సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు-8

0
13

[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారు రచించిన ‘సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

[ఓ రోజు క్లాసు తొందరగా అయిపోతుంది. కాస్త రిలీఫ్‍గా ఉంటుంది బీచ్‍కి వెళదామా అని రవి శకుంతలని అడుగుతాడు. ఆమె సరేనంటుంది. ఇద్దరూ బీచ్‍కి వచ్చి కూర్చుంటారు. మనుషుల్లోని తీరని కోరికల గురించి, అశాంతుల గురించి మాట్లాడుకుంటారు. మనస్సు ఆహ్లాదంగా ఉంచుకోవల్సిన ఆ సమయంలో వారిద్దరి మధ్యా గంభీరమైన చర్చ జరుగుతుంది. సముద్రం ఒడ్డున ఇసుక ఎలా ఏర్పడుతుందో చెప్తాడు రవి. ఇసుక రేణువులాంటి తన జీవితానికి ఓ అస్తిత్వముందా, ఓ ఉనికి ఉందా అని ప్రశ్నించుకుంటుంది శకుంతల. ప్రతీ వాళ్ళ జీవితానికి ఓ సార్థకత అనేది ఉంటుందంటాడు రవి. ర్యాగింగ్ రోజున తనని సీనియర్స్ మేనకా పుత్రీ అని హేళన చేసిన సంగతి గుర్తుందా అని రవిని అడిగి, తాను నిజంగానే కలియుగ మేనకా పుత్రినని చెప్తుంది. తన తల్లిదండ్రులెవరో తనకి తెలియదని, ఓ దంపతులు తనని కన్నబిడ్డ కన్నా ఎక్కువ చూసుకుని ఆదరించారని చెప్తుంది. అప్పుడు తన జీవితం గురించి చెప్పి, అక్కయ్య చేసిన త్యాగం గురించి చెప్తాడు రవి. కాసేపటికి ఎవరిళ్ళకి వాళ్ళు బయల్దేరుతారు. మేనల్లుడు సిద్ధార్థ తన కూతురు సుందరిని పెళ్ళి చేసుకోనంటాడేమో అనుకుని వాళ్ళ మధ్య ఇష్టం కలిగేలా చేయడానికి సిద్ధార్థని సెలవల్లో తమ ఇంటికి రప్పిస్తాడు. సుందరికి చదువబ్బలేదు. తెలివితేటలు అంతంత మాత్రమే. టీవీలో సినిమాలు, సీరియల్స్ చూస్తూ కాలక్షేపం చేసేస్తుంది. ఓ సినిమా పాట పాడుకుంటూ బావకి టిఫిన్ ప్లేట్ తెచ్చిస్తుంది. కూతురు గురించి ఆలోచిస్తూంటాడు శంకరం. కూతురు కొడుకు తన మాట వినరని, కొడుకు చేయి దాటిపోయాడని భార్య కాత్యాయని మాత్రం గంగిగోవు లాంటిదని అనుకుంటాడు. సిద్ధార్థకి సుందరిని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు. కానీ తన చదువు కోసం ఆర్థిక సహాయం చేసిన మామయ్య షరతుని అంగీకరించాల్సి వస్తుంది. కాత్యాయనికి తన పిల్లలిద్దరి లోపాలు తెలుసు. సిద్ధార్థ గురించి తలచుకుని బాధపడుతుంది. అతని వాలకం చూసి ఏదో ఇబ్బంది పడుతున్నవాడిలా ఉన్నాడని గ్రహిస్తుంది. తన జీవితంలా తన కూతురు జీవితం కాకూడదుకుని, కూతురిని సంస్కారవంతురాలిగా మలచాలంటే ఏం చేయాలా అని ఆలోచిస్తుంది. ఇక చదవండి.]

అధ్యాయం-15

[dropcap]మ[/dropcap]నం ఏ మాత్రం వెనకబడకుండా ఉండాలన్నా, విజేతలం కావాలన్నా మన బలాలు, బలహీనతలు మనకి తెలిసి ఉండాలి. వాటిని అంగీకరిస్తూ ఉండాలి. వాటి మీద స్పష్టత ఉండాలి. వాటిని మరుగు పరిస్తే మెరుగు అవడానికి అవకాశం లేకుండా పోతుంది.

