సంచార జీవులు

0
9

[box type=’note’ fontsize=’16’] స్వేత్లానా అలెక్సివిచ్ (బెలారస్) రచించిన కథను తెలుగులో ‘సంచార జీవులు’ పేరుతో అందిస్తున్నారు శ్రీ ఎ.యం.అయోధ్యారెడ్డి. [/box]

[dropcap]ఒ[/dropcap]క మనిషి జన్మించాడు…

ఇద్దరు దేవదూతలు అతని పక్కన కూర్చొని జాతకాన్ని చిత్రిస్తున్నారు. దీర్ఘాయుష్కుడా, అల్పాయుష్కుడా నిర్ధారించి జీవితకాలాన్ని సూచిస్తున్నారు. పైనుంచి దేవుడు ఇదంతా గమనిస్తున్నాడు. కొత్తగా భూమ్మీదకొచ్చిన ఆత్మని స్వాగతించేందుకూ, అలాగే తన ఉనికిని గురించి తెలియజెప్పేందుకు ఆయనే దూతల్ని పంపించాడు.

***

నాకున్న గొప్ప లక్షణం ఏమంటే ఒక మనిషి సంతోషంగా ఉన్నదీ లేనిదీ కళ్ళలోకి చూసి చెప్పగలను. ఇందుకోసం దారినపోయే ఏ దానయ్య వద్దకో నడిచివెళ్ళను. ఎవరెవరినో ఆపేసి “బాబూ.. నీకు జాతకం చెప్పేదా?” అని అంటే దానయ్యలు చిరాకుతో దూసుకెళ్లిపోతారు. అంతులేని జన సమూహంలో నాకు ముందే తెలిసినట్టుగా ఒకర్ని ఎంపిక చేసుకుంటాను. మనసులో ఒక అనుభూతి కలుగుతుంది. నా కళ్లముందు అక్షరాలు ప్రత్యక్షమవుతాయి. పదాల ఒరవడి మొదలవుతుంది. నేను మాట్లాడటం ప్రారంభిస్తాను. అతని జాతకం వివరిస్తాను. నా సంచీలో నుంచి అదృష్టం కార్డులు బయటికి తీసి ముందు పరుస్తాను. కార్డుల్లో సమస్తం ఉంటుంది. గతం ఏమిటి? భవిష్యత్తు యెలా ఉండబోతుంది? ఆత్మ ఎట్లా బొందిని వీడి పంచభూతాల్లో కలుస్తుంది? దేహాన్ని వీడిన తర్వాత ఆత్మ ఎక్కడ విశ్రాంతి పొందుతుంది? ఆత్మ వెళ్లిపోతూ తనవెంట ఏం తీసుకొనిపోతుంది?

అది ఎక్కణ్నుంచయితే వొచ్చిందో తిరిగి అక్కడికే వెళుతుంది. అంటే విధాత వద్దకు. కార్డులు అంతా విప్పి చెపుతాయి. మనిషి తన జాతకాన్ని తెలుసుకొని ఆనందిస్తాడు. ఒక ఆశావాదిగా మారుతాడు, గర్వపడతాడు. కానీ అతనికి తెలియదు.. అరచేతిలోని గీతలకు ముందే తన జాతకచక్రం స్వర్గంలో గీయబడి వుంటుంది. గీతల్లో ఒక సందేశం దాగి ఉంటుంది. అయితే ప్రతిఒక్కరూ ఆ సందేశాన్ని తమదైన రీతిలో చదువుకుంటారు.

***

మేం జిప్సీలం. మాది సంచార జాతి. మేమెక్కడైనా స్వేచ్ఛగా జీవిస్తాం. మా తెగకే సొంతమైన ప్రత్యేక ఆచారాలూ, జిప్సీ చట్టాలూ ఉంటాయి. మేమెక్కడ నివాసముంటే, మా బతుకులు ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడే మా ఇల్లు. అదే మా ఊరు. ఒక స్థిరమైన ప్రదేశమంటూ లేదు. సువిశాలమైన ఆకాశం కింద మెమెక్కడైనా బ్రతుకుతాం. నా చిన్నతనం నుంచీ మా నాన్న నాకదే చెపుతూ వచ్చాడు. మా అమ్మ కూడా అదే నేర్పించింది.

ఆ సమయంలో మేము మరో ప్రదేశానికి పయనమవుతున్నాం. మేమెక్కి వెళుతున్న కిబిట్కా (జిప్సీలు రవాణా కోసం ఉపయోగించే బండి) గతుకుల బాటలో ఎగిరిపడుతూ పోతున్నది. దాన్ని లాగుతున్న గుర్రం పరుగెత్తలేక ఆయాసంతో అడుగులేస్తున్నది. రోడ్డు గుంతల్లో బండి గెంతినప్పుడల్లా లోపలున్న మేము అటు ఇటు ఊగిపోతున్నాం. మా అమ్మ నాకోసం చక్కటి స్వరంతో మా సంచారజాతి ప్రార్థన గీతాలను ఆలపిస్తున్నది.

“నేను ప్రయాణించే ఈ రహదారి రంగూ…

నా పాదముద్రలు పడుతున్న నేలపైన మట్టి రంగూ…

గడిచిపోయిన నా చిన్నతనపు జ్ఞాపకాల రంగూ…

అన్నీ, నీటి మబ్బులు కమ్మిన బూడిద రంగులే…”

ఆమె గాత్రం శ్రావ్యంగా సాగిపోతుంటే అందరం మైమరిచిపోయి వింటున్నాం. అన్నట్టు మీరెప్పుడైనా జిప్సీలు నివాసముండే డేరాలని చూశారా? వాటిని గుడారాలు అని కూడా అంటారు. భూమి మాదిరి గుండ్రంగా, ఆకాశం మాదిరి ఎత్తుగా ఉంటాయి. అదిగో.. అలాంటి ఒక గుడారంలో నేను పుట్టాను. అదీ ఒక అడవి లాంటి నిర్జన ప్రదేశంలో. ప్రకాశవంతమైన నక్షత్రాలు మిణుకు మిణుకుమనే ఒకానొక రాత్రివేళ.

