సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు-7

0
12

[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారు రచించిన ‘సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

[రెండు రోజులు కాలేజీ మానేసి, మూడవ రోజున వెళ్తుంది హిమబిందు. ర్యాగింగ్ వల్ల కాలేజీకి రావడానికి భయపడితే, తల్లి ధైర్యం చెప్పి పంపిస్తుంది. బిందు కాలేజీకి రాకపోవడానికి సీనియర్సే కారణమని భావించిన సిద్ధార్థ వాళ్ళతో వాదిస్తాడు. మరోవైపు సిద్ధార్థ హిమబిందు వైపు ఆకర్షితుడవడాన్ని గమనించిన సీనియర్ సుకుమారి – అందులోని రహస్యం చెప్పమని హిమబింధుని వేధిస్తుంది. సీనియర్లు, బిందూ కాలేజీకి వచ్చింది చూసుకోమని చెప్పి సిద్ధార్థను పంపేస్తారు. రెండు రోజుల నుంచి కాలేజీకి ఎందుకు రాలేదని హిమబిందును అడుగుతుంది శకుంతల. ఒంట్లో బాలేదని చెప్తుంది హిమబిందు. సిద్ధార్థ సీనియర్స్‌పై విరుచుకుపడ్డ సంగతి బిందుకు చెప్తుంది శకుంతల. సిద్ధార్థ బిందును సపోర్టు చేస్తూ మాట్లాడుతూ ఉండటం అందరూ వింతగా చెప్పుకుంటున్నారని అంటుంది. హిమబిందు మళ్ళీ కాలేజీకి వచ్చినందుకు సంతోషిస్తాడు సిద్ధార్థ. తన కుటుంబం పరిస్థితి గుర్తొచ్చి దిగులు పడతాడు. క్రమంగా కాలేజీ వాతావరణంలో మార్పు వస్తుంది. ఇది వరకు జూనియర్స్‌ని ఏడిపించిన సీనియర్లు ఇప్పుడు వారికి సహకరిస్తారు. సీనియర్సు, జూనియర్సు మధ్య స్నేహపూరిత వాతావరణం ఏర్పడుతుంది. రవి, సిద్ధార్థ, బిందు, శకుంతల మధ్య స్నేహం గట్టిబడుతుంది. సిద్ధార్థ బిందును, రవి శకుంతలని ఇష్టపడతారు. కాలేజీలో కాస్త విరామం దొరికితే, బిందూని కలిసి సీనియర్ సుకుమారి ఏమన్నదో అడిగి తెలుసుకుంటాడు సిద్ధార్థ. మాటల మధ్య తన భావాలను వెల్లడిస్తాడు. సీనియర్స్ నుంచి తనను కాపాడినందుకు కృతజ్ఞతలు చెబుతుంది బిందు. ఇది చాలా చిన్న విషయం అనీ, తమ సీనియర్స్ తమని ఎలా ఏడిపించింది వివరిస్తాడామెకు. బిందు మళ్ళీ కృతజ్ఞతలు చెప్తే, ఆ భారాన్ని తాను మోహలేనంటాడు సిద్ధార్థ. ఇక చదవండి.]

అధ్యాయం-13

[dropcap]ఆ[/dropcap] రోజు క్లాసు తొందరగా అయిపోయింది. “శకుంతల గారూ! కాస్తా రిలీఫ్ ఉంటుంది బీచ్ వేపు వెళ్లాము. మీకేమైనా అభ్యంతరమా?” అడిగాడు రవి.

ఈ మధ్య రవి అంటే తన మనస్సు ఆసక్తి చూపిస్తోంది. అతని వేపు తను ఆకర్షితురాలవుతోందా? అతడ్ని ఇష్టపడుతోందా? అతని మీద తనకున్న భావం ఏంటి? ఆరాధనా? స్నేహమా? ప్రేమా? ఆకర్షణ? ఏవో తేల్చుకోలేకపోతుంది.

