సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు-22

0
11

[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారు రచించిన ‘సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

[ఫేర్‍వెల్ ప్రోగ్రామ్ నుంచి తిరిగి వచ్చిన ఉమాదేవి మనస్సు అస్తవ్యస్తమవుతుంది. ఏకాగ్రతగా ఏ పని చేయలేకపోతుంది. సిద్ధార్థ తల్లిదండ్రులు నీకు తెలుసా అని బిందు తల్లిని అడుగుతుంది. తెలుసంటుంది ఉమాదేవి. ఎలా తెలుసని బిందు అడిగితే, ఏదో దూరపు బంధుత్వం ఉందని అంటుంది. బిందూ ఇంకా ఏదో అడగబోతే, తనని విసిగించదని అంటుంది ఉమాదేవి. స్కూలుకి వెళ్ళలేక, ఇందిర చేత లీవ్ లెటర్ ఇచ్చి పంపిస్తుంది. బిందూ, ఉమాదేవి ఇద్దరూ బాధపడుతూ కూర్చుని ఉంటారు. ఇందిర స్కూలుకి వెళ్ళేముందు వాళ్ళిద్దరిని చూస్తూ ఉండమని తమ్ముడు రవికి చెప్పి వెళ్తుంది. మధ్యలో ఒకసారి ఫోన్ చేసి అడిగితే, ఇద్దరూ అలానే ఉన్నారు, వంట కూడా చేసినట్టు లేదని చెప్తాడు రవి. ఇందిర హాఫ్ డే లీవ్ పెట్టి వచ్చేస్తుంది. ఉమకి ధైర్యం చెప్పి అన్నం వండి తినిపిస్తుంది. సిద్ధార్థ మనసు అశాంతిగా ఉంటుంది. ఇన్నాళ్ళూ తన చదువుకి సాయం చేసిన ఉమాదేవి కూతురని తెలిసి తల్లి ఎందుకు అంత కఠినంగా మాట్లాడిందో అతనికి అర్థం కాదు. ఉమాదేవి పరువు తక్కువ మనిషని, చరిత్రహీనురాలని అంటుందామె. సిద్ధూ తండ్రి ఆమెను వారించడానికి ప్రయత్నించినా పట్టించుకోదు. అప్పుడే రవి సిద్ధూకి ఫోన్ చేసి బిందూ, ఉమాదేవిల పరిస్థితి వివరిస్తాడు. వాళ్ళని చూడడానికి బయల్దేరుతాడు సిద్ధూ. రవిని తీసుకుని, బిందు వాళ్ళింటికి వెళ్తాడు. సిద్ధార్థ వచ్చాడని రవి చెబ్తే, ఉలిక్కిపడి చూస్తారు తల్లీ కూతుళ్లు. కొన్ని క్షణాల్లో తేరుకుని లోపలికి రమ్మని పిలిచి, యాపిల్ పళ్ళను కోసి, ప్లేట్లలో పెట్టి, మంచినీళ్లతో పాటుగా వాళ్ళకిస్తుంది ఉమాదేవి. టీ పెట్టడానికి లోపలికి వెళ్తుంది. ఆమె టీ చేసి తీసుకొచ్చేసరికి ప్లేట్లలో యాపిల్ ముక్కలు అలాగే ఉండడం చూసి ముందు తినండి అంటుంది. సిద్ధు మనసులో చెలరేగుతున్న ఉద్వేగాన్ని గ్రహించి, శంకరం గారు మీ మామయ్య కదూ అని అడుగుతుంది. అవునంటాడు సిద్ధూ. ఆయన మొదటి భార్య గురించి నీకు తెలుసా అని అడుగుతుంది ఉమాదేవి. తెలీదు, అయినా ఆమె మంచిదికాదని విన్నాను అంటాడు. అది నిజం కాదని ఆమె చాలా మంచిదని చెబుతుంది ఉమాదేవి. మీకెలా తెలుసు అంటే తాను ఆమె స్నేహితురాలిని అని అంటుంది. ఎవరో ఏదో చెబితే నమ్మే మనస్తత్వం తనది కాదని, తాను ఆవిడని ప్రత్యక్షంగా చూడాలి, అప్పుడే ఆవిడపై ఓ అభిప్రాయానికి రాగలను అంటాడు సిద్ధూ. మీ మామయ్య మొదటి భార్యని నేనే అని చెబుతుంది ఉమాదేవి. అందరూ విస్తుపోతారు. లోపల్నించి ఒక ఫోటో తెచ్చి చూపిస్తుంది. అందులో శంకరం, ఉమాదేవి ఉంటారు. ఒకప్పుడు ఏం జరిగిందో చెప్తుంది. తన గతమంతా రాసి ఉన్న ఒక పుస్తకం తెచ్చి ఇస్తుంది. రవి చదవడం మొదలుపెడతాడు. ఇక చదవండి.]

