సంబంధాలు

1
10

[box type=’note’ fontsize=’16’] కన్నడంలో మాలతి ముదకవి రచించిన ‘సంబంధగళు’ అనే కథని అనువదించి తెలుగులో అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు. [/box]

[dropcap]“నీ[/dropcap]రజా… నీవిలాంటి ప్రకటనను ఇచ్చే ముందు ఇంటివాళ్లతోటి ఓ సారి సంప్రదించాల్సి ఉండాలి. చూడిప్పుడు నీ కారణంగా మాకు తలవంపులయ్యింది అందరి ఎదుట. అంతెందుకు… మన దూరపు బంధువులందరూ ఇదే విషయాన్ని మాట్లాడుకుంటున్నారు. మా వియ్యంకులవారు ఫోన్ చేసి ‘ఏంటండి ఇది, ఈ పేపర్లో ప్రకటన… ఫేస్‌బుక్ లోనూ ఇదే సమాచారం’ అని. కొందరైతే అవహేళన పూర్వకంగా నవ్వేశారు… ‘ఈ వయసులో వీరికి ఇది అవసరమా… అని అడిగారు కొందరు… ‘, ‘నీరజాక్షి దేశ్‌పాండే అంటే మీ సిస్టరే కదా అండీ’ అని.”

తలుపులు తీయగానే, ధటాలున నన్ను తోసుకుంటూనే వచ్చిన మా అన్నయ్య నన్ను నిగ్గదీసి అడిగాడు. ఫోన్ కూడా చేయకుండా నా ఇంటికి వాడెందుకొచ్చారో నాకు తెల్సిపోయింది. నా కోపం నెత్తికెక్కింది. నాకు ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఏనాడూ, ఉన్నావా, చచ్చావా అని విచారించని ఈ మర్యాదరామన్న ఇప్పుడొచ్చాడు.

“అన్నయ్యా! అలా అడిగిన వాళ్లకి – అవును ఆమె నా చెల్లెలే – నిజం. అయితే అంత చెప్పకోదగిన సంబంధమేమీ మా మధ్య లేదు. వివాహాలో, ఉపనయనాలో అయినపుడు మాత్రం ఆహ్వానం పంపించి వుంటాము. వస్తుంది. గిఫ్ట్ ఏదో ఇచ్చి, అక్షింతలు వేసి భోంచేసి వెళుతుంది. అంతే, అని చెప్పి వుంటే బావుండేది కదా” అని నవ్వుతూ సమాధాన మిచ్చా.

ఔను. మా ఇద్దరి మధ్యా మిగిలింది అంత మాత్రపు సంబంధమే. వీడి కొడుకు పెళ్లప్పుడు చూశా వీడి వియ్యంకుడి ముఖాన్ని. ఆయన కేల నా బాగోగుల గుఱించిన ఆరాటం అని కొంచం కోపమే వచ్చింది నాకు. నా ఒక్క ఈ ప్రకటనే వీళ్లందరి మనసుల్లో ఇంతటి పరిణామాన్ని సృష్టించిందే. ఇక నే పెళ్లే చేసుకుంటే? ఛీ.. పాడు స్వార్థపరులు…

ఆ పాత రోజుల నన్నింటినీ మరచి పోయాడా వీడు. నాన్నగారిది చెప్పుకోదగ్గ ఉద్యోగమేమీ కాదు. నాన్నగారి విధవతల్లి మా తోటే వుండేది. చిన్నా చితకా మనస్తాపాలు లేకపోలేదు. పేదరికమే అయినా నెమ్మదిగానే ఉండేవాళ్లం. మా అమ్మ, నాన్నలకి మేము ఏడుగురం సంతానం. అన్నయ్యే అందరికంటే పెద్దవాడు. ఇంజనీరింగ్ చదవాలనే ఆశ అన్నయ్యది. దానికి తగ్గట్టుగానే మంచి తెలివితేటలుండేవి. అయితే వాణ్ణి పరాయి ఊళ్లో వుంచి, ఫీజు కట్టి చదివించే స్తోమతే నాన్నగారికి లేదు. ఆ విషయాన్ని అన్నయ్యకూ విశదీకరించి, ఏదైనా ఓ చిన్న ఉద్యోగంలో చేరి సంసార భారాన్ని మోయమన్నాడు నాన్న. అయితే తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లనే మనస్తత్వం వాడిది. ఆప్లికేషన్ వేశాడు. సీటూ వచ్చింది. ఆ ధైర్యంతోటే, సిటీకెళ్లి, ఎవర్నో ఆశ్రయించి అడ్మిషన్‌కి డబ్బు సంపాదించాడు. భోజనానికి వారం ఇళ్లని వెదుక్కున్నాడు. ఈ మధ్యకాలంలో నాన్నగారికి గొంతు కాన్సర్ – ఇంటి పరిస్థితిని ఎరిగిన నాన్నగారు ఎవరికీ సూచనకూడా ఇవ్వకుండా దిగమింగుకొని ఫోర్త్ స్టేజీలో నోరు విప్పారు. అప్పటికే శృతి మించిపోయింది.

