సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు-12

0
13

[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారు రచించిన ‘సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

[సుందరిని చదువు మాన్పించి ఆమె తల్లిదండ్రులు తమ గ్రామానికి తీసుకువెళ్తారు. మొదట బాధపడ్డా పద్మకి, సూర్యానికి ఇది కూడా ఒకందుకు మంచిదేననిపిస్తుంది. సుందరికి చదువు మీద శ్రద్ధ లేనందువల్లా, వాళ్ళు గట్టిగా బలవంతం చేయలేదు. సుందరి వెళ్ళిపోయినందుకు సంతోషిస్తాడు సిద్ధార్థ. అతను బిందుకి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. అదే సమయంలో బిందూకి కూడా అతనిపై ప్రేమ కలుగుతుంది. కానీ తనని తాను నియంత్రించుకుంటూ ఉంటుంది. ఒకరోజు కాలేజీలో సిద్ధార్థకి ఎదురుపడుతుంది బిందూ. ఎవరి గురించో ఆలోచిస్తున్నారు అని అడిగితే అమ్మ గురించి అంటుంది. బాధల్ని తనలోనే దాచుకుని తనని గొప్పగా పెంచిందని చెప్తుంది బిందూ. మరి మీ ఫాదర్ అని సిద్ధార్థ అడిగితే, నాన్న గురించి అడిగితే ఒకసారి అమ్మ కొట్టిందనీ, అప్పటి నుండి తండ్రి గురించి అమ్మని అడగలేదని చెప్తుంది. సారీ చెప్పి వెళ్ళిపోతాడు సిద్ధార్థ. కాసేపయ్యాక, బిందూ లైబ్రరీ హాలులో కూర్చుని ఉండగా శకుంతల వచ్చి పలకరిస్తుంది. మాటల సందర్భంలో సుందరిని పెళ్ళి చేసుకోవడం సిద్ధార్థకి ఇష్టం లేనట్టుంది అని అంటుంది బిందూ. నీతో చెప్పాడా అని అడుగుతుంది శకూ. సిద్ధార్థ మీద బిందూ అభిప్రాయం తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది శకూ. శకుంతలకి సిద్ధార్థ బంధువవుతాడని తెలిసాకా, ఆమెని నిక్‍నేమ్‍తో పిలవడం మానేస్తారు. ఓ రోజు కాలేజీలో శకూని పిల్చి, ఓ చెట్టు కింద కూర్చుని మాట్లాడుతాడు సిద్ధార్థ. తాను బిందూని ప్రేమిస్తున్నట్లు చెప్పి బిందూ మనసులోని మాటను కనుక్కోమంటాడు. మరి సుందరి సంగతో, అంటే తనకి సుందరి అంటే ఇష్టం లేదని చెప్తాడు. సాయంత్రం క్లాసులు అయిపోయాక, బిందూతో మాట్లాడాలి ఉండమని చెప్తాడు. ఇద్దరూ బీచ్‍కి వెళ్ళి ఇసుకలో కూర్చుంటారు. తాను ఆమెని ప్రేమిస్తున్నానని, పెళ్ళి చేసుకుంటానని అంటాడు. తాను సుందరికి ద్రోహం చేయలేనని అంటుంది బిందూ. తన మనసులో సుందరి లేదని చెప్తాడు సిద్ధార్థ. తన విషయంలో మమ్మీదే నిర్ణయం అంటుంది బిందూ. సమయం వచ్చినప్పుడు మీ అమ్మగారినే అడుగుతాను అంటాడు సిద్ధార్థ. ఇక చదవండి.]

అధ్యాయం-23

[dropcap]సుం[/dropcap]దరిని తీసుకుని పోయిన తరువాత సిద్ధార్థకి కొంత ప్రశాంతంగా ఉంది. “ఓ పర్యాయం ఇక్కడికి వచ్చిపో!” మామయ్య ఫోనులో చెప్పాడు. సిద్ధార్థ బయలుదేరాడు. సిద్ధార్థ, బిందూ బీచ్‌లో మాట్లాడుకుంటున్న సమయంలో శంకరానికి పరిచయం ఉన్న వ్యక్తి చూడడం, ఆ వార్త శంకరం చెవికి వేయడం జరిగింది. ఆ వార్త వినగానే శంకరం మనస్సు అశాంతిగా – అపనమ్మకంగా ఉంది. సిద్ధార్థ తన చేయి జారిపోతాడా అన్న సందేహం అతనికి కలిగింది.