శంకరం కూడా తన బలాల కన్నా బలహీనతల వేపు దృష్టి కేంద్రీకరించాడు. వాటిని అంగీకరిస్తున్నాడు కూడా. తన బలహీనతలేంటి? పిల్లల్ని సక్రమమైన విధంగా పెంచకపోవడం, తన పెంపకంలో ఉన్న లోటు అతడ్ని భావోద్వేగానికి గురి చేస్తోంది. అసలే రాజకీయ జీవితం అంటేనే భావోద్వేగానికి లోనయ్యే జీవితం. ఎప్పుడూ ఏవో రకమైన సమస్యలు. కొట్లాటలు. అలజడులు. సమాధాన పరచడాలు. రాజీ కుదర్చడాలు. ప్రతిపక్షాల్ని మాటల యుద్ధంలో ఎదుర్కోడాలు.

వీటి వలన రోజూ అనేక భావోద్వేగాలకు, భావోద్రేకాలకు లోనవడం. ఎన్నెన్నో ఎమోషన్లు అవి పాజిటివ్ అయితే పరవాలేదు కాని నెగిటివ్ అయితే? మరి ఇంతే భావోద్రేక తీవ్రతతో ఎంతటి వారైనా విచక్షణారహితంగా ప్రవర్తిస్తారు. ఆలోచనకు సైతం అవకాశం లేకుండా పోతుంది. ఈ భావోద్వేగాల వల్ల కొన్ని సందర్భాల్లో మంచి జరుగుతే మరికొన్ని సందర్భాల్లో చెడు జరుగుతుంది.

శంకరం ఇలా భావోద్వేగానికి గురికావడానికి కారణం కొడుకు మధు చేసిన పని. మధు ఓ సినీ అభిమాన సంఘానికి నాయకుడు. తన అభిమాన హీరోను మరో అభిమాన సంఘ నాయకుడు విమర్శించడం తట్టుకోలేక వాళ్ళ మీద దాడి చేసి చితకబాదాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితుడ్ని పట్నం తీసుకెళ్ళి హాస్పటల్లో జాయిన్ చేసి ట్రీట్‌మెంటుకి డబ్బులిచ్చి బాధితుని తరుపు వాళ్ళకి క్షమాపణ తెలియజేసి ఇలా వచ్చాడు.

ఇక్కడ కూడా మధును భావోద్వేగాలు ఉద్రేక స్వభావానికి దారి తీసి దాడికి ఉసికొల్పాయి. పరిస్థితులు భావ మనోవికారాలైన ఈర్ష్య ద్వేషంగా మారి భయానక వాతావరణానికి దారి తీసింది.

అయినా మధూకీ ఈ అభిమాన సంఘాలేంటి? రాజకీయ పార్టీ విరాళాల పేరుతో తను డబ్బు సంపాదిస్తూ ఉంటే అభిమాన సంఘం పేరుతో కొడుకు డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడ్తూ దుబరా చేస్తున్నాడు. తన కొడుక్కి ఎప్పుడు బుద్ధి వస్తుందో?

హీరో జన్మదిన వేడుకలకి డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేసి వేడుకలు చేసుకుంటున్నారు. హీరో పేరున దానధర్మాలు చేస్తున్నారు. రక్త దానాలు చేస్తున్నారు. అయితే ఆ హీరో తరుపునుండి వీళ్ళకి ముట్టేది పొగడ్తలు, ప్రశంసలు తప్ప ఒక్కరూపాయి కూడా ముట్టదు. అభిమాన హీరో సినిమా విడుదల అయితే అభిమాన సంఘం వాళ్ళదే సందడి. మొదటి ఆటకు వీళ్ళే ఉండాలి. ఈ పిచ్చి ఎంతగా ముదిరిందంటే అభిమాన హీరో కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసే పరిస్థితి కలుగుతోంది. ఈ జాడ్యం ఎప్పుడు పోతుందో అప్పుడే మధు లాంటి యువత బాగుపడుతుంది. భావోద్వేగంతో ఆలోచిస్తున్నాడు శంకరం.

భర్త ఇంత భావోద్వేగానికి గురవడం కాత్యాయిని ఎప్పుడూ చూడలేదు. అయితే ఆమె మాట్లాడకుండా మజ్జిగ గ్లాసు టిపాయి మీద పెట్టి వెను తిరిగింది.

“కాత్యాయినీ!” అతను పిల్చాడు. ఆమె ఆశ్చర్యంగా అతని వేపు చూసింది. అతని కళ్ళల్లో ఏదో తెలియని బాధ – పశ్చత్తాపం.

