సజీవ శిలాజాలు

13
11

[dropcap]గో[/dropcap]పాల్‌కి తిక్క రేగింది. ఆ కోపం, రెండు గంటల పాటు ఎర్రటి ఎండలో సభలో నిలుచున్న సాధారణ పౌరుడి చిటపటలా ఉంది.

తను! తనంతటివాడు!!

‘తెలుగు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ’కు ప్రిన్సిపల్ సెక్రటరీ అయినవాడు!!!

పూర్తి పదవీ ‘వైభవంతో’, 40 నిమిషాల పాటు, ఏదో మిష పెట్టుకుని మరీ చూసినా కూడా, ‘వాడు’ రాలేదు!

కైలాసం! తన కైలాసం!

తన పాఠశాల సహాధ్యాయి….,

తిమ్మాపురంలో ఒకే చెరువులో ఈత కొట్టి, కొబ్బరి తోటలో ఉయ్యాలలూగి, మామిడి తోటలో – రాళ్లతో పిందెలను కొట్టి, ఒకరి ఎంగిలి మరొకరు పంచుకున్న కైలాసం, కాదు, ‘కైలాసం గాడు!’ సభకి రాలేదు.

“అతను సిగ్గరి సార్, షై మెంటాలిటీ” ఒకరు చెప్తున్నారు.

“పోయినసారి కలెక్టర్ సన్మానం అంటే కూడా, ‘జ్వరం’ అని ఇంట్లో పడుకుని మర్నాడు వచ్చి, షీల్డ్ పట్టుకుపోయాడు” ఇంకొకరు.

“పెద్ద వాళ్లతో కలిసి మసలలేడు” మరొకరు.

“సోషల్ మేనర్స్ లేవండీ!” కార్యక్రమ నిర్వాహకులు ఒకళ్ళు.

“అహహ! అబ్బే! అలా కాదు! చాలా మొహమాటస్తుడు, బిడియస్తుడూనూ!” ఇంకొకరు.

తలొకరు తలా మాట అంటున్నారు. గోపాల్ కూల్ డ్రింక్ సిప్ చేస్తూ, ఉన్నట్టుండి లేచాడు. బిళ్ళ బంట్రోతు ఎలర్ట్ అయ్యాడు. “సార్!”

సీసా అతడికి అందించి, విసవిసా గోపాల్ స్టేజి దిగాడు. డ్రైవర్ కారు ముందుకు తీసుకురావడం, ఎవరో తలుపు తెరవడం, గోపాల్ ఎక్కడం, కారు ముందుకు సాగిపోవడం, త్వరత్వరగా జరిగాయి.

కార్ ‘కూల్’గా ఉంది. కాస్త ‘వేడి’ తగ్గింది. ‘కైలాసం’ అంటే తెలుగు నేల అంతటా పేరున్న నాటక కళాకారుడు. పౌరాణికం తగ్గిపోతే సాంఘికం, సాంఘికం సెంటిమెంటు ఐపోతే సామ్యవాదం, సామ్యవాదం అయ్యాక సాహిత్యం… ఇలా, ఏదో ఒక అంశాన్ని తీసుకుని, నాటకం రాసుకుని, తన చుట్టూ నలుగురిని కూడగట్టి, ‘నాటకం చూడ్డానికి ఎందరు వచ్చారు?’ అని చూసుకోకుండా, అలా నాటకాలు ఆడుతూ ఉండే వ్యక్తి. తన చిన్ననాటి స్నేహితుడు. ఓ పల్లెటూరులో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు. అక్కడి పిల్లలతో ప్రతి యేటా ఏదో ఒక ప్రదర్శన ఇప్పిస్తాడు. తాను ఎక్కడుంటే అక్కడే ఓ కళాక్షేత్రం ప్రతిష్ఠించ గలిగేవాడు. అన్నో ఇన్నో అవార్డులు, రివార్డులు రాకపోలేదు.. ఆఫీసు హోదాలో ఎప్పుడూ తనని కలవలేదు. ఏ సభలోనూ తాను, వాడు ఎదురుగా పట్టుమని పది నిమిషాలు ఉండలేదు. ఒకవేళ కలిసినా, చాలా మర్యాదగా, పదుగురిలో ఒక మనిషిగా ఉంటాడు తప్ప, తమ బాల్య స్నేహాన్ని ఏ కొంచెం అలుసు తీసుకోలేదు, సరి కదా, అవకాశంగా కూడా తీసుకోలేదు. తనకు అదే కాస్త చిరాకు. కాదు కాదు! మహా విసుగు. ‘కైలాసం ఎందుకు నా ఎదుటకు రాడు? ఎందుకు నా డబ్బు, దర్పం, అధికార హోదాలను acknowledge చేయడు? వాడికి నాతో ఎందుకు ఏ పని పడదు? ఎలా సాధించాలి వీడిని?

