సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో..11

0
11

[box type=’note’ fontsize=’16’] సంచిక విశ్వవేదిక శీర్షికలో భాగంగా విశ్వవీధుల్లో తమ ప్రయాణపు అనుభవాలను వివరిస్తున్నారు శ్రీమతి వి. శాంతి ప్రబోధ. శీర్షిక నిర్వహణ శ్రీ సారధి మోటమఱ్ఱి. [/box]

నా అమెరికా ప్రయాణం

[dropcap]అ[/dropcap]మెరికా ప్రయాణం అయితే ఏమిటట?!

రోజూ ఎంతో మంది ఆ ప్రయాణం చేస్తున్నారు. విశేషం ఏముంది అని మీరు అనుకోవచ్చు.  నిజమే కానీ.. ఎవరి అనుభవాలు వారివే కదా..! ఎవరి అనుభూతులు వారివే కదా..!

అందుకే నా అనుభవాలు, అనుభూతులు మీతో పంచుకోవాలని ఇలా మీ ముందుకొచ్చాను. నాలుగు వారాల అమెరికా యాత్ర గురించి వివరంగా మీ ముందుకు తేవాలని నా ప్రయత్నం. మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

ముందుగా నా ప్రయాణం గురించి ముచ్చటించుకుందామా.. మొదట ఇద్దరం అనుకున్న ప్రయాణం చివరికి నేనొక్కదాన్నే చేయాల్సి వచ్చింది.

చిన్న చితక ప్రయాణమైనా ఏడు సముద్రాల ఆవలి ప్రయాణమైనా ఆడవాళ్ళకి ఒకటే. చివరి వరకు బోలెడన్ని పన్లు. ఎన్ని సర్దుకోవాలి. ఎన్ని అప్పగింతలు పెట్టాలి.. అయినా ఇప్పుడు ఆ గోల ఎందుకులే..

నా ప్రయాణం నవంబరు 30 న.

అదే రోజు మా ఆయనకు పని మీద వేరే ఊరు తప్పనిసరిగా వెళ్లాల్సి వచ్చింది. సో.. కారు లేదు. క్యాబ్ పిలిచాడు అబ్బాయి. తనని ఎయిర్ పోర్ట్‌కి వద్దన్నాను. పోను ఎలాగూ తప్పదు. తిరిగి రాను క్యాబ్ ఖర్చు ఎందుకని.

హైదరాబాద్‌లో మా ఇంటి నుంచి ఉదయం 11. 30కి నా ప్రయాణం మొదలైంది. 12.30 లోపు ఎయిర్‌పోర్ట్‌కి చేరా. ఈ మధ్యలో మా అబ్బాయి ఫోన్. ఏమైంది? ఏమైనా ఇబ్బందా.. కారు ఆగి అక్కడే తిరుగుతున్నది అంటూ.. ఇంట్లో ఉన్న వాడికి ఎలా తెలిసిందని ఒకింత ఆశ్చర్యపోతూ విషయం చెప్పాను. ఇంధనం కోసం రోడ్డుకు ఆవలి వైపు వెళ్లి ఆగిందని. ఈ కాలం పిల్లలు ఏదీ పట్టించుకోనట్టు, నిర్లక్ష్యంగా ఉన్నట్టు ఉంటారు కానీ, అన్నీ ఓ కంట కనిపెడుతూనే ఉంటారని మనసులోనే ఆనందపడ్డా.

హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఎయిర్ ఇండియా డొమెస్టిక్‌లో(25+7 లగేజీ కోసం ఈ ప్లైట్. లేదంటే కొన్నిటిలో 15+7, కొన్నిటిలో 7 కేజీలు మాత్రమే అనుమతి). అక్కడి నుండి ఇంటర్నేషనల్ ట్రావెల్ నాది.

రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్ డొమెస్టిక్ డిపార్చర్ దగ్గర బండి దిగే వరకు డ్రైవర్‌తో ముచ్చట్లు.

ఆర్మీ జవాను ఉద్యోగం కోసం పరీక్షలు రాసి పాసై వైద్య పరీక్షలు ముగించుకుని అప్పాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తూ డిగ్రీ పూర్తి చేసుకున్న ఆ యువకుడు జీవిక కోసం క్యాబ్ నడుపుతున్న వైనం వివరించాడు.

అతను ఆ విషయాలు చెబుతుంటే ఆర్మీ రిక్రూట్మెంట్ విషయంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఆందోళన గుర్తొచ్చింది. ‘ఆ రోజు నువ్వు కూడా ఉన్నావా’ అని అడిగాను. ‘నిజానికి నేను కూడా ఆ సమయంలో అక్కడ ఉండాల్సింది. కానీ మా నాన్నను హాస్పిటల్‌లో చేర్చడం వల్ల నేను నాన్నతో ఉండాల్సి వచ్చింది. మేము నిరసన తెలియజేయాలని అనుకున్నాం. కానీ అది ఏదో అయి ప్రాణాలు పోవడం, కోర్టు గొడవల్లో ఇరుక్కుని జీవితం చిక్కుముడి లాగా తయారయింది కొందరికి’ అని బాధ పడ్డాడు. తమ ఎదురు చూపులకు ఫలితం దక్కుతుందో లేదోనన్న ఆందోళన అతనిది.

