు, అయిదు నాటకాలు, డజన్ల కొద్ది సినిమా స్క్రిప్టులు రాశారు. అలాగే ఈజిప్టు వార్తాపత్రికల కోసం వందలాది కాలమ్స్ నిర్వహించారు. ఆయన రచనల ఆధారంగా ఈజిప్టులోనూ, ఇతర మరికొన్ని దేశాల్లోనూ చలన చిత్రాలు రూపొందినయి.

1988 లో నోబెల్ అందుకున్నారు. నోబెల్ బహుమతికి ముందు ఆయన నవలలు కొన్ని మాత్రమే విదేశీ భాషలలోకి వెళ్ళినయి. అటు తర్వాతే మహఫూజ్ రచనలకు విశ్వ గుర్తింపు, ప్రాముఖ్యత చేకూరినయి. వాస్తవానికి పురస్కారం వచ్చేవరకూ చాలా అరబ్ దేశాలు ఆయన పుస్తకాలను నిషేధించి వున్నాయి కూడా.

మహఫూజ్ రచనల్లో రాజకీయాలు అంతర్లీనమై ఉంటాయి. “నా రచనలు అన్నిటిలోనూ రాజకీయ ప్రమేయం ఉంటుంది. ప్రేమ లేదా ఇతర అంశాలు లేకుండా ఏదైనా కథ ఉండొచ్చు. కానీ రాజకీయాలు లేకుండా అసాధ్యం, అసలు ఊహించలేం” అని ఆయనే పలు సందర్భాల్లో చెప్పుకున్నారు. తన రచనల్లో ‘అడ్రిఫ్ట్ ఆన్ ది నైల్’ బాగా ప్రసిద్ధి పొందిన నవల. అలాగే ‘ది తీఫ్ అండ్ ది డాగ్స్’ బాల సాహిత్యంలో గొప్ప రచనగా ఆదరణ పొందింది. ఎందరో ఈజిప్టు రచయితలు, మేధావుల తరహాలోనే మహాఫూజ్ కూడా ఇస్లామిక్ సనాతనవాదుల హిట్లిస్టులో ఎక్కారు. ఆయనపైన దాడులు, రెండుసార్లు హత్యాయత్నాలు కూడా జరిగినయి. నజీబ్ మహఫూజ్ తన 94 వ యేట 2006 ఆగస్టు 30న కైరోలో మరణించారు. ఆయన ప్రసిద్ధ సంపుటి ‘ది టైమ్ అండ్ ది ప్లేస్’ లోని చిన్నకథ ‘హాఫ్ ఎ డే’ కు ఇది తెలుగు అనువాదం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here