లాభం లేదు! బుర్ర ‘చల్లని’ కారులో కూడా మళ్లీ వేడెక్కింది!!!

“…… వీరాస్వామి, ఏంటి? ఏదో కొత్త రూట్లో వెళుతున్నావు?” గోపాల్ అడిగాడు డ్రైవర్ని.

“సార్, అక్కడేదో స్మార్ట్ సిటీ వర్క్ జరుగుతోంది. డైవర్షన్ పెట్టారు. అందుకని వెనక్కు వెళ్లి, పేరలల్ రూట్లో మళ్ళీ ముందుకు వచ్చాను.”

బుర్రలో ఆలోచన తళుక్కున మెరిసింది గోపాల్‌కి…

***

సీమ చింత చెట్లు, మర్రి చెట్లు, చింత చెట్లు, అన్నీ దగ్గరగా, ‘ఆట ప్రారంభించే ముందు భుజాల మీద చేతులు వేసుకుని క్రికెట్టో, బాస్కెట్ బాలో టీం మెంబర్లు అంతా, మాట్లాడుకుంటున్నట్టు విప్పారిన తమ కొమ్మలు’ ఒకదానికొకటి రాసుకుంటూ ఉండగా, మూడు గంటల మధ్యాహ్నపు ఎండ పడకుండా, కిందనున్న భూమికి పందిరి వేసిన చోటు అది.

రెండు ‘ఎకో-ఫ్రెండ్లీ’ ఏసీలు పెట్టినా, ఈ చల్లదనం ఉండదు. గుడికి దగ్గరలో ఉన్న, పాత రాతి మండపం మీద, అడ్డంగా పడుకున్న కైలాసానికి, కాస్త దూరంలో కూర్చున్నాడు గోపాల్.

“ఏదేమైనా అనరా, గోపాలం! పెద్ద ఉద్యోగం అంటూ బాధ్యతలు పెరిగాక, నీ కళ్ళ చుట్టూ నల్ల మచ్చలు వచ్చేశాయి… ఎంత అందగాడివి? నా నాటకంలో, రాజు పాత్రకి నువ్వే సరి అనుకునేవాడిని, అప్పట్లో!” అభిమానంగా చూస్తూ, కళ్ళు చక్రాల్లా తిప్పుతున్నాడు కైలాసం.

“పోరా!!! నువ్వు మరీను!” అన్నాడు గోపాల్.

“కాదురా చిన్నప్పుడు అంతా చదువు టెన్షన్, ఇప్పుడేమో ఉద్యోగం టెన్షన్, కాస్త నీ గురించి కూడా నువ్వు శ్రద్ధ తీసుకోవాలి. ఈ బొజ్జ ఏమిట్రా? ఆ చొక్కా చూడు, ఎలా ఉందో?! తియ్య గుమ్మడి కాయమీద బట్ట కప్పినట్టు!” కైలాసరావు మళ్లీ అన్నాడు.

ఆశ్చర్యం! గోపాల్‌కి కోపం, విసుగు, బడాయి, చిరాకు, ఏమీ రావట్లేదు!! ఎందుకని? పది రోజుల క్రితం, డ్రైవర్ చెప్పిన సమాధానంలో దారి వెతుక్కుని, తన మిత్రుడి దగ్గరకి అలనాటి చెలికాడుగా వచ్చాడు కదా! పల్లె బస్సు ఎక్కి! అందుకనే, ఇంత హాయిగా ఉంది! ‘వీడికి నా మీద ఎంత ప్రేమ!’ అనుకున్నాడు.

