ఆవేశం చల్లారి ప్రశ్నించడం మానివేసిన అక్షరం – గోలి మధు ‘సంఘర్షణ’ పుస్తక సమీక్ష

0
11

[శ్రీ గోలి మధు రచించిన ‘సంఘర్షణ’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు శ్రీ శిరందాసు నాగార్జున రావు.]

[dropcap]గో[/dropcap]లి మధు కలానికి పదును, దూకుడు కూడా ఎక్కువే. ఆయన కవిత్వంలో అక్షర, పద విన్యాసాలు కనిపిస్తాయి. పదాలలో ఎంత పొదుపో, భావాలలో విస్తృతి అంత ఎక్కువ. ఈ విషయంలో ఉపాధ్యాయురాలైన ఆయన అమ్మ గారి ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. అభ్యుదయ కవిగా పేరు గడించిన గోలి మధు ప్రగతిశీల కవిత్వం రాయడంలో దిట్ట. భారతీయ ధర్మ విశ్లేషణ (2003), నవశకం (2006), రైతు సమరభేరి(2020, 2021), గమనం (2021) వంటి కవితా సంకలనాలు అందించారు.

పుస్తకాలకు కాలం చెల్లిందనుకుంటున్న రోజుల్లో 2020లో వచ్చిన ఆయన ‘రైతు సమరభేరి’ కవితా సంపుటి 2021లో రెండవ ముద్రణకు నోచుకుందంటే ఆయన కవిత్వంలో ఎంత పట్టుందో అర్థం చేసుకోవచ్చు. అదే ఆవేశంతో, పదునెక్కిన ఆలోచనలతో తనలో తను ఘర్షణ పడి 38 కవితలతో ‘సంఘర్షణ’ అనే కవితా సంకలనం తెచ్చారు. సమాజంలోని రుగ్మతలను సరిదిద్దాలన్న మధు ఆలోచనల్లో నుంచి పుట్టుకొచ్చిందే ప్రగతిశీల కవిత్వం పేరుతో రాసిన ఈ ‘సంఘర్షణ’. 2020 నుంచి 2023 జనవరి వరకు రాసిన కవితలు ఇందులో ఉన్నాయి.

అభ్యుదయ సాహితీవనంలో విరబూసిన ఎర్ర గులాబీ గోలి మధు. ఆయన ఉవ్వెత్తున లేచే కెరటం. ఓ మెరుపు. మధు భాషా – భావం రెండూ పదునైనవే. అతి సాధారణ పదాలలో అద్భుతమైన భావం పలికించగల కవి మధు. ఉద్ధండులైన సాహితీవేత్తలను కూడా ఆశ్చర్యపరిచేవిధంగా కవిత్వం రాయగలిగిన స్రష్ట మధు. ఆయన కవిత్వంలోని సారాన్ని ఎవరికి వారు ఆస్వాదించవలసిందే. మచ్చుకు ఓ కవితలోని రెండు లైన్లు.. ‘అక్షరానికి ఆవేశం చల్లారింది. అందుకే.. ప్రశ్నించడం మానేసింది.’ అన్నారు. ఇందులో నుంచి ఎన్ని అర్థాలు స్ఫురిస్తాయో ఆలోచించండి. ప్రశ్నించడం మానేసినా, ఆలోచించడం మానకూడదు.

‘అక్షరానికి పక్షపాతం ఆవహించింది, అందుకే పక్షవాతంతో కులమతాల చిచ్చులకు ఆజ్యమైంది’ అని స్పష్టం చేశారు. మరోచోట ‘పీడితులే నా కలానికి ఆరాధ్యులు. దేశం గుండెఘోష నా సిరా. పీడకులపైనే నా కలం దాడి. దేశం గుండెల్లో, పీడితుల ఎదలో రగిలే జ్వాల ఈ సంఘర్షణ. అడుగడుగునా అంధకారం ఆవరిస్తే, అక్షరం దీపమై అడుగులు మొదలుపెట్టాలి’ అంటారు మధు. ఆ అడుగులే ఈ ‘సంఘర్షణ’. సంఘర్షణ అనేక రూపాలలో, అనేక అర్థాలలో ఉంటుంది.

అక్షరాలు అరుణ వర్ణం కోల్పోయాయని, అవి తల్లక్రిందులవడంతో దేశ సంపద కొందరి చేతుల్లోకి వెళుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య భారతదేశ సంపదంతా ప్రైవేటీకరణ పేరుతో కార్పోరేట్ల కబంధ హస్తాల్లో ఒదిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అందరికీ తెలిసిన నడుస్తున్న చరిత్ర ఇది. ‘సంక్షోభంలోకి దేశం దిగజారుతున్నా పాలన మారనందుకు చోద్యంగా ఉంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. గగ్గోలు పెట్టారు. ‘చైతన్య రహితమైన సంఘాన్ని చూస్తే భయమేస్తోంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజం ఎంత చైతన్యహీనంగా తయారైందో స్పష్టంగా చెప్పారు.

