సాహిత్యచరిత్రను దారికితెచ్చిన దర్శనం-విశ్వనాథ నవ్య సాంప్రదాయం

0
10

[box type=’note’ fontsize=’16’] డా. జి. వి. సుబ్రహ్మణ్యం రచించగా, యువభారతి ప్రచురించిన ‘విశ్వనాథ నవ్య సంప్రదాయం‘ అనే పుస్తకానికి సంపాదకులుగా డా. ముదిగొండ వీరభద్రయ్య వ్రాసిన ముందుమాటను ప్రత్యేక వ్యాసంగా పాఠకులకు అందిస్తున్నాము. ఈ పుస్తకం 1995 సెప్టెంబరులో ప్రచురితం. [/box]

[dropcap]చ[/dropcap]రిత్రకూ, సాహిత్య చరిత్రకూ భేదముంది. ఒక రాజు రాజ్యమేలాడన్న విషయాన్ని అతని శత్రువు కూడా కాదనలేడు. కాదని అంటే అతని చరిత్ర రచన చరిత్రే కాకుండా పోతుంది. కాని, సాహిత్య చరిత్రలో ఈ రకమైన పరిస్థితి ఉన్నట్లుగా లేదు. హిట్లర్‍ని గాంధీ మహాత్మునిగా చిత్రణ చేయగల్గుతున్నారిక్కడ. అట్లాగే గాంధీజీని దోషాల పుట్టగా వక్రీకరణ చేయగల్గుతున్నారిక్కడ. సాహిత్యానికీ, సాహిత్య చరిత్రకీ ఉండే స్వయం ప్రతిపత్తిని తిరస్కరించే ‘మహానుభావుల’ వల్ల ఈ దుస్థితి సాహిత్యలోకంలో స్థిరపడిపోయింది; పోతున్నది. దీన్ని తిరస్కరిస్తూ, కాదంటూ సోపపత్తికంగా సాహిత్యాధ్యయనపరులకు సత్యాన్ని చూపించాల్సిన అవసరం గుర్తించి ఆచార్య జి.వి సుబ్రహ్మణ్యం గారీ గ్రంథాన్ని రచించారు.

గడిచిపోయిన ఘట్టాలుండేది చరిత్ర. ఆ ఘట్టాలు ఇప్పుడుండవు. మళ్ళీ అవి జరగవు. అంటే – చరిత్రకు వర్తమానంలో అస్తిత్వం లేదు. అది కేవలం కాలిక సత్యం మాత్రమే. సాహిత్య రచన అట్లాంటిది కాదు రచన ఏనాడు ఎన్నివందల సంవత్సరాల క్రితం జరిగినప్పటికీ, దాని ఉనికి వర్తమానంలోనూ ఉంటుంది. పొమ్మంటే పోయేది కాదు. అట్లాంటి సాహిత్యం యొక్క చరిత్ర రచనకూ, రాజకీయ చరిత్రకూ రచనలో భేదం ఉండక తప్పదు. సాహిత్య చరిత్ర నిర్మాణంలో వక్రీకరణలు, దుర్వ్యాఖ్యానాలు, దుష్టాన్వయాలూ తగవని చెప్పే రోజులు, చెప్పగలిగే రోజులు వస్తాయి; వచ్చాయి.

ఐతే నిష్పాక్షికుడైనవాడి వాదాన్ని లోకంలో ప్రచలితం కాకుండా చేయడానికి, సాహిత్యలోకంలోని కొందరికి రాజకీయ పార్టీల దన్ను ఉండింది. ఉంటున్నది. ఈ వక్రీకరణ నిజానికి ఆ పార్టీల వాళ్ళ సిద్ధాంత ప్రయోజనాల కోసమే కూడా! వారి లక్షణాలను గురించి రాస్తూ విశ్వనాథ –

“తీవ్ర ప్రకృతికి సామ్యవాదమున కెక్కువ సంబంధమున్నట్లు కన్పించుచున్నది. వారు చెడుగుడిలో నిపుణులు. కవ్వించ నేర్చినవారు. ఆకలి, వర్ణవ్యవస్థ పోవుట, సర్వజనులు సమానము, ఆర్థిక సామ్యము, పరదేశానుకరణము, విపక్షనాశనము మొదలైన బహు సిద్ధాంతములు వారికి కలవు. వానిని గురించి వ్రాసినదే వారికి కవిత్వమనిపించును. అదియే క్రొత్త కవిత్వము. తక్కిన దంతయు ప్రాత కవిత్వము. (1)

