[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారు రచించిన ‘సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]
[తన గత జీవితాన్ని కాగితాల్లో వ్రాసి అందరి ముందూ ఉంచిన తరువాత ఉమాదేవి సంతోషంగా ఉండలేకపోతుంది. తన గత జీవితం గురించి తెలిసాకా, సున్నితమనస్కురాలైన తన కూతురి మనోభావాల్లో మార్పు వస్తుందని, డిప్రెషన్‍కి లోనయ్యే అవకాశం ఉందని భయపడుతుంది. స్కూలుకి వెళ్ళాలనిపించక, లీవ్ లెటర్ రాసిచ్చి ఇందిరతో పంపిస్తుంది. అమ్మ జీవితం ఇలా అయిపోయినందుకు బిందు బాధపడుతుంది. కాలేజీకి వెళ్ళాలనిపించక ఇంట్లోనే ఉంటుంది. కాలేజీకి వచ్చిన శకుంతల బిందు రాకపోయేసరికి, ఏమీ తోచక, బిందు ఇంటికి బయల్దేరుతుంది. బస్సులో వెళ్తుండగా, ఆ రోజు సిద్ధార్థ వచ్చినప్పుడు జరిగిన సంగతులు గుర్తుచేసుకుంటుంది. సిద్ధూ వచ్చేటప్పటికే రామశాస్త్రి – ఉమాదేవి అత్తవారింటిలో ఎన్ని బాధలుపడింది, ఎన్ని ఆరళ్ళకి గురయింది, ఉమ మంచితనం, ఆమె నిర్దోషత్వం అన్నీ తెలియచేస్తాడు. అతని భార్య రామలక్ష్మి మొహంలో పశ్చాత్తాపం కనబడతుంది. ఈలోపు సిద్ధూ వచ్చి ఉమాదేవి రాసుకున్న కాగితాలు రామలక్ష్మి మీదకి విసిరికొట్టి నీవింత కఠినాత్మురాలివి అనుకోలేదు అని అంటాడు. ఆ కాగితాలను వరుసలో పెట్టి అందరికీ చదివి వినిపిస్తుంది శకుంతల. శాంతం వహించమని సిద్ధూకి చెప్తుంది. ఈలోగా బస్సు గమ్యం చేరుతుంది. ఆటో ఎక్కి ఉమాదేవి ఇల్లు చేరుతుంది శకుంతల. అక్కడి పరిస్థితి చూడగానే వాళ్ళు ఏమీ వండుకోలేదనీ, ఏమీ తినలేదని అర్థమవుతుంది. వాళ్ళిద్దరికీ కాసిని మంచిమాటలు చెప్పి మామూలు స్థితికి తీసుకువస్తుంది. శకు, బిందూ చదువు మీద దృష్టిపెడతారు. సిద్ధార్థ ఉద్యోగంలో చేరుతాడు. రవి ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజ్‍లో పార్ట్ టైమ్ లెక్చరర్‍గా చేరి, ప్రైవేటుగా ఎం.బి.ఎ. చదవడం మొదలుపెడతాడు. ఇప్పుడే ఉద్యోగం ఎందుకని ఇందిర అడిగితే, నా బాధ్యత నన్ను తెలుసుకోనీ అక్కా అంటాడు రవి. ఉమాదేవి మాత్రం ఉద్విగ్నంగా, ఆందోళనగా ఉంటుంది. పాఠాలు చెప్పడంలోనూ, పరీక్షల పేపర్లలో మార్కులు వేయడంలోనూ పొరపాట్లు చేస్తుంది. ఒకరోజు హెడ్ మిస్ట్రెస్ జ్యోతి ఉమాదేవిని తన గదికి పిలిపిస్తుంది. ఉమ సమస్యలు తనకి తెలుసనని చెప్పి, వాటిని తట్టుకునేందుకు ఏం చేయాలో సూచిస్తుంది. తను చెప్పినవి ఆచరించడానికి ప్రయత్నించమని అంటుంది. ఇక చదవండి.]
అధ్యాయం-53
[dropcap]ఉ[/dropcap]మాదేవిని అందరూ రిలాక్స్‌డ్‌గా ఉండమంటారు. ఆందోళనకి దూరంగా ఉండమంటారు గాని అదే ఆమెకి సాధ్యపడటం లేదు. ఏ క్షణాన్న ఏం జరుగుతుందో నన్న భయం, టెన్షన్. అందరి స్వభావాలూ ఒకే విధంగా ఉండవు కదా!
