సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు-21

0
12

[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారు రచించిన ‘సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

[ఫేర్‌వెల్ ఫంక్షన్‍కి వచ్చి బిందూ డాన్స్ చూద్దామనుకున్నాననీ, కానీ రాలేకపోతున్నానని అంటుంది సంఘమిత్ర. వీలుకాకపోతే ఏం చేయగలరు, పర్వాలేదంటుంది ఉమాదేవి. సంఘమిత్రలోను, ఆమె భర్త మన్మథరావు లోనూ వచ్చిన మంచి మార్పులను తలచుకుంటుంది ఉమాదేవి. వాళ్ళిద్దరి గురించి ఆలోచిస్తుంటే ఇందిర వస్తుందక్కడికి. దేని గురించి ఆలోచన అని అడిగితే, చెప్తుంది ఉమాదేవి. వాళ్లిద్దరిలో చాలా మార్పు వచ్చిందని అంగీకరిస్తుంది ఇందిర. కాలేజీకి వెడతారు ఉమా, ఇందిర. బిందూ మేకప్ వేసుకుని వస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రవి సిద్ధార్థని ఉమకి, ఇందిరకి పరిచయం చేస్తాడు. ఉమాదేవికి, ఇందిరకి సిద్ధూ నచ్చుతాడు. సిద్ధార్థను చూస్తూ ఉంటే ఉమాదేవికి తనకి పరిచయం ఉన్న వ్యక్తి పోలికలు అతనిలో ఉన్నాయనిపిస్తుంది. అతను చాలా మంచివాడిలా అనిపిస్తాడు. ఇంతలో అక్కడికి తన తల్లిదండ్రులతో వచ్చిన శకూ వాళ్ళని ఉమకి, ఇందిరకి పరిచయం చేస్తుంది. ప్రోగ్రామ్ అయ్యాకా, తమ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలని అంటారు సూర్యం దంపతులు. సరేనంటుంది ఉమాదేవి. వాళ్ళని చూసిన ఇందిర, వీళ్ళ పెంపకంలో పెరిగిన శకూ ఉత్తమ గుణాలు కలిగినదే అవుతుంది అని అనుకుంటుంది. ఇంతలో అక్కడికి సిద్ధార్థ తల్లిదండ్రులు వస్తారు. వాళ్ళు సూర్యం పద్మలకి తెలుసుకాని మిగతా వాళ్ళకి తెలియదు. అందుకే సిద్ధార్థ తన తల్లిదండ్రుల్ని అక్కడున్న వాళ్ళకి పరిచయం చేస్తాడు. అప్పుడు సిద్ధూ తండ్రి రామశాస్త్రి – ఉమా, బాగున్నావా? – అని ఉమాదేవిని పలకరిస్తాడు. చిరునవ్వు నవ్వి, – రామలక్ష్మీ, కులాసేయేనా? – అని సిద్ధూ తల్లిని పలకరిస్తుంది ఉమాదేవి. రామలక్ష్మి అసహ్యంతో తల తిప్పేసుకుంటుంది. రామశాస్త్రి ఆమెని వారిస్తాడు. ఉమాదేవి గురించి కఠినంగా మాట్లాడుతుంది. ఉమాదేవి మనసు మొద్దుబారిపోతుంది. కార్యక్రమం జరుగుతున్నంత వరకూ అన్యమనస్కంగా ఉంటుంది. ప్రోగ్రామ్ అయిపోయిందని ఇందిర గట్టిగా ఉమాదేవి చెవిలో అరిచి చెప్తే అప్పుడు ఈ లోకంలోకి వస్తుంది. ఇంటికి రమ్మని సూర్యం అడిగితే, క్షమించమని, ఈ రోజు రాలేమని అంటుంది ఉమాదేవి. శకుంతల, రవి అడిగినా రాలేనని చెప్పి, బయల్దేరుతుంది. బిందు, రవి, ఇందిర ఆమెని అనుసరిస్తారు. ఇక చదవండి.]