తను అతడ్ని కోరుకుంటోందా? కోరికలు ఎంతలా బలీయమైనవి అవుతాయో అంతలా సులభ సాధ్యాలు కాకుండా పోతాయి. ఎన్నో ఆటంకాలు. మరెన్నో అడ్డంకులు. మరెన్నో బాధించే సంఘటనలు ఎదురవుతాయి. లక్ష్యం చేరుకోక మునుపే, కోరిక తీరక మునుపే విరమించుకోవలసిన సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి. పరాజయాన్ని చవిచూడవల్సి వస్తుంది.

కోరిక తీరనప్పుడు అదే ఆరని మంటలా తయారవుతుంది. మనలో కోరిక ఎంతలా బలమైనది అయినప్పటికీ ప్రయత్నం, పట్టుదల, తెలివి, అనుభవం వీటిలో ఏ ఒక్కటి లోపించినా కోరిక మరింతగా అందనిదే అవుతుంది.

“మరో విషయం – ఒడ్డు నుండి చూస్తే సముద్రుడు, ఆకాశం సంగమించినట్లుంది కదూ!” శకుంతల అంది.

“అదంతా భ్రమే, ఇలాంటి భ్రమ లేకపోతే మానవ జీవితం నిస్సారమే. భ్రమల్లో బ్రతుకుతాం కాబట్టే ఈపాటి శాంతితో జీవించ గలుగుతున్నాం. భ్రమే లేకుంటే దుఃఖమే, అశాంతే. ఒక్క మానవుడికే అశాంతి కాదు సముద్రుడుకి కూడా అశాంతి ఉంటుందిట. తన అశాంతిని తెలియ చేయడానికి ఉవ్వెత్తున కెరటాలు పైకి లేచి సముద్రుడి కల్లోలాన్ని – కలవరపాటుని తెలియజేస్తాయట. మరి మానవుడి మనస్సులో అశాంతి ఉంటే?” తిరిగి అంది శకుంతల.

“మానవ మనస్సులో అశాంతి భావాలు ముఖ భంగిమల ద్వారా వ్యక్తమవుతాయి. చేష్టల ద్వారా – పనుల ద్వారా వెల్లడి అవుతాయి. ఇది నిజం కూడా!” రవి అన్నాడు.

“అందరి విషయంలోనూ అలా ఉండదు. కొంతమందిలో ఎంత అశాంతి ఉన్నా ఆ అశాంతిని హాలాహలంలా దిగమ్రింగుతూ పైకి మాత్రం అమృతపు చిరునవ్వులు చిందిస్తారు. దివిటీ వేసి వెతికినా వారి మనస్సులో ఉన్న అశాంతి భావ వీచికలు అగుపడవు. అది కొంతమంది వరకే పరిమితం,” అన్నాడు రవి.

మనస్సు ఆహ్లాదంగా ఉంచుకోవల్సిన ఆ సమయంలో వారిద్దరి మధ్యా గంభీరమైన చర్చ జరుగుతోంది. కొంతసేపు వారిద్దరి మధ్యా మౌనం రాజ్యమేలింది.

“శకుంతల గారూ! ఈ ఇసుక రేణువుని చూశారు కదా! దీని పుట్టుక గురించి ఓ విషయం వినండి.” సముద్రం ఒడ్డున ఉన్న ఇసుకను చేతిలోకి తీసుకుని తిరిగి వదిలిపెడ్తూ అన్నాడు రవి.

“చెప్పండి.”

“వరదలకి కొండలపై నున్న పెద్ద పెద్ద బండలు దొర్లుకుంటూ నీటి ప్రవాహంలోనే కొట్టుకుపోతూ ఉంటాయి. నిరంతరం ఆ ప్రవాహంలో కొట్టుకుపోవడం వలన వాటి అంచులు అరిగిపోయి నునుపుగా మెరుస్తూ గుండ్రంగా తయారవుతాయట. అలా ప్రవాహంలో కొట్టుకుపోయి చివరికి సూక్ష్మ రూపంలో అంటే ఇసుక రూపంలో మనకు అగుపడ్తుంది. అందుకే సముద్రం ఒడ్డున ఇసుక రేణువులే కాకుండా గుండ్రని, చిన్నా, పెద్దా రాళ్ళు కనిపిస్తూ ఉంటాయి గమనించండి,” అన్నాడు.