‘గుండ్రని నా అక్షరం దొర్లుతూ వెళితే,

పీడితుల పాదాలు తాకే పూల చెండు!

దూసుకెళితే పీడకులపై దాడిచేసే ఫిరంగి గుండు!’

~

సమాజంలో ఉన్న అన్ని అంశాలపై ఆయన కవితలు రాశారు. రాస్తున్నారు. రాస్తారు. వాటిలో రైతుల వెతలు తప్పక ఉంటాయి. రైతు ప్రాధాన్యతను మధు అంతగా గుర్తించారు. రైతంటే ఆయనకు వల్లమాలిన ప్రేమ, అభిమానం. దేశ వెన్నెముక వెన్ను విరుస్తూ 700 మంది రైతుల బలిదానాలకు కంట తడి చూపలేని అంధ దేశభక్తుడిని అని తనను తాను తిట్టుకున్నాడు. అదే సంఘర్షణ.

బోధన విషయానికి వస్తే, ‘లోకం పోకడ నేర్పక, మనసుకు జ్ఞానం ఇంకక, బట్టీపట్టే ర్యాంకుల పంటలే అగుపిస్తాయిక్కడ!’ అని నేటి చదువుల తీరును ఎండగట్టారు. చిన్నప్పటి నుంచి పెట్టుకునే నుదుట బొట్టును ఆయన రాలిపోగానే తుడిచేస్తారెందుకు? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేవారున్నారా? ‘వాడెవడో మనువంట-మగడు మరణించాక-మగువకు మనుగడ ఎందుకంటూ మరణశాసనం రాశాడు’ అని మండిపడ్డాడు. సమాజంలో మహిళల స్థానం, వారి ఆక్రోశం, ఆలోచన, ఆశలను చక్కగా, స్పష్టంగా తెలిపారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల విషయంలో ‘గడపదాటి గద్దించండి, స్త్రీ శక్తితో అధికారానికి అసలు అర్థం చెప్పండి’ అని మహిళలకు పిలుపునిచ్చాడు.

చేవ చచ్చి, చైతన్యం లోపించి నీరుగారిపోతున్న పోరాటాలకు సరికొత్త ఒరవడి అద్దిన ఉద్యమరైతుని శ్లాఘించారు. అధికార మదాంధుల వెన్నులో వణుకు పుట్టించిన దేశం వెన్నెముకగా ఉద్యమ రైతుని పోల్చి సలాం చేశారు. 75 ఏళ్లుగా నాయకులు ఇచ్చే స్థితిలోనే ఉన్నారని, ప్రజలు మాత్రం పుచ్చుకుంటూ ప్రశ్నించలేని స్థితిలో ఉన్నారని నేటి రాజకీయాలు, ఆ రాజకీయాల్లో ఓటర్ల తీరును చక్కగా వర్ణించారు.

పుస్తకం మొత్తం చదివితే కవి ఎవరెవరితో, ఏ రకమైన ఆలోచనలతో, సామాజిక పరిస్థితులతో, తనలోని తనతో.. ఎన్నివిధాల సంఘర్షణ పడ్డారో తెలుస్తుంది. ఎంత అంతర్మథనం పడ్డారో అర్థమవుతుంది. ఆ సంఘర్షణలో నుంచి మెరుపులు వచ్చాయి. ఉవ్వెత్తున పడిలేచే కెరటాలొచ్చాయి. ఆవేశం, ఆక్రోశం వచ్చాయి. కొత్తకొత్త ఆలోచనలు వచ్చాయి. కొత్త కొత్త పదాలు పుట్టుకొచ్చాయి. అలా ఈ ‘సంఘర్షణ’ కవిత్వం పుట్టుకొచ్చింది.

***

సంఘర్షణ (కవితా సంపుటి)
కవి: గోలి మధు – 9989186883
పేజీలు: 110
వెల: ₹ 80
తొలి ముద్రణ: ఫిబ్రవరి, 2023
ముద్రణ: యు.ఎస్.ఆర్. పబ్లికేషన్స్, నులకపేట, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా
ప్రతులకు: రేకా క‌ృష్ణారావు
ఎన్సీసీ రోడ్డు, మంగళగిరి- 522503
సెల్ నెం: 9848199098

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here