అధ్యాయం-41

[dropcap]ప్రో[/dropcap]గ్రామ్‌కి వెళ్ళి వచ్చిన తరువాత అక్కడ తనకు ఎదురయిన అనుభవం తలుచుకుంటూ ఉంటే ఉమాదేవి మనస్సు అస్తవ్యస్తంగా తయారయింది. ఏకాగ్రతగా ఏ పనీ చేయలేకపోతోంది. పని యందు మనస్సు నిమగ్నం చేయలేకపోతోంది. అసహనం, చిరాకు ఆమెలో చోటు చేసుకున్నాయి.

“మమ్మీ! సిద్ధార్థ తల్లిదండ్రులు నీకు తెలుసా?” కూతురు ఇలాంటి ప్రశ్న వేస్తుందనుకున్న ఉమాదేవి విస్తుపోలేదు.

“తెలుసు.”

“ఎలా?”

“వాళ్ళతో మనకి బంధుత్వం ఉంది.” ఇంకా ఏదో అడగబోతున్న బిందుని వారించింది ఉమాదేవి. “అసలే నాకు చిరాగ్గా ఉంది. నీ అడ్డదిడ్డమైన ప్రశ్నల్తో నన్ను విసిగించకు,” అంది ఉమాదేవి కూతురుతో, బిందు చిన్నబుచ్చుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది.

ఇందిరకి లీవ్ లెటరు ఇచ్చి “ఈ రోజు నేను స్కూలుకి రాలేను. హెచ్‌ఎమ్‌కు సి.ఎల్. తీసుకువెళ్ళి ఇవ్వు” అంది ఉమాదేవి. ఇందిర ఆమెను తరచి అడగాలనుకుంది కాని ఈ సమయంలో ఒంటరిగా వదిలి వేయడమే మంచిదని ఉమాదేవిని తరిచి తరచి అడగలేదు.

మనిషి అశాంతి ఆందోళనగా ఉన్న సమయంలో అతనికి మానసిక స్థైర్యం ఇచ్చే వాతావరణమైనా ఉండాలి. లేకపోతే ధైర్యాన్ని కలగ చేసి ఓదార్చే మనుష్యుల సహకారమేనా ఉండాలి. లేకపోతే కొంతసేపు మనస్సు స్థిమితపడే వరకూ ఒంటరిగానేనా వదిలిపెట్టాలి. ఈ సమయంలో ఉమాదేవి ఒంటరిగా ఉండడానికే ఇష్టపడింది.

రవి కూడా ఇంట్లో ఉన్నాడు. తల్లీ కూతుర్ని ఓ మారు వచ్చి చూస్తూ ఉండమని తమ్ముడితో చెప్పి ఇందిర స్కూలుకి బయలుదేరింది. రవి రెండు సార్లు వచ్చి చూశాడు. తల్లి కూతుర్ని ఒంటరిగా వదిలిపెట్టాలి. వారి ఏకాంతానికి భంగం చేయకూడదు అని అనుకున్న రవి మౌనంగా వెళ్ళిపోయాడు.

అవతల ఉమాదేవి పరిస్థితి అలా ఉంటే ఇవతల బిందూ పరిస్థితి మరోలా ఉంది. తల్లి తనని విసుక్కున తరువాత ఖిన్నురాలై హాల్లో ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తోంది. తన తల్లి ఇలా మూడీగా ఎందుకు మారిపోయింది? సిద్ధార్థ కుంటుంబంతో తమకి ఏదో సంబంధం ఉన్నట్టనిపిస్తోంది. అలా అయితే తన తండ్రి గురించి సిద్ధార్థ తల్లిదండ్రులకి తెలిసే ఉండాలి.

ఈ విషయం ఏదో రోజున వాళ్ళ ద్వారా తనకి తెలుస్తుందని తన తల్లి కలవరపడుతోందేంటో? ఇలాంటి ఆలోచన్లు బిందును చుట్టుముడ్తున్నాయి. బిందుకి, అవతల కలతబారిన మనస్సుతో పక్క మీద అటు ఇటు దొర్లుతున్న ఉమాదేవికి ఆకలన్న ధ్యాసేలేదు.

