సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు-24

0
12

[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారు రచించిన ‘సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

[సుకుమార్‍ని కొట్టి, ఉమాదేవిని ఇంటికి తెచ్చి ఓ గదిలో పడేస్తారు అన్నలు. మూడు నెలలు గడిచిన ఉమాదేవికి ఇంట్లో స్వతంత్రం ఉండదు. అదే గదిలో బంధీగా ఉన్నట్టు ఉంటుంది. సుకుమార్ రక్తంతో తడిచిన రుమాలును పదే పదే చూస్తూ అతడు క్షేమంగా ఉండాలని దేవుడిని కోరుకుంటుంది. మానసికంగా అశాంతితో ఉన్న ఉమ ఒకసారి గుడికి వెళ్ళిరావలని అనుకుంటుంది. పెద్ద వదినతో తన కోరికని చెప్పగా, ఆమె అర్థం చేసుకుని మగవాళ్ళని ఒప్పించి, గుడికి వెళ్ళడానికి తగిన ఏర్పాట్లు చేస్తుంది. గుడికి వచ్చిన ఉమని చూసి పూజారి గారు క్రుద్ధులవుతారు. తన కొడుకు జీవితాన్ని నాశనం చేశావంటూ ఉమని శపిస్తారు. ఏం జరిగిందో ఉమకి అర్థం కాదు. ఇంతలో సరస్వతి వచ్చి, జరిగినదంతా ఉమకి చెప్తుంది. ఉమ అన్నలు కొట్టిన దెబ్బలకి సుకుమార్‍కి మతిచలించిందనీ, కొన్ని రోజుల చికిత్స తరువాత ఇంట్లోంచి పారిపోయాడని చెప్తుంది. ఆ బాధలోనే పూజారి గారు అలా మాట్లాడారని అంటుంది. నీ పరిస్థితి ఎలా ఉందని అడిగితే, తన పరిస్థితి వివరిస్తుంది ఉమ. ఉమ వదిన అనసూయ, ఆమె పినతల్లి మాట్లాడుకుంటుంటారు. ఆమె పినతల్లి తన కొడుకు శంకరం గురించి, అతని వ్యసనాల గురించి, అప్రయోజకత్వం గురించి అనసూయకి చెప్తుంది. పెళ్ళి చేస్తే దారికొస్తాడని అంటుంది అనసూయ. తన కొడుకుకి పిల్లని ఎవరిస్తారని అంటుంది పినతల్లి. ఇంతలో అనసూయకు ఉమ గుర్తొస్తుంది. శంకరానికి ఉమనిచ్చి పెళ్ళి చేస్తే తమకి ప్రయోజనం అని ఆలోచిస్తుంది. మెల్లగా ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పిస్తుంది. అన్నలు చెల్లెల్ని ఒప్పించి పెళ్ళి నిశ్చయం చేసేస్తారు. శంకరం మంచివాడు కాదని ఉమకి తెలిసినా, ఏమీ చేయలేని నిస్సహాయురాలైపోతుంది. తనకి పూజారి గారి శాపం తగిలిందని బాధపడ్తుంది. ఇక చదవండి.]

అధ్యాయం-47

[dropcap]ఉ[/dropcap]మాదేవి ఇష్టాయిష్టాల్తో సంబంధం లేకుండా ఆమె మెళ్ళో మూడు ముళ్ళూ వేశాడు శంకరం. ఆ మూడు ముళ్ళు తన మెడలో ఉరి త్రాగు బిగించినట్లనిపించింది ఆమెకి. తన శరీరానికి మూడు ముళ్ళూ వేసి తన శరీరాన్ని తన స్వంతం చేసుకున్నాడు కాని మనస్సుని మాత్రం కాదు. ఇలా అనుకుంటున్న సమయంలో పెళ్ళి పందిరిలో గుసగుసలు. అవి పెరిగి పెద్దవవుతున్నాయి.

“అమ్మాయ్! అనసూయా నీవు ఇంత మోసం చేస్తావనుకోలేదు,” అంది ఉమ అత్తగారు వదినతో.