నేనతనికి బెస్ట్ విషెస్ చెబితే అతను నాకు సేఫ్ జర్నీ అని చెప్పి, నా లగేజీ ట్రాలీ లోకి ఎక్కించి వెళ్ళిపోయాడు.

నేను బాగేజ్ చెకిన్ చేసి లాంజ్ లోకి వచ్చి కూర్చున్న కొద్దిసేపటికే బోర్డింగ్ మొదలైంది. నాది విండో సీట్. విండో లోంచి చూస్తూ మేఘాలపై ప్రయాణం చేయడం నాకు చాలా ఇష్టం. ఆ ప్రయాణాన్ని ఎప్పుడు ఆస్వాదిస్తాను.

నిర్ణీత సమయానికి 2.30కి నా విమానం టేక్ ఆఫ్ తీసుకుంది. నా పక్క సీటు ఖాళీ. ఆ మధ్యాహ్న వేళ విండో బయట దృశ్యాలు నాకేమీ ఆసక్తి కలిగించలేదు. కళ్ళు మూతలు పడుతున్నాయి.. పక్క సీటు ఖాళీగా ఉండటంతో ఆరాం సే కూర్చుని కళ్ళు మూసుకున్నా.

అంతలో ఫుడ్ సర్వ్ చేయడం మొదలు పెట్టారు. రోటీ, వెజ్ రైస్, రాజ్‌మా, కోఫ్తా, సలాడ్, పెరుగు,ఆ తర్వాత చాకోలెట్ తో భోజనం ముగిసింది. 4.55కు గమ్యస్థానం చేరాల్సిన విమానం సాయంత్రం 4.30 గంటలకే అంటే 25 నిమిషాల ముందే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, టెర్మినల్ 3 వాకిట వాలింది.

చెకిన్ బ్యాగేజ్ బెల్ట్ నంబర్ 1 లో వస్తుందని ఫ్లైట్ లో ప్రకటించారు. అక్కడికి వెళ్తే అక్కడ ఖాళీ. నాలాగే పాసెంజర్స్ బెల్ట్ ఏదో వెతుక్కుంటున్నారు. అంతలో అమెరికాలో ఉండే మేనల్లుడు శశి ఫోన్. ఆ విషయం చెప్తూనే బ్యాగేజ్ ఏ బెల్ట్ పై వస్తుందో చూస్తున్నా. మళ్ళీ చేస్తా అంటూ ఫోన్ పెట్టాడు శశి.  బెల్ట్ నంబర్ 5 లో వచ్చింది. మళ్ళీ ఫోన్ చేసిన శశి అదే విషయం చెప్పాడు.

అక్కడికి వెళ్లేసరికి నా బ్యాగేజ్ బెల్ట్ పై కనిపిస్తూ. బ్యాగేజ్ తీసుకుని ట్రాలీ లో పెట్టుకుని ఇంటర్నేషనల్ డిపార్చర్ వైపు నడిచా.

నేను దిగింది టెర్మినల్ 3, ఎక్కేది కూడా టెర్మినల్ 3 కాబట్టి సులభంగానే ఇంటర్నేషనల్ డిపార్చర్స్‌కి చేరాను.

వెళుతున్నా కానీ నా లోపల సంకోచం. కారణం నా దగ్గర కంఫర్మ్ చేసిన టికెట్ లేకపోవడం. టికెట్ లేకుండా ఎలా వచ్చావని ఆశ్చర్యపోకండి. కొద్దిగా ఓపిక పట్టండి అక్కడికే వస్తున్నా.

శశి పంపిన టికెట్ కాని టికెట్ (పాస్) చూపించాను గేట్ దగ్గర.

అమెరికన్ ఎయిర్‌లైన్స్ స్టాఫ్ ప్రయాణికులా అని అడిగారు. అవును, అని చెప్పి చేతిలో ఫోన్ చూపించాను.

నా మొబైల్‌లో ఉన్న ఆ టికెట్‌ను పరిశీలనగా మరో సారి చూసి, అవుననే నా సమాధానం విని లోపలికి పంపించారు. అప్పటికింకా సమయం 5.30 దాటలేదు.

అమెరికన్ ఎయిర్‌లైన్స్ కౌంటర్ ఎదురుగా ఉన్న కుర్చీల్లో సెటిల్ అయ్యానో లేదో శశి నుంచి వాట్సాప్ మెస్సేజ్. ఆ రోజు అమెరికన్ ఎయిర్‌లైన్స్ టికెట్ స్టేటస్ డీటెయిల్స్ తెలుపుతూ. ఎకానమీ, బిజినెస్, ఫస్ట్ క్లాస్ టిక్కెట్లలో ఉన్న ఖాళీలు తెలుపుతూ..

నాకు ఏదో ఒక క్లాసులో టికెట్ ఖచ్చితంగా వస్తుంది అన్న నమ్మకం వచ్చింది.

D 1 అంటే అమెరికన్ ఎయిర్‌లైన్స్ స్టాఫ్, D2 అంటే అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగి భార్య/భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, D3 అంటే వారి బంధు మిత్రులు వస్తారు. ముందుగా D1, ఆతర్వాత D2, ఆ తర్వాత D 3 ప్రయాణికులకు ప్రాధాన్యత ఇస్తారు. ఆ లెక్కన నేను D3 ప్రయాణికురాలిని.