– అని అంటారు. ఈ రాజకీయ పక్షం వాళ్ళు నిల్పిన రచయితల సంఘాల వాళ్ళు సాహిత్య చరిత్రకు చేసిన ద్రోహం రెండు రకాలైనది. 1.సంప్రదాయ శబ్దానికి కువ్యాఖ్యానం చేసి, దాన్ని ఒక తిట్టుతో తుల్యమైన శబ్దంగా రూఢికెక్కించడం. 2.అసలైన అర్థంలోని సాంప్రదాయిక పంథా రచనలను తక్కువ చేసి, దాని ద్వారా సాహిత్యానికి కల్గిన వికాస, పరిణామాలను పైకి కన్పించనీయకుండా సాహిత్య చరిత్ర రచనను దారి మళ్ళించడం. కొందరిట్లా ఈ సంప్రదాయ శబ్దానికి దురర్థాన్ని రూఢి కెక్కించినంత మాత్రంలో దానికి తిరుగు ఉండదా? అని అడిగితే – అట్లా ఉండదని చెప్పలేము కాని, దానికెంతో తీవ్ర ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఆ ప్రయత్న ఫలితమే జి.వి సుబ్రహ్మణ్యం గారి ఈ నవ్య సంప్రదాయోద్యమ వాద ప్రతిపాదన.

-“దుష్టవిమర్శకుడు చేయు నపకార మెచ్చట నున్నదనగా నొక సద్గ్రంథమునకే వ్యాప్తి కలుగకుండ చేయుటలో నున్నది. ఈ కువిమర్శకుడు కుకవి కంటె నెక్కువ సాహిత్య ద్రోహి…. కువిమర్శకుడు అవిద్వద్భావుకుల మనసులను భంగించును. సత్కార్యము యొక్క స్థితికి ధూమకేతు ప్రాయుడగును… కుకవి వల్ల జగద్ద్రోహము జరుగదు. కువిమర్శకుని వలన జరుగును”(2)

– అని విశ్వనాథ ఒక సందర్భంలో రాసినది గమనించాల్సిన అభిప్రాయం. ఇలాంటి కువిమర్శల ఫలితంగానే వక్రీకరణలతో సాహిత్య చరిత్ర రాయబడింది. ఇట్లా రూఢి ఏర్పడడం వల్లనే కావచ్చు విశ్వనాథ ‘ఎవరో కొందరు కవులు, సనాతన వాదులని దుష్ప్రచారము చేయింపించుకొన్న కవులు కూడ….’ (3) అని ఒకచోట రాశారు! ఇట్లా సనాతన వాదాన్నీ, సంప్రదాయ వాదాన్నీ వ్యతిరేక దృక్కోణంతో కూడిన అర్థం కల్గినవిగా దుష్ప్రచారం జరిపి సాహిత్య చరిత్రలో ముఖ్యమైన ఘట్టాలను, పరిణామాలను కప్పివేయడం జరిగింది. మహాకవుల సమూహాన్నీ, మహాకావ్య సముదాయాన్నీ సంప్రదాయబద్ధమైనవన్న ఒక్క మాటతో గుణ పరిశీలనం చేయకుండా కొట్టివేసి సాహిత్య చరిత్రలో ఉజ్జ్వల స్థానాన్ని పొందకుండా చేశారు. ఈ అసత్యాన్నీ, అన్యాయాన్నీ ఎత్తిచూపుతూ, నాజూకుగా ఈ 22 వ్యాసాలను రాస్తూ ‘నవ్య సంప్రదాయోద్యమం’ అన్నది ఎట్లా వామపక్షీయుల దన్నుతో పాక్షిక దృష్టితో నడిచిన సాహిత్యోద్యమానికి సమాంతరంగానూ, దాని తర్వాతనూ ఎట్లా సాగిందో, దానికి విశ్వనాథ వారెట్లా నాయకత్వం వహించడం జరిగిందో స్పష్టంగానూ, హేతుబద్దంగానూ తెలిపారు!