ఏ ఉనికీ – అస్తిత్వం లేకుండా ఈ ఇసుక రేణువులు ఇలా సముద్రం ఒడ్డున పడి వుండవల్సిందే కదా! ఈ ఇసుక రేణువులాంటిదే తన జీవితం కూడా. తన జీవితానికి ఓ అస్తిత్వముందా? ఓ ఉనికి ఉందా? అని అనిపిస్తుంది. తనకి ఒక్కొక్క పర్యాయం ఆలోచిస్తోంది శకుంతల.

కోరికలకి అవసరాలు, అనవసరాలు అనేవి రెండు ముఖాలు. అనవసరాలు వదులుకుంటే అవసరాలు అంది వస్తాయి. మనం కోరికల్ని మాటలతో వ్యక్తం చేస్తే సరిపోదు. చేతలతో చూపించాలి. పట్టుదలతో ప్రయత్నిస్తే ఫలితం దక్కుతుంది. లేకపోతే కోరికలు తీరవు.

సరియైన దృక్పథం లేని కోరిక వల్ల కలిగేది నిరాశ మాత్రమే. కోరిక అనేది రహస్యంగా మనలో గూడు కట్టుకుని ఉండాలి. ఈ కోరికలే కాదు. ఇష్టాల విషయం కూడా అదే. ఇబ్బడి ముబ్బడిగా ఇష్టాలు మన మనస్సులో కలగవచ్చు. ఈ అన్ని ఇష్టాలూ, వ్యసనాలుగా మారితే మనకే నష్టం కలుగుతుంది.

భావోద్వేగంతో వయస్సుకు మించిన ఆలోచనలు శకుంతలను చుట్టుముడ్తున్నాయి. ఆలోచనలే కాదు యథార్థము కూడా అదే. యథార్థ జీవితానికి, ఊహలతో తేలిపోయే జీవితానికి చాలా తేడా ఉంటుంది.

“ఏంటో అంత దీర్ఘాలోచనలు?”

“కోరికలు – ఇష్టాల గురించి.”

“కోరికలు అనంతాలు. ఈ కోరికలకి అంతం అనేది లేదు. ఒక కోరిక తరువాత మరో కోరిక మన మనస్సులో పుడ్తూనే ఉంటుంది” రవి అన్నాడు.

“అయితే నెరవేరే కోరికల్ని నెరవేర్చుకుని – అసాధ్యమైన వాటిని వాయిదా వేసుకోవాలి. లేకపోతే వదులు కోవాలి,” శకుంతల అంది.

ఇద్దరూ బీచ్‌లో సముద్రం వంక చూస్తూ కూర్చున్నారు. సముద్ర కెరటాలు ఎగిరెగిపడ్తున్నాయి. ఆ కెరటాల హోరుకి చెవులు చిల్లులు పడ్తున్నట్లనిపిస్తోంది. ఒడ్డుకున్న బండరాళ్ళను ఢీ కొట్టుకుంటూ ఒడ్డుకు కొట్టుకొచ్చిన కెరటం పాలనురుగు ఆకారంలో ఒడ్డును ఒరుసుకుంటూ ముందుకు వచ్చి తిరిగి సముద్రుడిలో ఐక్యమయిపోవడానికి వెనక్కివెళ్తోంది. ఈ నీటితోనే ఒడ్డుకు వచ్చిన పీతలు ఇసుకలో కన్నాలు చేసుకుని దూరిపోతున్నాయి.

నిరంతరం ఆ కెరటాల తాకిడికి నునుపెక్కిన ఆ బండరాళ్ళు తడితో తళతళ మెరుస్తున్నాయి. ఓడలు సముద్రంలో ముందుకు సాగుతున్నాయి. కొంత దూరం వెళ్ళి ఓడలు దృష్టికి అందకుండా కనుమరుగవుతున్నాయి.

“చూశారా రవీ! మన శాస్త్రజ్ఞులు భూమి బల్లపరుపుగా ఉందని కొందరు, లేదు.. లేదు గుండ్రంగా ఉందని కొందరు అన్నారు. అయితే ఓడలు కనుమరుగవడం చూస్తుంటే భూమి గుండ్రంగా ఉందనిపిస్తోంది.”

