సమాజం రూపాంతరం చెందుతున్న ఆ రోజుల్లో….

4
6

[dropcap]నా[/dropcap]కు అక్షరాభ్యాసం చేసినవారు శ్రీమాన్‌ మోటుపల్లి కృష్ణమాచార్యులు. మా ఇంట్లో చిన పిన్న తండ్రులిద్దరికీ.. నా తర్వాత కుటుంబంలోకి వచ్చిన పిల్లలకు వారే అక్షరాభ్యాసం చేశారు. ఆ రోజుల్లో ఆయన సనాతన ధర్మ ప్రచారానికి క్రియాశీలుడైన కార్యకర్త. నేడు ఆంధ్రబాలికా జూనియర్‌ కాలేజీ ఉన్న ప్రాంతంలో రామలింగేశ్వరాలయానికి వెళ్లే చిన్న సందులో.. ఆయన పాఠశాల ఉండేది. ఆ వీధి బళ్లో ఆయన ఒకడే అధ్యాపకుడు. అక్షరాల తరగతి నుండి.. మూడు నాలుగు తరగతు దాకా విద్యార్థులే.. చిన్నవారికి పెద్దవారుగా పాఠాలు చెప్తూ ఉంటే.. ఆయన స్థూలంగా పర్యవేక్షించేవారు. విద్యార్థుల తల్లిదండ్రులిచ్చే ఒకటో.. రెండో రూపాయలు ఆయనకు వేతనంగా వచ్చేది. ఆ రోజుల్లో వరంగల్‌ నగరంలో దాదాపు నలభై.. యాభై వీధిపాఠశాలలు ఉండేవి. వీటిలో బోధన ఒక అధ్యాపకుడే చేస్తుండేవాడు. ఈ వివరాలు మాదిరాజు రామకోటేశ్వరరావుగారి ఆత్మకథలో వివరంగా ఉన్నాయి. ఈ పాఠశాలలో లెక్కలు.. ఎక్కాలు.. కొంత సామాజిక శాస్త్రం.. శతకాల పద్యాలు.. కొన్ని సంస్కృత శ్లోకాలు.. చెప్పబడుతూ ఉండేవి. రెండు మూడేండ్లలో విద్యార్థులకు భాషాజ్ఞానము, చదువడము, రాయడము.. కొంతలో కొంత శబ్దజ్ఞానము వస్తూ ఉండేది. సామాన్యమైన ఎక్కాలే కాక, కూడిక ఎక్కాలు.. తీసివేత ఎక్కాలు.. కొలమానాల లెక్కలు.. తదితర నిత్యజీవితానికి అవసరమైన అంశాలు నేర్పబడేవి. నీతిశాస్త్రమనే చిన్న పుస్తకం, జీవన మార్గదర్శకాలైన అంశాలతో సంస్కృత శ్లోకాలుగా కంఠస్థం చేయించబడేవి. శిక్షలు కొంచెం కఠినంగా ఉన్నా, అధ్యాపకునికి విద్యార్థుల కుటుంబానికి సన్నిహితమైన సంబంధాలు ఉండేవి. సాయంకాలం బడి విడిచిపెట్టేముందు.. వారి వారి ఎత్తు ప్రకారం నిలబడితే, ఒకరు ఎక్కాలు, ప్రభవాది సంవత్సరాల పేర్లు, రాశులు నక్షత్రాలు, నెలలు, ఋతువులు.. నలుపు, తెలుపు, ఎరుపు రంగుల్లోని వస్తువుల పేర్లు వరుసగా చెప్తూ విద్యార్థులతో చెప్పిస్తూ అరగంట పైగా నిత్యాభ్యాసం జరిగేది. ఇవాళ ప్రాథమిక పాఠశాలల్లో సహజమైన హోం వర్క్‌ లాంటిది అప్పుడు ఉండేది కాదు. అంతా చదువు అక్కడే పూర్తయ్యేది. భోజన విరామానికే కాక, ఉదయం, సాయంత్రం.. దగ్గర ఉన్న పిల్లలకు ఇంటికి వచ్చే సౌకర్యం ఉండేది. ఇలా విద్యలో ప్రాథమిక దశను ముగించుకొని నేను సామాన్య విద్యా ప్రణాళికలో చేరుకున్నాను. దగ్గర్లోనే ఉన్న సంస్కృత కళాశాలకు ఎప్పుడో ఒకప్పుడు వెళ్లినా.. అది అపవాదమే. 1944-45లో నేను ఆ నాళ్లల్లో స్థాపించిన ఆంధ్ర విద్యాభివర్ధని పాఠశాలలో చేరాను. 