ఉద్యమాలకు పేర్లు పెట్టడంలో కూడా కొంత ‘మతలబు’ ఉన్నది. కేవల సాహిత్యోద్యమాలకు పేర్లు ఆ ఉద్యమాలు ముగిశాకనే ఏర్పడినవి. రాజకీయ నేపథ్యంతో, నియంత్రించబడిన ఉద్యమాలకు ముందే పేర్లూ, మెనిఫెస్టోలు, సభలూ, ప్రచారాలూ, అందుకుగాను పత్రికలూ, సభ్యత్వాలూ మొదలైన వ్యవహారం ఉండింది. కనీసం ఇంగ్లాండులోనైనా రొమాంటిస్టులు తమని తాము రొమాంటిస్టులుగా చెప్పుకోలేదు. షెల్లీ, కీట్స్, బైరన్‍లతో ముడివేస్తూ కాలరిడ్జ్, వర్డ్స్‌వర్తులు 1849లో మాత్రమే మొదటిసారిగా దీన్ని కాల్పనికోద్యమమన్నారు (4). వామపక్ష వస్తువుతో రాసిన కవిత్వ పద్ధతికి నామకరణం ఇట్లా జరుగలేదు. వారు చేసినది సంఘటితంగా దేశీయమైన కవిత్వోద్యమాన్ని ఎదుర్కోవడం వారి అంతర్జాతీయ రాజకీయ దృష్టి వారిని అట్లా ఎదుర్కోవడానికి కారణమైంది. ఆ ‘అంతర్జాతీయ దృష్టే’ వారి యుగకర్త శ్రీశ్రీ మహాప్రస్థానంలో ఒక్క కవితలోనైనా భారతదేశం పేరైనా లేకుండా చేసింది! ద్వితీయ ప్రపంచ సంగ్రామంలో ఒక చోటెక్కడో రష్యా జయిస్తే రష్యాను ప్రశంసించేట్లుగా కూడా చేసింది! అట్లాంటి వాళ్ళు దేశీయంగా వస్తున్న సాహిత్య వికాసాన్ని హర్షిస్తారనీ, దాన్లో పాలు పంచుకొంటారనీ అనుకోవడం అత్యాశే. ఐనా, నవ్య సంప్రదాయోద్యమ నాయకుడైన విశ్వనాథ వారు శ్రీశ్రీని గురించి నిర్ణయిస్తూ తన ‘హేతువాద యుగం’ అన్న ఆకాశవాణి రూపకంలో ‘ఈ క్రొత్త కవుల్లో ఒక్కడే మహాకవి, అతని పేరు శ్రీశ్రీ (5) అని రాస్తారు! వస్తు దృష్టితో సాహిత్య స్థాయీ నిర్ణయాలు చేయకుండా ‘సాహిత్య విలువలు’ ఆధారంగా రచనలకు విలువ కట్టడమన్నది నవ్య సంప్రదాయోద్యమంలో అతి ముఖ్య విషయం. జివి సుబ్రహ్మణ్యంగారి ఈ గ్రంథంలో ఈ అంశం స్పష్టపడ్తుంది. దీనికీ విశ్వనాథ వారే మార్గదర్శనం చేశారు.

– “గొప్ప కవి యని అనుకొనబడుచున్న వాడొకడు కలడు వాని సిద్ధాంతములు మనకిష్టము కావు. వానిని మనము గొప్పకవి యని యనుచున్నాము. ప్రతిభాశాలి యనుచున్నాము. వాని కావ్యమునందవి లేనివి లేవని వ్రాయుచున్నాము. అనగా మనమనుకొన్నవి లేవనియే కదా! అవి లేకపోయినను వాడు గొప్పకవి యని మనమంగీకరించుచున్నాము కదా!” (6).

