సజీవ సహజ చిత్రీకరణలో సిద్ధహస్తులు ఆర్.కె. నారాయణ్

0
10

[అక్టోబర్ 10 భారతీయ ఆంగ్ల సాహిత్య దిగ్గజ౦ ఆర్.కె. నారాయణ్ జయంతి సందర్భంగా వారి మొట్ట మొదటి నవల ‘స్వామి అండ్ ఫ్రెండ్స్’ గురించి, ఆయన రచించిన కొన్ని కథల ఆధారంగా నిర్మించిన ‘మాల్గుడి డేస్’ టెలీ సీరియల్ గురించి రాసిన ఈ రచనను నివాళిగా సమర్పిస్తున్నారు అనుకృతి.]

ఆర్.కె. నారాయణ్

[dropcap]ఆర్.[/dropcap]కె. నారాయణ్ పూర్తి పేరు రాశీపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణ స్వామి. వీరు 10 అక్టోబర్ 1906 నాడు జన్మించారు. 13 మే 2001న మరణించారు. ఆయన రచనలన్నిటికీ, కేంద్ర బిందువు ఆయన సృష్టించిన ‘మాల్గుడి’ అనే ఊహాజనిత పట్టణమే.

చిత్రంగా నారాయణ్ మొదటి నవల – ఆయన చిరకాల మిత్రుడు, ఇంగీష్ రచయిత గ్రాహం గ్రీన్ సహాయంతో ఇంగ్లాండ్‌లో ప్రచురితమైంది. ‘స్వామి అండ్ ఫ్రెండ్స్’ ఆయన మొదటి నవల. ‘ది బాచిలర్ అఫ్ ఆర్ట్స్’, ‘ది ఇంగ్లీష్ టీచర్’ ఈ మూడూ ఆయన జీవితాన్ని చాలా వరకు పోలికలు కలిగి ఉంటాయి. నారాయణ్ మొట్ట మొదటి సారిగా ‘మాల్గుడి’ని పరిచయం చేసింది 1935లో ప్రచురితమైన ‘స్వామి అండ్ ఫ్రెండ్స్’లో.

నారాయణ్ రచనా పటిమను విలియం ఫాల్కనీర్‌తో పోలుస్తారు. విలియం కూడా ఒక ఊహాజనిత టౌన్ చుట్టూ సాధారణ మనుషుల లోని అన్నిరకాల ఉద్వేగాలను, జీవన సరళిని చూపిస్తాడు (Yoknapatawpha County – A fictional county created by American author William Faulkner). నారాయణ్ లెక్కలేనన్ని అవార్డులు పొందారు. భారత ప్రభుత్వం ఆయనను పద్మ భూషణ్, పద్మ విభూషణ్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో సత్కరించింది. ఆయన రాజ్యసభ సభ్యుడు కూడా. ఇంకా లండన్‍కి చెందిన రాయల్ సొసైటీ అఫ్ లిటరేచర్ వారు అందించే బెన్సన్ మెడల్ – లాంటి అరుదైన గౌరవాలు పొందారు.

నారాయణ్ ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి హెడ్‌మాస్టర్. ఎనిమిది మంది సంతానంలో నారాయణ్ రెండవ వారు. ఆఖరి వారు ఆర్.కె. లక్ష్మణ్. ఈయన ప్రముఖ కార్టూనిస్ట్, రచయిత కూడా. నారాయణ్ అన్ని రచనలకీ ఆయన తమ్ముడే చిత్రాలు గీసేవారు. ఆర్.కె. లక్ష్మణ్ కూడా పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత. నారాయణ్ లాగానే ఆయన కూడా లెక్కలేనన్ని అవార్డులు పొందారు. తండ్రికి తరచూ బదిలీలు అవుతుందటంతో ఆయన ఎక్కువగా తన ఆమ్మమ్మ పార్వతి దగ్గర స్వేచ్ఛగా పెరిగారు. ఆవిడ నారాయణ్‌కు సంగీతం, లెక్కలు, రామాయణం, మహాభారతంల గురించి చెప్పేవారు. ఆమె ఆయన ప్రథమ గురువు, అక్కడే ఆయన ఒక కోతి, ఒక నెమలి స్నేహితులుగా వెంటేసుకొని తిరుగుతుండేవారు. బాల్యంలో ఆయన ముద్దు పేరు ‘కుంజప్ప’.

