సగటు మనిషి స్వగతం-2

0
9

[‘సగటు మనిషి స్వగతం’ అనే కాలమ్‍ని అందిస్తున్నాము.]

[dropcap]అ[/dropcap]న్నీ తెలిసినవాడికి బాధలేమీ వుండవు. ఏమీ తెలియనివాడికి బాధ ప్రసక్తే లేదు.  బాధలంతా తెలిసీతెలియని సగటు మనిషికే. అసలు పేరులోనే తెలిసీ తెలియనితనం వుంది. సగటు అంటేనే, అన్ని ఆంశాల మొత్తాన్ని మొత్తం అంశాల సంఖ్యతో భాగించటం. అంటే, ఎన్నటికీ ఏదీ మొత్తంగా తెలిసే వీలు లేనేలేదు. అందుకే బాధలన్నీ సగటు మనిషివే!

మొన్నామధ్య నేను మార్కెట్‌కి వెళ్ళాను. మార్కెట్లో కూరలమ్మేవాడిని ఎప్పుడూ అడిగేట్టే, “తాజావేనా?” అని అడిగాను.

వాడు వెంటనే నా చెంప ‘ఛెళ్ళు’మనిపించాడు.

శ్రీకృష్ణుడు నోరు తెరిస్తే వాళ్ళమ్మ కూడా అంత ఆశ్చర్యపోయి ఉండదు, నా కళ్ళ ముందు ఆకాశంలో నక్షత్రాలు చిక్కటి చీకటిలో మిలమిలా మెరిసినప్పుడు నేను నిర్ఘాంతపోయినంత పనైంది.

“ఎందుకు కొట్టావు?” గంభీరంగా ఆడిగాననుకున్నాను, కానీ, ఏడుపు గాంభీర్యాన్ని డామినేట్ చేసింది.

“నువ్వు ఫేస్‌బుక్‌లో నా దగ్గర కొన్న బెండకాయల్లో వచ్చిన పుచ్చు బెండకాయల ఫోటో పెట్టావు. అది నాకు నచ్చలే, అందుకని” అన్నాడు.

“నచ్చకపోతే కొడతారా?” అడిగా

“ఎంపీ అన్నమాట నచ్చకపోతే కాపలా పోలీసే ఆమెని కొట్టలేదా? నువ్వెంత, నీ సగటు మనిషి బ్రతుకెంత? ఎంపీకే దిక్కులేదు, దిక్కున్న చోట చెప్పుకో పీఎం( పిచ్చిమొహం). నువ్వు మొన్న పీఎం(ప్రధానమంత్రి) వచ్చినప్పుడు సభకెళ్ళిన విషయం చెప్పి , నువ్వు పీఎం అభిమానివి అంటే చాలు , నిన్ను కొట్టినందుకు, నిన్ను కొట్టే నా స్వేచ్ఛనెవ్వరూ హరించలేరని నన్ను సమర్ధించేవాళ్ళు గల్లీకి గల్లీకి గంగాళాలకొద్దీ పుట్టుకొస్తారు. నిన్ను కొట్టే నా స్వేచ్ఛను సమర్థిస్తారు. నాకు నీరాజనాలు పడతారు. లక్షలు లక్షలిచ్చే ఉద్యోగాలు ఇస్తారు. నిన్ను కొడితే ఎన్ని లాభాలున్నాయో చూశావా” అన్నాడు. మళ్ళీ చెయ్యెత్తాడు.

అప్పటికే జనాలు గుమిగూడటంతో పరువంటే ప్రాణాలిచ్చే సగటు మనిషిని కావటంతో, గుంపులోకి  దూరి, దెబ్బ తిన్నది నేను కానట్టు, గుంపులోకి తొంగి చూసి,  ఎవ్వరూ గమనించకుండా  అక్కడినుంచి తప్పించుకున్నాను.

