సంచిక – స్వాధ్యాయ సాహిత్య సమావేశం (చర్చా వివరాలు)

12
9

[dropcap]సం[/dropcap]చిక – స్వాధ్యాయ రచయిత మొదటి సమావేశం స్వాధ్యాయ రిసోర్స్ సెంటర్‍లో 01 మే 2022 నాడు జరిగింది.

సత్రకాయ సరైన నిర్ణయం

దానికి మునుపే ఏప్రిల్ 25లోగా మీ అంగీకారాన్ని ఫోన్ కాల్ ద్వారా కానీ, వాట్సప్ మెసేజ్ ద్వారా కానీ తెలియజేయమని ప్రకటన సంచికలో చూశాను. వెళ్ళాలో వద్దో డైలమా. ఎవరెవరు వస్తారో, ఎంతమంది వస్తారో, వెళితే అక్కడ మహామహుల మధ్య ఇమడగలనో లేదో అనే సందేహాల మధ్య ఏప్రిల్ 24 వచ్చింది. సరే, ఒక ప్రయత్నం చేస్తే సరి. అవకాశం ఉంటే పెద్దలను కలువ వచ్చు. లేదా ఒక కాల్ నష్టం అనుకుంటూ కస్తూరి మురళీకృష్ణ గారి నంబర్ కు ఫోన్ చేయటంతో ఈ ప్రస్థానం మొదలైంది.

Ever welcoming new ideas అన్నట్లుగా ఉండే మురళీకృష్ణ గారు, మీ వాట్సప్ వివరాలు చెపితే నేను గ్రూప్ లో కలుపుతాను అన్నారు. అలా అలా… ప్రొఫెసర్ సుశీలమ్మ గారు, సంచిక కర్త, కర్మ, క్రియ అయిన కొల్లూరి సోమ శంకర్, డాక్టర్ కేఎల్వీ ప్రసాద్ మొదలైన వారందరూ ఉన్న గ్రూప్ లో నేను కూడా చేర్చబడ్డాను. అందరూ మహామహులే. క్రమంగా ఒకరికొకరు పరిచయాలు చేసుకున్నాం. అందులో భాగంగా రాయపెద్దిగారు, నాగరాజు మున్నూరు, మొదలైన వారి పరిచయాలే కాక మిగిలిన ఉద్దండుల వివరాలతో పాటు కొన్ని వారి సాహిత్య వ్యాసంగ వివరాలు తెలిశాయి. మరో ఆశ్చర్యకరమైన విషయం కూడా అప్పుడే తెలిసింది.

మే 1 మీటింగ్ కు ముందు రోజు కస్తూరి మురళీకృష్ణ గారు ఎజండా గురించి పోస్ట్ చేశారు. ప్రధానంగా ఈనాడు పాఠకులు ఎందుకు తగ్గిపోతున్నారు అన్నది ప్రతి ఒక్కరూ మాట్లాడాలన్నది. రామోజీరావుగారిని అడిగి చెప్తా అనబోయి, ఇలాంటి జోక్ కీశే॥ ఈవీవీ ఆల్రెడీ వాడేశారు కనుక, నేను మళ్ళీ నోరుజారి గ్రూప్ లో కీశే కాకూడదు కనుక సైలెంట్ గా ఉన్నాను. కానీ, ఇది నిజానికి గట్టిగా, చాలా constructive గా చర్చించాల్సిన విషయం. అందరూ చర్చించేదే. కానీ, ఎవరూ ఇంత వరకూ సరైన పరిష్కారం కనుక్కోలేదు. చర్చల్లో ఇది జరిగే పని కాదు అని నాకు తెలిసిన విషయమే. కానీ, ఇక్కడైనా కథ మారుతుందేమో అని ఆశ. ఒకటి మాత్రం అర్థమైంది. జరుగబోయేది మిగిలిన సాహిత్య సమావేశాల లాంటిదైతే కాదు. We can express ourselves freely without poking our noses into the freedom/rights of others. అసలే కరోనా కాలం కదా. ముక్కుకు అంత కష్టం ఎందుకు?

మరో పాయింట్ వినూత్నమైన రచనల గురించి చర్చ. ఎందుకు వినూత్నమైన కథలు తెలుగులో రావటం లేదు? అలాంటి కథలు రాయటంలో ఎదుర్కొన్న సమస్యలు, ఏమి చేయవచ్చు అన్నది. నా అవార్డ్ విన్నింగ్ కథ కుక్క నాకిన ముంజ కథ గుర్తొచ్చి ఈ విషయం చెప్పాలి అని గుర్తు పెట్టుకున్నాను. ఎటు నాది సత్రకాయ రోలే కాబట్టి (ఉన్న విషయం ఒప్పుకోవాలి), దాన్నైనా సరిగ్గా పోషించాలి,  అని దృఢ నిశ్చయంతో మీటింగ్ కోసం ఎదురు చూడసాగాను. అసలు వెళ్ళటానికి మరో కారణం నా వృత్తి పని మీద నేను ఎటూ దాదాపు అదే టైమ్ లో హైదరాబాద్ లో ఉంటాను. ఒక్కరోజు పర్యటనను extend చేసుకుంటే, హాజరవటంతో పాటు సంచిక రచయితలను, సాహితీవేత్తలను కలువ వచ్చు అన్నది ఆలోచన. ఎంతమంది చదువుతున్నారో తెలియని కొరియానం రాస్తున్నా కదా 😂.

