సాయి భక్త శిఖామణులు: గోపాలరావు గుండు

0
12

[dropcap]గో[/dropcap]పాలరావు గుండు కోపర్గావ్‍లో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తుండేవాడు. బాబా భక్తుడైన శ్రీ నానాసాహెబ్ డెంగళేకు సన్నిహితుడు. డెంగళేకు చాలా కాలం సంతానం లేకపోతే మిత్రుల ప్రోద్బలం వలన శిరిడీకి వచ్చి శ్రీ సాయిని ప్రార్థించగా, శ్రీ సాయి అతనికి సంతానం అనుగ్రహించారు. నాటి నుండి డెంగళే శ్రీ సాయిని తన గురువుగా అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుచుకోసాగాడు.

గోపాలరావు గుండుకు కూడా మూడు వివాహాలు చేసుకున్నా సంతానం లేదు. డెంగలే అనుభవం విన్నాక ఆశతో శిరిడీ వచ్చి శ్రీ సాయిని కొడుకు కోసం ప్రార్థించాడు. సాయి అనుగ్రహం వలన అతనికి ఒక కుమారుడు జన్మించాడు. అతని ఆనందానికి అవధులు లేకపోయాయి. బాబా చూపిన ప్రేమకు కృతజ్ఞతగా శిధిలమైన మశీదును పునరుద్ధరించుదామన్న నిర్ణయం చేసుకున్నాడు. అందుకోసం రాళ్ళు, ఇతర సామగ్రిని కూడబెట్టసాగాడు. అయితే బాబా ఆ పని నానా సాహెబ్ చందోర్కర్‌కు అప్పగించారు.

అందుకు ఎంతగానో నిరాశ చెందిన గోపాలరావును బాబా పిలిచి శిరిడీలో వున్న శని, గణపతి, మహాదేవుని దేవాలయాలు మరమత్తు చేయించమని చెప్పారు. గోపాలరావు వెంటనే పని ప్రారంభించి పనులను అతి లాఘవంగా పూర్తిచేసాడు. శిరిడీలో వేపచెట్టు వద్ద వున్న గురు స్థానానికి కూడా మరమత్తులు చేయించాడు.

బాబా ఆశీస్సుల వలనే బిడ్డ కలిగాడన్న దృఢ నమ్మకంతో గోపాలరావు గుండు శిరిడీలో ఉరుసు ఉత్సవాన్ని ప్రారంభించాలని సంకల్పించి ఆ ఆలోచనను దాదా కోటే, తాత్యా కోటే పాటిల్‌కు తెలియజేసాడు. వారందరూ సమ్మతించడం వలన గోపాలరావు మిక్కిలి చొరవ తీసుకొని తత్సంబంధిత అనుమతులను సాధించి ఆ ఉత్సవాన్ని శ్రీరామన నవమి రోజున అత్యంత ఉత్సాహంతో, భక్తి శ్రద్ధలతో ప్రారంభించాడు.

తాను బ్రతికినంత కాలం బాబాను ఎంతో భక్తి శ్రద్ధలతో గోపాలరావు పూజించాడు. తనకు వున్న పరపతి ద్వారా బాబా లీలా విశేషాలను రాష్ట్రం నలుమూలలా ప్రచారం చేసాడు. తన మరణానంతరం తన ఇంటిని శిరిడీ సంస్థాన్‌కు కానుకగా ఇచ్చేటట్లు వీలునామా కూడా గోపాలరావు గుండు రాసేసాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here