“ఉమా, మీరు ఉత్త పిరికి మనిషి, ఇలా అయితే లాభం లేదు. నేటి మానవ సమాజంలో టిట్ ఫర్ టాట్ అనే విధంగా ఉండాలి. ఎదుటి వాళ్ళు మనల్ని ఒక మాటంటే మనం వాళ్ళని నాలుగు మాటలు అనాలి. ఇటుక దెబ్బని రాతి దెబ్బతో బదులు తీర్చుకోవాలి. మీ కన్నా ఇందిరే నయం,” అంది సంఘమిత్ర ఉమాదేవితో.
‘మొదట్లో ఆవిడ ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం ఆవిడ బాగా మారిపోయింది. ఆవిడ తన యడల, ఇందిర యడల పాజిటివ్‌గా స్పందిస్తోంది. తన మాట సహకారం అందిస్తోంది. అయితే ఆవిడలా డాషింగ్ నేచర్ అందరికీ రాదు. అది పుట్టుకతోనే రావాలి,’ అని అనుకుంటుంది ఉమాదేవి.
ఆ రోజు జరిగిన సంఘటన తలుచుకుంటేనే ఉమాదేవికి ఒళ్ళు జలదరిస్తోంది. ఆ సమయంలో సంఘమిత్ర ఇందిర ఇంట్లో ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదో? అనుకుంటుంది ఇప్పుడు కూడా. ఆ రోజు తను భయపడ్తున్నట్లే జరిగింది. ఆ రోజు ఆమెకి బాగా గుర్తు.
“ఉమా!” ఆ పిలుపుకి ఆమె వెనక్కి తిరిగి చూసింది. అలా చూసిన ఆమె ఒక్కసారి బిత్తరపోయింది. ఎదురుగా శంకరం. ఆమెకి ఎక్కడ లేని పిచ్చి కోపం వచ్చింది అతడ్ని చూడగానే. “ఉమ కాదు ఉమాదేవి,” అంది గట్టిగా. ఆమె గొంతుకలోని తీవ్రతకి అతను కలవరపడ్డాడు.
“నా మీద నీకు కోపం ఉండటం సహజం. నేను చేసిన పని అలాంటిది. ఇప్పుడు నేను చేసిన పనికి బాధ పడ్తున్నాను. అయినా మన బంధాలు బాంధవ్యాలు ఎక్కడికి పోతాయి కనుక?” అన్నాడు అతను.
“ఆ బంధాలు – బాంధవ్యాలు మనకి ఎప్పుడో తెగిపోయాయి. మనిద్దరి మధ్యా ఏ సంబంధం లేదు. ముమ్మాటికీ ఏ సంబంధం లేదు,” గట్టిగా అరిచిది ఉమాదేవి. ఆ అరుపులు విని ఇందిర సంఘమిత్ర కూడా అక్కడికి వచ్చారు. సంఘమిత్రకి అక్కడ పరిస్థితి అర్థమయింది. అతను శంకరం అవచ్చు అని ఆమె కనిపించింది.
“మీరెవరండి?” సంఘమిత్ర ప్రశ్నకి అతను “నేను ఆమె భర్తను,” అని అన్నాడు.
“అబద్ధం!” గట్టిగా అరిచింది ఉమాదేవి. అతని మీద చాలా కోపం వచ్చింది సంఘమిత్రకి.
చిర్రెత్తుకొచ్చిన ఆమె అతనితో “భర్త అంటే మీకు అర్థం తెలుసా? తెలియకపోతే చెప్తాను వినండి. భర్త అంటే అర్థం భరించేవాడు అని. అంటే తిండి, బట్ట ఇచ్చి ఆమెకి అన్ని సౌకర్యాలు కల్పించి ఆమె జీవితం ఏ ఒడుదొడుకులూ లేకుండా సాఫీగా సాగిపోయేటట్లు చూసేవాడు.