ఆతిథ్యం

కోవెల సంతోష్ కుమార్ గారి ఇంట ఆతిథ్యం నిజంగా మర్చిపోలేనిది. స్వాధ్యాయ లైబ్రరీలో జరిగిన ఈ సమావేశానికి ఆతిథ్యమిచ్చిన కోవెల వారి తీరు జీవితాంతం ఒక మధురమైన జ్ఞాపకంగా నిలుస్తుంది. ఎవరికీ ఏ ఇబ్బందీ కలుగకుండా, సభ బాగా జరిగేలా జాగ్రత్తలు తీసుకోవటమే కాదు, నాస్తా, భోజనాలు సరైన రీతిలో అందించటంతో పాటూ, ఎవరూ ప్రత్యేకించి మంచినీటికోసం లేచి వెళ్ళాల్సిన అవసరం రాకుండా ఆ ఇంటివారందరూ తీసుకున్న జాగ్రత్తలు, అందరినీ ఆప్యాయంగా ఆహ్వానించటం, వీడ్కోలు చెప్పటం వరకూ అన్నీ అద్భుతం. నేను చేసిన ఘోరమైనా పొరబాటు (నా బిడియం వల్ల) సంతోష్ కుమార్ గారిని కలవలేక పోవటమే కాకుండా, I didn’t even express my thanks. But anyway now I have corrected the mistake to an extent I hope. వారి రామం భజే శ్యామలం చాలా చక్కటి రచన సంచికలో.

ఇంత ప్రత్యేకంగా ఆతిథ్యం గురించి ఎందుకు రాశానంటే, సమావేశం ఎంత గొప్పగా జరిగినా, ఒక్కొక్కరికీ దుశ్శాలువాలు కప్పి సత్కరించి అనర్ఘ రత్నాలిచ్చి పంపినా, ఆతిథ్య లోపాలుంటే ఆ పైవన్నీ కొట్టుకుపోతాయి. అసలే లక్ష మంచి పనులకన్నా ఒక్క లోపాన్నే రోజుల తరబడి గుర్తుంచుకునే రోజులు ఇవి. అంతే కాకుండా, if the basics are taken care of, rest will fall in place automatically అనేది తెలిసిందే. మన తెలుగూఫులకు అసలు కన్నా కొసరు ముద్దెక్కువ. (ఈ వాక్యం ఏదో ఫ్లోలో వచ్చింది. ఫాలో కండి. లేదా సెల్ఫ్ సెన్సార్ చేసుకోండి. Censor. Not sensor).

సంచిక స్వాధ్యాయం

స్వాధ్యాయ! భలే పేరు.

సంచిక! Minimalistic for my magazine, let alone for a web magazine.

ఈ రెండిటి కాంబినేషన్ బాగుంది.

ఎప్పుడూ ఎవరిని హైదరాబాద్ లో కలవాలన్నా రెండు బస్సులు మారాల్సి రావటమో, కనీసం గంటల ప్రయాణం చేయటమో ఉండే నాకు, ఆశ్చర్యకరంగా in my vicinity మీటింగ్ ప్లేస్ ఉండటం సంబరాచర్యం కలిగించింది. దాదాపు on the time వెళ్లినా ప్లేస్ కనుక్కోవటానికి కాస్త confuse అయ్యి మురళీకృష్ణ గారికి కాల్ చేశాను. వెంటనే సహాయం అందింది. వెళ్ళే సరికి దాదాపు అంతా రెడీ. దూరం నుంచి వచ్చిన వారికి బ్రేక్ఫాస్ట్ అందించారు. ఆ ప్రక్రియ చివరి అంకంలో ఉన్న నన్ను కూడా అడిగారు. తినే బయలుదేరాను కనుక టీ తాగాను (running joke తెలిసిన వారు నన్ను కమ్యూనిస్టు అనవచ్చు గాక). అంతా క్షణాల్లో సర్దుకోగానే విశిష్ట అతిథి శ్రీమాన్ కోవెల సుప్రసన్నాచార్య గారి పరిచయం.

పాల్గొన్న వారి వివరాలు

 విశిష్ట అతిథి: శ్రీ కోవెల సుప్రసన్నాచార్య

పాల్గొన్నవారు: శ్రీయుతులు తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి, ఎ.ఎమ్. అయోధ్యా రెడ్డి, డా. కె.ఎల్.వి. ప్రసాద్, శ్యామ్ కుమార్ చాగల్, తోట సాంబశివరావు, శ్రీమతి సి.హెచ్. సుశీల, శ్రీమతి లలిత చండీ, బి. మురళీధర్, శ్రీమతి బొమ్మదేవర నాగకుమారి, పి. జ్యోతి, మున్నూరు నాగరాజు, గండ్రకోట సూర్యనారాయణ, డా. రాయపెద్ది వివేకానంద, గుండాన జోగారావు, వేదాల గీతాచార్య, శ్రీమతి నండూరి సుందరీ నాగమణి, గండ్రకోట సూర్యనారాయణ, సి.ఎస్. రాంబాబు, గొర్రెపాటి శ్రీను, డా. చిత్తర్వు మధు, సలీం, కస్తూరి మురళీకృష్ణ, కొల్లూరి సోమ శంకర్ మరియు కోవెల సంతోష్ కుమార్.

కస్తూరి మురళీకృష్ణ గారు వచ్చిన రచయితలని ఆహ్వానించి, ఎజెండా వివరించాక  – శ్రీ కోవెల సుప్రసన్న గారిని పరిచయం చేశారు. సంచిక-స్వాధ్యాయ సంయుక్త కృషిని క్లుప్తంగా వివరించి. రచయితలందరూ సంచికకు సమానమేననీ, ఇక్కడకి వచ్చిన వారందరూ మాట్లాడాలని కోరారు. ఎక్కువ సమయం తీసుకోకుండా విషయానికి సూటిగా రావటం మంచి విషయం. అంతకు మునుపు కస్తూరి వారు వచ్చిన వారిని మరొక్కసారి పరిచయం చేశారు. అందరి గురించి మరొక్కసారి తెలుసుకునే అవకాశం కలిగింది. ఇంతటి వారితో వారి పక్కన కూర్చునే అర్హత ఉందా అన్న అనుమానం మరోసారి రైజ్ అయ్యి నెర్వస్నెస్ పెరుగుతుండగా, నేను రాసిన రెండు  కథలు గుర్తుకు వచ్చి ఫర్లేదు కూర్చోక పోయినా నించోవచ్చు అని inner voice చెప్పింది. కాకపోతే మరీ అంతసేపు నించోలేను కనుక కుర్చీకి అతుక్కుపోయాను.