1944 మే లోనే నా ఉపనయనం జరిగింది. పైన చెప్పిన పాఠశాల.. తెలుగుభాష మీద ప్రేమతో ఆ భాష మాధ్యమంగా ఒక పాఠశాల కావాలని భావించి జాతీయోద్యమ నాయకులు స్థాపించింది. దీనికోసం ఆ నాళ్లల్లో చందా కాంతయ్య అనే ఉదార వ్యాపారస్థుడు లక్ష రూపాయల విరాళమిచ్చి దాని స్థాపనకు పూనుకొన్నాడు. నగరంలో పెద్దలు.. ఒద్దిరాజు రాజేశ్వరరావు, కాళోజీ రామేశ్వరరావు కమిటీ సభ్యులుగా ఉండేవారు. ఎంఎస్‌ రాజలింగం కార్యదర్శిగా వ్యవహరించారు. అడవాల సత్యనారాయణ, పాములపర్తి సదాశివరావు, బండారు చంద్రమౌళీశ్వరరావు మొదలైన వాళ్లు అధ్యాపకులుగా ఉండేవారు. అప్పుడు పాఠశాల ఎల్లమ్మబజార్‌లోని చకిలం దమోదర్‌ సందు దగ్గర ఉండేది. తరువాత మట్టెవాడకు మారింది. ఆ తర్వాత పదేండ్లకు మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో ప్రస్తుతం ఉన్న చోటుకు మారింది. ఒక ఆదర్శానికి కట్టుబడ్డ ఈ పాఠశాలలో అధ్యాపకులు సంపూర్ణమైన నిబద్ధతతో పనిచేస్తుండేవారు. ప్రభుత్వ పాఠశాలలో లేని సాంస్కృతిక కార్యక్రమాలు, పెద్దల ఉపన్యాసాలు ఇక్కడ జరుగుతూ ఉండేవి. ఆ రోజుల్లో నేను ఐదో తరగతిలో చేరిన కొత్తలో (194647) రజాకార్‌ ఉద్యమం నగరాన్ని అట్టుడికించింది. ఆ సందర్భంలో వరంగల్‌ నుంచి అనేక మంది కాందిశీకులుగా చాందా, నాగ్‌పూర్‌ల వైపు.. బెజవాడవైపు బ్రతుకును దక్కించుకోవడంకోసం పారిపోయారు. మేము పర్వతగిరి సమీపంలోని కల్లెడలో దొరవారైన ఎర్రబెల్లి వెంకటేశ్వరరావు ఆశ్రయంలో మా కుటుంబం కొంతకాలం ఉన్నది. అప్పుడు మా తాతగారు ‘గడి’ లో ఉదయం భగవద్విషయము (శ్రీవైష్ణవ మతాచార్యులైన నమ్మాళ్వారుల దివ్యప్రబంధము, తిరువాయి మొఝికి వ్యాఖ్యానము), సాయంకాలము శ్రీమద్రామాయణము కాలక్షేపం (ప్రవచనం) చేసేవారు. నిజం చెప్పాలంటే నా జీవితంలో అతి విస్తృతమమైన ఉదాత్తమైన సంపన్నమైన విద్యాభ్యాసం ఆ పరిమిత కాలమే. నేను మామూలు లౌకిక విద్యాస్థాయి నుండి, ఉపనిషత్తులు, భగవద్గీత, ఉభయ వేదాంత గ్రంథాలు, రామాయణ రహస్యాలు.. ఇలా నా చిత్తంలో పదిలంగా తమను తాము పరుచుకుంటూ పోయాయి. ఆ తర్వాత మేము 1948 జనవరిలో విజయవాడకు వెళ్లాం. కల్లెడలో ఉన్న రోజుల్లోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. నేను, మా చిన్నాయన సంపత్కుమారాచార్యగారు అక్కడ ఉన్నప్పుడే కవితాభ్యాసాన్ని అనవరతం కొనసాగించాం. మా వలెనే ప్రవాసం కోసం అత్తవారింటికి వచ్చిన ప్రతాపపురం రాఘవాచార్య గారు మాకు కవితాగురువులు. వారు పద్య రచన చేస్తుండేవారు. ఆ రోజుల్లో తెలంగాణలో పల్లెలు సంక్షుభితంగా ఉండేవి. రజాకార్ల విజృంభణ పగళ్లలో.. కమ్యూనిస్టుల విజృంభణ రాత్రుళ్లలో సాగుతూ ఉండేవి. ప్రధాన కార్యకర్తలు తప్ప మిగతా జనం బితుకుబితుకుమంటూ బతికేవారు. అక్కడినుంచి క్రమంగా మేము బెజవాడకు చేరుకోవడం.. మా కుటుంబం మూడు భాగాలుగా రాజమండ్రిలో, రేపల్లెలో ఉన్నది. మా తాతగారితోపాటు నేను. మా రెండో పినతండ్రి అప్పలాచార్యులు విజయవాడలో ఉండిపోయాం.  