సైనికుడి భార్య

1
10

[కన్నడంలో మాలతి హెగడే గారు రచించిన ‘సావినాచె బదుకు’ అనే కథని తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

[dropcap]మ[/dropcap]బ్బుల మాటు నుండి ప్రసరిస్తూన్న తూరుపు అరుణ కిరణాలను ఆస్వాదిస్తూనే, ఇంటి ముంగిట నున్న చెత్త నూడ్చి నీళ్లు జల్లి, ముగ్గు పెట్టి, ఇల్లంతట్నీ శుభ్రం చేసి, పెరటి మొక్కలకి నీళ్లు చల్లి వచ్చేటప్పటికి కొంచం అలసట అయినట్లనిపించింది. స్నానం ముగించి, దేవుడి పూజ చేసి ఓ కప్పు కాఫీ కాచుకు తాగుతూ కూర్చున్నా. ‘ఉదయం ఎనిమిది. ఆ మబ్బుల చాటు నుండి సూర్యుడింకా బయట పడేటట్టు లేడు. పాపం ఆయనకి ఈ రోజు విసుగు పుట్టిందేమో!’ అని నాలో నేనే గొణుగుకుంటూ ఇల్లంతా ఓసారి కలయ జూసాను.. ఒంటరి జీవనం. ఏ పని ఎప్పుడు చేసుకుంటే ఆక్షేపించేవారు ఎవ్వరున్నారని?’ అని అనుకుంటూండగా రాఘవ్ గుర్తుకొచ్చాడు.

పడక గదిలో, నవ్వులు చిలకరిస్తూన్న రాఘవ్ ఫోటోను నా చీర చెంగుతో తుడిచాను. కండలు తిరిగిన శరీరం. సమయ పాలనా సాకార మూర్తి అయిన గడి ప్రదేశపు యుద్ధ సైనికుడు. ప్రతి చర్యలోనూ ఆయన క్రమశిక్షణ ఉట్టిపడేది. ఆయనే ఉండి వుంటే నేనిలా ఎందుకు ఉండేదాన్ని? జ్ఞాపకాల దొంతరలు విచ్చుకున్నాయి.

***

“అబ్బాయిది గవర్నమెంట్ ఉద్యోగం, మన శోభను వారికిచ్చి కళ్యాణం జరిపించేద్దామా?” అని నాన్న అమ్మతోటి సంప్రదించినవుడు నాకింకా పదహారే.

“ఉన్న ఒక్కగాని ఒక్క పిల్లని సైన్యంలో వారి కిచ్చి చేయాలా పెళ్లి! తుపాకీని ఎదపైన చేర్చి చేసే ఉద్యోగం కూడా ఓ ఉద్యోగమే” అన్న అమ్మ వ్యతిరేకత హారతి కర్పూరంలా కరిగి పోయింది.

“ఏం! ఎందుకు కాదు? దేశ సేవ చేసే భాగ్యం అందరికీ దక్కేనా” అనే నాన్నగారి నిర్ధారణ గట్టిగా నిల్చిపోయింది.

“ఇంకా నే చదవాలి” అని అనాలనుకునే నామాట గొంతు దాకా వచ్చి ఆగిపోయింది. రాఘవ్ ఆకారం కళ్ల ముందు నిల్చింది. ఎన్నెన్నో కలలని పూమాలగా చేసి రాఘవ్ మెడనలంకరించాను, సైనికుడి భార్యనయ్యాను.

పెళ్లయి ఒక నెల అయినా కాకనే దూరంగా ఉన్న ఢిల్లీకి తీసుకెళ్లాడు రాఘవ నన్ను. ఆయన వెచ్చని అనురాగపు కౌగిళ్లలో ఇమిడిపోయి, ఇష్టసతినై పోయాను. అంత బాగా వంట చేయ చేతకాని నాకు నన్ను, తన ప్రియమైన మాటల్తో ప్రోత్సహించి నన్నో గృహిణిగా తీర్చిదిద్దాడు. ఇంగ్లీషులో మాట్లాడం నేర్పించాడు. బ్యాంక్ వ్యవహారాలని తెల్సుకుని, ఒoటరిగా వెళ్లి ఇంటికి కావాల్సిన వెచ్చాలు మార్కెట్ నుంచి తీసుకు రావటం నేర్పించాడు. రోజులు క్షణంగా గడిచి పోయాయి. పుట్టిన కుమార్తెకు ‘ఖుషి’ అని నామకరణం చేశాము.

