కాజాల్లాంటి బాజాలు-112: సలహా ఇద్దురూ!..

0
10

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]చి[/dropcap]న్నప్పుడు మా అమ్మమ్మగారు ఒకమాట అంటూండేవారు.. అదేంటంటే, “వాళ్లదంతా వినికిడి జ్ఞానమర్రా..” అంటూ.

అంటే ఏ విషయమైనా పధ్ధతిగా నేర్చుకోకుండా కేవలం విని మాత్రమే జ్ఞాన మొచ్చేసిందనుకునే మహానుభావుల గురించి అలా చెప్పేవారన్న మాట.

ఈమధ్య మా మనవడిని చూసినప్పుడు నాకు ఆమాటే గుర్తొచ్చింది.

అప్పుడు మా అమ్మమ్మ గారన్నట్టు మా మనవడి వినికిడి జ్ఞానం సంపూర్ణ జ్ఞానం కాదూ.. సగం సగమేనని అంటే మిడిమిడిజ్ఞానం అంటారు చూడండి.. అలాంటి జ్ఞానమని అర్ఠమైంది.

ఏదో ఒక విషయం వినడం అదేమిటో పూర్తిగా అర్ధం చేసుకోకుండా దానిని ఆచరించేయడం.. ఇదన్నమాట మా మనవడు చేసే పని. ఇంక ఉపోద్ఘాతం ఆపి అసలు సంగతికి వచ్చేస్తాను.

మా మనవడికి తొమ్మిదేళ్ళుంటాయి. నేను టీవీలో ప్రవచనాలూ అవీ వింటున్నప్పుడు అప్పుడప్పుడు పక్కన కూర్చుని వింటూంటాడు. పిల్లాడు వింటున్నాడనే సంతోషంతో నేను ఒక చానల్ నుంచి మరోదానికి అలా వరసగా ప్రవచనాలు, జ్యోతిష్య ప్రకటనలూ పెడుతుంటాను. అలా మార్చినప్పుడు ఒక్కొక్కసారి నాకే ఎన్నో సందేహాలు వస్తుంటాయి.

ఒకదాంట్లో ఓ పెద్దాయన నా రాశికి ఈ వారం బ్రహ్మాండమైన రాజయోగం ఉందని చెపుతారు. ఇంకోదాంట్లో మరో పెద్దాయన నా రాశికి ఈ వారం తీవ్రమైన మనోవేదన అనుభవిస్తారు అంటారు. దేన్ని నమ్మనూ! అందుకే రాజయోగం ఉందని చెప్పిన ఆయన్ని పూర్తిగా నమ్మేసి, మనోవేదన అని చెప్పింది విన్నప్పుడు.. “ఆ.. ఈ రాశిలో కోట్లమంది ఉంటారూ.. అన్నీ అవుతాయా!” అని మనసుని సమాధాన పరిచేసుకుంటాను. అదేకదా మరి పాజిటివ్ ఆటిట్యూడ్ అంటే.. అది నాకు పుష్కలంగా ఉంది. అందుకే మనవడిని కూడా పక్కన కూర్చోబెట్టుకుని, వాడికి కూడా పాజిటివ్‌గా ఎలా ఆలోచించాలో చెపుతుంటాను.

అబ్బ.. ఇంకా ఉపోద్ఘాతంలాగే ఉంది కదా!.. సరే అసలు జరిగిన కథ చెప్తాను.. చదవండి..

తొమ్మిదేళ్ళ మా మనవడిని తీసుకుని మా ఇంటికి దగ్గర్లో ఉన్న గుడికి వెళ్ళాను. మామూలుగా ఇప్పుడు ప్రతి గుడిలోనూ అందరు దేవుళ్ళూ ఉంటున్నారు కదా.. అలాగే ఆ గుళ్ళోనూ ఉన్నారు. ఒక్కొక్క దేవుడికీ ప్రదక్షిణం చేస్తూ వస్తున్న నాకు పక్కన మనవడు కనిపించలేదు. కంగారుపడి అన్ని గుడులూ చూసుకొస్తుంటే ఆంజనేయస్వామి గుడిముందున్న ఆయన వాహన మయిన ఒంటె చెవిలో ఏదో రహస్యం చెపుతూ కనపడ్డాడు. అంత రహస్యంగా ఏం చెప్తున్నాడో నాకేమీ అర్థం కాలేదు.

