[‘సగటు మనిషి స్వగతం’ అనే కాలమ్‍ని అందిస్తున్నాము.]
[dropcap]స[/dropcap]గటు మనిషికి ఈ మధ్య ఒక గొప్ప జ్ఞానం కలిగింది. ఈ జ్ఞానంతో వచ్చిన చిక్కు ఏమిటంటే, జ్ఞానం తెలిసే సమయానికి జరగాల్సినవన్నీ జరిగిపోతాయి. కలిగిన జ్ఞానం వల్ల ఉపయోగమేమీ వుండదు. పోనీ ఎవరికయినా చెప్పి వారిని ఉద్ధరించాలని ప్రయనిస్తే, ఈ జ్ఞానాన్ని అందుకునే జ్ఞానం వారికి వుండదు కాబట్టి, వారి వినరు. పట్టించుకోరు. పైగా, ఎగతాళి చేస్తారు. అయినా సరే, ఎవరు విన్నా వినకున్నా, పట్టించుకోకున్నా, ఎంతెంత ఎగతాళి చేసినా సరే తన జ్ఞానాన్ని పదిమందితో పంచుకోవాలని నిశ్చయించుకున్నాడు సగటు మనిషి.
తను గ్రహించిన మహా జ్ఞానం ఏమిటంటే, పుట్టినప్పటి నుంచీ మనకు చదివి ఉద్యోగం తెచ్చుకోరా అని చెప్తూనే వుంటారు. మంచిగా చదివితే మంచి ఉద్యోగం వస్తుంది అని నచ్చచెప్తారు. మంచి ఉద్యోగం వస్తే బోలెడన్ని డబ్బులు వస్తాయి. బోలెడన్ని డబ్బులుంటే, కార్లూ, బంగళాలూ, ఫైవ్ స్టార్ హోటెళ్ళూ.. అబ్బో ఇక లెక్కలేదు, సుఖసౌఖ్యాలకంటారు.
చదువు రావటం లేదా?
ఫరవాలేదు. ఏదైనా ఆట నేర్చుకో.. అంటారు. ఆటల్లో కూడా క్రికెట్ అయితే డబ్బులే డబ్బులు. ఇక జీవితంలో తిరిగి చూసుకోనవసరం లేదు. చదువు రాకపోయినా, పరీక్షలు పాసవకపోయినా ఏదో ఒక ఆటలో రాణిస్తే, డబ్బులకు కొదువుండదు. కాస్త ప్రతిభ ప్రదర్శిస్తే ప్రజలు బ్రహ్మరథం పట్టటమే కాదు, దేవుడిని చేసేస్తారు.
పోనీ ఆట ఏమీ రావటంలేదా? సినిమాల్లో ప్రయత్నించు. సినిమాల్లో డబ్బులే డబ్బులు. ప్రజలు కూడా తెరపై కనిపిస్తే చాలు వెర్రిగా వెంటబడతారు. అదృష్టం బాగుండి, సినిమాల్లో సక్సెస్ అయితే ఇక దేనికీ కొదువ వుండదు.
ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే, ఈ ఆటగాళ్ళు, సినిమావాళ్ళూ, రాజకీయ నాయకులంటే వున్న క్రేజ్ కానీ, డబ్బుల సంపాదన కానీ, జీవితాంతం చదువులో వెచ్చించి జ్ఞాన సంపాదన కోసం అహర్నిశలు శ్రమించిన వాడికి వుండదు. ఒక విజ్ఞానశాస్త్రవేత్త కుండదు. ఒక చక్కటి రచయితకుండదు. దీన్ని బట్టి సగటు మనిషి గ్రహించిందేమిటంటే, మన సమాజంలో తెలివితేటలకు విలువ లేదు.
అంతెందుకు, ఓవర్‌నైట్ ఫేమస్ అయిపోవాలంటే, ఒక హాట్, ఆవిర్లు కక్కే స్టీమీ సీన్‌లో నటిస్తే చాలు నేషనల్ క్రష్ అవటమూ, డబ్బుల పంట పండటమూ ఖాయం అని మనకు నిరూపితమవుతున్నది కదా.. అనుక్షణం, తరం తరం.