ఇందిర తమ్ముడికి ఫోను చేసి బిందూ వాళ్ళ సంగతి అడిగింది. “వంట చేసినట్టు లేదు. నీవు వెళ్తున్న సమయంలో ఎలా ఉన్నారో ఇప్పుటి పరిస్థితీ అంతే,” అంటూ రవి అక్కకి పరిస్థితి వివరించాడు.

ఇందిర స్కూలుకి వచ్చిందే కాని ఆమె మనస్సంతా ఆ తల్లీ కూతురు చుట్టే తిరుగుతోంది. తను స్కూలుకి వస్తున్న సమయంలో తల్లీ కూతురు ఇద్దరూ మూడీగా ఉన్నారు. రవి మాటలని బట్టి తిండి కూడా తినినట్టు లేదు. తను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇలా అనుకున్న ఇందిర స్కూలుకి రెండో పూట సెలవు పెట్టి ఇంటికి వచ్చింది.

ఇందిర ఇంటికి వచ్చి చూస్తే తను స్కూలుకి వెళ్తున్న సమయంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో తను వచ్చిన తరువాత కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. వంటింటిలోకి వెళ్ళి చూసింది. వంట వండుకుని తిన్న ఛాయలు అగుపించలేదు ఇందిరకి.

“ఉమ.. ఉమ..!” గట్టిగా పిల్చింది. ఉలిక్కిపడి లేచింది. ఉమాదేవి. “తలనొప్పిగా ఉంది” అంటూ కణతలు రుద్దుకుంటోంది ఉమాదేవి. ఇందిర అమృతాంజనం తీసుకుని వచ్చి ఆమె కణతల దగ్గర రాసింది. కొద్దిసేపటికి ఉమాదేవికి కొద్దిగా రిలీఫ్ ఇచ్చినట్టనిపించింది.

“ఇలా తీవ్రమైన ఆలోచన్లతో మ్రగ్గిపోతే వచ్చేది తలనొప్పే గాని వచ్చిన సమస్యలు తొలగిపోతాయా? ఆ సమస్యల్ని అధిగమించాలంటే దానికి ఓ పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం కోసం ఆలోచించాలే కాని ఇలా సమస్యలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి. పాపం బిందు కూడా తిండి తినకుండా అలా కూర్చుంది,” అంది ఇందిర ఉమాదేవితో.

“ఏంటి బిందు ఆకలితో అలానే ఉందా ఇప్పటి వరకూ!” బాధగా అంది ఉమాదేవి.

“నీవు మంచం మీద అలా పడి ఉంటే ఎలా భోజనం చేస్తుంది. వంట వండిన వాళ్ళు ఎవరు? నాకు చెప్తే నేనైనా వండి వుంచేదాన్ని ఉమా” అంది ఇందిర. సాధారణంగా ఉమాదేవిని ఇందిర ఉమ అక్కయ్య అని పిలుస్తుంది. ఆమె మీద ఏ పాటి కోపం వచ్చినా చనువుగా ఉమా అని సంబోధిస్తుంది ఇందిర.

ఇందిర ఆ తల్లీ కూతురికి గబగబా వంట చేసి తీసుకొచ్చింది. కొసరి కొసరి వడ్డిస్తూ వాళ్ళ చేత తిండి తినిపించింది.

అవతల సిద్ధార్థ పరిస్థితి కూడా అస్తవ్యస్తంగా ఉంది. మనస్సంతా అశాంతిగా ఉంది. ఆందోళనగా ఉంది. అతని హృదయం కలతబారింది.

తల్లి అన్న మాటలు అతని హృదయానికి ముల్లులా గుచ్చుకుంటున్నాయి. “సిద్ధూ! నీ చదువుకి ఆర్థికంగా సహాయ పడింది, ఉమాదేవి కూతురా? ఇంత వరకూ జరిగిందేదో జరిగింది. ఇక మీదట వాళ్ళతో చనువు పెంచుకోవడం, నీవు ఆ అమ్మాయి చుట్టూ తిరగడం నాకిష్టం లేదు.” అంది.

“ఎందుకు?” సిద్ధార్థ గంభీరంగా తల్లిని అడిగాడు.