మేనల్లుడు వ్యవహారం తెలుసుకోడానికే సిద్ధార్థకి కబురు పంపాడు శంకరం. ఈ విషయం విన్నప్పటి నుండి సుందరి మనస్సు కుతకుతలాడి పోతోంది. ఆమె హృదయం నుండి క్రోధాగ్ని జ్వాలలు బయటకు సెగలు పొగలు కక్కుతున్నాయి. ఆమెలో ఈర్ష్యా – ద్వేషాలు ఒక్కసారి పెల్లుబుకుతున్నాయి. సహనం నశిస్తోంది.

తనకి మొదట్నించి అనుమానంగానే ఉంది ఆ బిందూ బావని వల్లో వేసుకుంటుందని. తను అనుకున్నంత అయింది. ఆ శకూ కూడా ఆ బిందూకు సహాయం చేస్తోంది. ఇలా అనుకుంటున్న సుందరి అహం దెబ్బ తినగా తోక త్రొక్కిన త్రాచులా – పగబట్టిన నాగినిలా బుసలు కొడ్తూ ఊగిపోతోంది. తన మాటల్తో అందర్నీ ఆకట్టుకున్న సుందరి, ఇన్నాళ్ళూ అమాయకంగా గలగల పారే సెలయేరులా మాట్లాడిన సుందరి, ఈ రోజు ప్రతీకార జ్వాలల మధ్య ప్రతీకారం తీర్చుకునే ప్రతిమూర్తిలా ఉంది. అపర కాళికలా బయటకు వచ్చిన సుందరిని చూసి తల్లిదండ్రులు కలవరపడ్డారు. సిద్ధార్థ మాత్రం ఎటువంటి చలనం లేకుండా అలా నిలబడి ఉన్నాడు. ఎటువంటి విషమ పరిస్థితి వచ్చినా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నట్టు అలా స్థిరంగా ఉన్నాడు.

“ఛీ..ఛీ..! విశ్వాస ఘాతకుడా! ద్రోహీ! నీచుడా! స్వార్థపరుడా!” అంటోంది సుందరి సిద్ధార్థని.

“సుందరీ!” గట్టిగా అరిచాడు సిద్ధార్థ.

“ఎందుకలా అరుస్తావు? నేనన్న మాటలు నిజం కాదా? తిన్నింటి వాసాలు లెక్కపెట్టే రకానివి నీవు. నాకు మొదటే అనుమానం వచ్చింది. ఆ బిందూ మోహంలోపడి నన్ను పెళ్ళి చేసుకోనంటావా? ఈనాడు నీవీ పరిస్థితిలో ఉండటానికి కారకులు ఎవరో తెలుసా? మా నాన్న. అతను నన్ను నీకిచ్చి పెళ్ళి చేద్దామనే ఉద్దేశంతోనే ఇంజనీరింగు చదివిస్తున్నాడు. లేకపోతే తిండానికి తిండి సరిగా లేని నీకు ఆ చదువు చదవడం సాధ్యమా?” సుందరి వాగ్ధారణి అలా సాగిపోతోంది. ప్రచండ రీతిలో తుఫాను వచ్చినట్టుంది సుందరి ధోరణి.

“సుందరీ!” గట్టిగా అరిచాడు సిద్ధార్థ మరో పర్యాయం.

కుటుంబ సభ్యులందరూ ఉలిక్కిపడి సిద్ధార్థ వేపు చూస్తున్నారు. ఎవ్వరూ సుందరి మాటల్ని ఖండించకపోవడం సిద్ధార్థకి బాధ – కోపం కలిగించాయి. అవమానం భరించలేనట్లు అతని ముఖం మండుతున్న నిప్పు కణికలా ఎర్రబడింది.