అధ్యాయం-43

అటు అది పల్లెకాదు – పట్నం కాదు. మధ్యస్థంగా ఉన్న ఊరది. ఆ గ్రామంలోని ఉన్నాయి పట్నాలలో ఉన్న సదుపాయాలన్నీ, అక్కడ కూడా అగుపిస్తున్నాయి నాగరికత చిహ్నాలు. ఆ ఊరిలో ఉన్న ఆగ్రహారంలో ఉన్నాయి సనాతన భావాలు, చాంధస భావాలు పుణికి పుచుకున్న కుటుంబాలు. పైకి ఆదర్శంగా మాట్లాడినా అక్కడి వాళ్ళ మనస్సుల్లో మాత్రం ఆదర్శమనేది లేదు. సనాతన ఆచారాలనే వాసనలు తొలిగి పోలేదు.

అటువంటి అగ్రహారంలో పుట్టి పెరిగింది ఉమాదేవి. చిన్న తనంలోనే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న ఆమెను మంచకోళ్ళలా నలుగురు అన్నదమ్ములు పెంచి పెద్ద చేసి చదివించారు. చెల్లెలంటే వాళ్ళకి చాలా ఇష్టం.

ఆ గ్రామంలో చదువు అయిన తరువాత కాలేజీ చదువులకి చెల్లెల్ని పట్నానికి పంపించలేదు ఆమె అన్నలు. అన్నదమ్ములందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. అందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారు అనే సమయంలోనే కథ అడ్డం తిరిగింది. ఉమాదేవి ఆఖరి వదినకి అన్నదమ్ములందరూ చెల్లెల్ని అపురూపంగా చూసుకోవడం నచ్చలేదు. ఎప్పుడూ మరదలు మీద చిటపట లాడేది. ఉమాదేవి ఆమె ప్రవర్తన పట్టించుకోలేదు. మిగతా ముగ్గురు వదినకి మరదలంటే చెప్పనలవికానంత అభిమానం. అందుకే ఉమాదేవి ఆడింది ఆటగా పాడింది పాటగా చలామణి అయ్యేది. ప్రైవేటుగా చదువు కొనసాగిస్తోంది ఉమాదేవి.

ఆ గ్రామం పూజారి గారి కొడుకు సుకుమార్, కూతురు సరస్వతి. ఉమాదేవికి ప్రాణ స్నేహితురాలు సరస్వతి. ఆ ముగ్గురూ చిన్నప్పుడు సెలయేటిలో దిగి బట్టలు తడుపుకుంటూ ఒకరి మీద మరొకరు నీళ్ళు జల్లుకుంటూ ఆడుకునేవారు. మామిడి చెట్టునున్న కాయలు మీదకి రాళ్ళు రువ్వేవారు. తోటమాలి కేకలు వేస్తే పరుగు తీసేవారు. నేలపై పడిన మామిడి కాయల్ని ముక్కలుగా కోసి ఉప్పు – కారంతో అద్దుకుని తింటూ చక్కగా కబుర్లు చెప్పుకునేవారు. తాటికాయల్లో ముంజుల్ని పోటీలు పడి తినేవారు. ఇలా హాయిగా ఒకర్ని విడిచి మరొకరు ఉండకుండా ఉండేవారు. వారి బాల్యం అలా అందంగా ఆనందంగా గడిచిపోయింది.