నారాయణ్‌కి చదువు మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు. ఆయన డిగ్రీ సాధించటానికి నాలుగేళ్లు పట్టింది. కానీ ఆయన సాహిత్యాన్ని విపరీతంగా చదివేవారు. ఆయన చాలా కొద్దీ కాలం టీచర్‌గా పనిచేసి, తర్వాత ఆ ఉద్యోగం వదిలేసి పూర్తిగా రచనా వ్యాసంగాన్ని జీవిత లక్ష్య౦గా ఎంచుకొన్నారు. ‘స్వామి అండ్ ఫ్రెండ్స్’ ఆయన మొదటి నవల, ‘మాల్గుడి’ అనే చిన్న టౌన్ సృష్టి ఈ నవల లోనే మొదలయ్యింది.

1933లో ఆయన అక్క ఇంటికి కోయంబత్తూరు వెళ్ళినప్పుడు రాజం అనే అందమైన 16 ఏళ్ళ బాలిక ప్రేమలో పడి, అందర్నీ ఒప్పించి ఆమెను వివాహమాడారు. రాజం 1939లో టైఫాయిడ్‌తో మరణించారు, అప్పటికి ఆయనకు హైమ అనే మూడేళ్ళ కూతురు వున్నది. రాజం మరణాన్ని నారాయణ్ తట్టుకోలేక పోయారు. ఆ ఆరేళ్ళ వైవాహిక జీవితం ముగిసి పోయింది. ఆయన పునర్వివాహం చేసుకోలేదు.

నారాయణ్, ఆయన సతీమణి రాజం

నారాయణ్ రచనలలో మరొక ప్రత్యేకత వుంది. కొన్ని భారతీయ భాషలలోని పదాలను, తన రచనలలో సంస్కృత, హిందీ, ఉర్దూ, తమిళ్ పదాలను వాడేవారు, వాటిని ఏ మాత్ర౦ మార్చకుండా వాడేవారు. ఇంగ్లీష్ లోకి మారిస్తే వాటి ప్రత్యేకతను కోల్పోతాయని ఆయన భావించేవారు. ఆయన రచనా శైలీ, భాష ఎంతో సరళంగా ఉంటుంది. ఉదాహరణకి లుంగీ, ధోతీ, జిలేబి, వడ, ఇడ్లీ, సాంబార్, pyol, వరండా, ధోభీ, పైజామా, జట్కా, బీడీ లాంటి పదాలు. వాటి అర్థం తెలియని వాళ్ళు Oxford డిక్షనరీ చూసుకోవాల్సిందే.

ఆర్.కె. నారాయణ్ 11 నవలలు, 400 పైగా షార్ట్ స్టోరీస్ రాశారు. లబ్ధప్రతిష్ఠుడైన రచయితగా తన అంతరంగాన్ని ఆయన ఈ విధంగా ఆవిష్కరించారు. “నేను రచయితగా అత్యంత విలువ నిచ్చేది మానవ సంబంధాలకు. సవ్యమైన మానవ సంబంధాలు జీవితాలను సుసంపన్నం చేస్తాయి. ఇంటా, బయట కూడా అవి సవ్యమైనవిగా ఉంటేనే, ఈ ప్రపంచంలో మన ఉనికి అర్థవంతంగా మారుతుంది. ఇదే వ్యూపాయింట్‌తో, నా ఫిలాసఫీని నా రచనలలో విజయవంతంగా అనుసరించాను” అని చెబుతారు.

(I value human relations very much. Very intensely, it makes one’s existence worthwhile. Human relationship in any and any form whether at home or outside, I have expressed this philosophy in my work successfully.)