ఎర్రబడిన అతని కనుదోయి ఎర్ర కలువల్ని గుర్తుకు తెస్తోంది. దవడ ఎముక కదలిక బట్టి అతను చాలా ఉద్రేకపడ్తున్నాడని తెలుస్తోంది. అతని పెదవులు కదుల్తున్నాయి. “నేను స్వార్థపరుడ్నా మీ నాన్న స్వార్థపరుడా? నన్ను చదివించడంలో మీ నాన్నకి స్వార్థపరత్వం లేదూ? మా పేదరికాన్ని అలుసుగా తీసుకుని నా జీవితంతో మీ నాన్న ఆటలాడుకోలేదా? నన్ను పావుగా వాడుకోలేదా? నీ అజమాయిషీ నేను సహించలేను.”

సిద్ధార్థ మాటలు సుందరికి మరింత ఆవేశాన్ని తెప్పించాయి. ఆవేశంలో తను ఏం మాట్లాడుతోందో? ఆ మాటలు పర్యావసానం ఏంటో మరిచిపోయింది అందుకే “మా నాన్న ఈ క్షణంలో డబ్బు పంపకుంటే నీ చదువెలా సాగుతుంది? నీ గతేం కాను? అలాంటి గతిలేని వాడివి నీవూ మాట్లాడ్డమేనా?” అంది.

ఆమె మాటలకి సిద్ధార్థ అహం పూర్తిగా దెబ్బతింది. సహనం చచ్చిపోయింది. ఏ సమస్యనయినా సామరస్యంగా పరిష్కరించుకోవాలే కాని, ఆ సమస్యను జటిలం చేస్తే ఏం ప్రయోజనం లేదు.

సహన గుణం నశించిన సిద్ధార్థ సుందరితో “మాటలు జాగ్రత్తగా రానీ! ఇంత వరకూ మీ నాన్న నాపై ఖర్చు చేసిన డబ్బు పైసా కూడా ఉంచుకోకుండా లెక్కగట్టి చెల్లిస్తాను.” ఆవేశంలో బుసకొత్తూ – మండిపడ్తూ అన్నాడు సిద్ధార్థ.

అవమానం – బాధ – కోపం, అసహ్యం, అన్ని భావాలకి అతడు మరింత లోనయ్యాడు. బాధాతప్త హృదయంతో మౌనంగా ఎవ్వరికీ చెప్పకుండా బరువుగా అడుగులు వేసుకుంటూ అచటి నుండి కదిలిపోయాడు.

‘ఈ పిల్లకి ఇంత దురుసుతనం పనికిరాదు. పాపం ఆ అబ్బాయి ఎంత బాధ పడ్తున్నాడు? దీనికి ఎప్పుడు బుద్ధి వస్తుందో?’ బాధగా అనుకుంటోంది కాత్యాయిని. శంకరం మాత్రం మౌనం వహించాడు.

సిద్ధార్థకి అంతకు పూర్వం లాగే తన పేదరికం మీద కోపం వచ్చింది. తన అసహాయ స్థితి మీద కోపం వచ్చింది. అయితే తనది ఏం చేయలేని పరిస్థితి. మొదట తను చేయవల్సింది చదువు ఆపుచేయాలి. ఇటువంటి పరిస్థితిలో తన చదువు సక్రమంగా సాగదు. ఒకరి దయాధర్మ బిక్షతో చదివే చదువు తనకి అక్కర్లేదు. ఈ బానిస బ్రతుక్కి చరమ గీతం పాడాలి.

ఆత్మాభిమానం తిండి పెడుతుందా? భావి జీవితం ఎలా సాగుతుంది? అనే వాదాలు తన ఎదుట నిలుస్తాయి. అయితే వాటికి తన సమాధానం ఒక్కటే ప్రస్తుతం ఆత్మాభిమానం – ఆత్మగౌరవానికి భంగం రానీయకుండా చూసుకోవడమే తన ముందున్న మార్గం. ఇక తన భావి జీవితమా? దాని గురించి తను ఆలోచించదల్చుకోలేదు. విధి ఎలా ఆడిస్తే అలా ఆడడమే. ఆ ఆటలో గెలుపు ఓటమి రెండూ ఉంటాయి. ఆ విధి ఆడించిన వింత నాటకంలో తనూ ఒక ఆటబొమ్మ మాత్రమే.

ఇలా సాగిపోతున్నాయి సిద్ధార్థ ఆలోచన్లు. ఇంతలో బస్సు వచ్చి అతని ముందు ఆగింది. బస్సులో కూర్చున్నాడు. బస్సు ముందుకు సాగిపోతూ ఉంటే అతని ఆలోచన్లు కూడా ముందుకు పరుగులు పెడ్తున్నాయి.