నన్ను కొరియానం రచయితగా పరిచయం చేశారు. Yeeewww! (My inner Ravi Teja: నువ్వంతగా వేరేవేం రాశావురా యదవా! అని అనటంతో గమ్మునుండిపోయా😀)

ఇక న గుణింతం పేటెంట్ పొందిన వారికి వదిలేస్తే…

కోవెల సుప్రసన్నాచార్య గారు మాట్లాడుతూ:

కథ అనేది సృష్ట్యాది నుంచీ ఉందని, కాకపోతే వేరు వేరు రూపాలలో ఉండి క్రమంగా రూపాన్ని మార్చుకుందని చెప్పారు. హహ! కొరియానంలో నా ఆదాము అవ్వ రిఫరెన్స్ వెక్కిరించిన వారికి భలే మొట్టాయి పడింది. వారి అనుభవాన్ని చెప్పడానికి ఆకృతి కథ అని చెప్పారు. అనుభవాన్ని పాడితే కావ్యం/గేయం అనీ, అప్పుడు అనుభూతి ఛందస్సులోకి ఒదిగినట్లని అన్నారు. అభినయం ద్వారా చెబితే బుర్రకథ, యక్షగానం అవుతాయని అన్నారు.

తల్లి పిల్లలకి కథలు చెబుతుందని, ప్రేయసీప్రియులు ఒకరిఒకరు కథలు చెప్పుకుంటారనీ – జీవితం కథలతోనే ప్రారంభమవుతుందని అన్నారు. వారి మాటలు వినగానే effective speeches doesn’t need to be loud అని అనిపించింది. భలే! గొప్ప నేర్చుకోవాల్సిన విషయం.

విష్ణుశర్మ పంచతంత్రం నాటి నుంచే కథలు ఉన్నాయని, కథల రూపాలు అనేకం అని చెప్తూ, కథాసరిత్సాగరాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. ఇవన్నీ అడిగితేనే చెప్పే కథలని చెప్పారు. శుక మహర్షి భాగవతాన్ని వినిపించాడనీ, వైశంపాయనుడు భారతం వినిపించాడని చెప్పారు.

కథా రూపం క్రమక్రమంగా మారుతోందని, అది సజీవ లక్షణమని అన్నారు. మనిషి జీవితంలో అనేక పరిణామాలు సంభవిస్తున్నట్టే, కథారూపం కూడా వికసిస్తూ వచ్చించని చెప్పారు.

ఒక కథ చెప్పుకోవడంలో భావ తీవ్రత, ప్రతీకాత్మకత, శైలి ఉంటాయి, తాదాత్మ్యత ఉంటుంది. అప్పుడు కథ స్వరూపం తెలుస్తుంది. దీనికి కిన్నెరసాని పాటలు ఉదాహరణగా పేర్కొన్నారు.

ఒక కథ చెబితే అందులోంచి ఎవరికి వారు తీసుకోవాల్సిన ఆదర్శాలు, ఔన్నత్యాలు ఎలా తీసుకోవాలో అర్థమయ్యేలా కథ చెప్పాలి. కథలో ఉండే పలు పార్శ్వాలు చూడాలి.

“విశ్వనాథ వారి ‘జీవుని ఇష్టం’ నాకు చాలా ఇష్టమైన కథ. ఎప్పుడు చదివినా నాకు ఒళ్ళు జలదరిస్తుంది” అని అన్నారు.

కథ చదివినప్పుడు కలిగే ప్రేరణ గొప్పది. ఏ కథ చదివినా హృదయానికి హత్తుకుని, ఎన్ని రోజులైనా మరిచిపోకుండా ఉండాలి. అది గొప్ప కథ అవుతుంది. అలాంటివి రావాలి – అన్నారు సుప్రసన్నాచార్య.

తెలుగు రచనలు పాఠకులను ఎందుకు ఆకట్టుకోవటం లేదు?

చర్చాంశం: ఎందుకని పాఠకులని ఆకట్టుకోలేకపోతున్నాము? కొత్త పాఠకులను చేరడమెలా?

తుమ్మేటి రఘోత్తమరెడ్డి:

అచ్చుపత్రికలు తగ్గి వెబ్ పత్రికలు/సోషల్ మీడియా పెరిగిన ఈ కాలంలో రచయితలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవ్వాలి. ఈ తరం వాళ్ళు డిజిటల్ మీడియాలోనే ఉంటున్నారు. మనం కూడా సోషల్ మీడియాని రచనా వ్యాసంగానికి ఉపయోగించుకోవాలి. పిల్లలు కథలు చదవడం లేదు, కానీ తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. మనం వాళ్ళతో కలిసి నడవాలి.

 

కొందరు కథలు ఇలా రాస్తేనే కథలు, ఆ విధంగా రాస్తేనే కథ రాసినట్టు అనే అభిప్రాయంలో ఉంటారు. మనవాళ్లు rigid అయిపోయారు. రాయడం అంటే కథ, నవల, కవిత్వమే అని అనుకుంటున్నారు. ఇంకా ఉన్నాయి. నేను ఫేస్‌బుక్‌లో రాశాను. చాలామంది చదివారు. మనం మన perspective మార్చుకోకుండానే సాధన చేయవచ్చు. మన ముందు తరం, మన తరం, మన తర్వాతి తరం – మొత్తం మూడు తరాలకి చేరేలా రాయాలి. వారితో నడుస్తూ వారి expression, వారి భాషని గ్రహించాలి. Update అవ్వాలి.