“అది సర్లేహె! కైలాసం, నిజం చెప్పు, నీకు జీవితంలో ఏదో కోల్పోయానని అనిపించదా? ఎవరి మీద ఫిర్యాదులు లేవా? అన్ని నాటకాలు ఎలా రాస్తావు, ఎలా వేస్తావు? నాటకం తప్ప, నీకు ముఖ్యమైనది ఇంకేం లేదా?” అన్నాడు గోపాల్. తన గొంతులో సందేహమే తప్ప, ఏ కొంచెం నిర్లక్ష్యం, దెప్పిపొడుపు లేవు. అది తనకే, తన చెవులకే తెలుస్తోంది.

అందుకేనేమో, కైలాసం బిగ్గరగా నవ్వుతూ మరీ లేచి కూర్చుని, పొర మారి, తన తల మీద తానే కొట్టుకుంటూ, “హ! హ్హహ్హహ్హ! గోపాలం! నా టీచర్ ఉద్యోగం, మా ఆవిడ సంగీతం క్లాసులు, వీటి వల్ల మాకు లోటు లేదు. ఇద్దరే, కొడుకులు. గవర్నమెంటు స్కూల్లోనే చదివేసుకుని, నెమ్మదిగా, డిగ్రీకి వచ్చి, పై చదువులకు వెళ్ళారు. నేనా?! సెలవుల్లోనే నాటకాలు వేస్తున్నాను. పైగా, ఈ మధ్య ఒక ప్రత్యేకమైన పద్ధతి మొదలుపెట్టాం! ఇందులో వేషం, పెద్ద సెట్టింగు, ముఖానికి రంగు పూసుకోవడం అన్నీ మానేసి, ఎలా ఉన్న వాళ్ళం అలా వేసేస్తున్నాం” అన్నాడు.

“నేనన్నదీ, నీకు నాటకాల్లో తృప్తి ఎలా అని?” అన్నాడు గోపాల్.

“సింపుల్! నా కథా వస్తువును మార్చుకుంటూ వచ్చాను. పురాణాలు, సామాజిక సమస్యలు, సామ్యవాదం, అయ్యాక కొంతకాలం కిందట పర్యావరణ పరిరక్షణ గురించి కూడా ఇతివృత్తంగా ఎంచుకుని నాటకాలు వేసాను. వెరైటీ, కరెంట్ ఇష్యూస్ ఇదే నా బలం!”

“మరి, ఇప్పుడు?” అన్నాడు గోపాల్.

“చెప్తున్నా కదా. ఆగరా! అంత ఆత్రం దేనికి?” మళ్ళీ నవ్వాడు కైలాసం.

ఆహా! మధ్యాహ్నపు ఎండ, చెట్ల నీడలు. చిన్నప్పుడు తెలుగు మాష్టారి మాటల్లో చెప్పాలంటే ‘తమాల తరుఛాయలు’, చిన్న గాలి కెరటం – అది రాల్చే ఎండుటాకులు. ఎక్కడో, అడపాదడపా విన వచ్చే పశువుల మెడలో గంట సవ్వడి, దూరంగా హైవే మీద ఎప్పుడైనా వెళ్లే లారీ చప్పుడు, ఎంత బాగుంది ! రెండు పాదాల యమ్.ఎస్. విశ్వనాధన్ గారి పాటలో ఇంటర్ల్యూడ్‌లా… నిశ్శబ్దం ఇంత బాగుంటుందా!

కైలాసరావు లేచి నిలబడ్డాడు. మండపానికి ఆవల కోనేటి వైపు చూస్తూ, “మౌనం ఎంత లోతైనదో కదరా! నీతో నువ్వు మాటాడుకునే ఓ గొప్ప అవకాశం అది. నా నాటకాలకు స్క్రిప్టు నేనీ మండపం నీడలోనే రాసుకుంటాను..” అన్నాడు.

ఓహ్! నిశ్శబ్దం కాదది. నిజమే! మౌనం.

రెండు అడుగుల్లో వెనక్కి తిరిగి “గోపాలం! ఒకటి చెప్పరా! సివిల్స్‌లో ఏం సబ్జెక్టు ఎంచుకున్నావు?” కైలాసం అడిగినది యథాలాపంగా అడిగినట్టనిపించినా, ఇప్పుడా ఊసు దేనికి? అనుకుంటూ, “ఆ…! తెలుగు, ఆంథ్రోపాలజీ” అన్నాడు.

“మరి నేనూ అంతే!” ఠక్కున అన్నాడు కైలాసం.

అబ్బురపడ్డాడు గోపాల్.

“అంటే?” ప్రశ్నార్థకంగా చూసేడు.