బెజవాడ, నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాలలో మా కుటుంబానికి చెందిన శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని పాటించే శిష్యులు ఉండేవారు. వారి ఆదరణతో అక్కడ తాతగారు ప్రవచనాలు చెప్తుండగా జీవనం గడిపాం. మా నివాసం బెజవాడలోని కొత్తగుడుల దగ్గర ఉండేది. నగరంలోని ప్రాచీన భాగంలోనే అమ్మవారి క్షేత్రం, దుర్గామల్లేశ్వర గ్రంథాలయం అనే ప్రాచీన గ్రంథాలయం ఉండేది. సామారంగంపేటలో పుస్తకాల షాపులు ఉండేవి. పెద్ద జియ్యర్‌ స్వామివారు (అప్పటికి ఆశ్రమం తీసుకోలేదు) విశిష్టాద్వైత సభలు నిర్వహిస్తూ ఉండేవారు. వరంగల్‌లో ఆగిపోయిన నా చదువును కొనసాగించాలనే ఉద్దేశంతో బెజవాడలోని మున్సిపల్‌ హైస్కూలులో(చాలా పెద్ద రాతి భవంతిలో ఈ స్కూలు ఉండేది) నేను కొన్ని నెలలు చదువుకొన్నాను. అక్కడ నాకు లెక్కలు చెప్పిన వారిలో ఒకరైన కారుమంచి కొండలరావుగారు పరిచయమైనారు. అనంతుని ఛందస్సునకు వ్యాఖ్యానం రాసిన ఒక తెలుగు పండితుడు శ్రీవైష్ణవుడు అక్కడ నాకు తెలుగు పాఠాలు చెప్పినారు. కానీ బెజవాడలో పది నెలలు మించి ఉండలేదు. 1948 సెప్టెంబర్‌లో సర్దార్‌ పటేల్‌ సాగించిన పోలీస్‌ చర్య హైదరాబాద్‌ సంస్థానానికి మా వంటి కాందిశీకులకు పునరుజ్జీవనాన్ని కలిగించింది. నవంబర్‌లో దీపావళి పండుగ వరకు అందరం వరంగల్‌లోని మా మా గృహాలకు చేరుకున్నాం. బెజవాడ రోజుల్లో వరంగల్లులోని వైశ్య కుటుంబాలు ఎక్కువభాగం అక్కడే ఉండేవి. అప్పుడు దసరా పండుగ వచ్చింది. వైశ్య కుటుంబాల వారు పట్టుచీరలు.. బంగారు నగలు అలంకరించుకొని కృష్ణానదిలో బతుకమ్మ పండుగను అద్భుతంగా జరుపుకొన్నారు. ఆ పూల పండుగను చూచి కొండమీద కనకదుర్గమ్మ ఎంత సంతసించిందో.. అక్కడి ప్రజలు ఎంతగా పులకితులైనారో ఇప్పుడు వర్ణించలేను.

1946-48 మధ్య కాలంలో వరంగల్లు చరిత్రలో రెండు ముఖ్యమైన సన్నివేశాలు జరిగినాయి. ఒకటి మహాత్మాగాంధీ రాక. ఆయన ప్రత్యేక రైల్లో వచ్చి స్టేషన్లోనే ఆగారు. అప్పుడు ఆయన్ను చూడటానికి లక్షల మంది జనం గుమికూడారు. నా వయస్సు అప్పుడు 18 ఏండ్లు. మధ్యాహ్నం ఎండలో నిలచి ఉన్న నాకు దాహం వేసి కొంచెం దూరం వెళ్లవలసి తిరిగి వచ్చేప్పటికి ఆయన వేదిక మీదికి రావడం ప్రసంగించడం మొదలైన కార్యక్రమాలు పూర్తయ్యాయి. వేదికమీద ఉన్నవారిలో హయగ్రీవాచారి గారు, చంద్రమౌళీశ్వరరావు గారు, అనంతాచార్య దేవర్జీ అనే హిందీ అధ్యాపకులు మరికొంతమంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ విభాగం ప్రచురించిన గాంధీ జీవిత చరిత్రలో వరంగల్లులోని ఈ సన్నివేశం ఛాయాచిత్రం ముద్రితమైంది. నేను ఆయన్ను దర్శనం చేసుకోలేకపోయినాను కానీ, ఆయన భావముద్ర నా జీవితంలో, సాహిత్యంలో నాటినుంచి ప్రముఖంగానే నిలిచి ఉన్నది. తర్వాత కాలంలో భారతదేశం స్వతంత్రమైన సందర్భంలో ఆగస్టు 1947లో.. తొలి పదిరోజుల్లో.. జాతీయ పతాకం ఎగురవేస్తామని స్థానిక జాతీయవాదులు ప్రయత్నించగా రజాకార్లు దాన్ని వ్యతిరేకించి పతాకం ఎగురవేయబూనిన బత్తిన మొగిలయ్య అనే దేశభక్తుణ్ణి హత్యచేశారు. ఆ రోజే ప్రజలకు వైద్యసేవ చేయడంలో మంచి పేరుగల డాక్టర్‌ నారాయణరెడ్డిని కూడా హత్యచేశారు. మొత్తంమీద ఈ హత్యలు ప్రజల్లో ఎక్కువమందిని భయభ్రాంతులను చేశాయి. దూరప్రాంతాలకు వలసపోయేటట్లు చేశాయి. ఆ మొగిలయ్య పేరుమీద ఈ రోజు నగరంలోని జయప్రకాశ్‌నారాయణ వీధిలో ఒక స్మారక సంస్థ, భవనం ఏర్పడి ఉన్నది.

