సంచిక విశ్వవేదిక – ది ఎంట్రాన్స్ బీచ్

0
12

[box type=’note’ fontsize=’16’] సంచిక విశ్వవేదిక శీర్షికలో భాగంగా ది ఎంట్రాన్స్ బీచ్‍లో తమ పర్యటనానుభవాలను వివరిస్తున్నారు శ్రీమతి వి. శాంతి ప్రబోధ. శీర్షిక నిర్వహణ శ్రీ సారధి మోటమఱ్ఱి. [/box]

[dropcap]జ[/dropcap]నవరి 26.

ఆస్ట్రేలియా డే కాబట్టి పబ్లిక్ హాలీడే. ఆస్ట్రేలియా డే అంటే వాళ్లకి స్వతంత్రం వచ్చిన రోజేమో అనుకున్నా.. కానీ కాదట.

బ్రిటిష్ వాళ్లు ఆస్ట్రేలియాలో ప్రవేశించి తమ భూభాగంగా ప్రకటించి మొదట జండా ఎగురవేసిన దినమట.

సెలవు దినం కావడంతో ఎటైనా బయటికి వెళ్లదామన్నారు మా పిల్లలు. అంతలో మా అమ్మాయి వయసున్న నా కజిన్ ఫోన్ చేశాడు. వాడు మాకు ఇరవై నిముషాల దూరంలో ఉంటాడు.

పబ్లిక్ హాలీడే గురించి అందరం ఎక్కడికైనా వెళ్దామా అని ప్రపోజల్ పెట్టాడు. మేమూ అదే అనుకుంటున్నాం కాబట్టి వెంటనే ఓకే అనేశాం. ఎక్కడికి వెళ్లాలని నిర్ణయించే బాధ్యత తనే తీసుకున్నాడు నా కజిన్ వర్ధన్.

మా అమ్మాయి సాధన, అల్లుడు రాజేష్, పిల్లలు సౌరవి, సుచిర్, నేను బయలుదేరాం.

వర్ధన్ భార్య, కూతురుతో పాటు వాళ్లత్తగారితో బయలుదేరాడు.

సిడ్నీకి పడమటి దిశలో ఉన్న మా ప్రయాణం ఉత్తర దిశగా సాగింది.

సెంట్రల్ కోస్ట్ లో ది ఎంట్రాన్స్ బీచ్ మా గమ్యం.

కొండలను చీల్చుకుంటూ విశాలమైన రోడ్లు.

చుట్టూ పరుచుకున్న చిక్కని పచ్చదనం. ఎత్తైన కొండలు, లోతైన లోయలు, నదులు కనువిందు చేస్తుంటే ఆస్వాదిస్తూ సాగింది ప్రయాణం.

ది ఎంట్రాన్స్ చేరుకున్నాం.

కారు పార్కింగ్ ఏ మాత్రం ఖాళీ లేదు. అక్కడక్కడే రెండు రౌండ్స్ వేశాం. ఖాళీ లేదు.

పార్కింగ్ వెతుక్కుంటూ ఒక బీచ్ నుండి మరో బీచ్ చివరి వరకూ తిరుగుతున్నాం. కానీ పార్కింగ్ లేదు. చివరికి మైలు దూరంలో ఓ లోపలి రోడ్డులో దొరికింది.

ఆ పసిఫిక్ సముద్ర తీరపు ఎంట్రాన్స్ చిన్న టౌను. పర్యాటకులతో, వారి వాహనాలతో కిటకిటలాడుతూ ఉంది.

ఎటుచూసినా జాతరలో ఉన్నట్లు జనం. బీచ్ టెంట్స్ వేసుకుని, వేసుకోకుండా.

లేత గులాబీ రంగు ఇసుక నీడ కోసం వేసుకున్న రంగు రంగుల టెంట్లు, గొడుగులతో కొత్తదనం ఒంపుకుంది.

నీలాకాశంతో పోటీపడుతున్న సముద్రుడు పలుచని ఎండపొడ పడి వింతగా మెరుస్తూ..

అంచులకు వచ్చేసరికి ఓ రకమైన పచ్చదనం (సీ గ్రీన్) కూడా అద్దుకున్నట్టున్న సముద్రుడు..

అప్పుడప్పుడు ఎగిసి పడే అలలు..

తీరంలో స్వచ్ఛంగా కనిపించే నీళ్లు..

మేం పిల్లలకు అనువుగా ఉండే ప్రాంతం ఎంపిక చేసుకున్నాం.

ఎగిసి పడే అలలు అక్కడ కనిపించవు. భుజాలను మించి నీళ్లు లేవు. మధ్యలో చిన్న ఐలాండ్ లాగా మేట వేసిన ఇసుక వరకు వెళ్లి వస్తున్నారు జనం. మా పిల్లలు ముగ్గురు చిన్నవాళ్లు కావడంతో అక్కడే బెటర్ అనుకున్నాం. చిన్న దీవిలాగా ఉన్న ఆ ఇసుక దిబ్బ అలల్ని అడ్డుకుంటూ పిల్లలకు సురక్షిత ప్రాంతంగా తయారయింది.