నేను పుట్టినరోజు నుంచే నాకు చీకటి రాత్రులన్నా.. అడవి పక్షులన్నా, జంతువులన్నా ఏమాత్రం భయం లేదు. రాత్రుళ్లు మా గూడారాల ముంగిళ్లలో వేసుకునే చలిమంటల వెలుగుల్లో పాటలు పాడటం, జిప్సీ డ్యాన్సులు చేయడం నేర్చుకున్నాను.

పాటలు, నృత్యాలు లేని జిప్సీల జీవితాన్ని మేమసలు ఊహించలేం.

మా తెగలో ప్రతి ఒక్కరూ ఆడతారు పాడతారు. మనిషికి మాట ఎంత సాధారణమో మా జాతికి ఆటాపాటా అంత సహజం. మేము పాడే గీతాలు హృద్యంగా ఉంటాయి. మా పాటల్లోని చరణాలు ఇంపైనవి.. మృదువైనవి.. విధ్వంసకరమైనవి కూడా.

నా చిన్నతనంలో నాకు పాటల అర్థం తెలిసేదికాదు. అయినాసరే ఎంతోబాగా ఆస్వాదించాను.. ఆనందించాను. చాలాసార్లు హృదయం ద్రవించి ఏడ్చాను కూడా. అవి ఎలాంటి చరణాలంటే మెల్లమెల్లగా మనిషి హృదయానికి పాకి ఆక్రమించుకుంటాయి. గుండెల్ని పిండేస్తాయి. కళ్లను వర్షింప చేస్తాయి. మనసును బరువెక్కించి అలజడి పెడతాయి. ఊరట కలిగిస్తాయి. నిన్ను స్పర్శిస్తాయి. లాలిస్తాయి. అంతలోనే తీవ్రంగా గుచ్చుకుంటాయి. అంతే గొప్పగా ప్రేమిస్తాయి.

అందుకే రష్యన్ ప్రజలు తమ జీవితకాలంలో రెండుసార్లు మరణిస్తారని అతిశయోక్తిగా చెప్పుకుంటారు. అందులో ఆశ్చర్యమేమీ లేదు. వాళ్లు మొదటిసారి మాతృభూమి కోసం ప్రాణాలిస్తే, రెండోసారి జిప్సీల గాత్రం వినేందుకు పడిచచ్చిపోతారని చెపుతారు.

***

నా గురించీ, మా జాతి గురించీ మీరేవేవో ప్రశ్నలడగాల్సిన పనిలేదు. ఎందుకంటే నేనే అన్ని విషయాలు చెప్పేస్తాను. నా బాల్యంలో నేనెంతో ఆనందంగా గడిపాను. చెబితే నమ్మరు కానీ, వేసవికాలం వొచ్చిందంటే చాలు, మేమంతా ఒకేచోట క్యాంపు వేసుకొని కలిసిమెలిసి వుండేవాళ్ళం. ఒక కుటుంబం మాదిరి బతికేవాళ్ళం. సాధారణంగా ఏదైనా నది తీరంలోనో లేదా అడవికి సమీపంలోనో ఆగిపోయి మంచి ప్రదేశంలో క్యాంపు వేసేవాళ్ళం. మా శిబిరాలు ప్రకృతిలో ఒక భాగంగా వుండేవి. తెలతెల్లవారుతుండగా మాకన్నా ముందుగానే మేల్కొనే పక్షులు కిలకిలా రావాలు చేస్తూ పాటలు పాడేవి. కోకిలలు శ్రావ్యంగా కూసేవి. మా అమ్మ వాటితో గొంతు కలిపి తను కూడా పాడుతుండేది. అమ్మ చైతన్యానికి మారుపేరులా ఉంటుంది. ఆమె రోజూ ఉదయమే నన్ను నిద్రలేపుతుంది.

శీతాకాలం వచ్చిందంటే నిర్జన ప్రదేశాలు వీడి మళ్ళీ జనవాసాల్లోకి అడుగుపెట్టేవాళ్ళం. రహదారుల పక్కనా, వంతెనల పక్కనా, ఇంకా నిర్మాణం పూర్తికాని పాత భవంతుల కిందా గుడారాలు వేసుకొని వుండేవాళ్ళం. జనం మాపట్ల దయగా స్నేహంగా వుండేవారు. వారిలో ఎంతోమంది సహృదయులు. వాళ్ళతో మేము కలిసిమెలిసి వుండేవాళ్ళం. అట్లా మంచు కురుస్తున్నన్ని రోజులూ వసంత ఋతువు ఎప్పుడొస్తుందాని ఎదురుచూసేవాళ్ళం.

గుర్రాలు మా జిప్సీల జీవనంలో ముఖ్యమైన భాగం. మావద్ద ప్రతి ఇంటికీ ఒకటో రెండో గుర్రాలు ఉంటాయి. ప్రతి కుటుంబమూ ఎంతో జాగ్రత్తగా వాటి సంరక్షణ చేస్తుంది. తమ పిల్లలతో సమానంగా వాటిని ప్రేమిస్తారు. వాటి బాగోగులు చూస్తారు.

ఏప్రిల్ నెలలో ఈస్టర్ పండగ వొచ్చిందంటే మేమంతా మా జాతి పెద్దలకూ, ఉత్తమ వ్యక్తులకూ నమస్కరించి వారి దీవెనలు పొంది కొత్త ఉత్సాహంతో జీవనోపాధి కోసం వేటకు సిద్ధమవుతాం. పైన వెచ్చని సూర్యుడూ, ప్రాణమిచ్చే నీరూ, మమ్మల్ని సేదదీర్చే గాలి, బతుకుదెరువు కోసం పడే కష్టం… ఇదే మా ప్రయాణం.

జిప్సీలైన మేము ఇతరుల జాతకాలు చూస్తాం. వారి భవిష్యత్తును కళ్ళకు కడుతూ సోది చెపుతాం. కానీ, మేము మాత్రం ఏరోజుకారోజు ఈపూట గడిస్తే చాలన్నట్టుగా బతికేస్తుంటాం. రేపటి గురించి ఆలోచించం. ఆ చింత మాకులేదు. ఎందుకంటే కాలం దొర్లిపోతుంది.