1948లో మేము తిరిగి పాఠశాలలోకి చేరాం. 1947-48లో పరీక్ష రాయకపోయినా మేము చేరగానే ఒక సంవత్సరం ప్రమోషన్‌ ఇచ్చి మా పాఠశాల వారు ఆరో తరగతిలో చేర్చుకున్నారు. అంతకుపూర్వం నిజాం పాలనలోని విద్యావ్యవస్థలో అయిదో తరగతి నుండి అన్ని సబ్జెక్టులు ఉర్దూలోనే బోధించవలసి ఉండేది. కానీ, ఆంధ్ర విద్యాభివర్ధిని పాఠశాల మాత్రం తెలుగులోనే అన్ని విషయాలూ బోధించే ప్రణాళికను అమలుచేసింది. అప్పుడు తెలుగులో అన్ని విషయాలు బోధించే అధ్యాపకులు ఈ  ప్రాంతంలో లేరు. అందువల్ల బెజవాడ ప్రాంతం నుంచి సుమారు 20 మంది అధ్యాపకులు మా సంస్థలో నూతన తెలుగులో విద్యాబోధన చేయడానికి ఆహ్వానించబడ్డారు. వారిలో శ్రీ కారుమంచి కొండలరావు గొప్ప గణితశాస్త్ర అధ్యాపకులు. ఆయన బోధించినప్పుడు ఎంతటి మంద విద్యార్థికైనా విషయం కరతలామలకం అయ్యేది. అంతకుముందే పాఠశాలలో హరిరాధాకృష్ణమూర్తిగారు అధ్యాపకులుగా చేరియున్నారు. ఆయన పద్యం చదివే పద్ధతి విశిష్టంగా ఉండేది. ఆయన అన్ని పద్యాలను కానడ రాగంలో చదివేవారు. అందరికీ అది ఆకర్షకంగా ఉండేది. అప్పట్లోనే ప్రభుత్వ ఉద్యోగం పొంది పదవీ విరమణ పొందిన దూపాటి వెంకటరమణాచార్యులు పాఠశాలలో అధ్యాపకులుగా చేరారు. రమణాచార్యులవారు శతావధాని. తాళపత్ర సేకరణలో.. శాసనాలను సేకరించడంలో  గొప్ప కృషిచేసినవారు. 1920 ప్రాంతాల్లో జయంతి రామయ్య పంతులుగారి ఆదేశంతో తెలంగాణలో శాసనాలను.. తాళపత్ర గ్రంథాలను సేకరించడానికి వచ్చిన వారు తమ జీవితమంతా పరిశోధనకు.. తెలంగాణలో సాహిత్య పునరుజ్జీవనానికి కృషిచేశారు. పోతన జన్మస్థాన నిర్ణయం వంటి ముఖ్యమైన వివాద విషయాలలో ఆయన కృషి ఎంత బలంగా ఉన్నదంటే పోతన జన్మస్థానం బమ్మెరయే అన్న నిర్ణయానికి తెలుగులోకం చేరుకున్నది. తెలంగాణ సాహిత్య సంస్కృతుల మేలుకొలుపులో కొమర్రాజు లక్ష్మణరావు, సురవరం ప్రతాపరెడ్డి మొదలైన వారి కృషి ఎంతదో.. రమణాచార్యుల వారి కృషికూడా అంతే. ఆయన కృషి గ్రంథాలయోద్యమంలో కూడా బలమైందే. గోలకొండ కవులసంచిక నిర్మాణంలోనూ ఆయన గొప్ప సహాయం చేశారు. ఆయన వారి అన్నగారు శేషాచార్యులవారు కలిసి శేషాద్రి రమణ కవులుగా ప్రసిద్ధులు. వావిళ్లవారికి గ్రంథ పరిష్కరణలో ఎంతో తోడ్పడటమే కాకుండా పాండిత్య పూర్ణములైన పీఠికలను సమకూర్చారు. ఆ రోజుల్లో పాఠశాలలో ఆయనను రమణకవిగానే వ్యవహరించేవారు. అప్పటికే ఎనిమిదో తరగతిలో చదువుతున్న మృత్యుంజయం అనే ముదిగొండ వారి అబ్బాయి ఆయన మార్గదర్శనంలో పద్యాలు రాస్తుండేవాడు. ఆయన పాఠం చెప్తే ఒక కారుణ్యభావం సాక్షాత్కరించేది. ఆయన గొంతులోనూ.. ఒక గాద్గద్యం వినబడేది. అప్పట్లో మా మాతామహులు ఠంయ్యాల లక్ష్మీనరసింహాచార్యులు తమ వేల్పుగొండక్షేత్ర మాహాత్మ్యాన్ని, లక్ష్మీపుర రంగనాథ క్షేత్ర మాహాత్మ్యాన్ని మధ్యాహ్న విరామ సమయంలో వినిపించి కొన్ని కొన్ని సవరణలు చేసుకొనేవారు. లక్ష్మీపుర రంగనాథ క్షేత్ర మాహాత్మ్యంలో కాకతీయుల చరిత్ర ఉన్నది. దీనికి సంబంధించిన పరిష్కారంలో దూపాటివారి తోడ్పాటు ఎంతో ముఖ్యమైనది.