“ఇప్పుడు కారణం నేను చెప్పలేను. అయితే ఆ పరువు తక్కువ, చరిత్రహీనులయిన మనుష్యులకి ఎంత దూరంలో ఉంటే అంత మంచిది నీకు. మనకి డబ్బు లేకపోయినా పరువు ప్రతిష్ఠలే ముఖ్యం,” అంది తల్లి. “రామలక్ష్మీ!” భర్త ఆమెను వారించడానికి ప్రయత్నించేడు. అయితే అతనికి ఆ అవకాశం ఈయలేదు రామలక్ష్మి.

‘బిందు చాలా అమాయకురాలు. చాలా మంచి అమ్మాయి. ఆమె తల్లి కూడా చాలా మంచిదాని లాగే అగుపడుతోంది. అయితే తన తల్లికి వాళ్ళ మీద ఎందుకు చెడు అభిప్రాయం కలిగింది? నిజంగా వాళ్ళు చరిత్ర హీనులేనా? నిజం ఎంత?’ ఇలా తెగ ఆలోచిస్తోంది సిద్ధార్థ మనస్సు.

అతని మానసిక స్థితి బాగులేని సమయంలోనే రవి నుండి సిద్ధార్థకి ఫోను వచ్చింది. బిందూ, ఉమాదేవి పరిస్థితి సిద్ధార్థకి తెలియజేసాడు రవి. సిద్ధార్థ ఆ తల్లీ కూతుర్నీ చూడ్డానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అయితే అతని మనస్సులో అనేక ప్రశ్నలు – అనేక సందేహాలు. వాటికి సమాధానం లభించాలంటే కొంత సమయం పడుతుంది.

అధ్యాయం-42

“బిందూ, సిద్ధార్థ వచ్చాడు” రవి అన్నాడు. ఉమాదేవి, బిందూ ఇద్దరూ ఒకే పర్యాయం తల పైకెత్తి చూసేరు. ఎదురుగా సిద్ధార్థ, రవి ఇద్దరూ నిలబడి ఉన్నారు. సిద్ధార్థ వదనంలో అగుపడ్తున్న వేదన గమనించి అతని మనస్థితి ఎలా ఉందో అంచనా వేస్తున్నారు ఆ తల్లీ కూతురు. వారి మానసిక స్థితిని అంచనా వేస్తున్నాడు సిద్ధార్థ.

“బిందూ! మమ్మల్ని అలా చూస్తూ ఉండిపోవడమేనా లేక లోపలికి రమ్మనమని ఆహ్వానించడం ఉందా లేదా?” రవి నవ్వుతూ అన్నాడు. తడబడుతూ “రండి.. రండి..!” ఉమాదేవి బిందూ ఇద్దరూ ఒకే పర్యాయం అన్నారు. ఇద్దరూ వచ్చి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు.

“బిందూ! కులాసాయేనా?” సిద్ధార్థ అడిగాడు బిందుని.

“ఆఁ.. ఆఁ..!” అంది బిందు. ఆమె మాటల్లో తడబాటు బట్టి ఆమె మానసిక స్థితి సరిగా లేదు, తనతో అబద్ధం చెప్తోంది అని గమనించాడు సిద్ధార్థ. ఉమాదేవి గబగబా వంటింటిలోకి వెళ్ళి ప్లేట్లలో సాక్సు, యాపిల్ పండు ముక్కలు సర్ది, ఆ ప్లేట్లను రవి, సిద్ధార్థ ముందుంచింది. మంచి నీళ్ళ గ్లాసులు టీపాయి మీద ఉంచింది. టీ తయారు చేసి తేవడానికి తిరిగి వంటింటిలోకి వెళ్ళింది.

ఆ సమయంలో సిద్ధార్థకి కావల్సింది స్నాక్సు, యాపిల్ పండు ముక్కలు తినడం కాదు. అవి తినడానికి రాలేదు అతను అక్కడికి. అతనికి కావాల్సింది. వేరే ఉంది. అతని మనస్సులో అనేక సందేహాలు. వాటి సమాధానం కోసమే అతను ఇలా వచ్చాడు.