ఎనిమిది రోజులు ఆస్పత్రివాసం – అంతే… వెళ్లిపోయారు. ఆయన చనిపోయిన ఓ ఏడాదికే నాకు పద్దెనిమిదేళ్లు నిండాయి. దానికోసమే కాచుకొన్నట్లు టెలిఫోన్ ఆపరేటర్ ఉద్యోగానికి అప్లికేషన్ వేసి వున్నా. నా యస్.ఎస్.సి. మార్కుల ఆధారంగా నాకు ఉద్యోగమూ దొరికింది. ఇంట్లోని సమస్యలకి కొంతగా పరిష్కారం దొరకినట్టయ్యింది. అన్నయ్య కాలేజి ఫీజుకని, పుస్తకాలకని డబ్బు సహాయం చేసేదాన్ని. వాడి చదువూ మగిసి ఓ మంచి ఉద్యోగమూ దొరికింది. ఓ రోజు అమ్మ, అన్నయ్యతో “ఓరే గురూ – నీరజకొక మంచి సంబంధం చూడరా. ఇన్ని రోజులూ అది మన సంసారానికే తన జీవనాన్ని ముడుపు పెడుతూ వుంది. ఇంకొన్నేళ్లు దాటితే – ఇప్పటికే ఇరవై ఎనిమిది నిండింది, దానికి వరుడు దొరకటం కష్టమవుతంది” అని అన్నప్పుడు, అమ్మ మాటకి ఊఁ గొట్టిన వాడు, రెండేళ్లు దాటగానే పల్లవి అనే అమ్మాయిని తీసుకొచ్చి “అమ్మా, ఈ అమ్మాయి పల్లవి. మా ఆఫీసులోనే పని చేస్తూవుంది. మంచి పిల్ల అమ్మా. నాన్న లేడు. అమ్మతోటే వుంది. మే మిద్దరం ఒకళ్లనొకళ్లం ఇష్టపడ్డాము. ఇంకో మాట…” అంటూండగానే అమ్మ కోపానికి హద్దులు లేకుండా పోయింది. అయితే వాడి మాట ఇంకా పూర్తి కాలేదు. మింగలేక, కక్కలేక, “అమ్మా, ఇప్పుడు పల్లవి నెల తప్పింది. ఆ రోజే పల్లవి తన ప్రాణాలను తీసుకునేందుకు ప్రయత్నించింది. నేనే… దాన్ని ఆపాను.”

