సంచిక – స్వాధ్యాయ – సాహితీ సమావేశం (23 ఏప్రిల్ 2023) – నివేదిక

1
9

[dropcap]సం[/dropcap]చిక – స్వాధ్యాయ – తెలంగాణ భాషా సాంస్కృతిక ఆధ్వర్యంలో సంచిక రచయితల సమావేశం హైదరాబాదులోని తెలంగాణ స్టేట్ ఎస్. సి. స్టడీ సర్కిల్ ప్రాంగణంలో 23 ఏప్రిల్ 2023 నాడు జరిగింది.

తెలంగాణ స్టేట్ ఎస్. సి. స్టడీ సర్కిల్ డైరక్టర్, ప్రముఖ కవి శ్రీ శ్రీధర్ చౌడారపు నేతృత్వంలో, సంస్థ సిబ్బంది తగిన సౌకర్యాలు కల్పించి, చక్కని ఆతిథ్యమిచ్చారు.

ఈ సమావేశానికి రచయితలతో పాటు, వారి సంబంధీకులు, స్డడీ సర్కిల్ విద్యార్థులు హాజరయ్యారు. కోవెల సంతోష్ కుమార్ గారి మిత్రులు వీరభద్రుడు, అరుణ్ – వీడియో చిత్రీకరణలో సహకరించారు.

రచయితలు:

సర్వశ్రీ/శ్రీమతి..

1) కస్తూరి మురళీకృష్ణ 2) కోవెల సంతోష్ కుమార్ 3) శ్రీధర్ చౌడారపు 4) కొల్లూరి సోమశంకర్ 5) విహారి (జేయస్ మూర్తి) 6) సుధామ 7) శ్రీధర మూర్తి 8) డా. సి. భవానీదేవి 9) అత్తలూరి విజయలక్ష్మి 10) డా. తుమ్మలపల్లి వాణీ కుమారి 11) వారణాసి నాగలక్ష్మి 12) జొన్నలగడ్డ శ్యామల 13) మద్దూరి బిందుమాధవి 14) సుధామణి నంద్యాల 15) గుండాన జోగారావు 16) డా. చిత్తర్వు మధు 17) వేదాంతం శ్రీపతి శర్మ 18) కౌండిన్య తిలక్ (కుంతి) 19) వేదాల గీతాచార్య 20) ఆసూరి హనుమత్ సూరి 21) కిరణ్‌కుమార్ సత్యవోలు 22) మున్నూరు నాగరాజు 23) డా. ఇమ్మడిశెట్టి చక్రపాణి 24) అనుముల చక్రపాణి 25) యేరువ శ్రీనాథరెడ్డి 26) శ్రీరాం కిశోర్ (సదరన్ స్ప్రింగ్స్ పబ్లిషర్స్) 27) డా. రాయపెద్ది వివేకానంద.

విద్యార్థులు/ఇతరులు

28) ఘండికోట విశ్వనాధం 29) డా. శర్మ 30) రామకృష్ణ 31) శ్రీకాంత్ 32) అనిల్ కుమార్ 33) శివరాం 34) విష్ణువర్ధన్ 35) నంద్యాల గౌతమ్ 36) సురేఖ నంద్యాల 37) ఋషీకేశ్ నంద్యాల 38) వీరభద్రుడు 39) అరుణ్

***

కస్తూరి మురళీకృష్ణ రచయితలని ఆహ్వానించి, ఎజెండా వివరించి – రచయితలని పరిచయం చేశారు. సంచిక స్వాధ్యాయ సంయుక్త కృషిని క్లుప్తంగా వెల్లడించారు.

అనంతరం ‘రామకథాసుధ’ సంకలనంలో ఎంపికైన కథలు అందించిన రచయితలకు (సమావేశంలో ఉన్నవారికి) పుస్తకం కాపీలు సీనియర్ రచయితల చేత ఇప్పించారు.

శ్రీ కౌండిన్య తిలక్ (కుంతి) గారికి విహారి గారు పుస్తకం అందజేశారు. తర్వాత కౌండిన్య తిలక్ గారు పుస్తకంలోని తన కథా నేపథ్యాన్ని వివరించారు. తనకి అత్యవసరమైన ఆఫీసు పని  ఉన్నందున – కౌండిన్య తిలక్ గారు అందరిని మన్నించమని కోరి, వీడ్కోలు తీసుకున్నారు. నంద్యాల సుధామణి గారికి సుధామ గారు పుస్తకం అందజేయగా, సుధామణి గారు తన కథ నేపథ్యం వివరించారు. వేదాంతం శ్రీపతిశర్మ గారికి పుస్తకం ప్రతిని శ్రీధర మూర్తి గారు అందజేశారు. శ్రీపతిశర్మ తన కథ గురించి వివరించారు. జొన్నలగడ్డ శ్యామల గారికి, నంద్యాల సుధామణి రామకథాసుధ పుస్తకాన్ని అందచేశారు.

అనంతరం కస్తూరి మురళీకృష్ణ మాట్లాడుతూ సంచిక రీడర్‌షిప్ క్రమంగా పెరుగుతోందనీ, కానీ monetise చేయడానికి సరిపోదని తెలిపారు. చదివే వారి సంఖ్య ఎందుకు తగ్గుతోందో చెప్పి, ఆడియో కథల ప్రభావం చదివే అలవాటుపై ప్రభావం చూపుతోందని తెలిపారు. సంచిక రీడర్‌షిప్‌ని పెంచేందుకు సూచనలను కోరారు.

కోవెల సంతోష్ కుమార్ గారు మాట్లాడుతూ – ప్రస్తుతం మాధ్యమాలు మారుతున్నాయని, సంచిక – వాట్సప్‌ని, ఫేస్‍బుక్‌ని ఉపయోగించుకుంటున్నా, ఇంకా చేయాల్సింది చాలా ఉందని అన్నారు. ఆడియోని పూర్తిగా పక్కన పెట్టనక్కరలేదని అన్నారు. కథని చెప్పాలి కేవలం చదువుకునేలా కాక, అనుభూతి చెందేలా పాత్రలను తీర్చిదిద్దాలని అన్నారు. రచయితలు ఎవరి రచనలను వారు ప్రొమోట్ చేసుకోవడమే కాకుండా, తోటి రచయితల రచనలని వీలైనంత ఎక్కువమందికి చేర్చాలని అన్నారు. ఏ ఒక్క రచననో కాకుండా మొత్తం మేగజైన్‍ని అంతా చదవగలిగే విధానం సంచిక తేవాలన్నారు. యువతరాన్ని ప్రోత్సహించాలనీ, వారిలో పఠనాసక్తిని పెంచేందుకు విద్యాసంస్థలను దర్శించి, విద్యార్థులకు పోటీలు నిర్వహించి, వారిని కన్విన్స్ చేయాలని అన్నారు.

సుధామ గారు మాట్లాడుతూ – సంచిక కేవలం సాహిత్యానికే పరిమితమైన పత్రిక అనీ – ఇతర పత్రికల్లా రాజకీయ అంశాలు కూడా ప్రచురిస్తే – రీడర్‍షిప్ పెరిగేదనీ, కాని సంచిక సాహిత్యానికే కట్టుబడిందని అన్నారు. మారుతున్న ప్రాధాన్యతల వల్ల చదవడంపై ఆసక్తి తగ్గుతోందని అన్నారు. రచయితలు తమ రచనలతో పాటుగా సంచికలోని ఇతర రచనలను షేర్ చేయాలని కోరారు. ఆడియో/యూ-ట్యూబ్ చానల్స్ పెరిగిపోతున్నాయనీ, కానీ కథని సరిగ్గా చదవడం రాకపోతే ప్రయోజనం ఉండదని అన్నారు. ఒక్కప్పుడు ఆకాశవాణిలో చదవాలంటే ఆడిషన్ టెస్టులు ఉండేవని గుర్తు చేశారు. అందరూ తమ రచనలను తామే గొప్పగా చదవలేరని, అందువల్ల ఆడియో కథలు కొన్నిసార్లు వినడానికి ఆసక్తిగా ఉండవని అన్నారు. వెబ్ పత్రికల రచనలను మొబైల్‍లో చదవాలంటే కాస్త కష్టమని, అదే ఐపాడ్/లాప్‌టాప్‍లలో పర్వాలేదని అన్నారు. సంచికలో అక్షరాల సైజు పెద్దదిగా ఉండాలనీ, విషయ సూచిక ఉండాలనీ, ఇండెక్స్ లోని ఆర్టికల్స్ క్లిక్ చేసేలా ఉండాలని అన్నారు. జూమ్ చేసుకునేటట్టు మాత్రమే కాకుండా ఫాంట్ సైజ్ పెంచుకునేటట్టు ఉండాలని అన్నారు. రచయితలు సంచికలో తమకి నచ్చిన కథలను ప్రొమోట్ చేయాలని కోరారు. ప్రతీ రచనకీ సమీక్ష ఉండాలనీ; ఉత్తమ సమీక్షకి బహుమతి ఉండాలని అన్నారు. సమీక్షలు/అభిప్రాయాలు సమగ్రంగా ఉండాలని అన్నారు. సంచికలో రచనల క్రింద కామెంట్స్‌లా మాత్రమే కాకుండా పాఠకుల లేఖలు అనే శీర్షికని నిర్వహిస్తే చాలామంది సంచికని చదివే అవకాశం ఉంటుందని అన్నారు.