“ఏంటి పిన్ని?”

“అదేనే నీ ఆడబడుచు మంచిది కాదుటగా! తిరుగుబోతుట. ఎవడో కుర్రాడితో నీ ఆడబడుచుకి సంబంధం ఉందిట కదా! మంచి సంబంధమే కుదిర్చాము,” అత్తగారు వదిన అనసూయతో అంది. పింతల్లి మాటలకి అనసూయకి కూడా బాగా కోపం వచ్చింది.

“ఆఁ పోనిద్దు పిన్నీ నీ కొడుకేఁ బుద్ధిమంతుడా? నీతిమంతుడా?” వ్యంగ్యంగా అంది.

ఆ మాటలకి ఉమ అత్తగారికి చెప్పలేనంత కోపం వచ్చింది. “వాడికీ నీ ఆడబడుచుకీ పోలికా? వాడంటే మగవాడు. ఎలాగైనా తిరుగుతాడు. ఎంతమందినైనా ఉంచుకుంటాడు,” గట్టిగా అరుస్తోంది ఆవిడ. మగవాడు ఎంత నీచాతి నీచమైన పని చేసినా తప్పులేదు అన్న భావం ఆమె మాటల్లో అగుపిస్తోంది.

పెళ్ళికొచ్చిన వాళ్ళు చోద్యం చూస్తున్నట్లు చూస్తున్నారు. అనసూయ కోపం కూడా తారా స్థాయికి చేరుకుంటోంది. “మొదట నా ఆడబడుచుని శంకరానికి ఇచ్చి పెళ్ళి చేయాలన్న ఆలోచన నాకు లేనే లేదు. నాలో ఆలోచన రేకెత్తించి పురిగొల్పిన దానివి నీవే. పై పెచ్చు నా మీద నిష్ఠురాలు వేస్తున్నావా?”

ఇలా పెళ్ళి పందిరిలో మాటా మాటా పెరుగుతూనే ఉన్నాయి. ఆడవాళ్ళు మధ్య జరిగిన ఈ వాదనలు చివరికి మగవాళ్ళ వరకూ వచ్చాయి. మీ అమ్మాయి ఇలాంటిది అంటే మీ అబ్బాయి గ్రంథసాంగుడు అని వాదనలు, దెప్పిపొదుపులు వరకూ వచ్చింది పరిస్థితి.

“మా వాడ్ని అంతేసి మాటలంటారా? మా వంశం, గౌరవం పరువు ప్రతిష్ఠలు ఎలాంటివో ఆలోచించు.”

“మా వంశం అంతకన్నా నిప్పులాంటిది.”

ఇలా వాదనల మధ్య ఉమ బలిపశువు అయింది.

“మీ అమ్మాయిని మీ దగ్గరే ఉంచుకోండి.” మగ పెళ్ళి వారు అన్నారు.

“మూడు ముళ్ళు పడగానే మా అమ్మాయి, మీ అమ్మాయి అయింది. ఏం చేసుకుంటారో చేసుకోండి.” ఆడ పెళ్ళివారన్నారు. మధ్యవర్తులు కల్పించుకోవడంతో రాజీ కుదిరింది. చివరికి పెళ్ళి కూతురితో ఎవ్వరూ రాకుండా ఒక్కదాన్నే తీసుకు వెళ్ళడానికి మగ పెళ్ళివారు చివరికి అంగీకరించారు.

ఉమ మనస్సు బితుకు బితుకు మంటోంది. అపరిచితమైన ప్రదేశానికి, అపరిచితులైన మనుష్యుల మధ్య మనుగడ సాగించడానికి, ఒక్కర్తీ బయలుదేరింది ఉమ. ఆమె పరిస్థితి ఎలా ఉందంటే బలిపశువు కసాయి వాడి వెంట నడిచినట్టుంది.