ఉమాదేవి టీ తయారు చేసి తీసుకు వచ్చేప్పటికి తను పెట్టిన ప్లేట్లలో తినుబండారాలు అలాగే ఉండడం గమనించింది ఆమె. వాళ్ళిద్దరూ వాటిని ముట్టనేనా ముట్టలేదు.

“ముందర తినండి.” నవ్వుతూ అంది ఉమాదేవి. అయితే ఆమె అంతరంగంలో అనేక ఆలోచన్లు. సిద్ధార్థకి, తమకి మధ్యగల సంబంధం తలుచుకోగానే ఒకవేపు ఆనందం. మరో వేపు కలవరపాటు కలుగుతున్నాయి.

ఇలా ఆలోచిస్తున్న ఉమాదేవి సిద్ధార్థతో “శంకరం గారు మీ మామయ్య కదూ!” అంది. ఆమె మాటలు విని విస్తుపోతూ ఆవిడ వంక చూశారు రవి, సిద్ధార్థ.

సిద్ధార్థ వేరే విధంగా ఆలోచిస్తున్నాడు. ‘ఈవిడకి మామయ్య ఎలా తెలుసు,’ అని అనుకుంటున్నాడు.

“అతని మొదటి భార్య గురించి నీకు తెలుసా?”

ఆమె ఈ మాటలకి చకితుడయ్యాడు. వెను వెంటనే అతని ముఖ కవళికల్లో మార్పు అగుపడుతోంది. ఒక్కసారి ముఖం చిట్లించాడు. అతని మనోభావాలు బట్టి ప్రస్తావన అతనికి రుచించలేదనిపించింది ఉమాదేవికి.

సిద్ధార్థ ఆలోచిస్తున్నాడు. ‘ఈ ఉమాదేవి మామయ్య మొదటి భార్య ప్రస్తావన తన దగ్గర తెచ్చిందేంటి? ఆవిడ ఈవిడికి తెలుసా? లేకపోతే ఈవిడ స్నేహితురాలా? ఆవిడ గురించి తలుచుకోవడమే మహా పాపంలా భావిస్తారు తమ కుటుంబంలో’. ఇలా ఆలోచిస్తున్న సిద్ధార్థ “ఆవిడ గురించి విన్నాను,” అన్నాడు.

“ఏమని?” కుతూహలంగా అడిగింది ఉమాదేవి.

“ఆవిడ కేరక్టరు మంచిది కాదని. మామయ్యని పెళ్ళి చేసుకోక మునుపే ఓ అబ్బాయితో ఆవిడ తిరిగేదని, వాళ్ళిద్దరికీ అక్రమ సంబంధం ఉందని. ఆవిడ చాలా పెడసరం మనిషని. ఇంటి గౌరవం పేరు ప్రతిష్ఠల్ని మంటగల్పిందని,” గుక్క త్రిప్పుకోకుండా అన్నాడు.

అతని మాటలకి ఉమాదేవి మ్రాన్పడిపోయింది. ఆమె వదనంలో విషాధ చాయలు అలుముకున్నాయి. ఆమె గుండెల్లో ఆవేదన. మరుక్షణంలోనే తిరిగి ఆమె వదనంలో గంభీరత చోటు చేసుకుంది.

“అవన్నీ నిజమేనని నీకనిపిస్తోందా? నీవు వాటిని నమ్ముతున్నావా? కళ్ళతో చూసిన కొన్ని సంఘటనలు అబద్ధమని తేలుతున్నప్పుడు ఎవరో చెప్పిన మాటలు విని మనం వాళ్ళు తప్పు చేశారని నిర్ధారణకి రావచ్చా!” ఉమాదేవి మాటలకి చప్పున జవాబు చెప్పలేక పోయాడు సిద్ధార్థ.