ఆర్.కె. నారాయణ్ సజీవ సహజ చిత్రీకరణలో సిద్ధహస్తులు. ఆయన రచనలోని పాత్రలకు ఒక కాలానికి, ఒక ప్రాంతానికి చెందివినవిగా వుండవు. అవి భారతీయ జీవన శైలిని, జీవన చిత్రాన్నీ, ముఖ్యంగా మధ్య తరగతి జీవితాలను ప్రతిబింబిస్తాయి. అత్యంత అద్భుతమైన విషయం ఏమిటంటే, ఆయన రచనలన్నిటిలోనూ ‘మాల్గుడి’ కేంద్రబిందువైనా, అవి సార్వజనీకమై ప్రపంచ ఖ్యాతిని పొందినవి. మాల్గుడినీ, ఆయన రచనలను విడదీసి చూడలేము. భారతీయ జీవనానికి మాల్గుడి ప్రతీక. నిజానికి మాల్గుడి ఊహాజనిత పట్టణం కానీ, అది ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందంటే, విదేశీ పర్యాటకులు ఇండియా వచ్చినప్పుడు “where is Malgudi?” అని అడిగేవారట. ఆశావహ దృక్పథం, అంతర్లీనంగా వుండే సునిశిత హాస్యం ఆయన రచనలని ఎంతో ఆసక్తికరంగా చదివింప చేస్తాయి. ఇదే నారాయణ్ ‘కామిక్ స్పిరిట్’.

థామస్ హార్డీ అనే ఆంగ్ల రచయిత నారాయణ్ ప్రతిభ గురించి చెబుతూ, “ఒక రచయితకు ప్రపంచం గురించి విస్తృతంగా తెలిసినా తక్కువ అవగాహనతో చేసే రచనలకంటే, చిన్న ప్రపంచం గురించి ఎక్కువ అవగాహనతో రాసేవాడే గొప్ప రచయిత” అని అంటారు.

(it is better for a writer to know a little of the world remarkably well than to know a great part of the world remarkably little, (Thomas Hardy 1955)

ఈ సందర్బంగా నారాయణ్ మొదటి నవల ‘స్వామి అండ్ ఫ్రెండ్స్’ గురించి ‘మాల్గుడి డేస్’ శీర్షికన వచ్చిన స్వామి అండ్ ఫ్రెండ్స్ టెలీ సీరియల్ గురించి ప్రస్తావిస్తాను.

‘మాల్గుడి డేస్’ సిరీస్ దూరదర్శన్ ద్వారా ప్రసారం చేయబడి అల్ టైం సూపర్ హిట్ సీరియల్‌గా విజయవంతమైంది.

నారాయణ్ రచనలన్నీ ఇంగ్లీష్‌లో రాశారు.

రాసిన నారాయణ్ తమిళుడు.

సీరియల్‌లో వాడిన భాష హిందీ,

తీసిన డైరెక్టర్ శంకర్ నాగ్ కన్నడిగ,

కథా నేపథ్యం తమిళ సంస్కృతితో కూడిన ప్రాంతం, ప్రజల జీవన శైలి, పాత్రలకు జీవం పోసింది సగానికి పైగా హిందీ, కన్నడ నాటక రంగానికి చెందినవారు.

చిత్రీకరణ అంతా కర్ణాటక ప్రాంతానికి చెందిన ‘ఆగుంబె’ అనే చిన్న వూరిలో జరిగింది. 1984లో ఈ సీరీస్ తీసేనాటికి స్వతంత్ర భారతిగా మారి దాదాపు నలభై ఏళ్ళు. కథ రాసిన కాలం బ్రిటిష్ ఇండియాది. అయినా అప్పటి కథాకాలాన్ని సృష్టించగలిగారు డైరెక్టర్ శంకర్ నాగ్.