అధ్యాయం-24

ఏ విషయమైనా కాలేజీలో ఇట్టే అందరికీ తెలిసి పోతుంది. సిద్ధార్థ విషయంలోనూ అంతే జరిగింది. కాలేజీ అంతా గోలగోలగా ఉంది.

ఇంకెవరి విషయమయితే ఎవ్వరూ ఇంతగా పట్టించుకుని ఉండేవారు కాదేమో కాని సిద్ధార్థ విషయంలో మాత్రం అలా జరగలేదు. దానికి కారణం ఆ కాలేజీలో అతనికున్న ప్రాముఖ్యత అలాంటిదేమో!

అందరి నోటి వెంబడి ఒక్కటే మాట వినిపిస్తోంది. ‘సిద్ధార్థ చదువు మానేస్తాడుట’ అన్న విషయం.

“ఎందుకు?” అందరి మెదడులో తొలుస్తున్న ప్రశ్న అదే.

“కారణం చెప్పరా నాయనా? డబ్బు సమస్యా? అదే అయిదే ఆ డబ్బు సర్దుబాటు చేయడానికి మేమున్నాము. లేకపోతే ఇంకేదేనా సమస్యా?” స్నేహితులు సిద్ధార్థని గుచ్చి గుచ్చి అడుగుతున్నారు. ఎవరు ఎన్ని విధాలా అడుగుతున్నా సిద్ధార్థ గంభీరంగా మౌనం దాల్చేడే కాని కారణం ఎవ్వరికీ తెలియజేయనీయ లేదు.

“బిందూ! సిద్ధార్థ చదువు మానేస్తున్నాడట తెలుసా నీకు?” సుకుమారి అడిగింది. బిందు వినకూడని మాట విన్నట్టు ఉలిక్కి పడింది. కాని ఆమెకీ కారణం తెలియదు. విస్మయంగా సుకుమారి వేపు చూసింది.

“అయ్యో కర్మ! నీకూ తెలియదా? అతని ఆంతరంగిక విషయాలు నీకు తెలుస్తాయని నిన్ను అడిగాను. నీకు తెలియనట్టుంది.”

“అవును,” అంది బిందు.

“సిద్ధార్థకి ఆర్థిక సమస్య లేవేనా ఉన్నాయోంటో? అలాంటి సమస్యలే ఉంటే మన మందరం లేమూ? కొద్ది నెలల్లోనే చదువు ముగిస్తున్న ఆఖరి సమయంలో అతను ఇలా చదువు మానివేయడం ఏం బాగులేదు. ఆ శకుంతలతోనేనా చెప్పేడేమో కారణాన్ని. ఓ పర్యాయం కనుక్కోకూడదూ?” సుకుమారి తిరిగి అంది.

“అలాగే!” అంది బిందు తల పంకిస్తూ. ఈ వార్త వినగానే ఆమెకి కూడా చాలా బాధగా ఉంది. బాధాతప్త హృదయంతో ముందుకు అడుగులు వేసింది. దార్లో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కూడా బిందుని అదే ప్రశ్న వేశారు. అందరికీ ఆమె సమాధానం ఒక్కటే.

“శకూ! సిద్ధార్థ చదువు ఆపు చేస్తున్నాడుట, అందరూ నన్ను అడుగుతున్నారు. నీకేమేనా తెలుసా?”

“అవును, నేనూ ఈ విషయం గురించి విన్నాను.”

“అతను అంత సడన్‌గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం నేను కాదు కదా అని అనిపిస్తోంది.”

“అయితే అవచ్చు. నిన్ను అతను ప్రేమించాడు. నీకు తెలియకుండానే అజ్ఞాతంగా నీవు అతడ్ని ఆరాధించావు. తనకు అనుకున్నవాడు పరాయి సొత్తు అవకూడదనుకుంది సుందూ. ఈర్ష్య, అసూయతో భగ్గుమంది. ఆ గుణాలు కొంతమంది ఆడవాళ్ళకి సహజమే కదా! అందుకే సుందూ హృదయం క్రోధాగ్ని జ్వాలల్తో దహించుకు పోయింది. వివేకం కోల్పోయి కఠినమైన మాటల్తో ఆ కుటుంబ సభ్యులు ముఖ్యంగా సుందూ అతని హృదయం గాయపరిచి ఉండచ్చు. ఆత్మాభిమానం మెండుగా గల వ్యక్తి ఆ మాటలు సహించడం కష్టమే. దానికి ఫలితమే అతని ఈ నిర్ణయం అని నేను అనుకుంటున్నాను,” శకుంతల అంది.