డా. చిత్తర్వు మధు గారు మాట్లాడుతూ సంచిక తనని ఎంతగానో ప్రోత్సహించిదని తెలిపారు. సాహిత్యంలో అన్నీ జానర్స్ – సంచికలో ఉండాలని అన్నారు. కుటుంబ కథలు ఎక్కువగా ఆదరణ పొందుతున్నప్పటికీ, అపరాధ పరిశోధన కథలు, రొమాంటిక్ కథలు, సైన్స్ ఫిక్షన్ కథలను మరిన్ని ప్రచురించాలని కోరారు. కాంట్రోవర్సీలు సృష్టిస్తే కథలకి ప్రచారం వస్తుంది కానీ ఆ పద్ధతి మనకి అవసరం లేదన్నారు. ప్రతి నెల/వారం ఆ సంచికపై సమీక్ష చేయాలి. యువతరాన్ని చేరుకోవాలి. బహుమతులు ఇవ్వాలి. పాఠకుల వయస్సుని కూడా పరిగణనలోకి తీసుకుని మన నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. కుటుంబ కథలలో యువతరానికి ప్రాధాన్యత నివ్వాలని; వారి ఆలోచనలను కథల్లో ప్రతిబింబిస్తే యూత్ కనెక్ట్ అవుతారని అన్నారు. విదేశాలలోని తెలుగువారు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఆడియోలు వింటూ వెళ్తారని అన్నారు. ఆడియో కథలు చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలని, వీడియోలకి చక్కని thumbnails ఇవ్వాలని అన్నారు. సైన్స్ ఫిక్షన్ కథలని ప్రోత్సహించాలని అన్నారు. హారర్, హాస్య కథల ద్వారా ఎక్కువమందిని చేరే అవకాశం ఉంటుదని అన్నారు.

మద్దూరి బిందుమాధవి గారు మాట్లాడుతూ – తానో రిటైర్డ్ బ్యాంకర్‍ని అనీ, సామాజిక అంశాలలో తెలుగు సామెతలని అన్వయిస్తూ రాసిన రచనల వల్ల తనకి గుర్తింపు వచ్చిందని తెలిపారు. సామెత కథలతో పాటుగా, శతక పద్యాల కథలు కూడా రచించానని తెలిపారు. తాను ఫేస్‍బుక్‌లో రాసుకుంటున్నప్పుడు మురళీకృష్ణగారు గమనించి, తనని సంచికకి రాయమని అడిగారని తెలిపారు. రేడియోని ఉపయోగించుకుని సంచికని ప్రమోట్ చేయగలిగితే ఎక్కువ మందిని చేరుకోవచ్చని సూచించారు. ఎఫ్.ఎం. రేడియోల యాంకర్లతో సంచిక రచనలని చదివిస్తే ఉపయోగం ఉండవచ్చని అన్నారు. విభిన్నమైన రచనలను చదివిస్తే పబ్లిక్ లోకి వెళ్ళగలిగే అవకాశం ఉంటుందని అన్నారు. మొబైల్‍లో చదవాలంటే ఇబ్బందిగా ఉందని, ఫాంట్ సైజ్ పెంచాలని కోరారు. ఓ పత్రికని ఉదహరిస్తూ పిడిఎఫ్ వెర్షన్‌లా తయారు చేయడం వల్ల – తమ రచన కోసం దాదాపు అన్ని పేజీలు స్క్రోల్ చేయాల్సి వచ్చిందని అన్నారు. సంచికలో clickable links ఉంటాయి కాబట్టి సులువుగా ఉందని అన్నారు. సాంకేతికతని ఉపయోగించి పత్రికని ఇంకా మెరుగుపర్చాలని అన్నారు. ఎఫ్.ఎం. రేడియో యాంకర్లకి అవసరమైన శిక్షణనిచ్చి, చక్కని expression, ఉచ్చారణతో చదివించగలిగే ఉపయోగపడచ్చని అన్నారు.

కిరణ్ కుమార్ సత్యవోలు గారు మాట్లాడుతూ – ఇయర్‍హుక్ అనే సంస్థ ద్వారా తాము ఆడియో కథలు, ఆడియో నవలలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఆడియోలో సరిగా చదవకపోతే శ్రమ వృథా అవుతుందని అన్నారు. తాము ప్రొఫెషనల్ ఆర్టిస్టుల చేత చదివిస్తామని తెలిపారు. సంచిక పాపులర్ అవ్వాలంటే మరింత user-friendly గా ఉండాలని అన్నారు. కథలు genre wise గా ఉండాలని అన్నారు. అప్పుడు ఏ రచనలకి ఎక్కువ ఆదరణ ఉందో stats తెలుస్తాయని అన్నారు. యువ పాఠకులని ఆకర్షించేలా క్రైమ్, డిటెక్టివ్, హారర్ జానర్స్‌లో రచనలు ప్రచురిస్తే ఉపయోగం ఉండవచ్చని అన్నారు. సంచికలో, genre wise, writer wise – రచనల లిస్ట్ ఇస్తే బావుంటుందని అన్నారు.

విహారి గారు మాట్లాడుతూ – ప్రతి పత్రిక, తన target group ఏదో తెలుసుకోవాలని అన్నారు. దాన్ని నిర్ణయించుకోడం పత్రిక యాజమాన్యంపై ఆధారపడి ఉంటుందన్నారు. సంచిక నిర్వాహకులకు ఈ విషయంలో లోతైన అవగాహన ఉన్నట్లు అనిపిస్తుందని అన్నారు. సంచికలో విభిన్న అంశాలకి ప్రాధన్యత నిస్తున్నారు. కొన్ని సెక్టార్లని వదిలేశామా అని ఆలోచించుకోవాలి. సంచికలో వస్తున్న తన సీరియల్ జగన్నాథ పండితరాయలుని ఎవరైనా చదువుతున్నారా అసలు అని ఓ విమర్శకుడు అడిగారని తెలిపారు. (కస్తూరి మురళీకృష్ణ అందుకుని – ఆ సీరియల్‍కి చక్కని రెస్పాన్స్ వస్తోందని అన్నారు). భాషకీ, సాహిత్యానికి దగ్గర సంబంధమనీ, ఈ రెండిని ఎలా మిక్స్ చేయగలమో ఆలోచించాలని అన్నారు. ప్రత్యేకమైన పాఠకులను ప్రోత్సహించే పద్ధతి ఉండాలని అన్నారు. పత్రిక పాఠకులని గుర్తించాలని అన్నారు.

వారణాసి నాగలక్ష్మి గారు మాట్లాడుతూ – ఇది ఒక రౌండ్ టేబుల్ సమావేశంలా అనిపిస్తోందని అన్నారు. సంచికలో మంచి సాహిత్యం ఉన్నా ఎక్కువమందికి ఎందుకు చేరలేకఫోతోందనేదే ప్రశ్న అన్నారు. ‘నాకు నచ్చిన కథ/రచన’ అనే పోటీ పెడితే బావుంటుంది. మానెటరీ బెనిఫిట్ అందించలేకపోయినా, పుస్తకాలు బహుమతిగా ఇవ్వచ్చని అన్నారు. అప్పుడు పోటీలో పాల్గొన్న వారిది, గెలిచిన వారి దృష్టి సంచికలోని ఇతర రచనలపై కూడా పడే అవకాశం ఉంటుందని అన్నారు. యువతని ఆకట్టుకునేలా రూపొందించాలని అన్నారు. ఒక టాపిక్ మీద అయినా పోటీ ఉండాలి, బహుమతి ఉండాలి అని అన్నారు. కాలేజీ విద్యార్థులుకి భాష/సాహిత్యం మీద పోటీలు పెట్టి పుస్తకాలు బహుమతిగా ఇస్తే బాగుంటుందని అన్నారు.