ఈరోజు నువు ఆనందంగా వుండొచ్చు. ఈ రాత్రికి నిన్నెవరైనా ప్రేమగా ఆలింగనం చేసుకోవచ్చు. నీ పిల్లలు ఎలాంటి బాధలు లేకుండా ఆరోగ్యంగా వుండొచ్చు. అందరికీ కడుపు నిండా కూడు దొరకొచ్చు. ఇదంతా చూసి నువ్వూ సంతృప్తి చెందొచ్చు. కానీ మా అమ్మ మాటల్లో చెప్పాలంటే రేపనేది ఒక కొత్తరోజు ఎప్పుడూ ఉదయిస్తూనే ఉంటుంది.

నేను ఏనాడూ బడికి పోలేదు. ఏమాత్రం చదువుకోలేదు. నేనేకాదు, మా జిప్సీ తెగలో పిల్లలెవరికీ చదువులు అందవు. ఇంట్లో అమ్మ కూడా నాకేమీ పెద్దగా నేర్పించలేదు. దేవుడు సృష్టించిన ప్రాణిగా ఒక శిశువు భూమ్మీద పడినప్పుడు నిజానికి తనకెవరూ పెద్దగా నేర్పించాల్సిన అవసరం లేదు. అన్నీ స్వయంగా చూసి నేర్చుకోగలదు. అచ్చంగా నేను అదేవిధంగా పెరిగాను. అయితే నాతోపాటు నాలో కోరికలు అభిలాషలు పెద్దగా పెరగలేదు. నావన్నీ స్వల్పకాలిక సంతోషాలు.. కేవలం జిప్సీల పరిమిత ఆనందాలు.

***

ఒకరోజు తెల్లవారే సమయంలో పెద్దపెద్దగా మాటలు వినిపించి నిద్ర మేలుకున్నాను. “ఓరి దేవుడో! యుద్ధం… రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది” ఎవరో గట్టిగా అరుస్తున్నారు.

“యుద్ధమా.. ఎవరితో?”

“జర్మనీతో… హిట్లరుతో”

“అయితే మనకేంటి? యుద్ధం జరగనీ. వాళ్ళను కొట్లాడుకోనీయండి. మనకెందుకు? మనం జిప్సీలం.స్వేచ్చాజీవులం. ఆకాశంలో పక్షుల మాదిరి ఎగురుతూ ఎక్కడపడితే అక్కడ బతికేసేవాళ్ళం”

“అట్లా కుదరదు. ప్రపంచ యుద్ధమంటే వేరు. అది అందర్నీ చుట్టుకుంటుంది. మనకూ కష్టాలు తప్పవు”

ఈలోగా పెద్దఎత్తున వైమానిక దాడులు మొదలైనయి. జర్మన్ విమానాలు ఊళ్ళపైన బాంబుల వర్షం కురిపిస్తున్నయి. మరోపక్క నుంచి హిట్లర్ సైనికులు ఊరూ వాడా ధ్వంసం చేస్తున్నారు. మనిషి.. పశువు అనే తేడా లేకుండా కనిపిస్తే చాలు తుపాకులు ఎక్కుపెట్టి కాల్చి చంపేస్తున్నారు. పొలాల్లో గడ్డిమేస్తున్న వందలాది ఆవులు, బర్రెలు బుల్లెట్లతో చిల్లులుపడి నేలకు వొరిగిపోతున్నయి. యుద్ధ విమానాల దాడులతో ఆకాశం కనిపించనంత దట్టంగా అలుముకున్న నల్లటి పొగలు.

ఆ రోజంతా ఉధృతంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. సాయంత్రం అమ్మ పిచ్చిపట్టినట్టు అయిపోయింది. జాతకాలు చెప్పేందుకు ఉపయోగించే కార్డుముక్కలు ఆమె చేతుల్లో నిలువకుండా జారి నేలమీద పడిపోయాయి. రెండుచేతుల్లో తల పట్టుకొని పెద్దగా రోదించింది. ఏడ్చిఏడ్చి కింద కూలబడి చాలాసేపు అచేతనంగా ఉండిపోయింది.

యుద్ధం తీవ్రరూపం దాల్చింది. అయినప్పటికీ మా క్యాంపు ఉన్నచోటు నుంచి కదల్లేదు. మా గుడారాలు అక్కడే ఉన్నాయి. యుద్ధం వల్ల ఏర్పడిన వాతావరణం నన్ను భయం కంటే ఎక్కువ చిరాకు పరిచింది. గంటలు, రోజులు బిక్కుబిక్కుమంటూ డేరాలో గడపడం విసుగు కలిగించింది. స్వేచ్చగా తిరగటం, అట్లా రోడ్డుమీద తోటిపిల్లలతో ఆడుకోవడం నాకిష్టం.

***

ఒక రాత్రి మేము మా గుడారాల ముందు చలిమంటల వద్ద కూర్చున్న సమయంలో ఒక వృద్ధ జిప్సీ మహిళ అక్కడికి మెల్లగా నడుచుకుంటూ వొచ్చింది. మనిషి వృద్ధాప్యం వల్ల బాగా వొంగిపోయింది. ఏళ్లతరబడి ఎండకు ఎండుతూ, వానలకు తడుస్తూ చీకిపోయిన వస్త్రంలా ఆమె చర్మం ముడతలుపడింది. మనిషి నిరుపేదగానూ, మురికిగానూ ఉన్నది. మా క్యాంపులోని పెద్దవాళ్లకు ఆమె పరిచయం వుండొచ్చు, కానీ నాకు తెలియదు. అక్కడికి దగ్గర్లోనే వున్న వేరే జిప్సీల క్యాంపు నుంచి ఆమె ఇక్కడికి వొచ్చింది.

“నిన్న మా క్యాంపులో ఘోరం జరిగింది” అందామె. అంతా ఒక్కసారి ఆమెని చూశారు. అక్కడి క్యాంపులో జరిగింది గుర్తుకొచ్చి వణుకుతున్న స్వరంతో ఆమె చెప్పసాగింది: “నిన్న తెల్లవారుజామున చాలామంది జర్మనీ సైనికులు మా గుడారాలను చుట్టుముట్టారు. వాళ్ళంతా బాగా బలిసివున్న గుర్రాలనెక్కి వొచ్చారు. గుర్రాల మెడలమీద నిగనిగలాడే జూలు ఉదయం నీరెండలో మెరిసిపోతున్నది. వాటి కాళ్ళకున్న డెక్కలు ఎంతో దృఢంగా వుండి దుమ్ము కొట్టుకొని వున్నాయి. ఒకేవిధమైన యునిఫారాలు, తలమీద ఇనుప టోపీలు ధరించిన సైనికులు గుర్రాల జీన్ల మీద అతిశయంగా కూర్చొని ఉన్నారు.