అప్పుడు వచ్చిన అధ్యాపకులలో అగ్రగణ్యులు యద్ధనపూడి కోదండరామశాస్త్రి (వైకే శాస్త్రి)గారు. ఆయన అంతకుముందు దివ్యజ్ఞాన సమాజ (థియొసాఫికల్‌ సొసైటీ) సంపర్కంలో ఉండి వచ్చినవారు. నెల్లూరు నివాసి. నెల్లూరులో జరిగే తిక్కన జయంతి ఉత్సవాలను చూచి ప్రేరణ పొందినవారు. అంతకుముందు ప్రధానాధ్యాపకులుగా ఉన్న వైద్యనాథ అయ్యర్‌, బాజారు హనుమంతరావు పాఠశాల విధులకే పరిమితమై ఉండేవారు. వైకే శాస్త్రి గారు తెలుగు సాహిత్య ఉద్యమాలతోనూ, జాతీయ పునరుజ్జీవన ఉద్యమాలతోనూ, దివ్యజ్ఞాన సమాజ ఉద్యమంతోనూ గాఢమైన సంబంధం కలవారు. తెలుగు సాహిత్యంలో ఉన్నత విద్య పొందినవారు. విస్తృతమైన విశ్వజనీన దర్శనం కలవారు. ఒకనాడు అక్టోబర్‌ ఒకటోతేదీనాడు ప్రార్థన సమావేశంలో రేపు గాంధీ జయంతి.. కానీ ఈరోజు మేడం అనిబిసెంట్‌ జయంతి అని చెప్పి.. మమ్మల్ని విస్మయపరిచారు. పాఠశాలలో అనేక విషయాలపైన విద్వాంసులచేత విస్తరణోపన్యాసాలు ఉండేవి. సిలబస్‌ దాటి విస్తృతమైన ప్రపంచాన్ని చూసే అవకాశం మాకు కలిగింది. నెల్లూరులోవలె వరంగల్లులో పోతన జయంతి ఉత్సవాలు జరుపడం ప్రారంభించింది శాస్త్రిగారే. దీన్లో వ్యాసరచన వక్తృత్వ పోటీలే కాక, భాగవత గ్రంథ పఠనం అనే ఒక ప్రముఖమైన అంశం ఉండేది. క్రమంగా ఈ పోటీలు పాఠశాల పరిమితి దాటి చుట్టుపట్ల పాఠశాలల్లో వారు కూడా పాల్గొనేట్లు జరిగాయి. ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాల్లో తెలుగు సాహిత్యంలో ప్రముఖులైన విద్వాంసులు వచ్చి ప్రసంగించేవారు. వరంగల్లు నగరంలో విద్యార్థుల స్థాయిలో అపారమైన సాంస్కృతిక ముద్ర వేసింది ఈ ఉత్సవాలలోనే. అంతకుముందు గణపతి ఉత్సవాలు జరిగినా వాటి వ్యాప్తి పరిమితమైందే. శాస్త్రిగారు భాగవతంలోని నరసింహావతార గద్య చదువుతుంటే ఆ ఘట్టం సాక్షాత్కరించేది. ఆయన చదువులో సంగీతం లేకపోయినా.. దాని ప్రభావం వినేవాళ్ల మనస్సులను ఆవరించేది. పాఠశాల సంస్థాపకులు చందాకాంతయ్య గారే అయినా బయట వైకే శాస్త్రిగారి బడి అని పేరు చెలామణిలో ఉండేది. ఆ ఉత్సవాలలో సరిపల్లి విశ్వనాథశాస్త్రి, దివాకర్ల వెంకటావధాని, చలమచర్ల రంగాచార్యులు, జొన్నలగడ్డ సత్యనారాయణ, జటావల్లభుల పురుషోత్తం, శివశంకరస్వామి, విశ్వనాథ సత్యనారాయణ మొదలుకాగల అనేకమంది తెలుగు సరస్వతీ సమర్చకుల ప్రవచనాలను వినే అవకాశం మాకు లభించింది. శాస్త్రిగారికి తోడుగా సాంస్కృతిక చైతన్య పరివ్యాప్తికి తోడ్పడినవారిలో ముఖ్యులు దెందుకూరి సోమేశ్వరరావు. ఆయన ఆంగ్లోపాధ్యాయుడే అయినా చరిత్ర, సంస్కృతి, తత్త్వశాస్త్రం, శిల్పము మొదలైన అంశాలు లోలోతుల వరకు పరిశీలించి పాఠశాలలోనే