పల్లవి బిక్కు బిక్కుమని ఏడుస్తూ అమ్మ కాళ్లని గట్టిగా వాటేసుకుంది. ఇక అమ్మ ఏం చేయగలదు. అన్నయ్య మారు రూపం ఆమెలో పెరుగుతున్న కారణంగా వాళ్ల పెళ్లికి ఒప్పేసుకుంది అమ్మ. ఇలా జరిగిపోయింది అన్నయ్య పెళ్లి. పురుడు పోసుకోడానికని వెళ్లి తిరిగి వచ్చిన పల్లవి, మా పేదరికంతోటి పొందుకోలేక వేరే ఇల్లు చూసింది. పిల్లవాణ్ణి చూసుకోవటానకని వాళ్లమ్మని పిలిపించుకొంది. ఇలా, మా నుంచి దూరమై పోయాడు అన్నయ్య. ఈ సంసారపు కాడిని నేనే మోయాల్సి వచ్చంది. నా తర్వాతి చెల్లెలు శారద. దాన్ని బి.కాం చదివించా. దానికీ బ్యాంక్‌లో వుద్యోగం చిక్కింది. దానికీ ఎన్నో ఆదర్శాలు. “అక్కా, నీవు నిశ్చింతగా పెళ్లి చేసుకోవే. నేనున్నానుగా ఇప్పుడు వీళ్లందరి బాధ్యత నాది” అంది. అమ్మకు ఎక్కళ్లేని సంతోషం. నాకు ఓ రెండు మూడు సంబంధాలు వచ్చాయి. అవి సెకెండ్ మ్యారేజ్ బాపతు. ఇంకొన్ని పనీ పాటాలేని సోమరిపోతు దండుగరాయళ్లు. ఇంకొందరు తాము మగరాయళ్లమనే ఒకే ఒక అర్హత తోటి – తనకు పెళ్లి చేసుకొని, వాళ్ల అమ్మానాన్నలని, తమ్ముళ్లనీ పోషించాలనే షరతు విధించిన వాళ్లు. పెళ్లి విషయంలో ఈ వ్యాపారమెందుకో నాకు నచ్చలేదు. శారదకు పెళ్లి ప్రయత్నాలు చేద్దామని నే అనగానే, సంతోషించిన చెల్లెలు శారద తన వరుణ్ణి తానే ఎంపిక చేసుకుని అతి తక్కువతో పెళ్లి చేసుకుంది. అయితే వరుడు వేరే జాతివాడు. బంధువుల మందు తలవొంపులు తెచ్చిందే అని అమ్మ అరచి గీపెట్టింది. అమ్మను ఎలాగో సమాధాన పరిచాను.

ఇక, రాజు, దీపా, శ్రీను, సవిత… వీళ్లది ఇంకా పిన్న వయస్సు. అందులోనూ సవిత కొంచం మందబుద్ధిది. చదువులోనూ వెనకే. రాజు డిగ్రీ పూర్తి చేశాడు కాని రెండేళ్లయినా ఉద్యోగం దొరకకపోయేటప్పటికి వాడిలో న్యూనతా భావం చోటు చేసుంది. ఎవ్వరితోనూ మాట్లాడక ఒంటరిగా ఉండిపోయాడు. ఈలోగా అమ్మ మమ్మల్నందరినీ విడిచి వెళ్లిపోయింది. రాజుకు ఇప్పుడు నేనే తల్లినయ్యాను. వీడి కోసం ఏదైనా చేయాలి. లేకపోతే వీడూ చేయి దాటిపోతాడనే భయం. ఉద్యోగాల కోసం ప్రయత్నించకుండా స్వతంత్ర జీవనం చేయడానికని వాడికి ఆటో కొనిస్తానని వాడికి చెప్పినప్పుడు వాడు సంతోషించాడు. ఓ పదివేలు అడ్వాన్సుగా చెల్లించి ఓ ఆటోని వాడి కప్పగించా. వాడు కంతలవారీ ఆటో లోన్‌ని తీర్చేశాడు. వాడి పెళ్ళి కూడా జరిపించా. “అక్కా నీ పెళ్లి కాకుండా నేనూ పెళ్లి చేసుకోను” అని వాడనప్పుడు వాణ్ణి సమాధానపరచి వేరే కాపురం కూడా పెట్టించా. రాజు భార్య అన్నగారితో దీప వివాహాన్ని జరిపించా. ఇక శ్రీను… వాడు మొదట్నుంచీ మృదుస్వభావి. మితభాషి. ఒకనాడు కాలేజీకని వెళ్లనవాడు తిరిగి రాలేలేదు. వాడు వ్రాసి పెట్టిన ఓ ఉత్తరం – అందులో “అక్కయ్యా, నన్ను వెదకే ప్రయత్నం చేయవద్దు. మహా సన్యాసి అయిన శ్రీ శ్రీధర్ మహరాజ్ తోటి వెళుతున్నా. నా ఉద్దేశం తీరిన తర్వాత రాగలను”… ఇంట్లోని డబ్బు, ఇతర వస్తువుల నేవీ తీసుక పోలేదు. తాను ఇలా వెళ్లిపోనున్న విషయాన్ని నాకు ముందే తెలియజేసి వుంటే – అంతో ఇంతో ఇచ్చి వాణ్ణి పంపేదాన్ని కదా. అయితే, ఏనాడైనా వాడు తప్పక తిరిగి వస్తాడనే నా నమ్మకం. వాడలా ఇల్లు విడిచి పోయినందుకు ఏవేవో కారణాల నూహించారు. అయితే కొంత కాలమయిన తర్వాత వాడి నుంచి ఓ ఉత్తరం “అక్కయ్యా! నేనెన్నడైనా ఇంటికి తిరిగి రాగలనే ఉద్దేశం వుండేది. ఇపుడు నా జీవిత లక్ష్యం ఏమిటనేది నాకు తెల్సింది. నేను నిన్ననే నా పిండ ప్రదానాన్ని చేసుకున్నా. ఇపుడు నేను శ్రీనుని కాను. ప్రమోదానందస్వామిని”. ఇది సారాంశం. జీవిత గమనం, ఎవరికి ఎప్పుడు ఎలా మారుతుందో! ఉబికి వస్తున్న దఃఖాన్ని దిగమింగుకొని, ఈ విషయాన్ని వాళ్లందరికీ తెలియజేశా. దీని పరిణామం ఎవరెవరి మీద ఎలా వుంటుందో నేనెలా ఊహించను!