అక్కడి నుంచయితే తప్పించుకున్నాను కానీ, ఇలా నచ్చని మాటన్నవాడిని ఇచ్చ వచ్చినట్టు కచ్చపచ్చా కొట్టటం తప్పు కాకపోతే ఇక నాలాంటి బలహీనులకు రక్షణ ఏముంది. అయినా రక్షణనివ్వాల్సినవాళ్ళే కొడుతుంటే, వాళ్ళ నుంచి రక్షణ నిచ్చేదెవరు? ఆ రక్షణ నివ్వల్సినవాడి నుంచి రక్షణ ఇవ్వాల్సిన వాడికే సగటు మనిషి మీద కోపం వస్తే, ఆ రక్షణనివ్వాల్సిన వాడి నుంచి రక్షణానిచ్చేవాడి నుంచి ఎవరు రక్షిస్తారు?

ఇదిగో అసలు సగటు మనిషికి ఇలాంటి ఆలోచనలెందుకొస్తాయో అర్థం కాదు. సగటు మనిషంటే అన్నిటికీ సగటు కదా, మరి నాకొచ్చిన ఆలోచనలు, భయాలలో, ఆ కొట్టినవారిని సమర్థించేవారికి వందో వంతయినా ఆలోచనలెందుకు రావు? పైగా, వాళ్ళంతా మేధావులు. నేనా సగటు మనిషిని.. యావరేజ్ హ్యూమన్ బీయింగ్!

ఇప్పుడీ గోలంతా ఎందుకొచ్చిందంటే, రాజకీయాలు తెలియని నేను నోర్మూసుకుని ఎవరేది చెప్తే దాన్ని విని మౌనంగా వుండవచ్చు కదా, అలా వుండక మొన్నామధ్య మేధావుల చర్చల్లో జోక్యం చేసుకున్నాను. “ఒక ముఖ్యమంత్రి జైలు లోంచి రాష్ట్రం నడపడమేమిటి? ఆయన తప్పించి ఆ పార్టీలో అర్హులు ఎవరూ లేరా? ఎన్నేళ్ళయినా జైల్లోంచి ఆయనే రాజ్యం నడపాలా” అన్నాను.  “ఇన్నిరోజులు ఆయన జైల్లో వుంటే, బయట నీళ్ళు లేక ప్రజలు అల్లల్లాడిపోతున్నా, నీళ్ళెక్కువయి అన్నీ మునిగిపోతున్నా ఎవరిదో బాధ్యత, ఎవరు జవాబుదారీ అన్నది తెలియక అయోమయంలొ అందరూ వున్నా, జైల్లో వున్నా నేనే ముఖ్యమంత్రి అంటే అందరూ ఎలా వూరుకుంటున్నారు?” అనడిగాను.    అంతటితో ఆగిపోతే బాగుండేది. నేనాగలేక, – “ఇప్పుడు చూడండి, ఒక గవర్నమెంటు ఉద్యోగి ఏదో కారణం చేత ఒక నెల రోజులు అనారోగ్యమని ఆఫీసుకెళ్ళలేదనుకోండి, అప్పుడా ఆఫీసువాళ్ళేం చేస్తారు, ఒరే, నువ్వుట్టిగా ఇంట్లో కూచుని జీతం తీసుకుంటే, దేశానికెంత నష్టం, అని జీతం కట్ చేస్తారు. తరువాత పనిష్మెంట్ ఇస్తామని  బెదిరించి మెడలు  వంచి పని చేయిస్తారు. అందుకే ఒకోసారి నాకు ఉద్యోగాలు, ప్రభుత్వమైనా, ప్రైవేట్ అయినా, కూలీ ఉద్యోగాలే, బానిస బ్రతుకులే అనిపిస్తాయి.” అన్నాను.

మనదీ ఒక బ్రతుకేనా, కుక్కల వలె, నక్కల వలె, సందులలో పందుల వలే అన్న కవికి కుక్కలు, నక్కలు, పందులు మనకన్నా ఎంత గొప్పవో తెలియదు. ఎందుకంటే, ఆయన గొప్ప కవి, సగటు మనిషి కాదు కదా! తెలిస్తే మన బ్రతుకును రాయల్, ఫ్రీ, మెజెస్టిక్ జీవితాలయిన కుక్కలు, నక్కలు, పందుల జీవితాలతో ఎందుకు పోలుస్తాడు?