ఆమె ఆలోచిస్తోంది. తన తండ్రి ఓ చిరు ఉద్యోగి. అతని చుట్టూ ఎన్నో బాధ్యతలు. తన పిల్లల బాధ్యత లేకుండా అన్నదమ్ముల చదువులు, అక్క చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసేటప్పటికి అతను ఆర్థికంగా చితికిపోయాడు. నిస్సహాయకుడిగా నిలబడిపోయడు ఆ మధ్య తరగతి కుటుంబీకుడు. అతడ్ని ఆర్థికంగా ఆదుకోలేదు తోబుట్టువులు కూడా.

అటువంటి సమయంలోనే తన పెళ్ళి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పుడే శంకరం సంబంధం వచ్చింది. మొదటి భార్యకి విడాకులిచ్చాడు. మనిషి అంత మంచివాడు కాదట. శాడిష్టు మెంటాల్టీట. అత్తగారు, ఆడబడుచులూ కూడా మంచివాళ్ళు కాదట. మొదటి భార్యని అందరూ కోడంటికం పెట్టి నానా అగచాట్లకి గురి చేశారుట. ఆవిడ అత్తింటి ఆరళ్ళు సహించలేక విడాకులు తీసుకుందట. ఇవి శంకరం గురించి తను విన్న మాటలు.

ఈ సంబంధం తీసుకు వచ్చిన మధ్యవర్తి మాత్రం ఆర్థికంగా మీ అమ్మాయికి ఏ లోటూ లేని సంబంధం. పైసా కట్నం కూడా వద్దన్నారు. నిరాడంబరంగా పెళ్ళి చేస్తే చాలంటున్నారు అని అన్నాడు.

తన తండ్రి ఈ సంబంధం చేయాలా, వద్దా అని ఊగిసలాడుతున్నాడు. తన తండ్రి ఆర్థిక పరిస్థితి తనకి తెలుసు. కొన్ని కావాలి – కొన్ని అవాలని అని అనుకున్నప్పుడు మరి కొన్నింటిని వదులుకోవాలి. తెగించి ఎలా జరగవల్సింది అలా జరుగుతుందని ముందుకు అడుగువేయాలి.

తను అదే చేసింది. నా నుదుటిని ఎలా వ్రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది. జీవితం ఇలా ఉండాలి – అలా ఉండాలని మనమే మన జీవితాన్ని శాసించలేము కదా. ఆర్థికలేమితో బాధపడ్తున్న మీ మధ్య ఉండేకంటే అక్కడ కష్టాలూ – కన్నీళ్ళూ జీవితంలో ఎదురయినా నేను అటు వేపే అడుగు వేయడానికి అంగీకరిస్తాను అంది తన తండ్రితో.

నా కన్నె చెరయినా విడిపించిన వాళ్ళు అవుతారు. తనని ఓ ఇంటిదాన్ని చేసి గుండెల మీద కుంపటిలా ఉన్న తను బరువు ముఖ్యంగా తొలగుతుంది. అని అనుకుని శంకరంతో తను పెళ్ళికి అంగీకరించింది.

భర్త నన్న అహంకారం శంకరానిది. తన మాటే భార్య వినాలి. తన అభీష్టం ప్రకారం నడుచుకోవాలి. తనకి భార్యగా ఉంటూ గంగిగోవులా ఉండాలి. తనకి ఎదురు చెప్పకూడదు. ఇదే అతనిలో ఉన్న భార్య యడల ఉన్న భావాలు, ఎమోషన్సు.

పెళ్ళి అయిన తరువాత తనేం సుఖపడిందా? ఉఁహూఁ..! సుఖపడలేను. అక్కడ వాతావరణం చూడగానే తనకి అలా అనిపించింది. అందుకే అతని మొదటి భార్య అత్తింటి ఆరళ్ళని భరించలేక విడాకులు తీసుకుంది అని తను అనుకుంది.

అది కుగ్రామం. అందులోనూ అగ్రహారం. అక్కడ చాదస్తం మనుష్యులు. వాళ్ళ మధ్య జీవితం. తను అత్తవారింటికి వెళ్ళిన తరువాత విధవ ఆడబడచుతో పాటు పెళ్ళయిన ఆడబడచు కూడా కుటుంబంతో అక్కడే ఉండేది. ఆ ఆడబడచు బట్టలన్నీ ఉతకడానికి తన ముందు పడేసేది. అత్తగారు బండెడు అంట్లు తోమమని తన ముందు పడేసేది. ఇల్లు తుడవడం, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం వీటితోనే తన జీవితం గడిచిపోయింది. ఒక్కొక్క పర్యాయం ఏడుపు వచ్చేది తనకి. తన కష్టాల్ని, మనస్సులో మాట చెప్పుకోడానికి ఎవ్వరూ లేరు. దుఃఖాన్ని తను మనస్సులోనే దిగమ్రింగుకునేది.