నంద్యాల సుధామణి గారు మాట్లాడుతూ – తాను మాజీ జర్నలిస్టునని చెబుతూ – ఆడియో కథలు బాగా వెళ్తాయని, వాటిని పడుకుని కూడా వినచ్చని అన్నారు. అయితే రచనలని భావస్ఫోరకంగా చదవాలని అన్నారు. ఎఫ్.ఎం. రేడియోలను ఉపయోగించుకోవటం మంచి ఆలోచన అని అన్నారు. విద్యార్థులకు సంచికని పరిచయం చేసి వారిని ఆకట్టుకునేలా చేయాలని కోరారు.

జొన్నలగడ్డ శ్యామల గారు మాట్లాడుతూ – ఆడియో ఛానల్స్ వల్ల ప్లస్‍లు, మైనస్‍లు రెండూ ఉన్నాయని అన్నారు. ఆడియో ప్రశాంతంగా వినడానికి చాలా మంది ఇళ్ళల్లో అంత వీలుగా ఉండకపోవచ్చని అన్నారు. అందుకని పుస్తక రూపమే ఉత్తమమని అన్నారు. వినడం కన్నా, చదవడంలో ఆ రచనని ఎక్కువగా అనుభూతి చెందగలమని అన్నారు. తాను ఆడియో వద్దని అననని, వ్యక్తిగతంగా తనకి పుస్తకమే బావుంటుందని అన్నారు. కొత్త పాఠకుల కోసం సంచిక యువతని ఆకట్టుకోవాలని సూచించారు. రచనల్లో యువత ఆలోచనలను ప్రతిబింబించాలని, వాళ్ళల్లో ఉత్సాహం ఉన్న వారి చేత రాయించాలని అన్నారు. విశ్వవిద్యాలయాలకి వెళ్లి విద్యార్థులలో సాహిత్యాభిలాష ఉన్నవారిని గుర్తించాలని సూచించారు. సంచిక ప్రచురించిన/సంచిక రచయితల పుస్తకాలను బహుమతులుగా ఇవ్వాలని అన్నారు. స్కూళ్ళు, కాలేజీలలో చర్చా కార్యక్రమాలను నిర్వహించాలని, సంచిక గురించి చెప్పాలని అన్నారు.

శ్రీధర్ చౌడరపు గారు మాట్లాడుతూ – తన బాల్యం నుంచి పుస్తకాలు చదివే అలవాటు అబ్బిందని, డబ్బు ఆదా చేసి పుస్తకాలు కొని చదివేవాడినని తెలిపారు. ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత ఇంట్లో వ్యక్తిగత గ్రంథాలయం అమర్చుకోగలిగానని తెలిపారు. సంచిక రీడర్‍షిప్ కోసం ప్రతి రచయిత వ్యక్తిగతంగా కృషి చేయాలని అన్నారు. ఫేస్‌బుక్‍లో మన వాల్ మీద మాత్రమే పోస్ట్ చేయకుండా, మన రచనల లింక్‍ని షేర్ చేయమని మిత్రులను కోరాలని తెలిపారు. ఉదాహరణగా సంచిక రచయిత శ్రీ శ్యామ్‍కుమార్ చాగల్ గారు పాటించే పద్ధతిని వివరించారు. సంచిక పత్రిక ప్రతి ఒక్కరికీ అవకాశం ఇస్తోందని అన్నారు. స్త్రీవాదం, దళితవాదం, వామపక్షవాదం, సాంప్రదయవాదం అంటూ – సంపాదకుల నిరంకుశత్వం ఏదీ లేదని, సంచిక free to all అని అన్నారు. మన లాభంతో పాటు పత్రిక లాభం కూడా చూడాలన్నారు. రచనలలోని పాత్రలను పాఠకులు own చేసుకునేలా రాయాలని, ఈ తరం పాఠకులకు నచ్చేలా రాయాలని అన్నారు. వారు రచనతో మమేకం అయ్యేలా ఉండాలని అన్నారు. రచనలలోని సంభాషణల్లో నేటి కాలపు పదాలను వాడితే ఉపయోగమని అన్నారు. ఒకప్పుడు కడుపు మండి రచనలు చేసేవారని, ఇప్పుడు కడుపు నిండి చేస్తున్నారని అన్నారు. సమస్యల పట్ల స్పందన ఉండాలని అన్నారు. ఇక ఆడియో కథలుగా చదవడంలో చదివేడప్పుడు చక్కని నేపథ్యం ఉండాలని, సంభాషణలను ఒకే తరహాగా కాకుండా different modulation తో చదవాలని అన్నారు. ఉదాహరణకి సి.ఎస్. రాంబాబు గారి ఆడియో ఛానెల్ గురించి వివరించి, ఆయన ఎలా చదివారో తన ఫోన్ ద్వారా వినిపించారు. సంచికలో రచన పూర్తి కాగానే కామెంట్ బాక్స్ ఉండాలని – ఇతర రచనలు – ట్యాగులు తర్వాత కాదని అన్నారు. కామెంట్ రాయటానికి పేరు, ఈమెయిల్ ఐడి తప్పనిసరి చేయటం వల్ల చాలామంది స్పందించరని, ఈ విషయంలో పత్రిక లిబరల్‍గా ఉండాలని అన్నారు. వీలైనన్ని clickable links ఇవ్వాలని అన్నారు. Easy navigation ఉండాలని అన్నారు. రచయితలకి వారి రచనల హిట్స్ తెలియజేయాలని, అప్పుడు అవసరమైతే వారు తమని తాము మార్చుకుంటారని అన్నారు. క్వాలిటీ పెంచాలని అన్నారు. సంచిక ద్వారా మనం ప్రజలకు చేరువవుతామనీ, అలాగే మన రచనల ద్వారా సంచికనీ పది మందికి చేర్చాలని అన్నారు.

కస్తూరి మురళీకృష్ణ మాట్లాడుతూ – రచనలకి వచ్చే హిట్స్ వివరాలు బహిర్గతం చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయని, ఎక్కువ హిట్స్ వచ్చేవారికి ఆనందం కలిగినా, తక్కువ హిట్స్ వచ్చిన రచయితలకు నిరుత్సాహంగా ఉంటుందని అన్నారు. రచయితలు సున్నిత మనస్కులు అని, వారిని కాపాడుకోవాలని అన్నారు.

సంచికలో ఒకరి రచనలను మరొకరు లైక్, కామెంట్, షేర్ చెయ్యడం ద్వారా పరస్పరం ప్రయోజనం ఉంటుందని, గుడ్‍విల్ ఉంటుందని అన్నారు మురళీకృష్ణ. సంచికలో అవసరమైన సాంకేతిక మార్పులు చేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇక ఎజెండాలోని తరువాతి అంశం సంచిక బుక్ క్లబ్ గురించి మాట్లాడాకుందామని అన్నారు.

తాము సంచిక బుక్ క్లబ్‍ని ప్రతిపాదిస్తున్నమని చెబుతూ గతంలో ఉన్న ఇండియా టుడే బుక్ల్ క్లబ్, ఎమెస్కో బుక్ క్లబ్ (ఇంటింటి గ్రంథాలయం) వంటి ఉదాహరణలను పేర్కొన్నారు. సభ్యత్వం ఆధారంగా నడిచే సంచిక బుక్ క్లబ్‍ని ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలిపారు. సంచిక ప్రచురించే పుస్తకాలు, సంచిక రచయితల పుస్తకాలను ఈ క్లబ్ ద్వారా అందజేసే విధానాన్ని రూపొందించదలచినట్టు చెప్పారు. సమావేశంలో ఉన్న వారిని తమ అభిప్రాయాలు చెప్పవలసిందిగా కోరారు.