కాక విహార యాత్రల సందర్భంలోనూ మమ్మల్ని విజ్ఞానవంతులను చేసేవారు. ఆయనతో కలిసి విహారయాత్రలు చేయడంవల్ల ఆయనతో కలిమిడి మాకు ఎక్కువగా ఉండేది. రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, రమణులు, అరవిందులు, రవీంద్రుడు, గాంధీజీ మొదలైన వారిని గూర్చి ఆయన నోటనే ఎక్కువగా విన్నాను. పుస్తకాలు సేకరించటం, నిర్భయంగా మాట్లాడటం ఆయన వల్ల నేర్చుకున్న విద్యలే.

నేను 1950-52 సంవత్సరంలో తొమ్మిదో తరగతిలోకి వచ్చాను. ఆ సంవత్సరం ప్రారంభంలో (జూన్‌లో) ఊళ్లో సారస్వత పరిషత్‌ వరంగల్‌ శాఖ వార్షికోత్సవం జరిగింది. ఆ ఉత్సవాలలో పాల్గొనడానికి వచ్చిన వాళ్లల్లో విశ్వనాథ ప్రముఖులు. మూడు రోజులు ఈ సమావేశాలు జరిగినట్లు జ్ఞాపకం. వాటిల్లో ఒకరోజు కవిసమ్మేళనం వెయ్యిస్తంభాల గుళ్లో జరిగింది. దాశరథి తన ‘శిల్పి’ పద్యాలను ఆ సభలో చదివారు. దాన్లోనే ఓరుగల్లు నంది అని అంతకుముందే భారతిలో అచ్చయిన పద్యాలను ఒక వ్యక్తి మేఘ గంభీర స్వరంతో చదివారు. ఆ స్థలంలోనే కొన్ని అడుగుల దూరంలోనే ఆ నంది ఉన్నది. ఆ చదివిన వ్యక్తి విశ్వనాథ వారి తమ్ముడు విశ్వనాథ వేంకటేశ్వర్లు. వారిద్దరూ ఒకే పోలిక కలిగి ఉన్నారు. ఆ పద్యాలలో గత వైభవ స్మరణం ఒక ఉద్వేగం.. బానిసతనం వల్ల పొందిన వేదన స్పష్టంగగా వ్యక్తమైంది. తెల్లవారో మర్నాడో.. మా స్కూల్లో కారిడార్లో విద్యార్థుల కోసం విశ్వనాథవారి సభ జరిగింది. ఆ ప్రసంగంలో పిల్లలకు అర్థమయ్యే పద్యాలను ఉదహరిస్తూ ఆయన సరళంగా ప్రసంగించారు. ఆ సభలో విశ్వనాథ వేంకటేశ్వర్లు కూడా పాల్గొన్నారు. మా స్కూలు మేనేజిమెంట్‌ వారు ఆయన్ను అధ్యాపకుడుగా నియమించినట్టు, ఆయన మాకు టీచర్‌గా రాబోతున్నట్టు తెల్లవారి క్లాస్‌రూంలో చూసినప్పుడే అర్థమైంది. అప్పట్నుంచి ఆయన పాఠశాల తరగతి రోజుల్లోనే కాక వ్యక్తిగతంగా కూడా నాకు సాహిత్యగురువైనారు. ఆయన పద్యం ప్రౌఢోక్తి బంధురం. భావనలో నిత్యము ఆయన ప్రాచీనాంధ్ర సాహిత్యంతోనే ఆశ్ర సంప్రదాయంతో సంబంధం ఉన్నవారు. స్వయంగా చెళ్లపిళ్లవారి శిష్యులే. ఆ తరగతిలో ఆయన పాఠాలు చెప్పి తెలుగు సాహిత్య రీతులతో, భిన్న శైలులతో,  పద్య విద్యతో నాకు అనుసంధానం కలిగించారు. చనువు పెరిగిన కొద్దీ.. నేను అప్పటికే రాసి ఉన్న పద్యాల నోట్‌బుక్‌ తీసుకొని ఒక సెలవు రోజున మట్టెవాడలోని ఆయన నివాసానికి వెళ్లాను. చెళ్లపిళ్లవారు 1950 శివరాత్రి నాడు పరమపదించగా.. నేను ఆ స్మృతితో రాసిన పద్యాలు కూడా వాటిల్లో ఉన్నవి. తర్వాత స్కూల్లో జరిగే కవిసమ్మేళనాల్లో పాఠశాలల్లో జరిగే పోతన ఉత్సవాల్లో ఆయన కవితా విశ్వరూపం దర్శనమిచ్చేది. ఆయన