“నో.. నో..! అతను మధ్యలోనే అలా చదువు వదిలి వేయడానికి వీల్లేదు,” ఉద్వేగంతో అరిచినట్లుంది బిందు. కళ్ళు పెదవి చేసి విస్మయంగా బిందు వేపు చూసింది శకుంతల.

“ఈ విషయంలో మనమేం చేయగలం?”

“అలా అని చూస్తూ ఊరుకోవడమా? అలా వీల్లేదు శకూ! అతని చదువు మధ్యలో ముఖ్యంగా చివరిలో ఉన్న అతని చదువు ఆగిపోవడానికి వీల్లేదు,” దృఢంగా అంది బిందు. ఆమె నిబ్బరమైన దృఢమైన మాటలకి చకితురాలయింది శకుంతల.

“అయితే ఈ విషయంలో ఏం చేద్దామనుకుంటున్నావు?”

“ఏదో చేయాలి. అతడ్ని ఆర్థికంగా ఆదుకోవాలి.”

“అస్వతంత్రురాలివైన నీకు ఇది సాధ్యమా? అది ఎలా?”

“నా అకౌంటులో ఉన్న డబ్బు తీసి అతని కిచ్చి చదువు ఆగకుండా చూస్తాను. నా పేరున బ్యాంకు బేలన్సు ఉంది.”

“మీ అమ్మగారికి ఈ విషయం తెలుస్తే?”

“తెలుస్తే?” బిందూ కూడా అలాగే తన మనస్సులో ప్రశ్న వేసుకుంది. వెంటనే ముఖంలో ఒక్కక్షణం కంగారు, తొట్రుపాటు, వెను వెంటనే భయం లాంటి భావం అగుపించింది. మరుక్షణమే ధైర్యం, ధైర్యం సడలిపోయాయి. వెను వెంటనే వాటి స్థానంలో తిరిగి దృఢత్వం, స్థిర నిర్ణయం చోటు చేసుకున్నాయి.

“తప్పక అతనికి ఆర్థికంగా సహాయ పడ్డాలి.”

“అతని మీద జాలితోనా?”

“జాలి కాదు. నేను చెప్పలేను. అది ప్రేమ అవచ్చు. ఆరాధన అవచ్చు. ఇష్టం అవచ్చు. స్నేహమవచ్చు. మానవత్వం చూపించాలన్న తపన అవచ్చు. అతని జీవితం నా వల్ల నాశనం అవకూడదు.”

“అతడ్ని ఆదుకోవాలన్న తపన మంచిదే. నాకూ సంతోషంగా ఉంది. అయితే ఒకవేళ అతని మీద ప్రేమతో నీవు ఇలా చేయడానికి నిశ్చయించుకుని అతనితో జీవితం పంచుకోడానికా? అలా అయితే నీ ప్రేమని, నీ ఇష్టాన్ని మీ అమ్మగారు అంగీకరించక పోతే?” శకుంతల తన సందేహం వ్యక్తపరిచింది.

“సాధ్యమైనంత వరకూ మమ్మీని ఒప్పించడానికి ప్రయత్నిస్తాను. మమ్మీ అంగీకరిస్తుందన్న నమ్మకం నాకుంది.”

“నీ ఆర్థిక సహాయం అతను అంగీకరించ వద్దూ? అసలే సిద్ధార్థ ఆత్మాభిమానం మెండుగా ఉన్న మనిషి.”

“ఈ విషయంలో నీ సహకారం కూడా కావాలి శకూ! ఎందుకంటే అతను నీ మాటకి గౌరవమిస్తాడు.”

“తప్పకుండా. అయితే ఈ విషయంలో ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటున్నావు. ఈ పిరికి పిల్లేనే ఇలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది, అని నాకనిపిస్తోంది.”

“పరిస్థితులే మనల్ని అలా మార్చేస్తాయి శకూ!”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here