సమ్‌ఝే…!

    13
    9

    [box type=’note’ fontsize=’16’] “మనిషి చాకచక్యానికి, అపర చాణక్యానికి హడలిపోయి అతనిలోని నిజాయితీ ముఖం తిప్పుకుని, పక్కకు తప్పుకుని వెళ్ళిపోతోంది ఈమధ్య…” అంటున్నారు “సమ్‌ఝే” కవితలో శ్రీధర్ చౌడారపు. [/box]

    అవినీతి మడుగులోకి జారిపోయి
    బురదలో కూరుకుపోయిన
    మానవ విలువల పుస్తకం
    పుటలన్నిటినీ పరపరా చింపేసుకుంటోంది….

    జీవితపు ఆటలో
    ఓడిపోయానన్న కడుపుమంటతో
    తనను తానే కాల్చేసుకొంటోంది

    ఎదగాలన్న కోరికతో
    ఆశల మెట్ల అడ్డ దారిలో
    పక్కవాని పైకెక్కేసి
    ఎదుటివాణ్ణి వెెనక్కితోసేసి
    ముందుకు దూసుకెళుతోన్న నవనాగరీకం…
    తన చేయి వదిలేసి వెళుతోంటే
    బతుకుబంధాన్ని తెంచేసి
    నిర్దాక్షిణ్యంగా తుంచేసి
    తనదారి తాను చూసుకుంటుంటే….
    దిక్కుతోచని మానవత్వం
    వెక్కివెక్కి ఏడుస్తోంది ఒంటరిగా కూర్చుని

    నీతికథల్లో కనిపించిన
    జంటకవుల్లాంటి జాలీ దయ…
    అదేమిటో…?
    బిక్కుబిక్కుమంటూ
    నాలుగు దిక్కులూ చూసుకుంటూ
    గోడల చాటున దాక్కుంటూ
    ఏ కంటా కనబడకుండా
    రహస్యంగా తిరుగుతున్నాయి…

    స్వార్థాన్ని సారాలా తాగేసి
    నిషాలో నింపాదిగా చిందులేస్తున్న
    ఈ నయా నరావతారం
    ఎక్కడ తమ ఇద్దరినీ
    చీకుల్లాగా నంజుకు తింటుందేమోనని
    భయమేసి

    చేతుల్లో చేయేసి
    కాకి ఎంగిలుల స్నేహం చేసి,
    అంటకాగి
    చిన్నతనాన్నంతా వెంట తిరిగిన
    నీతి ఇంటిపేరైన నిజాయితీ…
    అంతంత దూరంనుంచే
    ముఖం తిప్పుకుని,
    పక్కకు తప్పుకుని వెళ్ళిపోతోంది ఈమధ్య…
    అవసరాలవారి అవినీతిని
    వెంటబడి ప్రేమించి పెళ్ళిచేసుకున్న
    మనిషి చాకచక్యానికి
    అపర చాణక్యానికి హడలిపోయి

    దిగాలుపడిన హృదయాలతో అవన్నీ
    నివ్వెరపోయి వింటున్నాయతని మాటల్ని
    “కుఛ్ పానా హైతో… కుఛ్ ఖోనా హై”
    సమ్‌ఝే ….!
    అంటూ వెర్రిగా … గట్టిగా అరుస్తుంటే.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here