వారు బాల్య దశను దాటి కౌమారావస్థ, ప్రారంభ యవ్వనావస్థకి చేరుకునే సరికి వారి శారీరికాకృతిలో – వారి భావాల్లో అనేక మార్పులు వచ్చాయి. దానికి ఫలితమే ఉమాదేవికి ఆ ఊరులో చదువు అయిన తరువాత పై ఊరికి పంపలేదు ఆమెను, చదువు నిమిత్తం. అంతేకాదు ఇంటిలో అనేక ఆంక్షలు. మునపటిలా స్వేచ్ఛగా తిరగకూడదు. ఎవ్వరితోనూ ముఖ్యంగా మగవాళ్ళతో అతి చనువుగా తిరగకూడదు, మాట్లాడకూడదు.

మొదట్లో ఈ ఆంక్షలు ఉమాదేవికి కష్టతరంగా ఉండేవి. స్వేచ్ఛగా, స్వతంత్రంగా తిరిగే పక్షిని పంజరంలో బంధించినట్టుగా విలవిల్లాడి పోయింది ఆమె. ఆ తరువాత తరువాత ఆ వాతావరణానికి నెమ్మదిగా అలవాటు పడసాగింది.

బాల్యంలో సుకుమార్‌తో ఎంతో చనువుగా మాట్లాడేది. అతని దగ్గర అల్లరి చేసేది. మారాం చేసేది. ఇప్పుడు అతని దగ్గర అలా ఉండలేక పోతోంది. వయస్సు తెచ్చిన మార్పు వల్ల ఇప్పుడు అతనితో మాట్లాడలేక పోతోంది. మాట్లాడ్డానికి సిగ్గుపడుతోంది.

సుకుమార్, సరస్వతి ఉమాదేవి కంటే రెండేళ్ళు పెద్దవాడు. అతను చాలా తెలివైనవాడు. మంచి మార్కుల్లో పి.యు.సి. పాసయిన తరువాత మెరిట్ మీద అతనికి ఇంజనీరింగులో సీటు వచ్చింది. పూజారి గారి మీద గౌరవమున్న ఇద్దరు ముగ్గురు దాతలు సుకుమార్ చదువుకి ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు.

ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం పూర్తి చేసిన సుకుమార్ ఇంటికి వచ్చాడు.

“సరస్వతీ! ఉమ రావటం లేదా?” సుకుమార్ చెల్లెల్ని అడిగాడు.

“ఇప్పుడు అది మనతో ఆడుకునే చిన్నారి ఉమ అని అనుకుంటున్నావా అన్నయ్యా!” అంది సరస్వతి.

“నాకు తెలుసు ఆటలాడే వయస్సు మనది కాదని. ఉమ చదువు ఆపు చేసిదని నేను ఇంజనీరింగు చదవడానికి వెళ్తున్న సమయంలోనే తెలిసింది. అయితే చిన్నప్పటిలా ఆడుకోకపోయినా మాట్లాడుకోడానికి అభ్యంతరమా?” చెల్లెల్ని ప్రశ్నించాడు సుకుమార్.

“ఏమో బాబూ! నాకు మాత్రం తెలియదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనేక ఆంక్షలు – నిబంధనలు దాని మీద పెడ్తున్నట్లు వినికిడి,” అంది సరస్వతి.

“ప్లీజ్ సరస్వతీ! ఉమతో ఒక్కసారి మాట్లాడాలి. నాకు ఆ అవకాశం కల్పించవూ?” అలా ప్రాధేయపడ్తున్న అన్నయ్య వేపు విచిత్రంగా చూసింది సరస్వతి. అన్నయ్య భావాలు అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తోంది సరస్వతి. అందని ద్రాక్ష పండ్ల కోసం అర్రులు జాస్తున్నాడు అన్నయ్య. ఆశలు పెంచుకోవడం సులువే కాని త్రెంచుకోవడం కష్టం. ఆ ఆశలకి ఫుల్‌స్టాప్ పెట్టకుంటే చాలా ఇబ్బందే. ఆమెకేంటి డబ్బు – హోదా గల సంబంధం తెచ్చి ఆమెకి పెళ్ళి జరిపిస్తారు అన్నయ్యలు. అంతేకాని అన్నయ్య లాంటి దిగువ మధ్య తరగతి మనుష్యుల్తో పెళ్ళి జరిపిస్తారా?