అయితే సగటు మనిషి గ్రహించిన జ్ఞానం, పంచుకోవాలనుకుంటున్న జ్ఞానం ఇది కాదు.
ఏదో ఉద్యోగం రాగానే డబ్బులు దాచుకొమ్మంటారు. చిన్నమొత్తం పొదుపు పథకాలు, టెర్మ్ డిపాజిట్లు, చిట్లు, షేర్లు, సిప్పులు, చిప్పులు, ఉప్పులు, పప్పులు, చెప్పులు, తప్పులు అన్నీ దాచమంటారు. రిటయిర్మెంట్ పథకాలు వేయమంటారు. భవిష్యత్తు కోసం దాచమంటారు. అనవసర ఖర్చులు వద్దంటారు. ఇలా పుట్టినప్పటినుంచీ డబ్బు సంపాదన, సంపాదించిన డబ్బును తెలివిగా పెట్టుబడిపెట్టి, తెలివిగా పొదుపుగా ఖర్చుపెట్టి, డబ్బును జాగ్రత్తగా దాచి, పెంచి పెద్ద చేయమంటారు.
ఒక రకంగా పుట్టినప్పటినుంచీ మనిషి మరణం వైపు పరుగులిడుతున్నట్టే, పుట్టినప్పటినుంచీ మనిషి ప్రతి చర్య, ఆలోచనలన్నీ డబ్బు చుట్టే తిరుగుతూంటాయి. అయితే ఇది కూడ సగటు మనిషి పంచుకోవాలనుకుంటున్న జ్ఞానం కాదు.
మరి సగటు మనిషి చెప్పలనుకుంటున్న జ్ఞానం ఏమిటి?
ఎలాగయితే పుట్టినప్పుడే మరణం నిశ్చయమో, అయినా వందేళ్ళు బ్రతుకుతామన్న భ్రమలో మనిషి వుండేట్టు ప్రకృతి మనిషిని మోసం చేస్తుందో, అలాగే, మనం డబ్బు మనకోసం సంపాదిస్తున్నమన్న భ్రమలో ఈ ప్రపంచం మనల్ని వుంచుతోంది. నిజానికి మన జీవితమంతా ఏదో కంపెనీకో, ఎవరో ఒకరికో తాకట్టుపెట్టి, జీవితాంతం, డబ్బు సంపాదిస్తూ, ఖర్చు పెట్టాలంటే భయపడుతూ, కడుపూ, నోరూ కట్టుకుని జీవిస్తున్నది, డబ్బు సంపాదిస్తున్నది ఎందుకోసమో సగటు మనిషి గ్రహించేశాడు. ఇదే సగటు మనిషి గ్రహించిన జ్ఞానం. ఇదే సగటు మనిషి అందరితో పంచుకోవాలనుకుంటున్న విజ్ఞానం..
అయ్యలారా, అమ్మలారా, తల్లులారా, తండ్రులారా, అన్నలారా, అక్కలారా, చెళ్ళెళ్ళలారా, తమ్ముళ్ళారా..ఇంకా సమస్త బంధుగణాల్లారా, మనం డబ్బు సంపాదిస్తున్నామనుకుంటున్నది మన కోసం అనుకుంటున్నారా??? కాదు, మనం బ్రతుకులను పలురకాల అయిష్టమయిన, మనసుకు నచ్చని పనులు తిట్టుకుంటూ, ఏడుస్తూ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నది మన కోసం కాదు. మనవాళ్ళ కోసం కాదు. మనం డబ్బు సంపాదిస్తున్నది.
మరి మనం డబ్బు మన కోసం కాకపోతే ఎవరి కోసం సంపాదిస్తున్నాము?
మనం డబ్బు సంపాదించేది రెండే రెండు విషయాల కోసం.