D1, D2 ప్రయాణికులు లేకపోతే నాకు ఫస్ట్ క్లాసులో లేదంటే ప్రీమియం బిజినెస్ క్లాస్‌లో టికెట్ దొరుకుతుందని స్పష్టమైంది. ఒకవేళ బిజినెస్ క్లాస్‌లో లేకపోతే ఎకానమీ లోకి వెళ్ళాలి. ఫస్ట్ క్లాస్/బిజినెస్ క్లాస్ టికెట్ ఖరీదు 370$ (30వేలు), ఎకానమీ 280$ (24వేలు) కట్టాలి. అవి టాక్స్‌లు, ఎయిర్‌పోర్ట్ ఛార్జి కోసం తీసుకుంటారట.

అవి నేను కట్టాలేమో.. ఎలా కట్టాలి, క్యాష్ తీసుకుంటారా? కార్డు తీసుకుంటారా? లేదంటే ఆన్లైన్ ట్రాన్స్‌ఫర్ చేయాలా ఇలా అనేక సందేహాలు నాలో. అవి ఎలా కట్టడం అనేది మేం చూసుకుంటాం నువ్వేం కంగారుపడకు అని ముందే చెప్పింది మా అమ్మాయి. ఆ తర్వాత తెలిసింది ఆ డబ్బులు శశి ఖాతా నుంచి జమ చేయాలని. అలా అయితే పర్వాలేదు. మా మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలకు అనుకున్నా.

అమెరికన్ ఎయిర్ లైన్స్ కౌంటర్ 7.30కి తెరిచారు. క్యూ కొద్దిగా తగ్గిన తర్వాత వెళ్లి అడిగాను. కూర్చోండి 9.30 తర్వాత పిలుస్తామని చెప్పారు. అంతలో స్టేటస్ ఏమిటని శశి ఫోన్. జనాన్ని గమనిస్తూ ఫోన్‌లో ముచ్చట్లతో టైం కిల్ చేస్తూ కూర్చున్నా.

అన్నట్లుగానే 9.40కి పిలిచారు. మళ్ళీ ఫోన్ చేస్తే శశికి అదే విషయం చెప్పాను. ఇక ఫర్వాలేదులే.. అయిపోతుంది అన్నాడు.

శశి కుటుంబంతో కలిసి అంతకు ముందు వారం హాలిడేకి వెళ్ళివచ్చాడు. అప్పటికి ఇంటిల్లిపాదీ సిక్ అయ్యారు. ఆఫీసు పనికి సెలవు పెట్టే వీలులేదు. అయినా కూడా నా ట్రావెల్‌కి సంబంధించి ఫాలో అప్ చేస్తూనే ఉన్నాడు. నాకు ఎక్కడా ఇబ్బంది కలగకూడదని తన తాపత్రయం.

క్యూ లో నా ముందున్న వాళ్ళు లోనికి వెళ్లిపోతున్నారు. నా కంటే ముందు ఒకరి తర్వాత క్యూ కదలడం ఆగిపోయింది. టికెట్స్ ఖాళీగా ఉన్నప్పటికీ ఎందుకు ఇవ్వడం లేదు అనే ప్రశ్న నాలో .

కొద్ది సేపటి తర్వాత ఆగలేక అడిగేసాను. ముందు మాకు రెవెన్యూ వచ్చే విధంగా తీసుకుంటాం ఆ తర్వాతే మీకు అని చెప్పాడు కౌంటర్‌లో వ్యక్తి. ఖాళీగా ఉన్నాయి కదా అంటే, ఉన్నాయి కానీ కార్గోతో నిండింది. వెయిట్ చెక్ చేస్తున్నాం, మీరు వెయిట్ చేయాలి అంటూ ఆపారు.

ఎట్టకేలకు నా టర్న్ వచ్చింది. అప్పటికి సమయం 10.50. బిజినెస్ ప్రయారిటీ బోర్డింగ్ పాస్ ఇచ్చారు. లగేజ్ చెకిన్ చేసి ఇమ్మిగ్రేషన్ కి వెళ్ళా. చాలా పెద్ద పెద్ద క్యూ లు ఎలా అనుకుంటూ ఉండగా ప్రయారిటీ లైన్ కనిపించింది. చకచకా ఇమిగ్రేషన్ పూర్తి చేసుకుని సెక్యూరిటీ చెక్ వైపు నడిచా.

అక్కడ కూడా పెద్ద పెద్ద లైన్స్. క్యూ నుండే శశికి, మా వాళ్లందరికీ టికెట్ స్టేటస్ తెలుపుతూ మెసేజ్ పెట్టాను. ఎంతకీ క్యూ తరగడం లేదు.

అంతలో అమెరికన్ ఎయిర్‌లైన్స్.. అమెరికన్ ఎయిర్‌లైన్స్ పాసెంజర్స్ ఎవరున్నారు అంటూ అనౌన్స్మెంట్.. అలా మమ్మల్ని ముందు సెక్యూరిటీ చెక్‌కి వదిలారు.