వాళ్ళు పెద్దగా అరుస్తూ గాలిలోకి తుపాకులు పేల్చి మమ్మల్ని భయపెట్టారు. మా గుడారాల్లోకి చొచ్చుకుపోయి లోపల దాక్కున్న వాళ్ళందరినీ బయటకు లాక్కొచ్చారు. అందరినీ విపరీతంగా కొట్టారు. నేలమీద పడేసి బూట్లతో తొక్కారు.

జిప్సీల చేతి వేళ్లకున్న ఉంగరాలను బలవంతంగా గుంజుకున్నారు. ఆడవాళ్ళ చెవులు తెగి రక్తాలు కారుతూ ఏడ్చి మొత్తుకుంటున్నా జాలి లేకుండా వాళ్ళ చెవి పోగులు, కమ్మలు తెంపుకున్నారు. కొందరికైతే చెవులను కోసి నగలను లాక్కున్నారు. ఉంగరాలు లాక్కునే క్రమంలో మగవాళ్ళ చేతివేళ్ళలను విరిచేశారు. పక్షి ఈకలతో తయారుచేసుకున్న పరుపులను బయట పడేశారు. తుపాకుల చివరనుండే కత్తులతో పరుపులను పొడిచి పొడిచి చీలికలు పేలికలు చేశారు. వాటిల్లో బంగారం కోసం, డబ్బుల కోసం వెతికారు.

దోచుకోవడం మొత్తం పూర్తయ్యాక అకారణంగా అక్కడున్న అందరిమీదా తుపాకులు ఎక్కుపెట్టి గుడ్డిగా కాల్పులు జరిపారు. గుండ్లు తగిలి ఎంతోమంది నేలకొరిగారు. రక్తం కాలువలై ప్రవహించింది. ఇదంతా చూసి చలించిపోయిన ఒక చిన్నారి పాప ధైర్యంగా సైనికుల ముందుకొచ్చి నిలబడి అన్నది: “అయ్యాలారా.. దయచేసి తుపాకులు పేల్చకండి. మమ్మల్ని చంపకండి. మమ్మల్ని విడిచిపెట్టండి. కావాలంటే మీకోసం నేనో చక్కటి జిప్సీ పాట పాడుతాను. డ్యాన్సు కూడా చేస్తాను.”

అమాయకమైన పాప మాటలకు సైనిక రాక్షసులు బిగ్గరగా పడిపడి నవ్వారు.

చెప్పినట్టుగానే పాప ఒక మంచి పాట పాడుతూ నృత్యం చేసింది. అయినా సైనికులు వదల్లేదు. పాట పూర్తవగానే తుపాకులు ఎక్కుపెట్టి జాలిలేకుండా పాపని కాల్చేశారు. అది చూసిన అక్కడివాళ్ళ గుండెలు బద్ధలయినయి. గోడుగోడున విలపించారు. సైనికులు జిప్సీల గుడారాలన్నిటిని తగులబెట్టారు. క్యాంప్ మొత్తాన్ని తుడిచిపెట్టేశారు. కేవలం జిప్సీలకు చెందిన గుర్రాలను మాత్రం చంపకుండా మినహాయించారు. తర్వాత వాళ్ళు వెళ్లిపోతూ గుర్రాలను తమవెంట తోలుకొనిపోయారు.”

వృద్ధురాలు జరిగిన విషాదగాధను చెప్పటం పూర్తిచేసింది. చలిమంట చుట్టూ కూర్చొని, నిల్చొని వింటున్నవాళ్లు అందరూ కదలని బొమ్మల్లా ఉండిపోయారు. ముందున్న చలిమంట ఎప్పుడో కాలి చల్లారిపోయింది.

అంతటా నిశ్శబ్దం. జిప్సీలు చాలాసేపటి వరకూ తేరుకోలేదు. వృద్ధురాలు చెప్పిన విషాద కథనం నన్నెంతో కలచివేసింది.

అమ్మ పక్కన నిశ్శబ్దంగా కూర్చొని వింటున్న నేను భయంతో వొణికిపోయాను.

***

జిప్సీలకు ఆరాత్రి కాళరాత్రే అయింది. జరిగింది తలుచుకొని ఎవరికీ కంటిమీద కునుకు లేదు. ముందుముందు తమ క్యాంపుకు పట్టబోయే దుస్థితి గురించి ఊహించి వొణికిపోయారు. మరునాడు ఉదయమే మేమంతా ఆ ప్రదేశం నుంచి వెళ్లిపోయేందుకు తట్టాబుట్టా సర్దుకున్నాం. గుడారాలు ఎత్తేసి, వస్తువులన్నీ మూటలు కట్టుకున్నాం. ఈకల పరుపులు, మెత్తలు, వంటపాత్రలు, కుండలు.. అన్నీ సర్దుకొని కిబిట్కా పట్టణానికి బయలుదేరాం.

“అమ్మా! మనం ఎక్కడికి పోతున్నాం?” అడిగాను.

“కిబిట్కా పట్టణానికి” అమ్మ గంభీరంగా అన్నది.

“పట్టణానికి ఎందుకమ్మా? మనకు ఇక్కడే బాగుంది కదా. ఈరోడ్డు, పచ్చటి చెట్లు, సూర్యుడు, పక్కనే నదీతీరం. వీటన్నిటినీ వొదిలి పోవాలంటే నాకు బాధగా ఉంది.”

“అందరికీ బాధగానే ఉంది. కానీ ఏం చేయగలం. జర్మన్ సైనికుల హుకుం ఇది. మనం వెళ్ళక తప్పదు”

అమ్మ చెప్పింది విన్నాక నేనెంతో నిరాశ పడిపోయాను. కిబిట్కా పట్టణంలో మినిస్క్ ప్రాంతంలోని మూడు మురికి వీధుల్లో ఉండేందుకు మాత్రమే మా జిప్సీలను అనుమతించారు. మేమంతా అక్కడ డేరాలు ఏర్పాటు చేసుకున్నాం. అట్లా మారాకతో అక్కడో అల్పసంఖ్యాకుల వాడ ఏర్పడింది.