ఒక కవిని కవిగా చెప్పడానికి కవిత్వ లక్షణా లతని కవిత్వంలో ఉండడం తప్ప మరి దేన్నీ చూడని నవ్య సంప్రదాయోద్యమ నాయకుని లక్షణం ఈ ఉద్యమాన్ని ఉద్యమంగా గుర్తించని వాళ్ళలో కన్పించదు. ‘కాదనలేని వాస్తవం: నవ్య సంప్రదాయోద్యమం’ అన్న ఈ గ్రంథంలోని వ్యాసంలో సాహిత్య చరిత్రను తప్పుదారి పట్టించేవారి అంచనాలను సుబ్రహ్మణ్యంగారు సోపపత్తికంగా ఖండించారు. అంతేకాకుండా ‘ఇంకా మిగిలి ఉన్న సంప్రదాయాన్ని నవ్య సంప్రదాయంగా పిలుస్తున్నారు’ అన్న అవగాహన రాహిత్యాన్ని సుబ్రహ్మణ్యం గారి ఈ గ్రంథం అంతా సరిచేస్తున్నది. అందుచేత ఈ ఉద్యమాన్ని నవ్య సంప్రదాయోద్యమం అన్న పేరు ఉద్యమానంతరమే పెట్టబడినప్పటికీ, దీనికి ఉద్యమ లక్షణాలున్నవని, దీనివల్ల కల్గిన ఫలితాల వల్లనే చెప్పవచ్చును. అభ్యుదయ కవిత్వంతో సమాంతరంగా పుట్టి, దాని పరిసమాప్తిని కూడా చూసి ముందుకు సాగిందీ ఉద్యమం. అందువల్ల ఉద్యమవేళలో దీనికి పేరు లేకపోయినప్పటికీ కొరత ఏమీ జరుగలేదు. కొరత లేకపోవడమే కాక సుబ్రహ్మణ్యం గారి మాటల్లో – ‘సంప్రదాయ వాదాన్నీ, నవ్య సంప్రదాయవాదాన్నీ ఎదుర్కొంటున్న ఎందరో అభ్యుదయ విప్లవవాదులకు ఎదురుగా మహారథుల్లా నిలిచి ఆధునిక చైతన్యంతో సంప్రదాయాన్ని రక్షిస్తున్న కవులు, రచయితలు వీరు. ఆధునిక యుగంలో సమాజం సమగ్ర సాహిత్యానుభవాన్ని పొందే అదృష్టాన్ని అందించిన, అందిస్తున్న అక్షరశిల్పులు, రసమూర్తులు నవ్య సంప్రదాయ కవితాయుగ సారథులు (7).

సంప్రదాయమూ, నవ్య సంప్రదాయమూ నడుమన ఉన్న సూక్ష్మభేదాన్ని తర్వాతి కాలంలో కోవెల సుప్రసన్నాచార్యులవారు వివరిస్తూ –

“నవ్య సంప్రదాయ మంటే గతానుగతికంగా వచ్చే సంప్రదాయ సాహిత్యంగా భ్రమించే వీలులేదు. దీనివల్ల సమగ్రావగాహన కలుగదు. పరంపరగా వచ్చే విశ్వసనీయములైన పురాణేతిహాసముల అనువాదాలేవీ నవ్య సంప్రదాయంలో చేరవు. ఎందుకంటే వీటిల్లో సమకాలీన స్పందన చేరలేదు. (8)

‌ – అని స్పష్టీకరించారు. నవ్య సంప్రదాయం అన్న శబ్దాన్ని పారిభాషిక పదంగా రూఢి కెక్కించిన సుబ్రహ్మణ్యం గారి ఆలోచనకు, ప్రతిపాదనకు ఇది తోడ్పడ్తున్న ఆలోచన.

ఇక్కడ గమనించాల్సిన అతి ముఖ్య విషయం ఏమిటంటే – ఒక లేని ఉద్యమాన్ని ఎవరూ చరిత్రపుటల్లో సృష్టించలేరు. సాహిత్య చరిత్రలో కొందరు గుర్తించకుండా, దానిమీద దుప్పటి కప్పినప్పటికీ – తానుగా వ్యక్తమవుతున్న కొన్ని సమాన లక్షణాల యొక్క సమాహారానికి సాహిత్య చరిత్రకారుడు తప్ప పేరు ఎవ్వరు పెడ్తారు? అట్లా పెట్టకపోవడం సాహిత్యద్రోహం. విశ్వనాథ మాటల్లోనైతే దీన్ని జగద్ద్రోహం అనవచ్చును. దీనికి పేరుపెట్టి, ఈ ఉద్యమ లక్షణాలని స్పష్టీకరిస్తూ, ఇది ఏమేమి లక్ష్యాలను పెట్టుకొని, వాటినెట్లా ఎట్లా సాధించిందో నిరూపణం చేయడం విద్యావంతుని పని. ఈ పనినే ఆచార్య జివి సుబ్రహ్మణ్యం గారీ గ్రంథంలో చేసింది. ఐతే సుబ్రహ్మణ్యం గారే చెప్పినట్లు-