పెళ్ళయిన ప్రతీ స్త్రీకి, పురుషుడుకీ వారి జీవితాల్లో మొదటి రాత్రికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వారి భావి జీవితం ఈ రాత్రి సఫలత మీదనే సుఖకరం అవచ్చు వికటిస్తే దుఃఖకరం అవచ్చు. తమ జీవితాన్ని మధురాతి మధురంగా మలుచుకోవాలని నూతన దంపతులు ఎదురు చూస్తారు. చాలామంది విషయంలో అది మధుర రాత్రిగా మిగిలిపోతే మరికొంత మంది దురదృష్టవంతులకి అది కాళ రాత్రిగా మిగిలిపోతుంది.

ముఖంలో ఎటువంటి భావం లేకుండానే నిర్లిప్తంగా మొదటి రాత్రి నాడు గదిలోకి అడుగుపెట్టింది ఉమ. అలంకరించిన ఆ శోభనపు గదిలో మంచంపై ఆసీనుడై ఉన్న శంకరం విలాసంగా సిగరెట్టు త్రాగుతూ రింగులు రింగులుగా పొగ పైకి వదుల్తున్నాడు.

ఉమాదేవి అడుగులు చప్పుడు విని అట్నించిటు తిరిగిన అతను ఆమెను చూశాడు. “స్వాగతం” అని అన్నాడు. అతని మాటల్లో అగుపడ్తునన వ్యంగ్యం గుర్తించినా ఏమీ తెలియనట్టు ఊరుకుంది ఆమె.

“ఇలారా!” అలా పిలుస్తున్న అతని కంఠంలో లాలిత్యం లేదు. మార్దవం అంత కాన్న లేదు. అనురాగం – ఆప్యాయత, ప్రేమ ఇవేవీ లేవు. ఆజ్ఞ, అధికారం, దర్భం ఇవే అతని మాటల్లో వ్యక్తమవుతున్నాయి. వెట్టు చాకిరీ చేయించుకోడానికి యజమాని బానిసను తన దగ్గరకు పిలిచినట్టు ఆజ్ఞాపిస్తున్నట్టుంది.

ఉమ తడబడ్తున్న అడుగుల్తో అతడి మంచం దగ్గరికి వెళ్ళింది.

“నిన్ను నేను పెళ్ళి చేసుకోడానికి ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా?” ఆమె వేపు సూటిగా చూస్తూ ప్రశ్నించాడు. ఆమె కాలి బొటని వేలితో నేల మీద సున్నాలు చూస్తూ తలవొంచుకుని అలాగే నిలబడి యుండిపోయింది.

“నీవు తిరుగుబోతువి – నేను కూడా తిరుగుబోతుని. నీలాంటి దాన్ని పెళ్ళి చేసుకుంటే నా మార్గంలో ఆటంకం కలిగించవు. ఎందుకంటే నీవు అలాంటి దానివే కనుక. అదే సంసార పక్షమయిన అమ్మాయి అయితే అడుగడుగునా తల నొప్పే. గోలపెట్టి నానా రభస చేసి నన్ను బయట కీడుస్తుంది,” వ్యంగ్యంగా నవ్వుతూ అన్నాడు.

అతని మాటలు బట్టి తను చెడిపోయిన ఆడది. సంసార పక్షమైనది కాదు. తను తిరుగుబోతు, అలా ఆలోచిస్తున్న ఉమాదేవి “నేను తిరుగుబోతుని కాను,” అని గట్టిగా అరవ్వాలనుకుంది కాని అలా చేయలేకపోయింది.

“నా మాటలు వింటున్నావా?” అంటూ అతను తన చేతిలో వెలుగుతున్న సిగరెట్టు పీకను ఆమె మోచేతికి తాకించాడు. చురుక్కుమంది. “అమ్మా!” అంది బాధగా ఉమాదేవి. ఆమె కన్నుల్లో కన్నీటి తెర తళుక్కుమంది.

“ఈ మాత్రానికే బాధపడి భయపడిపోతే ఎలా? ముందుంది ముసళ్ళ పండుగ” అతను వికటంగా నవ్వుతూ అన్నాడు. అయితే ఇతనిది శాడిజం మనస్తత్వం అన్నమాట. ఈ మనస్తత్వం గల వాళ్ళు తమ జీవిత భాగస్వాములనే కాదు ఇతరులను కూడా నానా చిత్ర హింసలకు గురి చేసి వాళ్ళు బాధపడ్తుంటే అది చూసి ఆనందిస్తారు.

