సాహిల్ వస్తాడు – పుస్తక పరిచయం

0
8

[dropcap]సు[/dropcap]ప్రసిద్ధ కవి అఫ్సర్ రాసిన 11 కథల సంపుటి ఇది. ఈ పుస్తకాన్ని ఛాయా రిసోర్స్ సెంటర్, హైదరాబాద్ వారు ప్రచురించారు.

“కథ అంటే కొత్త వూహలూ ఆసక్తీ పెరిగిన 1990ల నుంచి ఇప్పటిదాకా కథా సాహిత్యంలోనూ, నాలోనూ చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులు కొన్ని అయినా మీకు ఈ కథల్లో కనిపిస్తాయి. ముఖ్యంగా, సమస్యని గురించి ఆలోచించే విషయంలో మార్పు వచ్చింది. పల్లె నుంచి వచ్చి, ఎక్కువ కాలం పట్టణాల్లోనే బతికినా, పల్లె నా పునాదిలో బలంగా నిలిచిపోయింది. ఆ పల్లె ఇప్పటికీ నా కథల్లో ప్రధానమైన కేంద్రమే! ఉద్యోగాల వల్ల మూడు పెద్ద పట్టణాలూ, వొక మహానగరమూ, అమెరికా నా జీవితంలో తప్పనిసరి ఘట్టాలయ్యాయి. వాటి ప్రభావం నా మీద లోతైనదే. వూరు మారినప్పుడల్లా కథ మారుతూనే వుంది, జీవితంలానే-” అంటారు అఫ్సర్ ‘సాహిల్ రాక ముందు’లో.

***

“ఈ కథలన్నింటా ఒక కథకుడున్నాడు. అతడికి ఇంటర్ కాలపు ఒక జీవితం ఉంది. కాలేజీ రోజుల జ్ఞాపకం ఉంది. పుట్టి పెరిగిన ఊరితో అనుబంధం ఉంది. వలస రావడం ఉంది. పట్నపు బతుకులోని బేజారు ఉంది. ఆ తర్వాత మారిన పరిస్థితులను చూసి గందరగోళ పడటం ఉంది. తన సమూహం కంటే పెద్ద సమూహం మతం ఆధారంగా వత్తిడి పెడుతున్నప్పుడు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి కావడమూ ఉంది.

ఈ కథలను చదవండి.

సుఖంగా అనిపించవు. ఊపిరిలో జ్వలనాన్ని, ఛాతీలో అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అలా అనిపిస్తే గనక మీలో మనిషి ఇంకా మిగిలి ఉన్నట్టు. మీ చర్మం ఆకుపచ్చ, కాషాయ వర్గాలను దాటి ఒక మానవ వర్గాన్ని కోరుకుంటున్నట్టు” అంటారు ‘సీనే మే జలన్’ అనే ముందుమాటలో ఖదీర్‍బాబు.

***

“ఈ పుస్తకంలోని అఫ్సర్ పదకొండు కథలూ ఒక అస్తిత్వ బాధను సన్నగా పదునుగా మనలోకి దించుతాయి. కవి రాసిన కథలివి అని మనమెక్కడా మరచిపోలేము. ఉదాత్తమయిన, మార్మికమయిన, భావుకులయిన పాత్రలు ఈ కథల్లో మనల్ని పలకరిస్తారు. అక్కడక్కడా సంభాషణల మధ్య తితిలీలు ఎగురుతూ కనిపిస్తాయి. మామూలు జీవిత సన్నివేశాలు, అతి సాధారణ ఉద్వేగాలు, చిన్న చిన్న దుఃఖాలు మన అశ్రుగ్రంథుల్ని సున్నితంగా పరామర్శిస్తాయి. వీటిని చదువుతుంటే, అనేక కథల్లో నిస్సహాయ ప్రేక్షక వ్యాఖ్యాతగా కనిపించే ఉత్తమ పురుష కథకుడిలాగే, ఈ సమాజం అంతా రణరంగరచనను చేష్టలుడిగి చూస్తున్నదేమో అని భయం వేస్తుంది. ఏమన్నా చేయలేమా, అన్న ప్రశ్న కూడా తారసపడుతుంది” అని అభిప్రాయం వ్యక్తం చేశారు కె. శ్రీనివాస్ తన ముందుమాట ” ‘ఇతరుడి’ అస్తిత్వ కథలు”లో.

***

“సమకాలీనులలో విలక్షణమైన కవీ, కథకుడు అఫ్సర్. ఆయన సమూహంలో ఒంటరితనాన్ని కనుగొనే మార్గం వేశాడు. ఈ ఒంటరితనంలోని వేదన, ఒంటరి పోరాటాల తెగువ సామూహిక అస్తిత్వ గాథలనూ, చరిత్రను మనకు గుర్తుకు తెస్తుంది. మనం అనివార్యంగా వాటిలో లీనమవుతాం. కథనంలో అఫ్సర్ అనితర సాధ్యమైన రీతిలో సాగిపోతున్నాడు. గెలుపు, ఓటమి, సాఫల్యం, వైఫల్యం వంటి ద్వంద్వాల అర్థాన్ని వెతికి, లోతుని కొలిచి దానితో అస్తిత్వ ధారను కల్పించే కథలివి. కథల అల్లిక జీవితమంత సంక్లిష్టంగా వుంటుంది. కానీ కథకుడు నేర్పుగా దాచిన రహస్య సూత్రం చేతికి దొరికితే అతి సులభంగా విప్పుకొని ఆశ్చర్యపరుస్తుంది. ఎక్కడో గుసగుసగా వినిపించే ఆ రహస్యాన్ని కనుగొనమని పిలుస్తూ ప్రేరణ కలిగించే కథలివి. మానవ జీవితానుభవం దూరం చేసిన సమతుల్యతను తిరిగి మనం పొందాలని చెప్పే కథలు” అంటారు ఓల్గా ఈ కథల గురించి.

***

“విషపూరిత మీడియా ప్రచారాల మధ్య ముస్లిం సమాజమంతా నలుగుతూన్న భయానక కాలంలో, స్థలంలో ముప్పయి అయిదేళ్ళ కల్లోల స్థితిని అనుభవిస్తూ అఫ్సర్ తనను తాను నిలబెట్టుకోడానికి రాసిన కథలివి. ఆధునిక ముస్లిం ప్రజల్లో, సాహిత్యంలో శ్రామిక వర్గ దృక్పథాన్నీ, పని సంస్కృతిని అలవరచుకోవాల్సిన అవసరాన్ని ఈ కథలు నొక్కి చెప్తాయి. భారతీయ ముస్లిం సాహిత్యంలో శాస్త్రీయ వివేచన కలిగించే ఆధునిక చేర్పు అఫ్సర్ కథలు” అంటారు అల్లం రాజయ్య.

***

సాహిల్ వస్తాడు, మరికొన్ని కథలు (కథాసంపుటి)
రచన: అఫ్సర్
ప్రచురణ: ఛాయా రిసోర్స్ సెంటర్, హైదరాబాద్.
పుటలు: 165
వెల: ₹180/-
ప్రతులకు: అనల్ప బుక్ కంపెనీ, జి.కె. కాలనీ, నేరెడ్‍మెట్, సికింద్రాబాద్-500094.

ఫోన్: 070938 00678

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here