వారానికి ఒకసారి జర్మన్ సైనికులు ఆ ప్రాంతానికి వచ్చి తనిఖీలు జరిపేవారు. వాళ్ళ దగ్గరున్న జాబితా ప్రకారం ఎవరున్నారు ఎవరెవరు వెళ్లిపోయారనేది హాజరుపట్టీ తీసుకుంటూ క్షుణ్ణంగా పరిశీలించేవాళ్ళు. అక్కడ పరిస్థితి దయనీయంగా ఉండేది. అలాంటి వాతావరణంలో ఎట్లా బతికేది? ఎంతకాలం నివసించేది?

మేము ఉండలేకపోయాం. కొద్దిరోజులకే అమ్మా నేనూ ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి పారిపోయినం. ఒక ఊరని కాకుండా ఎన్నో పల్లెలు, గ్రామాలు తిరిగాం. ఎంతోమందికి మా దయనీయ పరిస్థితి వివరించాం. సహాయం చేయమని అర్థించాం. ఆశ్రయం కోసం కాళ్లావేళ్ళా పడ్డాం. కొందరు దయాహృదయులు మాకు తినడానికి ఏదైనా పెట్టేవారు. ఒకరు రొట్టెలు ఇస్తే, మరొకరు గోధుమపిండి, ఇంకొకరు జొన్నపిండి మా జోలెలో పోసేవారు.

ఈ పరిస్థితుల్లో నాకు మాత్రం ఒక నిజం తెలిసింది. ప్రజల్లో జిప్సీల పట్ల ఏవగింపుగానీ, దురభిప్రాయం గానీ లేదు. ఎక్కడికెళ్ళినా మేము అవమానాలు, ఛీత్కారాలను ఎదుర్కోలేదు. జిప్సీల పట్ల… ముఖ్యంగా మేము చెప్పే జాతకాల పట్ల చాలమందికి గురి ఉన్నది. ఎంతో మంది మహిళలు మమ్మల్ని తమ ఇళ్లలోకి సాదరంగా ఆహ్వానించేవారు.

“ఓ.. మీరు జిప్సీలా! అదృష్టం చెపుతారు కదూ. అయితే లోపలికి రండి. ఒకసారి మీ కార్డులు పరిచి నా జాతకం చెప్పండి. మా ఆయన యుద్ధంలోకి వెళ్లారు. జర్మనీ హిట్లర్ సైన్యంతో పోరు. ఆయన ఎప్పుడు తిరిగొస్తారో చెప్పాలి” అని కోరేవాళ్ళు.

ఇట్లా రెండోయుద్ధం మా దేశంలో ఎన్నో కుటుంబాలను విడదీసింది. ఆత్మీయులు ఒకరికొకరిని దూరం చేసింది. మగవాళ్ళు యుద్ధంలోకి వెళ్లి ఎవరికివారే విసిరేసినట్టు ఎక్కడో ఉండిపోవడంతో ఇండ్లల్లో మహిళలు ఒంటరిగా బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. యుద్ధంలోకి వెళ్లినవాళ్ళు ఉన్నారా..? ఉంటే ఇప్పుడు ఎక్కడున్నారు..? అసలు బతికి ఉన్నారా? లేక దేశం కోసం అమరులయ్యారా..?

ఆశతో ఎంతోమంది స్త్రీలు ఎదురుచూపుల్లో రోజులు వెళ్లదీస్తున్నారు. అట్లా బాధిత కుటుంబాల్లోని వాళ్లంతా ఎంతకాలమైనా తమ ఆశల్ని సజీవంగానే నిలుపుకోవాలని భావిస్తున్నారు. ప్రవాహంలో కొట్టుకుపోయే ఏ మనిషికైనా, మనసుకైనా చిన్న ఆసరా.. ఒక ఊరట అవసరం. అందుకే వాళ్ళు అదృష్టం చెప్పమని కోరుతున్నారు. ఆ విధంగా తమ జాతకంలోకి తొంగి చూసుకోవాలని ఆరాటపడుతున్నారు.

అమ్మ జాతకాలు బాగా చూస్తుంది. అదృష్టాలు చెపుతుంది. ఆమె జాతకం చెప్పే పద్ధతి ఎదుటివారికి నచ్చుతుంది. వాళ్ల మనసుకి స్వాంతన కలిగిస్తుంది. మా ఆమ్మ ఒక్కరేకాదు, జిప్సీలలో చాలామందికి ఇది సహజంగా అబ్బిన విద్య. కార్డులు పరిచి అమ్మ జాతకాలు చెపుతుంటే వింటూ వుండటం నాకెంతో ఇష్టం.

కళావర్ రాజు.. ఆటిన్ రాణి.. స్పెట్ జాకీ. అకాల మరణాన్ని ప్రతీకగా చూపించే గబ్బిలం బొమ్మ గల ప్రత్యేకమైన నల్లకార్డు. కార్డులన్నిట్లోకి పెద్దదీ శుభసూచకమైన ఏస్. అలాగే శనిగ్రహాన్ని సూచించే ఏడు నెంబరు. ప్రేమ సూచకమైన తెల్ల రాజు.

సైనికుణ్ణి సూచించే నల్లరాజు. భవిష్యత్ ప్రయాణాన్ని సూచించే డైమండ్ ఆరు.

అన్నీ శ్రద్ధగా వినడం నాకు నిత్యకృత్యం. అయితే బయట జనమెవరికీ తెలియని ఒక నిగూఢ సత్యం నాకు తెలుసు. కార్డులు చూసి అమ్మ చెప్పేవన్నీ నిజాలు కావు. అట్లాగని మోసం ఎంతమాత్రం కాదు. ఎదుటి మనుషులను బట్టి, వాళ్ళ మానసిక స్థితిని బట్టి, వాళ్ళ నేపధ్యాన్ని అంచనావేసి చాలా సందర్భాల్లో ఆమె కావాలని చెపుతుంది. ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా ఎదుటివాళ్ళ ఆశలు కూలిపోకుండా సజీవంగా ఉంచే ప్రయత్నంలో కొన్ని కల్పితాలను కూర్చి వివరిస్తుంది.

జాతకం పూర్తిచేసి బయటకు వచ్చిన తర్వాత దారిలో వెళుతున్నప్పుడు అమ్మ బాధపడుతూ కళ్లనీళ్లు పెట్టుకునేది.