***

రాఘవకి, ఖుషికి చిక్కిన సెలవుల్లో ముగ్గురం కల్సి ‘నవలగుంద’కు వచ్చాము. వచ్చి పదిహేను రోజులైనా అవలేదు, అప్పుడే బార్డర్‌లో యుద్ధం ప్రారంభమయ్యింది. తిరిగి రావాల్సిందిగా రాఘవకి తాఖీదు. కళకళ పడ్డాను. “నీవు సైనికుడి భార్యవు. అన్నింటినీ తట్టుకునే సామర్థ్యం నీకుండాలి. విజయంతో తిరిగి వస్తాను. అప్పుడు నీవు విజయ మాలతో నాకెదురొచ్చి, నా మెడనలంకరించి ఆరతి ఇవ్వాలి,” అని నన్ను సమాధానపరచి వెళ్లిపోయాడు రాఘవ్. యుద్ధం గెల్చింది సత్యమే. అయితే ఆ విజయోత్సాహంలో పాలు పంచుకోలేని విధంగా రాఘవ్ వీరమరణం నా చెవుల బడింది. నా రాఘవ్ పన్నెండు మంది శత్రువులతో ఒంటరిగా పోరాడి, ఏ ఒక్క శత్రు సెనికుణ్ణి నాలుగడుగులు ముందుకు రానివ్వకుండా అందరినీ వెనకడుగు వేయిస్తూండగా, పొంచి వున్న శత్రు సైనికుడొకరు పేల్చిన తూపాకీ గుండుకు గురై, రక్తంతో తడిసి పోతున్నా, ‘భారత్ మాతాకీ జై’ అంటూనే నేలకొరిగారు. కొఱప్రాణంతో వుండగా, ప్రాణాలు కాపాడటానికి రక్షణ సిబ్బంది రాఘవ్‍ని ఆంబులెన్స్ లోకి చేరవేస్తూండగానే “నన్నెలాగైనా బ్రతికించండి. యుక్త వయసులో ఉన్న భార్య ఉంది, పసిపాప ఉంది” అని అన్నాడట. ఆస్పత్రికికి తరలిస్తూండగానే కొనయూపిరి పీల్చాడట. ‘భారతమాత రక్షణ కోసం వీర మరణం పొందాడు’ ..ఈ మాటలు చెవినబడుతూండేవి. మనసు, బుద్ధీ అన్నీ శూన్యమై పోయాయి. నా సుఖ సంసారానికి అశనిపాతమయ్యింది. కన్నీరొక్కటే నాకు మిగిలింది.

రాఘవ్ మరణ వార్త విని ఊరు ఊరంతా కన్నీరు పెట్టింది. ఎంతోమంది వచ్చి నన్ను సముదాయించారు. సకల ప్రభుత్వ మర్యాదలతో రాఘవని మట్టి చేశారు. నా వైధవ్యానికి అందరూ కన్నీళ్లు పెట్టారు. ‘వీర వనిత’ అని కొనియాడారు నన్ను. ఎంతో కాలమైన తర్వాత వచ్చింది ప్రభుత్వం నుంచి పరిహారధనం ఇరవై లక్షలు.

ప్రతినిత్యం ఇంట్లో యుద్ధం ప్రారంభమయ్యింది నాకూ మా అత్తమామలకు మధ్య – ఆ వచ్చిన పరిహారాధనంతో తమకూ భాగం కావాలని. వాళ్లు ఆశించిన దానిలో తప్పు లేకపోయినా “నీ కాలు గుణం బాగుండినట్టయితే మా కొడుకు యుద్ధంలో చనిపోయేవాడా.. ప్రొద్దునే నీ పాడు ముఖం చూడాల్పి వస్తూంది.. ఛీ” అని అన్న తీరు అసహ్యంగా ఉండేది. ఏభై ఏళ్ల వయసు వచ్చిన తమకంటే, కోడలికీ, మనమరాలకి డబ్బు ఆవశ్యకత ఎక్కువగా వుంటుందనే ఆలోచన వారికి రాకపోయింది.

‘చాలు నాకీ బదుకు’ అనే స్వాతంత్ర్యం నాకు లేదు. ‘అమ్మా’ అంటూ కొంగు పట్టుకు తిరిగే కూతురుంది నాకు. “నాన్న ఇంకెప్పుడూ తిరిగే రారా అమ్మా” అని ఎన్నోసార్లు ప్రశ్నించినపుడు నా కళ్లల్లో నీళ్లు తిరిగేవే తప్ప జవాబు వచ్చేది కాదు. ఢిల్లీ సెంట్రల్ స్కూల్ నుంచి ‘నవలగుంద’ లో ఉన్న గవర్నమెంట్ స్కూల్‍లో ఖుషిని చేర్చవలసి వచ్చింది. ఎందుకీ మార్పు అనేది ఖుషీకి అర్థం కాలేదు.