ఒకటి, స్కూళ్ళు కాలేజీలను పోషించేందుకు.
రెండు, ఆస్పత్రులను అభివృద్ధి పరచేందుకు.
నవ్వకండి. కొట్టిపారేయకండి. ఇది నిజం!
ఎంతో మంది సగటుమనుషులను పరిశీలించిన తరువాత సగటు మనిషి ఈ నిర్ణయానికి వచ్చాడు.
లెక్కలు కట్టి చూడండి.
ఒక సగటు మనిషి తన జీవితంలో తన కోసం, తన కుటుంబం కోసం ఎంత డబ్బు ఖర్చుపెడతాడు?
పిల్లల చదువుల కోసం, ఆస్పత్రుల కోసం ఎంత ఖర్చు పెడతాడు? లెక్కలు తీసి చూడండి. సగటు మనిషి చెప్పిన గొప్ప జ్ఞానంలో గొప్ప తెలిసిపోతుంది.
స్కూళ్ళల్లో వేలతో మొదలై లక్షలతో పూర్తవుతుంది.
గాల్లో బుడగలు వదిలినట్టు, ఫీజు లక్షన్నర, మూడు లక్షలు అని సులభంగా అనేస్తారు. పది లక్షలు, ఇరవై లక్షలు అని అలవోకగా పలికేస్తారు.
పిల్లల భవిష్యత్తు కోసం పంటి బిగువున అన్నీ భరిస్తారు సగటు తల్లితండ్రులు.
లెక్కలు తీసి చూడండి.. ఎవరో ప్రభుత్వ పాఠశాలల్లో చదివించేవారు తప్పించి, మిగతావారంతా, ఎన్నెన్ని లక్షలు చదువుల మీద బోర్లించారో!!!
స్కూలులో చేర్పించాలని అనుకుంటున్నప్పటినుంచీ డబ్బు నీళ్ళలా గుప్పెటలోంచి జారిపోవటం అనుభవానికి వస్తుంది. ఎల్.కెజీకి ఎన్ని కేజీల డబ్బులు, యూకేజీకి ఎన్ని కేజీల డబులు అని ముందే లెక్కలు వేసుకుని నెలవారీ బడ్జెట్‌లో డబ్బులు కేటాయించాల్సి వుంటుంది.
యూనిఫారంలు, బుక్కులు, ఆటోలు.. ఇలా ఖర్చులు పెరుగుతూనే వుంటాయి.
ఇవి కాక, స్కూళ్ళలో పోటీలు, ఆటలు, పిక్నిక్కులు.. ఇలాంటివన్నీ డబ్బులు లాగే టెక్నిక్కులు.
మధ్య మధ్యలో టాలెంట్ టెస్టులు, ఇంకేవేవో కోచింగులు.. ఇలా, బట్టలుతకాలని బట్టని నదిలో ముంచినవాడిని బట్టతో సహా నది లాక్కెళ్ళిపోయినట్టు, అడుగుపెట్టిన తరువాత మెడలోతు డబ్బుల ఖర్చు ఊబిలో దిగి ఉక్కిరిబిక్కిరి అవుతాడు సగటు మనిషి.
ఇక ఆస్పత్రుల సంగతి చెప్పనే అవసరం లేదు. అవసరం చూసి అంతా ఖర్చు పెట్టించేస్తారు.
ఆ మధ్య ఒకాయన ఒక ఆస్పత్రికి ఫోను చేసి “ఫలానా డాక్టర్ డ్యూటీలో వున్నారా?” అని అడిగాడట.
ఆయన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా, ఆ ఫోనెత్తిన అమ్మాయి “మీకు ఇన్సూరెన్స్ వుందా? క్యాషా?” అని అడిగిందట.
ఇన్సూరెన్స్ వుంటే, ఒకరకమైన ట్రీట్మెంట్, క్యాషయితే మరో రకమైన ట్రీట్మెంట్ అన్నమాట.
