సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు-3

0
11

[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారు రచించిన ‘సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

[కాలేజికి వెళ్ళడానికి బస్ కోసం ఎదురుచూస్తూంటుంది హిమబిందు. తనలాగే అక్కడ కాలేజీ బస్సు  కోసం ఎదురుచూస్తున్న అమ్మాయిల, అబ్బాయిల ప్రవర్తన నచ్చదు హిమబిందుకి. వాళ్ళల్లో చాలామంది సినిమా పాటలు పాడుతూ, రేప్ సీన్లు, ముద్దు సీన్లు, నేటి హీరోయిన్ల వస్త్రదారణ గురించి గట్టిగా మాట్లాడుకుంటుంటారు. కాసేపటికి బస్సు వస్తుంది. హిమబిందుతో పాటు విద్యార్థులంతా ఎక్కుతారు. బస్‍లో ఇద్దరు కుర్రాళ్ళు పాట పాడుతూ హిమబిందుని విసిగిస్తారు. మరో కుర్రాడు అసభ్యంగా మాట్లాడుతాడు. ఆమెలో స్త్రీలు ఎదుర్కుంటున్న సమస్యలపై అనేక ఆలోచనలు కలుగుతాయి. కాసేపయ్యాక కాలేజీకి చేరుతుంది. కాలేజీలో జూనియర్లని సీనియర్లు రాగింగ్ చేస్తుంటారు. ఒక గుంపు అమ్మాయిలు బిందుని పిలిచి తాము సీనియర్లమని, తమకి గౌరవం ఇవ్వాలని తెలియదా అని అడుగుతుంది. మరో సీనియర్ బిందు చేతిలోని క్యారేజ్ లాక్కుంటుంది. ఈలోపు అటువైపు వచ్చిన శకుంతల అనే జూనియర్‍ని ఏడిపించడం మొదలుపెడతారు. ఇంతలో సీనియర్ విద్యార్థులు పంపగా ఓ జూనియర్ కుర్రాడు వచ్చి ఆ అమ్మాయి చేతిలోని క్యారేజిని చేజిక్కించుకుంటాడు. దాన్ని మూత తీయించి లోపల ఏమేం పదార్థాలున్నాయో చెప్పిస్తారు. వంకాయ కూర ఉందంటే – వంకాయ మీద ఉన్న పాట పాడమని విసిగిస్తారా అబ్బాయిని. ఇలా ఆ అబ్బాయిని, హిమబిందుని, శకుంతలని చాలాసేపు ఏడిపిస్తారు. వీళ్లకి దూరంగా కూర్చుని చదువుకుంటున్న ఓ అబ్బాయిని హిమబిందుకు చూపించి – అతని చేత ఈ గుత్తి వంకాయ కర్రీ తినిపించి, అతని పేరు కనుక్కుని రమ్మని చెప్తారు సీనియర్లు. తప్పనిసరిగా అతని దగ్గరకి వెళ్ళి పలకరిస్తుంది. చుట్టూ ఉన్నవారిని చూసి జరుగుతున్నదాన్ని అర్థం చేసుకుంటాడు. ఆమె నోట్లో పెట్టిన కూరన్నం ముద్దని తిని తన పేరు సిద్ధార్థ అని చెప్తాడు. హిమబిందుని పేరు అడిగి తెలుసుకుంటాడు. సీనియర్లంతా ఆనందిస్తారు. బిందుని తొలిచూపులోనే ఇష్టపడతాడు సిద్ధార్థ. బి.టెక్ చదువు తనని ఇబ్బందుల పాలు చేస్తోందని హిమబిందు అనుకుంటుంది. ఇక చదవండి.]