అందరూ తిన్న తరువాత గిన్నెల్లో చాలీచాలని అదరువులు, అన్నం మిగులుస్తే వాటితోనే కడుపు నింపుకుని, అర్ధాకలితో జీవితం గడిపింది. సుందరి తన కడుపులో పెరుగుతోంది. విపరీతమైన నీరసం, అటువంటి సమయంలో కూడా ఇంటి చాకిరీ అంతా తనే చేయవల్సి వచ్చేది. తనకి కొన్ని కొన్ని రుచులున్న పదార్థాలు తినాలనిపించేది. తను నోరు విడిచి అడిగినా వినీ విననట్లు ఊరుకునే వారే కాని తన కోరికలు తీర్చలేదు.

తన అత్తింటి ఆరళ్ళ గురించి తను పుట్టింటికి తెలియజెప్పకపోయినా తెలుసుకుని పుట్టింటి వాళ్ళు చాలా బాధపడ్డారు. తల్లడిల్లిపోయారు. తనని తన పుట్టింటికి పంపేవారు కాదు. ఒకసారి తనలో ఉన్న సహనం చచ్చిపోయి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసింది. దీనితో ఇంటిల్లిపాది భయపడిపోయారు. అప్పటి నుండే వాళ్ళ ప్రవర్తనలో కొద్దిగా మార్పు రావడం ఆరంభించింది.

అత్తగారూ, మావగారూ, విధవ ఆడబడచు చనిపోవడం, రెండో ఆడబడచు వేరే ఊరు కాపురం నిమిత్తం వెళ్ళిపోవడంతో తన జీవితంలో కొంత స్వేచ్ఛ, స్వాతంత్ర్యం వచ్చాయనిపించింది. అయితే పూర్తిగా స్వాతంత్య్రం రాలేదు. ఇప్పుడు కూడా తన భర్తదే పై చెయ్యి. అతని అభీష్టం మేరకే అన్ని పనులూ జరగాలి. అందరు కుటుంబ సభ్యులూ అతని మాటే వినాలి. అనేదే అతని భావన. కొడుకు ఇలా తయారయ్యేప్పటికి తట్టుకోలేకపోతున్నాడు.

“కాత్యాయినీ!” తిరిగి పిలిచాడు శంకరం.

ఆలోచనా ప్రపంచం నుండి బాహ్య జగత్తులోకి అడుగుపెట్టింది కాత్యాయిని.

“నేను జీవితంలో ఎంత పెద్ద తప్పు చేశానో తెలుసా? ఓ బాధ్యత గల తండ్రిగా నేను ప్రవర్తించలేదేమో అని నాకనిపిస్తోంది.”

భర్త ఎప్పుడూ ఇంత భావోద్వేగానికి లోనయి మాట్లాడ్డం కాత్యాయిని ఎప్పుడూ చూడలేదు. అతని వదనంలో ఆవేదన అగుపడింది ఆమెకి.

“ఏం జరిగింది?” ధైర్యం కూడదీసుకుని ప్రశ్నించింది.

మధు విషయం వివరించాడు శంకరం. ఆమెకి మొదటి నుండి కొడుకు ప్రవర్తన నచ్చలేదు. తండ్రి దన్ను చూసుకుని వీడిలా తయారయ్యాడు అని అనుకునేది చాలా పర్యాయములు. అయితే ఏం చేయలేని పరిస్థితి. ఇంట్లో తన జీవితమే నిలకడలేని జీవితం. అలాంటప్పుడు తను కొడుకునేం మందలించ గలదు? తండ్రికి కొడుకు ప్రవర్తన స్వయంగా ఈ రోజున తెల్సింది కాబట్టి బాధపడుతున్నారు. తండ్రే కొడుకు విషయంలో శ్రద్ధ తీసుకోవాలి.

“కొడుకూ, కూతుర్ని చూసి మురిసిపోయానే కాని, నేను చేసిన తప్పు, నా పెంపకంలో లోటు ఈ రోజు నాకు తెలిసి వచ్చింది. మొక్కగా ఉన్నప్పుడే వంచలేకపోతున్న వాడిని మ్రానుగా మారిన తరువాత వంచగలనా?” నుదురు కొట్టుకుంటూ అన్నాడు శంకరం.