మున్నూరు నాగరాజు గారు మాట్లాడుతూ – మార్కెటింగ్ చాలా ముఖ్యమని, ప్రచారం కీలకమని అన్నారు. ఒక మంచి పుస్తకాన్ని/రచనని ప్రచారం లేకుండా మార్కెట్ చేయలేమని అన్నారు. ప్రచారం కోసం ఫేస్‍బుక్‌లో, ఇన్‍స్టాగ్రామ్‍లో పేజీ క్రియేట్ చేయాలన్నారు. లైక్, కామెంట్, షేర్ ఆప్షన్స్ కల్పించాలని, అప్పుడు నోటిఫికేషన్ ద్వారా వివరాలు తెలుస్తాయని అన్నారు. సంచిక ఫేస్‍బుక్ పేజీలో సంచిక రచనల లింక్స్ షేర్ చేయాలన్నారు (సంచిక ఫేస్‍బుక్ పేజీ ఉందనీ, కొత్త సంచిక రాగా, రచనల లింక్స్ ఆ పేజీలో షేర్ చేసే ప్రకియ ఇప్పటికే జరుగుతోందని కొల్లూరి సోమ శంకర్ తెలిపారు. సంచిక ఫేస్‍బుక్ పేజీ లింక్‍ని సంచిక రైటర్స్ గ్రూప్‍లో పెట్టమని నాగరాజు గారు అడిగారు). సంచిక ఫేస్‍బుక్ పేజీలో ప్రతి నెల ఒక రచయిత ఫోటో, పరిచయం, వారి రచనల వివరాలను అందించాలనీ, ఈ విధంగా ఒక్కో రచయితని ప్రొమోట్ చేయాలని అన్నారు. ప్రతి సంచిక విడుదలయ్యేటప్పుడు కవర్ పేజీ డిజైన్ చేసి పబ్లిష్ చేయాలని అన్నారు. కొత్త పాఠకులంతా కాలేజీలలో ఉన్నారని, సాహిత్యం ఎందుకు చదవాలో వాళ్ళకు తెలియదని అన్నారు. సంచిక కాలేజీలకి వెళ్ళి, తెలుగు లెక్చరర్స్ తోనూ, విద్యార్థులను సెమినార్‍లు ఏర్పాటు చేయాలని అన్నారు. విద్యార్థులని మాట్లాడించాలని అన్నారు. వందమంది సమావేశానికి వస్తే, వాళ్ళల్లో కనీసం పదిమంది అయినా సంచికకి పాఠకులవుతారు. ఈ విధంగా యువతని కొత్త పాఠకులుగా మార్చుకోవాలని అన్నారు. నెలలో నాలుగైదు సార్లు ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేస్తే వాళ్ళలోంచి, కొత్త పాఠకులు, కొత్త రచయితలు పుట్టుకొస్తారు. ఇది మనపై ఉన్న బాధ్యత అని అన్నారు. అందులో ఉన్న వాళ్ళు రచనల గురించి తమ అభిప్రాయం చెప్తారనీ; ఇలా చేయడం వల్ల పాఠకులు పెరగడమే కాకుండా, సంచిక గురించి తెలుస్తుందని అన్నారు.

శ్రీధర మూర్తి గారు మాట్లాడుతూ – బుక్ క్లబ్ ఆలోచన పాతదేననీ, విదేశాలలో రీడర్స్ క్లబ్‍లు ఎప్పటి నుంచో ఉన్నాయని అన్నారు. ఈ క్లబ్ సభ్యులు నవల చదివి ఒక పేరాలో సారాంశం రాసుకుంటారనీ, అలా వంద పుస్తకాల సారాంశంతో – ఒక కొత్త పుస్తకం వేస్తారని తెలిపారు. ప్రతి పుస్తకంలోని ప్లస్‍లూ, మైనస్‍లూ రాయాలని, ఈ రకంగా ఒక్కో పుస్తకం పూర్తి చేసుకుంటూ వెళ్ళాలని అన్నారు. రచన ఏదైనా చదివి, అందులోని నెగటివ్ పాయింట్స్ చెబితే కొందరు రచయితలకి కోపం వస్తోందని అన్నారు. కథ మధ్యలో అవసరమైన చోట సెపరేటర్స్ ఉండాలి, అవి లేకుండా రాస్తే పాఠకుడికి ఇబ్బంది అవుతుందని అన్నారు. ఏదైనా వివరంగా చెబితే స్పోర్టివ్‍గా తీసుకుంటారో లేదో తెలియదని అన్నారు. ఎవరికీ డప్పు కొట్టకూడదని అన్నారు. 30 ఏళ్ళ క్రితం రేడియోలో కథ చదివితే ఎంతో ఆనందంగా ఉండేదని అన్నారు. ప్రయాణాలలో ఆడియో ఫార్మాట్ చాలా ఉపయోగపడుతుందని చెబుతూ కిరణ్ ప్రభ గారి టాక్ షోల గురించి ప్రస్తావించారు. ఆయనకి లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని గుర్తు చేశారు. ఆడియో మాత్రమే కాదు, మనకి ప్రింట్ బుక్ కూడా ముఖ్యమేనని అన్నారు. ఈ సందర్భంగా సితారలో తాను వ్రాసిన రచనల గురించి చెప్పారు.

శ్రీరాం కిశోర్ గారు మాట్లాడుతూ మనం సినిమాలకి ఎంతైనా ఖర్చు పెడుతున్నాం కాని, పుస్తకాలు కొనడానికి వెనుకాడుతున్నామని అన్నారు. మాయాబజార్ సినిమా ఎందుకు ఎప్పటికీ అలరిస్తూ ఉంటుందో చెప్తూ, ఆ లక్షణాలని రచయితలకి అన్వయించారు. రచయితలు రాస్తూనే ఉండాలని, hurt కాకూడదని అన్నారు. సమాజానికి చెప్పగలిగే స్థితిలో ఉండే రచయితలు hurt కాకూడదని అన్నారు. రచయితలకి ఏదైనా చెప్పాల్సి వస్తే, వారిని మెయిల్ చేస్తే, respond అవుతారని అన్నారు. కన్నడ, తమిళ, హిందీ భాషలలోని పుస్తకాల అమ్మకాల గురించి ప్రస్తావించారు. పొన్నియన్ సెల్వన్ సినిమా తీస్తున్నారని వార్త వచ్చినప్పుడు పొన్నియన్ సెల్వన్ నవలలు అన్ని భాగాలు అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యాయనీ, వాటిలో 80% గ్లోబల్ ఆర్డర్లనీ అన్నారు. మనం న్యూస్ పేపర్ చదవడం మానేసామని, మేగజైన్లు తెప్పించటం మానేసామని అన్నారు. విభిన్నమైన పుస్తకాలను తెప్పించే లైబ్రరీలను పిల్లలకు పరిచయం చేయాలని అన్నారు. తను తమ పిల్లలతో కల్సి చెన్నై లోని కన్నిమెరా గ్రంథాలయంలో ఒక రోజంతా గడిపామని, ల్రైబ్రరీ సైన్స్ గురించి తెలుసుకున్నామని అన్నారు. సంచిక బృందం లిటరరీ టూర్స్ చేయాలని చెబుతూ ఉదాహరణకి విజయనగరం వెళ్తే అక్కడివారికి సంచిక గురించి తెలుస్తుందని, వారి ద్వారా మరికొంత మందికి చేరుతుందని అన్నారు. Literature does not come with weight అని అన్నారు. చదవడం చాలా ముఖ్యమని, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లేకపోతే చాలా కష్టమని అన్నారు. ‘నందిపురం’ అనే తమిళ పుస్తకం ధర 600 రూపాయలైనా, బాగా అమ్ముడయి, రెండు సార్లు ముద్రించారని, రెండు సార్లు అవుట్ ఆఫ్ స్టాక్ అయిందని చెప్పారు. రచయితలు గతాన్ని నోస్టాల్జియాలా కాపాడుకోవాలని అన్నారు. కొత్త పాఠకులు భవిష్యత్తు నుంచే వస్తారు తప్ప గతం నుంచి కాదని అన్నారు. పాండమిక్ సమయంలో ఎన్నో పుస్తకాలు చదివే అవకాశం దక్కిందని అన్నారు. తాము ప్రచురిస్తున్న దత్తశర్మ గారి ‘సాఫల్యం’ గురించి చెప్పారు. మనం మంచి అనుకున్నది చేస్తూనే ఉండాలని అన్నారు.

