సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో.. 17

0
9

[సంచిక విశ్వవేదిక శీర్షికలో భాగంగా విశ్వవీధుల్లో తమ ప్రయాణపు అనుభవాలను వివరిస్తున్నారు శ్రీమతి వి. శాంతి ప్రబోధ. శీర్షిక నిర్వహణ శ్రీ సారధి మోటమఱ్ఱి.]

థామస్ ఎడిసన్ సెంటర్

[dropcap]వె[/dropcap]లుగు జిలుగులు పంచే విద్యుత్ కాంతి లేని లోకాన్ని మనం ఊహించగలమా..

మానవజాతిని అత్యంత ప్రభావితం చేసిన విద్యుత్ బల్బ్ లేకుండా ఉండగలమా..

పల్లె నుండి పట్నం వరకు విద్యుత్ బల్బ్ తెలియని వారుండరేమో..

థామస్ ఆల్వా ఎడిసన్ ప్రపంచానికి ఇచ్చిన గొప్ప వరం విద్యుత్.

బడికి వెళ్లి చదువుకునే ప్రతి వారికీ ఆ పేరు పరిచయమే. ఎడిసన్ విద్యుత్ ఒక్కటే కాదు ఇంకా చాలా చాలా కనుక్కున్నాడు. మాస్ కమ్యూనికేషన్, సౌండ్ రికార్డింగ్, ఫోనోగ్రాఫ్ వంటివెన్నో కనుక్కున్నాడు. సైన్స్ విద్యార్థులకు ఎడిసన్ ఆవిష్కరణల గురించి ఎక్కువ అవగాహన ఉండొచ్చు.

అటువంటి గొప్ప వ్యక్తిని ప్రత్యక్షంగా కలవలేదు కానీ కలిసినంత అనుభూతి పొందాను.

గత పాతికేళ్లుగా మా చెల్లి అమెరికాలోని న్యూజెర్సీ ఉన్న పట్టణం ఎడిసన్‌లో నివసిస్తున్నది. ఒకసారి ఎప్పుడో హరికేన్ కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది, విద్యుత్ లేకపోవడం కలిగిన అసౌకర్యం గురించి చెబుతూ, మేం ఎడిసన్‌లో ఉండబట్టి కొన్ని గంటల్లోనే చాలా త్వరగా పునరుద్ధరించారని చెప్పింది. మిగతా ప్రాంతాల్లో రెండు మూడు రోజులు చాలా ఇబ్బందిపడ్డారని చెప్పింది. ఎడిసన్‌కి ఉన్న ప్రత్యేకత ఏంటట? అన్న నా ప్రశ్నకు సమాధానంగా అది థామస్ ఆల్వా ఎడిసిన్ నివసించిన పట్టణం కావడం వలన ఆ పట్టణానికి ఎడిసన్ అని పేరు వచ్చిందనీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ వెంటనే విద్యుత్ పునరుద్ధరిస్తారనీ, అది ఎడిసన్‌కి ఇచ్చే గౌరవం అని చెప్పిన మాటలు గుర్తున్నాయి. అంతకు మించి నాకు ఏమీ తెలియదు.

డిసెంబర్ 31న అనుకోకుండా థామస్ ఎడిసన్ సెంటర్ చూసే అవకాశం వచ్చింది. ఆ రోజు మా అమ్మాయి సాధన కుటుంబాన్ని నెవార్క్ ఎయిర్‌పోర్ట్‌లో దించడానికి రెండు కార్లలో వెళ్ళాం. నేను చిన్న చెల్లి కామేశ్వరి కారులో వెళ్ళాను. తిరుగు ప్రయాణంలో మరో కారులో ఉన్న పెద్ద చెల్లి శైలజ, ఆమె కొడుకు స్నేహిత్ , అతని భార్య రక్షిత, అమ్మ ఉన్న కారులోకి మారాను. అమ్మ నేను దిగిన కామేశ్వరి కారులోకి మారింది. అందుక్కారణం, పెద్దమ్మా మనం కాసేపు అలా తిరిగి వెళదాం అని స్నేహి అనడం.

వెళ్తూ ఉండగా ఇక్కడకు దగ్గరలో మెన్లో పార్క్‌లో థామస్ ఎడిసన్ సెంటర్ ఉంది. చూస్తారా అని అడిగాడు. ఈ పట్టణంలోనే ఎడిసన్ లాబరేటరీ అసిస్టెంట్‌గా జీవితం మొదలు పెట్టి ఎన్నో ఆవిష్కరణలు చేసాడని, ఇక్కడే నివసించాడని చెప్పాడు. జాతికి అతను అందించిన సేవలను గౌరవిస్తూ ఈ పట్టణ పేరును ఎడిసన్‌గా మార్చారని తనకు తెల్సిన విషయాలు చెప్పాడు.