‘కూతుర్ని బాగా చదివించాలి’ అని కలలు కంటూ వుండిన రాఘవ్ కలలు నిజమయ్యేదెలా ఈ పరిస్థితుల్లో! భగవంతుడా! ఏ నేరం చేసినందుకు నాకీ శిక్ష? శ్రావణ మాస సమయంలో నన్నెవ్వరూ పేరంటానికి పిలిచేవాళ్ళు కాదు. హత్య చేసిన వారికి యావజ్జీవ కారాగార శిక్ష. అయితే ఏ నేరమూ చేయని ఈ విధవకు ఎందుకీ శిక్ష? నే పడుతున్న ఈ వేదన చాలదన్నట్టు, ‘భర్త తమ్ముళ్ల’ కళ్ళు నా పరిహార ధనం పైనా, నా యవ్వనం పైనా పడ్డాయి. ఓర్పు నశించింది. ఓ రోజు దాచిపెట్టిన నల్లపూసల సరాన్ని మెళ్లో వేసుకొసి, కట్టు బట్టతో, కూతుర్ని వెంటబెట్టుకొని, రాఘవ్ స్నేహితుడైన ‘దేవప్ప’ ఇల్లు చేరుకున్నా. నేను వివరించి చెప్పకపోయినా, నేను అపాయంలోనున్నానని గ్రహించి, భయంతో వణికిపోతున్న నాకు ధైర్యం నూరిపోసి, గుట్టుగా నా పుట్టిల్లు శిరహట్టికి పంపించేశారు.

***

కూతురు వైధవ్య వాస్తవాన్ని జీర్ణించుకోలేక అమ్మ కుమిలి కుమిలి ఏడుస్తూ, కొన్నాళ్లకి మంచం పట్టి, 2 నెలల తర్వాత కాలం చేసింది. వృద్ధుడైన మా నాన్న అసహాయుడే అయ్యాడు. సాంత్వనం చెప్పాల్సిన వదినమ్మ “ఇదొకటి భారం.. భర్తను మింగింది.. ఈ ఇంటికొచ్చింది. ఇంకేం కానుందో ఈ ఇంట్లో” అని సూటిపోటి మాటలు అనడం ప్రారంభించింది. నా బ్యాంక్ అకౌంట్‍లో పరిహారాధనం వుందని తెల్సిన మరుక్షణం నుండి మాటి మాటికీ డబ్బు కోసం ఒత్తిడి ప్రారంభించింది. ఈ ఊరి స్కూల్ పరిస్థితులకు కూతురు పొందుకోలేక పోయింది.

ఒక నిర్ధారణకు వచ్చా. “అన్నయ్యా ధారవాడలో ఓ అద్దె ఇంటిని చూసిపెట్టు. నేనక్కడే వుండే కూతుర్ని సెంట్రల్ స్కూల్లో చదివిస్తా” అన్నా. తన భార్యను తీర్చటానికన్నా ఇదే నయమనిపించి అన్నయ్య అక్కడ అద్దె ఇంటిని ఖరారు చేసి మా ఇద్దర్నీ అక్కడ దింపి వెళ్లిపోయాడు.

తల్లి, కూతుళ్ల సంసారం ప్రారంభమయ్యింది. ఇరుగు పొరుగు వారి సహాయం అన్నింటా లభించింది. చిన్న తరగతుల పిల్లలకి ట్యూషన్లు ప్రారంభించా. కూతురు, కొత్త బడి పరిస్థితులకి అనుగుణంగా మారిపోయింది. రాఘవ్ అమ్మా నాన్నలకి మేమున్న ఇంటి విలాసం తెలిసి పోయింది. “ఎందుకు ఇల్లు విడిచి వచ్చావు? ఎలాగున్నావు?” అనే పలకరింపులు పోయి, మరలా డబ్బు అడిగేందుకు వచ్చి పీడించసాగారు. వీళ్ల పీడ విరగడైతే చాలునని, కొంత డబ్బిచ్చి, మళ్లీ నా వైపు కన్నెత్తి చూడకండి, అని చెప్ప సాగనంపాను. దేశసేన కోసం ప్రాణత్యాగం చేసిన కుమారుణ్ణి ఎంత త్వరగా మరచి పోగలిగారు వీరు!