“ఆవిడ్ని నేను నా బాల్యంలో చూసి ఉంటాను. బాగా గుర్తు లేదు. ఊహ తెలియని వయస్సులో ఆమెను చూసిన నేను అందరూ చెప్పిందే విన్నాను. నమ్మాను. కాని ఆవిడ వ్యక్తిత్వం, నడవడి నాకేం తెలుస్తాయి? ఇంతకీ ఆవిడ ప్రస్తావన ఇప్పుడెందుకు? ఇంతకీ ఆవిడ మీకు తెలుసా?” కనుబొమ్మలు ముడిపడగా ప్రశ్నించాడు సిద్ధార్థ.

“ఆవిడ నా స్నేహితురాలు కనుక.”

“అలాగా!”

“ఆవిడ గురించి విన్నదంతా నిజం కాదు. ఆవిద చాలా ఉత్తమురాలు. సహనపరురాలు. అత్తింటి వాళ్ళు ఆమెను ఎన్ని విధాలుగా ఆరళ్ళకి గురి చేసినప్పటికి తన సహన శక్తితో ఎదుర్కుందే కాని తొందరపడలేదు. అయితే సహనానికి కూడా ఓ హద్దు అనేది ఉంటుంది. ఆ ఇంటిలోని పరిస్థితులకి, వేదనలకి గురయిన ఆమె సహనాన్ని కోల్పోయింది. మరి ఆ ఇంటిలో ఉండలేక అక్కడ ఇమడలేక బయటకొచ్చేసింది.

అలా వచ్చేయడం తప్పా? అలా వచ్చినంత మాత్రాన్న ఆమె చెడిపోయిందేనా? అయినా మన కళ్ళ ద్వారా చూసిన దాన్ని నమ్మాలి కాని ఎవరో చెప్పినదాన్ని వినడమేనా? అంతకు మునుపు నేను చెప్పినట్టు ఒక్కొక్కసారి మనం కళ్ళతో చూసిన విషయాలు కూడా నిజం అవడం. లేదు. చెప్పుడు మాటలు విని ఆవిడి మీద తప్పుడు అభిప్రాయం ఏర్పచు కోవడం సబబేనా?” అంది ఉమాదేవి.

‘ఇక్కడికి తను ఎందుకు వచ్చాడు? ఇక్కడ జరుగుతున్నదేంటి’ ఇలా సాగిపోతున్నాయి సిద్ధార్థ ఆలోచన్లు. ‘అయితే మామయ్య మొదటి భార్య గురించి ఈవిడికి అంత బాగా తెలుసా?’ అనుకున్న అతను అదే అడిగాడు ఆవిడిని.

“తెలుసు.”

“ఎవరో ఏదో చెప్తే నమ్మే మనస్తత్వం కాదు నాది. నేను ప్రత్యక్షంగా ఆవిడని చూడాలి. చూసి ఆవిడతో మాట్లాడిన తరువాతే నేను ఓ నిర్ణయానికి వస్తాను. అంతేకాని వెంటనే నేను ఓ అభిప్రాయానికి రాలేను,” స్థిర కంఠంతో అన్నాడు సిద్ధార్థ.

“మీ మామయ్య మొదటి భార్యను నేనే!”

వినరాని మాట విన్నట్టు ఉలిక్కిపడ్డాడు సిద్ధార్థ. కుర్చీలో నిటారుగా కూర్చున్నాడు. రవి, బిందు పరిస్థితి అదే. ఉమాదేవికి నలత చేసిందని ఇందిరతో వచ్చిన సంఘమిత్ర పరిస్థితి అంతే.

‘ఏమిటీ ఈవిడ మామయ్య మొదటి భార్యా? అంటే బిందు తనకి మామయ్య కూతురా? ఇది నిజమా? నిజమయితే ఎంత బాగుండును?’ ఇలా సాగిపోతున్నాయి సిద్ధార్థ ఆలోచన్లు.

‘తన తల్లి చెప్పింది నిజమా? ఆ శంకరం గారు తన కన్న తండ్రా? అంటే సుందరి తనకి చెల్లెలు. ఇప్పటికి తన తండ్రి ఎవరో తనకి తెలిసింది. తను అక్రమ సంతానం కాదు. ఇన్నాళ్ళ వరకూ తను ఎంత మనోవ్యథను అనుభవించింది? తనకీ తండ్రి ఉన్నాడు. అంటే సిద్ధార్థ తనకి బావ. ఈ ఆలోచన్లు తనకి ఎంత ఆనందాన్ని కలిగిస్తున్నాయి,’ అనుకుంటోంది బిందు.