అందరూ తమ తమ సంసారాల్లో మునిగి పోయారు. ఇప్పుడు నేనూ, మందమతి అయిన చెల్లెలు సవితా, ఇద్దరమే ఇంట్లో. అది మందమతి అయినా, అన్ని పనులనీ అత్యంత నాజూకుగా చేస్తుంది. ఇలా పని చేసేది కాబట్టే, అన్నయ్య పల్లవి దాన్ని ఎన్నో సార్లు తమ వద్ద వచ్చి ఉండిపొమ్మన్నారు. “నీ తదనంతరం దీన్ని చూచుకునే వాళ్లెవరు? చదువూ లేదు. అందరిళ్లల్లోనూ పని చేసి తన జీవనాన్ని గడపాల్సి వుంటుంది” అని అన్నయ్య ఒకటి రెండు సార్లు వ్యంగ్యంగా మాట్లాడాడు. ఎవరు ఎన్ని చెప్పినా సవిత నన్ను విడచి అర క్షణం కూడా వుండదు. దాని అదృష్టమేమో, దాని పెళ్లి యోగమూ కలిసి వచ్చింది. రామాశాస్త్రుల వారి కొడుకు. వాళ్ల నాన్న లాగే పౌరోహిత్యమే నమ్ముకోవటం వల్ల వాడికి పిల్లనివ్వటానికి ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు రామశాస్త్రుల వారు నాతోటి ఈ ప్రస్తావన తేవగానే పరమానందమయ్యింది నాకు. తిండి, బట్టకు తాపత్రయం లేదు. స్వంత ఇల్లు వుంది. అంతో ఇంతో పొలం కూడా వుంది. పెళ్లి సునాయాసంగా జరిగిపోయింది. ఇపుడు నా మనసు శాంతించి కుదుటబడింది. బాధ్యతలన్నీ ముగిశాయి.

ఇవన్నీ పూర్తి అయేసరికి నేనూ పదవీ విరమణ అంచుకు చేరుకున్నా. డబ్బుకి తాపత్రయం లేదు. స్వంత ఇల్లు ఉంది. ప్రమోషన్ మీద హయ్యర్ ఆఫీసర్ నయ్యా. ఆరంకెల్లో జీతం. ప్రత్యేకమైన ఛేంబర్. ఆఫీస్ జీపు. అయితే, పెళ్లయి సవిత వెళ్లిపోయిన నాటి నుండి ఒంటరితనం నన్ను వేధిస్తున్నది. ఆఫీసులో వున్నంత సేపూ పని ఒత్తిడి వల్ల కాలమెట్లో గడిచిపోయేది. ఇంటికి రాగానే మళ్లా అదే ఒంటరితనం. ఒంటరితనం అన్పించినపుడు శారదకు ఫోన్ చేసేదాన్ని. ఓ రెండు సార్లు మాటాడింది కాని అటు తర్వాత “నీతో మాటాడటానికి నాకు తీరిక లేదు. ఆ తర్వాత మాటాడుతానే” అంటూ ఫోన్ కట్టేసేది. ఆ తర్వాత లిఫ్ట్ చేయడమే మానేసింది. దాని తీరు నాకు కష్టమనించినా, దాని సంసారం, పిల్లలూ, కోడళ్లూ, మనుమలు… వాళ్లతోటే పని వుంటుంది అని సరిపెట్టుకున్నా. ఓ నిర్ణయానికొచ్చా. నేనయి నేనుగా ఎవరికీ ఫోన్ చేయగూడదని. అయితే ఈ నియమాన్ని సవిత యొడల పాటించలేకపోయాను. సవిత ఇప్పుడు ఓ బిడ్డకు తల్లీ అయింది. అత్తలేని ఇంటికి తానే యజమాని అయ్యింది.