ఎ.ఎం. అయోధ్యా రెడ్డి:

నాకు మాట్లాడడం రాదు (అంటూనే మరొక పార్శాన్ని గట్టిగా చెప్పారు). అసలు కథలు ఎందుకు రాయాలి అనడంలో ఎంతో బాధ ఉంది, దుఃఖం ఉంది. పాతికేళ్ళ క్రితం రచయితలు చాలా తక్కువ, పాఠకులు బాగా ఎక్కువ ఉండేవారు. ఇప్పుడు ఎక్కువమంది రచయితలే, పాఠకులే తక్కువ.

మా అబ్బాయి చదవడు. మొన్న శ్రీశ్రీ జయంతి సందర్భంగా శ్రీశ్రీ ప్రస్తావన వస్తే ‘ఆయన ఎవరు పాప్ సింగరా?’ అని అడిగాడు. ఇంక ఏం చెప్పాలి?

ఇప్పుడు కథ చదవడానికి కూడా ఓపిక లేదు. మనం రాస్తున్నాం, కాని ఎవరు చదువుతున్నారు? అని ప్రశ్నించుకోవడం లేదు. మన సంతృప్తి కోసం మనం రాస్తున్నాం. మనమే ఇంకొకళ్ళ రచనలని చదవం అనేది ఫాక్ట్ (ఇది నాకు – భవదీయుడు) కూడా వర్తిస్తుంది. సంచికలో రెగ్యులర్ గా రాసే వరకూ నేను కూడా ఎక్కువ చదవలేదు(నీలమత పురాణం, రాజ తరంగిణి తప్ప). మరి పాఠకులు ఎలా వస్తారు?

పాఠకులను పెంచడం ఎలా అనేది ఆలోచించాలి. మిమ్మల్ని నిరాశపరచడం నా ఉద్దేశం కాదు. రైటర్స్, కవులు చాలామంది ఉన్నారు. పాఠకులే కావాలి. దాని కోసం ఏం చేయాలో ఆలోచించాలి.

డా. కె.ఎల్.వి. ప్రసాద్:

కథలు చదవడం లేదు అన్నారు అయోధ్య రెడ్డి గారు. చదివే వాళ్ళు ఉన్నారనే నా అభిప్రాయం. నేను ఎంతో మందితో చదివిస్తాను. రాయలేని వాళ్ళకి ఓ చేయి అందించడంలో తప్పులేదు. పాఠకులు ఉన్నారు. ఒక టైమ్ లో కథ, ఒక టైమ్‍లో నవలకి ప్రాముఖ్యత ఉంటోంది. మరి రేపెట్లా? కొత్త పాఠకులని ఎలా ఆకర్షించాలి?

పరిస్థితులు మారాయి.  అప్పట్లో అచ్చు పత్రికలకున్న ప్రాధాన్యత ఇప్పుడు లేదు. మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని burning issues తో రాస్తే చదివేవారు వస్తారు అని ముగించారు.

(వీరిని గురించి చాలాకాలంగా తెలుసు. వారి జీవితానుభవాలను సంచికలో చదువుతున్నాను కూడా – ఙ్ఞాపకాల పందిరి రూపంలో).

శ్యామ్కుమార్ చాగల్:

పాఠకులని వివిధ రకాల రచనలతో ఆకర్షించాలి. ఏ వయసు వారికి ఆ వయసు వారి కథలే నచ్చుతాయి. అయితే ఇప్పుడు చదివేవారంతా above 45 వారే. యూత్ చదవడం లేదు. ప్రేమ కథలు రాయాలంటే ఇప్పటి పిల్లల ఇంటరాక్షన్ మనకి తెలియదు (అసలు ఈ అంటే మా జనరేషన్ కు romantic tension అంటే ఏమి తెలుసు. ఈ తరం కంటే పీరియడ్ కంటెంట్ రూపంలో ఆ తరం వారే ప్రేమ కథలు గొప్పగా అందించవచ్చు). ఈ barrier దాటితే అందరినీ చేరవచ్చు.

తోట సాంబశివరావు:

ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను నా సంతృప్తి కోసమే రాస్తున్నాను. బహుమతులు రావాలని, పొగిడించుకోవాలనే ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. నా కథల్లో నేనే ఉంటాను. ఎక్స్‌పెక్టేషన్స్ లేవు, అసంతృప్తి లేదు. సంచికలో ప్రచురితమైన రచనలు నా గ్రూపుల్లోని 5000 మందికి పంపితే, 100 మంది రెస్పాన్స్ ఇస్తారు.ఎక్కువ మందికి పంపాలి, ఎవరో వస్తారని ఎదురు చూడకూడదు. Add friends అనేది నా పాలసీ. ఆ తృప్తి చాలు. (భలే అనుకున్నాను).

సి.హెచ్.సుశీల:

కథలనేవి సహజంగా ప్రతీ తల్లీ తన బిడ్డలకి చెబుతుంది. సంతోషం, ఆనందం అనుభవాల మధ్య కథా సాహిత్యం ఉన్నది. అయితే రానురానూ పాఠకుల సంఖ్య తగ్గిపోతోంది. (హాయిగా మొబైల్ ఫోన్ లో యూట్యూబ్ పెట్టి అన్నం పెట్టే రోజులివి. ఇమాజినేషన్ కు పదును పెట్టి కథలెవరు  చెప్తున్నారు?)

విద్యార్థులు సాహిత్య పుస్తకాలు చదవడం లేదు (పాఠ్య పుస్తకాలలోనే సాహిత్యం తగ్గిపోయింది. పర్సనాలిటీ డెవలప్‍మెంట్, కెరీర్ ఓరియంటెడ్, స్పిరిట్యువల్ బుక్స్ మాత్రమే చదువుతున్నారు.

పబ్లిషర్స్ కూడా అలాంటి పుస్తకాలే ఎక్కువ ప్రచురిస్తున్నారు. పాఠకులను ఎందుకు చేరుకోలేకపోతున్నాం అనేది కఠినమైన ప్రశ్న. మంచి కథ ఎప్పటికీ నిలుస్తుంది. సమాజానికి మేలు చేకూర్చడం రచన బాధ్యత. ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం ఎలాంటి సీరియల్స్ వచ్చేవో అందరికీ తెలుసు.