ఇంజనీరింగు చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం వస్తే కాని అన్నయ్య ఓ స్థాయికి చేరుకున్నట్టు అవుతుంది. అప్పుడే వీడు వాళ్ళ దృష్టిలో పడతాడు. ప్రస్తుతం వాళ్ళ దృష్టిలో అన్నయ్య సామాన్యుడు.

“నీ ఆలోచనకి ఆనకట్ట వేయడం మంచిది. అటువంటి ఆలోచన్లు నీకు ఆరోగ్యప్రదమైనవి కావు. వాటి వలన అనేక అనర్థాలు కలుగుతాయి. శక్తికి మించిన పరుగులు పెట్టకు,” అని గట్టిగా అరిచి చెప్పి అన్నయ్యకి హితబోధ చేద్దామనుకుంది. కాని సరస్వతి అలా చేయలేకపోయింది.

“మా మంచి చెల్లెమ్మవు కదూ! ఉమతో ఓ పర్యాయం మాట్లాడాలి. నాకీ ఉపకారం చేయవూ?” ప్రాధేయపడ్తున్నట్టు అడుగుతున్న అన్నయ్య మాటల్ని కాదనలేక పోయిది సరస్వతి. “సరే!” అంది. చెల్లెలు ఇచ్చిన ఆ హామీకి సుకుమార్ ఆనంద భరితుడయ్యాడు.

ఆ చెల్లెలు అన్నయ్యకిచ్చిన మాటను నిలబెట్టుకోడానికి ఉమాదేవిని ఒప్పించి గుడి కని వాళ్ళింట్లో చెప్పి ఇంటికి తీసుకు వచ్చి, ఉమ సుకుమార్ ఏకాంతంగా మాట్లాడుకునే అవకాశం కలిగించింది.

ఉమకి మాత్రం సుకుమార్ ఆలోచన్లు – మనోభావాలు, భావ మనోవికారాలు ఏవీ తెలియవు. కేవలం చిన్ననాటి స్నేహితుడు సుకుమార్ ఇప్పుడు ఉన్నత విద్య అభ్యసిస్తున్నాడు. తనని ఓ పర్యాయం చూడాలని అనుకుంటున్నాడు. ఆ స్నేహం తాలూకా తీపి గురుతులు ఎక్కడికి పోతాయి అని అనుకుంటూ అతడ్ని కలవడానికి వచ్చింది ఉమాదేవి.

ఆ తరువాత వారు గుడికి బయలుదేరారు. గుడికి కొద్ది దూరంలో విశాలమైన వటవృక్షం శాఖోపశాఖలుగా విస్తరించి ఉంది. ఆ వృక్షాన్ని ఆశ్రయించి అనేక జీవరాశులు తమ జీవన యాత్రను సాగిస్తున్నాయి. ఆ విశాలమైన చెట్టు నీడన కూర్చున్నారు సుకుమార్ ఉమ.

“అమ్మా ఉమా బాగున్నావా?” పూజారిగారు ఉమను యోగక్షేమాలు అడిగారు. తలూపింది ఉమ. తన కొడుకు, ఉమ అలా ఏకాంతంగా కూర్చుని మాట్లాడుకోవడం పూజారి గారికి అనుచితం అని అనిపించలేదు. చిన్నప్పటి నుండి కల్సి తిరిగారు, ఆడుకున్నారు. తన కొడుక్కి ఉమ కూడా సరస్వతి లాంటిదే అన్నదే అతని భావన. గుడి తలుపులు దగ్గరగా వేసి తనుంటున్న నివాసం వేపు నడిచారు. గుడి ఎదురుగానే అతని నివాసం.