రిటైర్‌మెంట్ రోజు రానే వచ్చింది. రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కూడా చేతికందాయి. చెప్పుకోదగ్గ డబ్బు బ్యాంక్‌లో. అన్నయ్య, శారదా, పల్లవి నాకు దగ్గర అవుతూ వస్తున్నారు. ఎంత డబ్బు వచ్చింది! ఏం చేస్తావు అంత డబ్బు. అని వాళ్ల ప్రశ్నలు. కొన్ని రోజులు తమ ఇళ్లల్లో కాలం గడపవచ్చు కదా అని వాళ్ల ఒత్తిళ్లు. కావాల్సినంత దేవుడు వాళ్లకిచ్చినా, వాళ్ల ఆశబోతుతనం తెల్సిన నేను రావాలనుకున్నప్పుడు వస్తాలే అంటూ తేలికగా దాట వేశాను.

నలభై ఏళ్లపాటు చాకిరీ చేసీ, చేసీ అలసిన నాకు విశ్రాంతి జీవనం మొదట్లో చాలా సంతోషాన్ని కలుగజేసింది. మా ఎదురింటి పద్మ, వయసులో నాకన్నా చిన్నదైనా ఎంతో నెమ్మదస్తురాలు. చక్కటి స్నేహితురాలయ్యింది నాకు. భర్త చనిపోవటంతో, ఆమె భర్త ఉద్యోగం ఆమెకి లభించింది. సుధీర్ ఒక్కడే కొడుకు. వాడు సెకెండ్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. వాళ్లిద్దరూ నా ఒంటరితనానికి ఆసరా అయ్యారు. ఆన్‌లైన్ వ్యవహారాలన్నీ నేర్పాడు నాకు సుధీర్. నా కంటికి పొర రావటం వల్ల డ్రైవింగ్ కష్టమయిపోయింది. ఎక్కడికైనా పోవాలన్నా వాడి సహాయాన్ని తీసుకునేదాన్ని. ఇంటి పనికి పనిమనిషి దేవకి వుంది. దగ్గరే ఉన్న లైబ్రరీ నుండి పుస్తకాలను తెచ్చుకొని చదివే అలవాటు చేసుకున్నా. అల్లాగే రచనలు చేయటానికి పూనుకున్నా, ఇలా హాయిగా కాలం గడుస్తూ పోతున్నది.

ఓ రోజు ఉన్న పళంగా ఛాతిలో నొప్పి ప్రారంభమయ్యింది. దానికి తోడు డయాబెటిస్ కూడా చేరుకుంది. కొద్దిగా ఉన్నప్పుడు ఎక్కువగా పట్టించుకోక, నొప్పి తీవ్రమైనప్పుడు, సీరియస్ అని అనిపించి, పద్మకి ఫోన్ చేశా – తల్లీ కొడుకు లిద్దరూ వచ్చి తక్షణమే హాస్పిటల్‍కి చేర్చారు. త్వరగా రావటం వల్ల ప్రమాదం తప్పిందని డాక్టర్లు స్టంట్ వేశారు. ఆ స్థితిలో నన్ను కంటికి రెప్పలా చూసుకుంది వారిద్దరే.

అన్నయ్యకూ, శారదకూ ఈ విషయాన్ని తెలియజేయాల్సిందిగా పద్మకు నే చెప్పినపుడు – ఆమె ఏదో విషయాన్ని నాకు చెప్పకుండా దాచివేయ ప్రయత్నించింది. అంతలో సుధీర్ వచ్చి “ఆంటీ! నిన్నటి రోజే వాళ్లిద్దరికీ ఫోన్ చేసి విషయం తెలిపా – వాళ్ల కేవేవో పనులున్నాయని, తీరిక చూసుకొని వస్తారున్నారు ఆంటీ” అన్నాడు.