-“ఒక కాలంలో ఒక చైతన్యం ఉవ్వెత్తుగా పొంగుతున్నప్పుడు దానిని కవులు పోషిస్తూ ఒక ధోరణినో, ఒక ఉద్యమాన్నో సాగిస్తున్నప్పుడు సమాజ చైతన్యంలోని మరో భాగంగా ఉండే తదితర ప్రవృత్తులు బలహీనంగా వున్నా చచ్చిపోవు. తమ శక్తులను కూడగట్టుకోవటానికి మందంగానో లేదా తీవ్రంగానో, వ్యక్తంగానో లేదా అవ్యక్తంగానో కృషి చేస్తుంటాయి. ఒక్కొక్కసారి ఆ శక్తులన్నింటికీ ప్రతినిధిగా ఒక రచయితో లేదా కొందరు రచయితలో తమ ప్రయత్నాలను బలంగా సాగించవచ్చు. ఇటువంటి పనే అభ్యుదయ కవిత్వోద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లోనే విశ్వనాథ సత్యనారాయణ గారు శ్రీ మద్రామాయణ కల్పవృక్షము రచిస్తూ, మెరుపులా సాధించిన నవ్య సంప్రదాయ యుగసిద్ది. (9)

రెనెవెలెక్, ఆస్టిన్ వారెన్‍లేమో సాహిత్య యుగనామం (రొమాంటిసిజమ్ వంటివన్న మాట) “It is a historical category or, if one prefers the Kantian term, a ‘regulative idea’ (or rather a whole system of ideas) with the help which we interpret the historical process” (10) అని అన్నారు.

నవ్య సంప్రదాయోద్యమం అన్నది సాహిత్య చరిత్ర వికాసాన్ని తెలిసికోవడానికి తోడ్పడే చక్కని కీలకమన్నమాట చరిత్ర వికాసక్రమాన్ని తెలిసికొనే ‘క్రమం’ దీనివల్ల మనకు స్పష్టపడ్తుందన్నమాట ఈ కీలకాన్ని సాహిత్యాధ్యయనపరులకు అందించి, దారి మళ్ళించబడిన చరిత్ర నిర్మాణాన్ని మళ్ళీ దారికి తెచ్చిన సద్విమర్శకులు, సాహిత్య చరిత్రకారులు ఆచార్య జి.వి సుబ్రహ్మణ్యం గారు. పై ఇద్దరు రచయితలు చెప్పినట్లుగా ‘While a period is thus a section of time to which some sort of unity is ascribed, it is obvious that unity can be only relative.” (11). ఒక యుగంలోని రచయితలందరి రచనలూ ఒక మూసలోంచి తీసినట్లుగా ఉండవు ఐనా వారి రచనల్లో ఏదో ఒక రకమైన ఏకత కూడా ఉండకపోదు. ప్రక్రియా పరమైన భేదాలు, ప్రయోగాలు ఎన్ని కన్పించినప్పటికీ, నవ్య సంప్రదాయోద్యమ రచనల్లో ముఖ్యంగా కావ్యాల్లో రస నిర్వహణ మన్నది సమాన లక్షణం. రసం ప్రధానం కాని కావ్యాలు లేకపోలేదు. అలాంటిచోట్ల వేరే కావ్య లక్షణాలలో ఏకత ఉంటుంది.