అధ్యాయం-5

[dropcap]అ[/dropcap]హంకారం వుంటే మనిషి దృష్టి మందగిస్తుంది. జీవితం విషపూరితంగా మారిపోతుంది. అహంకారమున్న వ్యక్తికి అందరూ పనిముట్లలాగా కనిపిస్తారు. అహంకారమంటే అక్కడ స్వార్థం తప్ప ఏమీ ఉండదు. అన్నీ తనకే కావాలి. అందరూ తనకే తలవొంచాలి అన్న దురహంకారం ఉంది. అహంకారంతో పనులు అవుతాయని మనుష్యులు భ్రమపడడం కూడా పొరపాటే. వినయం అహంకారం స్థానంలో ఉంటే అన్ని పనులు నెరవేరుతాయి. తృప్తి ఉంది. అహంకారంలో అసంతృప్తి ఉంది. ఎప్పుడేనా నేను, నాది అన్న భావం ఎప్పుడు ఉంటుందో అప్పుడు అహకారం ఉంటుంది. ఆ అహంకారమే లేకుండా ఉంటే వినయం ఉంటుంది. ప్రేమ ఉంటుంది.

అహంకారానికి మారు పేరే సంఘమిత్ర. ఆవిడ సామాజిక కార్యకర్త, సంఘ సేవకురాలు అనే ముసుగులో ఉన్న అహంభావి. స్వార్థపరురాలు. ఆవిడ మహిళా మండలి కార్యదర్శి కూడా.

తన తెలివి తేటలతో అహంకరిస్తుంది. విజయాల వేటలో ముందుకు పరుగుపెడ్తుంది. అహంకారం ఉంటే విజయం ఆమడ దూరంలో ఉంటుందని తెలుసుకోలేని అల్పత్వం ఉన్న మనిషి,

జ్ఞానం ఉంటే అహంకారం పెరుగుతుందంటారు. ఇతరుల కన్నా తనకు ఎక్కువ తెలుసునన్న గర్వం ఇతరులను తక్కువగా చూసేలా చేస్తుంది.

అంతే కాదు స్వార్థమున్న మనిషి ఆమె. ఒక హద్దు వరకూ స్వార్థం ఉండచ్చు. కాని అది హెచ్చుగా ఉంటేనే వచ్చిన తంటా అంతా. అనేక సమస్యలకు మూలం ఈ స్వార్థం. ఆదిపత్యం ప్రదర్శించడమే కాదు. ధనం సంపాదించాలనే కోరికతో కూడా ఇతరులను ఏదో విధంగా దోపిడీ చేయడానికి కూడా వెనకాడరు.

సంఘమిత్ర ఆమె పేరుగాని నేతి బీరకాయ వాటం ఆమె. సంఘానికి మిత్రురాలు అనే కంటే వ్యతిరేక అర్థం కూడా ఆమె విషయంలో తీసుకోవచ్చు.

విజయనగరంలో అది బాలాజీ నగర్ ప్రాంతం. ఆ ప్రాంతంలో విశాలమైన అపార్టుమెంటులో ఇరవై ఐదు ఫ్లాట్లు. కొన్ని డబుల్ బెడ్ రూమ్‍వి. మరికొన్ని త్రిబుల్ బెడ్ రూమ్‍వి. ఓ త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాటుకి యజమానురాలు సంఘమిత్ర. అయితే డబల్ బెడ్ రూమ్సు ఉన్న ఫ్లాట్లల్లో ఇందిర, మరో డబుల్ బెడ్ రూమ్ ఫ్లాటులో ఉమాదేవి ఉంటున్నారు.

ఇందిర అవివాహిత అయితే ఉమాదేవి భర్త చేత విడిచి పెట్టబడి మ్రోడుబారిన జీవితం గడుపుతున్న దురదృష్టవంతురాలు. ఆమె ఆశాదీపం కూతురు హిమబిందు. తన ఆశలన్నీ కూతురిపై కేంద్రీకరించి కూతుర్ని బి.టెక్ చదివిస్తోంది ఉమాదేవి.

మనం మన మనస్సులోని ఉద్దేశాలని, భావాల్ని వదులుకునేందుకు ఇష్టపడం. అర్థంలేని పాత భావాలు గత జీవితం తాలూకా చేదు అనుభవాలు పదే పదే గుర్తు తెచ్చుకుంటూ బాధలు అనే వేటగాడి బాణం దెబ్బకి గిలగిల్లాడుతాం. ఎంతో అందంగా ఆనందంగా ఉండవల్సిన జీవితాన్ని బాధగా నిట్టూర్పు విడుస్తూ జీవిస్తాం అని అనుకుంటూ ఉంటుంది ఉమాదేవి ఒక్కొక్క పర్యాయం.