డిస్సార్జ్ అయి ఇంటికి చేరా. ఎవరూ ఆస్పత్రికి రాలేదు, సరికదా కర్టసీ కోసమైనా నా ఆరోగ్యం గురించి ఒక్క ఫోను కూడా చేయకపోయారు. ఏదో ఓ రోజు అన్నయ్య ఫోన్ చేసి, “నా కూతురి పెళ్లి నిశ్చయమయి నందు వల్ల, బిజీ అయిపోయి రాలేకపోయాను.” వాడి సారాంశం. “నేను ఉత్తరభారత యాత్రలో వుండటం వల్ల రాలేకపోయాను.” ఇదీ శారద ఫోన్ సారాంశం.

పగలూ రాత్రి, నా సేవలో మినిగిపోయింది పనిమనిషి దేవకి ఒక్కతే. దీపా రాజులకి నా పరిస్థితిని గూర్చి తెలియబరచలేదు. సవిత ఇప్పుడు రెండో బిడ్డకి తల్లి అవుతోంది. పూర్ణ గర్భిణి – తెలియజేయలేదు.

నా భవిష్యత్ గురించి ఎంతో శ్రద్ధ వుండేవాడిలా, ఓ రోజు రాత్రి అన్నయ్య ఫోన్ చేశాడు. “నీరజా! ఇక ముందు నీ భవిష్యత్తును గురించి ఆలోచించు. వాడు ఆ పిల్లాడు – సుధీర్ అని అన్నావే, వాడే అంతా ఖర్చు చేశాడని చాలా మెచ్చుకున్నావ్ కాదా వాణ్ణి… ఎంత ఖర్చు చేశాడో… తప్పుడు లెక్కలు ఎన్ని చూపించాడో… నీవు ఆస్పత్రిలో చేరినప్పుడు నీ ఇంటి తాళం చెవులు వాడి వశంలో ఉండేవి. ఇంట్లో సామాన్లు – నగదు – ఏమేమి ఉన్నాయో చూసుకున్నావా? ఇప్పుడే ఓ నిర్ణయానికి రా. అనంతరం నీ ఆస్తి పరుల చేతికి పోవటం – కర్మాలు చేయటానికి మాత్రమే మేము భాగస్వాములవటం – ఈ రాద్ధాంతాలు వద్దు” అని విషాన్ని కక్కాడు. నా కర్మలు చేసే ప్రయత్నంలోనే ఉన్నాడు వాడు.

వారందరి దృష్టి ఇప్పుడు నా దగ్గరున్న ఇంటి పైన పడింది. డబ్బు విషయం వచ్చేప్పటికి తోడబుట్టిన వాళ్లందరూ ఒకటయ్యారు. వాటి పట్ల నేనే మాత్రమూ బుర్ర పాడు చేసుకోలేదు. పనిమనిషి దేవకి నా పట్ల చూపిస్తున్న శ్రద్ధతో నేను కుదటపడ్డాను.

ఓ సారి నేను దినపత్రిక చదువుతుండగా ఓ ప్రకటన నన్ను ఆకర్షించింది. సీనియర్ సిటిజన్ – రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయి – ఒంటరి – డెభ్భై ఏళ్ల ఆవిడకి ఆ వయసులో వున్న వరుడు కావాలి – అని ఓ మాట్రిమోనియల్ ప్రకటన- అందులో విశేషమేమీ అన్పించలేదు నాకు. ఎందుకంటే ఒంటరితనపు వ్యథ నాకంటే ఇంకెవరికి తెలియ సాధ్యం. ఆమె తీసుకున్న గట్టి నిర్ణయం – నేనూ ఓ నిర్ణయానికి రావటానికి కారణమయ్యింది.

నేనూ అల్లాంటి ప్రకటనే ఇచ్చా… ఆ తర్వాత దాన్ని మరిచేపోయా.

దాని ఫలితమే ఈనాటి అన్నగారి రాక. వెనువెంటనే శారద ఫోను. రెండింటి సారాంశము ఒకటే. మా ఇంట్లో దీన్ని అందరూ సీరియస్‌గా తీసుకుంటున్నారని.