యువ రచయితలకి ప్రోత్సాహం ఇవ్వాలంటే సీనియర్ రచయితలు తప్పుకోవాలి. చదివించాలంటే youngsters ని ప్రోత్సహించాలి. చదివించేలా రాస్తున్నామా అని ప్రశ్నించుకోవాలి. (యువతను ప్రోత్సహించాలి అనేది గొప్ప సజషన్. కానీ వారిని కూడా agenda based బ్యాచులు brainwash చేసి ఫలానా శైలే క్రియేటివిటీ అని నమ్మిస్తున్నారు. I’m a first hand witness to it).

లలిత చండీ:

నేను ముందుగా పాఠకురాలిని. వంద కథలు చదివితే గాని ఒక కథ రాయలేము. 16 ఏళ్ళకే ఒక నవల రాసి పోటీకి పంపాను. అది తిరిగి వచ్చేసింది. ఆ తర్వాత కొంత కాలం ఆపి, మళ్ళీ ఈ మధ్యే రాయడం మొదలుపెట్టాను. నాకు నా వృత్తి లోనే సంతృప్తి ఉంది. చదవడానికి భాష రావాలి. నేటి తరం పిల్లలు తెలుగు చదవడం లేదు.

కథలు చెప్పడానికి, నేటి సాంకేతికతని ఉపయోగించుకోవాలి. తమ పిల్లలకి తాము చదవడం నేర్పించారా అని రచయితలు ప్రశ్నించుకోవాలి. తెలుగు రాకపోవడమే పెద్ద ఇబ్బంది. నేను ఆడియో బుక్స్ వింటాను. ఆడియో బుక్స్ అందిస్తే మరికొంత మందిని చేరవచ్చు. (ఆడియో బుక్స్ చాలా మంచి సజషన్).

బి. మురళీధర్:

1987 నుంచి రాస్తున్నాను. గత 35 ఏళ్ళలో 25 కథలు రాశాను .  యూత్‍ని ప్రోత్సాహించాలి అంటే ఎంతో ఆశావహ దృక్పథం కావాలి. ఇది సంధి సమయం.

యూత్‍ని ఈ వైపు తిప్పడం కోసం కళాశాల విద్యార్థులకు కథ, కవితల పోటీ నిర్వహించాను. కానీ ఫలితాలు అంత ఆశాజనకంగా లేవు. మా జిల్లా రచయితల పేర్లు టీచర్లకీ, స్టూడెంట్స్‌కీ తెలియదు. (వారసుడు అని వారు రాసిన కథ గురించి వివరించారు). మంచి పాత రచనలను మళ్ళీ వెలుగులోకి తేవాలి. క్షేత్ర స్థాయిలో ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించాలి. కాలేజీ విద్యార్థులకు పోటీలు నిర్వహించడం ఒక ఆలోచన. (మరో మంచి సజషన్. కానీ వర్కౌట్ కాకపోవచ్చు. పాఠ్యపుస్తకాలలో తెలుగు తగ్గుతున్న వేళ).

బొమ్మదేవర నాగకుమారి:

(వీరి గురించి రెండు మాటలు. అప్పట్లో అంటే నా చిన్నప్పుడు వీరి రచనలు వీక్లీలలో వస్తేఅవి చదవటానికి పోటీ పడిన మా పిన్నుల హడావుడి బాగా గుర్తు నాకు. Last gen rep of golden age of Telugu commercial novel).

1987 నుంచి రాస్తున్నాను. అప్పట్లో సాహిత్యం ఒక్కటే వినోదమార్గం. వినోదానికి పుస్తకాలు మాత్రమే ఉండేవి. ఇంట్లో ఒక్క పుస్తకం ఉంటే కొత్త ప్రపంచాన్నే సృష్టించుకునేవాళ్ళం. టివి రావడంతో పుస్తక పఠనం తగ్గింది. కెరీర్ అవకాశాల కోసం అమెరికా వెళ్ళడం సులువవడంతో – రీడింగ్‍ తగ్గింది. సాహిత్యానికి ఇక్కడ గండి పడింది. అయితే ఇప్పుడు అక్కడ చదువు విలువ తెలుసుకుని హారీ పోటర్ వంటివి తెగ చదువుతున్నారు.

జెనరేషన్ మారుతోంది. పుస్తకం ఎంత ముఖ్యమో మనకి తెలుసు. రాయడానికి వయోపరిమితి పెడితే యూత్ ముందుకు వస్తారేమోనని నా అభిప్రాయం.

పి. జ్యోతి:

పాఠకులు దొరకడం లేదు అనే కన్నా, పాఠకులని మనమే సృష్టించుకోవాలి. ఫేస్‌బుక్‌లో నా ఆర్టికల్స్ చదివేవాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు. (I attest this. She’s one of the finest and most prolific writers of non-fiction in Telugu. కానీ అదంత అవసరం లేదు. జగమెరిగిన వ్యక్తి).

విలువలకి కట్టుబడి, మన దృక్పథంపై గట్టిగా నిలబడితే పాఠకులు ఉంటారు. మెదడుకి పని చెప్పేది మంచి సాహిత్యం (నా కొరియానమే గుర్తొచ్చింది. Inner Gollum: Narcissist. Narcissist GitacharYa.) వికారాలు కలిగించేది మంచిది కాదు. హృదయంలో కదలికలు తేగలిగేది మంచి సాహిత్యం. నేను పిల్లలని ప్రోత్సహించాను. పిల్లలకి సాహిత్యం గురించి చెప్పాలంటే నేను సినిమాల ద్వారా చెప్పాను (పూజా ఫలం సినిమా – మునిపల్లె రాజు గారి నవల గురించి వివరించారు. ఇదొక మంచి మార్గం కూడా. It సినిమా చూసి Stephen King రాసిన వెయ్యి పేజీల నవల చదివిన మా అన్న కొడుకు ఉదాహరణ).