“బాగా స్టడీ చేస్తున్నారే!” నవ్వుతూ అన్నాడు రవి శకుంతలతో. “ఏంటలా గంభీరంగా ఆలోచిస్తున్నారు?”

“ఈ ఇసుక రేణువులాంటిదే మాలాంటి వాళ్ళ జీవితాలు. ఓ అస్తిత్వం – ఉనికి లేకుండా ఇలా పడివుండే ఈ జీవితాలకి సార్థకత ఏంటి?”

“అలా అని ఎందుకనుకోవాలి? ప్రతీ వాళ్ళ జీవితానికి ఓ సార్థకత అనేది ఉంటుంది. లేకపోతే మనుగడే లేదు. ఈ ఇసుక రేణువుకి అస్తిత్వం లేదని ఎందుకనుకుంటున్నారు. ఈ ఇసుక రేణువు పెద్ద పెద్ద డామ్‌లు, బిల్డింగులు కట్టడంలో వినియోగపడ్తూ తన పాత్ర తను పోషిస్తోంది.”

“అలా మీరు సమర్థించవచ్చు కాని నేను మాత్రం అలా అనుకోవడం లేదు. ర్యాగింగ్ డే నాడు సీనియర్సు నన్ను మేనకా పుత్రీ అని హేళన చేసారు గుర్తుందా రవీ!”

“ఆఁ..”

“నిజంగా వాళ్ళున్నట్లు నేను ఈ కలియుగ మేనకా పుత్రినే. మీరు నాకు ఆప్తుల్లా అనిపిస్తున్నారు కాబట్టి నా ఆవేదన మీకు చెప్తున్నాను. అయితే పురాణ కాలంలో ఆ శకుంతల అదే మేనకా పుత్రికి తల్లి మేనక వుంది, తండ్రి విశ్వామిత్రుడని తెలుస్తోంది. ఈ కలియుగ మేనకా పుత్రి అయిన నాకు తల్లిదండ్రులెవరో? ఎలా ఉంటారో కూడా తెలియదు.

మేనకా విశ్వామిత్రులు శకుంతలని పుట్టగానే వదిలి పెడ్తే కణ్వ మహర్షి పెంచి పెద్ద చేసినట్లు నన్నూ ఓ దంపతులు చేరదీసి కన్నబిడ్డ కన్నా ఎక్కువుగా నన్ను చూసుకుంటున్నారు. వారి ఋణం నేను ఎన్నటికీ తీర్చుకోలేను. వాళ్ళు మానవ రూపంలో ఉన్న దేవతలనిపిస్తుంది” ఇలా అంటున్న సమయంలో ఆవేదన తొంగి చూసింది శకుంతల వదనంలో.

“ఇంచుమించు మీలాంటి జీవితమే నాదీను. దేవతలాంటి అక్కయ్య చేరదీసి చదివించబట్టే నా జీవితం ఇలాగేనా సాగుతోంది.”

“అంటే?” కుతూహలంగా అడిగింది శకుంతల రవిని.

“మా నాన్నగారి సంపాదన అంతంత మాత్రమే. అక్కయ్య తను ఉద్యోగం చేసి మమ్మల్ని చదివిస్తూ క్రొవ్వొత్తిలా కరిగిపోతూ పెళ్ళి చేసుకోకుండా మ్రోడులా మిగిలిపోయింది. నిజంగా అక్కయ్య మా పాలిట దేవతే. స్వార్థపూరిత సమాజంలో స్వార్థానికి దూరంగా ఉండిపోయి తన జీవితాన్ని త్యాగం చేసింది. అందుకే అంటారు మధ్య తరగతి కుటుంబంలో సంపాదనాపరురాలైన ఆడపిల్లగా పుట్టకూడదని. అక్కయ్య మా అన్నయ్యని చదివించి ప్రయోజకుడ్ని చేసింది. వాడు మాత్రం ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకుని ఇంటికి సహాయం చేయకుండా మొండి చెయ్యి చూపించాడు. చిన్నక్కయ్యకి పెళ్ళి చేసి ఆ తరువాత అన్ని ముచ్చట్లు తీర్చింది. ఇప్పుడు నన్ను చదివిస్తోంది. నా చదువుకే కాకుండా తల్లిదండ్రుల్ని కూడా ఆర్థికంగా ఆదుకుంటోంది.”