ఓ రోజు ఓ చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి మా వాళ్లందర్నీ పిలిచా. అందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి పనిమనిషి దేవకి వెళ్లిపోయింది.

అనంతరం – నా మనసులోని మాటను అందరి ముందూ వెల్లడి చేశాను. ఈ వయసులో పెళ్లి అవసరమా! అంతగా ఒంటరితనాన్నుండి దూరం కావాలనుకుంటే – మా పిల్లల్లో ఎవర్నయినా ఒకర్ని దత్తత తీసుకోవచ్చుగా. ఇదీ వాళ్ల జవాబు.

“హుఁ. ఇంతకాలం మీ బాధ్యతలను మోసాను. మీరు ఏం చేశారు? నన్ను ఒంటరిదాన్ని చేసి మీ దారి మీరు చూసుకున్నారు. మీ పిల్లలూ, మీ అడుగుజాడల్లో నడవరనే గ్యారంటీ ఏమిటి? వయసు మీరిన ఆడది, ఒంటరితనాన్ని సహించాలేకాని పెళ్లి చేసుకోకూడదని మీ అభిప్రాయమా? వయసు మీరిన తర్వాత, ఎవరూ చూచుకునే వాళ్లే లేక ఆ ఆడది అనాథగా జీవించాలా? మునుపు ఉమ్మడి కుటుంబాల్లో ఇలా వుండేది కాదు. భర్తను పోగొట్టుకొన్న వారో లేదా పెళ్ళి కాక నిల్చిపోయిన ఆడపిల్లలకి ఒంటరితనం అంతగా బాధించేది కాదు. తమ ఆలనా పాలనా చూచుకునే వారున్నారనే ఓ సురక్షితా భావం వారికుండేది. కని పెంచిన అమ్మానాన్నలనే అనాథలుగా చేస్తున్నారు ఈనాటి పిల్లలు. ఇల్లాంటి వ్యవస్థలో అక్క చెల్లండ్రును అడిగే వాళ్లెవరు? ఒంటరి బతుక్కి ఓ తోడు కావాలని ఆశించటం తప్పా? వారి బాధ్యతలని మోసే వాళ్లు ఎవరూ లేకపోతే, తమ అంతిమ దశలో వాళ్లు ఎవర్ని ఆశ్రయించాలి?”

పెళ్లి అంటే, కేవలం శారీరిక వాంఛలని తీర్చుకోడానికే అని ఎందుకు అనుకోవాలి? ఈ ఒంటరితనమనే శాపానికంటే వేరొకటి లేదు. తమ వృద్ధాప్యంలో కొడుకులతోటి, మనుమలతోటి ‘రామా కృష్ణా’ అంటూ గడిపివేయాలి. అయితే సంతానం లేని వాళ్లు? పెళ్లి కానివాళ్లు? – పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే అది తప్పా? ఒకటి మాత్రం నిజం. భార్యకు భర్త; భర్తకు భార్య వాళ్లే కడవరకూ – జీవిత భాగస్వామి లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరు.

మన సమాజంలో ఎన్నెన్నో మార్పులు వచ్చాయి. విధవా వివాహాలు సామాన్యమైపోయాయి. అలాగే ముసలివాళ్లు పెళ్లి చేసుకోవాలనుకుంటే- ఒక తోడు కావాలనుకుంటే తప్పేమిటి? ఈ సోషియల్ మీడియాల్లో మాలాంటి వాళ్లని అవహేళన చేసి నవ్వుకునే వాళ్లు తమ నిజ జీవనంలో ఎలా వుంటున్నారనేది నే నెఱుగుదును. పైకి చెప్పే రంగు, రంగుల మాటలే వేరే. రియాల్టీ వేరే. వీళ్ల మాటలని విని మా బతుకుల్ని కొనసాగించటం సాధ్యంకాని పని.

నా మనసు లోతుల్లో దాగిన లావాని వెళ్లగక్కి – శాంతమైన అగ్నిపర్వతం లాగా మౌనంగా కూర్చుండిపోయా కళ్లు మూసుకుని.

కన్నడ మూలం: మాలతి ముదకవి

అనువాదం: కల్లూరు జానకిరామరావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here