సగటు మనిషి స్వగతం-3

1
10

[‘సగటు మనిషి స్వగతం’ అనే కాలమ్‍ని అందిస్తున్నాము.]

[dropcap]స[/dropcap]గటు మనిషికి కోపం అస్సలు రాదు. పేదవాని కోపం వాడికే నష్టదాయకం అని సగటు మనిషికి బాగా తెలుసు. అందుకే ఎంతగా కోపం వచ్చే విషయమైనా కోపాన్ని దిగమింగి నవ్వుకోవాలని ప్రయత్నిస్తాడు. మన దేశంలో జరుగుతున్నన్ని చిత్రవిచిత్రాలు ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగవు.  తర్కశాస్త్రానికి తర్కం నేర్పిన మనదేశంలో తర్కం అన్నపదం అర్థం లేనిదయిపోతోంది. ఎంత కుతర్కంగా మాట్లాడితే అంత మేధావి, అంత తెలివయినవాడని పేరుపోందటం మన దేశంలోనే కనిపిస్తున్నది.

ఆ మధ్య పెద్ద వర్షాలు వరుసగా వారం రోజులు పడ్డాయి. సగటు మనిషికి తనపనికి అడ్డు రానంతవరకూ, తనకు కష్టం కలగనంతవరకూ వర్షం అంటే ఇష్టమే. వర్షం పడే సమయానికి అఫీసునుంచి ఇల్లు చేరుకుని వేడి వేడి కాఫీ తాగుతూ, వర్షాన్ని చూస్తూంటే అప్పుడు వర్షం ఇష్టం. ప్రొద్దున్నే వాకింగ్ వెళ్ళే సమయానికి వర్షం పడుతూంటే, వాకింగ్ మాని వర్షాన్ని చూడటాన్ని మించి స్వర్గం ఎక్కడో లేదు. కానీ, అప్పుడప్పుడు వర్షం  వికృతరూపం అనుభవించాల్సివచ్చినప్పుడు మాత్రం వర్షం అంటే చిరాకు.

ఆ రోజు దారిలో నిండా నీళ్ళునిండాయి. ఎక్కడ గుంత వుందో ఎక్కడ ఏముందో తెలియదు. నీళ్ళు రోడ్డు ఈ వైపునుంచి ఆ వైపుకు ఎంత వేగంగా వెళ్తున్నాయంటే పెద్ద పెద్ద బళ్ళుకూడా ఆ నీటి ప్రవాహవేగానికి గతి తప్పుతున్నాయి. అలాంటి రోడ్లో వెళ్ళాల్సివచ్చింది. ముందే సగటు మనిషికి అవసరమయినప్పుడు తప్ప మిగతా సమయాల్లో ధైర్యం బాగానే వుంటుంది. ఆ రోడ్డులో వెళ్ళకూడదనుకున్నా మరో దారిలేక తప్పనిసరిగా భగవంతుడిని ప్రార్థిస్తూ ఆ నీళ్ళల్లో మునిగిన చెరువులాంటి రోడ్డులో అడుగుపెట్టాడు సగటు మనిషి. ఎంత చిన్న వాహనం ఎంత నెమ్మదిగా వెళ్ళినా నీళ్ళు అలల్లా ఎగసిపడి రోడ్ డివైడర్‌ను తాకి తీరాన్ని తాకిన అలలు వేగంగా సముద్రంలోకి ఉరికినట్టు వెనక్కి వస్తున్నాయి. ఈలోగా ఏ బస్సో లారీనో వెళ్తే, ఎగసి పడే అలలు, తిరిగి వచ్చే అలలు ఢీకొని వైజ్ఞానిక పరిభాషలో చెప్పాలంటే, constructive interference, సంభవించి మరింత ఎగసెగసిపడుతున్నాయి. సముద్రపు అలల్లో వున్న అందం ఆనందం తాత్కాలికంగా రోడ్డు పై వెలసిన ఈ రాక్షసపుటలలావళుల్లో లేదు.