ఆధునిక కాలంలో వచ్చిన మూడు ప్రధాన సాహిత్యోద్యమాలలో అంటే భావకవిత్వోద్యమం, అభ్యుదయకవితోద్యమం, నవ్య సంప్రదాయోద్యమం – సాహిత్య విలువలకు ప్రాధాన్యమిచ్చినవి భావకవిత్వం, నవ్య సంప్రదాయం మాత్రమే. అభ్యుదయ కవిత్వానికి వస్తు ప్రాధాన్యమే. కళా విలువలతో బాగా రాజీపడి పద్ధతిలో బాగా రాజీపది చాలా కాలం మరుగునపడి పోవాల్సి వచ్చిందా ఉద్యామం. కళా విలువల్ని రాజీ లేని పద్ధతిలో పోషిస్తూనే జాతి ద్రోహకరమైన సిద్దాంతాలని, అమానుష పద్దతులని ఖండించింది నవ్య సంప్రదాయోద్యమం. రాణాప్రతాపసింహుని వంటి మహా క్షత్రియ వీరుడు కూడా గాంధీయమూర్తిగా భాసిస్తూ దేశ స్వాతంత్ర్యోద్యమం లోని అహింసా మార్గాన్ని స్ఫురింపజేస్తూంటాడీ ఉద్యమంలో! సౌందరనందము, శివ భారతం, రాణా ప్రతాపసింహ చరిత్రము, ఆత్మకథ, ఆంధ్ర పురాణము అన్న వాటిని పంచకావ్యాలుగా నిర్ణయించి నవ్య సంప్రదాయాన్ని గురించిన నేటి ఆలోచనకు విశ్వనాథ బీజాన్ని వేశారని సుప్రసన్న గారన్నారు (12). ఈ ఐదింటిలో నాల్గింటికి చరిత్రనో, చరిత్రకాంశాలో వస్తువు. ఇంతమాత్రమే ఇక సాహిత్యంలోని వివిధ కోణాలలో, మూలాలలో నవ్య సంప్రదాయ లక్షణాలెలా వున్నాయో పరిశీలించి, దీనికి నవ్య సంప్రదాయ యుగమని నామకరణం కావించాల్సిన ఆవశ్యకతను మొదటగా గుర్తించింది ఆచార్య జి.వి సుబ్రహ్మణ్యం గారు. చారిత్రక కావ్యాల నుంచి విమర్శరంగం వరకు అనేక ప్రక్రియలలోనూ, అంశాలలోనూ నవ్య సంప్రదాయం ఎలా కన్పిస్తున్నదో సోదాహరణంగా సుబ్రహ్మణ్యం గారీ గ్రంథంలో చూపించారు. అంతేకాకుండా, సాహిత్య చరిత్ర రచనకు పనికివచ్చేటట్లుగా, ‘భావకవిత్వం మీద సాగించిన తిరుగుబాటుగా మొదట తలయెత్తినా, అభ్యుదయ కవిత్వోద్యమానికి ప్రత్యర్థిగా క్రమంగా రూపొందిన సాహిత్యోద్యమం నవ్య సంప్రదాయోద్యమం (13) వంటి పరిశీలనలు చేసి భావి సాహిత్య నిర్మాతలకు చక్కని దారి వేశారు సుబ్రహ్మణ్యంగారు. (14).

నిత్యత్వము నవ్యత్వము విరోధం లేనివన్న నవ్య సంప్రదాయ రచయితల దర్శనాన్ని సుబ్రహ్మణ్యంగారి ఈ మొత్తం గ్రంథంలో అంతర్లీనంగా మనం చూడగల్గుతాము. అంతేకాకుండా, సమాజ దర్శనాన్ని సాహిత్య దర్శనంగా పరివర్తింపజేసికొన్న ప్రతిభావంతులుగా నవ్య సంప్రదాయ రచయితలు మనకీ గ్రంథం చదివాక దర్శనమిస్తారు. ప్రాచీన సాహిత్య దర్శనాలలో నేటి నవ్య సంప్రదాయ సాహిత్య దర్శనమూలాలున్నప్పటికిన్నీ, అవి ఆధునిక మూల్యాలతో సంవాదం పొంది కొత్తగా ఒక సాహిత్య దర్శనంగా ఎలా పరిణమించాయన్న అంశం కూడా ఈ గ్రంథం చదివాక మనకు తెలుస్తుంది.