ఇన్ని సంవత్సరాల బట్టి చూస్తున్నాను. మీరు ఆమెను భరిస్తున్నారా? యోగ క్షేమాలు అడుగుతున్నారా? ఆమె మంచి చెడ్డలు చూస్తున్నారా? కనీసం కప్పుడు కాఫీ అయినా ఆమెకి తెచ్చి ఇచ్చారా? అలాంటి మీరు ఆవిడికి భర్తనని ఎలా చెప్పుకుంటున్నారండీ!”
సంఘమిత్ర మాటలు శంకరం అహన్ని దెబ్బ తీసాయి. అతనిలో రోషం ముంచుకొచ్చింది. “ఇది మా వ్యక్తిగత విషయం. ఇతరు లెవరూ జోక్యం చేసుకుంటే బాగుండదు. ఇంతకీ నేనెవరో తెలుసా? రాజకీయంగా పవరున్న మనిషిని. నేను ఏం చేయగలనో? ఆలోచించి మాట్లాడండి,” దర్పంగా అన్నాడు శంకరం.
అతని మాటలకి సంఘమిత్రకి సర్రున కోపం వచ్చింది. “మా ప్రాంతం అలగా జనం ఉండే ప్రాంతం కాదు. మర్యాదస్థులుండే ప్రాంతం. సంసారులుండే ప్రాంతం. మీరు న్యూసెన్సు చేస్తే పోలీసు కంప్లైంటు ఇవ్వవల్సి వస్తుంది.”
“నేనేం అల్లాటప్పయ్యగాడ్ని అనుకుంటున్నారా?” అతను దర్పంగా అన్నాడు.
“నేను కూడా అలాంటి ఇలాంటి దాన్ని అని అనుకుంటున్నారా? నేను మహిళా సంఘానికి ప్రెసిడెంట్‌ని. ఎక్కడ అన్యాయం జరిగినా తేనిటీగల తుట్టులా అక్కడ వాలిపోయి అన్యాయాన్ని ప్రతిఘటించడమే మా పని. పోలీసు కంప్లైంటు ఇస్తే మీకే నష్టం. మీ ప్రతిష్ఠకి భంగం కలుగుతుంది.”
“నా ప్రతిష్ఠకేం భంగం?”
“కాదా మరి. మొదటి భార్య బ్రతికి ఉండగా ఆమెకి విడాకులు ఇయ్యకుండా ఆమె అనుమతి తీసుకోకుండా మరో పెళ్ళి చేసుకోవడం చట్టరీత్యా నేరం కాదా? పాపం ఉమ మంచిది కాబట్టి బ్రతికిపోయారు. ఏ ఫిర్యాదు చేయలేదు కాని. ఈ విషయం రుజువయితే కటకటాల వెనుక ఊచలు లెక్కపెట్టి ఉండేవారు.”
సంఘమిత్ర ఈ మాటలకి అతని అహం, దర్పం చప్పున చల్లారి పోయాయి. “ఇంకా వినండి. మీరు చేసుకున్న పెళ్ళి పెళ్ళే కాదు. పక్కా వ్యభిచారం. ఎందుకంటే మొదటి భార్య బ్రతికి ఉండగా విడాకులు తీసుకోపోతే రెండో పెళ్ళి చెల్లదు చట్టరీత్యా. మీకు పుట్టిన పిల్లలు కూడా అక్రమ సంతానంతో సమానం. మీ పెళ్ళి కూడా అక్రమ సంబంధమే,” గట్టిగా అరుస్తూ అంది సంఘమిత్ర.
శంకరం ఆమె మాటలు దాటికి తట్టుకోలేకపోతున్నాడు. నీరు కారిపోయాడు. పులిలా వచ్చిన మనిషి పిల్లిలా అయిపోయాడు. వెంటనే ప్లేటు ఫిరాయించాడు. కాళ్ళ బేరానికి వచ్చినట్టు మాట్లాడ్డం ఆరంభించాడు. “ఆవిడితో నా సంబంధం తెగిపోయి ఉండచ్చు. మా మధ్య బంధం, బాంధవ్యం ఏదీ లేదు అని అనిపించవచ్చు అయితే నా రక్తం పంచుకుని పుట్టిన కూతురుంది. నా కూతురు మీద నాకు అధికారం లేదా?”
“ఆ కూతురు ఇప్పుడు గుర్తుకొచ్చిందా?” చిటపటలాడ్తూ అంది సంఘమిత్ర.