ఒక కుక్కకున్న స్వేచ్ఛ ఉద్యోగికి లేదు. ఇష్టమొచ్చినప్పుడు నిద్రపోతుంది. నచ్చనివారిని చూస్తే అరుస్తుంది. మరీ నచ్చకపోతే కరుస్తుంది. ఒక సగటు ఉద్యోగి   అలా చేయగలడా? పనిచేయనివాడితో పనిచేయించకుండా పనిచేసే సగటు ఉద్యోగినే ఎందుకు వేధిస్తారని అడగగలడా?  నచ్చనిదాన్ని నచ్చలేదనగలడా? బాస్ ముందు నిలబడి మాట్లాడటం  అటుంచి   బాస్‍కు చెంచాగాడినెవడినయినా ఏమైనా అని మనగలడా? బాస్ కన్నా బాస్కు  చెంచాగాడు ఎక్కువెక్కువెక్కువ  శక్తి మంతుడు. బాస్ మెదడుపై పట్టు సాధించి, ఆ శక్తితో ఇతరులందరినీ సాధిస్తాడు. వాడిముందు సగటుమనిషి నిలబడగలడా? అందుకే, సగటుమనిషికన్నా పందులు, కుక్కలు, నక్కలే గొప్పవి.  అందుకే సగటు  మనిషిని చూడగానే గాండ్రించే పులయిపోతారందరూ. హిరణ్యకశిపుడిని చీల్చే ఉగ్ర నరసింహులయిపోతారు. ఆస్ట్రేలియా బౌలర్లను చూడగానే వెర్రెక్కి పిచ్చిపట్టినట్టు చితకబాదే రోహిత్ శర్మలు అయిపోతారు.  పేదవాడికోపం పెదవికి చేటు. సగటుమనిషి పంతం, సగానికి కాదు, మొత్తానికే వేటు.

ఒక పందికున్న స్వేచ్ఛ స్వతంత్రాలు సగటు  ఉద్యోగికి లేవు. పంది నచ్చితే బురదలో పొర్లాడుతుంది. పెంట తింటుంది. దానిష్టమొచ్చినట్టు తిరుగుతుంది. బురదలో పొర్లాడుతున్నావు పందీ ‘ఛ్హీ’ అంటే, ‘ఫోరా’ అన్నట్టు చూసి కసిగా ఇంకా బురదలోనే పొర్లాడుతూ ” ఎం చేస్తావో చేసుకో” అంటుంది.  సగటు మనిషి అలా చేయగలడా? అమ్మో ఎవరేమనుకుంటారో అని భయపడుతూ, ముడుచుకు కూర్చుంటాడు. నచ్చిన ఒక వంటకం రెండొసారి అడిగితే ఏం అనుకుంటారో అని నోరు కట్టుకుంటాడు. ఎవరేమంటారో, అనుకుంటూ అన్నిటితో రాజీపడుతూ, బయటబ్రతుకుతూ, లోపల చస్తూంటాడు.

ఒక పిల్లికున్న ఆత్మాభిమానం, ఆత్మగౌరవాలు సగటు ఉద్యోగికి వుండకూడదు. పిల్లి ఎవ్వరి మాటా వినదు. నచ్చకపోతే ఎన్నేళ్ళు ఎంత ప్రేమగా పెంచుకున్నవాడినయినా ‘పోరా’ అని పంజా విసిరిపోతుంది. మరీ బలవంతపెడితే గీరుతుంది. చీరుతుంది. వాడుపెట్టేది అన్నమో, ఇచ్చేది  పాలు మాత్రమే  కదా, వీడివ్వకపోతే ఎవడింట్లోంచయినా దొంగతనం చేసి బ్రతకగలనన్న   ధీమా పిల్లిది.