“ఉమా!” పిల్చాడు సుకుమార్.

తలపైకెత్తి చూసింది ఆమె. అతని వంక. తనతో చిన్నప్పుడు ఆడుకున్న సుకుమార్ కాదు. ఉంగరాల జుత్తు, గుండ్రని పచ్చని ముఖానికి నల్లని, సన్నని మీసకట్టు మరింత అందంగా ఉంది. విజ్ఞానం ఉట్టిపడే ఆ కళ్ళు ఆమెకి చిలిపిగా నవ్వుతున్నట్లు అనిపించాయి.

అతని వంక సూటిగా చూడలేకపోతోందామె. చిన్నప్పటిలా చనువుగా మాట్లాడలేకపోతోంది. వయస్సుతో పాటే వచ్చిన శారీరిక – మానసిక మార్పులు ఆమెను బిడియస్థురాలిగా చేస్తున్నాయి.

“ఉమా!” తిరిగి పిల్చాడు సుకుమార్. “ఊఁ!!!” బలవంతాన్న కనురెప్పలు పైకి లేపి అతని వంక ఓమారు చూసి తిరిగి తలవొంచుకుంది ఆమె.

“నేను అంత పరాయివాడ్ని అయిపోయానా? నాతో మాట్లాడ్డం మానేసేవు. నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని నా మనస్సు ఎంత ఆరాటపడిందో తెలుసా?” అన్నాడు సుకుమార్ విద్యార్థి పాఠం గడగడ అప్పగించినట్లు. ఆమె మాట మారుస్తూ “మీ చదువు ఎలా సాగుతోంది?” అంది అతనితో. ఆమె తనని మన్నిస్తూ మాట్లాడ్డం సుకుమార్‌కి నచ్చలేదు. ఆ మన్నన తమిద్దరి మధ్యా దూరాన్ని పెంచినట్టు అనిపించింది అతనికి.

మానవ జీవితంలో బాల్య కాలం ఎంతో మధురమయినదిట. ఆ సమయంలో ఏ బాధ్యతలుండవు – కష్టాలు తెలియవు. చింతలు తెలియవు. ఆంక్షలు అంత కన్నా ఉండవు. కల్లాకపటం తెలియదు. మనస్సులో కల్మషానికి తావుండదు. స్వచ్ఛమైన నిర్మలమయిన అద్దంలా ఉంటుంది మనస్సు. అతను అలా చెప్పుకు పోతున్నాడు. నేల మీద పిచ్చిగీతలు వ్రాస్తూ అతను చెప్తున్నదాన్ని వింటోంది ఉమ.

“నీ వాలకం చూస్తే నాకు కోపం వస్తోంది.” విసుగ్గా ముఖం పెట్టి అన్నాడు సుకుమార్. కంగారుగా అతని వదనం వేపు చూసింది ఆమె, తన వల్ల ఏ పొరపాటు జరిగింది చెప్మా అని అనుకుంటూ. “అదే! నేను ఎంత వాగుతున్నా ఏ సమాధానం ఇయ్యవు. కొండపల్లి బొమ్మలా అలా ముడుచుకుని కూర్చుంటావు,” విసుగునంతా మరిచిపోయి గలగల నవ్వుతూ అన్నాడు సుకుమార్. ఆమె కూడా అతని నవ్వులో శృతి కలిపింది. “అమ్మయ్య! ఇప్పుడు నాకు నచ్చావు. నేను చదువు కోసం మిమ్మల్నందరినీ వదిలి దూరంగా వెళ్ళిపోయాను కదా. ముఖ్యంగా నిన్ను వదిలి వెళ్ళడానికి నా మనస్సు చాలా బాధపడింది తెలుసా? నీకేం అనిపించలేదా నేను నిన్ను విడిచి వెళ్ళిపోవడం,” అతను అడిగాడు అమె అతని వదనం వేపు ఓసారి అయోమయంగా చూసింది. ఆమె ముఖ కవలికల్ని పరిశీలనగా చూస్తున్నాడు అతను.