ఇలా ఆలోచిస్తున్న ఉమాదేవి ఒక్కక్షణం వొణికిపోయింది. ‘హే భగవాన్! చివరికి నాకిలాంటి జీవితం ప్రసాదించావా? క్షణ క్షణం ఇలా చిత్ర హింసలకి గురి అవుతూ బ్రతికే కన్నా ఒక్కసారి నన్ను అంతం చేసేయ్!’ ఆక్రోసిస్తోంది ఆమె మనస్సు. అంతరంగం ఆమెను ఆదుకునేవారు ఆపద నుండి గట్టెక్కించేవారు అగుపించలేదు.

సిగరెట్టు పీక కాలితో నలిపివేసి బయటకు విసరివేసిన అతను బాటిల్లో ఉన్న ఎర్ర ద్రవాన్ని గ్లాసులోకి ఒంపుకుని ఆప్యాయంగా త్రాగుతున్నాడు. అతని కళ్ళులో ఎర్రని జీరలు, కళ్ళు మత్తుగా వాలుతున్నాయి. మనిషి మాట తడబడుతోంది. జోగుతున్నాడు. అతని చర్యలు – వాలకం ఆమెకి భయాన్ని కలగజేస్తున్నాయి.

“నీ ప్రియుడు నా కన్నా బాగుంటాడా? అందంగా ఉంటాడా? రసికుడేనా?” ఆమె వేపు కాంక్షగా చూస్తూ అడుగుతున్నాడు. ఆమె ఏం జవాబియ్యకుండా మౌనంగా నేల వేపు చూస్తోంది.

క్రమంగా అతనిలో మత్తుతో పాటు కాంక్ష కూడా పెరుగుతోంది. కోమలమైన కుసుమాన్ని కర్కశమైన చేతుల్తో పట్టుకుని నలిపి వేసినట్లు విచక్షణా జ్ఞానం కోల్పోయిన అతను చేతుల్తో ఉమాదేవిని పట్టుకుని ఆమెను నలిపేస్తున్నాడు కర్కశంగా ఆమె విలవిల్లాడిపోతోంది. బాధతో కళ్ళలో నుండి కన్నీరు దారలు కడ్తోంది. బాధగా మూల్గుతున్న ఆమె మూల్గులు ఆ గది దాటి బయటకు వినబడనంత హీన గొంతుకతో అరుస్తోంది. అతని పంటి గాట్లకి ఆమె అవయవాలు రక్తాన్ని చిమ్ముతున్నాయి. నిస్సత్తువుగా అలాపడి ఉంది ఆమె. రాక్షస రతికి అలిసిపోయి – నీరసించి పోయిన ఆమె సొమ్మసిల్లి పడి ఉంది మంచంపై కోరిక తీర్చుకున్న అతను మత్తుగా నిద్రపోతున్నాడు.

అధ్యాయం-48

అత్తవారింటిలో ఉమాదేవి జీవితం చాలా దుర్భరంగా తయారయింది. మనస్సులోని దుఃఖాన్ని బయటకు వెళ్ళగ్రక్కుతూ బోరున కరువు దీరా ఏడవడానికి కూడా అక్కడ అనువైన స్థలం లేక దుఃఖాన్ని మనస్సులోనే దిగమ్రింగుకుంటోందామె. తన కడుపులో మాట కరువు తీరా చెప్పుకోడానికి ఆమెకి నా అన్నవాళ్ళు కరువయ్యారు. మూగబోయిన మనస్సుతో – జీవచ్ఛవంలా జీవితం గడుపుతోంది ఉమాదేవి.

ఆమెకి ఏ ఆకాంక్షా లేదు. ఏ కోరికా లేదు. అభిలాష అంతకన్నా లేదు. అల్లారు ముద్దుగా పెంచిన తన వాళ్ళకి కూడా దూరమయి దుర్భరమైన జీవితం గడుపుతోంది ఆమె.