జనానికి కొన్ని నిజాలను చెప్పడం కష్టం. కఠిన వాస్తవాలను వాళ్లు తట్టుకోలేరు. తీవ్రమైన భావోద్వేగాలకు లోనై తల్లడిల్లిపోతారు.

“మీ ఆయన యుద్ధంలో చనిపోయాడు. తుపాకి గుండ్లు తగిలి నెలకొరిగిన మీ కుమారుడు ఇప్పుడు లేడు. వాళ్లు ఈ లోకంలోనే లేరు. మీరెంత ఎదురుచూసినా ఎప్పటికీ తిరిగిరారు. మాతృదేశం కోసం ప్రాణత్యాగం చేశారు. తమకు జన్మనిచ్చిన ఇదే మట్టిలో కలిసిపోయారు. అమరవీరులైన మీవాళ్లు పైన స్వర్గంలో వున్నారు. నా కార్డులే అందుకు సాక్ష్యం” అని అమ్మ ఏనాడూ ఉన్నది ఉన్నట్టు కుండబద్ధలు కొట్టి చెప్పదు.

***

పొట్టచేత పట్టుకొని ఊరూరు తిరుగుతున్న అమ్మా నేనూ ఒకరోజు రాత్రి ఒకరి ఇంట్లో బసచేశాం.

ఆ రాత్రి నాకెందుకో ఎంతసేపటికీ నిద్ర పట్టలేదు. మనసులో ఏదో గుబులు. అమ్మ వైపు చూశాను. చీకట్లో ఆమె స్పష్టంగా కన్పించలేదు. అమ్మను తలుచుకుంటే గర్వం కలిగింది. కొండలా మహోన్నత వ్యక్తిత్వం. అర్థరాత్రి కంటే చిక్కని, ఆగాధాన్ని మించిన లోతైన హృదయం. ఆమెను గురించిన ఆలోచనలతో నిద్ర నా దరికే రాలేదు.

చిన్నప్పటినుంచి నేను చూస్తూనే ఉన్నాను. జిప్సీ మహిళలు తమ పొడవాటి వేళ్ళ మధ్య కార్డులు పట్టుకొని అదృష్టాలు చెప్పడం. అందుకు వాళ్లు అప్పుడప్పుడూ ప్రకృతి లేదా కనిపించని దైవశక్తులను నమ్ముతూ ఆసరా చేసుకోవడం.

జాతకాలు చెప్పే ప్రతిఒకరూ కిటికీ తెరిచి ఒక రాత్రివేళ బయట చీకట్లోకి ధాన్యపు గింజల్ని ఎగరేస్తారు. తద్వారా గాలి వేగాన్నీ చప్పుడునూ చెవొగ్గి వింటారు. ఒకవేళ గాలి నిలకడగా ప్రశాంతంగా వుంటే తిరిగి వొస్తానని వాగ్దానం చేసి ఇంట్లోంచి వెళ్ళిపోయిన వ్యక్తి సజీవంగా ఉన్నట్టు. అదే గాలి ఈలలువేస్తూ వేగంగా వీచి కిటికీలు చప్పుడుచేస్తూ కొట్టుకుంటుంటే అర్థం ఇంట్లోంచి వెళ్లిన ఆ మనిషి కోసం ఇక వేచిచూడటం అనవసరం. అతనెప్పటికీ తిరిగిరాడని అర్థం.

యుద్ధం జరిగే సందర్భాల్లో తప్ప ప్రజలు మామూలుగా జిప్సీలను పట్టించుకునే వారుకాదు. మామీద అంతగా దృష్టి పెట్టేవారు కాదు. మాకు జరుగుబాటు కష్టంగా వుండేది. అలాంటి గడ్డురోజులు, పరిస్థితుల గురించి అమ్మకి బాగా తెలుసు. ఆ స్థితిలో ఆమె ఊరికే ఉండకుండా మగవాళ్లకు పనుల్లో సాయం చేస్తునో, పశువులు.. జంతువుల సంరక్షణలోనో గడుపుతుంది. జిప్సీల గోవులను, గుర్రాలను కాస్తుంది. వాటికి మేత వేస్తుంది. నీళ్ళు పెడుతుంది. వాటితో కలిసిమెలిసి వుంటుంది. వాటి భాషల్లో వాటితో మూగగా ముచ్చటిస్తుంది.

***

యుద్ధం భీకరరూపం దాల్చింది. దేశమంతా అట్టుడికి పోయింది. విధ్వంసాలు, చావులతో ఎక్కడ చూసినా సమర వాతావరణమే. పిడుగుల్లాంటి యుద్ధవార్తలు. మారణహోమాలు. హిట్లర్ సైనికుల దాడులు, వారి అరాచకాలు. యుద్ధ విమానాలు.. అవి కురిపించే బాంబుల వర్షం.. ఫిరంగుల మోతలు.

అలాంటి సమయంలో భయపెట్టే కొన్ని వార్తలు (పుకార్లు) గాలికన్నా వేగంగా వ్యాపించి మాకు చేరాయి. దేశంలోని పలుప్రాంతాల్లోని క్యాంపులను తొలగిస్తున్నారు. వాటిని నేలమట్టం చేస్తున్నారు. అందరినీ అక్కణ్ణుంచి తరిమేస్తున్నారు. ఒక క్యాంపులో నివాసితులందరినీ వరుసబెట్టి తుపాకులతో కాల్చేశారనే వార్త. తర్వాత మరో క్యాంపు.. ఇంకో క్యాంపు. అంతటా ఘోరమే.. నరమేధమే. ఇంకొన్ని చోట్ల నివాసితులను బలవంతంగా ఎక్కడో గుర్తుతెలియని ప్రదేశంలో కాన్సంట్రేషన్ క్యాంపుకు తరలిస్తున్నారు.

కొంతకాలానికి ప్రపంచాన్ని, ముఖ్యంగా రష్యన్లని వొణికించిన మహాయుద్ధం చిట్టచివరికి ముగిసిపోయింది. ఈ ప్రకటన వెలువడగానే మేమంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నాం. మా జిప్సీ తెగ అంతా మళ్ళీ ఒకచోటికి చేరుకున్నాం. మాకు ఎవరినైనా కలుసుకునేందుకు, ఆత్మీయంగా పలుకరించుకునేందుకు, ప్రేమగా ఆలింగనం చేసుకునేందుకు స్వేచ్ఛ దొరికింది.