గుండాన జోగారావు గారు మాట్లాడుతూ సంచిక రీడర్‍షిప్ పెరగాలంటే ఫార్మాట్ అనుకూలంగా ఉండాలని, సంచికని ఆడియో చేయించాలని అన్నారు. వెబ్ మేగజైన్ లోని ఆర్టికల్స్ చాలా సమగ్రమైన శైలిలో ఉండాలి. విద్యార్థులకు రచనల లింక్స్ పంపించి, ఒక పూటంతా చదివించాలని, ఒక ప్రశ్నావళి రూపొందించి వారి అభిప్రాయాలని సేకరించాలని అన్నారు. వారు చదివిన వాటిల్లోంచి క్విజ్ పోటీలు పెట్టాలని, విజేతలకు బహుమతిగా పుస్తకాలిచ్చి ప్రోత్సహించాలని అన్నారు. అప్పుడు సంచిక ఎక్కువ మందికి చేరుతుందని అన్నారు. తాను రోజుకి ఐదు కథలు ఆడియోలో వింటానని, చిన్న కథలు ఎక్కువగా చదువుతానని అన్నారు. పెద్ద కథలు చదవడం బాగా తగ్గిందని తెలిపారు. బుక్ క్లబ్ మంచి ఆలోచనే అనీ, గతంలో ఇలాంటి చాలా నడిచాయని అన్నారు. నిబద్ధతతో నడుపుతున్న పత్రిక రీడర్‍షిప్‌నీ, బుక్ క్లబ్‌ని ఎలా సాఫల్యం చేసుకోగలరో ఆలోచించాలని అన్నారు.

డా. తుమ్మలపల్లి వాణీకుమారి గారు మాట్లాడుతూ బుక్ క్లబ్ ఆలోచన మంచిదే అయినా విజయవంతం అవుతోందో లేదో చెప్పలేమని అన్నారు. ప్రస్తుతం పుస్తకాలు చదివేవారి సంఖ్య బాగా తగ్గిపోయిందని వ్యాఖ్యానించారు. సంచిక పాపులర్ కావాలంటే టెక్నాలజీని ఇంకా ఎక్కువగా ఉపయోగించుకోవాలని అన్నారు. Clickable links స్పష్టంగా ఉండాలనీ, కామెంట్స్ రాయడంలో ఉన్న ఇబ్బందులని తొలగించాలని అన్నారు. సంచిక రచనలని భావస్ఫోరకంగా చదివించే ఆడియో లింక్స్ ఇస్తే ఉపయుక్తమని అన్నారు. స్కూలు/కాలేజీ పిల్లలతో రాయించి ప్రచురిస్తే, యువతని చేరవచ్చని అన్నారు.

మద్దూరి బిందుమాధవి గారు మాట్లాడుతూ బుక్ క్లబ్ ఆలోచన మంచిదేనని అన్నారు. తాను సామెత కథలతో మూడు పుస్తకాలు వేశానని, సమీక్షలు/పుస్తక పరిచయాలు వస్తే సేల్స్ బావుంటాయని అన్నారు. మనం చేసే ప్రయత్నంలో కొత్తదనం ఉంటే తప్పకుండా పాఠకులు ఆదరిస్తారని అన్నారు. తాను ఒక కాలేజీలో చేసిన కార్యక్రమం తనకి పుస్తకాల అమ్మకంలో ఎంతో ఉపయోగపడిందని అన్నారు. పుస్తక పరిచయాల వల్ల పాఠకులు పెరుగుతారని అన్నారు.

వేదాంతం శ్రీపతిశర్మ గారు మాట్లాడుతూ – అందరి అభిప్రాయాలు బావున్నాయని అన్నారు. పుస్తకాల విషయంలో తెలుగుకి, ఇతర భాషలకీ తేడా ఉందని అన్నారు. మంగుళూరులో 8-80 ఏజ్ గ్రూపులోని పాఠకులను ప్రస్తావించారు. సంచిక రీడర్‍షిప్ పెరగాలంటే మేగజైన్‍ని మార్పులు చేయాలని అన్నారు. కవర్ పేజీ, ఇండెక్స్ తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ఐడెంటిటీ కనిపించాలని, length of article ముఖ్యమని అన్నారు. సంచిక బుక్ క్లబ్/రీడర్స్ క్లబ్ విషయంలో let us make beginning అని అన్నారు. సంచిక రైటర్స్ అందరూ తోటి రచయితల రచనలను చదవాలని, వాటి మీద వాళ్ళ అభిప్రాయలను అవసరమైతే ప్రైవేటుగా తెలియజేయచ్చని అన్నారు. Confidential Criticism, Open Appreciation – రెండూ ఉండాలని అన్నారు. రెవ్యూ మంచిగా ఉంటే, ఆ ఇంపాక్ట్ వేరేలా ఉంటుందని అన్నారు. క్వాలిటీ బావుండాలని అన్నారు. Innovative ఆలోచనలు తేవాలని అన్నారు. సాహిత్యం నుంచి రూపకం వైపు తీసుకువెళ్లాలని, రేడియో last resort కాకూడదని అన్నారు. ఆడియో చేసినా, సేల్స్ గొప్పగా ఉంటాయని చెప్పలేమని అన్నారు. సంచిక రైటర్స్ ఆసక్తి  చూపితే వారి రచనలను తాను ఆడియోగా చదవడానికి సిద్ధమని అన్నారు. ఇప్పటికే తాను కొన్ని ఎంపిక చేసిన కవితలతో ఆడియోలు చేసానని అన్నారు.

డా. మధు చిత్తర్వు మాట్లాడుతూ బుక్ క్లబ్ ఎంతైనా అవసరమని అన్నారు. ప్రస్తుతం ఎక్కువ మంది రచయితలు సెల్ఫ్-పబ్లిషింగ్ చేసుకుంటున్నారని అన్నారు. తన పుస్తకాలకి nominal price పెట్టుకున్నాని అన్నారు. బుక్ క్లబ్ మాత్రమే కాకుండా పుస్తకాలను ‘యాప్’ ద్వారా కూడా విక్రయించగలిగే పద్ధతి ఆలోచించాలని అన్నారు.

కస్తూరి మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రతిపాదిత బుక్ క్లబ్ సంచిక రచయితలకీ, సంచికకీ మ్యూచువల్‍గా ఉపయోగపడేటట్లుగా రూపొందించదలచామని అన్నారు. సంచిక మాసపత్రికలో లిటరరీ సప్లిమెంట్ అందించాలన్న ఆలోచన ఈ దిశగా వేస్తున్న అడుగేనని అన్నారు.

శ్రీధర్ చౌడారపు గారు మాట్లాడుతూ – తన పుస్తక కొనుగోళ్ళ అలవాటు గురించి చెప్పారు. ఒకప్పటి ఎమెస్కో బుక్ క్ల‍బ్‌లో తాను సభ్యుడినని, ఎన్నో పుస్తకాలు కొని చదివానని తెలిపారు. సంచిక బుక్ క్లబ్ కూడా ఇలాంటిదేనని అన్నారు. సంచిక బుక్ క్లబ్ తరపున మనం ఒక్కో రచయితవి ఐదు పుస్తకాలు కొని మన మిత్రులకి ఇవ్వచ్చని అన్నారు. పుస్తకాలను ఫ్రీగా ఇచ్చే పద్ధతిని ప్రోత్సహించవద్దని, పుస్తకాలని కొనాలని అన్నారు. సంచిక ప్రచురణలు ప్రారంభించాలని, బుక్ క్లబ్ త్వరగా ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరు  పుస్తకాల కోసం నెలకి కనీసం రెండు వందల రూపాయలు కేటాయించుకోవాలని అన్నారు. సంచిక క్లబ్ లో విక్రయించే పుస్తకాలకు రచయితలు డిస్కౌంట్ ఇవ్వాలని ప్రతిపాదించారు.

శ్రీధర మూర్తి గారు మాట్లాడుతూ అనంతపురం నుంచి జరుగుతున్న ఇటువంటి ప్రయత్నం గురించి ప్రస్తావించారు.