వంటిమీద వున్న ఊలుకోటు, ఎలక్ట్రానిక్స్, బ్యాటరీ, కేబిన్ బ్యాగేజ్, హ్యాండ్ బాగ్ సెక్యూరిటీ చెక్‌కి పంపి నేను చెక్ చేయించుకుని వచ్చేసరికి నా హ్యాండ్ బాగ్ పక్కకు పెట్టారు.

పక్కనుంచి అమెరికన్ ఎయిర్‌లైన్స్ బోర్డింగ్ పూర్తి అవబోతున్నదని ఒకావిడ తొందర పెడుతున్నది. ఎంత సేపు పడుతుందోనని నా కంగారు. బాగ్‌లో ఏమున్నాయి తెరవండి అన్నారు. తెరిచి చూపించా.

నేను అమెరికా ప్రయాణమైందే చెల్లెలు కూతురు శృతి పెళ్ళికి. పెళ్లంటే నగానట్రా కావాలిగా. అందునా ముగ్గురికి. ఆస్ట్రేలియాలో ఉండే నా కూతురు సాధన కుటుంబంతో అప్పటికే అమెరికా చేరిపోయింది. తన నగలన్నీ నాతోనే ఉన్నాయి. మా ఇద్దరితో పాటు మనవరాలికి అంటే ముగ్గురికీ నగలు కావాలి. వారం రోజుల పెళ్ళికి ఎక్కువ అవసరం కదా. బంగారు నగలతో పాటు కొన్ని పిచ్చివి కూడా కలగలిపి పట్టుకుపోతున్ననాయే.. ఆ విషయమే చెప్పాను.

ఆ హడావిడిలో ఏవి ఎక్కడ పోగొట్టుకుంటానో అని భయం ఓ వైపు. మళ్లీ స్కాన్ చేసి నా బాగ్ నాకు ఇచ్చారు. హమ్మయ్య అని హడావిడిగా సర్దుకుని పరుగులాంటి నడకతో గేట్ 26 వైపు నడిచా.

అరె .. ఎంత నడిచినా దూరం తరగదే.. దాదాపు మైలు దూరం పైనే ఉన్నట్టుంది. ఆయాసపడుతూ నా సీటు దగ్గరకు రావడం తోనే ఫ్లైట్ అటెండెంట్ నా హ్యాండ్ లగేజ్ తీసుకుని పైన సర్దేసింది.

ఒక అటెండెంట్ నాలుగైదు రకాల జ్యూస్‌ల పేర్లు చెప్పి ఏమి కావాలని అడిగింది. ఇంకా నేను నా సీటులో కూర్చోకుండానే అతిథి మర్యాదలు మొదలయ్యాయి అనుకుంటూ ఆరెంజ్ జ్యూస్ చెప్పి హమ్మయ్య ఎక్కేశాను అని గట్టిగా ఊపిరి పీల్చుకుని మా ఆయనకి, అబ్బాయికి, మేనల్లుడు శశికి, మా అమ్మాయి సాధనకి, చెల్లెలు కామేశ్వరికి మెసేజ్ పెట్టాను బోర్డింగ్ అయిందని.

సమయం సరిగ్గా 11.50 లోహ విహంగం కదలడం మొదలైంది. మరో ఐదు నిముషాల్లో గాలిలోకి ఎగిసింది నా ఫ్లైట్ AA 293.

ఇక నా సీటు విషయం గురించి చెప్పాలి. నా సీటు 13A . కిటికీ పక్కనే ఉంది. సీటులో నేను వచ్చేప్పటికి పిల్లో, బెడ్ రోల్, బ్లాంకెట్, చెప్పులు, కిట్బ్యాగ్ (టూత్ బ్రష్, పేస్ట్, లిప్ బామ్, క్రీం, పెన్, డెంటల్ కిట్, ఐ క్లోజర్, సాక్స్ వంటి వస్తువుల కిట్ ఉన్నాయి), టీవీ, ఇయర్ ఫోన్స్ ఉన్నాయి.

నా పరిసరాలు చూసా. కిటికీ వైపు ఇటు ఒకటి అటువైపు ఒకటి. మధ్యలో రెండు సీట్లు. అలా వరుసకు నాలుగు సీట్లు. 13 వరుసల్లో మొత్తం 52 సీట్లు ఉన్నాయి ప్రీమియం బిజినెస్ క్లాస్‌లో. ఫస్ట్ క్లాసులో పదో పన్నెండో ఉంటాయి. అటు చూశాను. కర్టెన్స్ వేసి ఉన్నాయి. ఏమీ తెలియలేదు. అప్పటికే కొందరు చెవులకు తగిలించుకుని టీవీ చూస్తూ కనిపించారు. కనిపిస్తే కొందరు సీటును ఫ్లాట్ బెడ్‌గా చేసేసుకున్నారు.

నా ప్రయాణంలో ఎప్పుడూ నేను ప్రయాణిస్తున్న ఫ్లైట్ నావిగేషన్ చేస్తుంటా. అదే విధంగా టీవీ పెట్టి నా సీట్ ఫ్లాట్ బెడ్‌గా ఎలా మారుతుందో కంట్రోల్ బటన్స్ నొక్కుతూ ఎక్సప్లోర్ చేస్తున్నా.