ఇంట్లో అందరూ తినేసేక గిన్నె అడుగున మిగిలిన నాలుగు మెతుకులు తిని అర్థాకలితోనే గడుపుకునే హీనస్థితి ఆమెకు దాపరించింది. తెల్లవారు జామున కోడి కూసిన వెంటనే లేవాలి. పాచి పని చేయడం ఆరంభించిన ఆమె చేతులు రాత్రి అందరూ పడుకున్నాక కాని విశ్రాంతి తీసుకోవు. ఆ ఇంటిలో మానవత్వం ఉన్న మనుష్యులు ఇద్దరే ఇద్దరు. తన మీద జాలి చూపించే వాళ్ళు ఆ ఇద్దరే. వాళ్ళే చిన్న ఆడబడుచు భర్త రామశాస్త్రి, పెద్దాడబడుచు. “ఉమా! నేనూ అత్తింటి ఆరళ్ళు అనుభవించేను. అందుకే ఆ బాధ నాకు తెలుసు. ఏం చేస్తాం? అనుభవించడమే” అనేది ఒకసారి. “ఎంతకని బాధలు అనుభవిస్తావు ఎదిరించు” అనేది ఆవిడ.

“ఉమా! మా పరిస్థితులు ఆర్థికంగా బాగు లేక బట్టే అత్తవారింటిలో ఉండవల్సి వస్తోంది. నీ బాధలు చూడలేకపోతున్నాను. మీ చిన్నాడబడుచు అదే నా భార్యలో మచ్చుకేనా మానవత్వం లేదు,” అంటూ బాధపడేవాడు. రాత్రి నాలుగు జాములూ తనకి విశ్రాంతి ఉండేది కాదు. బాగా తాగొచ్చిన శంకరం ఆమె ఇష్టా ఇష్టాల్తో సంబంధం లేకుండా ఆమె శరీరంతో ఓ ఆట బొమ్మతో ఆడుకున్నట్లు తెల్లారే వరకూ – తన కోరిక తీర్చే వరకూ కర్కశంగా ఆమె శరీరాన్ని నలిపెస్తూ వినోదిస్తూ హింసిస్తూ ఆనందపడేవాడు.

అతని కోరిక తిరస్కరిస్తే వాతలు – దెబ్బలు. ఇదే ఆమె జీవితంలో నిత్యకృత్యమయింది. ఆడదానికి ప్రకృతి ఇచ్చిన శాపమే అది. ఆడదానికి కోరిక లేకపోయినా పురుషుడి కోరిక దగ్గర తలవొంచాలి. ఆ సంపర్కంలో ఆడదానికి తల్లి అయ్యే ఆస్కారం ఉంది. శంకరం త్రాగి వస్తాడు. మైకంలో ఆడదాని పొందుకావాలి. బయట ఆడది అందుబాటులో లేకపోతే ఇంటి ఆడదానికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఆమెన అనుభవించి కోరిక తీర్చుకుంటాడు. అలా కల్సిన కలియక ఫలితమే ఉమ గర్భవతి అయింది.

ఏది తిన్నా ఇమడటం లేదు. కళ్ళు తిరుగుతున్నాయి. శరీరం జోగుతుంది. సరియైన తిండి లేకపోవడం వలన నీరసం శరీరమంతా వ్యాపించింది. అటువంటి స్థితిలో కూడా చిన్న ఆడబడుచు మాసిన బట్టలు కుప్పలు కుప్పలుగా ఉమాదేవిని ఉతకమని పడేసేది. ఒక్కొక్క పర్యాయం పిల్లల మలమూత్రాలు శుభ్రం చేయమని పురమాయించేది. భర్త రామశాస్త్రి ఉమ మీద జాలిపడే భర్త మీద గయ్‌మని లేచేది.