1984లో ప్రసారమైన ఈ సీరియల్ అత్యంత ప్రజాదరణ పొందింది. చిన్న పిల్లలు స్వామిని ఇష్టపడితే, పెద్దవాళ్ళు అద్భుతమైన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ‘స్వామి అండ్ ఫ్రెండ్స్’ సీరియల్‌లో జ్ఞాపకాల ఊయలలో వూగారు. మరో అద్భుతమైన విషయం ఏమిటంటే నేపధ్య సంగీతమంతా ఒక్క flute తో స్వరపరిచారు. వైద్యనాథన్ సంగీతం ముఖ్య౦గా టైటిల్ స్కోర్ ‘తా న న తన న న నా’ అంటూ వీక్షకులని టివి సెట్ ముందుకు లాక్కుని వచ్చేది. ఆ నేపథ్య సంగీతం తొలకరి వర్షపు పులకింతలా ఉండేది. ఈ సీరియల్ ప్రతి ఆదివారం ప్రసారమయ్యేది. మనుషుల జీవితాలలోని అసంతృప్తినీ, బాధలనీ, పోరాటాలనీ మర్చిపోయేలా చేసేది ఈ సీరియల్. శంకర్ నాగ్ ఈ సీరీస్ ఎంత అద్భుతంగా మలిచారంటే, తాను తప్ప ఇంకెవ్వరూ ఆర్.కె. నారాయణ్ కథలకు దృశ్య రూపం ఇవ్వలేరు అనేంతగా. ఏకంగా ‘మాల్గుడి’ టౌన్‌ని సృష్టించగలిగారు. ఆఖరికి మాల్గుడి బస్సు కూడా ఆ కాలానిదే. పాత్రల చిత్రీకరణ, ఆహార్యం, నటీనటుల ఎంపిక, నారాయణ్ ఊహకు, సజీవ రూపకల్పన చేశారు డైరెక్టర్ శంకర్ నాగ్. స్వామి తండ్రిగా వేసిన గిరీష్ కర్నాడ్ నటన గురించి ఏం చెప్పగలం?

మాల్గుడిలో సృష్టించబడిన పోస్ట్ ఆఫీస్, టౌన్ హాల్, పార్క్, రైల్వే స్టేషన్, కిరాణా షాప్, స్వీట్ షాప్, బెంగాల్ హెయిర్ కటింగ్ సలోన్, రకరకాల తినుబండారాలు, వస్తువులు, అమ్మేవారు, సరయు నది అన్నీ మన దేశంలో ప్రతి చిన్న టౌన్‌లో దర్శనమిచ్చేవే. మాల్గుడి ప్రజల జీవనం లోని నిరాడంబరత కొన్ని తరాలవరకు ప్రభావితం చేస్తుందని అభిప్రాయపడ్డారు గ్రాహం గ్రీన్. టి. యస్. నరసింహన్ ఈ సీరియల్‌కి నిర్మాత. ‘మాల్గుడి’ని ‘the microcosm of India’ అని అంటారు. అంటే భారతీయ జీవనానికి ఒక సూక్ష్మ రూపమని భావన.

శంకర్ నాగ్ భార్య అరుంధతి నాగ్ ఈ సిరీస్‌కి సంభాషణల్ని సమకూర్చారు. అరుంధతి ఒక పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో, “ఆగుంబె చాలా ఎతైన ప్రదేశం, చిన్నారి కావ్యతో కలిసి సీరియల్ క్రూ టీం, యాక్టర్స్ ఆ వూళ్ళో వున్న ప్రతి అడుగుని, వరండాలనీ ఆక్రమించాం” అని గుర్తు చేసుకున్నారు. ఒక ఎపిసోడ్‌లో గాడిదలు కావాల్సి వస్తే ఎత్తయిన ప్రదేశంలో వున్నా, బండిలో తీసుకువచ్చారట. మరో కథలో ఏనుగుని పెద్ద లారీలో ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి తీసుకొచ్చి చిత్రీకరించారట. యూనిట్ లోని ప్రతి ఒక్కరు ఎంతో శ్రద్ధతో పనిచేశారని అరుంధతి నాగ్ అభిప్రాయపడ్డారు. శంకర్ నాగ్ మధ్య తరగతి నేపథ్యంలో పెరిగిన వ్యక్తి, ఆ తరగతి వాళ్ళ ఆశలు, ఆశయాలు, ఎమోషన్స్ ఆయనకు చిరపరిచితం. అందుకే మాల్గుడిని భౌతికంగా సృష్టించగలిగారని, మాల్గుడి ఆత్మని అంతర్లీనంగా పట్టుకోగలిగారని, నారాయణ్ కామిక్ స్పిరిట్‌ని, సునిశిత హాస్యాన్ని పాత్రల చిత్రీకరణలో విజయవంతంగా ప్రదర్శించగలిగారని విమర్శకులు అంటారు. ఒక కార్ ఆక్సిడెంట్‌లో శంకర్ నాగ్ మరణంతో తర్వాత మాల్గుడి సీరీస్ తీసిన కవిత లంకేశ్ చిత్రీకరణలో ఇవి లోపించాయని అంటారు.