ఇందిర, సంఘమిత్ర ఈ సమయంలో అక్కడ ఉండడం మంచిది కాదనుకుని వెనుదిరిగారు.

“అలా వెళ్ళిపోతున్నారేంటి? రండి. ఈ రోజు మీ సందేహాలు, అనుమానాలకి సమాధానం దొరుకుతుంది. ఇన్నాళ్ళూ నా జీవితం గురించి తెలుసుకోవాలని కుతూహలపడ్డ వాళ్ళ కుతూహలం తీరుతుంది. నా జీవితం తెరిచిన పుస్తకం. ఆ పుస్తకం చదవడమే మీ పని,” అంది ఉమాదేవి నవ్వుతూ. ఇందిర, సంఘమిత్ర వచ్చి కూర్చున్నారు.

తిరిగి ఉమాదేవి ముఖంలో గంభీరత చోటు చేసుకుంది. గబగబా అడుగులేసుకుంటూ లోనికి వెళ్ళిన ఉమాదేవి బీరువా తెరిచి బట్టలు అడుగునున్న ఫోటోను తీసింది. ఆ ఫోటోను తదేకంగా చూస్తున్న ఆమెలో అంతులేని ఆవేదన, వెనువెంటనే చిన్న డబ్బీని తెరిచి రక్తం మరకలున్న రుమాలు తీసింది. దాన్ని చూడగానే అనేక జ్ఞాపకాలు వాటితో పాటే ఆవేదనా చిహ్నాలు ఆమె వదనంలో దోబూచులాడ్డం మొదలు పెట్టాయి, “సిద్ధార్థ!” గంభీరంగా స్థిరంగా పలికింది ఉమాదేవి కంఠం. తృళ్ళిపడి ఆమె వంక ఆమె చేతిలో ఉన్న ఫోటో వంక చూస్తున్నాడు అక్కడున్నవారు.

“ఈ ఫోటోలో ఉన్న వాళ్ళెవరో చెప్పవయ్యా!” అంది ఉమాదేవి. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తుల్ని చూసి ఆశ్చర్యపోయాడు సిద్ధార్థ. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి తన మామయ్య శంకరం. అతనిలో అప్పటికీ ఇప్పటికీ ఏ మార్పులేదు. ‘మరి ఆ ప్రక్కనున్న ఆవిడ ఎవరు? అత్తయ్య కాత్యాయిని కాదే,’ అని ఆలోచిస్తున్నాడు సిద్ధార్థ.

‘ఆ ఫోటోలో ఉన్నది సుందరి తండ్రి. అతని ప్రక్కనున్న ఆవిడలో మమ్మీ పోలికలు అగుపిస్తున్నాయి. పోలికలు అగుపించడం ఏంటి? మమ్మీయే. మమ్మీ దగ్గర ఈ ఫోటోల ఉన్నట్టు ఇప్పటి వరకూ తనకి తెలియనే తెలియదు’ అనుకుంటోంది బిందు.

ఆ ఫోటోలో ఉన్న వ్యక్తుల వంక ఓమారు, ఉమాదేవి వంక ఓమారు చూస్తున్న సిద్ధార్థ ఏదో రహస్య విషయం కనుగొన్నట్లు కళ్ళెగరేసాడు. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి.

“అయితే.. అయితే..! మీరు.. మీరు మామయ్య మొదటి భార్యేనన్న మాట.”

“అన్న మాటేంటి?” స్థిరంగా గంభీరంగా సమాధానమిచ్చింది ఉమాదేవి. ‘ఎంత విచిత్రంగా ఉంది. సుందరి తను ఒకే తండ్రి పిల్లలు. శకూ కూడా తనకి వరసకి సోదరి అవుతుంది. సిద్ధార్థ తనకి అత్త కొడుకు. ఈ నిజం ఎంత ఆనందంగా ఉంది తనకి’ అనుకుంటోంది బిందు.