అప్పటి వరకూ అతని మీద ఆమెకి ఏ భావం లేదు. అయితే అతని మాటల తీరు చూసి ఆమె మనస్సు అడుగు పొరల్లో అతనంటే అజ్ఞాతంగా ఆకర్షణ, ప్రేమ, ఆరాధనా భావాలు మొలకెత్తాయి. అయితే అవి అజ్ఞాతంగా మరుగునపడి ఉన్నాయి. వాటిని పైకి తీసుకు వచ్చి తగిన వాతావరణంలో మొలకెత్తడానికి సహాయం కావాలి. అతని మాటల వల్ల జీవం పోసుకోవడం ఆరంభించాయి.

తనని ఇంతగా ప్రేమిస్తున్నాడు సుకుమార్ అన్న విషయం ఉమకి ఇప్పుడు తెలిసింది. తను కూడా అతడ్ని ఇష్టపడుతోంది అన్న విషయం అవగతమయింది. మనం ప్రేమించిన మనిషి దగ్గర కంటే మనల్ని ప్రేమిస్తున్న మనిషి దగ్గర మన విలువ పెరుగుతుందన్న నగ్న సత్యం ఆమెకి అవగతమయింది.

“ఐ లైక్ యూ ఉమా! ఐ లవ్ యూ!” అంటూ పిచ్చిగా ఆమె చేతులు గట్టిగా వొత్తి వదిలిపెడ్తూ అన్నాడు. ఈ ఆకస్మిక సంఘటనకి ఆమె విస్మితురాలయింది.

“రేపు ఇదే సమయానికి ఇక్కడే కలుద్దాం!” అన్నాడు. ఇద్దరూ ఇంటి దారి పట్టారు.

అధ్యాయం-44

మరునాడు వెళ్ళకూడదు మొదట అనుకున్న ఉమాదేవి వెళ్ళకుండా ఉండలేకపోయింది. క్రితం సాయంత్రం జరిగిన సంఘటనే ఆమె కళ్ళెదుట కదలాడుతోంది. సుకుమార్ అలా భావోద్రేకానికి లోనవుతాడని తను అనుకోలేదు. నిగ్రహ శక్తిని కోల్పోయిన సుకుమార్ ఇలా అంటాడని తను అనుకోలేదు.

“ఏంటి ఆలోచిస్తున్నావు ఉమా! నిన్నటి నా ప్రవర్తన గురించా! క్షమించు – క్షణికావేశంలో తొందరబాటుగా ప్రవర్తించేను,” ఇలా అంటున్న అతని కళ్ళల్లో పశ్చత్తాపభావాలు కదలాడాయి. ఆమె మౌనంగా కూర్చుని ఎదురుగా ఉన్న చెట్టువేపు చూస్తోంది.

“ఉమా!”

అతని వేపు చూసింది ఆమె.

“నేను ఏదో ఆవేశంతోనో తొందరబాటుతోనో ఇలా అనటం లేదు. నిదానంగా ఆలోచించే అంటున్నాను. నేను నిన్ను నాదానిగా చేసుకుంటాను. రాత్రంతా ఆలోచించిన తరువాత నేను ఈ నిర్ణయానికి వచ్చాను. జీవితంలో స్థిరపడిన తరువాత నా కోరిక తీర్చుకుంటాను. ఎప్పటి నుండో అజ్ఞాతంగా నా మనస్సులో ఈ కోరిక ఉంది. ఇన్నాళ్ళూ ఆ కోరికని త్రొక్కి పెట్టేసిన నేను ఇప్పుడు నీ దగ్గర ఈ ప్రస్తావన తెస్తున్నాను. ఆర్థికంగా వెనకబడ్డ మా కుటుంబంతో మీ వాళ్ళకి సంబంధం కలుపుకోవడం ఇష్టం ఉండక పోవచ్చు.” అన్నాడు సుకుమార్.