ఏ సమాధానం ఇవ్వకుండా తలవొంచుకున్నాడు శంకరం. ఎందుకంటే తప్పు అతనిలో ఉంది. ఆ తప్పుని కప్పి పుచ్చుకోలేదు కదా!
“మీకూ కూతురు మీద హక్కు అధికారం ఉంటాయి. అది ఎప్పుడు? అన్నీ సవ్యంగా ఉన్నప్పుడే. మీరు మీ బాధ్యతను విస్మరించారే. ఇప్పుడు మీరు మీ కూతురు కోసం కోర్టుకి వెళ్తే దొంక అంతా కదుల్తుంది. అన్ని విషయాలూ ఒక్కొక్కటీ బయటకు వస్తాయి. మీరు విడాకులివ్వకుండా రెండో పెళ్ళి చేసుకోవడం, ఆ పెళ్ళి చెల్లకపోవడం, ఆ సంబంధం అక్రమ సంబంధం అని తేలడం. ఆ సంబంధంలో పుట్టిన సంతానం అక్రమ సంతానమని ఒక్కొక్కటీ బయటపడ్డాయి. ఇన్ని అనర్థాలున్నాయి తెలుసా?”
సంఘమిత్ర వాగ్ధాటికి శంకరం నీరు కారిపోయాడు. అతని ఆశలన్నీ అడియాశలయ్యాయి.
“మరో విషయం. మీ కూతురికి తన తల్లికి జరిగిన అన్యాయం తెలుసు. దానికి కారుకులెవరో తెలుసు. ఇటువంటి పరిస్థితిలో దానికి కారకులయ్యే వారిని బిందు అసహ్యించుకుంటోంది. ఆమెకి మీ మీద సదాభిప్రాయమనేది లేదు. మీ మీద ఆమె మనస్సులో మంచి అభిప్రాయం కలగడానికి కొంత కాలం పట్టవచ్చు.
కాలమే అన్ని సమస్యలకీ పరిష్కారం చూపిస్తుంది. అంత వరకూ వేచి ఉండటమే తప్ప మనమేం చేయలేము. ఎవరైనా మంచిగా ఉంటూ ఎదుటివాళ్ళ మనసుల్ని గెలుచుకోవచ్చు కాని అధికారంతో మాత్రం కాదు. ఈ విషయం తెలుసుకోండి.
మరో పర్యాయం ఈ పరిసరాలలోకి రావడానికి ప్రయత్నించకండి. అలా వస్తే పర్యావసానం మరో విధంగా ఉంటుంది. ప్లీజ్ గో ఫ్రమ్ దిస్ ప్లేస్ ఇమీడియట్లీ. డోంట్ కమ్ ఎగైన్,” అంది సంఘమిత్ర ఆవేశంతో ఊగిపోతూ.
శంకరం తలదించుకుని వెనక్కి తిరిగాడు. ఇందిర, ఉమాదేవి రిలీఫ్‌గా ఊపిరి పీల్చుకున్నారు.
అధ్యాయం-54
“ఈ మధ్య మరే విశేషాలు ఏమైనా జరిగాయా?” సంఘమిత్ర ఉమాదేవి ఇంటికి వచ్చి అడిగింది. ఆ సమయంలో ఇందిర కూడా అక్కడే ఉంది. ఉమాదేవికి పరీక్ష పేపర్లు దిద్దుతున్నప్పుడు సహాయం చేస్తోంది ఇందిర.
“విశేషాలు జరగకపోవడమేంటి? ఎన్నో విశేషాలు జరిగాయి.”
“ఏంటవి?”
“ఆ శంకరం గారి భార్య కాత్యాయిని ఉమాదేవికి ఫోను చేసి మాట్లాడింది.”
“ఏమని?”
