సగటు మనిషి స్వగతం-6

0
70

[‘సగటు మనిషి స్వగతం’ అనే కాలమ్‍ని అందిస్తున్నాము.]

సగటు మనిషికి తన చుట్టూ వున్న ప్రపంచాన్ని చూస్తూంటే గమ్మత్తుగా అనిపిస్తున్నది. పెద్దలు, మేధావులు, తెలివైనవారు, మన భాగ్యవిధాతలు అనుకున్నవారి ప్రవర్తన చూస్తూంటే చిన్నప్పటినుంచీ సగటు మనిషి విలువలు అని పట్టుకుని వ్రేలాడుతున్నవన్నీ పనికిరానివనిపిస్తున్నది. బహుశా, అలాగ విలువలు అన్నవాటిని పట్టుకుని వ్రేలాడటం వల్లనే సగటు మనిషి సగటు మనిషిగానే మిగిలి ఉన్నాడన్న నమ్మకం కలుగుతున్నది.

లేకపోతే, చూడండి.. సగటు మనిషికి చిన్నప్పటి నుంచీ పెద్దలను గౌరవించవలెను అని నేర్పించారు. కానీ, ఇప్పుడు పెద్దలను గౌరవించటం ఓల్డ్ ఫేషన్ అయింది. పెద్దలను ఎంతగా అగౌరవపరిస్తే అంత గొప్పవాడు.

విద్యార్థి అనేవాడు బుద్ధిగా వుండవలెను. దృష్టి చదువుమీదే వుండాలి. ఉపాధ్యాయులను, అధ్యాపకులను గౌరవించవలెను.

కానీ, ఇప్పుడు విద్యార్థి అన్నవాడు ప్రేమార్థి కావలెను. కాలేజీలో.. కాదు కాదు, స్కూల్ స్థాయి నుంచే ప్రేమ వ్యవహారాలుండవలెను. సిగరెట్లు, మద్యములు త్రాగవలెను. తాగిన మత్తులో పెద్దలను, తల్లితండ్రులను బూతులు తిట్టవలెను. ప్రేమించిన అమ్మాయిని వస్తువులా చూడవలెను. ఆమెను లైంగిక వస్తువులా చూసి ఆడుకోవలెను. అమ్మాయిని ఆటవస్తువులా, ఆట బొమ్మలా భావించవలెను.

ఎవరయినా మరణిస్తే ‘అయ్యో పాపం’ అనుట మహా పాపం. ‘చనిపోయిన వాడి కళ్ళు చారెడేసి’ అన్నది పాత సామెత. చనిపోయిన వాడిని గౌరవించటం ఘోరం. ఎవరయినా చనిపోయిన వార్త వస్తే, వాడు మనవాడు కాకపోతే,  ప్రళయకాల సంకలిత భయంకర జలధరార్భుటుల చలిత దిక్కుటుల జటిత దిక్కురుల వికృత ఘీంకృతుల సహస్ర ఫణ సంచలిత భూకృతుల నాట్యం చేస్తూ, ఆ చనిపోయినవాడి దోషాలెన్నుతూ, చీల్చి చెండాడుతూ,  వికృత, అసహ్య, దుస్సహ కరాళ, కర్కశ, అమానుష, రాక్షస భీకర, భయంకర, పశుతుల్య నృత్యం చేయాలి. అదే, తమకు నచ్చినవాడు పోతే, వాడిని ఎవరయినా ఏమైనా అంటే, ఇది ఘోరం, ఇది నేరం, ఇది అనౌచిత్యం, ఇది అమానుషం అని వాపోవాలి. ఎవరినయినా తిట్టే హక్కు, పొగిడే హక్కు తమకే వుందన్నట్టు ప్రవర్తించాలి.