తనకే సరియైన తిండి లేదు. తన గర్భంలో పిల్ల పెరిగేదెట్లా? అయితే అబార్షను చేయించుకుందికి మనస్సు అంగీకరించలేదు. అలా జరగనీరు కూడా అత్తవారింట్లో. తనని లేడీ డాక్టరు దగ్గరకు తీసుకెళ్ళి మందులిప్పిస్తారు. బలమైన ఆహారం ఇస్తారు అనుకుంది ఉమాదేవి. ఆమె మీద ఆ ఇంట్లో ఎవ్వరికీ ఆప్యాయత లేదు. ఆదరణ లేదు. కరుణ లేదు. సానుభూతి అంతకన్నా లేదు. అటువంటి పరిస్థితిలో కూడా బండెడు అంట్లు ముందేసుకుని తోమవల్సిందే. పేడ తీసి పిడకలు పెట్టవల్సిందే. అందరి బట్టలు ఉతకవల్సిందే. ఇంత గొడ్డు చాకిరీ చేస్తున్నా ఆమె వల్ల ఏ కొద్దిపాటి లోపం జరిగినా ఇటువంటి పరిస్థితిలో కూడా తాపులు తినడం – శరీరంపై వాతలు తేలడం పరిపాటి అయిపోయింది.

“నేను చాలా పర్యాయములు అడుగుదామనుకున్నాను. ఆ రక్తం మరకులున్న రుమాలు పట్టుకుని అలా పరధ్యానంగా కూర్చుంటావు. అంత భధ్రంగా ఆ రుమాల్ని నీ పెట్టిలో పెట్టుకుని ఉంచుకోడానికి కారణం ఏంటి? దానితో నీకు సంబంధం ఏంటి?” కరుకుగా కఠినంగా పలికింది శంకరం కంఠం.

ఉలిక్కి పడి బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఉమాదేవి భయ భయంగా అపరాధిలా అతని వేపు చూస్తోంది. దొంగను పట్టుకున్న పోలీసు అధికారిలా డాబు దర్పం చూపిస్తున్నాడు శంకరం.

అతను తనకి భర్తయినా తన మీద ఎంత అధికారమున్నా తనకి తెలియకుండా తన పరోక్షంలో తన పెట్టెను ఇలా అతను తెరిచి వెతకడం ఆమెకి నచ్చలేదు. అతనికున్న సంస్కారానికి అతని మీద అసహ్యం కూడా కలిగింది. ఆ భావాన్ని ఆమె కళ్ళ ద్వారా వ్యక్తం చేసింది.

అలా చూస్తున్న ఆమె చూపులు అతని వివేకాన్ని మరింత రెచ్చగొడ్తున్నాయి.

“ఏంటా నిర్లక్ష్యం చూపులు?” గట్టిగా అరిచాడు శంకరం. ఆమె నోరు మెదపలేదు. అతని సహనాన్ని పరీక్షిస్తోందా అన్నట్టు మౌనంగా అలా నిలబడి పోయింది. “చెప్తావా – చెప్పవా?” అంటూ పేక బెత్తంతో బాదుతున్నాడు గొడ్డును బాదినట్టు ఆమె శరీరం అతను కొట్టిన దెబ్బలకి తాళలేక పోతోంది. శరీరం ఆ దెబ్బలకి కమిలిపోతోంది. బాధగా కళ్ళు మూసుకుని “అమ్మో!” అంటూ చిన్నగా అరుస్తూ రోదిస్తోంది. అగ్నికి వాయువు తోడయినట్టు కొడుకుని మరింత రెచ్చకొడ్తూ అతని కోపాన్ని ద్విగిణీకృతం చేస్తోంది అత్తగారు.

తగిలిన దెబ్బలకి దుఃఖాన్ని అణుచుకోవడం ఉమకి అసాధ్యమవుతోంది. కళ్ళలో నుండి కన్నీటి బిందువులు జారి నేల మీద పడ్తున్నాయి. ‘ఈ సమాజంలో భర్త అన్న వాడి స్థానం ఇదా? జీవితాంతం తన భార్య కష్ట సుఖాల్లో భాగం పంచుకోవలిసిన భర్త – గృహిణిగా తనని ఆదరించవలసినవాడు, తన జీవితంలో సగ భాగమైన అర్థాంగి యడల మెలగవల్సిన భర్త తీరు ఇదా? భర్త అన్న పదానికి అర్థమే మార్చివేసి ఇష్టం వచ్చినట్టు భార్యను బాదడం, ఆమెను చిత్ర హింసలకు గురి చేయడమేనా భర్త పని,’ ఇలా ఆలోచిస్తున్న ఉమాదేవి కళ్ళు మూసుకుని కుమిలి పోతోంది.