ఈ గ్రంథం ద్వారా సుబ్రహ్మణ్యం గారు సృష్టీకరించిన మరొక ముఖ్యాంశం సాహిత్య దర్శనం విషయం. ఒక సాహిత్య దర్శనమే లేకుండా సాహిత్య చరిత్రలో స్థానాన్ని సంపాదించబూనడం ఆశ్చర్యకరమైన విషయం. సాహిత్య సిద్ధాంతం లేకుండా కేవలం సామాజిక సిద్ధాంతాలతో సాహిత్య క్షేత్రంలో దూరడం ‘విడ్డూర’మైన విషయం. ఆర్థిక, రాజకీయ, సాంఘిక సిద్ధాంతాలు, నవ్య సంప్రదాయకుల వస్తువులలో రంగరించబడినప్పటికిన్నీ వారి రచనలన్నీ మౌలికంగా కళా ధర్మాలనే తమ ఆత్మ స్థానంలో నిల్పుకొన్నవి. పరిపూర్ణ కళానుభవమే ఈ ఉద్యమంలోని వారి అసలు లక్ష్యం. ‘నవ్య సంప్రదాయ వాదులు ఆశించింది సాహిత్యాన్ని కళగా దర్శింపగల సౌందర్య దృష్టి; దానిని అనుశీలించి, అనుభవించగల ప్రామాణిక ప్రవృత్తి.’ (15).

కళానుభవాన్ని కాదని పాఠకులలో చైతన్యం కల్గించ గల్గిన రచన చేయ గల్గడం అనూహ్యం. ఐనా రచనకు సాహిత్య సిద్ధాంతాన్ని కాదనగల్గిన ‘మేధావులు’ ఉదయించారంటే అది విచిత్ర సన్నివేశమనే అనాలి. ‘దీన్ని వ్యతిరేకించి, సామాజిక చైతన్యాన్ని రసదర్శనంగా మార్చుకొనే సాహిత్య ప్రక్రియలను చేపట్టి, అపూర్వంగా నిర్వహించి నవ్య సంప్రదాయోద్యమాన్ని సాగించారు నవ్య సంప్రదాయ కవులు. నవ్య సంప్రదాయ కవులది నవ్య రసమార్గమనటం మరింత సమంజసం’ (16) అని, ఈ మార్గంలోని రచయితల సాహిత్య సిద్ధాంతాన్ని తేలుస్తారు సుబ్రహ్మణ్యం గారు. రస సిద్ధాంతం యొక్క ప్రభావం తొలిరోజులలో అభ్యుదయకవుల చేతనమీద కూడా ఎలా పడిందో ‘నవ్య సంప్రదాయోద్యమం: సాహిత్య విమర్శ’ అన్న వ్యాసంలో వీరు ఎత్తి చూపారు.

మొత్తం జాతీయోద్యమాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చిన అల్ప సంఖ్యాకుల ఉద్యమాన్ని కాదని, దాన్ని ఎదురొడ్డి నిలిచి దేశంలో నిర్మాణాత్మకమైన సాహిత్య సృష్టికి కారణమైన మహా సాహిత్యోద్యమాన్ని నడిపినవాడు విశ్వనాథ. ఆ మహారచయిత కేవలం రచయితగానే కాక ఒక సాహిత్యోద్యమకర్తగా ఎట్లా సాహిత్య చరిత్రను సృష్టించాడన్నది ఈ గ్రంథం యొక్క కేంద్రబిందువు. ‘జాతీయోద్యమ స్పృహ సాహిత్యోద్యమంగా రూపొందటమే సామాజిక సాహిత్య స్పృహగా నవ్య సంప్రదాయవాదులు భావిస్తారు’ (17) అన్న లక్షణం విశ్వనాథ వారి ప్రత్యక్షరంలోనూ కన్పిస్తుంది. ఒక మహా రచయిత ఒక మహా సాహిత్య పరంపరను పోషించి, పెంచి, కాపాడి, సాహిత్య స్రవంతిని పుష్టిపరిచినప్పటికీ, సాహిత్య ద్రోహం జరగనే జరిగి సాహిత్య చరిత్ర వక్రీకరింప బడింది. దీన్ని నిర్మూలించగలిగిన మేధాశక్తి, విశ్లేషణ, సత్య దర్శనం, పాండిత్యం, సాహిత్యానుభవం దండిగా ఉన్న మేధావి ఆచార్య జి.వి సుబ్రహ్మణ్యంగారు. ప్రౌడిమ, స్పష్టతా అన్న రెండు లక్షణాలు వీరి రచనల్లో ఉంటాయి. ‘పద్యము వ్రాయుట యెట్టిదో, ఒక వ్యాసము వ్రాసెడు శక్తియు నట్టిదే’ అని విశ్వనాథవారే అన్నారు. సుబ్రహ్మణ్యంగారి వ్యాసాలన్నింటిలో ఈ శక్తి తొణికిసలాడ్తున్నది. అంతేకాకుండా, వీరి వ్యాసాలన్నీ విజ్ఞానదాయకాలు. తోటి విమర్శకలకు జరిగిన అన్యాయాలను కూడా వీరి వ్యాసాలలో తొలగించడం మనం గమనించగల్గుతాము. ఈ వ్యాసాలన్నీ ఆంగ్లభాషలోకి కూడా అనువాదం కావాల్సి ఉన్నది. అప్పుడు కాని కూపస్థమండూకాల బోలు సిద్దాంతాల అసలు రంగు బైటపడదు. విమర్శకుడుగా, కళా తాత్త్వికుడుగా, తెలుగు సాహిత్య చరిత్ర వికాసాన్ని నిర్దిష్టంగా పరిశీలించిన ఆచార్య జి.వి సుబ్రహ్మణ్యం గారికి అరవయ్యేళ్ళంటే నమ్మదగినట్లుండదు. ఇంకా ఎంతో సాహిత్య సేవ వారు చేయాల్సి ఉన్నది. దానికి భగవాన్ సాయిరాముడు వారిని ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ, నమస్కరిస్తూ –