శ్రీధర్ చౌడారపు గారు మాట్లాడుతూ – ప్రచురించే పుస్తకాల నాణ్యత చాలా ముఖ్యమని అన్నారు. సంచికలో ఒకొక్క నెల ఒక్కొక్క రచయిత పుస్తకాలను ప్రొమోట్ చేస్తే పుస్తకాలు కదులుతాయని అన్నారు. ప్రస్తుతం చాలామంది పుస్తకాలపై పెట్టే ఖర్చు వృథా అని భావిస్తున్నారని అన్నారు. పుస్తకాలు కొని చదవడం సాహిత్యం పట్ల మనం చూపే కనీస గౌరవం అని తాను భావిస్తానని అన్నారు. సంచిక బుక్ క్లబ్‍ని వీలైనంత త్వరగా ప్రారంభించాలని అన్నారు.

కస్తూరి మురళీకృష్ణ మాట్లాడుతూ ఒక డిస్ట్రిబ్యూషన్ నెటవర్క్ ఏర్పాటు చేసే ఆలోచన కూడా సంచికకి ఉందని, ఈ దిశలో మొదటి అడుగు వేద్దామని అన్నారు.

ఆసూరి హనుమత్ సూరి మాట్లాడుతూ – తాను సాహిత్య లోకానికి కొత్తవాడిననీ, ఇటీవలే రచనలు చేయడం మొదలుపెట్టాననీ, సంచికలో నాలుగు కథలు వచ్చాయని అన్నారు. సంచిక బుక్ క్లబ్ ఆలోచన స్వాగతించదగినదని అన్నారు. సంచిక పత్రికకి మొబైల్ యాప్ ఉండాలని, యాప్ వల్ల పాఠకాదరణ పెరుగుతుందని అన్నారు. పత్రికలో నైట్ మోడ్ ఆప్షన్ ఇవ్వాలనీ, దాని వల్ల రాత్రిపూట చదివే పాఠకుల కళ్ళపై ఒత్తిడి తగ్గుతుందని అన్నారు. జానర్ వైజ్ కేటగిరీలు ఉంటే బావుంటుందని అన్నారు. సంచిక పత్రిక గురించి ఒక జింగిల్ చేసి ప్రసార మాధ్యమలలో ప్రదర్శిస్తే, కొత్తవారికి చేరే అవకాశం ఉంటుందని అన్నారు. బి.ఎ. ఆర్ట్స్ విద్యార్థులకు లేదా గ్రూప్1 లో తెలుగు ఆప్షనల్‍గా ఎంచుకున్న విద్యార్థులకు సంచిక పత్రికని పరిచయం చేయాలని అన్నారు. తాను పుస్తకాలు చదివే పద్ధతిని వివరించారు. చిన్నప్పుడు రామాయణం, భారతం సీరియల్స్ టివిలో చూసేవాళ్ళమని.. ఆ అలవాటు సాహిత్యంపైకి మళ్ళిందని అన్నారు. దినపత్రికలు కొని చదవడం ముఖ్యమని అన్నారు. సంచిక బుక్ క్లబ్ వీలైనంత త్వరగా ప్రారంభమవాలని కోరుకున్నారు.

అనుముల చక్రపాణి గారు మాట్లాడుతూ తాను కొత్తగా రాస్తున్న రచయితనని అన్నారు. సంచిక లింక్స్‌ గాని, రచయిల ఇతర రచనలని గాని ఫేస్‍బుక్‌లో పోస్ట్ చేస్తున్నప్పుడు హాష్ టాగ్ ఇవ్వటం చాలా ముఖ్యమని అన్నారు. # పెట్టి రచయిత పేరు, పుస్తకం పేరు, సంచిక పేరు, కథ పేరు.. వగైనా కీలక పదాలని టైప్ చేస్తే ఎవరైనా ఆ పదాలతో సెర్చ్ చేసినప్పుడు మన రచనల లింక్స్ కనబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సూచించారు. # టాగ్స్ వల్ల ఆర్టికల్స్‌కి రీడర్స్ పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు.

డా. సి. భవానీదేవి గారు మాట్లాడుతూ – బుక్ క్లబ్ ఆలోచన మంచిదేనని అన్నారు. కానీ నిర్వహణలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. గతంలో చాలామంది బుక్ క్లబ్ లను నడిపి, తర్వాత ఆపేశారని గుర్తు చేశారు. సంచిక బుక్ క్లబ్ విజయవంతం కావాలంటే అందరి సహకారం అవసరం. సంచిక రైటర్స్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలని, వాళ్ళ పుస్తకాల గురించి అందరికీ తెలియాలంటే ఈ గ్రూప్ తప్పనిసరి అని అన్నారు. రచయితలు భాష కోసం తాపత్రయపడాలని, యువతతో తెలుగు రాయించాలని అన్నారు. తెలుగు లెక్చరర్లు/టీచర్లతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ విద్యార్థులతో రచనలు చేయించేలా ప్రోత్సహించాలి. పిల్లలలో మౌత్ పబ్లిసిటీ ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవ్వచ్చని అన్నారు. అలా చేస్తే పిల్లలలో కూడా ఎక్కువ రీడర్‍షిప్ వస్తుందని అన్నారు. తనకు ఏ బాధ్యత అప్పగించినా నిర్వహించడానికి సిద్ధమని అన్నారు.

అత్తలూరి విజయలక్ష్మి గారు మాట్లాడుతూ తాను చెప్పాలనుకున్న విషయాలను చాలామంది ఇప్పటికే ప్రస్తావించారని అన్నారు. సంచిక వెబ్ పత్రికని బాగానే చదువుతున్నారని అన్నారు. సంచిక standards, values ఉన్న పత్రిక అని అన్నారు. ఫేస్‍బుక్, # టాగ్స్, ఇన్‍స్టా‍గ్రామ్ తదితర మాధ్యమాలను మరింతగా ఉపయోగించుకోవాలని సూచించారు. సంచిక లింక్స్ అన్నీ ఒక్క చోట వచ్చే ఏర్పాటు ఉండాలని అన్నారు. యంగ్‌స్టర్స్‌ని చేరాలంటే సంచిక ఇంగ్లీష్ వెర్షన్ కూడా ఉండాలని సూచించారు. తెలుగు అంతగా రాని పిల్లలని సాహిత్యం వైపు మళ్ళించటం ఎలా అన్నది ఆలోచించాలని అన్నారు. తెలుగు వచ్చిన పిల్లల చేత రాయించటం అనేది మంచి ఆలోచన అన్నారు. బుక్ క్లబ్ ఆలోచన మంచిదేననీ, కానీ కొన్ని చాలామంది ఇళ్ళల్లో పుస్తకాలను ఉంచే స్థలం లేక లైబ్రరీలకి ఇచ్చేస్తుంటారని అన్నారు. అందుకని మనకి లైబ్రరీ ఉంటే బావుంటుందని, అక్కడ చదువుకోవచ్చని అన్నారు. పుస్తకాలను కానుకగా ఇవ్వటానికి కొందరు ఇష్టపడరని అన్నారు.

యేరువ శ్రీనాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ తాను తొలుత సినీ రంగంలో ప్రయత్నించాననీ, అవకాశాలు రాలేదని అన్నారు. కస్తూరి మురళీకృష్ణ గారు తనను ప్రోత్సహించి తన రచనలు సంచికలో ప్రచురించారని తెలిపారు. సంచిక సాహిత్యానికి ఒక సంచీ కావాలని అభిలషించారు. సంచిక ప్రతి సంచికకి ఒక ముఖచిత్రం తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ప్రస్తుత కాలంలో పుస్తకాలు చదవడం బాగా తగ్గిపోయిందంటూ తన అనుభవాలు వివరించారు. ఎక్కువమంది విద్యార్థులతో రచనలు చేయించాలని అన్నారు. వెబ్ మేగజైన్ కాబట్టి ఎక్కడి నుంచైనా చదవవచ్చని అన్నారు. పిల్లల చేత రాయిస్తే వాళ్లూ చదువుతారు, తమ మిత్రులతో చదివించి, షేర్ చేస్తారని అన్నారు.

డా. ఇమ్మడిశెట్టి చక్రపాణి గారు మాట్లాడుతూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో బావుందని అంటూ, కస్తూరి మురళీకృష్ణ గారికి అభినందనలు తెలియజేశారు. కొన్ని అంతర్జాల పత్రికలు చదవడానికి ఈజీగా ఉంటాయనీ, మరికొన్ని కష్టంగా ఉంటాయని అన్నారు. సంచిక ఫార్మాట్ మారిస్తే బాగుంటుందని అన్నారు. రచనల స్క్రీన్ షాట్లు తీసుకునే వీలు కల్పించాలని అన్నారు. కంటెంట్ బావుంటోందని, అయితే ఇంకా ఎక్కువ మందికి చేరాలని అన్నారు. సంచిక రచయితల కోసం ఏదైనా అవార్డు ఫంక్షన్ నిర్వహించాలని, అప్పుడు సంచిక ఎక్కువ మందికి చేరుతుందని అన్నారు.