మెన్లో పార్క్‌లో ఉన్న థామస్ ఎడిసన్ సెంటర్‌కి వెళ్ళేసరికి సన్నని తుంపర పడుతూ పలుచని జలతారు వస్త్రం కప్పుకున్నట్లు ఉంది ప్రకృతి. అయినా చూడాల్సిందేనని వెళ్లాం. ఆ క్యాంపస్ లోకి వెళ్ళగానే పెద్ద స్తూపం. దీనిపై వెలుగుతున్న విద్యుత్ బల్బు దర్శనం ఇచ్చాయి. ఆ వెనుకగా ఏపుగా పెరిగిన వృక్షాలపై మేలిముసుగు కప్పుకున్నట్లు అగుపించే చిక్కని అడవి.

థామస్ అల్వా ఎడిసన్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్తూపం చూస్తూ అడవిని అంత పట్టించుకోలేదు. వాతావరణం పర్యాటకులకు అనుకూలంగా లేకపోవడం వల్ల జనం లేరు. పార్కింగ్‌లో రెండు వాహనాలు మినహా అంతా కాళీగా ఉంది కావచ్చు అనుకుంటూ ముందుకు నడిచాం.

మేం వెళ్ళిన సమయం నిజానికి సరైన సమయం కాదని అక్కడి బోర్డు చూశాక అర్థమైంది. సందర్శకులు ఎవరూ లేరు. అంతా ఖాళీగా ఉంది. మ్యూజియం మూసేసి ఉంది. అయ్యో.. అని నిట్టూర్పు విడిచి సన్నని తుంపరలో తడుస్తూ అటూ ఇటూ తిరిగాం. మామూలుగా అయితే వాతావరణాన్ని బాగా ఆస్వాదించే దాన్ని. కానీ ఆ రోజు మ్యూజియం చూడలేకపోయానని నిరుత్సాహం.. మరొక రోజు రావడానికి కూడా సమయం లేదు. మరుసటి రోజే మాతృదేశానికి నా తిరుగు ప్రయాణం.

36 ఎకరాలలో ప్రకృతి ఒడిలో ఉన్న థామస్ ఎడిసన్ సెంటర్ చుట్టూ అందమైన పార్క్. బయట అక్కడక్కడా పిక్నిక్ టేబుల్స్ ఉన్నాయి. మ్యూజియం దగ్గర ఒక స్టోర్ ఉంది. అది కూడా మూసేసి ఉంది. లోపలికి ఎటువంటి ఆహారం అనుమతించరట.

గురు, శుక్ర, శని వారాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంటుంది.

గంట గైడెడ్ టూర్‌కి పెద్దలకు 7$, సీనియర్ సిటిజన్స్‌కి , పిల్లలకు 5 $, మిలిటరీ సర్వీస్‌లో ఉన్నవారికి కూడా 5$, ఐదేళ్ల లోపు పిల్లలకు ప్రవేశం ఉచితం. ఒక టూర్‌లో 15- 40 మందికి మాత్రమే ప్రవేశం. స్కూల్ పిల్లలు ఎక్కువగా వస్తుంటారు.

140 ఏళ్ల క్రితం శక్తిని కాంతిగా మార్చి ప్రకాశవంతమైన బల్బు ద్వారా ప్రపంచానికి వెలుగు అందించిన ఎడిసన్ ఇంకా ఎన్నో ఆవిష్కరణలు చేశాడు. అందులో ఫోనోగ్రాఫ్, డిక్టాఫోన్, విద్యుత్ బల్బ్, విద్యుత్ శక్తి ఉత్పత్తి, మాస్ కమ్యూనికేషన్, ఆటోగ్రాఫిక్ ప్రింటర్ వంటివెన్నో.. అంతటి గొప్ప ఆవిష్కర్త గురించి సమగ్రంగా తెలుసుకునే అవకాశం తప్పిపోయినందుకు చింతిస్తూ, జ్ఞాపకంగా కొన్ని ఫోటోలు తీసుకున్నాం.

నిత్యం మనం వాడుకునే బల్బుతో పాటు అనేక ఆవిష్కరణలు ప్రపంచానికి అందించిన, మరెన్నో పరికరాలు అభివృద్ధి చేసిన ఎడిసన్‌కి ధన్యవాదాలు తెలుపుకుంటూ వెనక్కి తిరిగాం.

వి. శాంతి ప్రబోధ


వి. శాంతి ప్రబోధ గారు పుట్టింది పెరిగింది ఉత్తర తెలంగాణా జిల్లాల్లో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.

తరతరాల దురాచారంపై జోగిని (నవల), అమర్ సాహసయాత్ర (బాలల నవల), కాంపింగ్ (బాలల బొమ్మల కథ), గడ్డిపువ్వు గుండె సందుక, ఆలోచనలో.. ఆమె (కథా సంకలనాలు), బతుకుసేద్యం, ప్రచురణ. నిష్కల, నీలాకాశంలో నిధి (బాలల నవల), కథలు, కవితలు త్వరలో ప్రచురణకు సిద్ధమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here