అంతలో ఆరు రకాల నట్స్ (బాదాం, జీడిపప్పు, వాల్నట్, పిస్తా, బ్రెజిల్ నట్స్ ఇంకా ఏవో ఉన్నాయి) ఉప్పు వేసి వేయించినవి తెచ్చి ముందు పెట్టారు. ఏ జ్యూస్ కావాలని మళ్ళీ అడిగారు. ఈసారి ఆపిల్ జ్యూస్ తీసుకున్నా. కాళ్ళు చాపుకు కూర్చున్న నేను సీటును మామూలు స్థితికి తెచ్చి నట్స్ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టా.

మధ్యాహ్నం ఫ్లైట్‌లో పెట్టిన భోజనం తప్ప మధ్యలో ఏమీ తినలేదు. తాగలేదు. పిల్లలు చెప్పారు ఎయిర్‌పోర్టులో తినమని. అప్పటికి ఆకలి కూడా లేకపోవడంతో లగేజీ తీసుకుని అటు ఇటు వెళ్లడం ఎందుకని ఆగిపోయాను.

తీరిగ్గా కూర్చునే సరికి ఇప్పుడు ఆకలి తెలియడం మొదలైంది. నట్స్ తింటూ నా ప్రయాణ గమనం సాగే విధాన్ని చూస్తున్నా. అమృత్‌సర్ కాబూల్ మధ్యగా పోతున్నది .

అవి తినడం పూర్తయేసరికి గ్రీన్ సలాడ్, హోల్ వీట్ బన్, బట్టర్, ఆలివ్ ఆయిల్, పుడ్డింగ్ తెచ్చి పెట్టారు. అవి తినడం పూర్తి కాకుండానే మీల్స్ ఏమి కావాలి అని అడిగారు. ఏమున్నాయి అనడంతో మెనూ కార్డు చూసి చెప్పమన్నారు. నాకు ఎడమచేతి వైపు ఉన్న బల్లపై మెనూ కార్డు చూపుతూ.. చూస్తే.. వెజ్, నాన్ వెజ్ లో మూడు ఆప్షన్స్‌తో ఉన్నాయి.

వెజ్ ఫ్రైడ్ రైస్, చికెన్ కర్రీ, బఠాణీలు బీన్స్ కూర వచ్చాయి. అది పూర్తయేసరికి డెసర్ట్ మూడు రకాల ఆప్షన్స్‌తో.. రెండురకాల ఐస్ క్రీం వెనిలా, బటర్ స్కాచ్ ఫ్లేవర్స్‌తో, డార్క్ చాకోలెట్ టోరస్. నేను సాధారణంగా ఐస్ క్రీం తినను. ఇప్పుడు నా ఆరోగ్యాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఐస్ క్రీం తిని ఏదన్నా తెచ్చుకుంటే ఎలా.. అందుకే అది రూల్డ్ అవుట్. ఇక మిగిలింది డార్క్ చాకోలెట్ టోరస్ చెప్పాను. నిజానికి డార్క్ చాకోలెట్ కూడా నాకు నచ్చదు.

ఆ అర్ధరాత్రి పూట నీలాల నింగిలో ఆకాశ మార్గంలో విశ్వ విధుల్లో విహరిస్తూ ఏదో ఒక మేత మేస్తూనే ఉన్నా.. ఎంత బరువు పెరిగిపోయానో అనుకుంటూ సమయం చూస్తే రెండుగంటలు. కానీ నిద్ర రావడం లేదు.

ఈ మధ్యలో నావిగేషన్ ఆగిపోయింది. మళ్ళీ సెట్ చేసుకుని చూస్తే టర్కీ సమీపంలో ఉన్నట్లు తెలుస్తున్నది.

చుట్టూ చూస్తే ఎవరి కేబిన్‌లో వాళ్ళు ఒదిగిపోయి ఉన్నారు. కొందరు నిద్రపోతూ ఉంటే కొందరు టీవీ చూస్తూ కనిపించారు.

అంతలో ఫ్లైట్ అటెండెంట్ మెలకువగా ఉన్నవారిని మరో రౌండ్ అడుగుతున్నది. మిడ్ నైట్ స్నాక్ ఏం కావాలంటూ.. ఇప్పటికే పొట్ట పగిలిపోయేలా తిన్నాను. ఇక ఏం వద్దని చెప్పా.. నవ్వేసి, అయితే ఇక నేను డిస్టర్బ్ చేయను అంటూ వెళ్ళిపోయింది.

మాములుగా ఫ్లైట్ అటెండెన్స్ నలభై ఏళ్ల లోపు వారే కనిపిస్తారు. నేను ఇంతకు ముందు ప్రయాణించిన ఏ ఎయిర్‌లైన్ విమానంలోనూ కనిపించని విధంగా ఈ ఎయిర్‌లైన్స్‌లో నలభై పై బడిన వారు దాదాపు 50 ఏళ్ల వయసు వారు ఉండడం చూసి ఆశ్చర్యం వేసింది. అదీ గాక అతి మేకప్ లేదు. చాలా మాములుగా ఉన్నారు. చాలా చలాకీగా, స్నేహంగా ఉండడం నాకు చాలా నచ్చింది.

వేడినీళ్లు అడిగి తెప్పించుకుని అవి తాగాను.