“అలాంటి అక్కయ్య మీకు ఉండడం మీ అదృష్టమే. నిజంగా ఆమె దేవతయే!” అంది శకుంతల. ఇద్దరూ ఒకరి గురించి మరొకరు తెలుసుకున్నారు. మాటల్లో పడి పరిసరాలు పట్టించుకోలేదు. సంధ్య చీకట్లు వ్యాపిస్తూ ఉండగా ఇంటికి వెళ్ళడానికి బయలు దేరారు.

అధ్యాయం-14

‘అందమైన బావ, ఆవు పాలకోవా – విందుగా పసందుగా నా ప్రేమ నందుకోవా?’ కూనిరాగం తీస్తూ టిఫిను ప్లేటు సిద్ధార్థకి అందిస్తోంది సుందరి. అతని పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా, చేదు మాత్ర మ్రింగుతున్న రోగిలా ఉంది.

తను జీవితాంతం ఈ సుందూతో జీవితం పంచుకుని జీవించాలి అనే ఆలోచన అతి భయంకరంగా అనిపిస్తోంది. కూతురి వేపు మురిపెంగా చూస్తూ మురిసిపోతున్నాడు శంకరం. కూతురు సుందరి పేరుకు మాత్రమే సుందరి రూపానికి – గుణానికి అలవాట్లుకి మాత్రం సుందరమైనది కాదు. ఆమెది చిన్న పిల్లల మనస్తత్వం, అలుగుతుంది, మారాం చేస్తుంది. తను అనుకున్నది సాధించే వరకూ వదిలి పెట్టదు.

ఎంత సేపూ టి.వి.లో సినిమాలు, టి.విలో సీరియల్సు చూడ్డమే ఆమె అలవాటు. ఆ సినిమాలు పాతవి అవచ్చు. క్రొత్తవి అవచ్చు అన్ని సినిమాలూ చూసేస్తుంది. చదువు మాత్రం అబ్బలేదు.

‘ఈ సుందూకి చదువు అబ్బలేదు. తెలివి తేటలూ సామాన్యం. రూపమా అంటే అదీ లేదు. దీన్ని ఎవడు కట్టుకుంటాడు? తన పెంపకం బాగాలేదు. ముఖ్యంగా తన పెంపకంలో కూతురు ఇలా తయారయింది. కూతురు సంగతి ఇలా ఉంటే కొడుకు సంగతి కూడా సంతోషకరంగా లేదు. కొడుక్కి కూడా చదవబ్బలేదు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిపోతున్నాడు.

మొక్కగా ఉన్నప్పుడే వొంచాలి అని తను అనుకుంటాడు అప్పుడప్పుడు. కాని తను అలా చేయలేకపోతున్నాడు. తన బలహీనత అదే’ అని అనుకుంటాడు శంకరం. భార్య కాత్యాయిని మాత్రం గంగిగోవు లాంటిది. తను ఎంత చెప్తే అంతే. పిల్లలకి తల్లి దగ్గర భయభక్తులన్నవి శూన్యం.

మన మనస్సులో కొన్ని ఉద్దేశాలు ఉండొచ్చు, ఆశలుండచ్చు. కోరికలుండచ్చు. తన ఉద్దేశాల అనుగుణంగా మెలగాలి. కోరికలు నెరవేర్చుకోవాలి అని అనుకుని మన ఉద్దేశాలు, కోరికలు నెరవేర్చుకోడానికి ఎదుటివాళ్ళ బలహీనతల్ని ఆసరగా చేసుకుని, వాళ్ళ జీవితాన్ని ఛిద్రం చేయకూడదు. ఎదుటివాళ్ళ జీవితం నాశనం చేయకూడదు. మనకి ఎలా స్వతంత్రంగా జీవించే హక్కు ఉందో అలాగే ఎదుటి వాళ్ళకి కూడా జీవించే హక్కు ఉంది అని భావించి వాళ్ళ బాటలో వాళ్ళు నడవడానికి సహకరించాలే కాని మన పంథాలో ఎదుటి వాళ్ళను కూడా బలవంతాన్న లాక్కొచ్చి ఎదుటి వాళ్ళ జీవితం ఛిద్రం చేయకూడదు.