కానీ అప్పటికి మాలో మిగిలింది కొద్దిమంది మాత్రమే. అసలే చిన్నదైన మా తెగ మరింత చిన్నదైంది. అయినా ప్రజలకు జాతకాలు చెప్పే మాలోని ఆచారం ఇప్పటికీ పొలేదు.

జర్మన్లతో పోరుకు యుద్ధరంగంలో దూకిన పురుషులు ఇంకా తిరిగిరాని ఇళ్లలో కుటుంబ సభ్యుల ఆందోళన, ముఖ్యంగా వారి భార్యల ఆశ నిరాశల ఊగిసలాట. ఇంకా కొనసాగుతూనే వున్నది. యుద్ధంలో మరణించిన వారి సమాచారాన్ని దృవీకరిస్తూ జారీ అయిన నోటీసులు తమకు అందినా, ఏమూలో ఆశ చావని స్త్రీలు జిప్సీలను ఇంట్లోకి పిలిచి జాతకం చెప్పమని అడుగుతారు.

“చాలా జాగ్రత్తగా చూసి అదృష్టం చెప్పమ్మా! మావారు చనిపోలేదని నా మనసు చెపుతుంది. ఎక్కడో బతికే ఉండొచ్చుగా. చనిపోయినవాళ్ళ జాబితాలో అధికారులు మా ఆయన పేరు పొరపాటున నమోదు చేసి వుంటారు. దయచేసి నువ్వయినా చెప్పు” ఒకామె రోదిస్తూ అడుగుతుంది.

అమ్మ ఆ స్త్రీ వంక ఒకింత సానుభూతితో చూసి సంచిలో నుంచి కార్డులు బయటికి తీసి జాతకం చెపుతుంది. అప్పుడు కూడా ఎప్పటిలాగే కుండబద్ధలు కొట్టినట్టు నిజాలు చెప్పకుండా దాచిపెట్టి ఊరట వాక్యాలు పలుకుతుంది. ఆవిధంగా మహిళ మనసులో మిణుకుమిణుకుమనే ఆశల వత్తిని తన జాతకంతో ఎగదోసింది. భర్త యుద్ధంలో మరణించాడని ఖచ్చితంగా చెపితే ఆ గృహిణి గుండె తట్టుకోలేదు. అమ్మ చెప్పేది వింటూ నేను మౌనంగా ఉండిపోయాను.

ఒకరోజు మార్కెట్లో ఒక అమ్మాయికి నా జీవితంలోనే మొదటిసారిగా అదృష్టం చెప్పాను. నేను పట్టుకున్న కార్డుల్లో నుంచి ఒక కార్డు తీయమని ఆమెను కోరాను. ఆమె సంశయిస్తూనే తీసింది. అది ప్రేమ ఖచ్చితంగా ఫలిస్తుందని సూచించే లక్కీ కార్డు. ఆ కార్డులోకి చూస్తూ త్వరలో ఆమెకు గొప్ప అదృష్టం పట్టబోతుందని, అంతా శుభం జరుగుతుందని ఆశాజనంగా చెప్పాను. దానికా అమ్మాయి సంతోషించి నాకో రోబుల్ బహుమతిగా ఇచ్చింది.

జాతకం నా విద్య, నావృత్తి. అది చెప్పి నేనామెకు సంతోషం కలిగించాను. అది తాత్కాలికమే కావొచ్చు. కానీ ఆమెకు ఆనందాన్ని పంచాను. అట్లా ఒక్క ఆమె మాత్రమే కాదు, మీరూ.. అందరు కూడా సంతోషంగా ఉండాలి.

ఆనందాన్ని పంచడమే మా పని. దేవుడు కూడా మీకు తోడుండుగాక. అందరికీ జాతకాలు చెప్పే జిప్సీల జీవితాలు, వాళ్ళ జాతకాల గురించి దయచేసి ప్రపంచానికి తెలియజేయండి. ప్రజలకు తెలిసేలా చెప్పండి. జిప్సీల గురించి జనానికి తెలిసింది చాలా తక్కువ. దేవుడు మీకు మేలు చేస్తాడు. మిమ్మల్ని చల్లగా చూస్తాడు.

మూలం: స్వేత్లానా అలెక్సివిచ్ (బెలారస్)

అనువాదం: ఎ.యం.అయోధ్యారెడ్డి


స్వేత్లానా అలెక్సివిచ్ పరిచయం

బెలారస్ సాహితీ సంచలనం స్వేత్లానా అలెక్సివిచ్ 1948లో సోవియట్ రిపబ్లిక్ హయాంలో ఉక్రెయిన్ లోని స్టానిస్లావివ్లో జన్మించారు. తండ్రి బెలారస్, తల్లి ఉక్రేనియన్ దేశస్థులు. తండ్రి సైన్యంలో పనిచేశారు. అతని ఉద్యోగ విరమణ తర్వాత కుటుంబం బెలారస్‌లో స్వంత గ్రామానికొచ్చి స్థిరపడ్డారు. ఆమెకు చిన్నతనం నుంచీ రచన పట్ల అభిరుచి ఉన్నది. స్కూల్లో చదువుకునే రోజుల్లోనే స్కూలు వార్తాపత్రిక కోసం కవితలు, వ్యాసాలు రాస్తూ సాహితీ అభిరుచిని పెంపొందించుకున్నది.1972లో మినుస్క్ వర్శిటీలో జర్నలిజంలో డిగ్రీ పూర్తిచేశారు. ఇంకోపక్క రచన సాగించారు. కథ, నవల, వ్యాసం, వార్తాకథనం తదితర ప్రక్రియల్లో కృషి చేశారు.