అతను ఈ ప్రస్తావన తన దగ్గర తెచ్చే వరకూ తనకి ఈ ఆలోచనే లేదు. అతను ఈ ప్రస్తావన తన దగ్గర తెచ్చిన తరువాత అతనికి తన మీద గల ప్రేమ, ఆరాధనా భావాలు తెలుసుకొచ్చాయి. ‘ఈ ఆస్తులు, అంతస్తులు శాశ్వతం కాదు. కాబోయే దంపతులకి నిర్మలమైన ప్రేమ, పరస్పర సహకారం కావాలి,’ అనుకుంటోంది ఉమాదేవి.

ప్రస్తుతం సుకుమార్‌కి స్థిరమైన జీవితం లేదు. ఆర్థికంగా మరొకరి మీద ఆధారపడి చదువు సాగిస్తున్నాడు. ఈ ప్రేమ కడుపు నింపుతుందా? అన్నం పెడ్తుందా? మొదట అతను జీవితంలో స్థిరపడాలి. అప్పుడు తను అతని దాన్నిగా అవడం తనకి సమ్మతమే తిరిగి అనుకుంది ఉమ.

“ఏంటి ఆలోచిస్తున్నావు ఉమా!” అడిగిన అతనికి తన మనస్సులో ఉద్దేశం చెప్పింది ఉమ. ఆమె ఉద్దేశం విని అతను గాఢంగా నిట్టూర్పు విడిచి పెట్టాడు. “నిజమే ఉమా! నీ ఆలోచన్లలో నిజం ఉంది. నిజాయితీ ఉంది. నీ కోరిక ప్రకారం కానీ! అయితే నా సంతృప్తి కోసం నీవు నాకు ఒక్క విషయంలో సహకరించాలి,” ఆమె వంక నిశితంగా చూస్తూ అన్నాడు.

“ఏంటి?”

“చెప్తాను, పద” అంటూ అతను ఉమను పార్వతీదేవి గుడి వేపు చేయి గట్టిగా పట్టుకుని తీసుకెళ్ళాడు. మంత్ర ముగ్ధురాల్లా ఆమె అతని వెంట నడిచింది.

“ఉమా నేను చేయబోయే పనేంటో తెలుసా?

“ఏంటి?”

సుకుమార్ పార్వతీదేవి విగ్రహం పాదాల చెంత ఉన్న ఎర్రని కుంకం తీసాడు. “ఈ కుంకం నీ పాపిటిలో ఉంచుతాను. అలా అయితే మనిద్దరికీ పెళ్ళి అయినట్టే లెక్క” అంటూ ఎర్రని ఆ కుంకాన్ని ఆమె పాపిటిలో ఉంచబోతున్న సమయంలో “ఆగు” అన్న భయంకర గర్జన వినిపించింది. ఆ అరుపుకి అదిరిపడి బుర్ర ప్రక్కకి త్రిప్పి చూశాడు సుకుమార్.

గర్భ గుడి ద్వారం దగ్గర ఉమ నలుగురు అన్నదమ్ములు నిలబడి అగ్నిమయ నేత్రాల్తో అతని చర్య గమనిస్తున్నారు. వాళ్ళను చూసి గజగజ వణికిపోతున్నాడు. యాంత్రికంగా అతని చేయి క్రిందకి దిగిపోయింది.

సుకుమార్ భయం భయంగా చూస్తున్న వేపు తల పైకెత్తి చూసింది ఉమ. శరీరం పెనుగాలిలో ఊగిపోతున్న ఎండుటాకులా రెపరెపలాడింది. ఆమె కంపిస్తోంది. గుండెలు పీచుపీచుమంటున్నాయి. శరీరమంతా చెమటలు పట్టింది. కాళ్ళు స్వాధీనం తప్పుతున్నాయి.

ఉమాదేవి చిన్న వదిన సుకుమార్, ఉమ గుడికి వెళ్ళడం గమనించి ఈ వార్త మగవాళ్ళ చెవిలో వేసింది. ఉమ అంటే ఆవిడకి పడదు కదా! దానికి ఫలితమే ఆమె అన్నదమ్ములు నలుగురూ గుడి దగ్గరికి వచ్చారు.