దగ్గరగా వచ్చి నిలబడ్డాడు కైలాసరావు.

“ఒరేయ్! ఎప్పుడో ధూళిలో కలిసిపోయిన మానవుల జాడలని, శిలాజాలలో వెతికిన ‘ఆంత్రోపాలజీ’ అనే విషయం కొన్ని నెలలు చదివి, ఉద్యోగం సంపాదించావు! మరి నేను? రోజూ మారుతున్న సామాజిక పరిస్థితుల నేపధ్యంలో మనుషుల మనస్తత్వాలను పరిశీలిస్తూ, నాటకాలు వేస్తున్నాను. ఇది ఒక రకం ‘లైవ్ ఆంథ్రోపాలజీ’ అనుకో!” అన్నాడు కైలాసం.

గోపాల్ కూడా లేచి నిలబడ్డాడు, చొక్కాకి అంటుకున్న దుమ్ము దులుపుకుంటూ.

“కైలాసం, నాకు సరిగ్గా చెప్పు, నీ భాషలో కాదు!” అన్నాడు.

“సరే! నేను ఉన్న ఊరికి ఎందుకు నువ్వు ఇన్నాళ్ళకు ఎందుకు వచ్చావ్?” కళ్లల్లో కళ్లు కలిపి అడిగాడు కైలాసం.

గోపాల్ ఇంకా పెదవులు కదిపేందుకు ఉద్యుక్తుడవబోతుండగానే,

“మన చిన్ననాటి అమలిన స్నేహాన్ని దూరం చేసే, ఏవో పొరలు – తెరలు మనిద్దరి మధ్య మొలిచేయి; అవి ఉండగా నేను నీ దగ్గరగా ఇహ రాలేను అని తెలుసుకునే కదా!” దెబ్బ తగిలించుకున్న పిల్లాడిని లాలిస్తున్న అమ్మలా అన్నాడు కైలాసం.

గోపాల్ ఆపాదమస్తకం చలించిపోయాడు. ‘వీడు మామూలోడు కాదు, ఇలాంటి వీడు! నా మిత్రుడు!’ హృదయం బరువెక్కింది. తేలికా పడింది !

“ఔన్రా! మనిషి నిత్యం తన చదువు, హోదా, డబ్బు, పలుకుబడి అనే వేషాలు వేసి, దానికి తగ్గ హంగుల రంగులు పులుముకుంటున్నాడు. అయితే బరస్ట్ అయిపోవడమో, లేదా isolate అయిపోవడమో – చేస్తున్నాడు.

నేను, నా నాటకంలో ఆ ఉద్వేగభరిత క్షణాలని మరి కొంచెం సేపు పొడిగించి, ఆ పాత్రల చేత తమ మనసును తామే విశ్లేషించుకునేలా చేస్తున్నాను. నీకర్థమయేలా చెప్పాలంటే శబ్దం తగ్గించి మౌనం అవసరం ఓ కళారూపంలో సూచిస్తున్నాను.”

“నాటకం చూసి మారే వాళ్ళున్నారంటావా?!”

“నాటకం ఒక్కటే నాకు తెలిసిన భాష. ఏ పిట్టైనా తన భాషలోనే కదరా పాడగలదు! అయినా, మనం కట్టుకున్న అంతస్తు మీదకెళ్ళి, మనమే, చాలా ఎత్తైన వాళ్లమై పోయాం అనుకోవడం అవివేకం కదరా! ఇద్దరు మనుషుల మధ్య అంతరాలు వాటంతట అవి రావురా! వాళ్లలో ఒకరు ‘నేను గొప్ప’ అనుకుంటే తప్ప…” ఈ మాటలు చెబుతూ మండపం నుంచి ఓ మెట్టు దిగి కింద నిలబడ్డాడు కైలాసం.

మనసు ప్రశాంతంగా ఉంది గోపాల్‌కి.

తమ సీనియర్ ఆఫీసర్ నవీన్ గారు అన్న మాటలు చెవుల్లో, కాదు – కాదు, మనసులో రింగుమన్నాయి “మనం ప్రజలతో మమేకం కావాలి, సమస్యలను ఆఫీసర్లుగా కాక, ప్రజల స్నేహితులమై చూడాలి.”

గోపాలం మెట్టు దిగడానికి కైలాసం తన చేయి అందించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here