“తన భర్త ఆవిడకి ఇక్కడ జరిగినదంతా చెప్పాడుట. ఆ కాత్యాయిని మిమ్మల్ని చాలా పొగిడేసిందిట. ‘మీకు ఆ సంఘమిత్రలాంటి మాట సహకారం ఉంది. అందుకే మీరు అదృష్టవంతులు. నాకు అలాంటి సహకారం లేదు. నేను దురదృష్టవంతురాలిని’ అని అందట. అంతే కాదు ఆవిడ కూడా మధ్య తరగతి ఆడపిల్లేనట. బాధ్యతలు – లేమి మధ్య పుట్టి పెరిగన ఆవిడ్ని తండ్రి తన గుండెల మీద కుంపట్ని దింపుకోడానికి శంకరానికి ఇచ్చి పెళ్ళి చేశాడుట. ఇప్పడయితే తన భర్త మారేడు కాని మొదట్లో ఆవిడ్ని అతడు ఓ మనిషిలా చూసేవాడు కాదుట. అతనే కాదు ఆ ఇంట్లో ఎవ్వరూ ఆమెను ఓ మనిషిలా చూడకుండా పని మనిషి కన్నా హీనంగా చూసేవారట. ఆ అత్తింట్లో ఆరళ్ళు భరించలేకపోయిందిట ఆవిడ. ఉమకి ఏ అనుభవాలు అయ్యయో అవే అనుభవాలు ఆమెకి కూడా షరా మామూలేనట.
తన పిల్లలు కూడా ఆమె మాటలు ఖాతను చేయరుట. శకుని బిందూని చూస్తుంటే ఆవిడకి ముచ్చటేస్తోందిట. తన కష్టాలు చెప్పుకుని ఆవిడ చాలా బాధపడిందట ఉమతో ఆవిడ. ‘మీరు చెర నుండి బయట పడ్డారు. మీరు చాలా అదృష్టవంతులు. నాకు ఇల్లే చెరసాల’ అని బాధపడిందిట.” ఇలా చెప్పుకుపోతోంది ఇందిర. ఆమె చెప్పింది వింటూ కూర్చుంది ఉమాదేవి.
“అంతే కదా! మనిద్దరం ముద్దుల మొగుడికి పెళ్ళాలం. అతని ముద్దూ ముచ్చట్లు తీరుద్దాం. అక్కా అంటే, చెల్లీ అని పిలుచుకుందాం అని సినీ డైలాగు లేవీ మాట్లాడుకోలేదు కదా! ఎందుకంటే ఇప్పుడు వస్తున్న కొన్ని సినిమాల్లో ఇలాగే ఉంటాయి డైలాగులు. ఒకడికి ఇద్దరు పెళ్ళాలు. వాళ్ళతో రొమాన్సు,” సంఘమిత్ర గలగల నవ్వుతూ అంది.
“అదేం లేదు,” అంటూ చిన్నగా నవ్వింది ఉమాదేవి.
ఆ తరువాత సంభాషణ బిందూ శకూల చదువు వేపు మళ్ళింది. సంఘమిత్రకి తన పిల్లల చదువు విషయం గుర్తుకు వచ్చి ఉంటుంది. ఆమె ముఖం వివర్ణమయింది. ఏదో చెప్పలేని బాధ ఆమె ముఖ మండలంపై చోటు చేసుకుంది. ఒక్కక్షణం బాధగా కళ్ళు మూసుకుంది. ఈ హఠాత్పరిణామానికి విస్మితురాలయ్యారు ఉమాదేవి, ఇందిర.
మరుక్షణం లోనే తేరుకున్న సంఘమిత్ర గొంతు సవరించుకుంది. “మీరిద్దరూ ఈ సంఘమిత్ర స్వార్థపరురాలు, అహంభావి, తిరుగుబోతు అని అనుకుంటున్నారు కదూ! నా స్వభావం అలాంటిదేనని భావిస్తున్నారు కదూ! అయితే ఈ సంఘమిత్రలో మరో కోణం ఉంది అని తెలుసుకోలేరు కదూ!” బాధగా అంది సంఘమిత్ర.
“నేను అలా తయారవడానికి కారణం పరిస్థితులు. అవే నన్ను ఇలా మార్చేసేయి. నేనూ ఒకప్పుడు మామూలు మధ్య తరగతి ఆడ పిల్లనే. పుట్టగానే కన్నతల్లిని పోగొట్టుకుని కన్నతల్లి ప్రేమ అనే అదృష్టానికి నోచుకోలేక అష్ట కష్టాలు అనుభవించిన సగటు ఆడపిల్లని,” సంఘమిత్ర చెప్పింది. విస్మితులై వింటున్నారు ఇందిర, ఉమాదేవి. సంఘమిత్ర తన గురించి చెప్పడం ఆరంభించింది.