ఒక సగటు ఉద్యోగిని అలా ప్రవర్తించమనండి. ఉద్యోగం వదలాలన్న ఆలోచన వస్తే, ప్రాణం పదిసార్లు పోతుంది. ఊపిరయినా వదలచ్చుకానీ, ఉద్యోగమ్ వదలటమన్న ఆలోచనే రాదు.  ఒక్క నెల జీతంలో ఒక్క పైస తక్కువొస్తే ప్రాణాలు పోయినదానికన్నా ఘోరంగా బాధపడతాడు. ఏడుస్తాడు. డిప్రెస్ అయిపోతాడు. ఇంత చదువుకునీ ఎందుకూ పనికిరానివాడిలా నాలుగు పచ్చకాగితాలకు జీవితాన్ని అమ్ముకున్నానని ఏడవడు,  కానీ, ఒక్క రూపాయిపోతే గుండెలదిరి,  ఆగేలా ఏడుస్తాడు.   కుక్కను, పందిని, పిల్లిని చూసి జాలిపడేవారుంటారు,  కానీ, సగటు ఉద్యోగిని సానుభూతిగా చూసేవారే వుండరు. తోటి ఉద్యోగులూ చూడరు. పట్టించుకోరు. బంధాలన్నీ, గృహద్వారబంధం వరకే అన్నట్టు ప్రవర్తిస్తారు. (అందుకే, ఈ జన్మ ఇక సగటుమనిషి జన్మనే, కనీసం వచ్చే జన్మలో నయినా కుక్కగానో, పందిగానో, పిల్లిగానో పుట్టించమని దేవుడిని ప్రార్ధిస్తే, ఆ దేవుడు “నేనేం చేయలేను, కుక్కదేవుడు, పందిదేవుడు, పిల్లిదేవుడు తమలాగా పుట్టాలంటే,గొప్పవారూ, పెద్దవారు, మేధావులు కావాలి తప్ప సగటుమనిషి అవసరంలేదంటున్నారు. నీకు వచ్చే పది జన్మలూ సగటుమనిషి జన్మలే.  అయామ్ హెల్ప్‍లెస్స్” అని నిస్సహాయత వ్యక్తం చేశాడు. అదేమిటో, సగటుమనిషి దగ్గరకు వచ్చేసరికి దేవుడు కూడా  హెల్ప్‍లెస్సే, లెస్సుహెల్పే!!! )

మరి, ఏదో, చిన్న ఉద్యోగం చేసే సగటు ఉద్యోగికి ఇన్ని నియమాలయితే,  ఒక రాష్ట్ర భవిష్యత్తును, దేశ భవిష్యత్తునూ నిర్ణయించేవారికెన్ని డిసిప్లినరీ రూల్స్ వుండాలి? నేను జైల్లో వున్నా మంత్రినే అంటే ఎలా వూరుకుంటున్నారు? ఆ ముఖ్యమంత్రి జీతం కోసి, జైల్లో వున్నవుగా, నీకు భవనమెందుకు అని ముఖ్యమంత్రి భవనం ఖాళీ చేయించవచ్చుకదా!  సగటు మనిషికయితే నెల రోజులు రాలేదని ట్రావెలింగ్ అలవెన్స్ కోసి పారేస్తారు.  ఇంతకీ, జైల్లో వుండి ఏ నిర్ణయం తీసుకునే అర్హతలేనివాడు ముఖ్యమంత్రిగా కొనసాగితే లేని నష్టం ఒక సగటు ఉద్యోగి వారం రోజులు ఆఫీసుకు రాకపోతే కలుగుతుందా? ఇలా వాదించినందుకు నన్ను దేశద్రోహిని చూసినట్టు చూశారు మేధావులంతా. ముఖ్యమంత్రికీ నీకూ పోలికేమిటి? అని తిట్టారు. హేళన చేశారు. నాకీ మేధావులలో ఇదే నచ్చదు. నేను పందితో పోల్చుకున్నప్పుడు పట్టించుకోనివారు, ముఖ్యమంత్రితో పోల్చుకుంటే కోపగించుకుంటారు. ఇది న్యాయమా, మీరే చెప్పండి?