ఇటువంటి ఆలోచన లేదు శంకరానికి. అతను ఆ గ్రామంలో మకుటం లేని మహారాజు. సర్పంచుకు కుడి భుజంగా ఉంటూ రాజకీయాల్లో మంచి పలుకుబడి సంపాదించాడు. ఆర్థికంగా కూడా నిలదొక్కుకున్నాడు. ఎదుటి వాళ్ళ జీవితాన్ని శాసించే స్థాయికి ఎదిగాడు.

చెల్లెలు కుటుంబ లేమిని, వాళ్ళ అవసరాలు ఆసరాగా చేసుకుని రక్త సంబంధం అన్న ఆలోచన విడిచిపెట్టి చెల్లెలు కుటుంబంతోను – వాళ్ళ జీవితాల్తోనూ బేరసారాలు పెట్టుకున్నాడు. అదే మేనల్లుడు సిద్ధార్థని ఇంజనీరింగు చదివించడానికి, దానికి బదులు తన కూతుర్ని అతనికిచ్చి పెళ్ళి చేయడానికి. ఒక విధంగా ఇది ఒప్పందమే.

భయం ఎక్కడ ఉంటుందో అక్కడ అనుమానం ఉంటుంది. శంకరం భయమల్లా తను మేనల్లుడుకి ఇంత ఖర్చు పెట్టి చదివిస్తున్నాడు. చదువు పూర్తి చేసుకుని జీవితంలో స్థిరపడిన తరువాత మేనల్లుడు మొండి చెయ్యి చూపిస్తే అప్పుడు తన కూతురు పరిస్థితి ఏంటి? అదే అతని భయం. ఆ భయమే అనుమాన రూపం దాల్చింది. అందుకే దసరా సెలవులకి మేనల్లుడ్ని రమ్మనమని ఫోను చేసి మరీ రప్పించాడు. ఆ సెలవులన్నాళ్ళేనా కూతురు, అల్లుడూ చెట్టాపట్టా లేసుకుని తన కళ్ళెదుట తిరుగుతూ ఉంటే చూసి ఆనందించాలనే ఉబలాటం అతనిది. ఆ ఉబలాటం సాకార రూపం చాల్చాలి. అలా ఇద్దరూ తిరిగే అవకాశం కలిగించాలి. అందుకే మేనల్లుడికి ఫోన్ చేసి రమ్మనమన్నాడు.

సిద్ధార్థకి మొదట్నించి మామయ్య కూతుర్ని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు. అయితే తల్లిదండ్రుల బలవంతం వల్లనే తన చదువు విషయంలో మామయ్య షరతు అంగీకరించవల్సి వచ్చింది. తన జీవితాన్ని బలిపెట్టి సమిధగా మిగిలిపోవల్సి వచ్చింది.

దీని అంతటికీ కారణం లేమి. అదే ఆర్థిక లోటుపాటు. ఈ ఆర్థికావస్థ సరిగా లేని కారణం చేతే పేదరికంతో రోజులు గడప వల్సి వస్తోంది. ఈ పేదరికం మహా చెడ్డది. మనుష్యుల్ని తన గుప్పెట్లో తీసుకుని నలిపేస్తూ వినోదిస్తుంది. ఈ పేదరికం బారిన ఆత్మాభిమాని కూడా ఎదుటి వాళ్ళ దగ్గర తలవొంచే పరిస్థితి వస్తుంది.

ఆర్థికంగా ఆదుకుంటున్నాడన్న ఒకే ఒక్క కారణం చేత తను ఆత్మాభిమానాన్ని – కోరికలు అన్నీ వదిలేసి తన మామయ్య దగ్గర తలవొంచాడు. అతని అభీష్టం మేరకి మామయ్య పెట్టిన షరతు నెరవేర్చడానికి అంగీకరించాడు. ఇలా సాగిపోతున్నాయి సిద్ధార్థ ఆలోచన్లు.