మున్నూరు నాగరాజు:

నేను ఇప్పటి తరం ప్రతినిధిని. మార్కెటింగ్ రంగంలో ఉన్నాను కనుక కస్టమర్ జర్నీపై అవగాహన ఉంది. కన్నడ సాహిత్యం కూడా పరిచయం ఉంది. పంచతంత్ర కథలతో ప్రారంభించి చాలా చదివాను. లైబ్రరీలలో కూచుని చదివేవాడిని. విద్యార్థిగా ఉన్నతను – పాఠకుడిగా మారే ప్రాసెస్ ఉందా?

ఫోన్ లేకపోతే బతకలేనితరం ప్రస్తుత తరం. అప్పట్లో పుస్తకాలు చదివేవారు, ఇప్పుడు ఫోన్‌లో చదువుతున్నాను. చదివే మాధ్యమం మారింది. 40-60% చదవడం వచ్చిన వారు పుస్తకాలు చదువుతున్నారు. చదవడం తక్కువ వచ్చిన వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నారు. మేధావులు ట్విటర్ లో ఉన్నారు (???). వీరిలో మీ పాఠకుడెవరో గుర్తించాలి.

యూట్యూబ్ కథలు, ఇతర డిజిటల్ మీడియా పద్ధతులను పరిశీలించాలి. పాఠకులను చేరే మార్గం కనబడుతుంది. ప్రత్యక్షంగా అనుభూతి చెందేలా రాయగలిగితే చదువుతారని నా నమ్మకం. ఈ పుస్తకం చదివితే నాకు లాభం ఉంది అని ఫీలయితే పాఠకులు తప్పక చదువుతారు. (ఇదే పెద్ద ప్రమాదమై పోయింది నిజానికి. సాహిత్యం మరుగున పడి వ్యక్తిత్వ వికాసాలు పెరిగాయి. వాటివల్లా ప్రయోజనం శూన్యం). యువత త్వరగా కనెక్ట్ అయితేనే రచనలు ఎక్కువ పాఠకులకి చేరుతాయి.

Neglected Youth ని వదిలి elite readers కోసం ప్రయత్నిస్తే ప్రయోజనం ఉండదు (పుష్ప, కెజిఎఫ్2 సినిమాలు ఉదాహరణ చెప్పారు).

డా. వివేకానంద రాయపెద్ది:

నేను రచయిత కన్నా ముందు పాఠకుడిని. నా అభిప్రాయంలో పాఠకులు ఎక్కడికీ పోలేదు (నిజం. వారు చదివే రచనలే వారి వద్దకు చేరటం లేదు). ఇంకా పెరిగారు. ఎప్పుడూ Today is the best day అని అనుకోవాలి. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు ఎప్పుడూ నిత్య ఉత్సాహంతో ఉంటారు. రచయితలందరూ అలాంటి మైండ్‌సెట్‌లో ఉండాలి. ప్రస్తుత తరం వారు ఎవరిని ప్రోత్సహిస్తున్నారో గమనించుకోవాలి. ఆడియో బుక్స్ అవసరం ఉంది (కిరణ్ ప్రభ గారి గురించి చెప్పారు).

‘యాదోన్ కా ఇడియట్ బాక్స్’ పేరిట నీలేష్ మిశ్రా గారు – తన ఆడియో టాక్ షో లొ కథలు చదివి – యువ రచయితలను ప్రోత్సాహస్తున్నారని, ఈయన సబ్స్క్రయిబర్ బేస్ 10 లక్షల పై మాటేనని తెలిపారు.

పాఠకులు ఏ పంథా ద్వారా రసాస్వాదన చేస్తున్నారో గమనించుకుని ఆ పంథాలో ముందుకు సాగాలి.

గుండాన జోగారావు:

నేను ఖరగ్‍పూర్ వాసిని. ప్రస్తుతం పఠనం తగ్గి, వీక్షణం పెరిగింది. శ్రోతలు పెరిగారు, పాఠకులు తగ్గారు. పత్రికలలో వస్తున్న పెద్ద కథలు ఇప్పుడు ఎవరూ చదవడం లేదు. చిన్న కథలే చదువుతున్నారు. (ఫిల్మ్ క్రిటిక్ గా detailed reviews vs short and template reviews between my ex-employer and myself గుర్తొచ్చింది. కానీ పెద్ద కథలు చదివించేలా రాయలేక పోవటమే కారణం తప్ప చదవక పోవటం కాదు. కాకపోతే సోషల్ మీడియాల్లో అయితే వెంటనే చదవరు. Bookmark చేసుకుని మర్చిపోతారు. కానీ సమయం చిక్కినప్పుడు పెద్ద కథలు చదివేవారు నాకు చాలామంది తెలుసు).

వ్యంగ్యం, హాస్యం చక్కగా ఉన్న కథలు వాట్సప్‍లో వస్తున్నాయి. పాఠకులలో సాహిత్యం పట్ల ఆసక్తి పెంచాలంటే ఆడియో బుక్స్ తేవాలి. కథలని ఆడియో బుక్స్‌గా తెస్తే సరికొత్త పాఠకులని చేరుకోవచ్చని నా అభిప్రాయం. కాలేజీలోనూ విద్యార్థులకి/తెలుగు లెక్చరర్లకీ ‘కథా పఠనం’ ఒక తప్పనిసరి కార్యక్రమంగా పెట్టాలి. పుస్తకాలు ఇచ్చి చదివించాలి. రీడింగ్ సెషన్‍లు పెట్టించాలి. పుస్తకాలను కానుకలుగా ఇవ్వాలి. అలాగే కథల పోటీలలో మూస ఇతివృత్తాలకు బహుమతులు ప్రకటించకూడదు. న్యాయనిర్ణేతలుగా అకడమీషియన్లను కాకుండా కథకులనే పెట్టాలి. (అద్భుతమైన సజషన్).