2.30 తర్వాత నా సీటును పూర్తి ఫ్లాట్ బెడ్‌గా మార్చి బెడ్ రోల్ పరిచా. సరిగ్గా మనిషి వెడల్పు ఉన్న బెడ్. అటూ ఇటూ మెసిలే నా లాంటి వాళ్ళకి అంత సముఖంగా ఉండదు కానీ గంటలు గంటలు కూర్చోవడం కంటే చాలా చాలా బెటర్ కదా.. దాదాపు అందరు నడుము వాల్చినట్టున్నారు. కేబిన్ లలో లైట్స్ ఆఫ్ అయ్యాయి.

నా సీటు 13A. 12B పాసెంజర్ 5 కాకముందే లేచి కేబిన్ తెరిచి బాగ్ తీయడం మొదలు పెట్టాడు. ఒకటికాదు రెండు కాదు ఏడెనిమిదిసార్లు అతని పై కేబిన్ బాక్స్ తెరుస్తుండడంతో ఆ చప్పుడుకు నాకు మెలకువ వచ్చేసింది. అసలే చీమ చిటుక్కుమంటే లేచి కూర్చునే రకాన్నాయే.

ఇక నిద్దుర ఏం పడుతుంది? అట్లాగే ముసుగుతన్ని కళ్ళు మూశా, నిద్రపోవడానికి ప్రయత్నం చేశా. కానీ నిద్ర రాదే.. నిద్రాదేవి నేను రాను పొమ్మంటుంటే ఏం చేయను?

నా ఫ్లైట్ ఎక్కడుందో నావిగేషన్ చూస్తూ గడిపా ఓ వైపు బెర్లిన్, హాంబర్గ్, కోపెన్ హెగెన్, ఆ తర్వాత అంస్టర్‌డాం కనిపిస్తున్నాయి. యూరోపియన్ దేశాలను పలుకరిస్తూ నెదర్లాండ్స్‌లో ఉన్న నిషిని గుర్తు చేసుకున్నా.

హిందీ ఇంగ్లీషు భాషల్లో మార్చి మార్చి వస్తున్నది స్క్రీన్ మీద. భారత్ నుండి కాబట్టి భారతీయ ప్రయాణికుల సౌకర్యార్ధం హిందీ, ఇంగ్లీషు రెండు భాషల్లో అనౌన్స్‌మెంట్‌లు ఇవ్వడం, అదే విధంగా టీవీలో సినిమాలు, నావిగేషన్ అన్నీ కూడా ఉండడం అభినందించాల్సిన విషయమే.. అదే కదా ప్రయాణికుల్ని ఆకట్టుకునే వ్యాపార రహస్యం.

అలా పడుకోవడం ఎందుకు. లేచి కాస్త తిరగమని నడుము కోరింది. సరేనంటూ లేచి కాసేపు వాకింగ్ చేశా. ఒకరిద్దరు లాప్‌టాప్ ముందు పెట్టుకుని పనిచేసుకోవడం కనిపించింది. ఫ్రీ వైఫై కనెక్ట్ చేసుకోవచ్చని, వైఫై డబ్బు చెల్లించి పొందవచ్చని రెండు రకాల మెస్సేజ్‌లు టీవీలో రావడం చూశా. అవసరం ఉన్న వాళ్ళు డబ్బు చెల్లించి ఎక్కువ స్పీడ్ ఉన్న వైఫై పొందుతారేమో..!

పైసామే పరమాత్మ.. అని ఇందుకే అంటారేమో..!

ఆకాశవీధుల్లో ప్రయాణిస్తూ ప్రపంచంతో కనెక్ట్ అవడం, ముచ్చటించడం లేదా పనులు యధావిధిగా చేసుకోవడం అంటే.. మానవమేధ.. అది చేసిన ఆవిష్కరణలు ఆలోచించిన కొద్దీ అబ్బురంగా తోచాయి.

వేల ఏళ్ల ప్రయాణంలో మానవజాతి సాధించిన అభివృద్ధి ఫలాలు ఎంత సులభంగా అందుకోగలుగుతున్నాం.. అనుభవించగలుగుతున్నాం.. భవిష్యత్‌లో ఇంకెన్ని మార్పులు రానున్నాయో..

నా చిన్నప్పుడు హైదరాబాదు వెళ్లి రావడం గొప్ప. ఢిల్లీ, బొంబాయి వెళ్లడం అంటే మరింత గొప్పగా తోచేది. అమెరికాలో ఉన్నారు అంటే ఆకాశం అంత గొప్పగా అనిపించేది. అలాంటిది ఇప్పుడు ఏదేశమైనా ఇలా వెళ్లి అలా రావడం మామూలై పోయింది.

వాగులు, వంకలు, నదీజలాలు వెతుక్కుంటూ వాటి వెంట ప్రయాణం చేసిన నాటి మానవుడు, గాలిలా ఎగిరే పక్షుల్ని చూసి తాను కూడా అలా ఎగిరిపోగలిగితే అని ఆశపడిన మానవుడు అక్కడితో ఆగిపోతే ఈనాటి ఈ ప్రయాణాలు ఉండేవా?

ఇప్పుడు ఖండాతరాలకు ప్రయాణమైనట్టు భవిష్యత్‌లో గ్రహాంతరాలకు ప్రయాణాలు సాగుతాయేమో..! ఏమో ఎవరికి తెలుసు.. ఇప్పటికే ఆ దిశగా పరిశోధనలు, ప్రయత్నాలు సాగుతున్నాయని అడపాదడపా వార్తలు వస్తూనే ఉన్నాయి అంటూ ఆలోచనల పరంపర..