అయితే ఉమాదేవి పరిస్థితి వేరుగా ఉంది. ఇలాంటి పరిస్థితి ఏదో రోజున వస్తుందనుకుంది కాని ఆ రోజు ఇంత తొందరగా వస్తుందని ఆమె ఊహించలేదు.

సిద్ధార్థ ఆలోచన్లు మరోలా ఉన్నాయి. బిందు తనకి మామయ్య కూతురు. అంటే తనకి మరదలు. ఈ ఆలోచన తనకి ఆనందాన్ని – పులకరింతను కలగజేస్తోంది. తను విన్నదానికి – చూస్తున్నదానికి పొంతం లేదు. తను తన మామయ్య మొదటి భార్య గురించి అతి నీచంగా విన్నాడు. ఆమె ఓ బజారు మనిషి అనే భావం తన మనస్సులో ముద్ర పడింది. అయితే ఈ ఉమాదేవి అలా అగు పడ్డంలేదే? పవిత్రతకి మారుపేరుగా ఉంది ఈవిడ. బాధ్యత లెరిగి కర్తవ్య నిష్ఠతో తన జీవితాన్ని నెట్టుకొస్తున్న ఆదర్శ నారిగా అగుపడ్తోంది. ఓ కూతురికి నిజమైన మాతృమూర్తిలా అగుపిస్తోంది. ఆమె గురించి అతి నీచంగా ఊహించడానికే మనస్కరించడం లేదు.

“సిద్ధార్థ!” పిలిచింది ఉమాదేవి. ఆలోచన్ల నుండి తేరుకున్న అతను ఆమె వంక చూశాడు.

“నీకు నేను మొదట స్నేహితురాల్ని అని అబద్ధం చెప్పాను. నేను మీ మామయ్య మొదటి భార్యని అని చెప్పిన తరువాత నీ మనోభావాలు ఎలా ఉంటాయోనని గమనించాను. అయితే ఇప్పుడు నన్ను అందరూ మీ మామయ్య మొదటి భార్యగా గుర్తించవచ్చు. అలా అనుకోవడం సహజమే. అయితే ఇప్పుడు నేను అతని మొదటి భార్య స్థానంలో లేను. ఉండబోను ఉండలేను కూడా. ఆ సంబంధం బంధం ఏనాడో తెగిపోయాయి. ప్రస్తుతం అతను బిందుకి జన్మనిచ్చిన తండ్రి మాత్రమే. అందరూ అనుకున్నట్టుగా నేను బజారు మనిషిని మాత్రం కాదు. అతి పవిత్రంగా బ్రతుకుతూ నా కూతుర్ని పవిత్రంగా ఆదర్శవంతమైన మార్గంలో నడిపిస్తున్న బాధ్యత గల మాతృమూర్తిని. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం.

ఇప్పుడు నా గతాన్ని చెప్పే సమయం వచ్చింది. ఎందుకంటే మీరిద్దరూ ఒకర్ని మరొకరు ఇష్టపడుతున్నారని నాకు తెలుసు. ముందు ముందు మీరిద్దరూ ఒకటవచ్చు. ఆ తరువాత నా చరిత్ర వేలెత్తి చూపిస్తూ బిందూ మనస్సు నొప్పించే సంఘటనలు ఎదురవచ్చు. అందుకే నా గతాన్ని నేను చెప్పదల్చుకున్నాను. ఎవరు విన్నా వినకపోయినా, నమ్మినా, నమ్మక పోయినా నాకు పరవాలేదు. ముఖ్యంగా నీవు నమ్మితే అదే నాకు చాలు. విన్న తరువాత నా మీద నున్న నీ అభిప్రాయం మారుతుందని నేను అనుకుంటున్నాను,” ఉమాదేవి అంది.

తన జీవితంలో జరిగిన సంఘటల్ని పుస్తక రూపంలో వ్రాసిన ఆమె ఆ పుస్తకాన్ని రవికి ఇచ్చింది చదవమని. అందరూ వినడానికి కుతూహలబడ్తున్నారు. రవి చదవడం ఆరంభించాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here