“అంత రహస్యంగా ఏం చెపుతున్నావూ!” అనడిగితే మాట్లాడలేదు.

“ఆ.. చెప్పేదేదో దేవుడికే గట్టిగా చెప్పుకోవచ్చుకదా! అలా రహస్యంగా ఒంటె చెవిలో చెప్పడమెందుకూ!”

ఊరుకోలేక మళ్ళీ అడిగేను.

“దేవుడికి చెప్పేకన్న ఆయన వాహనానికి చెవిలో రహస్యంగా చెపితే మనకి కావల్సింది దేవుడిచేత ఇప్పిస్తాట్ట కదా! మొన్న టీవీలో ఆ పెద్దాయనెవరో చెప్పేరు కదా! మరి నాకు ఆంజనేయస్వామంటే ఇష్టం కదా! అందుకే నాక్కావల్సింది ఆ దేవుడికి చెప్పమని ఆ వాహనానికి రహస్యంగా చెప్పేను.” అన్నాడు.

“టీవీలో ఒంటె చెవిలో రహస్యంగా చెప్పమని చెప్పేరా!” ఆశ్చర్యంగా అడిగేను.

“అబ్బా.. అమ్మమ్మా.. నీకేదీ అర్థం కాదేంటీ! మొన్న ఒక పెద్దాయనెవరో శివాలయానికి వెళ్ళినప్పుడు ఆయన ముందున్న శివుడి వాహనం అయిన నంది చెవిలో మనకి కావల్సింది రహస్యంగా చెప్తే ఆయన శివుడికి చెప్పి ఇప్పిస్తాడని చెప్పలేదూ!” ఎదురు ప్రశ్నించేడు నన్ను.

నాకు మతిపోయింది.

“శివలింగానికి ముందున్న నంది చెవిలో చెప్పమన్నారు కానీ ఒంటె చెవిలో కాదు..” అన్నాను.

“అది ఒంటా.. నంది కాదా?” ఆశ్చర్యంగా అడిగేడు.

“అవును.. ఇది కేమెల్. తెలుగులో ఒంటె అంటారు. ఆంజనేయస్వామి వాహనం. నంది అంటే శివుడి వాహనం. శివలింగానికి ఎదురుగా ఉంటుంది.” వివరించి చెపుతూ ఆలోచిస్తున్నాను.

శివుడి ముందున్న నంది చెవిలో చెప్పమంటే ఇప్పుడు వీడు ఆంజనేయస్వామి ముందున్న ఒంటె చెవిలో చెప్పేడా! అంటే ఏ దేవుడిని ఏది అడగాలన్నా ఆ దేవుడి వాహనానికి చెప్పేసుకుంటే కావల్సింది వచ్చేస్తుందని అనుకుంటున్నాడా! లేక వీడు నంది అంటే ఒంటె అనుకుంటున్నాడా!

వాడికి అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను.

“అదికాదురా.. అలా చెవిలో చెపితే మనకి కావల్సింది ఇప్పించేది ఒక్క శివుడి వాహనమైన నంది మటుకే. ఇలా అన్ని దేవుళ్ళ వాహనాలూ ఇప్పించవు..” అందామని నాకు నోటి చివరిదాకా వచ్చింది.

కానీ ఎంతో నమ్మకంతో ఆంజనేయస్వామిచేత తనకి కావల్సింది ఇప్పించమని ఒంటె చెవిలో చెప్పిన మా మనవడి విశ్వాసాన్ని తప్పని చెప్పలేకపోయేను.

అందుకే మాట మార్చేస్తూ, “ఇంతకీ ఏం కావాలని అడిగేవూ!” అనడిగేను.

నన్ను కాస్త వంగమని, ఇంకే దేవుళ్లకీ వినిపించకుండా రహస్యంగా నా చెవిలో చెప్పేడు,

“కొత్తగా వచ్చిన వీడియోగేమ్..” అంటూ.

ఇప్పుడు నేనేం చెయ్యాలీ.. మనవడి నమ్మకం నిలబెట్టడం కోసం వాడికి ఆ వీడియోగేమ్ కొనివ్వాలా లేక అలాంటి అపోహలు ఉండకూడదనుకుంటూ అంతా వివరించి చెప్పాలా!

నాకు ఏం చెయ్యాలో తోచటంలేదు. కాస్త సలహా ఇద్దురూ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here