జీవితాంతం ఒకరినే ప్రేమిస్తూ, గౌరవిస్తూ, వారితోనే జీవితం గడపవలెను అన్నది పురాతన సనాతనం. వీరు కాకపోతే వారు, వారు కాకపోతే ఇంకెవరు దొరికితే వారు అన్నట్టుండవలెను. పెళ్ళి అన్నది పాత చింతకాయ పచ్చడిలో చింతపండు లాంటిది. దాని అవసరంలేదు. కాబట్టి, ఎవరు నచ్చితే వారితో నచ్చినంతకాలం కలసి వుండవలెను. దానికి లివ్ ఇన్ రిలేషన్‌షిప్ అని బరువూ బాధ్యతలు లేకుండా ఆనందించే బ్రతుకు బంధం అనెదరు. పెళ్ళి బంధం బ్రతుకు. ఇది బాంధవ్యరాహిత్యమైన బ్రతుకు.

కుక్కలు, పిల్లులు, బల్లులు, నక్కలు ఎంత స్వేచ్ఛగా వుంటాయో మనిషి కూడా అంతే స్వేచ్ఛగా వుండాలి. మనిషి పశువులా బ్రతకాలి. మొదటినుంచీ మనిషి పశువులు, జంతువులనే ఆదర్శంగా తీసుకున్నాడు కదా! కోకిల కంఠం, సింహం బలం, ఏనుగు నడక, సింహమధ్యం, హంస చలనం, కోతి చేష్టలు, తాబేలు నడక, కుందేలు పరుగు, లేడి కళ్ళు, కుక్క విశ్వాసం, త్రాచు ఆగ్రహం, డేగ చూపు, గుడ్లగూబ దృష్టి ఇలా, ఒకటా? రెండా? ఎన్నెన్ని పశువులు, పక్షులు వున్నాయో అన్నన్ని పశువుల  ఉత్తమ లక్షణాలు మనిషికి కూడా వుండాలని, వున్నవారిని ఆయా పశువులు పక్షులతో పోలుస్తారు కదా! చివరికి భగవంతుడు కూడా జంతువులలో సింహాన్ని నేను అన్నాడు. కాబట్టి,  అన్ని విషయాలలో పశువులను ఆదర్శంగా తీసుకుని  అనుకరించిన మనిషి వైవాహిక వ్యవస్థలో మాత్రం ఎందుకని వాటిలా వుండకూడదు. అలాంటి ఆలోచనే వివాహ వ్యవస్థను నిరాకరించే బంధం, బాధ్యతల్లేకుండా ఉన్నవారిని విడిచి నచ్చినవారితో వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొకరు నచ్చితే వారితోనూ వెళ్ళిపోగల వెసులుబాటు ఇచ్చే అత్యద్భుతము, అత్యంత నాగరీకమైన అనాగరీక విచ్ఛిన్నకర వ్యవస్థ వైపు మొగ్గు చూపేట్టు చేస్తున్నట్టుంది.

కానీ ప్రస్తుతం సమాజంలో వీరినే మేధావులు, మోడర్న్, అభివృద్ధి చెందినవారు, ఆధునికులు, లిబరల్స్ ఇలా పలు పేర్లతో పిలుస్తున్నారు. విలువలను పట్టుకు వ్రేలాడుతూ, ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే పత్ని అనేవారు సగటు మనుషులుగా మిగిలిపోతున్నారు.

ఇదీ సగటు మనిషిని బాధిస్తున్న అంశం. పోనీ, వారిలాగా అవుదామా, సగటు మనిషి అనే పేరు సర్ప పరిష్వంగాన్ని వదిలించుకుని, కుక్కలా, నక్కలా, పందిలా మారి బురదలో పొర్లుదామంటే, మనస్సాక్షి, మర్యాద, గౌరవం, విశ్వాసం లాంటివి సగటు మనిషిని ముందుకు కదలనివ్వటంలేదు. కుక్కల్లా పురుగుల్లా పదేళ్ళు బ్రతకటం కంటే, మనిషిలా అదే సగటు మనిషిలా వందేళ్ళు బ్రతకటం మేలనినిపిస్తోంది. ఏం చేయమంటారు చెప్పండి.

వచ్చే నెల వరకూ మీకు అలోచించి పరిష్కారం సూచించే సమయం వుంది.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here