ఫ్రెష్ అయి వచ్చి కూర్చున్నానో లేదో వేడివేడి బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసింది. తిన్నది అరగాలిగా.. అప్పటికి రెండు సార్లు చెప్పాను ఇప్పుడే వద్దని.

మూడోసారి అడగకుండానే తెచ్చి ముందు పెట్టారు. బహుశా వాళ్ళ పని అయిపోతుందని కావచ్చు.

విమానం నార్త్ సీ మీదుగా నలభై వేల అడుగుల ఎత్తులో పోతున్నది. బయటికి చూస్తే శూన్యం.

గమ్యస్థానంలో సమయం, ఇంకా ప్రయాణ సమయం ఎంత మిగిలి ఉన్నదో ఎప్పటికప్పుడు టీవీలో చూపుతూనే ఉన్నది. బయట గాలి వేగం గంటకి 913 km. ఊహించడానికి ప్రయత్నించా.. 150 కిమీ వేగానికి హుదూద్ చేసిన విధ్వంసాన్ని విశాఖలో చూసి ఉన్నా. 913 గాలి వేగం అంటే భూమి మీద ఏమీ మిగలవేమో.. ఆ గాలిని చీల్చుకుంటూ పోతున్న విమానం నలభై వేల అడుగుల ఎత్తులో..

నార్త్ సీ దాటి భూభాగం మీదకి రాబోతున్నాం. అంతలో సీట్ బెల్ట్ పట్టుకొమ్మని స్క్రీన్ చెప్పింది. అనౌన్స్మెంట్ వచ్చింది.

ఈ భూగోళంలో తూర్పునుంచి పశ్చిమానికి చేసే ప్రయాణంలో ఇంకా 3354 మైళ్ళ ప్రయాణం మిగిలే ఉంది. తూర్పున ఉన్న ఆసియా ఖండం నుండి పడమట ఉన్న అమెరికా ఖండం వైపు సాగే ఈ ప్రయాణంలో ఎన్ని సముద్రాలు దాటుతున్నానో..

మళ్ళీ సముద్రం మీద ప్రయాణం. సప్త సముద్రాల ఆవల అంటారుగా.. అలా నేను దాటుతున్నానా.. అసలు ఎన్ని సముద్రాలు దాటుతున్నానని సందేహం. ఏ ఏ సముద్రాలు దాటి ఉంటాను ప్రశ్న?

ఇప్పుడు అట్లాంటిక్ మహా సముద్రం పైన.. అంతా చీకటే.. బయటికి చూస్తే శూన్యమే..

ఇక నావిగేషన్ చూడాలనిపించలేదు.

దృష్టి సినిమాలవైపు మళ్లింది. నేటివ్ హెరిటేజ్ నెల సందర్భంగా అంటూ బీన్స్ సినిమా కనిపించింది. ఆసక్తిగా చూశాను. MOHAWK ఇండినీయస్ తెగకు చెందిన టీనేజ్ బాలిక అనుభవాలు, 1990లో వచ్చిన ఓకా క్రైసిస్ లేదా సాయుధ ప్రతిష్టంభన (armed standoff) నేపథ్యంలో తీసిన సినిమా..

నేటివ్ హెరిటేజ్ నెల సందర్భంగా ఆ సినిమా వేస్తున్నట్లు టీవీ చెప్పింది. అందుకే ఆసక్తిగా చూశాను. ఆ తర్వాత బీన్స్ 92 పెట్టాను కానీ కళ్ళమీద నిద్ర తోచుకొచ్చింది. కొద్దిసేపు కునికిపాట్లు.. మెలకువ వచ్చి కిటికీలోంచి బయటికి చూస్తే చీకట్లో అప్పుడప్పుడు మినుకు మిణుకుమనే చుక్కలు.. అది ఆకాశమా.. కాదు అవన్నీ పైకి కనిపించడం లేదు. ఆకాశం ఉల్టా ఫుల్టా అయినట్లుగా.. కిందకి కనిపిస్తున్నాయి.

చూస్తుండగానే నక్షత్రాలు అక్కడక్కడా కుప్పలు పోసినట్లుగా.. కొన్ని చోట్ల వెదజల్లినట్లుగా..

నావిగేషన్ ఆన్ చేశాను. బోస్టన్ మీదుగా ప్రయాణం సాగుతున్నట్లు తెలుస్తున్నది. ఆ చీకటి వెలుగులో బోస్టన్ నగరం విస్తరించుకుని..

2004లో ఒక కాన్ఫరెన్స్ కోసం మొదటి సారి అమెరికా ప్రయాణం. ఆ ప్రయాణంలో దిగింది బోస్టన్ లోనే. కానీ అప్పుడు దిగింది మధ్యాహ్నం కావడం, మధ్య సీట్లలో కూర్చోవడం వల్ల ఇలాంటి అనుభూతి కలుగలేదు.

ఈ ప్రయాణంలో మొదటిసారి అనంత శూన్యంలో కింద మినుకు మినుకుమనే నక్షత్రాలలా కన్పించిన విద్యుత్ దీపాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి.