విధవ ఆడబడుచు మాటలు గుర్తుకు వస్తున్నాయి. ఆమెలో క్రమేపి తెగింపు చోటు చేసుకుంది. సాధు జంతువు పిల్లిని గదిలో బంధించి కొట్టడానికి ప్రయత్నిస్తే అది ఎదురుదాడి చేస్తుంది. ఉమ కూడా అదే చేసింది. తనని బాదుతున్న శంకరం చేయి గట్టిగా పట్టుకుంది. ఆపేక బెత్తాన్ని లాక్కుని ముక్కలు ముక్కలు చేసింది. ఈ హఠాత్ సంఘటనకి ఆ కుటుంబ సభ్యులు విస్మితులయ్యారు. మరుక్షణం ఆమె ఈ తెగింపు గుణం వారి కోపాన్ని మరింత అధికం చేసింది. ఆమె ఈ చర్య వాళ్ళకి అవమానకరంగా తలవొంపులు తెచ్చేదిగా అయింది. దానికి ఫలితమే ఆమెను ఆ ఇంటి నుండి బహిష్కరించడానికి నిర్ణయం చేసుకున్నారు.

వారు ఇంటి నుండి తగిలి వేయక ముందే ఆమె ఆ ఇంటిని తనే బహిష్కరిస్తున్నట్లు పెట్టి పట్టుకుని ఆ ఇంటి నుండి బయలు దేరింది. తన రాక పుట్టింటి వాళ్ళకి సంతోషం కలిగించలేదు. అక్కడా ఆమెకి చుక్కెదురయింది. అన్నలు సపోర్టు లభించలేదు. వదినలు సూటిపోటి మాటలు ఆమెకు బాధ కలిగించాయి. అప్పటికే ఆమె తిండి తిని ఒక రోజు అయింది. విపరీతమైన ఆకలి ఒకవేపు మరోవంక నీరసం.

అందరూ తనని నిందించిన వాళ్ళే. “నా మాటలు అబద్ధమయితే చూడండి,” అంటూ తన శరీరం మీద బట్టలు తొలగించి వదినకి చూపించింది ఉమాదేవి. ఆ సమయంలో అలా చేయడం ఆమెకి సిగ్గు అని అనిపించలేదు ఆమెకి. వాళ్ళకి రుజువు చూపించాలన్నదే ఆమె తాపత్రయం.

ఉమాదేవి పచ్చని శరీరం మీద కాల్చిన మచ్చలు – కొట్టిన దెబ్బలకి శరీరంపై తేలిన తట్లు చూసి ఒక్క క్షణం చలించారు వదిన్లు. అయితే మరుక్షణమే ఏం అనుకున్నారేమో కాని ఉమాదేవికే నచ్చజెప్పడం ఆరంభించారు.

“మొగుడు అన్న తరువాత ఆ మాత్రం చేయి చేసుకుంటాడు. కొన్ని కుటుంబాల్లో ఇది సహజమే. అయితే అలా కొట్టడం మంచిది కూడా కాదు. కొట్టడం మేము సమర్థించం. అయితే కుటుంబం అన్న తరువాత అనేక సమస్యలు – చిక్కులూ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా వీధిన పడడం మంచిదికాదు. సహనంతో సర్దుకుపోవాలి” అంటూ వదినలు ఉమాదేవికి హితబోధ చేసారు. ఆమెకి అక్కడుండడానికి మనస్కరించలేదు. అల్లారు ముద్దుగా తనని పెంచిన అన్నలు కూడా మౌనం వహించడంతో ఉమ అక్కడి నుండి బయలుదేరింది. కనీసం తిండి తినమని కూడా చెప్పలేదు వాళ్ళు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here