సల్లో.. సల్ల – పుస్తక పరిచయం

0
7

[dropcap]‘స[/dropcap]ల్లో.. సల్ల’ అనే ఈ పుస్తకాన్ని ప్రసిద్ధ రచయిత శ్రీ ఆర్. సి.కృష్ణస్వామి రాజు వెలువరించారు. ఈ పుస్తకంలో 1. రాయలచెరువు రోడ్డు 2. అమ్మా, నీకు దండమే! 3. బంగారు సంబంధం 4. అమ్మా! ఆకలే!! 5. చప్పట్లు 6. కొడుకో… బంగారు తండ్రీ! 7. విశాల హృదయం 8. బాతుల బాలరాజు 9. కర్షక మిత్ర 10. సల్లో.. సల్ల 11. పెద్దమ్మ పెరుగు 12. అమ్మా! నారాయణమ్మా!! 13. చెట్టు నీడలాంటోడు మేనమామ 14. మాయమై పోలేదు మనిషన్నవాడు! 15. సిలబస్‌లో చేరని పాఠం 16. అమ్మ సినిమాకి వెళ్ళాలంటోంది – అనే పదహారు కథలున్నాయి.

***

“ఈ కథలన్నింటా పరచుకున్న వస్తువు – పల్లె జీవితం.

ప్రతి కథలోనూ పల్లెను మన కళ్ళ ముందు పునర్నిర్మిస్తారు. ఆ పల్లె నిండా పక్షులు, ఈలపిట్టలు, గువ్వలు, ఉడుతలు, గేదేలు, ఆవులు, దూడలు, మేకలు, గొర్రెలు, పెంపుడుకోళ్ళు, కుక్కలు, బాతులు ఉంటాయి. కానుగచెట్లు, వేపచెట్లు, చింతచెట్లు, మట్టితొట్లు, తిప్పతీగ ఆకులు ఉంటాయి. పిలకాయలుంటారు. ఆటపాటలుంటాయి. ఈతలుంటాయి. కేరింతలుంటాయి. తుళ్ళింతలుంటాయి.

ఆ దృశ్యాలన్నిటినీ ఆస్వాదింపజేస్తూ మనల్ని ‘కయ్యిలమ్మిట, కాల్వలమ్మిట’ తిప్పుతారు.

~

కండగల వాక్యాల సమాహారమే కథను పుష్టికరంగా తీర్చిదిద్దుతుంది. ఇలాంటి శిల్పమే రాజు గారి ప్రధాన బలం. ప్రాంతీయ యాస అదనపు ఆభరణం.

డొంక తిరుగుడు లేని ఎత్తుగడతో మనల్ని కథలోకి లాక్కెళతారు. ఆ తర్వాత అలవోకగా పరుగులు తీయిస్తారు.

~

ఈ కథల్లో భారీ కుదుపులు, ఊహించని మలుపులు, నాటకీయ పరిణామాలు ఉండవు. నిత్య జీవితంలోంచి కొన్ని సంఘటనలు పైకి లేచి అక్షరాలతో అలంకరించుకుని, మానవ జీవన ప్రవృత్తులను ప్రతిబింబించి, అంతే నిశ్శబ్దంగా నిష్క్రమిస్తాయి.

అయితే, ఆ నిశ్శబ్దం – మన లోపలి రణగొణ ధ్వనుల్ని భగ్నం చేస్తుంది. ఆ నిష్క్రమణ మనలోని మురికిని శుభ్రం చేస్తుంది. కథ ముగిశాక జీవితానికి మరింత దగ్గరవుతాం.

~

ఈ కథలు పల్లె బతుకులపై పరిశోధన పత్రాలు. మానవీయ జీవన చిత్రాలు” అని ముందుమాట ‘పల్లె బతుకుల పరిశోధన పత్రాలు’లో సుప్రసిద్ధ రచయిత శ్రీ ఎమ్వీ రామిరెడ్డి వ్యాఖ్యానించారు.

***

“వినయం ఆయన లక్షణం, సాహిత్యం ఆయన ప్రాణం. నిత్యం జీవితాలకు బీమాతో రక్షణ (ఉద్యోగం) కల్పిస్తూనే… ఎన్నో జీవితానుభవాలను పరిశీలించి… పరిశోధించి ధీమాగా (సద్యోగం) అక్షరీకరిస్తూ… ఎందరికో మార్గదర్శనం చేస్తూ… కలంకారుడిగా కీర్తి శిఖరాలను అధిరోహిస్తున్న రచయిత ఆర్. సి. కృష్ణస్వామిరాజు.

చిన్నా పెద్ద కథల సవ్యసాచిగా పాఠకుల మన్ననలు అందుకుంటున్నానడంలో సందేహమే లేదు. మంచి కథలు చదవాలనుకునేవారు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది” అని వ్యాఖ్యానించారు ప్రముఖ కథా రచయిత ఇందూ రమణ.

***

“ఊహల పల్లకీలో ఊరేగే కథలు కావివి. మీ వీధిలోనో, మా వీధిలోనో, మీ ఊరిలోనో, మా ఊరిలోనో జరిగిన సంఘటనలను పత్రికల్లో ప్రచురింపబడేట్లు, పాఠకులను చదివించేట్లుగా మలచిన వాస్తవ రూపాలు.

~

ఈనాడులో విలేఖరిగా పని చేసినప్పుడు క్రాస్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీని క్లోజ్‌అప్‌లో చూడగలిగే అవకాశం దొరికింది. సాంఘిక సమస్యల మూలాలు తెలుసుకోవడానికి పాత్రికేయ వృత్తి దోహదపడింది.

ఎల్.ఐ.సి.లో డెవలప్‍మెంట్ ఆఫీసర్‌గా కడపజిల్లా కోడూరులో ఆరేళ్ళపాటు పని చేశాను. అప్పుడు పల్లెలన్నీ విరివిగా తిరగడం కూడా నా మానసిక వైశాల్యానికి దోహదపడింది.

~

ప్రకృతికి, సమాజానికి, వాస్తవికతకు దగ్గరగా ఉండే ఈ కథలను చదివి ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను” అన్నారు రచయిత ‘నా మాట’లో.

***

సల్లో.. సల్ల (కథలు)

రచన: ఆర్‌.సి. కృష్ణస్వామి రాజు

పేజీలు: 126; వెల రూ.120/-

ప్రతులకు: రచయిత, ఫోన్‌: 9393662821

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here