వీరభద్రయ్య

హైదరాబాదు,

1‌-9-1995

అథోజ్ఞాపికలు:

  1. కవిత్వము యొక్క ఉత్తమత్వము : సిద్ధాంత సంబంధము; జయంతి అక్టోబరు 1959. పుట 230, విశ్వనాథ అసంకలిత సాహిత్యం సం॥ ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య.
  2. జయంతి, నవంబర్, 1959 పై గ్రంథంలోనే. పు. 233
  3. పైదే. పు. 229
  4. చూడు – Theory of Literature, Rene Welleck and Austin Warren P. 264
  5. విశ్వనాథ అసంకలిత సాహిత్యం IV – పు 103.
  6. పైదే – పు 231
  7. ‘నవ్య సంప్రదాయ కవిత్వోద్యమం – విశ్వనాథ’ వ్యాసంలో. (తెలుగు అకాడమి ప్రచురణ)
  8. ‘వర్తమాన కవిత్వదర్శనం’ అన్న వ్యాసంలో (అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు – పు 90)
  9. ‘నవ్య సంప్రదాయ కవిత్యోద్యమం – విశ్వనాథ’ అన్న వ్యాసంలో. (తెలుగు అకాడమి ప్రచురణ)
  10. Theory of Literature P. 265
  11. Theory of Literature P. 265
  12. ‘విశ్వనాథ విమర్శ’ – వివేచన 14 వ సంచిక – పు 188
  13. చూడు – ‘అభ్యుదయవాదం : నవ్య సంప్రదాయవాదం’ వ్యాసం
  14. భావాభ్యుదయ నవ్య సంప్రదాయోద్యమాలను గురించి ఆచార్య కోవెల సంపత్కుమారాచార్యుల వారు మూడు చక్కని వ్యాసాలను ఈ తర్వాత ‘కవి – కవిస్వామ్యం’ అన్న గ్రంథంలో రాశారు. ఈ గ్రంథంలో సాహిత్య చరిత్రలో ఈ మూడు కవిత్వోద్యమాలపై సత్యదర్శనం ప్రారంభమైంది.
  15. ‘నవ్య సంప్రదాయవాదులు – తిప్పికొట్టిన దాడులు’ – అన్న వ్యాసంలో.
  16. ‘నవ్య సంప్రదాయవాదుల నవరససూక్తం’ – అన్న వ్యాసంలో.
  17. ‘నవ్య సంప్రదాయం: జాతీయ దృక్పథం’ – అన్న వ్యాసంలో.

– డాక్టర్ ముదిగొండ వీరభద్రయ్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here