సమాజంలోని మధ్య తరగతి కుటుంబంలో పెద్ద కూతురుగా పుట్టింది ఇందిర. ఈ మధ్య తరగతి జీవితాలన్నీ ఇంతే. సమాజంలో ధనికుల్లా ఆడంబరంగా జీవితాలు గడపలేరు. అలాగని బడుగు వర్గాల్లా ఆత్మాభిమానం వదులుకుని ఎదుటివాళ్ళ దగ్గర చేయి జాచలేరు. సభ్యత అనే పరదా మాటున దాక్కుని అటు ధనికుల్లా జీవించలేరు, ఇవతల పేదవాళ్ళలా బ్రతకలేరు.

ఈ మధ్య తరగతి కుటుంబంలో పెద్ద కూతురుగా అందులోనూ సంపాదనాపరురాలైన పెద్ద కూతురుగా పుట్టడం ఇందిర చేసుకున్న దురదృష్టం. ఇలాంటి వాళ్ళకి, చుట్టూ బాధ్యతలు. వీటి మధ్య వీళ్ళు నలిగిపోతారు. సుఖం, సంతోషం లేని జీవితం గడుపుతారు.

ఇందిర పెద్ద కూతురుగా అందునా సంపాదనాపరురాలైన పెద్ద కూతురూ అవడం వలన తండ్రి స్వార్థంతో పెళ్ళిమాట తలపెట్టలేదు. ఏ ఆడపిల్లా నేను పెళ్ళి చేసుకుంటాను అని సిగ్గు విడిచి తల్లిదండ్రుల్తో చెప్పలేదు. ఆమె సంపాదన అనుభవిస్తున్న వాళ్ళకి ఆ తలంపే రానేరాదు.

వేనీళ్ళకి చన్నీళ్ళు తోడు అన్నట్టు తండ్రి బాధ్యతల్లో తనూ పాలు పంచుకుంది ఇందిర. తమ్ముడిని చదివించి ఉద్యోగస్థుడయిన తరువాత పెళ్ళి చేసింది. చెల్లెలికి పెళ్ళి చేసింది. మరో తమ్ముడ్ని బి.టెక్ చదివిస్తోంది. రోగిష్ఠి తండ్రికి ఆసరాగా నిలబడింది. క్రొవ్వొత్తిలా కరిగిపోతూ తమ్ముడు పెళ్ళి అనగానే బాధ్యతను అతను వదిలిపెట్టి ఇంటి ఖర్చులకి డబ్బు ఈయకపోవడమే కాక తిరిగి అతను తను ఇల్లు కొనుక్కోడానికి డబ్బు సాయం చేయలేదని ఇందిరని నిందిస్తే ఆమె బాధ పడింది.

పెళ్ళీడు దాటిపోయిన తరువాత క్రొవ్వొత్తితో తన జీవితాన్ని సరిపోల్చుకుంటూ బాధ పడింది. రిటైర్మెంటు వయస్సుకి చేరువవుతున్న సమయంలో ఒక అతను తనని పెళ్ళి చేసుకుంటానన్నాడు. అతని స్వార్థం అతనిది. లైంగికానందానికి కాకపోయినా ఈ ముదిమి వయస్సులో తనకి ఆసరాగా నిలబడుతుందన్న స్వార్థం ఇందిరని పెళ్ళి చేసుకుంటానన్న ఆయనిది.

అన్నీ సవ్యంగా జరుగుతే ఈ వయస్సులో అంటే తనకో కూతురుంటే కూతురికి పెళ్ళి చేయవల్సిన వయస్సు తనది. ఈ వయస్సులో నాకు పెళ్ళేంటి అని పెళ్ళిని తిరస్కరించి ఇప్పటికి కూడా తల్లిదండ్రులు, తమ్ముడి బాధ్యతను నెత్తి మీద వేసుకుని వాళ్ళకి డబ్బు పంపిస్తూ ఈ అపార్టుమెంటులో డబుల్ బెడ్ రూమ్ ఉన్న ఫ్లాటులో మ్రోడు బారిన జీవితం గడిపేస్తోంది.