“నా కొడకా! ఇప్పుడు నీకు మేము పెళ్ళి చేస్తామురా!” అంటూ సుకుమార్ జుత్తు పట్టుకుని ఈడ్చి ఈడ్చి కొడ్తున్నారు ఉమ అన్నదమ్ములు. సుకుమార్ గర్భ గుడిలోనే నేల మీద పడిపోయాడు. ఆనాడు పద్మవ్యూహంలోకి చొరబడిన అభిమన్యుడ్ని కౌరవ సేనంతా ఏక ఉమ్మడిగా కలిసి అధర్మరీతిలో హతమార్చోరో అదే విధంగా ఉమ నలుగురు అన్నదమ్ములూ సుకుమార్ మీద దాడి చేసి బాదుతున్నారు.

“నన్ను కొట్టకండి, కొట్టకండి” అంటూ రెండు చేతుల్తో వాళ్ళకి నమస్కారం చేస్తూ సుకుమార్ ప్రాధేయపడ్తున్నాడు. అతని గోడు వినిపించుకునే నాథుడు లేదు అక్కడ. డేగ కాళ్ళ క్రింద నలిగిపోతున్న కోడి పిల్లలా సుకుమార్ తన్నుకుంటున్నాడు.

కొడుకు అరుపులు విని అక్కడికి వచ్చిన పూజారి గారు పరిస్థితిని గమనించి “అయ్యా! వాణ్ని వదిలిపెట్టండయ్యా! కొట్టకండయ్యా! వాడికి నేను చీవాట్లు పెడ్తాను. తప్పు చేస్తే వాడికి వేసే శిక్ష నాకు వేయండయ్యా! నాకు పుత్ర బిక్ష పెట్టండయ్యా!” అంటూ అతి దీనంగా విలపిస్తూ ప్రాధేయపడ్తూ వేడుకుంటున్నాడు.

మానవత్వం నశించి దానవత్వంతో ఊగిపోతున్న వారికి పూజారి గారి మాటలు చెవికెక్కలేదు. ఉమ చిన్న అన్నయ్య గుడిలో నున్న దీపపు సెమ్మ తీసి సుకుమార్ తల మీద బాదాడు. “అమ్మా!” అంటూ సుకుమార్ కుప్పకూలాడు. గాయం నుండి జివ్వున రక్తం వచ్చి నేల మీద పడింది.

ఇదంతా చూస్తున్న ఉమాదేవి నిగ్రహించుకోలేక పోయింది. “సుకుమార్!” అంటూ గట్టిగా అరుస్తూ అతడ్ని సమీపించి తన చేతిలో ఉన్న రుమాలుతో అతని తలను అద్దింది. రుమాలు రక్తసిక్తమయింది. ఆమె చర్యని సహించలేని ఆఖరి అన్నయ్య ఆమెను బరబరా ఈడ్చుకుని ఇంటికి తీసుకు వచ్చి గదిలో పెట్టి గడియ వేశాడు.

ఉమాదేవి హృదయం ఆక్రోశిస్తోంది. గదిలో ఒంటరిగా విలపిస్తోంది. సుకుమార్ పరిస్థితి ఎలా ఉందో? ఈ సంఘటనలో అతని ఒక్కడిదీ తప్పు కాదు. తన తప్పు కూడా ఉంది. అతనిలో తను కూడా ఆశలు కల్పించబట్టే అతను ఇంత చొరవ తీసుకున్నాడు అనుకుని బాధపడుతోంది. చేతిలో ఉన్న రుమాలు విప్పింది. తెల్లని రుమాలు మీద ఎర్రటి రక్తపు మరకలు ఆమె దుఃఖాన్ని బాధని రెట్టింపు చేశాయి. ఏం చేయలేని అసహాయ స్థితి తనది. తన వల్లనే కదా అతనికి ఈ గతి పట్టింది, మరో పర్యాయం అనుకుంటూ ఉమ కుమిలిపోతోంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here