***

కాలం దొర్లిపోయింది. ఇల్లు కొన్నా. ఆ ఇంటి పెరట్లో, అమ్మాయి ఖుషీతో కలసి పూలు కూరగాయలు పెంచాం. కూతురు చదువులో రాణిస్తూంది. మెట్టుమెట్టుగా ఎదుగుతూ ఎం.బి.బి.యస్ పూర్తి చేసి బెంగుళూర్లో ఓ ప్రముఖ ఆస్పత్రిలో ఉద్యోగం సంపాదించుకుంది.

***

మొబైల్ ఫోన్ రింగ్ అయ్యింది. “అమ్మా! ఎలాగున్నావే” కూతురు ఖుషి.

“ఒక్కతివె వుండి నీకు బోర్ కొడుతూ వుంటుంది కదూ. నీవు కూడా వచ్చి నాతోటే వుండమ్మా అంటే నీవు వినడం లేదు” అంది నిష్ఠురంగా.

“నేను అక్కడికొచ్చి ఏం చేసేదే? ఆస్పత్రి పనికి నీవు వెళ్ళాక అక్కడ కూడా నే ఒంటరిదాన్నే కదా. ఆ సిటీ జీవనానికి పొందుకొని ఉండలేనే తల్లీ. నాకిక్కడ సుఖంగానే ఉంది.” అన్నా.

“అమ్మా! మిలిటరీ ఆస్పత్రిలో సేవ చేయడానిక డాక్టర్లని ఎప్పాయింట్ చేసుకుంటున్నారు. నేనెలాగూ యం.డి.ఎ. పాసయ్యాను కదా. అక్కడ ఉద్యోగం చిక్కితే వెళ్ళనా? అయితే బెంగుళూరు నుండి ఢిల్లీకో, రాజస్థాన్‌కో వెళ్లాల్సి ఉంటుంది” అని అంది.

సరైన సమయంలో చికిత్స దొరకక వీరమరణం పొందిన రాఘవ్ గుర్తుకొచ్చి కళ్లు ఆర్ద్రమయ్యాయి. ఒక క్షణమైనా దాని బాగోగుల గురించి ఆలోచించక “మీ నాన్నగారిని రక్షించుకోలేక పోయాము. అయితే అట్లాంటి సైనికులకు జీవదానం చేసే అవకాశం వస్తే వెళ్ళమ్మా తల్లీ”.. అన్నా.

“నాకూ అలానే అనిపిస్తూంది. అయితే నీవు ఒప్పుకోవేమో అనుకుంటూ వుండేదాన్ని. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా వుంది. నీవు నాతోడుగా వస్తావా అమ్మా!”

“లేదు. నేను ఈ ఉళ్లోనే ఉంటాను.”

“ఒక్కత్తివే వుండి ఏం చేస్తావమ్మా?”

“మనం అప్పుడప్పుడు కొన్న పుస్తకాలన్నింటినీ ఇంటి ముందు బుక్ షెల్ఫ్ ఉంచి ఓ చిన్న లైబ్రరీ లాంటి దాన్ని చేస్తా. దానికి ‘రాఘవ్ మినీ లైబ్రరీ’ అని పేరు పెడ్తా. ఎవరైనా సరే సాయంకాలం వచ్చి పుస్తకాలను చదువవచ్చునని అందరికే తెలియజేస్తాను. చుట్టుముట్టూ వున్న నా లాంటి స్త్రీలను కలసి ‘వీర వనితల సంఘం’ అనే సంఘాన్ని ఏర్పాటు చేస్తా. నా లాగా వైదవ్యాన్ని అనుభవిస్తూ కష్టాలలో ఉన్నవారికి ధైర్యం నూరిపోస్తా. వీరవనిత అనే పదానికి జీవం పోస్తా. నీకు పిల్లలు పుట్టాకా నా మనుమలు, మనుమరాళ్ళను పెంచి వాళ్ళ బాగోగులు చూస్తా.” అన్నా.

“అమ్మా! యు ఆర్ సింప్లీ గ్రేట్. అల్లాగే చెయ్యి. ప్రస్తుతానికి కొన్ని పుస్తకాలని నీ లైబ్రరీకి పంపిస్తున్నా” అని అంది.

ఫోటోలోని రాఘవ్ సంతోషంతో నవ్వుతున్నాడు.

సమాప్తం

కన్నడ మూలం: మాలతి హెగడే

అనువాదం: కల్లూరు జానకిరామరావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here