సల్లంగుండవే నా నీడా!

0
9

[dropcap]నే[/dropcap]ను పుట్టినకాడ్నుంచి
అది నాతోనే ఉన్నదంట,
అడుగంగనే అందరు జెప్తనే ఉంటరు
నేన్పుట్టంగనే అదీ పుట్టిందంట

నేను యాడ్కివొయినా
నా యెంటనే నడుస్తది
యెల్గులకు వోతె సాలు
యెన్కనన్నుంటది … ముంగలనన్నుంటది
ఆపక్కల్నో ఈ పక్కల్నో
ఏదో ఒక్క దిక్కుల నాతోనే ఉంటది
కూసుంటే కూసుంటది
నిలబడ్తే నిలబడ్తది
అడుగులల్ల అడుగేసుకుంటూ
నన్నిడిసిపెట్టకుండా నడుస్తనే ఉంటది

చీకట్ల యాడ దాక్కుంటదో గాని
యెల్గువడ్తె సాలు లటుక్కున పుట్టుకొస్తది
గిదే ముచ్చట దాంతోని అడిగితే
‘చీకట్ల నీకు బుగులైతదేమో’ అని
నిన్నల్ముకుని, నీతోనే ఉన్న అనన్నది

నేనెంత శింగారం జేసుకున్నా
అది నల్లంగనే ఉంటది
నేను కోపంల ఉన్నా కొట్లాడేతీర్గ ఉన్నా
అది సల్లంగనే ఉంటది
నేనెగిర్తే ఎగుర్తది, నేను దుంకితే దుంకుతది
నేనుర్కితే ఉర్కుతది, నేనాగితే ఆగుతది
యాష్టకొచ్చి ఎల్లగొడ్తమంటే యాడికీ వోదు
నేను ఎంత ముద్దుచేసినా, నెత్తికెక్కదు
నా కాళ్ళకాడే పడుంటది, నన్నిడ్సిపెట్టకుండా

ఏందో ఈ నీడ సంగతి
మెల్లంగ మెల్లంగ ఎర్కవుతోంది
నేను పుట్టంగనే నాతో పుట్టిందంట గందా
మరి పుడకల్దాకా నన్నిడ్సిపెట్టదేమో గందా
అందుకనే
“ఓ నీడా! సల్లంగుండవే నా నీడా”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here