పెళ్ళి కాకుండా మ్రోడు బారిన జీవితం ఇందిర గడిపేస్తుంటే, పెళ్ళి అయికూడా పరిస్థితులు అనుకూలించక భర్తకి దూరమై కూతురితో మ్రోడు బారిన జీవితం గడిపేస్తోంది ఉమాదేవి.

సంఘమిత్ర విషయానికి వస్తే ఆమెది మరొక రకమైన జీవితం. అహంకారమైన స్వార్థపూరిత జీవితం ఆమెది. ఆమె భర్త మన్మథరావు. పేరుకు తగ్గ గుణాలు అతనివి. రూపానికి మన్మథుడు కానప్పటికి, బుద్ధులకి మాత్రం మన్మథుడే. అతను ప్రొఫెసర్. తన దగ్గరికి వచ్చే రిసెర్చి స్కాలర్‍ని అదే ముఖ్యంగా ఆడవాళ్ళని లైంగికంగా వేధించేవాడట. అతను ఇంట్లో పిల్లి, ఊర్లో పులి అని అందరూ అనుకుంటారు. అందుకే స్టూడెంట్సు అందరూ అతడ్ని ‘బిల్లీ, బిల్లీ’ అని పిలిచేవారు. భార్య అంటే అతనికి జడుపే. అతని చేత సంఘమిత్ర ఇంటి పని చేయిస్తుందని అందరూ చెప్పుకుంటారు.

ఇక కూతురు యూనివర్సీటీలో చదువుతోంది. హాస్టల్లో ఉంటోంది. ఈ మధ్య డ్రగ్స్‌కి అలవాటు పడిందని తెలిసి ఈ మధ్య చాలా బాధ పడిపోయింది. దానికి తోడు హాస్టల్లో ఉంటూ బి.టెక్ చదువుతున్న కొడుకు కూడా చెడు వ్యసనాలకి బానిస అయిపోవడం ఆమెకి మరింత బాధ కలిగించింది.

తనింటిని తను చక్కబెట్టలేని దాన్ని సంఘసేవ ఏం చేస్తాను అని అనుకోకుండా అహంకారంతో విర్రవీగుతూ ఎదుటి వాళ్ళని చులకనగా చూడ్డం మాత్రం మానలేదు సంఘమిత్ర.

అధ్యాయం-6

మనిషి తను స్వేచ్ఛగా ఉన్నాననుకుంటాడు. స్వాతంత్ర్యంతో ఉన్నాననుకొంటాడు. తను నిజంగా స్వేచ్ఛగా ఉన్నానా, స్వతంత్రంగా ఉన్నానా అని నిజాయితీగా ఆలోచిస్తే దానిలోని డొల్లతనం బయటపడుతుంది. అతడు ఈ సత్యాన్ని తెలుసుకోలేడు. తెలుసుకోవాలన్న కోరిక కూడా ఉండదు.

మొదట మనిషి తనకి స్వేచ్ఛ లేదని గుర్తించాలి. తన బానిసత్వానికి కారణం తనేనని గుర్తించాలి. అలా గుర్తించిన నాడు అటు వేపు దృష్టిపెడ్తాం. బానిసత్వంలో ఉన్నందుకు ఆందోళనకు గురవుతాము. బానిసత్వాన్ని గురించి పూర్తిగా అవగాహన చేసుకున్న నాడు మనం ఎందుకు బంధింపబడ్డామో తెలిసివస్తుంది. అప్పుడు విముక్తి మార్గం తెలుస్తుంది.

మన్మథరావు విషయం అదే అయింది. తను పని చేస్తున్నది వైజాగ్‌లో. ఉన్నది విజయనగరంలో. అక్కడ పని చేస్తూ ఇక్కడ ఎందుకుండాలి? స్వంత ఇల్లు ఉంటే ఇది అద్దెకు ఇచ్చేసి వైజాగ్‌లో ఉండచ్చు కదా అని అనుకుంటాడు. అయితే అతని ఆలోచన పని చేయనివ్వదు భార్య సంఘమిత్ర. అందుకే కారులో వైజాగ్ వెళ్ళి వస్తూ ఉంటాడు. ఒక్కొక్క పర్యాయం మూడేసి రోజులు అక్కడే ఉండిపోతాడు. అంతేకాని భార్యకి ఎదురు చెప్పలేడు. ఛీ.. ఛీ.. ఎందుకీ భానిస బ్రతుకు అని తనని తాను తిట్టుకుంటాడు.