R. K. Narayan Museum, Mysore

స్వామినాథన్ పాత్రకు మంజునాథ్ పూర్తి న్యాయం చేకూర్చి, అనేక ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్నాడు. స్వామి పాత్ర ఒక రకంగా బాల్యంలో ఆర్.కె. నారాయణ్‌కి ప్రతిరూపమే. Woodlands హోటల్‌లో success ఫంక్షన్ జరిగినప్పుడు నారాయణ్ మంజునాథ్‌ని ఈ విధంగా కామెంట్ చేశారట, “Manju, you acted exactly as I imagined Swami to be”. తనకు వచ్చిన నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ కంటే నారాయణ్ కామెంట్ తన జీవితం లోనే అత్యంత విలువైన అవార్డుగా భావిస్తానని మాస్టర్ మంజునాథ్ ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయం వెలిబుచ్చాడు.

మాల్గుడి డేస్ చిత్రీకరణ జరుగుతున్నప్పుడు ఆర్.కె. నారాయణ్ తరచు వచ్చి తన అభిప్రాయాలను, మార్పులను, చేర్పులను సూచిస్తే శంకర్ నాగ్ ఎంతో గౌరవంతో వాటిని పాటించేవారట, కానీ ‘ది గైడ్’ సినిమా చిత్రీకరణలో నారాయణ్ అభిప్రాయాలను డైరెక్టర్ ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదని నారాయణ్ చాలా బాధపడేవారుట. మంజునాథ్‍కు హిందీ రాదు కానీ అతను తన పాత్రను, భాషనీ ఎంతో అర్థవంతంగా పోషించాడు. సిరీస్ మొత్తం ఇంగ్లీష్, హిందీలలో ఒకేసారి నిర్మించారు.

విచిత్రమైన విషయమేమంటే అసలు మంజు ఆర్.కె. నారాయణ రచనలనేవీ చదవలేదుట, ‘స్వామి అండ్ ఫ్రెండ్స్’ నవలని కూడా చదవలేదుట. చదివుంటే మంజు స్ట్రెస్ ఫీల్ అయేవాడేమో అంటారు విమర్శకులు.

ప్రముఖ పాత్రికేయుడు, రచయిత కుష్వంత్ సింగ్ నారాయణ్‍కు నివాళులు అర్పిస్తూ ‘Malgudi Days’ సీరియల్ తీసిన ఊరికి ‘మాల్గుడి’ అని పేరు పెట్టటం ఉచితంగా ఉంటుందని, అది ప్రభుత్వం నారాయణ్‌కు, శంకర్ నాగ్‌కు ఇచ్చే సరైన నివాళి అని సూచించారు.

కొసమెరుపు: ఆర్.కె. నారాయణ్ ఒక సాహిత్య సమావేశానికి అమెరికా వెళ్ళినప్పుడు ఒకాయన వచ్చి “Do you write in English?” అని అడిగాట్ట. దానికి నారాయణ్ తన సహజ హాస్య ధోరణిలో, కోపం తెచుకోకుండా “I write only in English” అని జవాబిచ్చారట కూల్‍గా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here