2004 నవంబరు 30న న్యూయార్క్‌లో ఉన్నాను. డిసెంబరు 1 రోడ్ ఐలాండ్‌లో.. మళ్లీ ఇప్పుడు 18 ఏళ్ల తర్వాత అప్పుడు కాన్ఫరెన్స్‌కు వచ్చిన నన్ను కలవడానికి చెల్లి కామేశ్వరి పిల్లలతో నా దగ్గరికి బోస్టన్ వచ్చింది. ఇప్పుడు నేను చెల్లెలింటికి.

అప్పడు తనని చూసి దాదాపు ఐదేళ్లు. ఇప్పుడు రెండు నెలలు కూడా కాలేదు.

విద్యుత్ దీపకాంతులను చూస్తూ నా ఆలోచనల్లో నేను ఉండగానే అనౌన్సమెంట్. లైట్స్ ఆన్ అయ్యాయి. అందరూ సీట్ బెల్ట్ సర్దుకుంటున్నారు.

రావలసినదానికంటే 25 నిముషాలు ముందుగానే గమ్యం చేర్చింది మా లోహ విహంగం. అరగంట లోపే బ్యాగేజి తీసుకుని, ఇమిగ్రేషన్ పూర్తి చేసుకుని గేట్ 8కి చేరాను. ఎయిర్‌పోర్ట్ వాళ్ళ ఫ్రీ ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకుని చెల్లికి మెసేజ్ పెట్టాను. మా అమ్మాయి వాళ్ళకి, మా ఆయనకి, శశికి అందరికి క్షేమంగా న్యూ యార్క్‌లో దిగినట్లు సమాచారం అందించాను.

అంతలో చెల్లి ఫోన్ చేసి తాను పిక్ అప్‌కి రావడం లేదని శృతి అభి వస్తున్నారని చెప్పింది.

వాళ్ళ కోసం ఎదురు చూస్తూ టర్మినల్ 8 లో 36 ద్వారం దగ్గర నుంచున్నా..

చల్లటి గాలి చెళ్లుమనిపించింది. నా ఉన్ని దుస్తుల్ని చెవుల వరకు సర్దుకుని ఎదురుచూస్తున్నా. ట్రాఫిక్‌లో ఉన్నామని మరో పది నిమిషాల్లో ఉంటామని శృతి మెసేజ్ చేసింది.

నా విమానంలోనే దిగిన ఇండియన్స్ కోసం వచ్చిన వాళ్లేమో చాలా మంది భారతీయులు కన్పించారు.

కానీ తర్వాత అర్థమైంది. వాళ్ళు టాక్సీ డ్రైవర్లు అని. టాక్సీ.. టాక్సీ.. అని హిందీలో అడగడంతో. వాళ్లలో ఎక్కువగా శిక్కులు కనిపించారు. వచ్చే పోయే జనాన్ని చూస్తూ కూర్చుంటే నాకు అసలు బోర్ రాదు.

ఇరవై నిముషాలై పోయింది. శృతి వాళ్ళు రాలేదు. గేట్ లోపల ఉంటే నేను వాళ్లకు కనిపించడం కష్టం అని నాకు నేను చెప్పుకుని చలిని లెక్క చేయకుండా బస్సు పాయింట్ దగ్గరకి వచ్చి నుంచున్నా. దాంతో ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయింది.

నేను ఫోన్లో శ్రుతివాళ్ళకి దొరకలేదు. అభి కారు దిగి వెతుక్కుంటూ వచ్చి హాయ్ అత్తా అనడంతో ఉలిక్కిపడ్డా.. మొదటి సారి అతన్ని చూడడం. ప్రయాణం బాగా జరిగిందా అంటూ కుశల ప్రశ్నలు వేశాడు. అంతలో శృతి కారుతో వచ్చింది.

అంత ప్రొద్దున్న విపరీతమైన ట్రాఫిక్. ఆ ట్రాఫిక్ లోంచి బయటపడడానికి సమయం పట్టింది. జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎప్పుడూ రద్దీగానే ఉంటుందని పిల్లలు చెప్పారు.

పెళ్ళికొడుకు, పెళ్లి కూతురు వచ్చి నన్ను తీసుకుని మరో గంటన్నర ప్రయాణం తర్వాత న్యూ జెర్సీలోని చెల్లి ఇంటికి చేర్చారు. అలా వాళ్ళ పెళ్ళికి వారం రోజుల ముందు పెళ్లింటికి చేరానన్నమాట.

అమెరికాలో సాంప్రదాయ పెళ్లి విషయాలతో మళ్ళీ కలుద్దాం.

వి. శాంతి ప్రబోధ


వి. శాంతి ప్రబోధ గారు పుట్టింది పెరిగింది ఉత్తర తెలంగాణా జిల్లాల్లో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.

తరతరాల దురాచారంపై జోగిని (నవల), అమర్ సాహసయాత్ర (బాలల నవల), కాంపింగ్ (బాలల బొమ్మల కథ), గడ్డిపువ్వు గుండె సందుక, ఆలోచనలో.. ఆమె (కథా సంకలనాలు), బతుకుసేద్యం,  ప్రచురణ. నిష్కల, నీలాకాశంలో నిధి (బాలల నవల), కథలు, కవితలు త్వరలో ప్రచురణకు సిద్ధమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here