“అమ్మా, నేను డాక్టర్‌ని కలవాలి. అందుకని అడిగాను” అని సంజాయిషీ ఇచ్చుకున్న తరువాత డాక్టరు గురించిన సమాచారం ఇవ్వటానికీ కన్సల్టేషన్ ఫీజు అడిగింది.
ఇంకో సగటు మనిషి అత్యవసరమై దగ్గరలో వున్న చిన్న ఆస్పత్రిలో చేరాడు. రోగిని చూశారు. చూసిన ఫీజు కట్టించుకుని, “ఇంకా టెస్టులు చెయ్యాలి. టెస్టులు చెయ్యాలంటే అడ్మిట్ చెయ్యాలి” అన్నారు. అక్కడ అడ్వాన్స్.. డెబ్భయి అయిదువేల రూపాయలు. సగటు మనిషి నెలంతా కష్టపడితే కూడా అంత సంపాదించడు. ఇక్కడ క్షణాలలో అంత డబ్బు ఆవిరి. ఆ ఆవిరి సగటు మనిషి కళ్ళల్లోంచి, ముక్కు చెవుల్లోంచి వెలువడి తల తిరిగినంత పనయింది.
ఏదో చేసి పాపం ఆయన ఆస్పత్రిలో చేర్పించి నిట్టూర్చేలోగా, “ఫలానా టెస్ట్ చేయాలి, డబ్బులు కట్టి రసీదు తెస్తే, టెస్ట్ చేస్తాం”, “ఫలానా వస్తువులు కావాలి. క్రింద మెడికల్ షాప్‌లో కొని తీసుకుని రండి”, ఇలా, ఆ ఆస్పత్రిలో వున్నన్ని రోజులూ, పైకీ క్రిందకూ, అంటే, పేషంటున్న అంతస్తు నుండి, క్రింద మెడికల్ షాప్ వరకూ కొన్ని వందలసార్లయినా తిరిగివుంటాడు.
ఇంతకీ సమస్య ఏమిటో చెప్పరు.
“స్కాన్ అయితే తెలుస్తుంది.”
“స్కాన్‍లో తెలియటం లేదు. ఇంకో టెస్ట్ చేయాలి.”
“సోడియం లెవెల్స్ ఎక్కువున్నట్టున్నాయి.”
“పోటాశియం పడిపోయింది.”
“ఇన్ఫెక్షన్ వచ్చింది.”
“ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చిందో టెస్ట్ చేయాలి.”
“టెస్టులో ఏమీ తెలియటంలేదు. ఇంకో టెస్ట్ చేయాలి.”
“హెమోగ్లోబిన్ తక్కువ ఉంది. బ్లడ్ ఎక్కించాలి. బ్లడ్ అరేంజ్ చెయ్యండి.”
“ఇన్ఫెక్షన్ శరీరమంతా పాకుతోంది. ఈ మందులు, ఈ వస్తువులు తీసుకురండి.”
“కొంచేం ఏదో తేడాగా వుంది. ఈసీజీ తీయాలి. ఎమ్మారై చేయాలి. ఏబీసీడీ నుంచి జెడ్ వరకూ, జేడ్ నుంచి బడ్ వరకూ, ఆల్ఫనుంచి డెల్టా వరకూ, డెల్టా నుంచి ఉల్టా వరకూ, ఫుల్లుగా, ఉల్లూగా చెక్ చేయాలి.”
ఏ టెస్టూ ఏమీ చెప్పదు.
వాళ్ళేవేవో చెప్తారు. వారు చెప్పిది అర్ధం కాక, సగటు మనిషి గూగుల్ వాణిని అడుగుతాడు. అది చదివి భయంతో చస్తూంటాడు.
అలాగని చివరి క్షణం వరకూ చికిత్స ఇప్పించకుండా వుండలేడు. ఆస్పత్రులు డబ్బుల వలువలు వొలిపించకుండా వదలవు.