***
చిన్నప్పుడు సంఘమిత్ర పేరు వైదేహి. ఆ పేరుకి మారు పేరే సీత. రామాయణ కాలంలో సీత ఎన్ని కష్టాలు పడిందో – ఎన్ని అగచాట్లకి గురయిందో ఈ కలికాలంలో వైదేహి కూడా అన్ని కష్టాలు అనుభవించింది.
వైదేహి తల్లి చిన్నప్పుడే చనిపోయింది. సవితి తల్లి సుగుణ ఆ ఇంటికి వచ్చింది. ఆమె పెట్టే బాధలకి తట్టుకోలేకపోయింది చిన్నారి వైదేహి. తన పిల్లల్ని ఒకలాగ, వైదేహిని మరొకలాగ చూసేది ఆవిడ. వైదేహి చేతే ఇంటి పనంతా చేయించేది ఆవిడ. చదువుతున్న చదువు వైదేహి చేత మాన్పించింది. ఆవిడ. తిండి సరిగా పెట్టేది కాదు. కొట్టేది. తొడపాసం పట్టేది. ఏడుపు బయటకు వినిపించకుండా వైదేహి నోట్లో గుడ్డలు కుక్కేది.
వైదేహి బంగారు బాల్యం ఇలా కష్టాలు, కన్నీళ్ళతో, చాలీచాలని తిండితో గడిచి పోయింది. ఆమె తనలో తానే కుమిలిపోయేది. తన కష్టాలు చెప్పుకుని బావురమని ఏడవడానికి కూడా ఎవరూ లేరు. తండ్రి లోకం తండ్రిది. సవతి తల్లులున్న వాళ్ళ అందరి జీవితాలు ఇలాగే ఉంటాయా? లేక తన ఒక్కదాని జీవితమే ఇలా ఉందా అని అనుకుని బాధపడేది.
వైదేహి ఆ కష్టాలు, కన్నీళ్ళు మధ్య పెరిగి పెద్దదయింది. వయస్సుతో పాటే ఆమెలో తెగింపు మొండి ధైర్యం చోటు చేసుకున్నాయి. కొట్టడానికి చెయ్యి ఎత్తిన సవతి తల్లి చెయ్యి పట్టుకుంది. ఈ హఠాత్పరిణామానానికి సవతి తల్లి సుగుణ విస్తుపోయింది. ఇలా జరుగుతుందని ఆమె ఊహించి ఉండదు. వెంటనే నానా హంగామా చేసింది సవతి తల్లి. వైదేహి తనని కొట్టబోయిందని ఆమె భర్తతో చెప్పింది.
వైదేహి తండ్రి నిజానిజాలు తెలుసుకోలేదు. ఫలితంగా ఆ తండ్రి కూతురు మీద చేయి చేసుకున్నాడు. కుమిలి పోయింది వైదేహి. ఆ ఇంట్లో తన గురించి పట్టించుకునేవారు, తన బాగోగులు చూసేవారు లేరని వైదేహి బాధపడేది.
సవితి తల్లి పేరు సుగుణే కాని పేరుకు తగ్గట్టు ఆమెకి మంచి గుణాలేవీ లేవు. అటువంటి సమయంలోనే ఆమె తల్లి సత్యవతమ్మ వచ్చింది. ఆవిడ కొడుకే మన్మథరావు. పేరుకు తగ్గట్టు అతను బుద్ధులకు మన్మథుడే. ఉద్యోగం చేస్తున్నాడు కాని అతనికి చెడు తిరుగుళ్ళు ఉన్నాయి. చిల్లరకొట్టు వ్యవహారాలు ఎన్నో ఉన్నాయి.
అటువంటి కొడుకుని సరియైన మార్గంలో పెట్టాలంటే కొడుక్కి పెళ్ళి చేయాలి. అనుకుంది సత్యవతమ్మ. ఇలాంటి వాడికి పిల్లనెవరిస్తారు? అటువంటి పరిస్థితిలో ఆమె దృష్టి వైదేహి మీద పడింది. ఆవిడ రాకలో ఆంతర్యమదే.