భర్త ఉద్వేగం చూసిన తరువాత కాత్యాయినిలో భర్త ఎదుట తన మనస్సులో మాట చెప్పడానికి తగిన ధైర్యం వచ్చింది.

“మీరు కోపగించకుండా ఉంటే ఒక్క మాట చెప్పనా?”

“చెప్పు.”

“మధు విషయం విడిచిపెట్టండి. సుందూ విషయమే నాకు బెంగగా ఉంది. సిద్ధార్థకి సుందూని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదని నాకనిపిస్తోంది. మీకు ఇచ్చిన మాటకి కట్టుబడి తన అభిప్రాయం చెప్పలేక మథన పడ్తున్నాడనిపిస్తోంది. అయినా ఆ అబ్బాయి తప్పేం లేదు. సుందూకి చదువు సంధ్యలు శూన్యం. పనిపాట్లు రావు. శారీరికంగా ఎదిగినా పసిపిల్ల కన్నా అద్వానం. మానసిక స్థితి ఏ విధంగా చూసుకున్నా ఆ అబ్బాయికి తగిన అమ్మాయి కాదు. మన కూతురే అయినా నేను నిజాన్నే చెప్తున్నాను. దీనిలో మార్పు రాకపోతే సిద్ధార్థ సుందూని పెళ్ళి చేసుకుని ఏం సుఖపడగలడు? ఆ తరువాత కలతల కాపురం, అశాంతి మయమైన జీవితం. కూతురు జీవితం అలా ఉంటే మనకేం సంతోషమా.”

“లేదు, అయితే మనం ఏం చేయాలి?”

“మీ బాబాయ్ కొడుకు సూర్యం వైజాగ్‌లో ఉన్నాడు కదా! వాళ్ళకి పిల్లలు లేకపోతే ఒక అమ్మాయిని పెంచుకుని చదివిస్తున్నారు కదా! ఆ అమ్మాయి చాలా తెలివైనది, బుద్ధిమంతురాలు, బాగా చదువుతుందని విన్నాను.”

“అవును, అయితే ఆ శకుంతల గురించేనా నీవు చెప్తున్నది. ఇప్పుడే ఆ ప్రస్తావన ఎందుకు?” చిరాగ్గా అన్నాడు.

“చిరాకు పడకండి. నేను చెప్పింది సావధానంగా వినండి. మన సుందూని కూడా సూర్యం వాళ్ళింటిలో చదువు నిమిత్తం కొన్ని నెలలు ఉంచుతే ఆ శకుంతలను చూసి దీనికి కూడా చదువు మీద శ్రద్ధ కలుగుతుంది. ప్రవర్తనలో మార్పు వస్తుంది. మీ మాట కాదనరు సూర్యం దంపతులు. ఆ నమ్మకం నాకుంది” అంది కాత్యాయిని.

భార్య మాటలు విన్న శంకరం ఆలోచన్లలో పడ్డాడు. ‘కాత్యాయిని చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది. ఎలాగూ మధూ నా మాట వినటం లేదు. సుందూనేనా మార్చాలి. సిద్ధార్థకి తగిన భార్యగా మలచాలి. మనకి తట్టని విషయం మంచిదయినప్పుడు దాన్ని అమలు పరచడం మంచిదే కదా! కాత్యాయిని సలహా కూడా బాగానే ఉంది,’ అనుకున్నాడు శంకరం.

అధ్యాయం-16

సాయంకాలం అయిదు గంటలవవస్తోంది. భానుని అస్తమయ కిరణాలు వసుధకి వింత అందాన్ని తెచ్చుపెడ్తున్నాయి. ఆ నీరెండ చెట్ల ఆకులపై పడటంతో అవి మెరుస్తున్నాయి. ఆ నీరెండలో ప్రకృతి మనోహరంగా అగుపడ్తోంది.

అలాంటి సంధ్యా సమయంలో పొలం గట్టు వేపు బయలుదేరారు సిద్ధార్థ, మధు. ముఖ్యంగా సిద్ధార్థ మధుని ఇలా ఒంటరిగా తీసుకు రావడంలో కూడా కారణం ఉంది. మధు మనస్సు, భావాలు తెలుసుకుని అతనిలో పరివర్తన తీసుకురావాలని.

భావ మనో వికారాల్లో భక్తి, శ్రద్ధ, ప్రేమ ఒక భాగము. ఒక వ్యక్తిలోని విశిష్ట గుణాలకి ఆకర్షింపబడి, వీళ్ళ మీద శ్రద్ధ, భక్తిలాంటి భావం కలుగుతుంది. ఆ భావాలే రాను రాను పిచ్చి ప్రేమ, ఆరాధనగా మారుతాయి.