సంఘమిత్ర ఇక్కడ స్వేచ్ఛకి అలవాటుపడింది. సంఘ సంస్కర్త, లేడిస్ క్లబ్ సెక్రటరీ హోదాలో భర్త అక్కడ పాట్లు పడ్తూ ఉంటే ఇక్కడ ఈమె తిరుగుళ్ళకి అలవాటు పడింది. పులిలా విధులు నిర్వహించే ఇతను ఇంట్లో భార్య దగ్గర పిల్లే అని అందరూ అనుకుంటూ ఉంటారు.

ఆ రోజు ఆదివారం. మన్మథరావు ఇంట్లోనే ఉన్నాడు. సంఘమిత్ర కూడా ఇంట్లోనే ఉంది. భార్య ఆజ్ఞకి బద్ధుడై అతను తన తల్లిని వృద్ధాశ్రమంలో చేర్పించాడు. అలా చేర్పించడం అతనికి ఇష్టం లేదు. ఎక్కడో మనస్సు అడుగు పొరల్లో తల్లి మీద మమతానురాగాలు అతనిలో మిగిలే ఉన్నాయి.

మనం మానవులం. ప్రేమతత్వం లేకుండా జీవించలేం. ఈ ప్రేమ భావమే సకల జీవరాశుల్లో అగుపడుతుంది. క్రూర జంతువులో అగుపడుతుంది. సాధు జంతువులోనూ అగుపడుతుంది. అయితే ఈ ప్రేమతత్వం మానవ మాత్రురాలయిన తన భార్యలో ఎందుకు అగుపించటం లేదు అని అతను అప్పుడప్పుడు మథనపడుతూ ఉంటాడు.

“మిత్రా!” పిల్చాడు మన్మధరావు భార్యని. అతను అలా మార్దవంగా పిలుస్తున్నాడంటే తన వల్ల ఏదో పని చేయించుకోవాలి. లేకపోతే ఏదో చెప్పాలనుకుంటున్నాడు అని ఆమెకు బాగా తెలుసు.

“ఏంటి?” విసుగ్గా అడిగింది సంఘమిత్ర.

“రేపు నా పుట్టినరోజు. ఎలాగూ వృద్ధాశ్రమానికి వెళ్ళి పళ్ళు ఇస్తూ ఉంటాము కదా! మా అమ్మని ఆ చేత్తోనే ఇంటికి తీసుకువద్దాం.” భయపడ్తూనే భార్య ముఖం వేపు చూస్తూ అన్నాడు. అతని మాటలు వినగానే ఏదో వినరానిది విన్నట్టు ముఖం చిట్లించింది సంఘమిత్ర. తిరిగి మామూలు పరిస్థితిలోకి వచ్చింది.

“ప్లీజ్! ఈ ఒక్క పర్యాయం నా మాట కాదనకు.”

అతను ప్రాధేయపడుతున్నట్లు అడుగుతున్నాడు. ఆమె ఏ మూడ్‌లో ఉందో గాని అతని మాటలు ఎందుకు కాదనాలి అని అనుకుందేమో “సరే!” అంది. దానికే పొంగి పోయాడు ఆ అల్ప సంతోషి.

మర్నాడు వృద్ధాశ్రమానికి వెళ్ళి వృద్ధులకి రొట్టెలు, పండ్లు పంచిపెట్టి తల్లిని వెంటబెట్టుకుని ఇంటికి బయలుదేరాడు మన్మథరావు.

