సాయి భక్తాగ్రేసరుడు హరి సీతారాం దీక్షిత్

0
9

[dropcap]శ్రీ [/dropcap]శిరిడీ సాయినాథుల యొక్క భక్త జనావళిలో ముఖ్యులు శ్రీ హరి సీతారాం (కాకాసాహెబ్) దీక్షిత్. వీరు కట్టించిన దీక్షిత్ వాడా నాడు శిరిడీకి వచ్చే ఎందరో భక్తులకు ఆశ్రయం ఇచ్చింది. సాధారణ జీవితాన్ని ప్రారంభించిన దీక్షిత్, సాయి సహచర్యం వలన అధ్యాత్మికంగా ఎంతో ఉన్నతి సాధించి, సాయి కృపకు పాత్రుడై మోక్షం సాధించారు. ఆయన చరిత్రను ఇప్పుడు సంక్షిప్తంగా స్మరించుకుందాం.

మహారాష్ట్ర లోని ఖాండ్వా గ్రామంలో వడనగర బ్రాహ్మణ కుటుంబంలో 1864వ సంవత్సరంలో శ్రీ దీక్షిత్ జన్మించారు. ప్రాథమిక విద్యను ఖాండ్వా, హింగన్‌ఘాట్ గ్రామాలలో పూర్తి చెయ్యగా, నాగపూరులో మెట్రిక్ పూర్తి చేసారు. మొదట్లో లిటిల్ అండ్ కంపెనీలో న్యాయవాదిగా ఉద్యోగం చేసాక అనంతరం స్వంతంగా ప్రాక్టీస్ పెట్టుకున్నారు.

1909వ సంవత్సరంలో లోనావాలాకు ఒక కేసు విషయమై వెళ్ళగా అక్కడ తన స్నేహితుడైన నానా చందోర్కర్‌ను దీక్షిత్ కలిసారు. ఇద్దరూ కూర్చోని చిన్ననాటి సంగతులు ముచ్చటించుకుంటుండగా అయిదు సంవత్సరాల క్రితం దీక్షిత్ లండన్ వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు రైలు ఎక్కుతుండగా కింద పడి కాలికి గాయమైన సంగతి చెప్పారు.

లండన్‌లో పేరు మోసిన వైద్యులందరితోనూ ట్రీట్‌మెంట్ చేయించుకున్నా ప్రయోజనం కలగలేదు. అప్పుడు చందోర్కర్ దీక్షిత్ యొక్క అరోగ్య సమస్యకు పరిష్కారం కోసం తన సమర్థ సద్గురువైన శ్రీ సాయినాథుని వద్దకు వెళ్ళమని సలహా ఇచ్చారు. అనితర సాధ్యమైన రోగాలెన్నింటినో కేవలం తమ దయామృతమైన చూపులతో, చేతి స్పర్శతో నయం చేయగల అద్భుత, అసామాన్య సద్గురువు శ్రీ సాయి అని చందోర్కర్ తెలియజేసారు. మరియు శ్రీ సాయిదేవులు చేసిన ఇతర లీలలెన్నింటినో విశదపరిచారు. అన్నింటినీ విన్న దీక్షిత్‌కు శ్రీ సాయి మీద అపారమైన నమ్మకం కుదిరింది. వీలైనంత త్వరగా వెళ్ళి శ్రీ సాయి దర్శనం చేసుకొని కాలి కుంటితనం కంటే తన మనసు యొక్క కుంటితనాన్ని సరిచేయమని వేడుకుంటానని దృఢంగా చందోర్కర్‌తో దీక్షిత్ చెప్పారు.

ఇక సాయిలీలలను గమనించండి. తన వద్దకు రావాలని సంకల్పించిన భక్తులను పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు శ్రీ సాయియే అవసరమైన పరిస్థితులను కల్పించి శిరిడీకి తీసుకు వస్తారు. బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో పోటీ చేస్తున్న దీక్షిత్ ప్రచారం కోసం అహ్మద్‌నగర్‌లో కాకా సాహెబ్ మిరీకర్ ఇంటికి వెళ్ళారు. అదే సమయంలో శ్యామా మావగారు తన ఆరోగ్యం బాగా లేని కారణంగా ఒక్కసారి చూసి వెళ్ళమని శ్యామాకు టెలిగ్రాం ఇచ్చిన కారణంగా శ్యామా సాయి అనుమతితో అహ్మద్‌నగర్ వచ్చి మావగారి ఆరోగ్యం బాగుపడిందని తెలుసుకొని తిరిగి శిరిడీ ప్రయాణం కట్టాడు. అనుకోకుండా మిరీకర్ శ్యామాను కలుసుకోవడం వలన దీక్షిత్‌ను శ్యామాతో శిరిడీకి పంపించాలని నిర్ణయించారు.