కనిపించిన చిన్నజాగాలో మా సరంజామా పెట్టి సెటిల్ అయ్యాం.

చుట్టూ చూస్తే ఆడ-మగ, చిన్న-పెద్ద, రాజు-పేద, నలుపు-తెలుపు మనుషులేనా.. వారితో వారి పెట్స్..

కొందరు స్విమ్ సూట్స్ లో.. మరికొందరు తమకు అనువైన దుస్తులతో నీటిలోకి పోతూ.. తిరుగుతూ..

నెలల పిల్లలని కూడా నీళ్లలో కూర్చోపెట్టే పెద్దలు, యథేచ్ఛగా ఉప్పు నీటిలో బీచ్ టాయ్స్‌తో ఆడుతూ ఐదేళ్ల లోపు పిల్లలు లోపలికి కదులుతూ ఆపై పిల్లలు కొందరు సర్ఫింగ్ చేస్తూ, నీటిపై తేల్చే టూల్స్ వాడుతూ వెళ్లిపోయే పిల్లలూ.. అసలు భయమనేది లేకుండా.. పెద్దలు వాళ్ళని కాపు కాసుకుంటూ..

మనం అంత ధైర్యంగా పిల్లల్ని ఒదులుతామా అన్నది బంధువులావిడ. నిజమే రెండు మూడేళ్ళ పిల్లలు కూడా పెద్దలు లేకుండా నీళ్ళలోకి వెళ్లిపోతున్నారు. ఎంత అలలు లేకపోయినా ఉన్న నీళ్లు చాలవూ ఏదైనా అనర్థం జరగడానికి అనిపించింది.

అదంతా చూస్తుంటే నాకర్థమయిందేమంటే వాళ్ళు పిల్లలకి జాగ్రత్తలు చెబుతారు కానీ భయపెట్టరని.

“సో మెనీ పీపుల్, సో మచ్ ఆఫ్ నాయిస్” అంటూ చెవులు మూసుకున్నాడు సుచీ.

పిల్లలు ఈత కొలనులో నేర్చుకుంటున్నారు. స్విమ్ సూట్ ఉంది కాబట్టి వాళ్ళని వాటిలోకి మార్చాము. అవి తడిసిన ఒంటికి అతుక్కుపోయి ఇబ్బంది కలిగించవని.

ఆ తర్వాత ఇసుకతో ఆడటం మొదలు పెట్టి నెమ్మదిగా నీళ్లలోకి చేరాడు. ఇసుక తవ్వి వచ్చిన నీళ్లను చూడడం, లోపలినుంచి తడి ఇసుక తెచ్చి కాసిల్ లాగ చేయడం వంటి ఆటల తర్వాత ఆడపిల్లలు ఇద్దరు నీళ్ళలోకి దిగారు.

Image Courtesy: Central Coast Australia

మధ్య మధ్యలో నీటిలో కనిపించే చేపల కోసం ఎగిరే పెలికాన్ పక్షులను గమనిస్తూ..

మా సుచిర్‌కి నీళ్లంటే మోహం, వ్యామోహం.

తినడానికి బలవంతాన కొద్దిసేపు ఒడ్డున కూర్చున్నప్పటికీ ఏదో ధ్యానంలో ఉన్నట్లు సముద్రం వైపు చూస్తూ..

టాయిలెట్ సదుపాయాలు పిల్లలకి, వీల్ చైర్‌కి కూడా సౌలభ్యంతో ఉన్నాయి. ఉప్పునీటిలోంచి బయటకు రాగానే దగ్గరలోనే ఉన్న షవర్స్ కింద మంచి నీటితో కడుక్కుంటున్నారు కొందరు. కొందరు అలానే బట్టలు మార్చుకుంటున్నారు. సదుపాయాలు బాగున్నాయి. అవసరమైనవి కొనుక్కోవడానికి షాపింగ్ ఉంది. పిల్లలను ఉల్లాస పరచడానికి జైన్ట్ వీల్, వంటివి ఉన్నాయి.

భోజనాల సమయంలో మా అల్లుడు, తమ్ముడు భోజనాలు తేవడానికి వెళ్లారు. బంధువులావిడ నాన్ వెజ్ తినరు. కాబట్టి ఇంటినుండి పెరుగన్నం తెచ్చుకున్నారు. మేమంతా అక్కడి తిండే. బర్గర్స్ బాగున్నాయ్ అనుకున్నారు మా వాళ్ళు. నా కోసం ప్రత్యేకంగా సీ ఫుడ్ తీసుకున్నారు. కారం, మసాలాలు లేవన్నమాటే కానీ చాలా బాగుంది సాస్ అద్దుకుని తింటే.

పబ్లిక్ హాలిడే కావడంతో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. దారిలో ఆక్సిడెంట్ కావడంతో దారి మళ్లింపు వల్ల గమ్యం చేరడానికి కొద్దిగా ఆలస్యం. పార్కింగ్ కోసం అరగంటపైనే సమయం పట్టిందని తప్ప, రోజంతా ఆహ్లాదకరంగా బాగా గడచిపోయింది.

వి. శాంతి ప్రబోధ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here