గుణాన్ని గుణంగా.. దోషాన్ని దోషంగా నిరూపించి చెప్పేవారు. నన్నయాదులమీద ఎంతో గౌరవముండేది. ఆధునిక కవుల మీద కూడా తన అన్నగారి తర్వాతనే ఎవరిమీదనైనా ఆసక్తి కనబర్చేవారు. పెద్దగా ఎవరికీ తెలియని ఒక పార్శ్వం ఆయనలో ఉన్నది.. దేవీ ఉపాసన. శ్రీవిద్యా పట్టాభిషక్తుడు. ఆయన అంతకు పూర్వం రాసిన వచన రచనలు.. ప్రచురణకర్తలు పాఠ్యగ్రంథంగా నియమింపజేసుకోవడానికి అనువుగా ఉండేవి. ఒకసారి ఆయన తాను రచించిన దక్షిణేశ్వర ముని అనే రామకృష్ణ పరమహంస చరిత్రకు సంబంధించిన పుస్తకం తన రచనల కట్టల్లోంచి తీసి ఇచ్చి చదువమన్నారు. శ్రీరామకృష్ణుల పరిచయం నాకు ఆ గ్రంథంతోనే లభించింది. నా సంప్రదాయ మార్గానికి భిన్నంగా ఆ రచనలో శ్రీరామకృష్ణుల సాధన విశేషాలు తెలియజేసినప్పుడు షట్చక్ర విద్యసాధనలు మొదలైనవి చదివినప్పుడు నేను ఒక రకంగా నూతన సాధన ప్రపంచంలోకి ప్రవేశించాను. అది పరోక్షమైన ఉపదేశం కావచ్చు. కానీ ఆ సంప్రదాయం నాటి నుంచి నన్ను విడిచిపెట్టకుండా నాతో కదలి వస్తున్నది. అయితే నేను దీక్షితుణ్ణి కాదు. వేంకటేశ్వర్లుగారితో సంభాషించే సమయంలో భారత భాగవతాల్లోని ఉపాఖ్యానాలను ఆయన వివరించి చెప్పి కవిత్వ శిల్పమును గూర్చిన పరిచయం కలిగించారు. నాకు జీవితంలో చెరగని ముద్రవేసింది, ఆయన వ్యాఖ్యానించిన శ్రీకాళహస్తి మాహాత్మ్యంలోని నత్కీరుని కథ. గుణదోషాలు వివేచించేప్పుడు రచయిత వ్యక్తిత్వాన్ని, పట్టించుకోకుండా నిర్భయంగా నిష్పాక్షికంగా నిర్ణయంచేయాలని ఆ సందర్భంలో ఆయన ఉపదేశించారు. ఆ రోజుల్లోనే నేను రాస్తున్న పద్యాలను గమనించి ‘సమకాలికులైన వ్యక్తులను గూర్చి ఎప్పుడూ పద్యాలు రాయకు’ అని చెప్పారు. అందువల్ల వివాహాలకు, షష్టిపూర్తులకు ఇలాంటి సందర్భాలలో పద్యాలు రాసే పరిస్థితి నా నుంచి తప్పిపోయింది. నవరత్నాలు, పంచరత్నాలు మొదలైనవి ఒకటిరెండుచోట్ల తప్ప నేను రాయలేదు. ఈ ఉపదేశం నా కవిత్వ మార్గాన్ని లౌకిక పరిమితులలోనికి జారకుండా కాపాడింది. నత్కీరుడి కథ నిర్భయత్వాన్ని చెప్తే.. లౌక్యాన్ని, ప్రలోభాన్ని రాకుండా ఈ మాట కాపాడింది. అదేకాలంలో నేను నా పినతండ్రి శ్రీ సంపత్కుమారాచార్య గారు కవితాభ్యాసం చేస్తున్న రోజులవి. ‘మా స్వామి’ని అనుకరిస్తూ సర్వేశ్వర అన్న మకుటంతో ఒక శతకం రాశాము. దాన్ని వెంకటేశ్వర్లుగారు విజయవాడకు తీసుకెళ్లి అన్నగారిచేత మంచి పీఠిక వ్రాయించి తెచ్చారు. ఆ గ్రంథంపేరు హృద్గీత.. పీఠిక పేరు స్వరకల్పన. ఆ పీఠిక ఉండటం వలన అఖిలాంధ్ర దేశంలోనూ మాకు తొలి గుర్తింపు లభించింది. 