“మధూ! అభిమాన సంఘం అనే విష వలయంలో చిక్కుకు పోతున్నావు. నీవు ఏంటి చేస్తున్నావో? ఎలా ప్రవర్తిస్తున్నావో నీకు తెలుసా? నీ వాళ్ళకి మనస్తాపం కలిగిస్తున్నావు.”

“ఏంటి బావా అలా మాట్లాడుతున్నావు? అభిమాన సంఘం పెట్టి అభిమాన హీరోను ఆరాధించడం, ప్రేమించడం తప్పా? ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రంగం అంటే ఇష్టం. నాన్న రాజకీయ రంగాన్ని ఇష్టపడతాడు. నీవు విద్యను ఇష్టపడతావు. నేను నా అభిమాన హీరోను ఇష్టపడతాను. ఆరాధిస్తాను. ఒక్కొక్కళ్ళు ఇలా ఒక్కొక్క రంగాన్ని ఎంచుకుంటారు. నేను సినీ హీరోను అభిమానించడం తప్పా?”

“ఓ హద్దు అనేది ఉంది. సమాజానికి హాని జరగనంత వరకూ చేయనంత వరకూ అభిమానించడంలో తప్పులేదు.”

“సమాజానికి హానా?”

“అవును. ఒక అభిమాన సంఘం వారు ఒక హీరోను అభిమానిస్తారు, ఆరాధిస్తారు. మరో సంఘం వారు మరో హీరోని అభిమానిస్తారు, ఆరాధిస్తారు. అలా చేయడం వరకూ బాగుంది. రెండు సంఘాల వారు ఎదుటి పక్షం హీరోలను చెడుగా చెప్పుకుంటే రెండు సంఘాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. కొట్లాటకు దిగుతారు. దాడికి దిగుతారు. దీనివల్ల సమాజంలో అశాంతి ఏర్పడుతుంది. హింస చెలరేగుతుంది. ఇది సమాజానికి హితమా? లేక అహితమా? చెప్పు మధూ!”

“బావా! నీవు సినిమాలు చూడవా? నీకు అభిమాన హీరో లేరా?”

“ఇప్పటి సినిమాల్లో మంచి వాటిని వ్రేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ప్రతీ సినిమాకి విడుదలకి ముందు ఆడియో ఫంక్షన్లు పెట్టడం, ఆ ఫంక్షన్లలో తోపులాట, సినిమా బాగున్నా బాగులేకపోయినా హీరోని ఆకాశానికి ఎత్తేయడం, విడుదల అయిన మొదటి రోజునే అభిమానులు సూపర్ హిట్ అని పొగిడెయ్యడం, విడుదలయిన తరువాత మరుసటి రోజు విజయోత్సవాలు.”

“నీవు ఈ కాలంలో పుట్టవల్సిన వాడివి కాదు. ఈ జడ పదార్థాన్ని కాలేజీలో అమ్మాయిలు కామెంటు చేయటం లేదు కదా! సమాజంలో  వెనకబడిపోయావు బావా! కాలానుగుణంగా నిన్ను నీవు మలుచుకో!” మధు అన్నాడు.

“నీలాంటి వారికి నా మాటలు నిష్ఠూరంగా ఉండి ఉండచ్చు. అందుకే లోకోభిన్న రుచి అంటారు. నీవు ఇష్టపడినదాన్ని నేను ఇష్టపడక పోవచ్చు. నేను ఇష్టపడిన దాన్ని నీవు ఇష్టపడకపోవచ్చు. అదంతా ఎందుకు? వందేళ్ళ సినిమా పండుగ అని జరుపుకుంటున్నారు. అయితే నేటి సినిమాల్లో  ఏముంది గొప్పతనం? నేటి సినీ ప్రపంచానికి కావల్సింది నటన కాదు పలుకుబడి, ఆ పలుకుబడి ముసుగులో టాలెంట్, అందం లేకపోయినా వారసుల్ని అందలమెక్కిస్తూ, టాలెంట్, అందం ఉన్న బయటవారిని ఈ ప్రపంచంలోకి రానీయకుండా చేయడమే ఈ సినీ పెద్దల పని. పలుకుబడితో వారసులైన కుర్ర హీరోలు, అవార్డులు, రివార్డులు సంపాదిస్తారు. ప్లాస్టిక్ సర్జరీలతో లేని కృత్రిమ అందాన్ని రూపొందించుకుని హీరోలుగా చెలామణీ అయిపోతున్నారు.