అయినా సరే తప్పనిసరి పరిస్థితుల్లో నడుస్తూ, భగవంతుడిని ప్రార్థిస్తున్న సగటు మనిషి భయపడినట్టే అయింది. ఎదురుగా బండిని తోస్తూ నడుస్తున్న ఓ అమ్మాయి నీళ్ళ ఉధృతి తట్టుకోలేక బండితో సహా నీళ్ళలో పడిపోయింది. ఆమెకు సహాయం చేసేవారు ఆమెని చేరేలోగా ఓ పెద్ద లారీ నెమ్మదిగా వెళ్ళినా పెద్ద పెద్ద అలల కల్లోలాన్ని సృష్టించింది. సహాయం కోసం వెళ్ళినవారికే సహాయం అవసరం అయింది. ఇదంతా చూసి సగటు మనిషి బెదురుతూనే వున్నాడు. ఇంతలో ఓ పెద్ద ట్రాలీ, నిండా సరికొత్త తళతళలాడే బైకులతో  ఆ నీళ్ళల్లో అడుగుపెట్టింది. ఇంకేం వుంది, రోడ్డు కల్లోలిత అల్లకల్లోల అలల సముద్రమయిపోయింది. అందరితోపాటూ సగటు మనిషి కూడా ఆ సముద్రంలో మునిగిపోయాడు. కళ్ళల్లో, ముక్కుల్లో ఆ బురదనీరు ఎంతో ఆప్యాయంగా, ఆత్రంగా నిండింది. ఉక్కిరిబిక్కిరయి నరకానికి నాలుగడుగులు, స్వర్గానికి సౌ అడుగుల దూరంలో వున్న సగటు మనిషిని ఎవరో ముక్కొమొహం తెలియని పుణ్యాత్ముడు ఈ లోకానికి లాక్కొచ్చాడు. అందరూ ఆ ట్రాలీ వాడిని తిట్టారు.  ట్రాలీవాడూ తక్కువ తినలేదు. వాడెంత తక్కువ స్పీడులో వున్నాడో, ఇంకా తగ్గితే నడపటం ఎంత కష్టమవుతుందో చెప్పుకొచ్చాడు. అదంతా వింటూంటే సగటు మనిషికి ఒంటె వీపు పైని గడ్డిపోచ గుర్తుకువచ్చింది. రోడ్డులోఅన్ని నీళ్ళుంటే, ఆ నీళ్ళపై ఈగ వాలినా, దోమ వాలినా అలలు జలజలలాడతాయి. మరి అంత పెద్ద ట్రక్కు నడిస్తే అలలు పెల్లుబకటంలో ఆశ్చర్యం లేదు. మరి దోషం ఎవరిది?

ఇదంతా ఇప్పుడు ఎందుకు గుర్తుకువచ్చిందంటే, ఢిల్లీలో, రోడ్డు పై ఓ పెద్ద కారువెళ్ళినందుకు రోడ్డు పై నిండిన నీళ్ళు దగ్గరలోని భవంతి గేటును ఎంత బలంగా తాకేయంటే, ఆ గేటు విరిగి భవంతి బేస్‌మెంట్‌లో నీళ్ళు నిండి, అక్కడ లైబ్రరీలో చదువుకుంటున్న ముగ్గురు పిల్లలు మరణించటంతో, ఈ ఉదంతం అంతటికీ అక్కడ రోడ్డుపైనుండి వెళ్ళిన కారు కారణం అని పోలీసుకు ఆ కారు డ్రైవరును అరెస్టు చేశారన్న వార్త వల్ల.

అసలు రోడ్లున్నదే వాహనాలు వెళ్ళేందుకు. రోడ్డుపై నీళ్ళు నిండుగా వుంటే ఆ రోడ్డుపైనుంచి వాహనం నడపటం నేరం అని భారత నేర చట్టాలలో ఎక్కడా వున్నట్టు లేదు. అలాంటి రోడ్డుపై కారు నడపటాన్ని ఇంతవరకూ ఎవ్వరూ, ఎక్కడా నిషేధించినట్టు లేదు. అంతెందుకు, మనుషులు నడవటానికి నిర్మించిన ఫుట్‌పాత్ పైన నిద్రిస్తున్న వారి మీద నుంచి కారు నడిపినవాడిది తప్పుకాదు, నడవటానికున్న ఫుట్‌పాత్ పైన పడుకున్నవారిది తప్పని ఆ మధ్య అన్నారు కదా! అంటే, వీలున్న చోటల్లా కారు నడపవచ్చని కదా అర్థం. మరి ఇప్పుడు నీళ్ళు నిండిన రోడ్డు పైనుండి కారు నడిపినందుకు డ్రైవర్‌ను అరెస్టు చేయటంలో అర్థం ఏమైనా వుందా?