వేదాల గీతాచార్య:

చదివే వాళ్ళు ఉన్నారు, కానీ చదివించే విధంగా రాసేవాళ్ళు ఎందరు? పిల్లలని సాహిత్యం చదివించాలంటే ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం ఎంతో ముఖ్యం. ఆ నమ్మకం, వాతావరణం ఉండాలి.

విభిన్నమైన కథలని ప్రోత్సహించాలి. అలాంటివి రాస్తే ప్రచురిస్తారన్న నమ్మకం ఉండాలి. రాసేందుకూ ఇంటివైపు నుంచీ ప్రోత్సాహం ఉండాలి. కథలు కాకరకాయలు రాసినప్పుడు ప్రోత్సహిస్తే ఉద్యోగం పక్కన పెట్టి వీటి గోలలో పడి కెరియర్ (ఏం బ్రహ్మ పదార్థమో? వదిలేస్తారని బాగున్నా బాలేదనటం లాంటివి స్వయంగా ఎదుర్కున్న సమస్య) – జై బాలయ్య!

తెలుగు కథలలో వెర్సటాలిటీ బాగా తగ్గింది. Style అసలే లేదు. Repetition of expressions and idiom ఎక్కువైంది (ఉదాహరణగా ‘వెన్నెలసోన’ అనే పదం గురించి చెప్పాల్సి వచ్చింది facepalm).

మూసలు/టెంప్లేట్స్ బద్దలు కొట్టలేకపోతున్నాం.

ఉదాహరణగా కుక్క నాకిన ముంజ- An award winning story  కథ క్లైమాక్స్ మార్చమని వచ్చిన సలహా!!!

గండ్రకోట సూర్యనారాయణ:

పాఠకులు రూపాంతరం చెందారు. ఇప్పటి పిల్లలకి తెలుగు చదవడం రాదు. ఆడియో అడుగుతున్నారు. పుస్తకం – ఫోన్ లోనూ, ఆడియో లోను లభ్యమయితే పాఠకులు (ఈక్షకులు?) పెరుగుతారు.

 

సలీం:

పాఠకులు పెరగాలంటే ఇంజనీరింగ్/మెడిసిన్‍లలో కూడా లిటరేచర్ ఉండాలి (Great suggestion. పాఠకుల కోసం కాదు కానీ, సాహిత్యం అవసరం చాలా ఉంది. దాని వల్ల కలిగే లాభాలు ఆ ప్రొఫెషన్ వారికి తెలుసు) సాహిత్యం వల్ల హృదయ వైశాల్యం పెరుగుతుంది. అది పిల్లలకి మేలు చేస్తుంది. మూస కథలకి విభిన్నంగా వ్రాస్తే ప్రచురించే పత్రికలు లేవు (సొంత కథ ‘అజా’ అనుభవం చెప్పారు). మంచి కథ అయినా ప్రచురించడం లేదు. జూనియర్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, సీనియర్స్ కూడా రాయాలి. యువకులకి/సీనియర్స్‌కీ విడిగా ప్రైజ్‍లుండాలి. (వీరిచ్చినది చాలా మంచి సజషన్. సంచిక ఇటీవలె నిర్వహించిన పోటీల్లో ఈ పద్ధతిని అనుసరించింది. )

సి.యస్. రాంబాబు:

Transformation of readers has happened. చదివే మీడియం మారిపోయింది. తెలుగు మీడియం దాదాపుగా లేదు. 80లలో తెలుగుకి బదులుగా ద్వితీష భాషగా సంస్కృతం ఎంచుకునే అవకాశం కల్పించినప్పుడు సమస్యకి బీజాలు పడ్డాయి. తెలుగు వారికి తమ భాషపై ప్రేమ తక్కువ.

పత్రికలలో యువతకి పత్యేక కాలమ్‍లు, ప్రత్యేక పేజీలు కేటాయించాలి. సగటు పాఠకుడి వయసుని తగ్గించ గలిగితే కొత్త పాఠకులు వస్తారు. (I second this).

గొర్రెపాటి శ్రీను:

నేను కూడా మొదట పాఠకుడినే, చిన్నప్పటి నుంచి విస్తృతంగా చదివేవాడిని. మా నాన్నగారి ప్రోత్సాహం ఎంతో ఉంది (వారి స్వీయ అనుభవాలు చెప్పారు). ప్రింట్ పత్రికలు తగ్గి ఆన్‌లైన్/డిజిటల్ మీడియా పెరిగిన ఈ రోజుల్లో – కథల/కవితల లింక్‌లను వీలైనంత ఎక్కువగా షేర్ చేసుకుంటే పాఠకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నేటి పాఠకులను అనుగుణం శైలిని మలచుకోవాలి.

డా. చిత్తర్వు మధు:

పోటీలు మరిన్ని పెడితే ప్రయోజనం ఉంటుందని నా భావన. పాత తరం ఎడిటర్లు – రచయితలని ఎంతో ప్రోత్సహించేవారు. సినిమాలకైనా, నాటకాలకైనా కథే ముఖ్యం. ఈ రోజుల్లో ప్రచారం చాలా ముఖ్యం. కథకులు ఫేస్‍బుక్ లైవ్ లేదా జూమ్ మీటింగ్‌లలో వీలైనంతగా సమావేశం అవ్వాలి (చదువరులతో). ఏ జాన్రా లో రాసేవాళ్ళు, ఆ జాన్రా శిక్షణ ఇవ్వాలి. సొల్యూషన్ ఇవ్వాలి. రచయితకి దృక్పథం ఉండాలి. అప్పుడే పాఠకులను చేరుకోవచ్చు.