హైడ్రోజన్ నుంచి బీథోవెన్ వరకూ ఏదో ఒకటి శరీరంలో తగ్గుతూంటుంది. ఎందుకో తెలియదు. టెస్ట్ చేసినా తెలియదు. టెస్ట్ చేయకున్నా తెలియదు. కానీ, ఇన్ఫెక్షన్ మాత్రం శరీరంలో పెరిగిపోతుంది. అది ఏం చేసినా తగ్గదు.
“ఐసీయూలో పెట్టాలండి. కొంచెం క్రిటికల్‌గా వుంది.”
మనకు చెప్పకుండా ఏమీ చేయరు. కానీ, ఏం చేస్తున్నారో, దాని ఫలితమేమిటో ఏమీ తెలియదు.
మనకు తెలుస్తున్నదోకటే, ఇన్ఫెక్షన్ పెరిగిపోతున్నది. మనకు టెన్షన్, ఫ్రస్ట్రేషన్ పెరుగుతున్నది. డబ్బులు వరదలా పారిపోతున్నాయి మన దగ్గర నుంచి.
ఆ డబ్బులు ఎంత వేగంగా పారిపోతున్నాయంటే, నెలలు, సంవత్సరాలు అన్నీ, కొన్ని నిముషాల్లోకి కుదించుకుపోతున్నాయి.
తీరా చూస్తే మనిషి ప్రాణం పోతుంది. ప్రాణం పోకుండా మనిషి దక్కితే డబ్బు పోతే పోయిందనుకుంటాడు సగటు మనిషి. ఇంతచేసీ, ఫలితం దక్కకపోతే ఎవరినేమంటాడు? డాక్టర్లు ముందే చెప్తారు, మనం ఏం చేసినా పైనవాడు ఎలా రాస్తే, అదే అవుతుంది. మన ప్రయత్నం మనం చేస్తాం అంతే.. అంటారు.
జీవితాంతం అన్నీ కట్టుకుని ఎందుకోసమో కూడబెట్టిన డబ్బూ పోతుంది. మన దగ్గర ఏమి మిగిలిందంటే, చిన్నప్పటినుంచీ డబ్బు సంపాదనే పరమావధిగా భావిస్తూ గడిపి వ్యర్థం చేసుకున్న జీవితపు గాలిలేని తోలుతిత్తి మాత్రమే!!
పాపం.. నా సగటు మనిషి ఫ్రెండు తనవారు మరణించినందుకు దుఃఖించాలో, లేక జీవితాంతం దాచి సంపాదించిన డబ్బంతా ఖాళీ అయిపోయినందుకు బాధపడాలో తెలియని పరిస్థితిలో వున్నాడు.
వాడి బాధ ఏమిటంటే, భవిష్యత్తులో, తనకో, తన కుటుంబంలో ఇంకెవరికో ఏమన్నాయితే, ఆస్పత్రికి తీసుకెళ్ళెందుకు కూడా డబ్బులెట్లా అన్నది.
అప్పుడు వెలిగింది సగటు మనిషికి.. మనం పుట్టినప్పటినుంచీ, చదివి, ఎదిగి, ఉద్యోగాలు చేసి, నానా గడ్డి కరచి డబ్బు కూడబెట్టేది ఎందుకంటే, ఇందుకు.
ఇదీ సగటు మనిషి గ్రహించిన జ్ఞానం. అందరితో పంచుకోవాలనుకుంటున్న జ్ఞానం!!
దీనివల్ల లాభం ఏమిటి? మాకు ఇది తెలియదనుకుంటున్నావా? అని అడిగేవారికి ఒకటే సమాధానం..
సగటు మనిషికి ఎప్పుడు జ్ఞానం వస్తే, అప్పుడే ప్రపంచంలో ఆ జ్ఞానం కనుగొన్నట్టు.. కాదంటారా?
సగటు మనిషి పరిజ్ఞానమింతే!!!
సగటు మనిషి చెప్పిందే సత్యం.. మిగతా అంతా మిథ్య అంతే!!!
(మళ్ళీ కలుద్దాం)