వారణాసి నాగలక్ష్మి గారు మాట్లాడుతూ సంచిక ప్రతీ ఏడాది జరిగే హైదరాబాద్ బుక్ ఫెయిర్‍లో ఒక స్టాల్ పెట్టాలని అన్నారు. సంచిక ప్రచురించిన పుస్తకాలను, సంచిక రచయిల పుస్తకాలను ఈ స్టాల్ ద్వారా విక్రయించాలని అన్నారు. సంచికలో ఒక ఏడాదిలో వచ్చిన కథల నుంచి కొన్ని కథలను ఎన్నుకుని ఒక పుస్తకం తెస్తే బావుంటుందని అన్నారు. Collectors Books, Coffee Table Book లాగా ఉండాలని, ధర మరీ ఎక్కువగా ఉండకూడదని అన్నారు. ధర మోడరేట్‍గా ఉండేలా సంచిక పుస్తకలాని తేవాలని, వీలైనంత మేర రిబేట్  ఇవ్వాలని అన్నారు. తద్వారా సంచిక రచయితల పుస్తకాల అమ్మకాలు బాగుండే అవకాశం ఉంటుందని అన్నారు.

వేదాల గీతాచార్య గారు మాట్లాడుతూ – విజిబిలిటీ ప్రధాన సమస్య అని అన్నారు. పిల్లలతో రాయించి సంచికలో ప్రచురించాలనీ, పిల్లల తల్లిదండ్రుల ద్వారా సంచిక ఎక్కువ మందికి చేరుతుందని అన్నారు. పిల్లలు రాసిన రచన అంటే ఎక్కువమంది చదువుతారని అన్నారు. తెలుగులో పల్ప్ ఫిక్షన్ చాలా తక్కువ అని, ఇతర భాషలలో ఎక్కువగా లభిస్తోందని అన్నారు. పల్ప్ ఫిక్షన్‍ని యూత్ ఎక్కువగా చదువుతారని అన్నారు. పొన్నియన్ సెల్వన్ సినిమాగా వస్తోందంటే, ఆ నవల ఎందుకు ఎక్కువగా అమ్ముడుపోయిందో ఆలోచించాలని అన్నారు. అలాగే ‘కొండపొలం’ నవల కూడా బాగా అమ్ముడైందని అన్నారు. భయంకర్ గారు రచించిన ‘జగజ్జాణ’ నవల కూడా దేనికీ తీసిపోదని గుర్తు చేశారు. సంచిక రచనలని షార్ట్-ఫిల్మ్‌లా రూపొందిస్తే బావుంటుందని, యూట్యూబ్ చానెళ్ళతో టై-అప్ కావాలని సూచించారు. పల్ప్ ఫిక్షన్ రావలని కోరారు. కామిక్స్ కూడా అవసరమని అన్నారు. సాహిత్యానికి – పాఠకులకి – మీడియాకి మధ్య గ్యాప్ ఉందని అన్నారు. సైన్స్ ఫిక్షన్‍ని ప్రమోట్ చేయాలని, అప్పుడు యువత ఎక్కువగా చదువుతారని అన్నారు. క్రైమ్ ఫిక్షన్, థ్రిల్లర్స్ కూడా ఉండాలని అన్నారు. ప్రస్తుతం pure romance నవలలు బాగా తగ్గిపోయాయని అన్నారు. Adventure Fiction, Horror fiction ఉండాలని అన్నారు. ఇలాంటి రచనల ద్వారా సంచిక రీడర్‌షిప్ పెరుగుతుందని అన్నారు.

కస్తూరి మురళీకృష్ణ మాట్లాడుతూ ఈ దిశగా సంచిక చేస్తున్న ప్రయత్నాలను వివరించారు.

వేదాల గీతాచార్య మాట్లాడుతూ సంచికని మనం ప్రమోట్ చేస్తే, మన రచనలు కూడా ప్రమోట్ అవుతాయని అన్నారు. సంచికలో ప్రచురితమైన ‘కరనాగభూతం’ కథలని తాను ప్రమోట్ చేసినట్లు తెలిపారు.

ఘండికోట విశ్వనాధం గారు మాట్లాడుతూ సంచికలో తమ తండ్రిగారి ‘శ్రీపర్వతం’ నవలని ప్రచురించారనీ, ఆ విధంగా తాను ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడనని అన్నారు. సంచికలో ఆర్టికల్స్‌కి/కథలకి – కామెంట్స్ రాయటం కష్టంగా ఉందని, సులువుగా రాయగలిగేలా చూడాలని అన్నారు. బహుశా సాఫ్ట్‌వేర్ మార్చుకుంటే చాలేమోనని అన్నారు. రైటర్స్ క్లబ్/బుక్ క్లబ్ ఆలోచన మంచిదేనని అన్నాయి. అయితే ప్రచురించిన పుస్తకాలను డిస్కౌంట్ ఇస్తూ అమ్మితే బాగుంటుందని అన్నారు. తన తండ్రి గారి రచనలు ఎక్కువమందికి చేరేలా ‘ఘండికోట బ్రహ్మాజీరావు సమగ్ర సాహిత్యం’ ప్రచురించే ఉద్దేశం ఉందని తెలిపారు. రైటర్స్ క్లబ్/బుక్ క్లబ్ ద్వారా పుస్తకాలను ఎక్కువమందికి చేర్చవచ్చని అన్నారు. పుస్తకాల ధరని వీలైన అందుబాటులో ఉంచాలనీ, affordability ముఖ్యమని అన్నారు.

కస్తూరి మురళీకృష్ణ గారు మాట్లాడుతూ సమావేశం ఎజెండా లోని మరో అంశమైన ‘సంచిక సాహిత్య అకాడమీ’ స్థాపన ఉద్దేశం గురించి చర్చిండానికి సమయం తక్కువగా ఉందని తెలిపి ‘సంచిక సాహిత్య అకాడమీ’ తరఫున చేయదల్చిన కార్యక్రమాలను సంక్షిప్తంగా వివరించారు. ప్రస్తుతం ఉన్న సాహిత్య అకాడెమీలో మననుంచి వసూలు చేసిన పన్నుల డబ్బులతో ఫైవ్ స్టార్ హోటళ్ళలో వుండటం, ఒకే భావజాలాన్ని ప్రోత్సహిస్తూ సాహిత్యాన్ని సంకుచితం చేయటం సాగుతోందనీ, మనం కట్టిన పన్నుల డబ్బులు వేరేవాళ్ళు దుర్వినియోగం చేస్తూ, సాహిత్యాన్ని దెబ్బ తీస్తున్న పరిస్థితుల్లో, మనమందరం కలసి మన డబ్బులతో మనం మెచ్చిన సాహిత్యానికి పెద్ద పీట వేసే సాహిత్య అకాడెమీని ఏర్పాటు చేసుకోవాల్సివుంటుందనీ,  ఇప్పుడు కొత్తగా ఏర్పడిన సాహిత్య అకాడెమీ సభ్యులు, గతంలో వున్న తానులో గుడ్డల్లాంటివారేననీ, సాహిత్యాన్ని సమగ్ర దృష్టితో చూస్తారన్న ఆశ, చూసే అవకాశాలూ లేవు కాబట్టి, ఉత్తమ సాహిత్యాన్ని రచయితలే గుర్తించి, ప్రోత్సహించేందుకు సంచిక సాహిత్య అకాడెమీ ఏర్పడాల్సిన ఆవశ్యకత వుందనీ, రాబోయే సమావేశాల్లో ఈ విషయంపై విస్తృతమైన చర్చలకు సిద్ధమై రావాలనీ రచయితలను అభ్యర్ధించారు.

వారణాసి నాగలక్ష్మి గారు మాట్లాడుతూ ‘సంచిక సాహిత్య అకాడమీ’ మంచి ఆలోచన అని, ఫండ్ రైజర్ ఒకటి నిర్వహించాలని సూచించారు.