ఆ రాత్రే శిరిడీకి ప్రయాణం అయ్యారు .ట్రెయిన్ అంతా కిక్కిరిసి వుంది. ఎక్కలేమేమోనని దీక్షిత్ ఆందోళన పడ్తుండగా ఆ ట్రెయిన్ యొక్క గార్డు దీక్షిత్ స్నేహితుడు. దీక్షిత్‌ను ప్లాట్‌ఫారంపై చూసి ఆనందంతో కౌగలించుకొని ఇద్దరినీ ఫస్ట్ క్లాస్‌లో కూర్చోబెట్టాడు. ఇద్దరూ సుఖంగా ప్రయాణం చేసి కోపర్‌గాంలో దిగారు. ఇదీ ఒక సాయీలీలే!

కోపర్‌గావ్‌లో చందోర్కర్ శిరీడీకి వెళ్ళడానికి సిద్ధంగా వున్నాడు. చిరకాలమిత్రులు మళ్ళీ కలుసుకొని ఆనందించారు. గోదావరిలో స్నానం చేసి శిరిడీ వెళ్ళి సాయినాథుని దర్శనం చేసుకున్నారు. సాయిని దర్శించగానే దీక్షిత్‌కు అలౌకిక ఆనందం కలిగింది. మనస్సులో చింతనలు, ఆందోళనలు మటుమాయం అయ్యాయి. “నీ కోసమే నేను శ్యామాను అహ్మద్‌నగర్ పంపించాను. ఇక్కడ హాయిగా విశ్రాంతి తీసుకో” అని సాయి చిరునవ్వుతో అనగా దీక్షిత్ మనస్సు ఆనందంతో ఉప్పొంగింది. ఆ రాత్రి బసకు వెళ్ళి అకారణంగా వెక్కి వెక్కి ఏడ్చాడు. మనసంతా తేలికైపోయినట్లనిపించింది.

నాటి నుండి శ్రీ సాయిని దీక్షిత్ అకుంఠిత దీక్షతో, అచంచలమైన విశ్వాసంతో సేవించనారంభించారు. సంవత్సరంలో ఎక్కువ రోజులు శిరిడీలో గడపసాగారు. అక్కడ నివాసం కోసం ఒక వాడా (భవంతి) ని కట్టి దానినే తన నివాస స్థలంగా చేసుకున్నారు. నిరంతరం సాయిని సేవించడం, ఆరాధించడమే తన జీవితాశయంగా చేసుకున్నారు.

శిరిడీలో వున్నంత కాలం దీక్షిత్‌కు కల్గిన అనుభవాలు లెక్కలేనివి. వాటిని వర్ణించాలంటే ఒక గ్రంథమే అవుతుంది. సాయికి దీక్షిత్ అంటే అపారమైన ప్రేమ. భోజనం చేసేటప్పుడు తన ప్రక్కనే కూర్చోబెట్టుకునేవారు. తరచుగా లంగడా కాకా అని ఆట పట్టిస్తుండేవారు. దీక్షిత్‌ను మేలిమి బంగారంగా సాయి అభివర్ణిస్తుండేవారు.

తన నిష్కల్మషమైన భక్తితో, సేవ, ఆరాధనతో, మంచి మనసుతో ఎందరికో సహాయ సహకారాలను అందించిన దీక్షిత్‌కు సాయి ఒక అపూర్వమైన వరం ఇచ్చారు. “నిన్ను అంత్య కాలంలో విమానంలో తీసుకుపోయి శాశ్వత మోక్షాన్ని ప్రసాదిస్తాను” అని సాయి ఒకసారి దీక్షిత్ తో పలికారు.

అన్న ప్రకారంగా 1926వ సంవత్సరంలో జులై 5వ తేదీన శిరిడీ నుండి హేమాద్రిపంత్‌తో కలిసి రైలులో ప్రయాణం చేస్తున్నారు దీక్షిత్. ఇద్దరూ సాయి గురించి లీలలను ముచ్చటించుకుంటుండగా సాయి యందే మనసు లగ్నం చేసిన దీక్షిత్ హఠాత్తుగా తన తలను హేమాద్రిపంత్ భుజంపై వాల్చి ఎటువంటి బాధ, ఆందొళన లేక  హాయిగా ప్రాణం విడిచారు. అనంతరం అనుపమానమైన, అతి దుర్లభమైన సాయి సాయుజ్యాన్ని, మోక్షాన్ని పొందారు దీక్షిత్.

భక్తి శ్రద్ధలతో, సహనం, విశ్వాసాలతో గురుదేవులను నమ్మి కొలిస్తే ఆ భక్తుల సర్వ బాధ్యతలను భగవంతుడు తీసుకొని ఇహ పర సౌఖ్యాలను ప్రసాదిస్తాడని ఆర్యోక్తి శ్రీ దీక్షిత్ విషయంలో రుజువయ్యింది.

సర్వం శ్రీ శిరిడీ సాయినాథ పాదారవిందార్పణ మస్తు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here