ప్రసిద్ధ బెలారస్ రచయిత అలెస్ అదమోవిచ్ రచనలతో ఎక్కువగా ప్రభావితురాలైంది. తన రచనా జీవితంలో రెండో ప్రపంచ యుద్ధం, సోవియట్ పతనం, ఆఫ్గన్ యుద్ధం, చెర్నోబిల్ విపత్తు వంటి చారిత్రక ఘటనలకు సంబంధించిన జ్ఞాపకాలు, అనుభవాలు నవలీకరించి సాహిత్యంలో నిక్షిప్తం చేయగలిగారు. కేవలం వాస్తవాలు, సంఘటనలకు పరిమితం కాకుండా మనిషి మనోభావాలను చారిత్రీకరించే దిశలో కృషిచేశారు. ఆమె తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని అలవర్చుకున్నది. రచనా విధానం భిన్నం, విలక్షణం. ఒక కాలంలో జరిగిన ప్రధాన సంఘటనల్లో ప్రమేయం వున్న లేదా చూసిన వారిని కలిసి విషయసేకరణ జరిపి రాయడం ఆమె ప్రత్యేకత. చరిత్ర వాస్తవాలను అర్థం చేసుకునేందుకు, నిక్షిప్తం చేయడానికి ఇది ఉపయోగమని భావించారు.

“నిజ జీవితానికి దగ్గరగా వుండే వినూత్న రచనా విధానాన్ని ఆవిష్కరించాలనేది నా ఆకాంక్ష. ఆ దిశగానే కృషిచేశాను. వాస్తవికత నన్నెప్పుడూ ఆయస్కాంతంలా ఆకర్షిస్తుంది. అశాంతికి గురిచేస్తుంది. మంత్రించి వేస్తుంది. దాన్ని కాగితం మీద పెట్టాలన్న తపనతో ఊగిపోతాను. జనం వాణి, అంగీకారాలు, సాక్ష్యాలు, ఆధారాలు, పత్రాలను నా రచనకు మూలాధారం చేసుకున్నాను. నా సృజన యావత్తూ సజీవమైందే. ఈ మార్గంలోనే ఒక రచయిత్రిగా, రిపోర్టరుగా, సామాజికవేత్తగా, సైకాలజిస్టుగా ఉండగలిగాను” అని పలు ఇంటర్వ్యూలలో చెప్పుకున్నారు. స్వేత్లానా ఎన్నో రచనలు రంగస్థల నాటకాలుగా, చలన చిత్రాలుగా రూపొందాయి. ఆమె కృషికి గుర్తింపుగా ప్రభుత్వం నుంచి, పలు ప్రతిష్ఠాత్మక ప్రయివేట్ సంస్థల నుంచి అవార్డులు పొందారు. 2015లో నోబెల్ పురస్కారం వచ్చింది. సాహిత్యానికి నోబెల్ పొందిన మొదటి బెలారస్ రచయిత్రి ఈమెనే.

1983లో తొలి నవల ‘ది ఆన్ ఉమన్ లీ ఫేస్ ఆఫ్ ది వార్’ ప్రచురణకు అనేక అడ్డంకులొచ్చాయి. సహజవాదం, శాంతివాదం, సోవియట్ మహిళ డిగ్లోరీఫికేషన్ అంశాలపై ఆరోపణలు ఎదుర్కొన్నారు. 1985లో మిఖాయిల్ గోర్బచేవ్ హయాంలో ఈ నవల మాస్కోలో ప్రచురణై తక్కువ సమయంలో 20 లక్షల ప్రతులు అమ్ముడయింది. ఇదో కొత్త ఆవిష్కరణగా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ నవల కొత్త ప్రయోగమని, రెండో యుద్ధం తాలూకు మరుగున పడిన కోణాలెన్నిటినో తెలిపిన మహిళల మోనోలాగ్ ల సమాహారమని కొనియాడారు. ఇదే ఏడాది ‘ది లాస్ట్ విట్నెసెస్:100 ఆన్ చైల్డ్ లైక్ స్టోరీస్’ పేరుతో రెండో పుస్తకం వచ్చింది. ఇది మహిళలు, పిల్లల దృక్కోణంలో రాయబడి యుద్ధ సాహిత్యంలో కొత్త ఉరవడికి నాంది పలికింది. 1989లో ‘జింకీ బాయ్స్’ అనే యుద్ధ నేపధ్య నవల రాశారు. సోవియట్-ఆఫ్గన్ యుద్ధంలో అసువులు బాసిన అధికారులు, సైనికుల గురించి ఇందులో చిత్రించబడింది. యుద్ధంలో అమరులైన వారి తల్లులు, భార్యలను కలుసుకొని దాదాపు వందమందిని ఇంటర్వ్యూ చేసి ఈ సంకలనం చేశారు.

ఆమె తనదైన సరికొత్త విలక్షణ నాన్ ఫిక్షన్ ప్రక్రియను సాహిత్యంలో సృష్టించారు. వేలాది గొంతుకలు వినిపించే స్వరాలను నవలలుగా మలిచారు. ఇంటర్వ్యూల ఆధారంగా ఎన్నో ఆత్మ ఘోషలను కాగితంపై రికార్డు చేశారు. 1993లో వొచ్చిన ‘ఎన్ఛాన్టెడ్ విత్ డెత్’లో సోవియట్ రిపబ్లిక్ విచ్చిన్నం, ఆ సమయంలో విషాదకర ఆత్మహత్యల నేపధ్యాన్ని చిత్రించారు. 1997లో ‘ది చెర్నోబిల్ ప్రేయర్: ది క్రానికల్స్ ఆఫ్ ది ఫ్యూచర్’ వొచ్చింది. ఇందులో చెర్నోబిల్ విపత్తు తదనంతరం ప్రజలు కొత్త వాస్తవికథకు ఏవిధంగా అలవాటు పడ్డారు అనే అంశానికి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. తర్వాత “సెకెండ్ హ్యాండ్ టైమ్”తో స్వేత్లానా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందారు.

ఆమె పొందిన పురస్కారాల్లో నోబెల్ బహుమతి, జర్మనీ బుక్ ట్రేడ్, ఫ్రెంచి ప్రిక్స్ మెడిసిస్, రిజార్డ్ కపుచినొస్కీయ్ అవార్డు, యాంజెలెస్ కేంద్రీయ ఐరోపా పురస్కారం, నేషనల్ బుక్ క్రిటిక్స్ అవార్డు, ఏరిచ్ రెమరుక్ శాంతి బహుమతి, ఆండ్రీ సిన్యవస్కీ బహుమతి, ఆర్డర్ ఆఫ్ ది బ్యాడ్జ్ ఆఫ్ హానర్ (యూఎస్ఎస్ఆర్) ముఖ్యమైనవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here