కస్తూరి మురళీకృష్ణ గారు మాట్లాడుతూ ‘సంచిక సాహిత్య అకాడమీ’ పారదర్శకంగా ఉండేలా చూస్తామని, responsibility, accountability ఉండేలా చూస్తామని అన్నారు. ఇక సమావేశంలో ఉన్న విద్యార్థుల/ఇతరుల అభిప్రాయాలు తెలుసుకుందామని, వారు ఎటువంటి సాహిత్యాన్ని చదువుతున్నారో తెలుసుకుందామని అన్నారు.

విష్ణువర్ధన్ గారు మాట్లాడుతూ తాను తెలుగు ఆప్షనల్‍గా తీస్కున్న విద్యార్థినని చెప్పారు. తమకి అద్దంకి శ్రీనివాస్ గారు తెలుగు పాఠాలు చెప్తారని అన్నారు. తాను ఎక్కువగా పురాణాలు, దేశభక్తి పుస్తకాలు, మహనీయుల చరిత్రలు చదువుతానని అన్నారు. పుస్తకాలు చదవని సమయంలో ఆడియో/యూట్యూబ్ ఛానెళ్ళలో ప్రవచనాలు వింటానని తెలిపారు. దినపత్రికలు రోజూ చదవాలని, ముఖ్యంగా సంపాదకీయం, ఆదివారం అనుబంధం లోని కథలు చదవాలని, వాటి వల్ల ఎన్నో విషయాలు నేర్చుకుంటామని అన్నారు.

నంద్యాల గౌతమ్ మాట్లాడుతూ – తాను నంద్యాల సుధామణి గారి అబ్బాయినని, ఇన్ఫోసిస్‍లో పనిచేసున్నానని తెలిపారు. మొత్తం సుమారు 40 వేలమంది ఉద్యోగులు ఉంటే అందులో కనీసం 20 వేల మంది తెలుగువాళ్ళని అన్నారు. వీళ్ళల్లో చాలామంది తెలుగులో మాట్లాడడం ఎలా అనే గ్రూపు సభ్యులు. ఈ గ్రూపుకి ప్రతి నెలా ఒక మేగజైన్ వస్తుంది. అయితే ఎవరు ఏం కాంట్రిబ్యూట్ చేయాలనేది తమకి కష్టం అని అన్నారు. సంచిక రచనలని చదవమని ఈ గ్రూప్‍కి చెప్తానని అన్నారు. ఈ విధంగా సంచికకి రీడర్‍షిప్ పెరగవచ్చని అన్నారు. సంచిక లిటరరీ ఈవెంట్స్ కాలెండర్ రూపొందించి ఇస్తే తమ టీంలో షేర్ చేసి రీడర్‍షిప్ పెంచడానికి ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తామని కస్తూరి మురళీకృష్ణ హామీ ఇచ్చారు.

శ్రీకాంత్ గారు మాట్లాడుతూ తాను తెలుగు లిటరేచర్ విద్యార్థినని తెలిపారు. తాను ఎక్కువగా మోటివేషనల్ రచనలు చదువుతానని తెలిపారు. మనిషి డౌన్ అయినప్పుడు/చీకట్లలో కూరుకుపోయినప్పుడు రచయితలు అందించే స్ఫూర్తి గొప్పదని అన్నారు. మేధోమథనం గొప్పదని అన్నారు. సంచిక చదివేవారికి పుస్తకాలను, చదవని వారికి పాడ్‍కాస్ట్‌లను అందించాలని సూచించారు. పొన్నియన్ సెల్వన్, బలగం సినిమాలను ప్రస్తావించి, మనిషిలోని ఎమోషన్స్ ఎప్పటికీ మారవని అన్నారు. రచయితలు తమ రచనల్లో ఈ భావోద్వేగాలను జోడించగలిగితే ఆ రచనలు ఎక్కువమందికి చేరుతాయని అన్నారు. సమాజంలో పేరుకుపోయిన మైండ్‍సెట్ మారాలంటే ఇటువంటి రచనల అవసరం ఉందని అన్నారు.

అనిల్ కుమార్ మాట్లాడుతూ తాను తెలుగు లిటరేచర్ విద్యార్థినని తెలిపారు. తాము సంచిక గాని వేరే ఏదైనా పత్రికని ఎందుకు చదవాలి అని అడుగుతూ, పత్రికల ద్వారా తాము ఏం ఆశిస్తామో తెలిపారు. రచనలలో ఆలోచనాత్మక/ప్రేరణాత్మక వాక్యాలు, పదాలు ఉండాలని అన్నారు. సంచిక వల్ల తమ భాష మెరుగుపడాలని అన్నారు. సమస్యలకి పరిష్కారం చూపగలిగే రచనలు ఉండాలని అన్నారు. సంచికలో అన్ని రకాల రచనలు ఉండాలని, తమ ఏజ్ గ్రూప్‌కి నప్పే రచనలు ఉండాలని అన్నారు. 20-60 ఏళ్ళ వరకు వారి వయసుకి తగ్గ రచనలు ఉండాలని కోరారు. యువత సమస్యల గురించి తెలియాలంటే, వాటిను అనుభవించే యువత చేతే రాయించాలనీ, మిగతావారు ఊహించి రాస్తారని అన్నారు. రచనలు సామాజిక ధోరణికి అనుసంధానమై ఉండాలని అన్నారు.

రామకృష్ట గారు మాట్లాడుతూ తాను అన్ని రకాల సాహిత్యం చదువుతానని, తనకి ప్రధానంగా అడ్వెంచరస్ లిటరేచర్ ఇష్టమని తెలిపారు.

తెలుగు విద్యార్థి శివరాం గారు మాట్లాడుతూ తాను ఎక్కువగా నవలలు, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదువుతానని తెలిపారు. యువత తెలుగు చదవటానికి ఆసక్తి చూపకపోవటానికి ప్రధాన కారణం చిన్నప్పడు తెలుగు నేర్పకపోవడమేనని అన్నారు. భాష, సాహిత్యం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.

సురేఖ నంద్యాల మాట్లాడుతూ తాను నంద్యాల సుధామణి గారి కోడలని అన్నారు. తాను ఎక్కువగా భక్తి, దైవానికి సంబంధిత పుస్తకాలు చదువుతానని తెలిపారు. పిల్లలతో చదివించడానికి ప్రయత్నిస్తున్నానని తెలిపారు.

నంద్యాల సుధామణి గారి మనవడు ఋషీకేశ్ నంద్యాల మాట్లాడుతూ తనకి అడ్వెంచర్ బుక్స్ నచ్చుతాయని అన్నారు. హారీ పోటర్ సీరిస్ ఇష్టమని తెలిపారు.

కొన్ని ముఖ్యమైన కారణాల వల్ల సమావేశానికి ఆలస్యంగా హజయ్యారు డా. రాయపెద్ది వివేకానంద. ఆయన మాట్లాడుతూ తాను ముందు పాఠకుడినని తెలిపారు. తమ ఆసక్తిని పెంచేలా ఏది రాసినా పాఠకులు చదువుతారని అన్నారు. ప్రత్యేక కసరత్తులు ఏమీ అక్కరలేదని అన్నారు. రచనలో భావం బలంగా ప్రతిబింబించాలని అన్నారు. తనకు వచ్చే ఆలోచనలని ఎప్పటికప్పుడు నోట్ చేసి పెట్టుకుని తర్వాత డెవలప్ చేస్తానని తెలిపారు.

***

భోజనాల సమయం కావడంతో అందరికీ కృతజ్ఞతలు తెలిపి సమావేశం ముగించారు కస్తూరి మురళీకృష్ణ. చక్కని ఏర్పాట్లు చేసిన తెలంగాణ స్టేట్ ఎస్.సి. స్టడీ సర్కిల్ డైరక్టర్ శ్రీధర్ చౌడారపు గారికి, వారికి సిబ్బందికి సంచిక బృందం ధన్యవాదాలు తెలియజేసింది. త్వరలో మళ్ళీ సమావేశం నిర్వహిస్తామని సంచిక బృందం తరఫున వాగ్దానం చేశారు.

చక్కటి శాకాహార భోజనం తరువాత సంతృప్తాంతరంగులయిన రచయితలు పలు విషయాలు ముచ్చటిస్తూ ఒకరొకరుగా సెలవు తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here