నేటి సినిమాల్లో చోటు చేసుకున్న, ప్రభావితం చేస్తున్న లైంగిక వైపరీత్యానికి, అశ్లీల శృంగార విన్యాసాలు మితిమీరి సమాజంలో చెడుకి దారి తీస్తున్నాయి. అశ్లీల గీతాలు, అసభ్యరాగాలు, ద్వందార్థ మాటలు, బూతు డైలాగులు, ఇవీ నేటి సినిమాలు తీరుతెన్నులు. ఓ కథా ఉండదు. ఐటెమ్ సాంగ్సుతో ప్రేక్షకుల్ని మెప్పించవచ్చు అని అనుకునే భ్రమలో ఉంది నేటి సినీ పరిశ్రమ.

ఉత్తమ సంగీతానికి, ఉత్తమ నటులకి ఉన్నత విలువలు కలిగిన సాహిత్యంతో ఉన్న పాటలకి మధురమైన పాటలకి ఈనాడు సినిమాలో స్థానం లేదు. పాటల రచయితలు అశ్లీల పదాలు వేసి పాటలు వ్రాస్తుంటే బొంగురు గొంతకల్తో – కీచు శబ్దాల ఉచ్చారణతో స్వరాన్ని మార్చేసి పాటలు పాడుతున్నారు గాయకులు” సిద్ధార్థ ఆపాడు.

“అయిందా నీ ఉపన్యాసం? ఎంతగా క్లాసు పీకావు?”

“నా మాటలు నీకు రుచించకపోవచ్చు. కాని నా మాటల్లో నిజం ఉంది. ఇంచుమించు మనిద్దరి వయస్సు ఒకటి కాకపోయినా నా కన్నా చిన్నవాడివయినా, మన ఆలోచనా విధానంలో ఎంత మార్పు? ఇంతెందుకు? హీరో జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిపిస్తారు. అన్నదానాలు చేస్తారు. రక్తదాన శిభిరాలు పెడ్తారు. పండ్లు పంచుతారు రోగులకి వీటి అన్నిటికీ అవసరమైన డబ్బు అభిమాన హీరో ఇస్తున్నాడా?

మీ చేతి చమురు వదలవల్సిందే కదా! చివరికి అభిమానులు ఇచ్చే రక్తాన్ని కూడా సొమ్ము చేసుకునే హీరోలున్నారు అని నీవు వినలేదా? ఈ మధ్య ఆడియో ఫంక్షనులో తొక్కిసలాట జరిగింది. అప్పుడు ఓ అభిమాని చనిపోయాడు. అతని కుటుంబం వీధిన పడింది. జీవితాంతం ఆ అభిమాని కుటుంబాన్ని హీరో ఆదుకోగలడా? కంటితుడుపు చర్యగా ఎంతో కొంత డబ్బు ముట్టజెప్పడం తప్ప.”

“అయితే నేను చేస్తున్న పని సవ్యమైనది కాదంటావు.”

“అది నీకే తెలియాలి. ఇప్పుడున్న సినీ రంగం తీరుతెన్నులు గురించి చెప్తున్నాను. అయినా నేడు ఈ ఆడియో ఫంక్షన్లు జోరు ఎక్కువయిపోయింది. వారసులు పాటలకి వెరైటీ స్టెప్పుల్తో డాన్సు గ్రూపులు అదరగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. బుల్లితెర యాంకర్లు ఈ సందర్భంల్లో లక్షల్లో వసూలు చేస్తున్నారు. సినిమా శత దినోత్సవాలు కరువయిపోబట్టే ఈ ఆడియో ఫంక్షనకి అంత హడావుడి.

పూర్వం అయితే సినిమాలు విడుదల అయిన తరువాత అర్ధ శత దినోత్సవం, శత దినోత్సవం పోస్టర్లు వేసేవారట. ఇంకా భారీ హిట్ అయితే  సిల్వర్ జూబ్లీ, చేసుకునేది సినిమా. ఇన్ని సెంటర్లలో సినిమా శత దినోత్సవం, అన్ని సెంటర్లలో సిల్వర్ జూబ్లీ అని జరుపుకుని రికార్డులు భద్రపరుచుకుని సంతోషపడేవారట.