అతని తల్లి సత్యవతమ్మకి ఇదంతా నిజమేనా అని అనిపించింది. ఎందుకంటే కోడలికి తన పొడంటే గిట్టదు. ఎప్పుడూ ధుమధుమలాడ్తూ ఉంటుంది. తనని వృద్ధాశ్రమంలో కొడుకు చేర్పించే వరకూ ఇంటిలో శాంతి లేకుండా చేసింది. తను మాత్రం క్లబ్బుల్లో – మహిళా సంఘ మీటింగుల్లో “వృద్ధులను కంటికి రెప్పలా చూసుకోవాలి. వాళ్ళని ఆదరించాలి. చిన్నప్పటి నుండి పిల్లల్ని ఎంతో కష్ట నష్టాల్ని ఓర్చుకుని పెంచిన తల్లిదండ్రులు జీవిత చరమాంకంలో ఎక్కడికి వెళ్తారు? మానవత్వంతో, కృతజ్ఞతతో పిల్లలు వాళ్ళని వృద్ధావస్థలో చేరదీయాలి. ఆదరించాలి. ఇదే మానవ్వతం,” అంటూ ఉపన్యాసాలు ఇస్తుంది. అంతేకాని తను మాత్రం పాటించదు.

“అబ్బాయి! నీవు చాలా తప్పు చేశావనిపిస్తోంది. మనది రక్త సంబంధం కాబట్టి నీ పేగు లాగి ఉండచ్చు. అందుకే నన్ను నీవు ఇక్కడికి తీసుకువచ్చి ఉండవచ్చు. కాని కోడలికి నేను ఇక్కడికి రావడం ఇష్టం లేనట్లుంది.” సత్యవతమ్మ కొడుకుతో అంది.

“నీ కోడలి సంగతి నీకు తెలుసు కదమ్మా. సంఘ సంస్కర్తగా, సమాజ సేవకురాల్లా ఉపన్యాసాలిచ్చినంత విధంగా ఔదార్యం ప్రదర్శించ లేని మనిషి, అయినా నీ కోడలి ముఖం చూసి ఇక్కడికి వచ్చావా లేదా నా ముఖం చూసి వచ్చావా?”

“అది నిజమేనులే! మన ఇద్దరిదీ ఎంతేనా రక్త సంబంధం. అందుకే అలా అంటున్నాను. మొదట్నించి కోడలికి నా పొడగిట్టదు అంది సత్యవతమ్మ.

మన్మథరావు దురదృష్టమో లేక సత్యవతమ్మ దురదృష్టమో కాని భోజనం సమయంలో డెక్కాడి సత్యవతమ్మ వాంతి చేసుకుంది. ఆమె భయపడ్తూనే ఉంది. ఆ భయం ప్రకారమే జరిగింది. బితుకు బితుకుమని చూస్తోంది.

సంఘమిత్ర అగ్గిమీద గుగ్గిలంలా విరుచుకు పడింది. “అందుకే నేను ఈ ముసలావిడ్ని తీసుకు రావద్దనన్నాను. ఈ ముసలి వాళ్ళంటేనే నాకు ఎలర్జీ. ఎవరు ఎక్కడుండాలో అక్కడ ఉండాలి కాని అందర్నీ అందలం ఎక్కిస్తామంటే అవుతుందా? తొందరగా శుభ్రం చేస్తే సరి.” మన్మథరావుకి హుకుం జారీ చేసింది సంఘమిత్ర.

పాపం అతను ఏం చేయగలడు? ఏం మాట్లాడగలడు. ‘సమాజంలో రక్త సంబంధాలకి విలువ లేకుండా పోయింది,’ అని అనుకుంటూ వాంతి చేసుకున్న తల్లిని పంపు దగ్గరికి తీసుకువెళ్ళి శుభ్రపరిచాడు.

“ఇక్కడ ఒక్క క్షణం కూడా మీ అమ్మని ఉంచడానికి వీళ్ళేదు. ఆశ్రమానికి తీసుకెళ్ళి దింపిరా,” భర్తకి పురమాయించింది సంఘమిత్ర. అపార్టుమెంటులో ఉన్న వాళ్ళందరూ ఆ అరుపులకి బయటకు వచ్చేసి చోద్యం చూస్తున్నారు. సిగ్గుతో చితికిపోయిన మన్మథరావు తల్లిని ఆశ్రమంలో వదిలిపెట్టడానికి బయలుదేరాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here