రోడ్డుపైన నీళ్ళున్నాయి కాబట్టి కారు నడవటంవల్ల నీళ్ళు గేటును విరగగొట్టాయి. రోడ్దు మీద నీళ్ళు లేకపోతే అలలు వచ్చేవే కావు. అలలు రాకపోతే గేటు విరిగేది కాదు. గేటు విరగకపోతే, నీళ్ళు బేస్‌మేంట్ లోకి వెళ్ళేవి కాదు. నీళ్ళు బేస్‌మెంట్ లోకి వెళ్ళకపోతే, లైబ్రరీలో పిల్లలు మరణించేవారు కారు. కాబట్టి, రోడ్డు మీద నీళ్ళు నిండటం వల్ల ఇదంతా సంభవించింది. అందుకని దోషం నీళ్ళది. అయినా నీళ్ళు పల్లంలోకి పోవాలి కానీ, రోడ్లపైన అలా నిలచిపోవటం ఏమిటి? కలికాలం కాకపోతే నీళ్ళు ప్రవహించి వెళ్ళిపోవాలి కానీ, అలా పెద్ద పెద్ద వాహనాలు వచ్చేదాకా ఆగి, అవి రాగానే దిక్కున్నచోటికి ప్రవహిస్తూ, తాను మనుషులను చంపి, వాహనాలకు చెడ్డ పేరు తేవటం ఏమిటి?

అయినా భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు జరుగుతాయని అందరూ చెప్తూంటే, ఒక్కో నీటిబొట్టునూ కాపాడాలని సగటుమనిషి తీవ్రంగా ప్రయత్నిస్తూంటే, నదీ నీళ్ళు వ్యర్ధంగా సముద్రంలో కలుస్తున్నాయని పెద్ద పెద్ద డ్యాములు నిర్మిస్తూంటే, ఇలా రోడ్లపై నిలచిపోయి అందరికీ ఇబ్బంది కలిగించే ఈ నీటిని వ్యర్థం కాకుండా ఏమీ చేయలేరా?

అయినా, అసలు రోడ్లపై నీళ్ళెందుకు నిలవాలి? ఈ నీళ్ళు భూమిలోకి ఇంకిపోయేట్టు పల్లాలల్లో ఇంకుడు గుంతలు నిర్మించవచ్చుకదా?

అయినా ఇలాంటి ఆలోచనలు అధికారం వున్నవారికెందుకు రావు? సగటు మనిషికే ఎందుకు వస్తాయి?

అధికారం వున్న వారేమో, లైబ్రరీలో చదువుతున్న విద్యార్ధులది తప్పు, బేస్‌మెంట్‌లో లైబ్రరీ పెట్టినవాళ్ళది తప్పు, రోడ్డు మీద పోయిన కారుది తప్పు, రోడ్డు మీద నిండిన నీటిది తప్పు, అంతగా కురిసిన వర్షానిది తప్పు అని తర్క రహితంగా ఆరోపణలు చేస్తూ, తర్కాన్ని హింసించి చంపుతున్నారు. మేధావులింకో అడుగు ముందుకు వేసి, ఇదంతా గ్లోబల్ వార్మింగ్ అంటూ, ఎల్‌‌నినో, ఎల్‌నానో అంటూ సగటు మనిషికి అర్థం కాని విషయాలేమేమో చెప్తున్నారు.

అందుకే అప్పుడప్పుడు సగటు మనిషికి సగటు మనిషి అవటం కన్నా పెద్ద శాపం లేదనిపిస్తుంది. మీరే చెప్పండి, ఇతరులకన్నా చక్కటి ఆలోచనలుండి కూడా, ఏమీ చేయలేకపోవటాన్ని మించిన శాపం ఇంకేమైనా వుందా? ఆలోచనలు లేనివారు అధికారంలో వుండి నిర్ణయాలు తీసేసుకుంటూంటే, అవి తప్పని తెలిసి కూడా తలవంచి పాటించవలసి రావటాన్ని మించిన దౌర్భాగ్యం ఇంకోటి వుందా?

ఇది రాస్తూంటేనే వర్షానికి నీటితో నిండిన ఇంటి ఎదురుగా వున్న రోడ్డులో నీటిలో నిండి కనబడని స్పీడ్ బ్రేకర్ తగిలి ఒక బండి ఎగిరి పడింది. అదెవరో చూసి సహాయం చేయటానికి పోతున్నాను. ఎందుకయినా మంచిదని నా నడుముకు తాడు కట్టుకుని, తాడు ఒక కొనను ఇంటి స్తంభానికి కట్టి మరీ పోతున్నాను. వచ్చిన తరువాత అక్కడ ఏమయిందో రాస్తాను. అంతవరకూ ఇక్కడే ఎదురుచూస్తూండండి సగటు మనిషి స్వగతం కోసం!!!!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here