భోజనాలు అయిన తరువాత కూతురు దగ్గర తన మనస్సులో మాట బయట పెట్టింది. తల్లి కోరిక విన్న సుగుణ ఆలోచనలో పడింది. ఈ మధ్య వైదేహి తన మీద తిరగబడుతోంది. వైదేహిలో ఏదో మొండి ధైర్యం కొట్టొచ్చినట్టు అగుపడుతోంది. ఆమెకి వచ్చిన కొమ్ములు విరిచేయాలంటే వెంటనే భర్తని ఒప్పించి తమ్ముడితో వైదేహి పెళ్ళి జరిపించాలి.
సుగుణ తన ఆలోచన కార్య రూపం పెట్టడం ఆరంభించింది. భార్య మాటలు విని విని వైదేహి తండ్రి కూడా ఆలోచించడం ఆరంభించాడు. భార్య చెప్పింది కూడా సబువుగానే ఉందనిపించింది అతనికి. వైదేహికి పెళ్ళి చేస్తే ఇంకా తనకి ఇద్దరు పిల్లలున్నారు. వారి భవిష్యత్తు కూడా చూడాలి. అందులోనూ తెలిసిన సంబంధం కూడా. అందులోనూ తన భార్యకి తమ్ముడు. ఇలా ఆలోచిస్తున్నాడు వైదేహి తండ్రి సత్యమూర్తి.
అతని ఆలోచన్ల ఫలితమే మన్మథరావుతో వైదేహి పెళ్ళి జరిగిపోయింది.
వైదేహి జీవితం క్రమం ఎప్పుడూ ఒకటే బాల్యంలో సుఖపడలేదు. పెద్దయ్యాక సుఖపడలేదు. పెళ్ళయి అత్తవారింటికి వచ్చిన తరువాత కూడా సుఖపడలేదు.
అత్తవారింటికి వచ్చిన తరువాత సత్యవతమ్మ వైదేహిని అత్తింటి ఆరళ్ళకి గురి చేసింది. కూర్చుంటే తప్పు. నిల్చుంటే తప్పు. వైదేహి ఏ పని చేసినా తప్పే. పెళ్ళయినా మన్మథరావు చెడు తిరుగుళ్ళు తగ్గలేదు. ఇంట్లో భార్యను పట్టించుకోవడం లేదు మన్మథరావు. అతని దృష్టిలో భార్య కేవలం తనకి శారీరిక సుఖం ఇచ్చే మనిషి మాత్రమే.
కొంత మంది మొదటి నుండి కష్టాలు అనుభవించడానికే పుడ్తారేంటో? ఇలా పిచ్చిగా ఆలోచించి బాధపడేది వైదేహి. కష్టాలు, కన్నీరు, నిరాశ, దుఃఖం, నైరాశ్యం, ఇలా నిస్సారమైన జీవితం మధ్య ఇద్దరు పిల్లలకి తల్లి అయింది. అయితే వారి ముద్దు ముచ్చట్లు తీర్చుకునే అవకాశం వైదేహికి లభించలేదు. తన పిల్లలకి తన మాతృప్రేమ పంచి ఇచ్చే అవకాశం వైదేహికి లభించలేదు.
సత్యవతమ్మ పిల్లలకి, తల్లి మీద పిల్లలకి చెడు అభిప్రాయం కలిగేటట్లు ఉన్నవి, లేనివి కల్పించి చెడుగా చెప్పేది. పిల్లలు వినేవారు. పాపం వాళ్ళు పసివాళ్ళు. వాళ్ళు చెప్పిందే వింటారు కాని చెప్పిందాంట్లో నిజనిజాలు తెలుసుకునే శక్తి వాళ్ళకి ఉండదు. అందుకే పిల్లలు కూడా నాన్నమ్మ చెప్పుడు మాటలు విని తల్లిని ద్వేషించడం ఆరంభించారు. వైదేహిది ఏం చేయలేని పరిస్థితి చాలా బాధపడింది.
పిల్లల్ని హాస్టల్లో ఉంచి చదివించడం ఆరంభించారు. తనని తన పిల్లలు ద్వేషిస్తున్నా ఎదురుగా వాళ్ళుంటే వాళ్ళను చూస్తూ సంతృప్తి పడదామన్న ఆమె ఆశ అడియాశే అయింది.
(ఇంకా ఉంది)