న్యాయమంటే, గుర్తుకొచ్చింది. ఈ మధ్య దేశంలో పిరికివారు ఎక్కువయిపోయారనిపిస్తున్నది. ఇంతకు ముందు, బహిరంగంగా ఏడవటం సిగ్గుచేటు అనేవారు. ఎంత ఏడుపొచ్చినా, గుడ్లనీరు కుక్కుకుని, పైకి నవ్వుతూ వుండటం ధీరోదాత్తత, హీరోయిజం అనేవారు. కానీ, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏడ్చేస్తున్నరు. టీవీల్లో పోటీల్లో  ఓడినవారు ఎట్లాగో ఏడుస్తారు, గెలిచినవారూ  ఏడుస్తున్నారు. గెలిచినవారి అమ్మలూ, అయ్యలూ, అక్కలూ, పక్కింటివారూ, ఎదురింటి, పొరుగింటి వారూ ఒకరేమిటి, జడ్జిలూ, కెమేరామెన్నులూ అంతా కన్నులు తడిచేసుకుంటున్నారు. ఆటగాళ్ళయితే, చెత్తగా ఆడి ఓడిపోతే కూడా కన్నీళ్ళు పెట్టేసుకుంటున్నారు. ఏమిటో, ఇంతమంది కళ్ళల్లో ఇన్నిన్ని నీళ్ళు ఇంతింతగా చిప్పిల్లుతూంటే, నీళ్ళు లేవని దేశాలు అల్లల్లాడిపోతున్నాయి.  దేశంలో డ్రై ఐస్ గాళ్ళ సంఖ్య పెరిగిపోతోందని డాక్టర్లు గోల పెడుతూ, ఖరీదైన ఐ డ్రాప్స్ రాసి సంబరాలు చేసుకుంటూ కన్నీళ్ళు కారుస్తున్నారు. ఈ క్రికెట్లు, సినిమాలు, సీరియల్సూ చూస్తూ సగటు మనుషులు డ్రై ఐస్ రోగం తెచ్చుకుంటూంటే, ఈ ఆటగాళ్ళు, సినిమావాళ్ళూ, సీరియళ్ళవాళ్ళూ  డబ్బులు చేసుకుంటూ,  గెలుస్తూ, ఓడుతూ,కళ్ళుతుడుచుకుంటూ, పచ్చగా, తడిగా, వెచ్చగా సంబరాలు చేసుకుంటూన్నారనిపిస్తుంది. ఇది అన్యాయం కాదా?

ఈ అన్యాయాన్ని సరిచేద్దామని ఏడవాలనుకుంటే, సగటు మనిషికి ఏడుపు రావటం లేదు. పుట్టినప్పటి నుంచీ, ఇప్పటివరకూ ఏడ్చిన ఏడ్పుల ఫలితమేమో, కళ్ళు ఎడారుల్లా ఎండిపోయాయి. గంటగంటకీ డ్రాప్స్ వేసుకోమన్నాడు డాక్టరు. సగటు మనిషి బాధలు ఎన్నని చెప్పాలి? ఎన్నో చెప్పాలని వుంది కానీ, “గొప్ప మేధావిలా సమాజాన్ని ఉధ్ధరించేట్టు ఏం రాస్తున్నారు? సమయాన్ని వ్యర్థం చేయకండి. నేను బయటకెళ్తున్నాను, స్టవ్ మీద కూర వుంది, కలుపుతూండండి, ఇంకో స్టవ్ మీద బియ్యం పెట్టాను, మూడు విజిల్స్ రాగానే స్టవ్ ఆర్పేయండి, మోటార్ వేశాను, టాంక్ నిండగానే ఆర్పేయండి, మళ్ళీ నీళ్ళు నిండితే పొర్లిపోతాయి, ముందే నీళ్ళకు కటకట అంటున్నారు” అంటూ  ప్రధాన, ముఖ్య, హోమ్ మంత్రి ఆదేశాలు వినిపించాయి.  నా కళ్ళలోనే కాదు, భూదేవి కళ్ళలోనూ నీళ్ళు ఇంకిపోయినట్టున్నాయి. సరే, నా స్వగతం వింటూ, నవ్వీ నవ్వీ , కన్నీళ్ళన్నీ వచ్చేసి, మీ కళ్ళల్లోనూ నీళ్ళు ఇంకేలోగా నేను సెలవు తీసుకుంటాను (చూశారా, సగటు మనిషి ఎప్పుడూ భ్రమల్లోనే బ్రతుకుతాడు. మిమ్మల్ని నవ్విస్తున్నాననుకోకపోతే నా స్వగతం వినిపించలేను. అందుకే మీరు నవ్వుతున్నారనే అనుకుంటాను. మీరు కాదన్నా నమ్మను).  మళ్ళీ వచ్చే నెల వరకూ ఒక్కచుక్క కన్నీరు కూడా కార్చకుండా  రడీగా వుండండి. నవ్వుతూ కన్నీళ్ళు కార్చాలిగా మరి!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here