కాత్యాయిని ఆలోచన్లు మరో విధంగా సాగుతున్నాయి. మనం గతాన్ని, వర్తమానాన్ని తలుచుకుంటూ ఉండడం, మూట కట్టుకున్న అనుభవాల్ని నెమరు వేసుకుంటూ నవ్వుకోగలగటం ఒక వరం. గడిచిన జీవితం బాగుందనుకోవడం మానవ సహజ ప్రవృత్తి. వర్తమానం బాగు లేకపోతేనే మనస్సులో అసంతృప్తి.

ప్రస్తుతం తను మథన పడ్తున్నదీ ప్రస్తుతం తన పిల్లల గురించే. ఇద్దరికి ఇద్దరూ ఒకలాగే తయారయ్యారు. కొడుకు మాట వినడు. చదువు సంధ్యలు లేకుండా జలాయిలా తిరుగుతాడు. ఆడపిల్ల సుందూ స్థితి చూస్తే ఇలా ఉంది. అది సిద్ధార్థను ఆటపట్టిస్తూ పాడిన పాట పాత సినిమాలోనిది. ఆ సినిమా రిలీజు అయినప్పుడు తను కూడా పుట్టి ఉండదేమో. అలాంటి సినీమా పాటలు సుందరి పాడుతోందంటే జ్ఞాపక శక్తి మెచ్చుకోవల్సిందే.

అయితే ఈ తెలివితేటలు అన్ని విషయాల్లో ముఖ్యంగా చదువులో చూపిస్తే ఎంత బాగుండేది?

మనం నాణేనికి ఒక వేపు చూస్తున్నాం. రెండో వేపు కూడా చూడాలి. సిద్ధార్థ భవిష్యత్తులో ఓ హోదా గల ఉద్యోగంలో స్థిరపడతాడు. అంత హోదా గల వాడికి తన భార్య కూడా హోదాలో ఉన్న అమ్మాయి కాకపోయినా సంస్కారవంతురాలైన అమ్మాయిని కోరుతాడు. సుందరిలో ఆ సంస్కారం లేదు. పరిసరాల ప్రభావం వల్ల ఇలా తయారయింది.

సిద్ధార్థని తను వచ్చినప్పటి నుండి గమనిస్తోంది. ఏదో ఇబ్బంది పడ్తున్నట్లుంది అతని వాలకం తప్ప హాయిగా గడపలేకపోతున్నాడనిపిస్తోంది. ఇలాంటి భిన్న మనస్తత్వాలు గలిగిన ఇద్దరికీ ముడిపెడ్తే వాళ్ళ వైవాహిక జీవితం సవ్యంగా నడుస్తుందా? తను ఎంత అణుకువుగా భర్త దగ్గర నడుచుకుంటూ ఉన్నా కూడా తన జీవితం అంత చెప్పుకోదగ్గ సంతోషజనకంగా లేదు.

మన జీవితానికి కర్తలం మనమే. బాధ్యులమూ మనమే. జీవితం గతిని సాగినా మనమే బాధ్యత వహించాలి. బాధపడాలి. కష్టపడాలి. మనం చాలా ఆనందంగా బ్రతికేస్తున్నాం అని మనల్ని మనం మభ్యపుచ్చుకుంటూ సంతృప్తిగా ఉండగలుగుతున్నాం అని అనుకోవటమూ మేకపోతు గాంభీర్యం మాత్రమే. తన జీవితం అంతే ఇన్నిన్నాళ్ళ తన వైవాహిక జీవితంలో సంతోషంతో గడిపిన సమయాలు చాలా తక్కువ. ఏదో జీవితంతో రాజీపడి బ్రతకడమే. సుందరి జీవితం తన జీవితంలా అవకూడదు. దాన్ని సంస్కారవంతురాలిలా మలచాలంటే ఏం చేయాలో ఆలోచించాలి. మెదడుకి పదునుపెట్టాలి, ఇవీ ఆమె ఆలోచన్లు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here