1956లో విశ్వనాథవారు వెంకటేశ్వర్లుగారి అమ్మాయి పెళ్లికోసం వరంగల్లు వచ్చి రెండుమూడు రోజులు ఉన్నారు. ఆ విషయం తెలిసి గబగబా తొందరగా కొన్ని పద్యాలు ఉన్నవి.. కొన్ని పద్యాలు కొత్తగా చేర్చినవి కలుపుకొని ఆనంద లహరి అన్న కావ్యం.. శబరి ఆత్మార్పణం ఇతివృత్తంగా సమకూర్చి విశ్వనాథ సత్యనారాయణగారికి అంకితమిస్తామని చెప్పితే.. ఎంతో దయతో అంగీకరించారు.  ఆ పద్యాలు వినిపించినప్పుడు ఆయన ఎంతో తృప్తిపడి ‘వీరు నా కవితా సంతానము’ అని ప్రశంసించారు. ఆనందలహరిలోని తొలి పద్యం నాలుగవ పాదంలో ‘ఈ యెదపాదులోన కుసుమించిన మించుల లేత తీవియా’ అన్న సంబోధన ఉన్నది. ఆ పద్యం చదువుతున్నప్పుడు విశ్వనాథవారు ‘వృత్తంలో మొదటి అక్షరం తర్వాత విరిచి ప్రాసాక్షరం దగ్గర ప్రారంభించి రచన చేయడం నా శిల్పమార్గం. దాన్ని వీళ్లు చక్కగా నిర్వహించారు’ అన్నారు.

కల్పవృక్ష అవతారికలో విశ్వనాథ రాసిన ‘పండిత కీర్తనీయుడు’ అనే పద్యం వెంకటేశ్వర్లు గారి గురించి రాసిందే. తన కవిత్వాన్ని శంకున పోసిన తీర్థంలాగా చేసేవాడని దానిలో ఆయన ప్రశంసించాడు. విశ్వనాథ వెంకటేశ్వర్లు గారు గొప్ప లేఖకుడు కూడా. విశ్వనాథవారి వేగాన్ని తట్టుకొని చాలాభాగం ఆయన చెప్తుంటే రాసి 28 రోజుల్లో వెయ్యి పడగలు పూర్తిచేసినవారు. ఆయన నిష్ఠగా కూర్చోలేదేమో కానీ, వరంగల్‌లో ఉన్న రోజుల్లో కొంత కావ్యరచనచేశారు. ఒకసారి వేసవికాలపు సెలవుల తర్వాత వరంగల్‌ చేరుకొన్నప్పుడు రోజూ 30, 40 పద్యాల చొప్పున వ్రాసి పూర్తిచేసిన కావ్యమది. తుకారాం చరిత్ర కావ్యాన్ని చూపించారు. అది ప్రచురణకు నోచుకోలేదు. అది ఏమైందో తెలియదు. తర్వాత శ్రీవిద్యా అంతర్గర్భితంగా కాళిందీ పరిణయము మొదలుగా రెండుమూడు కావ్యాలు రాశారు. వీటిలో కాళిందీశ్రీకృష్ణుల పరిణయాన్ని ప్రతీకాత్మకంగా అద్భుతమైన పద్యరచనతో శ్రీవిద్యాతత్వ ప్రదర్శకంగా నిర్మించారు. శ్రీనోరి నరసింహశాస్త్రి గారు 60 ఏండ్ల తెలుగు సాహిత్యంలో నిలిచేవి అన్న వ్యాసంలో నిలిచే కావ్యాలలో ఉత్తమమైనదిగా కాళిందీ పరిణయాన్ని ఏర్కొన్నారు. ఆ రోజుల్లో ఆయన రాసిన పద్యాలు జయంతి పత్రికలో అచ్చయ్యేవి. పోతన విదేహముక్తి పొందినప్పుడు కైవల్య స్థితిలో వివిధ దేవతలు ప్రశంసించిన ఘట్టాలు అచ్చెరువు గొలిపేట్లుగా రచించారు. 1962 ప్రాంతాల్లో పదవీవిరమణ పొంది విజయవాడకు వెళ్లి జీవిక కోసం రస తరంగిణి ప్రెస్‌లో ప్రూఫ్‌రీడర్‌గా చేరుకొన్నారు. ఎంత గొప్ప ప్రతిభావంతుడైనా ఆయనను దారిద్య్రం విడిచిపెట్టలేదు. అయినా.. ఆయన ఎవరికీ తలవంచలేదు. 1982లో సంపూర్ణ సూర్య గ్రహణం నాడు జపం చేసుకొని శరీరాన్ని విడిచిపెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here