తెలుగు అసోసియేషన్, సిడ్నీ వారి 30 సంవత్సరాల వార్షికోత్సవ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

0
11

[dropcap]తె[/dropcap]లుగు అసోసియేషన్, సిడ్నీ (www.sydneytelugu.org) తన 30వ జన్మదినం శోభాయమానంగా ఆదివారం 23-April-2023 తేదీన ఘనంగా జరుపుకుంది. ఈ మైలురాయికి గుర్తుగా ఒక ప్రత్యేక సావెనీర్, అందించాలని కార్యవర్గం నిర్ణయించుకొని, దాని సంపాదక బాధ్యతను నాకు అప్పగించింది. తెలుగు అసోసియేషన్, సిడ్నీ, 30వ జన్మదినం మరియు సావెనీర్ విడుదల శుభ సందర్భంలో, అందరికీ శుభాభినందనలు! దాని ఆవిష్కరణ ప్రత్యేక అతిధులుగా విచ్చేసిన శ్రీయుతులు చంద్రబోస్, శివారెడ్డి గాయకులు చిరంజీవులు హరిణి, సాయిచరణ్, యాంకర్ అభినవ కృష్ణ, మరియు కార్యవర్గం, సంపాదక వర్గాల చేతుల మీదుగా జరిగింది. తెలంగాణా ముఖ్యమంత్రి, శ్రీ కె. చంద్రశేఖరరావు గారు తమ అభినందన సందేశాన్ని అందించారు, అది సావెనీర్‌లో పొందుపరిచాము. అందు పొందుపరచిన సంపాదకీయంలో కొన్ని భాగాలు ఇక్కడ పంచుకుంటున్నాను.

మలుపు మలుపుల జీవితపుదారిలో, మలుపులు క్షణమైన మెరుపులా కాలచక్రగతిలో మెరిసినా, ఒక్కొక్కసారి బలమైన వెలుతురుతో జీవితాన్ని ముందుకు నెడుతూ ఉంటాయి! అనంత కోట్లాది నక్షత్రాల మధ్య చిన్న బిందువైనా కాని, మానవ (మన) (తెలుగు వారి) ప్రస్థానం ఒక అల్పాయణువైన భాగమే!

ఐదు పదులు దాటిన ఆస్ట్రేలియా తెలుగువారి ప్రస్థానం, మొదట్లో వైద్య, విద్యా, పరిశోధనా రంగాల్లోని నిష్ణాతులకు పరిమితమైనా, 1990 దశకంలో కంప్యూటర్ రంగ నిపుణుల వలస వలన ఎన్నో రెట్లు పెరిగిందనే చెప్పాలి. గత 30 సంవత్సరాలలో, సంఖ్యాపరంగా పెరిగి, సామాజికంగా, ఆర్థికంగా నిలదొక్కుకుంటూ, వృత్తులలో ముందడుగు వేస్తూ, మెట్టినింటికి సేవలు అందిస్తూ, అభివృద్ధిని, మరియు సివిల్ పురస్కారాలు కూడా అందుకొంటున్నారు. కొంతమంది రాజకీయ రంగంలో ప్రవేశిస్తున్నారు, రాణిస్తున్నారు.

భిన్న సంస్కృతి, ఆహార వ్యవహారాలు, జీవన విధానాల మధ్య- బ్రతుకు తెరువు కోసం ఆరాటం, ప్రతి తెలుగు మనిషినీ ఒక్కొక్క విధంగా ప్రభావితం చేశాయి. చేస్తున్నాయి. చేస్తాయి కూడా! భాష, సాహిత్యాల పట్ల సమున్నత సంఘటిత కృషి చేయాలి. కొంత సాహితీ సంపద సృజించినా, శిఖరాల అనుభవాలు, అనుభూతులు- ఎన్నెన్నో అక్షరబద్ధం చేయవలసిన బృహత్తర అవసరం ఉంది. ఇక్కడి మంచి దేశీయ పద్ధతులను, భిన్న సంస్కృతుల జీవన విధానాన్ని ఉన్నతిస్తూ, కథలను వెలువరిస్తే, స్వంత భూమిలో కొంత ఆలోచన రేకెత్తించ వీలుపడుతుంది. తెలుగులో ‘ఆస్ట్రేలియా కథ’, ‘అమెరికా కథ’, అలా భిన్న భిన్న కథలు తన విలక్షణతను రూపొందించుకోవాలి.

వీటి నేపధ్యంలో ఈ సావెనీర్ ప్రణాళిక రూపొందించాము. అసోసియేషన్ చరిత, పెరుగుదల, సేవ విభాగాలు, అందుకొన్న మైలురాళ్ళు శిలాకరిస్తూ, ఆశలు, ఆశయాల గురించి చర్చించడం జరిగింది.

తెలుగువారి మదిలో తమ నటనతో, ఆహార్యంతో, జీవన శైలితో, మాటనీ దేవుళ్ళుగా నిలిచిపోయిన, నందమూరి (28-05-23), అక్కినేనిల (20-09-23) శతజయంతి, మరియు వారిద్దరి పాటలకు జీవంపోసి, తెలుగువారి అదృష్టంగా, తన గంధర్వగానాన్ని ధారపోసిన ఘంటసాల (04-12-22 శతజయంతి) పురస్కరించుకొని, వారిపై కొన్ని వ్యాసాలు పొందుపరిచాము. అలాగే, తెలుగువారి మదిలో ఎనలేని ఖ్యాతిని అందుకొన్న గాయక శిఖామణి ఎస్పి బాలు, నటులు కృష్ణ, కృష్ణంరాజు, దర్శకుడు కె. విశ్వనాథ్, రచయిత సిరివెన్నెలలకు నివాళిగా వారిపై కథనాలను అందిస్తున్నాము. మన చరిత రాసుకొనే దిశగా కొన్ని స్వగతాలు, చరిత్ర కథనాలు, ఉగాది కవితలు మీకు కనిపిస్తాయి.

అడిగిన వెంటనే, తమ రచనలు అందించిన అందరికీ, ఈ సావెనీర్ ముద్రణకు, ఆర్ధిక సహకారాలు అందించిన ప్రోత్సాహకులకు, వివిధ విధాలుగా చేయూత నిచ్చిన అందరికీ, పేరుపేరునా మా ధన్యవాదాలు.

ఇది సామాజిక సాహిత్యం. ఒక విధంగా మన చరిత్ర మనం రాసుకోవడం!

భాష మారేదే, అంటే సంస్కృతీ మారేదే! మార్పు సహజం!

సాహిత్యం బలపడితే, భాష, దానితో సంస్కృతి వెల్లివిరియడం సుసాధ్యం!

మంచిని ఎంచుతూ, పంచుతూ, తోటి ఆస్ట్రేలియన్లకు మన తెలుగు భాష ఔన్నత్యాన్ని, మన సాహిత్యాన్ని భిన్న సంస్కృతి వారికి పరిచయం చేయాలి. దాని యందు వారికి అనురక్తిని కలుగజేస్తే, తెలుగు భాషను తెలుగు వారే కాదు, మరెందరో స్వచ్ఛంద పూనికతో అలరించ వీలుపడుతుంది.

తెలుగువారు మరింత ఉన్నతిని అందుకోవాలని, తెలుగు అసోసియేషన్, మహోన్నత స్థితికి చేరాలని, ఆకాంక్షిస్తూ, మళ్ళీ మరు సంచికలో, మిమ్ములను కలుసుకుంటాను. అంతవరకు సెలవు!

సర్వే జనాః సుఖినో భవంతు!

మీ, సారధి మోటమఱ్ఱి.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here