నండూరి సుందరీ నాగమణి:

1990ల నుంచి రాస్తున్నాను. పాఠకులను రీచ్ అవడం ఎలా? ఏ జానర్‌ తీసుకున్నా ఆకట్టుకునే రీతిలో రాయగలగాలి. శైలి ముఖ్యం. అది బావుంటే ఎవరినైనా ఆకట్టుకోవచ్చు. పత్రికల సంఖ్య తక్కువగా ఉంది కాబట్టి ఫేస్‌బుక్‌లో కూడా రాసుకోవచ్చు. వాక్య నిర్మాణం సరిగా ఉండాలి. క్లుప్తంగా ఉండాలి.

కొల్లూరి సోమ శంకర్:

రచయిత పాఠకుల మధ్య కమ్యూనికేషన్ ఉంటే – దాని ద్వారా ఒక పాఠకుడు మరింత మందిని రచయితకి పరిచయం చేయగలడు. (సలీం గారితో తన అనుభవాన్ని వివరించారు). ఆధునిక కాలంలో రచయిత పాఠకులతో ఫోన్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా లేదా ఇతర డిజిటల్ మీడియా పద్ధతులతో టచ్‍లో ఉంటే ఏర్పడే సుహృద్ భావన ఆ పాఠకుడి ద్వారా మరికొంత మంది కొత్త పాఠకులను తెచ్చే అవకాశం ఉంటుంది.

ఈ విధంగా అందరూ తమ సృజన స్వరాలను వివరించగా, ఇంత వరకూ సమన్వయం చేస్తూ కట్టు తప్పకుండా కాస్తూ వచ్చిన…

కస్తూరి మురళీకృష్ణ ఈ చర్చని సంగ్రహంగా వివరించారు.

అనంతరం సెషన్ ముగింపు శ్రీ కోవెల సుప్రసన్నాచార్య గారి మాటలతో జరిగింది.

“70 సంవత్సరాల వెనక్కి వెళితే నేనూ పాఠకుడినే. ఆ రోజుల్లో మేము వినేవాళ్ళం. కావ్యాలు/కవితలు పఠిస్తుంటే మేం వినేవాళ్ళం. రచయిత కథ/నవల/కవిత్వం – చదివి వినిపించే సంప్రదాయం ఉండాలి.

మాది ఉర్దూ మీడియం. అప్పట్లో గ్రంథాలయ ఉద్యమం ఉండేది. మా రోజుల్లో తెలుగు భాషను ప్రజలే రక్షించుకున్నారు. ఆ రోజుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. ఈ రోజు ప్రజలే తెలుగు భాషను వద్దంటుకున్నారు. ఇప్పుడు తెలుగు కోసం మరో ఉద్యమం రావాలేమో అని అనిపిస్తోంది. (ఇది నిజం). ప్రజలకు సాహిత్యానికి మధ్య వంతెనగా ‘సాహిత్య పఠనం’ ఉండాలి. అలాంటివి సంచిక, స్వాధ్యాయ చేయాలి. నెల కొకసారి చదివి వినిపించాలి. Reciter Organization అవసరం అని నాకు తోచింది. ప్రజల భాష నశించకూడదు.”

ఈ విధంగా మిగిలిన సెషన్లలో కూడా చర్చించాల్సిన కొన్ని అంశాలు కూడా వ్యక్తపరచబడ్డాయి. కానీ ఎక్కడో చిన్న అసంతృప్తి. ఎందుకు? సొల్యూషన్ అయితే కాంక్రీట్ గా దొరక లేదు. కానీ ఒక ఆలోచనగా బీజం అయితే పడింది సంచిక ద్వారా.

కథలుమ్ కాకరకాయలుమ్

సినిమా అంటే మలయాళ సినిమాల గురించి. పుస్తకం అంటే తొంభై శాతం ఇంగ్లీషు పుస్తకాలు. గొప్ప రచన అంటే లెఫ్టిస్టు లిబరల్. ఈమధ్య దేశంలోనే కాదు. ప్రపంచంలో కూడా Wokes పడ్డారు. సమాజం సమస్య.

హహహ! సమాజమే సమస్య. సామాజిక సమస్యలే సమస్య కథలు ఎక్కువ మందికి చేరటానికి. There’s no pulp fiction in Telugu because pulp and fiction are English words అని తోటి రచయిత, మిత్రుడు శ్రీను పాండ్రంకితో నేను అన్న మాటలు గుర్తొచ్చాయి. Where’s pulp fiction in Telugu? All there’s is పులుపు ఫిక్షన్. పులిసిపోయిన ఫిక్షన్. సాహిత్యాన్ని సినిమాగా మలుస్తే పుస్తకాల గురించి తెలుసుకుని చదివే అవకాశం ఉంది. Lord of the Rings అమ్మకాలు 2001-2003 వరకు వచ్చిన సినిమాల వల్ల ఎన్ని రెట్లు పెరిగాయి? Just like commercial cinema, mainstream literature needs a commercial push.

తెలుగులో మంచి సినిమాలు వచ్చినా మల్లూ సినిమాలను తెగ మెచ్చుకునే వారి మీద ఎంత ఒళ్ళు మండుతుందో… తెలుగులో క్రైమ్ ఫిక్షన్, సైఫై, ఎన్ని జాన్రాలు? ఏవి? ఎక్కడ? వీటిని రాకుండా అడ్డుకుంటున్న వారి మీద కూడా అంత మండుతుంది.

సైఫై రైటర్ మధు చిత్తర్వు గారితో పరిచయం గొప్ప అనుభూతి. వారు కొరియానం బాగుందనటం cringeworthy bittersweet moment. I wanted to get introduced to him as a hard sci-fi writer. టైమలా వచ్చింది.

మొత్తానికీ కస్తూరి వారి చొరవతో మొదలై కోవెల వారి వెలకట్టలేని ఆతిథ్యంతో (చాలా గొప్ప విలువైన పుస్తకాలు ఆప్యాయంగా అందించటం…) ముగిసిన ఈ సమావేశం ఒక కొత్త అనుభూతి.

భవిష్యత్తులో సంచిక-స్వాధ్యాయలు నిర్వహించే సమావేశాలకోసం ఎదురుచూస్తూ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here