మరి ఇప్పుడో? ఎంత సూపర్ హిట్ అయినా పాతిక రోజులు ఆడితే గొప్ప, ఇన్ని రోజులు పోయి కలెక్షన్ల రికార్డుల మోత మోగించడానికి వేలాది థియోటర్లలో అగ్ర హీరోల సినిమాలు విడుదల చేస్తున్నారు. లెక్కాపత్రం లేకుండా నిర్ణయించే అనధికార టికెట్టు ధరలతో కలెక్షన్లు హోరెత్తి పోతున్నాయి. తొలి వారంలోనే పెట్టుబడులు లాగే ప్రయత్నాలు, నానాటికి నేడు ఎక్కువయి పోతున్నాయి. సినిమా ఎంత హిట్ అయినా బి.సి. సెంటర్లో మూడు వారాలకే సినిమాలు మాయమవుతున్నాయి.

అధిక రేట్ల దాటికి కొట్టుకుని చూసే జనాలు కనిపించటం లేదు. అందుకే యూత్ టార్గెట్‌తో సినిమాలు తయారవుతున్నాయి. నేడు వంద రోజుల పోస్టరు కరువయిపోయింది. తమ అభిమాన హీరో ఫ్లెక్సీ పై తమ ఫోటోలను వేయించుకునే కాలం వచ్చేసింది. కలెక్షన్ల గీటు రాయిగా మారిన రికార్డుల మోతతో సినిమా రన్ పడిపోయింది. అందుకే ఆడియో వేడుకలకి ప్రాధాన్యత పెరిగింది. పైరసీ దెబ్బకి ఆడియో కంపెనీలు కూడా అంతగా రన్ కాలేకపోతున్నాయి.”

సిద్ధార్థ ఊకదంపుడు ఉపన్యాసం మధుకి నచ్చలేదు. తలనొప్పి తెస్తోంది. ‘ఈ బావతో తను అనవసరంగా వచ్చాను. చక్కగా సమయాన్ని ఆనందమయంగా మలుచుకోకుండా’ అని అనుకుంటున్నాడు.

“నీవు ఏంటనుకుంటున్నావో నాకు తెలుసు” సిద్ధార్థ నవ్వుతూ అన్నాడు. మధు ఏం సమాధానం ఇయ్యలేదు.

“మధూ! చివరిగా నేను ఒక్క విషయం చెప్పదల్చుకున్నాను. ఈ రోజు నీవు ఆరాధిస్తున్న అభిమానిస్తున్న హీరోకి కొన్ని రోజులకి సినిమాల సంఖ్య తగ్గచ్చు. అతని సినిమాలు ఫట్ అవచ్చు. ఎందుకంటే కాలం ఎప్పుడూ ఒక్కలాగే ఉండదు. కనుక ఆ హీరో సినీమాలు హిట్ అయినా ఫట్ అయినా అతను నిలదొక్కుకోగలడు. ఎందుకంటే అతని దగ్గర పుష్కలంగా సంపాదించిన సంపద ఉంటుంది. అయితే చివరికి జీవితం పాడయ్యేడి నీలాంటి అభిమానులదే.

హీరోని అభిమానించవద్దని నేను చెప్పటం లేదు. అయితే అది ఓ హద్దు వరకే? నేడు అలా అవటం లేదే. ఈ అభిమానం విషమ సంస్కృతిని ప్రోత్సహిస్తోంది. వెర్రితలలు వేస్తోంది. ఆ అభిమానం ఎంతగా పెరిగిపోయిందంటే ఆ హీరో పేరున ఓ గుడి కట్టించి అతని బొమ్మ పెట్టే స్థాయి వరకూ పెరిగిపోయింది. ఇదే నా బాధ” అన్నాడు సిద్ధార్థ.

నలు దిశలా చీకట్లు క్రమ్ముకొస్తున్నాయి. ఇంటికి బయలు దేరడానికి లేచారు ఇద్దరూ. నడుస్తున్న సమయంలో ఇద్దరి ఆలోచన్లలోని భిన్నత్వం. ‘ఈ రోజు బావతో రావటం ఎంత తప్పు చేశాను’ అని అనుకుంటున్నాడు మధు. సిద్ధార్థ ఆలోచన్లు మరో విధంగా ఉన్నాయి. ‘ఈ రోజు మధు తనని మనస్సులో ఎంత తిట్టుకుని ఉంటాడు? నా మాటలు అతనికి రుచించలేనట్లుంది. మధులో మార్పు వస్తే పరవాలేదు. కానీ అదే రాకపోతే అతని జీవితం అంతే’ అనుకుంటున్నాడు సిద్ధార్థ.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here